[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
2వ అధ్యాయం – 1857 మహాసంగ్రామ యుద్ధవీరులు
ఉజ్జ్వల ఘట్టాలు – తెలుగేతర సాహిత్యం:
ప్రజలు తాము నివసిస్తున్న నేల మీద భక్తిని ప్రకటించటం, స్వజాతి జనుల మీద ప్రేమను సంపాందించుకోవడం జాతీయతగా భావించవచ్చు. జాతి మీద అభిమానమే జాతీయత. అయితే ఏ జాతి తన చరిత్రలోని ఉజ్జ్వల ఘట్టాలను విస్మరించజాలదు. అటు విస్మరించజాలని ఘట్టాలలలో 1857 స్వరాజ్య సంగ్రామ మొకటి. ఈ కాలంలో మానవ జాతి చరిత్రలో ఒక నూతన శకం ఆరంభమయింది. బానిస సంకెళ్ళను త్రెంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో బతకాలనే ప్రగాఢమైన వాంఛతో దాదాపు భారతదేశంలో అన్ని ప్రాంతాలలో సిపాయిలతో పాటు అన్ని సంస్థానాదీశులు, ప్రజలు ఉద్యమించారు. బ్రిటిష్ వారి మీద అనేక రకాలుగా ప్రజల జీవితాల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్రిటిష్ ఆధిపత్యంపై తిరుగుబాట్లు జరిగాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నానాసాహెబ్, ఝాన్సీలక్ష్మీభాయి, బహదూర్‌షాలు బ్రిటిష్ పరిపాలనా విధానంపై ఎదురు తిరిగారు. ఇదే 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుగా చెప్పబడుతున్నది. ఈ తిరుగుబాటులో తిరగబడిన సిపాయిలను ‘యూనిఫారమ్ ధరించిన రైతులు’గా కార్లమార్క్స్ అభివర్ణించారు. దీన్నే ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా అభివర్ణించారు ఏంగిల్స్.
2.1. అమరవీరుడు మంగళపాండే:
బ్రిటిష్ వ్యతిరేక ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం రెండేళ్ళు కొనసాగింది. వందేళ్లుగా భారతదేశంలోని అనేక తరగతుల ప్రజల్లో బ్రిటిష్ వాళ్ల పట్ల అసహనమూ, అసహ్యమూ నానాటికి పెరిగి పోయాయి. 1857 ప్రారంభంనుంచే బ్రిటీష్ వారిపై సిపాయీల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం మీద కాంక్ష పరతంత్రాన్ని తుదముట్టించానే దీక్ష జమిలిగా కొనసాగాయి. మొదట బెంగాల్ సైన్యంలో కదలికలు. తర్వాత బర్హాన్‌పూర్‌లో, మార్చ్ ఆఖరువారంలో బారఖ్‌పూర్‌లో సిపాయీల నిరసనలు పెరిగిపోయాయి. కొవ్వుతూటాల వాడకం (వద్దనే) విషయం మీద ఘర్షణ చెలరేగింది. తొలి తూటా మంగల్‌పాండే పేల్చాడు. మంగల్‌పాండే అలా స్వాతంత్య్ర పోరాటానికి శంఖమూదాడు. మంగళ్‌పాండే గురించి ఈ అధ్యాయంలో స్థూలంగా చెప్పడం జరిగింది. 4వ అధ్యాయంలో మంగళ్‌పాండే కావ్యం గురించి పరిశీలించడమైనది.
2.2. నానాసాహెబ్ షీష్వా:
మహారాష్ట్రలో వేణు అనే గ్రామంలో 1824లో జన్మించాడు నానా. నానా అసలు పేరు దోండేవత్. గంగాబాయి తల్లి నారాయణ భట్టు తండ్రి. సామాన్య కుటుంబం. పేదరికం నీడలోనే కనులు తెరిచాడు. నానా పీష్వాబాజీ రావ్ అప్పుడు బిటూర్‌లో వుంటున్నాడు. అక్కడికే చేరాడు నారాయణ భట్టు. అక్కడ నానా బాజీరావును ఆకర్షించాడు. రెండున్నరేండ్ల నానాను బాజీరావు దత్త పుత్రునిగా స్వీకరించాడు. మనూ, తాంత్యాలతో నానా కలిసి చదువుకున్నాడు. వీర విద్యలన్నీ నేర్చుకున్నాడు.
తండ్రిపోయాక నానా అందమైన బికూర్‌నే ఆవాసంగా కూర్చుకున్నాడు. గుర్రాలన్నా, తాను సంపాదించి పెట్టుకున్న రకరకాలైన ఆయుధాలన్నా, నానాకు ఎంతో ప్రీతి. ఫిరంగుల, పెద్ద పెద్ద బందూకులు, కత్తులూ ఆ ఆయుధాల్లో వుండేవి. నానా ఎంత విద్యావంతుడో, అంతటి రాజకీయ అభినివేశం వున్నవాడు. టాడ్ అనే అతనితో ఇంగ్లీషు దినపత్రికలను కూడా చదివించుకునే వాడట. దేశ దేశాల చరిత్రల్ని రాజకీయ పరిణామాలనూ శ్రద్ధగా పరిశీలించేవాడనీ చెపుతారు.
