Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన

[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

ముందుమాట:

“ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం” అన్నారో కవి. వేయి సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. ఈ కాలంలో ఎందరో వీరులు భరతమాత దాస్య శృంఖలాలు త్రెంచే ఏకైక ధ్యేయంతో అనేక కష్టనష్టాల కోర్చి పనిచేశారు. వందలాది మంది నవ్వుతూ ఉరికంబాలెక్కి అమరులయ్యారు. లాఠీదెబ్బలు తిన్నారు. నరక కూపాలైన జైళ్లలో అమానుషమైన హింసలకు గురి అయ్యారు.

దుర్భరమైన అణచివేతను సహించలేక ఒక దేశంలో ఒక కాలంలో లక్షల జనం ఎదురు తిరిగి, ధర్మాగ్రహంతో సంఘర్షించి వేల సంఖ్యలో ప్రాణాలు బలి పెట్టారంటే ప్రపంచంలో ఏ దేశమైన, ఏజాతి అయినా వారి ధైర్యానికి, శౌర్యానికి గర్వపడుతుంది. పోరాటపు సాఫల్య వైఫల్యాలతో, పోరాడిన వారి ఆశయాల గుణదోషాలతో నిమిత్తం లేకుండా తన పూర్వులు పడిన కష్టాలను, చేసిన త్యాగాలను కృతజ్ఞతా పూర్వకంగా గుర్తు పెట్టుకుంటుంది. ఈ తరహాలో 1857 స్వాతంత్ర్య సంగ్రామాన్ని సంస్మరించి, వేలాది మృతవీరులకు సముచిత రీతిలో హృదయ పూర్వకంగా నివాళి ఇవ్వాలన్న ఆసక్తితో ఈ పరిశోధనా ప్రణాళికను చేపట్టాను.

1857 నాటి అంశాలను ఆధారంగా గ్రహించి ఇంతవరకు ఎవరు పరిశోధన చేయలేదు, ఈ అంశాన్ని ఆధారంగా తీసుకొని తెలుగులో కొన్ని పద్య కావ్యాలు, పద్యేతర కావ్యాలు వచ్చాయి. వీటిలో స్వాతంత్య్ర వీర ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి, ఝాన్సీరాణి, భారత స్వాతంత్య్ర సంగ్రామము, మంగళపాండే వంటి పద్య కావ్యాలను, ఇంకా అనేక పద్యేతర కావ్యాలను పరిశీలించడం జరిగింది.

ప్రపంచ చరిత్రలో జరిగిన ఏ ప్రజాపోరాటానికీ తీసిపోని ఈ మహత్తర వీరగాథను గమనిస్తే మనిషన్న వాడికి మనసు చెమ్మగిల్లుతుంది. అధర్మానికి తలవంచని మన సంగ్రామ సారథులు ధర్మనిష్ఠకు, ఆదర్శం కోసం, ఆశయం కోసం రక్తం ధారపోసిన వారి త్యాగ నిరతికి నిండు గర్వంతో నమస్కరించాలనిపిస్తుంది. ఎంత గొప్పవారైనా కళ్లకద్దుకుని ఘననీరాజనాలర్పిస్తారు. కలకాలం సగర్వంగా స్మంస్మరించుకొంటారు. అయితే సిపాయిల తిరుగుబాటును ప్రేరేపించిందెవరు? బహుదూర్‌షా, నానాసాహెబ్‌, ఝాన్సీరాణి మొదలైనవారు. అందుకు వారిని ప్రేరేపించిన కారణాలేమిటి? ఇంగ్లీషు వాళ్ళు బహుదూర్‌షా పాదుషాగిరికి ఎసరు పెట్టారు. నానాసాహెబ్‌కు వారసత్వంగా రావలసిన భరణాన్ని ఎగ్గొట్టారు. ఝాన్సీరాణి దత్తపుత్రుడి వారసత్వ హక్కును తిరస్కరించారు. ఇలా రాజ్యాలు పోయిన రాజభరణాలు రద్దుయిన మాజీరాజులు, రాణులు ఏకమై తెల్లవారి మీద కత్తిగట్టి, సిపాయిలను తిరుగుబాటుకు పురికొల్పారని విదేశీ చరిత్రకారులు సెలవిచ్చారు. వీరిది ప్యూడల్‌ వరకు అయినా, పోరాటానికంటూ అయత్తమయ్యాక కేవలం తన బాగు కోసం, తన పెత్తనం కోసం అని కాకుండా విశాల జాతీయ విముక్తి పోరాటంలో తమదీ ఒక భాగమని భావించారు. రాజ్యక్షేమం, ప్రజాక్షేమం అన్నిటికంటే మిన్నగా తలచారు. తమ కోసం ప్రజలు కాక, ప్రజలకోసం తాము ముందుండి సంఘర్షణ సాగించారు. తమ నిజాయితీతో చిత్తశుద్ధితో సైనికులను, సామాన్యులను ఉత్తేజపరిచి కార్యరంగంలోకి దూకించారు. అదే వారసత్వ హక్కులకోసం సంఘర్షణ స్వాతంత్య్ర సంగ్రామం స్థాయికి తీసుకు వెళ్ళింది.

