[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారి ‘తెలుగు తెరపై హిందీ స్వరాలు’ అనే రచనని అందిస్తున్నాము.]
యజుర్వేదంలో “సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా..” అనే ప్రార్థనాగీతం ఉన్నది. అంటే, “ఓ సరస్వతీ దేవీ! కోరిన రూపం ధరించే తల్లీ! విద్యను ప్రారంభిస్తున్నాను. నాకు ఎల్లప్పుడూ విజయం కలిగేటట్లు చేయి తల్లీ!” అని అర్థం. ఇక్కడ ‘కామరూపిణీ’ అంటే కోరిన రూపం ధరించగలది అని అర్థం. సంగీతం, సాహిత్యం, నాట్యం, గానం, చిత్రలేఖనం, శిల్పం వంటి చతుష్షష్టి కళలన్నీ సరస్వతీ దేవి రూపాలే! నేను ఏ విద్యని ప్రారంభిస్తే ఆ రూపంలో దర్శనమిచ్చి విజయం కలుగజేయమని భావం. అందుకే ఇక్కడ కామరూపిణి అనే పదం ఉపయోగించారు. బాగా పాటలు పాడేవారిని సంగీత సరస్వతి అని అంటూ ఉంటాము.
సంగీతానికి భాషా భేదం లేదు. ఆ మాటకొస్తే కళలు వేటికీ భాషాభేదం లేవు. కావలసినదల్లా ఆ కళలో మమేకం అవగలిగిన సామర్ధ్యం మాత్రమే! తెలుగు చిత్రాల్లో పరభాష నుంచీ వచ్చిన నటీనటులు, గాయనీ గాయకులు, సంగీత దర్శకులు ఇలా.. చాలామంది ఉన్నాడు. ఈ వ్యాసంలో తెలుగు చిత్రాల్లో తమ గానాన్ని వినిపించిన హిందీ పరిశ్రమ నుంచీ వచ్చిన కొందరు గాయనీ గాయకులను గుర్తు చేసుకుందాం.
ముందుగా గుర్తు చేసుకోవలసినది గాయకుడు మహమ్మద్ రఫీ. ఈయన తెలుగులో చాలా పాటలు పాడారు. తెలుగులో రఫీ పాడిన మొదటి చిత్రం ‘భక్త రామదాసు’ (1964). ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా ఆలస్యంగా విడుదల అయింది. ఇందులో రఫీ “దర్శన్ దేనా రామా..”, “దిల్ కో హమారే చైన్..” వంటి అయిదారు పాటలు పాడారు. ఇవన్నీ గుమ్మడి నటించిన కబీరు దాస్ పాత్ర మీద చిత్రీకరించారు. ఇందులో నాగయ్య, కన్నాంబ ప్రధాన పాత్రలు. యన్.టి.ఆర్., అంజలీదేవి, ఏ.యన్.ఆర్., శివాజీ గణేశన్ వంటి హేమాహేమీలు అతిధి నటులుగా నటించినా పెద్దగా ప్రజాదరణ పొందలేదు.
తర్వాత ‘భలే తమ్ముడు’ (1969) లో “గోపాల బాలా నిన్నే చేరి”, “ఎంతవారు గానీ, వేదాంతులైన గానీ…”, “నేడే ఈనాడే కరుణించె చెలి తానే..” “ఇద్దరి మనసులు ఒకటాయే..” వంటి పాటలు రఫీ పాడారు. ఇవి యన్.టి.ఆర్., కే.ఆర్. విజయ ల మీద చిత్రీకరించారు. విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు ఒకరు దొంగ, మరొకరు గాయకుడు అవుతారు. చిత్రం విజయవంతం అయింది.
టాలెంట్ ఎవరిలో ఉన్నా అవకాశాలిచ్చి ప్రోత్సహించేవారు ఆనాటి నిర్మాత, దర్శకులు. ఈ పాట హిట్ అవటంతో మరికొన్ని పాటలు పాడటానికి లతాను ఆహ్వానించారు ఇతర నిర్మాతలు. “నేను మద్రాస్ రాను. మీరే బొంబాయి వచ్చి రికార్డింగ్ చేసుకుని వెళ్ళండి” అన్నారు ఆవిడ. “అంత అవసరం మాకు లేదు” అనుకుని తెలుగు నిర్మాతలు ఎవరూ వెళ్ళలేదు. అటూ ఆవిడా రాలేదు. ఫలితంగా లతాజీ స్వరంలో మరికొన్ని మధురగీతాలు వినే అదృష్టం కోల్పోయారు తెలుగు ప్రేక్షకులు.
