[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
2వ అధ్యాయం – 1857 మహాసంగ్రామ యుద్ధవీరులు
2.6. 1857 తిరుగుబాటు గురించి వచ్చిన తెలుగేతర సాహిత్యం:
1857 తిరుగుబాటు ఎంతో చారిత్రక ప్రాధాన్యత వున్న తిరుగుబాటు. 1857 కంటె ముందు 1757 నుంచి బ్రిటీష్ దమననీతికి వ్యతిరేకంగా భారతదేశంలో అనేకానేక తిరుగుబాట్లు జరిగాయి. 1794 ప్రాంతం నుంచీ జరుగుతూ వస్తున్న బ్రిటీష్ వ్యతిరేక సాయుధ ప్రజాపోరాటాలు 1857లో ఓ మలుపు తీసుకున్నాయి. తర్వాత్తర్వాత 1857 భారత ఫ్యూడల్ సామ్రాజ్యవాద పోరాటాలకు ఎంతో ప్రేరణనిచ్చిన పోరాటం. ఆంగ్లేయ పాలకులు అంత పెద్ద ఎత్తున వలస ప్రజల ప్రతిఘటనను ఎదుర్కొన్నది 1857 పోరాట సమయంలోనే. బ్రిటిష్ రచయితలు దాన్ని ‘దేశభక్తిలేని సిపాయీల పితూరి అని, ప్రజల తిరుగుబాటు కాద’ని కొట్టివేసినా అది భారత ప్రజల నిజమైన తొలి స్వాతంత్య్ర సంగ్రామ భేరి.
స్ఫూర్తి గీతం:
నాగళ్ళ కడగళ్ల/నడుగ నవసరమూ లేదు
మగ్గాల నడుముల్ని/విరిచేసినారు/రైతు చేతుల భమి
దోచేసినారు/వల్ల కాడై నేల/తల్లడిల్లింది జనము
పొండిరా లండను/పనియేమిరా ఇక్కడ/దయ్యాలు మీరు
దరిదాపులుండొద్దు/బుల్లెట్లవానల్లు/కురిపించి నారు
కొరడాలతో కొట్టి/హింసించినారు/వందేళ్లుగా మీరు
రాకాసి మూకలై/రక్తాలు తాగారు/మీ అంత దుష్టులు
కనపడరు ఎక్కడ/పొండిరా లండను/పని ఏమిరా ఇక్కడ
దయ్యాలు మీరు/దరిదాపులుండొద్దు/మానేల నేల మీరెవరు?
పొండిరా లండను/బంగారు భూమిని/బుగ్గి పాల్జేశారు
ఆకలీ అవమానముల/తల్లడిల్లింది జనము/ఈ నేల నేల మీరెవరు?
పొండిరా లండను/పనియేమిరా ఇక్కడ/చేసింది చాలు
దయ్యాలు మీరు/దరిదాపులుండొద్దు/అలహబాదూ ఢక్కాల
అగుడు చేసీనారు/చేనేత కారుల/చేతుల్లు నరికేసినారు
బిచ్చగాండ్లను చేసి/ఇసిరేసినారు/మాంచెస్టరును దెచ్చి
మాతలలపై నిలబెట్టినారు/బంగారు తల్లిని/పాడు చేసీనారు
పాపాత్ములారా/పని ఏమిరా ఇక్కడ/పొండిరా లండను
ఈ నేల మా నేల/మా నేల నేల మీరెవరు?/పోకుంటె తన్ని పంపుతాము
దయ్యాలు మీరు/దరిదాపులుండొద్దు/పొండిరాలండను
(1857 తిరుగుబాటులో ప్రజలు పాడుకున్న ఓ పాట స్పూర్తితో)
వీరులారా! వందనం-రణధీరులారా! వందనం:
స్మృతులు/మనల్ని నదుల్ని చెయ్యపోతే/అలల కత్తుల్ని చెయ్యకపోతే
కత్తుల కవాతుల్ని చెయ్యకపోతే../అవేం స్మృతులు?