కారణం లేని కార్యం ఉండదు. బలమైన ప్రేరణ ఏదో లేకుండా పెను విప్లవం సంభవించదు. సాధారణంగా ఏ కాలంలోనైనా కష్టాలకోర్చుకుని అన్యాయాలను భరించి, తమ బతుకులు తాము ప్రశాంతంగా వెళ్లదియ్యాలనే కోరుకుంటారు. ఇంకే మాత్రమూ సహించి ఊరుకోజాలని గడ్డు సవాళ్ళు ఎదురైతేగానీ తాము ప్రాణం కంటే మిన్నగా తలిచే విశ్వాసాలకూ, విలువలకూ, సెంటిమెంట్లకూ, తీవ్ర విఘాతం కలిగి దుర్మార్గానికి తల ఒగ్గటం కంటే ప్రాణత్యాగం మేలన్న తెగింపు వస్తేగాని సంఘర్షణకు దిగరు.

విదేశీయుల బెడద భారతదేశానికి కొత్త కాదు. శకులు, గ్రీకుల నుంచి హూణులు, ముసల్లాన్ల వరకూ ఎందరెందరో విదేశీయులు చారిత్రక విభాత వేళ నుంచీ ఇండియాపై అదను చూసి దాడి చేస్తూనే ఉన్నారు. భారతీయులు శాయశక్తులా వారిని ప్రతిఘటిస్తూనే వచ్చారు. క్రీ.పూ. 4వ శతాబ్దంలో అలగ్జాండర్‌ని పురుషోత్తముడు, క్రీ.శ. 10వ శతాబ్దంలో సబక్తజిన్‌ని జయపాలుడు, క్రీ.శ. 12వ శతాబ్దంలో ఘెరీ మహమ్మద్‌ను పృధ్వీరాజు – ఆనాటి రాజలోకపు అండతో ఎదుర్కొని ఎంత భీషణ సంగ్రామాలు సాగించారో తెలిసిందే. వీరోచితంగా పోరాడినా ప్రయోజనం లేక కుట్రలకు, కుతంత్రాలకు వారు బలికావడం వేరే సంగతి. ఆది నుంచీ ఆంగ్లేయుల వరకు వారిని గట్టిగా ప్రతిఘటించుటకు ముఖ్యకారణం.

తాము అనాదిగా అన్నింటికంటే మిన్నగా ప్రాణం కంటే ఎక్కువగా తలిచే ధర్మానికి, దైవ సంబంధ, మత విశ్వాసాలకు పెనుముప్పు వాటిల్లినపుడు స్వధర్మాన్ని రక్షించుకోవటానికి, దాన్ని కాపాడగల స్వరాజ్యాన్ని సాధించటానికి వివిధ మతాల వివిధ వర్గాల దేశవాసులు బలిష్ఠమైన మహా సామ్రాజ్యావాదులతో నిర్భయంగా తల పడ్డారు. 1857 విప్లవంతో మతం పెద్ద పాత్రవహించింది.

