[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
331.
సత్యశివసుందర సచ్చిదానంపు చిత్రంబులోన
నిత్యంబు కాననగు విచిత్ర వర్ణంపు జీవచిత్రణము
నిత్యంబు నీ వద్దాని విస్మరింపక తలంతు వేని
యత్యంత తన్మయుడ వయ్యెదవు – మంకుతిమ్మ!
332.
సత్యమన్నదది యేడ? నీ యంతరంగంబు నందునో, లేక
నిత్యము నీ వనుభవించు బాహ్య చిత్రణమందునో?
యుక్తి చేత రెంటిని సమన్వయించి సరిజూచిన
తత్త్వ దర్శనమది కలుగు – మంకుతిమ్మ!
333.
సత్యానుభవ మందరికి నొక్క రీతిగా నుండ సాధ్యమే?
ఎత్తయిన గిరి తలమున నొకడు, గుహాంతరమున నొకడు
ఎత్తరి చూడగలడు లోయలనుంచి యొకడు, మహో
న్నత యంబర దృశ్యముల – మంకుతిమ్మ!
334.
ఒకరొకరి యంతరంగ గుణము లొక్కొక రీతి
ఒక్కొక్కరు కొక్కొక్క రీతి భారంబులు మోయ; జడకోలాటలో
ఒక్కక్కరు తమ పగ్గంబుల పట్టి గంతులేయ; వారి నాడించు
డొక్కరుండా విధి గాదె – మంకుతిమ్మ!
335.
ఫల మదేది దక్కు? ఈ సంసార వనంబున, చూతమో, నింబ
ఫలమో? యయ్యది దక్కు జన్మంపు ఋణము వలన, కర్మ
ఫలంబు వలన – రెంటినీ మేళవించి, భావ జ్వరంబు పోద్రోల
గ్రోలవలె యా రసంబును – మంకుతిమ్మ!
336.
ఈ నీ జీవనంపు టెదుగుదలకు కారకులెందరో
ఎన్నగ, నీ వొకండవె కాదు, అన్య శక్తులు తోడయినవి,
అన్నం బిడిన వారు, విద్య గఱపిన వారు, తోడ బుట్టినవారు
మిన్నగ చేయూత నిడిరి – మంకుతిమ్మ!
337.
అనిల గుణంబు, భూమి, సస్య ధాన్య గుణంబులు, మన
తను గుణంబుల, మనోగణంబుల ప్రభావితంబు జేయు
జనపదంబు వారల తను మనోగుణంబులును నంతెయె
మనుజుడొకడు, సమూహము శత శతంబు – మంకుతిమ్మ!
338.
నేనొంటరి నీ జగానయని తలంచ నేల? నీ
జన్మదాతలు, పూర్వీకులు, బంధు మిత్రులు, శత్రువులు దాగియున్నారు
ఎన్నో శత శతంబుల యడగియున్నారు నీ యంతరాళంబులోన
గుణంబులవి వారివి గలసియున్నవి నీలోన – మంకుతిమ్మ!
339.
నీ తాత, ముత్తాత, వారి తాతలెల్లరూ నెలసి యున్నారు
నీ తనువులోన, మరి జనించనున్నారు ముందు ముందు
నీ తనయుడు, వాని తనయుడవ్వాని తనయుడు
నీ తామర తంపరాన్వయము లోన – మంకతిమ్మ!
340.
తెలియని వ్రాతలవేవో గలవు నీ నొసట, చదివి
తెలియ జెప్పు వారెవరు? రహస్యమవి: తెలియరావు
తెలిసిన నీ వ్యవహారంబులె నిర్భరించు నాక నరకంబుల
తెలియుము నీ యాత్మ – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084