Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-9

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 3 – మూడవ భాగం

3.1.21 ధూళిపాళ శ్రీరామమూర్తి

వీరు తమ సిద్ధాంత గ్రంథంలో భాగవతములోని ప్రధానరసము భక్తిరసమేనని చెప్పారు. “భాగవతమునందు భక్తిరసము ప్రధానమైనను, దానితోఁ బాటు తక్కిన రసములును జక్కగాఁ బోషింపఁబడినవి” అన్నారు.

భాగవతములో మొదటినుండి తుదివరకు భక్తిరసము అత్యుత్కటముగా వ్యక్తమగుతుందని చెప్తూ “ఏ భావోద్రేకము చేతనైనను బరమేశ్వరభావమునందు మునిగిపోవుట భక్తిరసమని తేలుచున్నది” అంటారు.

భక్తిరసపోషణ విషయమున పోతన దశమస్కంధంలో శ్రీకృష్ణ దేవుని రూపచిత్రణను ప్రధాన స్తంభముగా జేసినాడనీ, మిగిలిన కథలలో కూడా ఆయా కథలలోని పాత్రల యొక్క యార్తిని పాఠకులు కూడా అన్వయించుకోగలిగేట్లుగా పద్యములు వ్రాసి భక్తిరసప్రతీతి కలిగించాడనీ చెప్తారు.

గజేంద్ర మోక్షణము, దశమస్కంధంలోని గోపికా విరహము వంటి ఘట్టాలను ఉదాహరణలుగా తీసుకుని భక్తిరస పోషణను వివరించారు. “భక్తిరసమున కంగములుగా నవరసములు భాగవతమునందుఁ బ్రతీయమానములగుచున్నవి” అంటూ నృసింహావిర్భావము, దావాగ్ని గ్రసనము, కాళియమర్దనము వంటి ఘట్టాలలో ప్రతీయమానములగుచున్న అద్భుతము, భయానకము, వీరము మొదలైన రసములు భక్తియందు పర్యవసిస్తున్నాయని తెలియచేశారు.

సిద్ధాంతగ్రంథంలోనే కాక “పోతన భాగవత నీరాజనం” అనే సంపుటి కోసం ఆయన రచించిన వ్యాసంలో కూడా భక్తి రసమంటే ఏమిటో అది ఎలా నిర్వహించబడుతుందో ఎలా రంజింప చేస్తుందో వివరంగా చెప్పారు.

“పోతనగారి నిర్మాణ మార్మికతను రసనిర్భర రచనను వ్యాకరించుటకు నొక్క నల్లని వాడన్న పద్యము చాలును” అని చెప్పి ఆపైన మధుసూదన సరస్వతి సిద్ధాంతాన్ననుసరించి భక్తిరసం అంటే ఏమిటో ఈక్రింది విధంగా వివరించారు.

“భక్తిరస ప్రతీతియందు రూపచిత్రణము మర్మము. భక్తిరసమునకు స్థాయిభావము భగవానుడు. విభావమును భగవానుడే. చిత్తవృత్తియందు ముద్రితమైయున్న పరమేశ్వరమూర్తి స్థాయిభావము. బయటనున్న తత్కాలదేశ విశిష్టమైన పరమేశ్వరమూర్తి యాలంబనము. బయటనున్న మూర్తినావలంబించి లోపలనున్న మూర్తి చర్వణాగోచరుడగుట భక్తిరసము.”

తమ సిద్ధాంత గ్రంథంలో మధుసూదన సరస్వతి ప్రతిపాదించిన భక్తి రస సిద్ధాంతాన్ని, దానిపై వచ్చిన ప్రశ్నలకు మధుసూదన సరస్వతి ఇచ్చిన సమాధానాలను చాలా స్పష్టంగా వివరించిన శ్రీరామమూర్తి గారు సిద్ధాంత గ్రంథాన్ని ముగిస్తూ వ్రాసిన చివరి రెండు వాక్యాలు మాత్రం కొంత అస్పష్టతకు తావిస్తున్నాయని అనిపించింది.

“భక్తిరసమునందు ఆత్మతత్త్వమీశ్వర స్వరూపముగను, శాంతమునందు స్వస్వరూపముగను బ్రతీయమానమగుట తప్ప మఱియొక భేదమీ రెంటికిని లేదు. ఈ భేదమును బురస్కరించుకుని యిది పదవ రసముగా మధుసూదనుడు చెప్పినాడు” అన్నారు.

