[ఇటీవల జరిగిన తెలుగు వికీపీడియా 21వ వార్షిక సమావేశం నివేదికను అందిస్తున్నారు శ్రీ కోడీహళ్లి మురళీమోహన్.]
ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో తిరుపతిలో నిర్వహించిన 21వ వార్షిక సమావేశం ‘తెలుగు వికీపీడియా పండగ 2025’ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుండే కాక బెంగళూరు, ముంబయి వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతాల నుండి 50 మందికి పైగా తెలుగు వికీపీడియా సభ్యులు పాల్గొన్నారు. మొదటి రోజు సభ్యుల నమోదు ముగిసిన తరువాత వికీమీడియా ఫౌండేషన్, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సోసైటీ (ఇండియా), బెంగళూరుల సహకారంతో తెలుగు వికీమీడియా యూజర్ గ్రూపు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల సభ్యులను ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు.
సీనియర్ సభ్యులైన శ్రీయుతులు గుళ్ళపల్లి నాగేశ్వరరావు, గుంటుపల్లి రామేశ్వరం, శ్రీరామమూర్తి, టి.సుజాత, పాలకోడేటి సత్యనారాయణరావుగార్లు జ్యోతిప్రకాశనం గావించాక సభా కార్యక్రమాలు మొదలయ్యాయి.
చర్చలో మునిగిపోయిన వికీపీడియన్లు
2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా ఇప్పటివరకు లక్షకు పైగా వ్యాసాలను కలిగి ఉన్నది. గత ఏడాది 2024 నవంబరులో లక్ష వ్యాసాల లక్ష్యాన్ని అధిగమించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వేదికపై సంబరాలు జరుపుకున్నారు. చదువరి, వి.జె.సుశీల, యర్రా రామారావు, స్వరలాసిక, బి.కె.విశ్వనాథ్, రాధిక తదితరుల సమక్షంలో లక్షవ వ్యాసాన్ని వ్రాసిన ఇనగంటి రవిచంద్ర కేక్ కట్ చేశారు.
అనంతరం వికీమీడియా ఉద్యమం, ప్రాజెక్టుల పరిచయం, ప్రాజెక్టులు ఎలా ప్రారంభమయ్యాయి, ఎలా సాగింది, ప్రస్తుత స్థితికి ఎలా చేరుకున్నాయి, ఆయా ప్రాజెక్టులు అధిగమించిన మైలురాళ్ళు అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. సభ్యుల ప్రశ్నలకు సీనియర్ సభ్యులు సమాధానాలను ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.
మధ్యాహ్న భోజనాల తరువాత గత సంవత్సరం విశాఖపట్నంలో జరిగిన వార్షిక సమావేశాలలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతి మొదలైన వాటిపై సాయి ఫణీంద్ర నివేదికను సమర్పించాడు. తదుపరి సెషన్లలో ‘తెలుగు వికీపీడియాను విస్తరించే మార్గాలు’, ‘సభ్యుల వ్యాస రచనా నైపుణ్యాల మెరుగుదల’, ‘వ్యాసాలను ప్రజలకు మరింత ఆసక్తికరంగా రూపొందించే పద్ధతులు’, ‘వికీడేటా, కామన్స్‌ల పరిచయం’, ‘వికీడేటాలో అంశాలకు, కామన్స్‌లో బొమ్మలకు స్టేట్‌మెంట్లు జోడించడం’ వంటి కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆ తరువాత వికీడేటా ఎడిటథాన్ చేపట్టారు.
రెండవ రోజు ఉదయం సదస్సులో ప్రతి ఒక్క సభ్యుడు తెవికీలో తాను నిర్వహిస్తున్న పాత్ర, తాను ఎదుర్కుంటున్న సమస్యలు, తాను చేపట్టదలచుకున్న కార్యక్రమాలు మొదలైన వాటిని గురించి వివరించారు. తమ అభిప్రాయాలను ఇతర సభ్యులతో పంచుకున్నారు. టీ బ్రేక్ తరువాత వికీమీడియా ఫౌండేషన్ నివేదిక, వారు చేపట్టిన పరిశోధనలపై చర్చ, పవర్ పాయింట్ ప్రదర్శన జరిగింది. సి.ఐ.ఎస్. తరఫున నివాస్ వారి సంస్థ చేపట్టిన తాజా కార్యక్రమాలను వివరించాడు.