1857 తిరుగుబాటులో బ్రిటీస్ సామ్రాజ్యవాదులపై ధ్వజమెత్తిన వీరుల స్మృతులు మనల్ని నదుల్ని చేస్తాయి. అలల కత్తుల్ని చేస్తాయి. కత్తుల కవాతుల్ని చేస్తాయి. కానట్టే ఆ తిరుగుబాటులో పాల్గొన్న వీరుల సంస్మరణ మనకు అత్యవసరం.
ఝాన్సీ/నానా/రాజపుత్ర వీరులు
వీర గెరిల్లాలు/కువర్‌సింగ్/అమర్‌సింగ్
తాంతియాతోపే/బహదూర్‌ఖాన్/భక్త్‌ఖాన్
ఆత్మభిమానుల కథ/హజరత్ మహల్
మరెందరో వీరనారీమణులు
ఝాన్సీ! నీ తర్వాత నీ స్నేహితులు నానా, తాంత్యేలు ఏమయ్యారు? నీ బాటలోనే సాగారు. భారతదేశానికి వన్నెదెచ్చారు.
ఆమె మట్టి నించి/రాళ్ళనించీ/రప్పల్నించి
మహాసైన్యాన్ని/సృష్టించింది/కర్రముక్కను
ఖడ్గంగా మలిచింది/పర్వతాల్ని
పరిగెత్తే అశ్వాల్ని చేసింది/గ్వాలియర్ దిక్కుగా
నడిచింది/ఆమె తన సైనికులకి/అన్నం పెట్టింది
(ఝాన్సీ రాణిని గురించి ప్రజలు పాడుకునే పాటల్లోని కొన్ని పంక్తులు)
అతన్ని కీర్తించే గీతాలు చాలా వున్నాయి. ఈ గీతాలు వాళ్ల భూస్వామ్య వ్యతిరేకతను కూడా తెలియచేస్తాయి. ఈ గీతాలు బ్రిటీష్ వ్యతిరేక దేశభక్తితో పాటు భూస్వామ్య వ్యతిరేక లక్షణాలను పెంచిపోషించటానికి వుపయోగపడినాయి.
కూడగట్టి/నల్లవాళ్లను/పోరసాగెను
కుషాల్‌సింగు/అవ్వారే! అవ్వా/సాటెవరవ్వా!
తుఫాను మేఘంలా/తుపాకి గర్జన/అప్సరల్లారా!
అవనికి రండి/నాట్యం చెయ్యండి!/మృత్యువిక్కడ
ఆడుతోంది/కబడ్డీ/మారుమోగుతోంది
లండన్‌లో అవ్వాపేరు/మా భూమిలోనూ/ప్రతివూరూ
కుషాల్‌సింగ్‌ని/పాడుతుంది/ఆడుతోంది.
(ఓ రాజస్థానీ గీతం ఇది. రాజస్థానీ గీతాలు భూస్వామ్య వ్యతిరేకతకి పెట్టింది పేరు. పాలించే రాజుని ధిక్కరించి బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో నేలకొరిగిన వీరుడు రాజపుత్ర వీరుడు కుషాల్‌సింగ్. అశేష ప్రజాభిమానమున్నవాడు. ఆయన్ను గురించి పాడుకునే దోహాల్లో కొన్ని..)
కుషాల్‌సింగ్ తర్వాత పేరు పొందిన రాజపుత్ర వీరుడు అమర్‌కోట రతన్‌రాణ. కుషాల్‌సింగుతో కలియడానికి ఎందరో రాజులు ముందుకు రానివేళ సింగ్‌తో స్నేహహస్తం కలిపిన వీరుడు రతన్‌రాణా. అవ్వాలో పోరాటం వెనుకడుగు వేసినపుడు అబూ పర్వతాల్లో తలదాచుకుని ఆరావళీ పర్వత శ్రేణుల్లో తిరుగుతున్నపుడు కుషాల్ రతన్‌రాణాను కలుసుకున్నాడు.