1851లో బాజీరావు చనిపోతూ, నానా తన దత్తపుత్రుడని, అతని ఆస్తులు, పీష్వా అధికారాలు తన కొడుక్కే చెందుతాయని వీలునామా రాసిపోయాడు. బాజీరావు రాజ్యం అప్పటికే బ్రిటీష్‌వాళ్ళ చేతుల్లో వుంది. బ్రిటీష్‌వాళ్ళు అతనికి ప్రతి సంవత్సరం 8 లక్షలు ఫించనుగా ఇచ్చేవాళ్ళు. బాజీరావు మరణంతో ఆ ఫించను యివ్వమని బ్రిటీష్‌వాళ్ళు షరామామూలు గానే ప్రకటించారు. అంటే దత్తతను గుర్తించమని అర్థం. అదే రాజ్యవిలీన ద్రోహబుద్ధి. నానా తన హక్కులను గూర్చి హుందాతనంతో బ్రిటీష్‌వాళ్ళకు లేఖలు రాశాడు. రాజ్యాన్ని విక్రయించినపుడు అందుకు బ్రిటీష్‌వాళ్ళు తమతో చేసుకున్న ఒడంబడికను అమలు చేయటం ధర్మమని పేర్కొన్నాడు. ఒడంబడికను ఉల్లంఘించటమంటూ వుంటే, అది రెండువైపులా కూడా వర్తిస్తుందని నానా హెచ్చరించాడు. నానా రాయబారిగా అజముల్లాఖాన్ లండను వెళ్లినా లాభం లేకపోయింది. పరిస్థితులు భారతంలో నానాటికి మారుతున్నాయి. బ్రిటీష్‌వాళ్ళపై వ్యతిరేకత ఏదో రూపంలో బయటపడుతూ వున్నది. ఈ పరిస్థితుల్ని గమనించి నానా, అజిముల్లాఖాన్‌లు ఉత్తర భారతదేశ పర్యటనకు బయల్దేరారు. స్వాతంత్య్ర పోరాటం విజయం పొందాలంటే, హిందు ముస్లింల మధ్య మైత్రి తప్పని సరైనదని వాళ్లు అర్థం చేసుకున్నారు. కృషి ప్రారంభించనూ ప్రారంభించారు. ఈ పనులన్నీ నానా ఇంగ్లీషు వారికి ఏ మాత్రం నుమానం రాని విధంగానే చేస్తున్నాడు. అతను భారత ప్రజలు ఎన్ని రకాల అవస్థలకు గురవుతున్నారో ప్రత్యక్షంగా తెలిసుకోగలిగాడు.
నానా అజిముల్లాఖాన్‌లు సామాన్యుల నుంచి సంస్థానాధీశుల వరకు అన్ని రకాల బ్రిటీష్ పీడిత జనాన్ని సమీకరించే యత్నంలో మునిగిపోయారు. 1857 మే 31న దేశవ్యాప్తంగా ప్రజలంతా తిరగబడాలని నిశ్చయం జరిగింది. పథకాన్ని క్రమశిక్షణగా అమలు పెట్టే రోజులు సమీపిస్తున్నాయి. కాని అకస్మాత్తుగా అనుకోని విధంగా 1857 మే 10న వసంతపోరాట మేఘం గర్జించింది. మీరట్ తిరుగబడింది. ఢిల్లీ సవాలు విసిరింది. అయినా నానా తొణకలేదు. బెణకలేదు. ప్రశాంతంగా వున్నాడు. అయినదేదో అయింది. ఇపుడేం చెయ్యాలనో-చెయ్యాలనే నిశ్చయం. బిటూర్ ప్రశాంతంగా కనిపిస్తున్నది. చుట్టూ రేగుతున్న తుఫానుతో తనకేమి సంబంధం లేనట్టే కనిపిస్తున్నాడు నానా. అంత వరకు గుర్తురాని నానా ఇపుడు బ్రిటీష్ వాళ్లకు గుర్తు వచ్చాడు. కాన్పూర్‌లో విప్లవం చెలరేగుతుందని భయపడిపోతున్నారు తెల్లవాళ్లు. నానా కాన్పూరు వెళ్లి వాళ్ళ మధ్యనే విడిది చేశాడు. ఖజానా రక్షణని నానాకే అప్పగించారు బ్రిటీష్‌వాళ్లు. ఇదంతా తిరుగుబాటుకు ఓ వారం ముందటి పరిస్థితి అని గమనించాలి. రేపు తిరుగుబాటు జరుగుతుంది అనే వరకు నానా వాళ్ల కళ్లను కప్పగలిగాడు. 1857 జూన్ 1న నానా, తమ్ముడు బాబాసాహెబు, అజీముల్లాఖాన్, సుబేదార్ తిక్క సింగ్‌లతో భేటీ అయ్యాడు. అంతిమ కార్యక్రమం రూపొందింది.
కాన్పూరు అర్థరాత్రి నిద్రలో వుండగా మూడుసార్లు బందూకులు గర్జించాయి. ఇంగ్లీషు వాళ్లుండే భవనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. తిరుగుబాటుదార్లు విజయ ఢంకా మోగించారు.
ఇంగ్లీషు వాళ్లపై యుద్ధం ప్రకటిస్తూ నానా, బ్రిటీష్ మ్యాన్‌కు వర్తమానం పంపాడు. ఘోరయుద్ధం నెత్తురు టేర్లు ప్రవహించినయ్. కాన్పూరు విముక్తి పొందింది. కల్లోల పరిస్థితుల్లోనే నానా తన రాజ్యంలోని ప్రజల అవసరాలను అనుక్షణం గమనిస్తూనే వున్నాడు. పట్టుదప్పిన సిపాయిలను కూడా ఒక్క కంట కనిపెడుతూ ప్రజలకు కష్టం కలగకుండా చూస్తున్నాడు. తిరుగుబాటుదార్లు నానాను రాజుగా ప్రకటించారు. సిపాయిలకు నానా అభినందనలు తెలిపాడు. జులై 1న సింహాసనం ఎక్కాడు.
లార్డ్‌కానింగ్ కాన్పూరులో ఇంగ్లీషు సైనికుల ఓటమిని జీర్జించుకోలేకపోయాడు. తన కార్యాలయాన్ని కలకత్తా నుండి అలహాబాదుకు మార్చుకున్నాడు. హేవలక్ నాయకత్వాన ఇంగ్లీషు సేనలు తిరిగి కాన్పూరును వశపరుచుకోవటానికి బయలు దేరాయి. మేజర్ రేనా కూడ తన సైన్యాలతో ఫతేఘర్‌ను చుట్టుముడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నానా వెంటనే కొంత సైన్యాన్ని అక్కడికి తరలించాడు. ఆ సైన్యానికి ఇంగ్లీషు సేనల ముందు నిలవటం కష్టమైంది. తమ్ముడు బాబాసాహెబ్ గుండు దెబ్బతో గాయపడినాడు. కాన్పూరును రక్షించాలంటే తానే కాసెపూసి కదలటం తప్పదన్న నిర్ణయానికి వచ్చాడు. పోరు మొదలైంది. నానా నిలవటం కష్టమనిపించి మళ్లీ బిటూర్‌కి చేరాడు. హేవలక్ పన్నాగాలను భగ్నం చేయాలని తాంత్యా, బాలాసాహెబులతో కలిసి చర్చించాడు. కాల్పీ రక్షణ బాలాసాహెబు తాంత్యాలకు అప్పగించబడింది. నానా లక్నో ఫతేపూర్ ప్రయాణం.