మధ్యాహ్న భోజనం తరువాత సభ్యులు ఆరు గుంపులుగా విడిపోయి ‘తెలుగు వికీపీడియాలో భాష’, ‘తెలుగు వికీపీడియా నిర్వహణ’, ‘తెలుగు వికీపీడియా విస్తరణ, శిక్షణ’, ‘తెలుగు వికీసోర్సు’, ‘వికీమీడియా కామన్స్’, ‘వికీడేటా, మీడియా వికీ, టూల్స్’ అనే అంశాలపై చర్చించి తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయాలను క్రోడీకరించి భవిష్యత్ ప్రణాళికను నిర్ణయించుకున్నారు. మరియు, యొక్క, బడు వంటి పడికట్టు పదాలను వీలైనతవరకూ పరిహరించాలని, ఇదివరకు 20 వారాలు నడిచిన తెవికీబడి శిక్షణా కార్యక్రమం ఇకపై ప్రతీవారం నిర్వహించాలనే నిర్ణయాలు వాటిలో కొన్ని. తరువాత మొబైల్ ఫోన్‌లో ఎడిటింగ్ శిక్షణనిచ్చారు.
సాయంత్రం వికీపీడియన్లందరూ బ్యానర్లను పట్టుకుని, ‘తెలుగు వికీపీడియాలో చేరండి.. అందరికీ విజ్ఞానం పంచండి’ అనే నినాదంతో తిరుపతి నగర వీధుల్లో ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను పంచి, ప్రజలకు వికీపీడియా గురించి అవగాహన కల్పించారు. ఈ ప్రదర్శన శంకరంబాడి సుందరాచారి శిలావిగ్రహం వరకూ సాగింది. సుందరాచారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి అందరు సభ్యులూ ‘మా తెలుగు తల్లికి’ గీతాలాపన గావించి నివాళులు అర్పించారు.
శంకరంబాడి సుందరాచారికి నివాళి
మూడవ రోజు ఉదయపు సదస్సులో ‘వేగంగా మారుతున్న సాంకేతిక పురోగతి వికీపీడియాపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది’ అనే అంశంపై ప్యానల్ చర్చ జరిగింది. ప్యానల్లో రవిచంద్ర, సాయిఫణి, రాధిక, ఐ.మహేష్ పాల్గొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నా అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాజాలదని, దాని గురించి ఎక్కువ ఆందోళన చెందనవసరం లేదని, దానిని ఒక పరికరంగా ఉపయోగించుకొని వికీపీడియాలో చేపట్టవలసిన పనులను సులభతరం చేసుకోవాలని, హ్యూమన్ టచ్ లేని చర్యలు కృతకంగా ఉంటాయని సభ్యులు చర్చద్వారా అభిప్రాయపడ్డారు.
హాజరైన సభ్యులలో అతి పిన్న వయస్కుడైన 17 సంవత్సరాల ఉదయ్ కిరణ్‌తో మరొక సభ్యుడు, ప్రఖ్యాత రచయిత పాలకోడేటి సత్యనారాయణరావు వేదికపై ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మారుమూల గ్రామంలో ఇంటర్మీడియట్ చదువుకుంటూ కంప్యూటర్ సదుపాయం లేకపోయినా సెల్ఫోన్ ద్వారా వికీపీడియాలో 500లకు పైగా వ్యాసాలు వ్రాసిన ఉదయ్ కిరణ్ చెప్పిన విషయాలు సభికులందరికీ ఆశ్చర్యాన్నీ, ఉత్తేజాన్నీ కలిగించాయి.