నిజమే, శాంతమునకు, భక్తికీ ఉన్న భేదం ఇదే కావచ్చు. అయితే ఇది వేదాంతుల వైపు నుంచి చెప్పే భేదం. ఆలంకారికుల పరిభాషకు ఇది సరిపోదు.

ఎందుకంటే ఆలంకారికులు శాంత రసాన్ని నిర్వచించేటపుడు “ఆత్మతత్త్వము స్వస్వరూపముగా బ్రతీయమానమయ్యే రసము” అని నిర్వచించరు. స్థాయి సంచారి భావాలను ఆధారం చేసుకుని, వాటిలోని భేదాలను ఆధారం చేసుకుని నిర్వచిస్తారు. అష్ట రసములకంటె శాంతము ఎందుకు భిన్నమో దానిని ప్రత్యేక రసముగా ఎందుకు పరిగణించాలో విభావానుభావ సంచారిభావాల విభిన్నతను ఆధారం చేసుకుని చెప్తారు. భక్తిరసము విషయములో కూడా ఆ పనిని మధుసూదన సరస్వతి చేశారు. ఆలంకారికుల పరిభాషలోనే భక్తిరసాన్ని స్పష్టంగా వివరించారు. శ్రీరామమూర్తిగారున్నూ ఆ వివరణ నంతటినీ స్పష్టంగా తన సిద్ధాంత వ్యాసంలో చెప్పారు. అదంతా అయ్యాక మళ్ళీ చివరికి ఈ వాక్యంతో గ్రంథాన్ని ముగించడం వలన శాంతానికీ భక్తికీ వేదాంత పరంగానే తప్ప అలంకార శాస్త్ర పరంగా భేదం లేదేమోనన్న భావం కలుగుతుంది. అటువంటపుడు భక్తిని పదవ రసంగా పేర్కొనవలసిన అవసరం ఏముందన్న ప్రశ్నకి అవకాశం ఏర్పడుతుంది.

అంతేకాదు, ఈ వాక్యాలకు ముందుగా వ్రాసిన వివరణను కూడా శ్రీరామమూర్తిగారు “శాంతరసమని యాలంకారికులన్న దానినే భక్తులు భక్తిరసమని పిలుతురనవలెను కాని..” అంటూ ఆరంభించారు. దీనిని ఆధారం చేసుకుని చాలామంది పరిశోధకులూ విమర్శకులూ ఈ వాక్యానికి ముందు వెనుకలలో ఉన్న విషయాలను పరిగణించకుండా ఈ వాక్య భాగాన్ని మాత్రమే ఉదాహరిస్తూ ‘ఆలంకారికులు దేనిని శాంతము అంటారో దానినే భక్తులు భక్తి అంటారు, ఆ రెండిటికీ భేదం లేదు. భక్తి ప్రత్యేక రసము కాదు’ అని చెప్పడం కనిపిస్తూ ఉంటుంది. తుమ్మపూడి కోటీశ్వరరావు గారు “భక్తిరసవాదం” అనే తమ వ్యాసంలో శ్రీరామ్మూర్తి గారి ఈ వాక్యాన్ని ఉదాహరించి అయితే ప్రత్యేకంగా చెప్పడం దేనికి? అని ప్రశ్నించి “మతవాదులు చేసిన గందరగోళమనాలి” అన్న సమాధానం చెప్తారు. కానీ ఈ ఆరోపణ అసంబద్ధం. ఎందుకంటే భక్తిరసమును ప్రతిపాదించినవారు కూడా ఆలంకారికులే. మధుసూదన సరస్వతి ఒక భక్తుడిగానో మతవాదిగానో కాక ఒక ఆలంకారికుడిగానే భక్తిరసాన్ని ప్రతిపాదించారు. అలంకార శాస్త్రానుసారమే, ఆ పరిభాషలోనే దానిని వారు నిర్వచించారు. శాంతము కంటే అది ఎలా భిన్నమో చెప్పారు.

శ్రీరామమూర్తిగారు మరొక మాట కూడా అన్నారు. భక్తిని రసముగా పరిగణించడం గురించి జగన్నాథుని అభ్యంతరాన్ని వివరించాక “భక్తిని రసముగా నొప్పికొన్నచో రసభావ పరిగణనమందు వ్యవస్థ లేకుండఁ బోవునన్నదే ప్రాచీనుల అభ్యంతరము. ఇది అప్రతిసమాధేయము” అన్నారు.