బిటూర్ శత్రుగతమైంది. అయినా నానా దీక్షసడలలేదు. అనేకచోట్ల ప్రత్యక్షమై దాడులు చేస్తూనే వున్నాడు. అలా పోరాడుతు పోరాడుతూ, తిరుగుబాటు సైనికులు నేపాల్ చేరారు. ఎన్నిసార్లు ఓడినా నానా ఇంకా బతికే వున్నానని ఇంగ్లీషు వాళ్లను హెచ్చరిస్తూనే వున్నాడు. అరవై వేల మంది సైనికులతో అలా ఇంగ్లీషు వాళ్లకు నిద్రలేకుండా చేస్తూనే నేపాల్ వెళ్లిన నానాకు అక్కడి రాజు సహాయం చేయలేదు. సహాయం చేయకపోగా, తిరుగుబాటు దారుల్నే వేటాడేందుకు బ్రిటీష్‌వాళ్లకు సాయపడినాడు.
నానా తనను ద్రోహిగా ప్రకటించిన బ్రిటీష్ వాళ్ళకు లేఖ రాస్తూ నన్ను ద్రోహిగా ప్రకటించడానికి నువ్వెవడివి? అసలు ఈ దేశంపై నీ పెత్తనమేమిటి? మా స్వంత దేశంలో మేము దొంగలము? మీరు రాజాధిరాజులా? అంటూ గర్జించాడు. ఆ తర్వాత నానా ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. రకరకాల కథలు ప్రజలు చెప్పుకోవడమే! అంతే.
2.3 ఝాన్సీ లక్ష్మీభాయి:
ఆమె పేరు లక్ష్మీబాయి. ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి అని ప్రసిద్ధమైంది. ఝాన్సీ ఆమె రాజ్యం. తండ్రి మోరోపంత్. తల్లి భాగీరథీ బాయి, మోరోపంత్ పీష్వాల సైన్యంలో సర్దారు. పీష్వా బాజీరావు తన రాజ్యాన్ని ఇంగ్లీషు వాళ్ళకు ఇచ్చేశాక ఆయనతో పాటు మోరోపంత్ కూడా బ్రహ్మావర్తానికి అంటే ఇప్పటి బిటూర్‌కి చేరుకున్నాడు. 1835 నవంబర్ 18న మోరోపంత్, భాగీరథీబాయిలకు మన ‘ఝాన్సీ’ జన్మించింది. లక్ష్మీబాయి చిన్నప్పటి పేరు మనూబాయి. లక్ష్మి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. నానాసాహెబ్ బాజీరావు దత్తపుత్రుడు. నానా, మనూ కలిసే పెరిగారు. తండ్రి బాజీరావు వద్ద వుండేవాడు కాబట్టి తాంత్యా కూడ వీళ్లతోనే వున్నాడు. అలా వాళ్ల ముగ్గురి బాల్యం కలిసే నడిచింది. నానా, తాంత్యాలతో పాటు మనూ కూడా కలిసే చదువుకుంది. యుద్ద విద్య, కత్తిసాము నేర్చుకుంది. నానా, తాంత్యా ఆ అందమైన అమ్మాయిని ‘చమేలి’ (సంపంగి పువ్వు) అని పిలిచేవాళ్లు. చిన్నతనంలో నేర్చిన యుద్ధ విద్య, పెద్దయ్యాక ఆమెకు ఉపయోగపడింది. ఏడవ యేటే ఝాన్సీ రాజు గంగాధరరావుతో ఆమెకు పెళ్ళిచేశారు. బాల్య వివాహమన్నమాట. అత్తవారు పెట్టుకున్న పేరు ‘లక్ష్మీబాయి’.
గంగాధరరావు రాజ్యాభిషక్తుడయ్యాక ఆయన బ్రిటీష్ వాళ్లతో సఖ్యంగానే వున్నాడు. తన రాజ్యంలో కొంత ఆంగ్ల సైన్యాన్ని కూడా అట్టిపెట్టుకున్నాడు. దాని ఖర్చుకు మూడు లక్షల రూపాయల్ను కూడా కేటాయించాడు. 5 వేల శాశ్వత సైన్యం 2 వేల రక్షకభటులు, 3 వందల అశ్వక దళం వుండేవి. మరఫిరంగులు తయారుచేసే కార్ఖానాలు కూడా ఝాన్సీలో వుండేవి. అలాంటి ఈ రాజ్యాన్ని ఎప్పుడు దిగమింగుదామా అని బ్రిటీష్‌వాడు ఎత్తులు వేస్తూనే వున్నాడు.
లక్ష్మీబాయి దంపతులకు బిడ్డ పుట్టినట్టే పుట్టి పోయాడు. చాలా కాలం పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ళు ఆనందరావనే పిల్లవాణ్ణి దత్తత తీసుకున్నారు. ఆ తంతు బుందేల్‌ఖండ్ ప్రభుత్వాధికారి ‘ఏలిస్’, సమక్షంలోనే జరిగింది. ఆనందరావుకు దామోదర్ రావని పేరు పెట్టుకున్నారు. గంగాధరరావు అనారోగ్యంతో బాధపడుతూ ఈ దత్తతను అంగీకరించమని, తన తర్వాత తన భార్య రాజ్యాధిపతి అని ఆ పిల్లవాణికి ఆమె తల్లి అని, ఆమె అధీనంలోనే ఝాన్సీ రాజ్యం వుండవలెనని గంగాధరరావు రాసిన లేఖకు బదులేమీ లేకపోవడంతో ఝాన్సీ కొన్నాళ్లకు మరో లేఖ రాసింది. తన భర్త అంత్యక్రియలు కూడా దత్తపుత్రుడే చేశాడని, ఆ పిల్లవాణి రక్షణ తమ మీదే వున్నదని, డల్హౌసికి తెలిసింది. కాని డల్హౌసి ఝాన్సీ రాజ్యాన్ని కబళించే దృష్టితోనే ఆ మాటల వినలేదు. గంగాధరరావు బ్రిటీష్ విధేయుడే. అయినా కుటిల బుద్ధి కలిగిన డల్హౌసికి అవి గుర్తురాలేదు.
రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు పరచదలిచాడు. ఝాన్సీ బ్రిటీష్ రాజ్యంలో భాగమై పోయింది. లక్ష్మీ దేవాలయం భగ్నమైంది. నిధి నిక్షేపాలు దోచుకున్నారు. గోవధ నిషేధాన్ని ఎత్తివేశారు. జీవిత పర్యంతం నెలనెలా 5 వేల రూపాయలు ఇస్తారని, రాజమహల్ ఆమెకే చెందుతుందని గంగాధరరావు నిజ సంపత్తిని, ఆభరణాలని వాళ్లే వుంచుకోవచ్చని ఆమెపై ఆమె నౌకబార్లపై తమకెలాంటి అధికారాలుండవని డల్హౌసి ప్రకటించాడు. కొడుకు ఉపనయన ఖర్చుకని అడిగినా డబ్బులివ్వలేదు బ్రిటీష్‌వాళ్లు. వకీళ్లను ఇంగ్లాండు పంపినా లాభం లేకపోయింది. ఝాన్సీలో ఝాన్సీ సైన్యంని తొలగించి ఇంగ్లీషు వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని నియమించారు. రాణి కోట విడిచింది. ఆమె దుఃఖానికి అంతే లేకుండా అయిపోయింది. అవమానాన్నీ భరించలేక అల్లాడిపోయింది.
1857 వసంత మేఘం గర్జించింది. ఝాన్సీలో కూడా గురుభక్ష్ అనే అతని నాయకత్వాన సిపాయీలు బ్రిటీష్ అధికార్ల మీద తిరుగబడినారు. తిరుగుబాటుదార్ల ధాటికి బ్రిటీష్ అధికార్లు పారిపోయి కోటలో దాక్కున్నారు. కోట మళ్లీ రాణి వశమైంది. రాణిగా ఆమె ఆ పది మాసాల కాలంలో ఎంతో సమర్థవంతంగా ఝాన్సీని పాలించింది. రాజకీయ వ్యవహారాలను స్వయంగా చూసుకునేది. ఆమె రాజఠీవిని ఎన్నడూ ప్రదర్శించలేదని అంటారు. ఆమె నడుముకు రెండువైపులా రెండు పిస్తోళ్లుండేవి. కైజారు కూడా వుండేవి. ఆమె అప్పుడప్పుడు పైజామా కూడా ధరించేది.
ఝాన్సీపై ఇంగ్లీషు వాళ్లు యుద్ధం ప్రకటించారు. ఝాన్సీని చుట్టుముట్టిన బ్రిటీష్‌వాళ్లకు నిలవనీడ కూడా కరువైంది. తిండి తీర్థాలు లభించకుండా అయ్యాయి. రాణి యుద్ధతంత్రం రాజకీయ చతురత దాని వెనుకనున్నవి. అయితే వెలుగు సరసనే చీకట్లున్నట్లు దేశద్రోహులు కూడా వుంటారు. సింధియా, బెహ్రీలు ఇంగ్లీషు సైన్యాలకు సహాయపడినారు.
“పుట్టడం గిట్టడం కోసమే బ్రిటీష్ పతాకాన్ని ఈ గడ్డపైన ఎగరనీయకండి. విజయం మనదే” అంటూ రాణి గర్జించింది.
రోజుల తరబడి యుద్ధం. ఒకచోటు నుండి మరోచోటుకు తరలిపోయింది. ఇంగ్లీషు వాళ్ళని ముప్పతిప్పలు పెట్టింది. ఝాన్సీ బ్రిటీష్ హస్తగతమైంది. అయినా రాణి హృదయం క్రోధంతో, దుఃఖంతో వూగిపోయింది. బిడ్డను వీపున కట్టుకొని తన నల్లని అశ్వంపై బయల్దేరింది. బ్రిటీష్ సేనల్ని చీల్చుకుంటూనే ఛాండియర్ గ్రామంలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని, కాల్పీ మార్గాన సాగిపోయింది. బౌకర్‌తో ముఖాముఖి పోరు. ఆమెతో వున్న కొద్ది సైన్యం, బౌకర్ సైన్యంతో యుద్ధానికి దిగింది. రాణి తప్పించుకొని అర్ధరాత్రికి కాల్పి చేరింది. గుర్రం కుప్పకూలింది. కాల్పీలో రావు సాహెబ్ పీష్వాను కలిసింది. చివరి నెత్తుటి బొట్టు వున్నంతవరకు బ్రిటీష్‌వాళ్లపై యుద్ధమేనని నిశ్చయం మరింత బలపడింది. హ్యూరోజ్ కాల్పీని చుట్టుముట్టాడు. కాల్పీ ఇంగ్లీషు వాళ్ల వశమైంది. తాంత్యా కలిశాడు. మళ్లీ గ్వాలియర్ వశమైంది. నానా ప్రతినిధి రావు సాహెబ్‌కు సింహాసనం లభించింది. హ్యూరోజ్ మళ్లీ వేటకుక్కలా వెంటపడ్డాడు. సైన్యంతో గ్వాలియర్‌ను చుట్టుముట్టాడు. యుద్ధం మొదలైంది. కొద్దిమంది అశ్వికదళంతోనే ఆమె బ్రిటీష్ సైన్యంపై విరుచుకుపడింది.
ఆమె స్నేహితులు, అంగరక్షకురాలు ముస్లిం వనితలు అయిన ముందర్, కాశీలు వీరోచితంగా శత్రువుతో తలపడ్డారు. ఆ సైన్యానికి నాయకత్వం వహించిన స్మిత్ తాత్కాలికంగానైనా వెనుకంజ వేయక తప్పింది కాదు. మళ్లీ కోటపై ఇంగ్లీషు వాళ్ల దాడి ప్రారంభమైంది. ఈసారి స్మిత్‌తో రోజ్ కూడా కలిశాడు. ముందర్ నేలకూలింది. ముందర్‌ను నేలకూల్చిన వాని శిరస్సును కూడా నేలకూల్చింది రాణి. నలువైపులా ఇంగ్లీషు సైనికులు పద్మవ్యూహంలో వీరాభిమన్యునిలా రాణి. శత్రువుల దెబ్బల తాకిడికి, ఆమె పూచిన మోదుగ వృక్షంలా వూగిపోయింది. గాయపడిన రాణిని ఆమె సేవకుడొకడు కుటీరంలోకి తీసుకుపోయాడు. ఝాన్సీరాణి అస్తమించింది.
2.4. తాంతియా తోపే:
ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటంలో తాంతియా తోపేది విశిష్టస్థానం. ఆయన వీరగెరిల్లా. గెరిల్లా యుద్ధపద్ధతుల్ని అనుసరించి ఎంతోమంది పేరు పొందిన ఇంగ్లీషు సేనానుల్ని మట్టి గరపించిన మహాయోధుడు.