ఉదయ్ కిరణ్ పాలకోడేటిల ముఖాముఖి
తెలుగు బెంగాలీ వికీపీడియాలలో సారూప్య వైరూప్యాలు అనే విషయంపై రెండు భాషలలోనూ దిద్దుబాట్లు చేస్తున్న సభ్యుడు మౌర్య బిశ్వాస్ వివరించాడు. బోధిసత్వ అనే వికీమీడియన్‌తో కలిసి సాయిఫణి అభివృద్ధి చేస్తున్న వికీసోర్స్ రీడర్ అనే ఉపకరణం బీటా వెర్షన్‌ను సభికులకు పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ ఉపకరణం ప్రయోగదశలో ఉందని అతి త్వరలో అందరికీ అందుబాటులో రానున్నదని వివరించాడు. మరొక సభ్యుడు కోటగిరి కృష్ణ ఐ.ఐ.ఐ.టి. హైదరాబాదులో తాను అభివృద్ధి చేస్తున్న వికీపీడియా ఆర్టికల్ జనరేటర్ అనే ఉపకరణాన్ని గురించి సభ్యులకు తెలియజేశాడు.
మధ్యాహ్నం జరిగిన సదస్సులో వికీపీడియా, దాని సోదర ప్రాజెక్టులకు గత దశాబ్ద కాలంగా విశేష సేవలు అందిస్తున్న సభ్యులు తుమ్మల శిరీష్ కుమార్ (చదువరి), గుళ్ళపల్లి నాగేశ్వరరావు, శ్రీరామమూర్తి, బత్తిని వినయ్ కుమార్ గౌడ్, కోడీహళ్ళి మురళీమోహన్ (స్వరలాసిక), టి.సుజాత, గుంటుపల్లి రామేశ్వరం, బి.కె.విశ్వనాథ్, ఇనగంటి రవిచంద్ర, ఐ.మహేష్‌లను శాలువాలు కప్పి మొమెంటోలతో సత్కరించారు. ఉత్తమ నిర్వాహకునిగా యర్రా రామారావు సత్కారం పొందారు.
స్వరలాసిక (కోడీహళ్ళి మురళీమోహన్)ను సత్కరిస్తున్న డా.పాలకోడేటి సత్యనారాయణరావు
చివరగా చదువరి, రవిచంద్రలు అప్పటికప్పుడు తయారుచేసిన ‘వ్యాస విలాపం’ అనే దృశ్యశ్రవణ రూపకం సందర్భోచితంగా ఉండి ఆ రోజు కార్యక్రమాలలో హైలైట్‌గా నిలిచి పలువురి ప్రశంసలను అందుకుంది.
భవిష్యత్తులో మరింత కంటెంట్ సృష్టించి, సమగ్ర వికీపీడియా నిర్మాణానికి కృషి చేయడం, అలాగే కొత్త వాడుకరులకు మెరుగైన మద్దతు అందించేందుకు అవసరమైన సహాయక వనరులను అభివృద్ధి చేయడం వంటి కీలక నిర్ణయాలు తెలుగు వికీమీడియా యూజర్ గ్రూప్ ఈ సదస్సులో తీసుకుంది. ముగింపు ప్రసంగంలో ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని సహృద్భావ వాతావరణంలో నిర్వహించిన కృపాల్ కశ్యప్, వి.జె.సుశీల గార్లకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశాలలో ప్రత్యేక ఆకర్షణ ఫుడ్ టేబిల్. సభ్యులు తమ తమ ప్రాంతాలకు చెందిన ప్రత్యేకమైన పిండివంటలు, చిరుతిళ్ళు (పూతరేకులు, కాజాలు, రేగొడియాలు మొదలైనవి) తెచ్చి ఒక టేబుల్‌పై పెట్టారు. సభ్యులందరూ లొట్టలు వేసుకుంటూ వాటిని ఆరగించారు.
ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా, ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. హాజరైన సభ్యులలో వివిధ ప్రాంతాలవారు, విద్యార్థులు, డాక్టర్లు, సాంకేతిక నిపుణులు, ఆర్కిటెక్ట్లు, యూనివర్శిటీ ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, రిటైర్ అయినవారు, రచయితలు ఇలా వివిధ వృత్తులకు చెందినవారు ఉన్నారు. వీరందరూ ఒకచోట చేరి మూడు రోజుల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోగలరో నిరూపించిన తెలుగు భాషాభిమానుల పండుగ ఇది.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.