మధుసూదన సరస్వతి సిద్ధాంతాన్ని అంత స్పష్టంగా వివరించిన శ్రీరామమూర్తి గారు ఈమాట అనడం విచిత్రం. మధుసూదన సరస్వతి ప్రతిపాదన రసభావపరిగణనలో వ్యవస్థనే దెబ్బ తీసేంత భిన్నంగా ఏమీ లేదు. ఈ విషయాన్ని శ్రీరామమూర్తిగారే తమ వ్యాసంలో స్పష్టంగా వివరించారు. మరల ఆయనే “అప్రతి సమాధేయము” అని అనడం ఆశ్చర్యకరంగా ఉంది.

3.1.22 కేతవరపు రామకోటిశాస్త్రి

విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణకల్పవృక్షం గురించి వ్రాసిన “ఒక భక్తిరచన” అన్న వ్యాసంలో భక్తి రసమా భావమా అన్న ప్రశ్నను తీసుకువచ్చారు రామకోటి శాస్త్రిగారు. “భక్తి యన్నది కేవలము భావమా? రసమా? యను ప్రశ్న యున్నది. దానికి సమాధానమిచ్చుటకు నేను గాదు. భక్తి రసము వలెనైన యోగ భావమని నా అభిప్రాయము” అన్నారు ఆయన ఆ వ్యాసంలో (విశ్వనాథ వైఖరి పుట 84).

అదే వ్యాసంలో మరొక చోట రామాయణ కల్పవృక్షంలోని పాత్రలన్ని రాముని యందు లగ్నమనస్కములుగా నిరూపింపబడి నిర్వహింపబడినవనీ, అటువంటి నిర్వహణ పూర్వ రామాయణాలలో అంత నిశితంగా లేదనీ అంటారు. “ఈదృశ నిర్వహణము పూర్వ రామాయణములందింత నిశితముగా లేదు. ఈ నిర్వహణనున్నది శిల్ప విశేషము. బహుధారూపిత సూక్ష్మతర కథా కథన కుశలురైన అంతర్ద్రష్టల చేతిలో అది రసముగా పరిణమించును” అన్న రామకోటి శాస్త్రిగారి మాటలు సమర్థుడయిన కవి చేతిలో భక్తి రసముగా పరిణమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి (విశ్వనాథ వైఖరి పుట 85).

3.1.23 ఎం. కులశేఖరరావు

ఎం. కులశేఖరరావుగారు తాను రచించిన ఆంధ్ర వచన వాఙ్మయము ఉత్పత్తి వికాసాలు అనే గ్రంథంలో పోతన గురించి చెప్పేటపుడు “భక్తికి రస స్థాయి కలిగించిన యీతని ఉత్సాహము” (పుట 310) అంటూ భక్తిరస ప్రస్తావన చేస్తారు. మరొక చోట మరలా స్తుతివచనాల గురించి వ్రాసే సందర్భంలో కూడా “భక్తిని రస స్థాయికి తెచ్చి పారాకాష్ట నందించిన పోతనామాత్యుని కావ్యమాంధ్రులకు నిత్య పఠనీయమైనది” అంటారు (పుట 455). ఇక్కడ వీరు భక్తిరసము అనే శబ్దాన్ని వ్యవహారిక అర్థంలో వాడలేదు. ఆలంకారిక పరిభాషను అనుసరించే వాడారు. ఎందుకంటే ఈ వాక్యానికి ఇచ్చిన అథోజ్ఞాపికలో “భక్తిని రసమని భావించువారు కలరు. వంగదేశీయుడగు రూపగోస్వామి మధుసూదన సరస్వతియను లాక్షణికు లిందు ముఖ్యులు” అని స్పష్టంగా పేర్కొన్నారు. స్తుతివచనముల గురించి చెప్పేటపుడే మరొక చోట “భరతాది లక్షణకారులు భక్తిని రసముగా గుర్తించకపోయినను, తమ కవిత్వమున భక్తిని రసప్రమాణమున కందించిన కవులలో నిట్టి వచనములు రచించిన పెద తిరుమలాచార్యుడు కూడ చేరుచున్నాడు” అనడం వలన వారు భక్తిని రసముగానే భావించారని స్పష్టమవుతున్నది (పుట 485). అంతే కాదు, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించిన తెలుగు వచన వికాసము అనే సంక్షిప్త గ్రంథంలో కూడా “ఆంధ్రులకు అభిమాన పాత్రమైన భక్తి అనే భావానికి రస స్థాయిని కలిగించి కావ్య రచన చేసినవాడు పోతన” (పుట 16) అని పేర్కొన్నారు. ముఖ్యాంశాలు మాత్రమే ఏర్చి కూర్చిన ఆ సంక్షిప్త గ్రంథంలో కూడా వారు ఈ వాక్యాన్ని వ్రాయడం, దానిని పోతనకు గల ఒక ప్రధాన గుణంగా చెప్పడం గమనించవలసిన విషయం.