బలవంతపు మత మార్పిడుల ద్వారా, దుర్మార్గపు చట్టాల ద్వారా, మిషనరీల విచ్చలవిడి దుష్ప్రచారాల ద్వారా భారతదేశం మొత్తాన్ని క్రైస్తవమయం చేయడానికి బ్రిటిషు పాలకులు తెగబడినందు వల్లే వారి అఘాయిత్యాలను ఉపేక్షించి ఊరకుంటే తమ మతానికి, ధర్మానికి సర్వనాశనం తధ్యమన్న వెరపుతోటే ఈ దేశంలో హిందువులు, ముస్లింలు మతవిభేదాలను మరచి ఐక్యమత్యంతో విదేశీయులపై భీషణ సంగ్రామం సాగించారని చరిత్ర ఘోషిస్తున్నది.

ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామంలో దేశం కోసం ప్రాణాలు బలిచ్చిన వాళ్ళు యుద్ధంలో అద్భుత శౌర్య పరాక్రమాలు చూపించినవాళ్ళు, ప్రజాభిమానం విశేషంగా చూరగొన్నవాళ్ళు నానాసాహెబ్‌, బహుదూర్‌షా, లక్ష్మిబాయి సాహెబ్‌, మంగళపాండే, తాంతియాతోపే, టీకాసింగ్‌, కుమార, అమర సింహులు, అజుముల్లాఖాన్‌, హజరత్మహాల్‌ మొదలైనవారు. ముఖ్యముగా 1857 తిరుగుబాటు అనగానే ఎవరికైనా మొట్టమొదట గుర్తొచ్చేది ఝాన్సీ లక్ష్మీబాయి. అప్పటి ఆమె శౌర్య పరాక్రమాన్ని తలచుంటే కొడుకును వీపుకు కట్టుకొని గుర్రమెక్కి కత్తి పట్టి వీరవిహారం చేసే లక్ష్మీబాయి రూపమే మనసులో మెదులుతుంది. వేలూ లక్షల యోధానుయోదులు ఉండగా పౌరుషానికి ఒక స్త్రీ వచ్చిందంటే ఆమె ప్రజ్ఞా పోరాటాలు ఎంత ఘనమైనవో తెలుస్తుంది.

ఇప్పటికి ఋందేల్‌ఖండ్‌ జానపదులు ఆమె గురించి అబ్బరంగా చెప్పుకుంటారు. నిజంగానే ఆమె పిడికెడు మట్టి పట్టుకుంటే దాన్నించి మహా సౌన్యం తయారయ్యేదట. ఆమె చేయి తగిలితే కర్రముక్క కాస్తా కత్తిగా మారేదట. ఆమె రాయిని ముట్టుకుంటే అది గుర్రంగా మారి గ్వాలియర్‌కు దౌడు తీసేదట అని అక్కడి పాటక జనం ఇప్పుటికీ పాడుకుంటారు. తెల్లవారు నరరూప రాక్షసులని, దొరరూప రాక్షసులని అప్పటి భారతీయులు అన్నారంటే అందులో ఎంతో నిజం కనిపిస్తుంది. ఒక ఇంగ్లీషువాడు ఇంటికి రాసిన ఉత్తరాన్ని గమనిస్తే ఈ విషయం బయట పడుతుంది.