తాంతియా మహారాష్ట్ర దేశవాసి. పాండురంగ భట్టు సుపుత్రుడు. తండ్రి, పీష్వా బాజీరావు దగ్గర ధర్మకార్య శాఖాధికారి. నానా, ఝాన్సీల నేస్తం. నానాసాహెబ్ సర్వసైన్యాధిపతి. మరాఠా వీరుల యుద్ధతంత్రాలను ఆపోశన పట్టినవాడు తాంతియా. తాంతియా ఒక ‘మిలటరీ శాస్త్ర మేధావి’. గ్వాలియర్ యుద్ధంలో వీర ఝాన్సీ నేలకొరిగి తిరుగుబాటు తిరోగమన థలో పడినపుడు తాంతియా కొడిగడుతున్న పోరాటజ్వాలను ఎగసన దోసినవాడు.
దెబ్బతిన్న పోరాటయోధులను కూడగట్టడంలో మళ్ళీ జీవం పోయడంలో, ఉత్సాహం నింపడంలో, తాంతియా అగ్రగామి. తాంతియా పేరు విప్లవోత్సహాన్ని రేకెత్తించేంత ప్రభావశీలమైనది అంటే ఆశ్చర్యమేమీ లేదు. నిరంతరం పోరాటం. గెలుపు ఓటముల్ని పట్టించుకోని పోరాటం తాంత్యాది. తాంత్యే, నానాలు జూన్ 20న గ్వాలియర్ పోరాటం నుంచి తప్పించుకుపోయారు. ఆలిపూర్ నుంచీ అలానే తప్పించుకొని పోయారు. బాహాబాహీ పోరాటం వ్యర్థ త్యాగాలకే కాని మరెందుకు పనికిరాదని ఆచరణలో తెలుసుకున్నాడు. వువర్‌సింగ్ కోవలోని వాడే తాంతియా. తన యుద్ధ కార్యక్రమాన్నంతో మూడు సూత్రాల మీద నడపాలని నిశ్చయించాడు.
ఒకటి ఇంగ్లీష్ సైన్యం చుట్టివేతలో ఇరుక్కొని పోకుండా చూసుకోవాలి. రక్షణలేని చోట్ల గెరిల్లా దాడులు సాగించాలి. దానికోసం తగినంత ఆహారం-తగినంత ఆయుధ సంపత్తి కావాలి. ప్రజలు కరువు కాటకాలతో బాధపడుతున్నారు కాబట్టి సంస్థానాల నుండి వాటిని సంపాదించాలనుకున్నాడు. ఉత్తర-మధ్య భారతదేశాల్లోని స్వార్థపరులైన సంస్థానాలను అందుకు ఎన్నుకున్నాడు. మనస్ఫూర్తిగా ఇస్తే సరి, లేకుంటే బలప్రయోగం చేసి సాధించాలనుకున్నాడు తాంత్యే.
‘అన్నివైపులా చుట్టు ముట్టి వున్న ఇంగ్లీషు సైన్యంతో కొత్త కొత్త పద్ధతుల్లో యుద్ధం చేస్తూ సరైన సమయంలో నర్మదను దాటి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్ళి బలపడటం’ ఆయన ఆశయమయ్యింది. తాంత్యాను నర్మద దరిదాపులకు రానీయకుండా చూడటమే ఇంగ్లీషు వారి ప్రధాన ఆశయం. రెండు పక్షాలు దృడదీక్షగానే వున్నాయి.
ప్రతి సంస్థానంలోనూ తాంతియాను అభిమానించే వాళ్లున్నారు. కాని బహిరంగంగా బ్రిటీష్ తొత్తులైన వాళ్ల ప్రభువుల్ని ధిక్కరించే వాతావరణం లేదు. తెగువ లేకున్నా వాళ్లంతా తాంతియాతో నిరంతర సంబంధం కొనసాగిస్తూనే వున్నారు. ఇంగ్లీషు వాళ్ల పద్మవ్యూహం దాన్ని ఛేదించుకొని సంస్థానాలపై దాడి చేయాలి. ఊహకందని సాహస కార్యక్రమం.
మొదట భరత్‌పూర్‌ని ఎన్నుకున్నాడు తాంత్యా. ఇంగ్లీషు సైన్యం అడ్డుపడగా జైపూర్ మార్గం పట్టాడు. ఈ ప్రాంతం తాంతియాకు అనుకూలమైన ప్రాంతం. ఇంగ్లీషు సైన్యం జైపూర్‌కు వచ్చింది. ప్లాను విఫలమైంది. దక్షిణదిశగా ప్రయాణాన్ని మార్చాడు. మరోవైపు నుంచి కర్నల్‌హోమ్స్ తరమడం ప్రారంభించింది. వాళ్ల కళ్ళల్లో కారంకొట్టే తాంతియా టోంకు సంస్థానంపై దాడి చేశాడు. నవాబు కొంతమంది సైనికులను ఓ నాలుగు ఫిరంగులిచ్చి తాంత్యపై యుద్ధానికి పంపాడు. వచ్చినవాళ్లు తాంతియాతో కలిసిపోయారు.
తగిన ఆహార పదార్థాలను ఆయుధ సామాగ్రిని సైన్యాన్ని సమకూర్చుకొని తాంతియా దక్షిణాన ఇంద్రగఢం వరకూ సాగిపోయాడు. భోరున వర్షం. చంబల్‌నది వురకలు వేస్తూ వుంది. హోమ్స్, రాబర్టు చక్రవ్యూహం. ప్రమాదం గుర్తించి తాంతియా నీముచ్-నసీరాబాద్ దిక్కుగా మళ్లాడు. ఈశాన్య దిక్కుగా వెళ్లి బుందీ మీదుగా భిల్వాడా చేరి విశ్రాంతి తీసుకున్నాడు. కోరినది నెరవేరే సమయం వచ్చింది. కాని సర్‌వర్‌గాం నుంచి రాబర్ట్సు దాడి. పగలంతా యుద్ధం. రాత్రి తాంతియా ఉదయపూర్‌లోని కోఠ్రాకు సురక్షితంగా చేరగలిగాడు. దేవళంలో పూజాదికాలు నిర్వహించుకుని వుండగా ఇంగ్లీషు సైన్యాలు దరిదాపుల్లో యుద్ధం తప్పలేదు. ఓటమి మిగిలింది. సామాగ్రి శత్రు వశమయిపోయింది.