3.1.24 జి. వి. సుబ్రహ్మణ్యం

జి.వి. సుబ్రహ్మణ్యం గారు భక్తిని రసముగానే భావించారు. పలు సందర్భాలలో భక్తిరసము అనే మాటను వాడారు. ఉదాహరణకు “సంకీర్తన సాహిత్యం మధురభక్తి మహార్ణవం” అనే వ్యాసంలో “తెలుగువారి అదృష్టం ఏమిటంటే – 15 వ శతాబ్ధి పూర్వార్ధంలో బమ్మెరపోతన భాగవతం తెలుగులో వినిర్మించి భక్తిని రసంగా నిర్ద్వంద్వంగా సాహిత్య రంగంలో నిలిపాడు. 15వ శతాబ్ధి ఉత్తరార్ధంలో జీవించియున్న అన్నమాచార్యులు సంకీర్తన సాహిత్యంలో భక్తిరసాన్ని పరమోదారంగా పరిపోషించాడు” అంటూ స్పష్టంగా భక్తిరస ప్రస్తావన చేస్తారు జి.వి.ఎస్ (సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు పుట 142).

లెక్కకు మిక్కిలిగా ఉన్న జి.వి.ఎస్ గారి సాహిత్య వ్యాసాలలో ఇటువంటి ప్రస్తావనలు మనకు పలుచోట్ల కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైన వాటిని, భక్తిరసం గురించి జి.వి.ఎస్ గారు ప్రత్యేకంగాను నూతనంగాను చేసిన కొన్ని వ్యాఖ్యలను మాత్రమే ఇక్కడ పేర్కొంటున్నాను.

మొదట చెప్పుకోవలసినది “ఆంధ్ర మహా భాగవతము-రసానుభూతి” అనే వ్యాసం. ఈ వ్యాసమే కొన్ని చిన్న చిన్న మార్పులతో “భాగవత పురాణ ఫల రసాస్వాదన” అనే పేరుతో కూడా ప్రచురించబడింది. ఇందులో జి.వి.ఎస్ భక్తిరసాన్ని గురించి ఉన్న చర్చలను ప్రస్తావించి, ధూళిపాళ శ్రీరామమూర్తి గారి సిద్ధాంతగ్రంథం నుండి కొన్ని వాక్యాలను ఉదాహరిస్తారు. ఆతర్వాత “భాగవత పురాణం భక్తిరస ప్రధానమని ఫలితార్థం. శాంతం దానికంగం. భగవద్రూప రతి భావం స్థాయి. దానికి తత్త్వజ్ఞానం పోషకం” అంటూ తన వివరణను అందిస్తారు (రసోల్లాసము పుట 243). ఈ వ్యాసం ప్రారంభంలోనే “నల్లనివాడు” అన్న భాగవత పద్యాన్ని పేర్కొని “ఈ పద్యం విని పరవశించే తెలుగువారికి భక్తి రసం కాదంటే లక్షణ శాస్త్రం మీద గౌరవ ముంటుందని నేననుకోను” అంటారు. “చర్చల కతీతమైన లక్ష్యలక్షణ గ్రంథం భక్తిరసాయనమైన భాగవతం” అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తారు (రసోల్లాసము పుట 239).