తర్వాత ఎప్పుడో 1988 లో మళ్ళీ ‘ఆఖరి పోరాటం’ (1988) చిత్రంలో “తెల్లచీరకు తకధిమి, తకధిమి..” అనే పాట బాలుతో కలిసి పాడారు. ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవల ఆధారంగా నిర్మించారు. యన్.టి.ఆర్., విశ్వామిత్రుడుగా నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ (1991) చిత్రంలో కూడా పాడారు ఆమె. కానీ అప్పటికి సినీగీతాల్లో సాహిత్యం బాగా తగ్గిపోయింది. అవేమీ ప్రజాదరణ పొందలేదు. ఇప్పటికీ లతా మంగేష్కర్ అనగానే “నిదురపోరా తమ్ముడా..” అనే పాటే గుర్తుకు వస్తుంది తెలుగు ప్రేక్షకులకు.
పి.సుశీల స్వరంలో రాజసం ఉట్టిపడుతుంది. కానీ లతాజీ స్వరం కోకిల స్వరం. భాష తెలియని వారు కూడా ఆమె గానమాధుర్యానికి మైమరచిపోతారు.
హిందీ గాయకుడు వెన్నెలలాంటి మెత్తని స్వరం కల గాయకుడిగా పేరుపొందిన తలత్ మహమూద్ తెలుగులో మనోరమ(1959) సినిమాలో ఒక సోలో పాట, రెండు యుగళగీతాలు, ఒకటి సుశీలతో, మరొకటి జమునారాణితో కలసి పాడారు. అందాల సీమా సుధానిలయం,మరచిపోయేవేమో, గతిలేనివాణ్ణి పాటలు పాడేరాయన.
లతా మంగేష్కర్ సోదరి ఆశాభోస్లే తెలుగులో ‘పాలు నీళ్ళు’ (1981) చిత్రంలో “ఇది మౌనగీతం ఒక మూగ రాగం..” అనే పాట పాడారు. ఈ పాట జయప్రద మీద చిత్రీకరించారు. చిన్నప్పుడు దూరమైన కన్నబిడ్డను తిరిగి కలుసుకున్నప్పుడు నాయిక హృదయంలో చెలరేగిన ఉద్వేగంగా ఈ పాట నేపధ్యంలో వినిపిస్తూ ఉంటుంది. కొడుకుగా బేబీ సరస్వతి నటించింది.
నటుడు కృష్ణ కుమారుడు రమేష్ బాబు నటించిన ‘చిన్నికృష్ణుడు’ (1988) లో “జీవితం సప్తసాగర గీతం, వెలుగు నీడల వేదం, సాగనీ పయనం కలా ఇలా..” పాట బాలుతో కలసి గానం చేశారు ఆశాభోస్లే. ఈ పాటలో నాయికా నాయకులు అమెరికాలో విహరిస్తున్నట్లు చూపించారు., ఇంకా అశ్వమేధం, పవిత్ర బంధం, చందమామ, బ్రహ్మర్షి విశ్వామిత్ర వంటి సినిమాల్లో కూడా కొన్ని పాటలు పాడారు ఆశాభోస్లే.
అక్కడ నుంచీ తెలుగు తెరమీద పరభాషా గాయనీగాయకుల తాకిడి ఎక్కువైంది. శ్రేయా ఘోషల్, సోను నిగమ్, సునిధీ చౌహాన్ వంటి వారు ఎంతోమంది వస్తున్నారు. కానీ వారి గానంలో ఉచ్చారణ పట్ల శ్రద్ధ తీసుకున్నట్లు అనిపించదు. ‘చూడాలని ఉంది’ సినిమాలో ఉదిత్ నారాయణ్ “రామచిలకమ్మ..” పదాన్ని “రామ్మా! చిలకమ్మా!” అని పాడటం, శ్రోతలు కూడా టి.వి. కార్యక్రమాల్లో అదే విధంగా అనుకరించటం జరిగింది. ఇదివరకు రేడియోలో పాట విని గాయకుడు, లేదా గాయని ఎవరో టక్కున చెప్పేసేవారు. ఇప్పుడు అందరి గొంతులు ఒకేలా అనిపిస్తున్నాయి, పైగా వాయిద్యాల ఘోషలో పాటలో సాహిత్యం అర్థం కాదు.
నేపథ్య సంగీతం మంద్రస్థాయిలో ఉంటేనే గాయనీగాయకుల స్వరాలు స్పష్టంగా వినిపిస్తాయి. గతంలో ‘రాజమకుటం’ (1960) చిత్రంలో “సడి చేయకో గాలి, సడి చేయబోకే, బడలి ఒడిలో రాజు నిదురించేనే..” పాటలో సంగీతం ఎంత మంద్రస్థాయిలో ఉంటుందో, ఆ పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో చూడండి! అందుకే అలాంటి పాటలు దశాబ్దాలు గడిచిపోతున్నా నిత్య నూతనంగా ఉంటున్నాయి. ఆ పాట పాడిన గాయని పి.లీల తెలుగువారు కాదు, మలయాళీ. ఆమె మాతృభాష తెలుగు కాదంటే తెలుగువారు చిన్నబుచ్చుకుంటారు. అంత మమేకమై పాడేవారు లీల. ఇలాంటి సందర్భంలోనే సంగీతానికి భాషాభేదం లేదు అనుకోవాలి.
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.