ఊహించినంత స్థాయిలో పన్నుభారం వేసినపుడు ప్రజలను దృష్టిలో పెట్టుకొని అంత పన్ను ఇవ్వనిరాకరించాడు రతన్. ఆ సందర్భంగా అమర్యాదగా ప్రవర్తించిన బ్రిటీష్ అధికారిని శిరచ్చేదం చేశాడు రతన్. అలా బ్రిటీష్ పెత్తనానికి వ్యతిరేకించి పర్వత ప్రాంతాలకు పారిపోయి రాబిన్‌హుడ్‌లా మారిపోయాడు. మేవారు ప్రాంతం ఆడవాళ్లు ఆయనపై పాటలు గట్టారు. ఈ పాటలు దేశభక్తి నేమీ కలిగించవు గాని ఆ వీరునిపై వాళ్ల కాల్పనిక ప్రేమను గౌరవాన్ని మనకు తెలుపుతాయి. ఈ ప్రేమకు కారణం అతడు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా వుండటమే అని మరచిపోరాదు. రతన్ రాణాను ఒక ద్రోహి సాయంతోనే బంధించి వురితీశారు. ఒక ఫ్యూడల్ ప్రభువైనా ఏకకాలంలో ఫ్యూడల్ వ్యతిరేక బ్రిటిష్‌వ్యతిరేక పోరాటం చేయగలిగిన ఆయన్ను ప్రజలు జ్ఞాపకం వుంచుకోవటం సహజమే.
రతన్‌రాణా!/గుర్రాన్ని వెనక్కి తిప్పు/అమర్‌కోట పిలుస్తోంది
చిలుకలు చింతతో వున్నవి/నెమళ్ళు ఏడుస్తున్నవి/రతన్ రాణా!
మ రాజా!/మా ప్రాణమా/గుర్రాన్ని వెనక్కి తిప్పు
చిలుకలు నెమళ్లు పలవరిస్తున్నవి/నీకోసం కోయిలలు పాడుతున్నవి
అమర్‌కోటలో మహాతరువులు/మహ్వాతరువులు అమర్‌కోటలో
మహ్వా మధువులు స్రవిస్తున్నది/రతన్ రాణా!
ఒక్కసారి తిరిగిరా/ఒక్కసారి తిరిగిరా/ఇసురు రాళ్లతో విసిరి
గోధుమల పిండితో/రొట్టెలుచేసి వుంచాం మేం
మా రాజా! మా ప్రాణమా!/ఒక్కసారి వచ్చి పోవయ్య
అమర్‌కోటలోని/అగసాలి వాళ్లు/నా కోసం
అందెలు చేస్తున్నారు./వెదురుతెరల వెనుక
“తలచెడిన అమ్మాయి/నిలుచోని వున్నది/రతన్‌రాణా
వెనక్కి తిప్పు/గుర్రాన్ని/అమర్‌కోటంత చీకటే
చిమ్మచీకటే కోటంత/నీవులేని రాజ భవనం
దిగులుగా వుంది/తిరిగిరావయ్య”
వీర గెరిల్లాలు మీరు:
వీర గెరిల్లాలు మీరు/విముక్తి పోరు విజయం పొందిందాక
మసలుతూనే వుంటారు
మా జ్ఞాపకాల్లో మెసలుతూనే వుంటారు
1857 నాటి భారతస్వాతంత్య్ర పోరాటంలో భారత వీరులననుసరించిన యుద్ధ తంత్రంలో గెరిల్లా యుద్ధం ప్రముఖమైంది. బలమైన శత్రువును దీర్ఘకాలం ఎదిరించి నిలవటానికి గెరిల్లా యుద్ధతంత్రం అమోఘంగా వుపయోగపడుతుంది. గెరిల్లా యుద్ధతంత్రంలో బీహార్ జగదీశ్‌పూర్ సంస్థానాధీశుడు కువర్‌సింగ్ అతని తమ్ముడు అమరసింహుడు. తాంతియాతోపే ఆరితేరినవారు.