దేవదాసు వెంకటేశ్వరరావుగారి ‘ప్రాచీనాంధ్ర సాహిత్యం – మధురభక్తి’ అన్న సిద్ధాంత గ్రంథంలోని విషయాలను చెప్తూ వ్రాసిన “మధురపరిశోధకుడు” అనే వ్యాసంలో భక్తిరసం గురించి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు జి.వి.ఎస్ (కొలమానం పుట 331-334). ఆ వ్యాసంలో వారు “పండితులకు భక్తి, రసం కాక పోవచ్చు. కాని, జానపదులకు అన్ని రసాల కంటె ఆత్మీయమైనది భక్తిరసం” అంటారు. “భక్తిరసం నిస్సంశయంగా దేశీయం” అనీ, “ప్రజల హృదయాలలోని మహాభావమే ప్రజల పాటలలోని భక్తిరసానికి బీజం” అనీ అంటారు. అయితే భక్తిని రసం కాదన్న వాదంలోనూ ఒక వాస్తవం ఉంది; అవునన్న వాదంలోనూ ఒక సత్యం ఉంది అంటూ ఒక కొత్త వివరణను ఇస్తారు జి.వి.ఎస్ ఈ వ్యాసంలో. “భక్తి- శాంతం వంటి శుద్ధమైన ఆత్మరసం కాదు; భగవద్విభావానుభావ చర్వణం కలిగించే పారవశ్యం వలన కలిగే ఆధ్యాత్మికానందం” అంటారు. భక్తి శృంగారాది రసాల వలె శుద్ధమైన అలౌకిక రసం కాదనీ, నాయికా నాయకులుగా శకుంతలా దుష్యంతులకూ రాధాకృష్ణులకూ భేదం ఉందనీ అంటారు. శకుంతలా దుష్యంతులు అలౌకిక విభావాలనీ వారివురి రతివలన సామాజికులకు శృంగారరసమే అందుతుందనీ, రాధాకృష్ణులు శృంగార రస నాయికానాయకులు కారనీ వారివురి నడుమ గల రతి భావం ఆధ్యాత్మికంగా ఆస్వాదింపబడి భక్తిరసమౌతుందనీ వివరిస్తారు. “భక్తిరసం శృంగారాదుల కంటే స్థాయిలో మిన్న; శాంతరసం కంటె ఒక స్థాయి చిన్న. భక్తి పఠితలను అలౌకికం నుండి ఆధ్యాత్మికం వైపు ప్రస్థానం చేయించి, ఒక అపూర్వానందాన్ని కలిగించే శక్తి కలిగి ఉంది. అది నిర్గుణతత్త్వ జ్ఞానంతో పర్యవసిస్తే శాంతరసమౌతుంది. అందువల్ల అలౌకిక రసవాదులు భక్తిని రసంగా అంగీకరించకపోవటంలో ఒక వాస్తవం ఉన్నమాట నిజం. భక్తిని రసంగా అంగీకరించేవారూ, కావ్యాలలో పోషించేవారూ, లక్షణ గ్రంథాలలో నిరూపించే వారూ దానిని ఆధ్యాత్మిక స్పృహతో చెప్పారే కాని, శృంగారాదులతో సమాంతరంగా చెప్పలేదు. భక్తికి రసంగా ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉందని స్పష్టం” అంటారు.

ఈ విషయాన్నే కొంత భిన్నమైన పదాలతో ఆంధ్రమహాభాగవతము-రసానుభూతి అన్న వ్యాసంలో కూడా చెప్తారు. అక్కడ వారు “గోపికల రతిభావం సాధారణీకరణాన్ని పొందుతున్నా భగవద్విభావాలకు సంబంధించిన భావాలు సహృదయునికి అసాధారణాలై ఆశ్చర్యజనకాలై ఆలోచనాన్ని రేకెత్తిస్తున్నవే కాని తాదాత్మ్యాన్ని కలిగించడం లేదు. అంటే సహృదయుడు భక్తపాత్రల్లో తాదాత్మ్యాన్ని పొందగలడు కాని భగవంతుని పాత్రలో పొందలేడు. అందువల్ల భాగవతంలోని ప్రధానపాత్రయైన భగవంతుడు అలౌకిక విభావవిస్ఫూర్తితో వెలుగొందినా, ఆధ్యాత్మిక విభావంగానే అనుగమ్యమానుడౌతున్నాడు” అంటారు. అంతేకాకుండా భాగవతంలో భగవత్తత్త్వం సగుణ నిర్గుణ మార్గాల ననుసరించి నిరూపితం కావడం వలన సహృదయుడు సగుణరూపంతో సహానుభూతి పొందలేక పోతున్నాడనీ, నిర్గుణతత్త్వాన్ని హృదయంతో సాధించలేకపోతున్నాడనీ, అందువలన భగవద్విషయంలో బుద్ధిని ఆశ్రయించవలసి వస్తున్నదనీ అంటారు. అలౌకికం హృదయగమ్యం, ఆధ్యాత్మికం బుద్ధిగమ్యం కాబట్టి భాగవతంలో సహృదయుడు పొందే రసానుభూతి సగం అలౌకికం, సగం ఆధ్యాత్మికం అని వ్యాఖ్యానిస్తారు (రసోల్లాసము పుట 241).