ఉట్టి చేతుల్లో ఇంగ్లీషు సైనికుల చక్రబంధం నుంచి తప్పించుకొని విడివిడిగా చంబల్ నదిని దాటి శత్రువును విస్మితం చేశారు. దగ్గర ఫిరంగిలేదు. సైనికులతోనే ఠూలేర పట్టణం మీద తాంత్యా విరుచుకుపడినాడు. ఝాలేర సైనికులు తాంతియాతో కలిసి పోయారు. 32 ఫిరంగులూ సైన్యం కావాల్సినంత ఆహారం తాంతియాకు లభించాయి. తాంతియా ఝాలేర ప్రభువుకు 25 లక్షల అపరాధం విధించాడు. క్షమాభిక్ష అర్థించిన ప్రభువు తాంతియా సంతోషంతో సైన్యానికి బహుమతులిచ్చాడు.
మళ్లీ నానా, బరోడా నవాబులతో కలిసి ఆలోచనలు. నర్మదను దాటి దక్కను పీఠభూమిలో ప్రవేశించాలని ప్లాను. నర్మదను దాటనీయకుండా బ్రిటీష్ సైన్యాలు. ఇందూర్ సైన్యం ఇందూరు ప్రభువు హోల్కారుపై దాడికి రమ్మని, తాము తాంతియాతో కలిసేందుకు సిద్ధమని వర్తమానం పంపింది. ఈసారి తాంతియాను రాబర్ట్సు, హోమ్స్, పార్క్, మిచ్చెల్, హోప్, లాఖార్టు సైన్యాలతో అన్నివైపులా చుట్టుముట్టి అదనుకోసం చూస్తున్నారు. దక్షిణం దిక్కుగా వెళుతున్నట్టు భ్రమింపజేసి కూల్వాలోనికి పోయి రాయఘడ్‌లో మళ్లీ ప్రత్యక్షమైనాడు తాంతియా. ఇంగ్లీషు సైన్యాధిపతులు దిగ్భ్రమ చెందారు.
అలసి విశ్రాంతి తీసుకుంటున్న మిచ్చెల్ కళ్లు గప్పి తాంతియా తన సైన్యంతో తరలిపోయాడు. తాంతియా అలసివున్న తరుణంలో ఇంగ్లీషు సైన్యంమీద పడింది. ఆ ధాటికి తాంతియా సైన్యం నిలపలేకపోయింది. కువర్‌సింగ్ ప్రత్యక్షయుద్ధాన్ని వాయిదావేస్తూ అనుకున్నది సాధించినట్టు చేయడం తాంత్యాకు అప్పుడు అసాధ్యమైంది. ఈ ప్రమాదాన్నించి బయటపడివుంటే ఇందూరుపై దాడి చేసి అన్నింటినీ సాధించుకోగలిగి వుండేవాడు కాని అలావీలు కాలేదు.
తాంత్యా అన్నింటినీ పోగొట్టుకొని అడవుల గుండా బేల్వా నదిని దాటి, శిరంజీ అనే వూరును చేరాడు. నాలుగు ఫిరంగులు దొరికాయి. వర్షాల వల్ల ఇంగ్లీషు సైన్యాలకు కదలలేని స్థితి. దాన్ని చూసి తానూ విశ్రాంతి తీసుకున్నాడు తాంతియా. ఆ తర్వాత ఉత్తరం వైపు సింధియాలోని ఇజాగఢ్‌పై దాడి జరిపి మరో 8 ఫిరంగులు సంపాదించాడు.
తాంత్యా రావు సాహెబ్‌ల నాయకత్వం కింద సైన్యాన్ని రెండుగా విభజించారు. వేర్వేరుగా అనుకూల ప్రాంతాలపై దాడి. తర్వాత మళ్లీ కలుసుకోవడం. విడిపోవడం ఇలా నూతన యుద్ధాన్ని మొదలు పెట్టారు.
ఇంగ్లీషు వారూ కొత్త ఎత్తుగడలు ప్రారంభించారు. నాలుగువైపులా చంబల్ నుంచి చక్రవ్యూహం పన్నారు. ఆ వ్యూహాన్ని ఛేదించుకుని తాంతియా రావు సాహెబులు కజూరి చేరగలిగారు. అక్కడా ఇంగ్లీషు సైన్యం తటస్తపడింది. మళ్లీ అడవుల్లోకి తప్పించుకొని ఉత్తరదిశకు మారి తల్బహాట్‌కు పోయారు. ఇంగ్లీషు వాళ్లు ఇక వీళ్లు నర్మదను దాటలేరని అనుకున్నారు. దక్షిణం వైపు వెళ్లే ప్రయత్నం మానుకున్నారని ఇంగ్లీషు వాళ్లు భ్రమల్లో వుండగనే తాంతియా రావు సాహెబ్స్ బేట్వా నదిని దాటి కజూరి వద్ద బ్రిటీష్ వారిపై దాడికి దిగారు. దాడిచేసి మళ్లీ రాయగఢ్‌పైబడి మెరుపుదాడుల పరంపరతో బ్రిటీష్‌వారిని తికమకపెట్టాడు. బ్రిటీష్‌వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు వుండగానే హోషంగాబాద్ వద్ద సైన్యంతో సహా నర్మదను దాటి అందర్నీ అద్భుతాశ్చర్యాల్లో ముంచివేశాడు తాంతియా. ఈ అద్భుతాశ్చర్య సన్నివేశం తాంతియాకు సత్ఫలితం ఇవ్వలేకపోయింది. కొండంత ఆశతో నర్మదను దాటి నాగపూర్ వస్తే భయభీతులైన అక్కడి ప్రజలు అతన్ని ఆహ్వానించలేకపోయారు. అలా సాహసయాత్ర నిష్పలమైంది.
ఇంగ్లీషు సైన్యాలు తాంతియాను తరమడం ప్రారంభించాయి. బీభత్సం మధ్యంలో వున్న దక్షిణదేశం తాంతియాకు అనుకూలం కాదనిపించింది. మళ్లీ నర్మదను దాటి ఉత్తర భారతం పోవాలనుకున్నాడు. ఇంగ్లీషు చక్రబంధాన్ని చీల్చుకుంటూ రైళ్లను దోచుకుంటూ, టెలిగ్రాఫు సౌకర్యాలను ధ్వంసం చేస్తూ ఇంగ్లీషు వాళ్లను చీకాకు పరచటం మొదలెట్టాడు తాంతియా. దక్షిణ దేశంలోనైతేనే తాంతియాను బంధించటం సులువని ఇంగ్లీషు వాళ్లనుకున్నారు. అందువల్ల నర్మద వద్ద బందోబస్తు ముమ్మరం చేశారు. సండర్లాండుతో యుద్దం చేసి, ఫిరంగుల్ని వదిలివేసి నర్మదను దాటి తాంతియా మరోసారి దేశాన్ని అద్భుతాశ్చర్యాల్లో ముంచేసినాడు.