‘యుద్ధభూమిని ఎప్పుడూ పిరికితనంతో వదిలిపెట్టకూడదు’ అనే సూత్రం గెరిల్లా యుద్ధంలో ప్రధానమైన సూత్రం. తమ సైనికుల్లో ఆత్మ విశ్వాసం కలిగించటం, శత్రువును చీకాకుపరచటం దీనిలో ముఖ్యం. ప్లాను ప్రకారం దాడి మళ్లీ వెనక్కి తగ్గడం. తక్కువ నష్టంతో శత్రువును ఎక్కువ నష్టానికి కష్టానికి గురిచేయటం, నీరసపరచటం, నిరుత్సాహపరచడం గెరిల్లా యుద్ధతంత్రంలో కనిపించే విశేషాలు. శత్రువు ఆదమరిచి వున్నది చూసి దాడిచేయడం. ఒకవైపు దాడి చేస్తున్న భ్రమల్లో శత్రువును పెట్టి మరోవైపు నుంచి దాడిచేయడాలు గెరిల్లా పోరాటంలో కనిపిస్తాయి. గెరిల్లా వీరులు అటవీ ప్రాంతాన్ని ఆత్మరక్షణ కోసం సమర్థవంతంగా వుపయోగించుకోగలిగారు. కువర్‌సింగ్ రాజపుత్ర వీరుడు. మడమ తిప్పని యోధుడు యుద్ధ వ్యూహనిపుణుడు. డల్హౌసి రాజ్యసంక్రమణ సిద్ధాంతంతో కువర్‌సింగ్ రాజ్యం కూడా చేజారిపోయింది. కువర్‌సింగ్ క్రుద్ధ వృకోదరుడై యుద్ధానికి సిద్ధమైనాడు. అపుడా వృద్ధ సింహానికి 80 ఏళ్ళ వయస్సు. తమ్ముడు అమర్‌సింగు, సహచరులు జవాన్‌సింగ్, ఈశ్వర్‌సింగ్‌లతో రాణివాసాన్ని వెంబడించుకొని బీహార్ అడవుల్లోకి శోణానదిని దాటి వెళ్లాడు కువర్‌సింగ్.
కువర్‌సింగ్‌ని బీహార్ ముఖ్యంగా అర్రా పట్టణం నేటికీ జ్ఞాపకం చేసుకుంటూనే వుంది. ‘భోజ్‌పురీపిత’గా ఆయన నేటికీ ప్రజల మనస్సుల్లో వున్నాడు.
హోలీ హోలీల రంగహోలి/శెమ్మి కేలీరే హోలి
హోలీపాట సంద్రమై వుప్పొంగుతుంది/అర్రా ఆనందాశ్రువులతో
కువర్‌సింగ్ ఓగుల్ మొహర్ పూల పర్వతమై/పైకి లేస్తూనే వున్నాడు
సాయుధ సందేశం అందిస్తూనే వున్నాడు
కువర్‌సింగ్ తమ్ముడు అమర్‌సింగ్, ఆయన అన్నమార్గంలో నడిచిన రాజపుత్ర వీరుడు. ఒక నిమిషం కూడా వ్యర్థం చేయకుండా అన్న మరణించిన నాలుగైదు రోజుల్లోనే బ్రిటీష్ వాళ్ళపై సమరభేరి మోగించాడు.