ఈ అంశాన్నే కొనసాగిస్తూ భక్తి శాంతరసాలు రసనామ వాచ్యాలైనా రసాతీతాలని సంభావించాలంటారు. అంతే కాదు “భాగవత పఠితయైన సహృదయుడు ప్రధానంగా ఆస్తికుడై ఉండాలి. ఆపైన ఆధ్యాత్మిక చింతనాపరుడై ఉండాలి. భాగవతంలో రమణీయార్థం కోసమే కాక, పరమార్థం కోసం కూడా వెదకాలి. ఇటువంటి చిత్తపరిపాకం ఉంటేనే భగవద్రతి ప్రకాశిస్తుంది. లేకపోతే ఆభాస ఎదురౌతుంది” అన్న మరొక కీలకమైన వ్యాఖ్య కూడా చేస్తారు (రసోల్లాసము పుట 242).

జి.వి.ఎస్. భక్తిరసం అన్న మాటను వ్యావహారికంగా వాడలేదు. పూర్తిగా అలంకార పరిభాషలోనే వాడారు. స్థాయిభావాదుల గురించీ భక్తిరసం నిష్పణ్ణమయే క్రమాన్ని గురించీ కూడా వారు మాట్లాడారు. “భగవద్రూప రతి భక్తికి స్థాయి. భగవత్తత్త్వం సగుణ నిర్గుణ భేదంతో రెండు విధాలు. సగుణరూప రతిలో భక్తి రసస్థితి నందుకొంటుంది” అని స్పష్టంగా చెప్పిన జి.వి.ఎస్, “పోతన కవితలోని అలంకారం ఆర్ద్రతనూ, భావాభివ్యక్తిలోని ప్రసాదం పారవశ్యాన్నీ, భగవద్రూపతత్త్వ చింతనామయమైన ఆధ్యాత్మిక ప్రవృత్తి ప్రేరణం భక్తిమత్త చిత్తాన్నీ కల్పించి అసంలక్ష్య క్రమ వ్యంగ్య ఫణితిలో రసామోదాన్ని కలిగిస్తుంది” అని వివరించారు. పోతన “మూలభాగవత శాంతరసస్థితిని తనరచనలో భక్తిరసపోషకంగా అనుసంధించా”డన్నారు (సారస్వత వ్యాసాలు – 1 పీఠిక).

3.1.25 కోవెల సంపత్కుమారాచార్య

ఆధునిక విమర్శకులలో భక్తిరసము గురించి లోతుగా ఆలోచించినవారు, స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారూ కోవెల సంపత్కుమారాచార్య గారు. వారు “రసప్రస్థానంలో ‘భక్తి’ విప్లవం” అనే ఒక వ్యాసంలో భక్తిని ప్రత్యేక రసముగా గుర్తించవలసిన ఆవశ్యకత గురించి, అలా గుర్తించకపోవడానికి గల కారణాలను గురించి చక్కగా వివరించారు.

భక్తిని రసముగా ప్రతిపాదించిన తొలి ఆలంకారికుడెవరు అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు కానీ భక్తిని రసం కాదు అని నిరాకరించటం మాత్రం అభినవగుప్తుని నుంచి స్పష్టంగా కనబడుతుందని అంటూ అభినవగుప్తుని దాకా సాహిత్యం/అలంకారశాస్త్రంలో ఎక్కడా కనబడని భక్తిని అభినవగుప్తుడు రసం కాదు అని నిరాకరించడం ఎలా కుదురుతుంది అన్న ప్రశ్న వేస్తారు. “లేనిదాన్ని నిరాకరించటం కుదరదు కాబట్టి ఈ నిరాకరణమే భక్తి రసం యొక్క ఉనికిని వ్యాప్తిని తెలుపుతుంది. అంతేకాదు, రసంగా భక్తి యొక్క ఉనికిని గుర్తించినట్టే స్పష్టపడుతుంది. అభినవగుప్తునికి పూర్వమే, భక్తి యొక్క రసత్వం ఒక గొప్ప ఆలంకారికుడు నిరాకరించక తప్పని స్థాయికి ఎదిగి విస్తృత ప్రచారంలో ఉండిందని గూడా స్పష్టపడుతుంది” అంటారు.