శత్రువు కళ్లు గప్పి తాంతియా నదినైతే దాటగలిగాడు. ఖాళీ చేతులు, బరోడాలో తనకు మద్దతునిచ్చే వాళ్ళు బాగానే వున్నందున తాంతియా బరోడా మీద దాడికి వుపక్రమించాడు. అందుకోసం రాజపురాపై పడి అశ్వాలను ధనాన్ని దోచుకున్నాడు. బరోడాకు 50 మైళ్ళ దూరంలో వున్న చోటా ఉదయ్‌పూర్ చేరాడు. ఇంగ్లీషు సైన్యాల దాడుల మధ్యనే ఇదంతా, పార్క్ సైన్యం దరిదాపుల్లోకి రావటంతో బరోడాపై సైన్యాల దాడుల మధ్యనే ఇదంతా. పార్క్ సైన్యం దరిదాపుల్లోకి రావటంతో బరోడాపై దాడిని విరమించుకుని వాస్వారా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. వెంట వున్న బందా నవాబు బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోయాడు. తాంతియా రావు సాహెబ్‌ల దృఢనిశ్చయం రవంత కూడా సడలలేదు. ఒక అడవి ఖిల్లాదారు సాయంతో కొంత సామాగ్రిని సంపాదించుకొని ఉదయపురంవైపు పయనమయ్యాడు తాంతియా. దిగ్బంధం నుంచి తప్పించుకొని ప్రతాప్‌గఢ్‌కి వెళుతూ ఉంటే రాఖీ సైన్యాలు చుట్టుముట్టాయి. ఆ చుట్టివేత నుంచీ తాంతియా తప్పించుకున్నాడు. ఢిల్లీ రాజ కుటుంబీకుడు మిర్జా ఫిరోజ్ షా కూడా వచ్చి తాంతియాతో కలిసిపోయాడు. సింధ్యా సర్దారు, మాన్‌సింగ్ కూడా ఆయనతో కలిశాడు. 1859 జనవరి 13న ఇంద్రగఢ సమావేశాన్ని శత్రువులు భగ్నం చేశారు. నేపియర్, సోమర్సెట్, షోయర్సు, స్మిత్, మిచ్చెల్, బెన్‌సన్‌లు పన్నిన అడకత్తెర వ్యూహాన్ని కూడా అవలీలగా చేధించగలిగాడు. తాంతియా. అలా తప్పించుకొని దివాసా చేరుకున్నారు. ఇంగ్లీషు సైన్యాలు ఏకంగా తాంత్యాగుడారం పైనే దాడిచేశారు. తాంత్యా నేర్పుగా తప్పుకొన్నాడు. అల్వార్ ప్రాంతంలో షికార్ గ్రామం దగ్గర మరల రావు సాహెబ్ తాంతియా ఫిరోజ్‌లుషాలు కలుసుకున్నారు. హోమ్సు అక్కడ వాళ్లను పెద్ద దెబ్బేకొట్టాడు. కోలుకోలేని దెబ్బే కొట్డాడు. నాయకత్వం విడిపోయి తలో దిక్కున తప్పుకున్నారు. అంత ప్రమాదకరమైన దాడిలోనూ మనసు నిబ్బరాన్ని కాపాడుకున్నాడు తాంతియా.
ఫిరోజ్‌షా సురక్షిత ప్రాంతం ఒకటుందని రమ్మని తాంత్యాకు వర్తమానం పంపాడు. తాంతియా ఫిరోజ్‌షా దగ్గరకు పోకుండా మాన్‌సింగ్ దగ్గరకు వెళ్లాడు. మాన్‌సింగ్ అది వరకే బ్రిటీష్‌వాళ్ళకు కోవర్టుగా మారి వున్నాడు. ఆ ద్రోహి గతంలో బ్రిటీష్‌వాళ్ళు జాగీరు ఇప్పిస్తామని ఆశ జూపితే తన పినతండ్రిని బ్రిటీష్‌వాళ్లకు అప్పజెప్పివున్నాడు. మాన్‌సింగ్ బ్రిటీష్‌వాళ్ళకు లొంగిపోవచ్చు కాని మిత్రద్రోహం చేయడనుకున్నాడు తాంతియా. కాని మాన్‌సింగ్ తాంతియాను బ్రిటీష్‌వాళ్లకు పట్టిచ్చాడు. శత్రువుల వ్యూహాలను ఎత్తుగడలను చిత్తుచేసిన తాంతియా చివరికి మిత్రద్రోహం కారణంగా శత్రువుల చేత చిక్కాడు. నిర్భయంగా ఉరితాడును మెడకు బిగించుకొని ప్రాణార్పణ చేశాడు తాంతియా.
1857 ఏప్రిల్‌లో మంగళపాండే అమరత్వంతో ప్రారంభమైన ప్రథమ భారత స్వాతంత్య్రపోరాటం 1859 ఏప్రిల్ 18న తాంత్యాతోపే బలిదానంతో ముగిసింది. రెండేళ్లు సాగిన బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేక ప్రథమ భారత స్వాతంత్య్రం ఓడిపోయింది. దాని గొప్పదనం మడమతిప్పని పోరాటంలో వుంది. ఆనాటి ప్రజల, వీరుల పోరాటం ఇంకా నిజమైన స్వతంత్య్రాన్ని పొందని భారతావనని కదిలించేది. మునుముందుకు నడిపించేంది భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గాన నడుస్తున్న శ్రేణులన్నీ గాఢాలింగనం చేసుకోవలసిన పోరాటం 1857 పోరాటం.
2.5. బహదూర్‌షా:
పరాయి పాలనను దేశంలో అంతమొందించాలని తుదిశ్వాస వరకూ పోరాడిన వీరయోధుడు బహదూర్ ఖాన్. ఖాన్ బహదూర్ ఖాన్ రోహిల్ ఖండ్ నేత. స్వతంత్ర పాలన అనే లక్ష్యంతో బ్రిటీష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ఖాన్ బహదూర్ ఖాన్ వయస్సు 70 ఏళ్ళు. కువర్‌సింగ్ లానే వయసుతో నిమిత్తంలేని పోరాట పటిమ ఖాన్‌ది.