కున్వర్‌సింగ్‌పై పాటలు:
నా చిట్టి తండ్రి/నా చిట్టి తండ్రీ!/మన కష్టాలు దీర్ఘంగ
కత్తి దూసిండు మీ తాత/మన గౌరవమూ నిల్ప
కదనాన దూకిండు/మీ తాత/తాత ముత్తాతల గౌరవాన్ని
నిలపాల్సి వుంది/తల చెడిన తల్లుల/రక్షించుకోవాలె
గోమాత కోసమై/కాసెబూయాలె/మనమతమును మంట్ల
కలువకుండా ఆపాలె/మన గౌరవమ్ము నిలువ
మీ తాత దూసిండు కత్తి/వీర మరాఠాలు
ప్రాణాలు వదిలారు/చివరి శ్వాస దాక/సిక్కులూ నిలిచారు
పీష్వాల బిడ్డలు/బిచ్చగాండ్లైపోయినారు/ఢిల్లీకి రాజైన
బిచ్చగాడే నుర తండ్రి/బిచ్చగాళ్ళను/బిచ్చమడిగేటి
రోజొచ్చెరా తండ్రి/కష్టకాలం వొచ్చెరా తండ్రి
కష్టాలు తీర్చంగ మీ తాత/కత్తి దూసిండు రాతండ్రి
సకల శాస్త్రాలు/తేళ్లగూళ్లయి పొయ్యాయి
బందూకు గొట్టాల/తుప్పు పట్టింది
తెలివి తక్కువయ్యీ మనము/ఖడ్గాలు చేసేటి వుక్కుల్ని
కొడవళ్ళు చేశాము/భోజ్సురీలందరూ/లాఠీలు గూడా
వదిలేసినారు/నా చిట్టి తండ్రీ/నా చిట్టి తండ్రీ
కష్టాలు దీర్పంగ/మన పరువు నిల్పంగ
కత్తి గట్టిండు మీ తాత/కదనాన దూకిండు
మీ తాత/ముగ్గుబుట్టా వంటి/తలతోడమీ తాత
పళ్లన్ని వూడినా తాత/ఏళ్లు ఎనబయ్యి
పై బడ్డ మీ తాత/కత్తి గట్టిండు
కదనాన దూకిండు/కష్టాలు దీర్పంగ
మన పరువు నిల్పంగ/కత్తి గట్టిండు తాత
కదనాన దూకిండు తాత.
(కువర్‌సింగును జ్ఞాపకం చేసుకుంటూ ఓ తల్లి బిడ్డను జోకొడుతూ పాడిన పాట ఇదీ 1854 నాటి ప్రజల పాటే)
“అడవి నించడివికి పోయిండు తండ్రి/ఎనుకడుగు ఎయ్యలేదూ దండ్రి
తండ్రి గాయపడితే చూసి/జింకతల్లీ కన్నీరువెట్టే”
ఆయన్ను భోజ్‌పురీలు పేరు పెట్టి పిలవరు. బాబూ అని పిలుస్తారు. ‘బాబు’ అంటే భోజ్‌పురీలో ‘తండ్రి’ అని అర్థం.
‘మా తండ్రీ కువర్‌సింగ్/నీ రాజ్యం వచ్చేదాక
కట్టబోము కాషాయాలు/అక్కణ్ణుంచి ఫిరంగీలు
ఇక్కణ్ణుంచి అన్నాదమ్ములు/తహోలిరంగులు కురిసినట్లే
కురిసింది తూటాల వర్షం/ఆ వర్షం మధ్య భీకరపోరు
తండ్రీ కువర్‌సింగ్ !/నీ రాజ్యంవచ్చే దాకా
కట్టబోము కాషాయాలు’
తిరుగుబాటుదారులు చేసిన ప్రతి హింస కంటె వెయ్యి రెట్లు ప్రతీకార హింసాత్మక దాడుల్ని ఇంగ్లీషు వాళ్లు చేశారు. ప్రముఖ కవి గాలిబ్ చలించిపోయాడు.
“ఎక్కడ చూసినా రక్త సముద్రమే
జమున మానవ కళేబరాలతో నిండిపోయింది
ఆ దృశ్యాలను చూసి భరించలేని మహిళలు
ఆత్మహత్యలు చేసుకున్నారు
అందుకు సాక్ష్యంగా
కులం చలం బావిని చూడమన్నాడు” – గాలిబ్
రంగూన్‌లోనే వున్నప్పుడు జఫర్
“జఫర్ నువ్వెంత దురదృష్టవంతుడివిరా!