భక్తిరస విషయమై జగన్నాథ పండితరాయలు చేసిన చర్చ గురించి మాట్లాడుతూ సంపత్కుమార “జగన్నాథుడు భరత-అభినవగుప్తుల మీద గౌరవంతో భక్తిని రసంగా నిరాకరించాడు గాని ఆయన ఆలోచనలో, వివేచనలో ఏమూలో భక్తి రసమేనన్న భావన దోబూచులాడుతున్నట్లు కనబడుతుంది. ఇందుకు ఆయన భక్తి విషయంగా చేసిన వివేచన, నిరాకరణలే సాక్ష్యం” అంటారు.

జగన్నాథ పండితుని వివేచనను వివరించాక “భక్తిని రసంగా అంగీకరించకున్నా దాని రసత్వం-విభావానుభావ ప్రకటనతో సహా రాయల నిరాకరణలో స్పష్టపడింది” అంటారు.

భక్తి ఒక రసంగా అనుభవంలోకి వచ్చే ఒక మహాకావ్యం/మహాగ్రంథం భాగవతమనే విషయంలో ఎవరికీ విప్రతిపత్తి లేదనీ, భక్తి రసానుభవాన్ని కలిగించేంతటి శక్తిమంతమయిన రచన భాగవతానికి ముందు ఉండి ఉండకపోవచ్చుననీ, అందువల్ల భాగవత మహాకావ్య అనుభవం నుంచే, అనుభవ విశ్లేషణ నుంచే భక్తి యొక్క రసత్వ భావన వ్యాప్తికి వచ్చి ఉండవచ్చునని స్థూలంగా నిర్ధారించుకోవచ్చుననీ అంటారు.

భక్తిని ఏ ఆలంకారికుడూ రసంగా ప్రతిపాదించకపోవడానికి కారణం భరతముని మీది గౌరవమే కావచ్చుననీ, ఆ విషయాన్ని జగన్నాథ పండితరాయలు స్పష్టంగానే ప్రకటించాడనీ, అయితే భరతముని నియంత్రించిన రస (సంఖ్యా) పరిగణనాన్ని సమర్థంగా భంగించడమే భక్తి సాధించిన విప్లవమనీ అంటారు సంపత్కుమార.

భక్తిని రసముగా అంగీకరించని ఆలంకారికులందరి అభిప్రాయాలనూ పేర్కొని, ఇంతింతమంది ఇంతింతగా నిరాకరిస్తున్నా కూడా భక్తి ఎప్పటికప్పుడు శక్తిమంతంగా పురోగమిస్తూనే ఉందనీ, ప్రేయో వత్సల లౌల్య మాయాదులకు లేని జీవశక్తితో నిరంతరం పుంజుకుంటూనే ఉందనీ, ఈనాటికీ భక్తిరసభావన చర్చా విషయం కావటమే దాని ప్రాణశక్తికి నిదర్శనమనీ అంటారు. జగన్నాథ పండిత రాయలు భక్తిని రసంగా అంగీకరించకపోయినా దాని రసత్వం విభావానుభావ ప్రకటనతో సహా ఆయన విచారణలో స్పష్టపడిందనీ, భక్తిలోని జీవశక్తి అదేననీ, మిగతావాటికి లేని ఆ జీవశక్తితో భక్తి రససంఖ్యా నియతిని పెళ్ళగించి వేసిందనీ అంటారు.

భక్తిరసానికి స్థాయిభావం భగవదనురాగమని చెప్పి నిజానికి దానిని పరమప్రేమ అనడం సమంజసంగా ఉంటుందంటారు. ప్రేమ యొక్క అత్యుత్కృష్టస్థాయి పరమప్రేమ అనీ, ఆ పరమప్రేమ యొక్క ఛాయలే రతి, వాత్సల్య, స్నేహాదులనీ చెప్పారు. ఆ పరమప్రేమకు భగవంతుడు, భగవతి, గురువు, తల్లిదండ్రులు, దేశం – ఇలా అత్యుదాత్తమయినది ఏదయినా ఆలంబనం కావచ్చునంటారు. భగవద్రూపాలు భిన్నభిన్నాలు కావచ్చుననీ, ఎక్కడయినా సరే ఆ ప్రేమ సాధారణ ప్రేమస్థాయిని దాటి అన్నిటినీ పొదువుకోగల పరమప్రేమ కావడం ముఖ్యమనీ అంటారు. పోతన గారు ఉద్దామప్రేమ అని చెప్పినది ఈ పరమప్రేమయేననీ రత్యాదుల కున్న పరిమితులు పరమప్రేమకు లేవనీ అన్నారు.