పల్లెలకు అన్నివైపుల నుంచి నిప్పటించి గ్రామవాసులను తగల బెట్టటం చాలా మంది ఇంగ్లీషువారికి మహా వినోదంగా తోచింది. ఆయా బీభత్స దృశ్యాలను చమత్కారంగా వర్ణిస్తూ ఇంగ్లాండుకు వారు ఉత్తరాలు రాశారు. మంటలను ఎంత వేగంగా ఎంత లాఘవంగా అంటించే వారంటే గ్రామంలోని ఏ ఒక్కరూ తప్పించుకో గలిగేవారు కాదు. పేదరైతులు, బ్రహ్మణ పండితులు, హాని చేయని ముసల్మాన్లు, బడిపిల్లలు, చంకలో పసిపిల్లలున్న తల్లులు, యువతులు, వృద్ధులు, అంధులు, అవిటివారు అందరూ మంటల్లో మాడిపోయారు. వాళ్ళంతా ఉన్న పెద్ద గ్రామానికి మేము నిప్పుంటించి, చుట్టు ముట్టాం మంటల్లోంచి బయటికి రాబోయిన వారినల్లా కాల్చేశాం అని ఆ తెల్లదొర తన ఉత్తరంలో వర్ణించాడు.

దెబ్బ తిన్నవాడికే బాధ బాగా తెలుస్తుంది. కల్లోలం కొనసాగిన రెండేళ్ళూ తెల్లవాళ్ళు ఎన్నెన్ని చిత్రహింసలు పెట్టి, ఎలాంటి చిత్రవధలు చేశారో దుస్సహక్లేశాన్ని అనుభవించిన వారే సరిగా చెప్పగలరు. మానవత్వం మరిచి, పిశాచాల్లా పెట్రేగి, జనాన్ని చెండుకు తిన్న దొరలే అదేదో వీరోచిత మహాకార్యమైనట్లు సగర్వంగా చెప్పుకున్నారు. డైరీల్లోనూ, బంధు మిత్రులకు రాసుకున్న ఉత్తరాల్లోనూ తామూ చేసిన ఘాతుకాలను మహా గొప్పగా ఏకరువు పెట్టారు. తమను పెట్టిన క్షోభను ఆ కాలపు భారతీయులు ఎక్కడా రాసి పెట్టలేదు. దారుణ దమనకాండకు గురై దిక్కుతోచని భయావహ స్థితిలో ఆయా దురాగతాలను ఎక్కడా గ్రంధస్థం చేయలేదు. దయలేని తెల్లరాకాసుల ఆగ్రహానికి గురి అవుతామన్న భయంతోనే ఏమో ఎవరూ అందుకు సాహాసించలేదు.

అర్ధ శతాబ్ది తరువాత వీరసావర్కర్‌ అనే దేశభక్తుడు ‘ది ఇండియన్‌ వార్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌ 1857’ అనే తన ప్రసిద్ధ గ్రంధంలో బ్రిటిష్‌ దమననీతి మహాకర్కశంగా సాగుతున్న సమయంలో విస్తృత పరిశోధన చేసి ఆంగ్లేయుల రాక్షస కృత్యాలూ కాలగర్భంలో కలిసిపోకుండా యథార్థాన్ని ఉన్నదున్నట్లు లోకానికి చాటారు.

ఇంగ్లీషు వారి పక్షాన పోరాడిన వీరులకు విక్టోరియా క్రాస్‌లాంటి పతకాలు గౌరవ నీరాజనాలు ఇచ్చి వారి చరిత్రను అనేక మంది చరిత్రకారుల ద్వారా వెలుగులోనికి తెచ్చారు. దీనికి విరుద్ధంగా మన పక్షాన ప్రాణాలర్పించిన మృతవీరులు మంగళ్ పాండే, తాతియాతోపే పేర్లు కూడా మనకు తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుకు 1857 తిరుగుబాటులో పాల్గొన్న వారి దైర్యాన్ని, శౌర్యాన్ని జాతి జనులు కలకాలం కృతజ్ఞతతో గుర్తుపెట్టుకొనే విధంగా ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే పరిశోధన ద్వారా 1857 యుద్ధానికి సంబంధించిన చరిత్రతో పాటు ఎన్నోముఖ్య ఘట్టాలు, ముఖ్యవ్యక్తుల ప్రస్తావన ఇందులో వివరించడం జరిగింది. విజ్ఞులు నా కృషిని హర్షిస్తే నా పరిశోధనకు సార్థకత, పలితం దక్కినట్లే అని సంతోషపడుతాను.

(సశేషం)

Exit mobile version