నువ్వెంత గానో ప్రేమించిన మాతృభూమిలో
రెండు గజాల నేలకు కూడా
నువ్వు నోచుకోలేదు” అని రాసుకున్నాడు.
ఆత్మాభిమానాల కథ:
“నేపాల్ అంచుల్ని/తాకిన లక్నోశౌర్యం
హజ్రత్ మహలై/ఆకాశాన్ని తాకిన కథ
ఆత్మాభిమానాల కథ/ఆత్మార్పరణల కథ”
వీరనారి ఝాన్సీ రాణిలా మాతృదేశం కోసం పోరాడిన మరో వీర మహిళ ‘హజ్రత్ మహల్. బ్రిటిష్ వాళ్లు అవధ్ రాజ్యాన్ని ఆక్రమించుకొని నవాబు వజీర్ అలీకి ప్రవాస శిక్ష వేశారు. రాజమాత ఇంగ్లండు వెళ్ళిపోయింది. హజరత్‌మహల్ ధైర్యంతో నిలిచింది. తన 11 సంవత్సరాల కొడుకు కోసం, సంస్థాన ప్రజల కోసం తాను పాలన చేపట్టింది.
కులం, ప్రాంతం తేడాలు లేకుండా పురుషులతో బాటు ఎందరో స్త్రీలు తిరుగుబాటులో చేరారు. రకరకాల స్థానాల్లో ఉంటూ తిరుగుబాటును ప్రజ్వరిల్లడానికి ప్రయత్నం చేశారు.
“వీరనారులారా!/మీరు లేని చరిత్ర
ఎక్కడైన ఉన్నదా/ఎన్నడైన ఉన్నదా
తల్లులారా లాల్‌సలామ్/అక్కలారా లాల్‌సలామ్’’
1857 పతాక గీతం:
“మాదే మాదే హిందూస్థాన్/మేమే దీనికి మాలికులం
ఇది మాసొత్తు/మాదే మాదే హిందూస్థాన్
నల్లగా వుండుటవల్లే ఈ దేశం/లోకం అంతా వెలుగుల సంతా
పవిత్రమైనది/మాదేశం/దిగదుడుపేర
స్వర్గం గూడా/ఎంత పురాణం/ఎంత నవీనం
విశిష్ఠమైనది/ఈ దేశం/గంగాయమునల
జీవధారలు/బంగరుపండే/పంటపొలాలు
సాటిలేనిది/చక్కనైనది/మా దేశం
పెట్టని కోటలు/హిమాలయాలు/ఉత్తరమ్మున
నగారమోతలు/సముద్ర ఘోషలు/దక్షిణమ్మున
దూరం నుండి/వచ్చిదూరిన/ఫిరంగి మూకలు
మాయలు చేసి/సర్వం దోచిరి/ఫిరంగి పాలన
నంతం చేయగ/సవాలు విసిరిరి/కంట నిప్పులు
కురుస్తు రండి/బానిసత్వపు/బందనాలను
తెంచగ లెండి/ముస్లిమ్ హిందూ/సిక్కులందరు
అన్నాదమ్ములై/స్వతంత్ర జండకు జైజై
మన స్వతంత్ర జండకు జైజై’’
(1857 పోరాటంలో సిపాయీలు పాడుకున్న పాట. నానా ముఖ్య అనుచరుడు అజిముల్లాఖాన్ నడిపిన ‘పయామే ఆజాదీ’ అనే ఉర్దూ పత్రికలో ఈ పాట వచ్చింది). పై పాటల్ని హిమజ్వాల గారు రచించిన ‘ఘాటెక్కిన గంధక ధూమం’ లోనివి.
(సశేషం)