రోహిల్‌ఖండ్‌లోని ప్రజానీకమంతా తన వెంట ఉండగా రాజధాని బరేలిలో తిరుగుబాటు బావుటాను ఎగరేసి 1857 మే 31న స్వతంత్ర పాలనకు నాంది పలికాడు ఖాన్. ప్రజలను ఉద్దేశిస్తూ అప్పుడు ఆయన చేసిన ప్రసంగం విశిష్టమైనది. “భారతదేశ ప్రజలారా” అని రాచరిక వ్యవస్థకు ప్రతినిధియైన ఖాన్ నోట రావటం గమనించాల్సిన అంశం. “పవిత్ర ఖురాన్‌ను గౌరవించేట్టయితే ఓ ముస్లిములారా! గోమాతను ఆరాధించేట్టయితే ఓ హిందువులారా! మీలోని స్వల్ప భేదాలను విస్మరించి ఈ ధర్మయుద్ధంలో చేతులు కలపండి. ఒక జండా కిందికి రండి మన హిందుస్థాన్‌ను రక్షించుకుందాం. ఆంగ్లేయుల అధికారపు నెత్తుటి మరకలను మీమీ శుభ్ర రుధిరంతో శుభ్రం చేయండి” అని ఉత్తేజకరమైన రీతిలో ప్రసంగించాడు ఖాన్.
స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రతీక అయిన ఆకుపచ్చజండా రోహిల్ ఖండ్ ఆకాశంలో రెపరెపలాడటం బ్రిటిష్ వాడి గుండెల్లో మాటలు రేపింది. బ్రిటిష్ సైనిక స్థావరాలలోని సైనికులు తిరుగబడినారు. ఆంగ్లేయ అధికారులు పలాయనం చిత్తగించారు. రోహిల్‌ఖండ్ నేతగా ఖాన్ శోభారాంని ప్రధాన మంత్రిగా, భక్తఖాన్‌ను సైన్యాధ్యకక్షునిగా నియమించాడు. ఈ ముగ్గురు రోహిల్‌ఖండ్ ప్రజల హృదయాలను చూరగొన్నారు. బ్రిటిష్ వాళ్లని రోహిల్‌ఖండ్ నుంచి తరిమేసినందుకు బహదూర్‌ఖాన్‌ను, ‘సర్దార్ ఉల్ సదరత్’ (నాయకుల నాయకుడు) గా గౌరవించారు.
బహదూర్ ఖాన్ హిందూ ముస్లిం ఐక్యత కోసం కృషి చేశాడు. ముస్లిం సోదరులు గోవులను ఖుర్బాని ఇవ్వటాన్ని నిషేధించాడు. ఆంగ్లేయాధికారి జేమ్స్ ఔట్రాం డబ్బుతో ఎర చూపి హిందువులని, ముస్లింలపై రెచ్చగొట్టడానికి యత్నం చేశాడు. ప్రజలా సొమ్ముపై ఉమ్మివేసి ఐక్యతకు ప్రాణం పోశారు. ఖాన్ ప్రభావం అలాంటిది. బ్రిటిష్ వారికంటే తమ బలగాలు తక్కువ కావటాన్ని గ్రహించిన ఖాన్ గెరిల్లా పోరాటాన్నే అనుసరించాడు. ఈ విషయాన్ని ఆంగ్లేయులే చెప్పారు.
‘‘మన కంటే అన్ని విధాల వాళ్ళు పై చేయిగా ఉన్నారు. కాబట్టి శత్రువు కదలికల్ని కనిపెట్టండి. నదుల ప్రాంతాల్లోని పర్వత ప్రాంతాలకు ఆహార సరఫరాను అందకుండా చేయండి. శత్రువును నిద్రపోనీయకండి’’. ఇవన్నీ గెరిల్లా ఎత్తుగడలకి సంబంధించిన అంశాలే.
చక్రవర్తి జఫర్ లొంగిపోయినా, బహదూర్ ఖాన్ ఆయన ప్రతినిధిగా పాలన కొనసాగించాడు.
బ్రిటిష్ ఉన్నతాధికారి క్యాంప్‌బెల్, వాల్ పోల్ నాయకత్వంలో ఆ సైన్యాన్ని బరేలీపై దాడికి పంపాడు. రోహిల్లా ప్రజలు, సైనికులు ఆ దాడిని సునాయాసంగా తిప్పికొట్టారు. క్రోధావేశాలతో క్యాంప్ బెల్ స్వయంగా అపార సైనిక బలగాలతో బరేలిని ముట్టడించాడు. నేపాల్ సరిహద్దుల వరకు తిరుగుబాటు దారుల్ని తరమగలిగారు. అట్టి సమయంలో తప్పించుకుంటే మరో యుద్ధానికి తయారు కావచ్చునని శోభారాం చెప్పాడు. ఖాన్‌కి నచ్చలేదు. చివరికి అనుచరుల ఒత్తిడి వల్ల కొద్ది సైన్యంతో నేపాల్ అడవుల్లోకి నిష్క్రమించాడు బహదూర్. నేపాల్ రాజు బ్రిటీష్ భక్తుడవటం మూలాన బహదూర్‌కు రక్షణ లభించలేదు. మలేరియా కూడా వారిపై పగబట్టింది. ఎంతోమంది చనిపోయారు. రోహిల్లాల నేతను బ్రిటీష్ వాళ్లకు పట్టించాడు నేపాల్ రాజు.
బ్రిటీష్ వాళ్లు విచారణ ప్రారంభించారు. ఖాన్‌కు ఆయన అనుచరులకు ఉరిశిక్షలు విధించారు. బ్రిటిష్ కమీషనర్ కార్యాలయం ఆవరణలో ఉన్న పెద్ద మర్రిచెట్టుకు వాళ్లను ఉరివేశారు. చాలా నాళ్ల వరకు మృతదేహాలు అలానే వేళ్లాడాయి.
అలా భిన్న మతాల ప్రజల్ని ఐక్యం చేసి పరాయి పాలకులపై ధ్వజమెత్తిన ఓ వృద్ధ వీరయోధుడు భవిష్యత్తుపై కలలు కంటూ ఉరికంబమెక్కాడు. “వీరులారా! వందనం” అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.
(సశేషం)