ఇక్కడ “పరమప్రేమకు భగవంతుడు, భగవతి, గురువు, తల్లిదండ్రులు, దేశం – ఇలా అత్యుదాత్తమయినది ఏదయినా ఆలంబనం కావచ్చు”నన్న సంపత్కుమార గారి వాక్యం మధుసూదన సరస్వతి చెప్పిన నిర్వచనంతో విభేదిస్తుంది. మధుసూదనసరస్వతి మోక్షకారకులయిన హరిహరాదులపైన ఉండే భక్తికి మాత్రమే రసత్వాన్ని చెప్పి, ఇంద్రాదిదేవతలపై ఉండే భక్తిని భావంగానే పరిగణించాడు.

ఇక ఈ వ్యాసంలో మరొక ముఖ్యమైన వ్యాఖ్యను కూడా చేశారు సంపత్కుమార. “భక్తిరస విషయంలో కావ్యపాఠకుడు ‘భక్తుడు’ అన్న ధోరణిలో ఆలోచించడం సరయిన విధానం కాదనిపిస్తుంది. కావ్యంద్వారా వీరరసానుభవం పొందే పాఠకుడు వీరుడే కానక్కర్లేదు. సహృదయ పాఠకుడు కావడం మాత్రం తప్పనిసరి. పాఠకునిలో వాసనారూపంగా పరమ ప్రేమ కూడా మౌలిక చిత్తవృత్తిగా ఉండనే ఉంటుంది. ఈ చిత్తవృత్తియే రసానుభావానికి కీలకాంశం” అంటారు.

సంపత్కుమారాచార్య గారి ఈ వివరణ భక్తికావ్యం నుండి రసానుభూతిని పొందే పాఠకుడిని భక్తుడిగా పరిగణించిన విశ్వనాథ వారి విశ్లేషణకు, భక్తి కావ్యాన్ని ఆస్వాదించాలంటే పాఠకుడు ప్రధానంగా ఆస్తికుడై ఉండాలన్న జి.వి.ఎస్. గారి వ్యాఖ్యకు కూడా సమాధానమిస్తుంది.

ఈ వ్యాసంలో భక్తిరసం గురించి సంపత్కుమార చెప్పిన మరికొన్ని అంశాలు:

“భక్తి భారతీయ కావ్యరస ప్రస్థానంలో ఒక అలజడి” అన్న మరొక వ్యాసంలో నిజానికి అభినవగుప్తుని నాటి నుంచి ఏ లాక్షణికుడూ భక్తిని గురించి నిశితంగా ఆలోచించినట్లు కనిపించదనీ, ఆలోచించినది ఒక్క జగన్నాథ పండితుడేననీ అంటారు సంపత్కుమార.

భారతీయ కావ్యశాస్త్రంలో తొలిసారిగా “భక్తి” అనే అంశాన్ని ప్రవేశపెట్టినవాడు దండి అని చెప్తూ, దండి అభిప్రాయం ప్రకారం ప్రీతి మౌలికమనీ, అది శృంగారపరమయితే రతి అనీ వివరిస్తారు. ప్రీతి రతికన్నా భిన్నమయినదనీ, భక్తికి మూలం ప్రీతి అయితే, శృంగారానికి మూలం రతి అని వివరిస్తారు. “రతిలో స్త్రీ నుంచి ఆశించే అంశం ఉంది. ప్రీతిలో అట్లాంటిదేమీ లేదు. వీటిలోని మౌలిక భేదం అది. అందుకే అనురూప వయస్సూ, కాంక్షా గల స్త్రీ పురుషుల విషయంగా తప్ప “రతి” అనేది ఇతరత్ర ఎక్కడా ఉపయోగింపబడదు. ఇది ప్రధానంగా గుర్తించవలసిన అంశం” అంటారు.

సంపత్కుమార చెప్పిన మరొక ముఖ్యమైన విషయం ఒకటుంది. “దండి భక్తిని రసంగా ప్రతిపాదించాడనటానికి అవకాశం లేదు. ప్రేయస్ భావాలంకారం కాబట్టి ప్రేయో విషయంగా చెప్పబడిన ప్రీతి భావమే అవుతుంది. ప్రీతి భావమే కావచ్చు గాని, ఆ భావం స్థాయిగా ఉన్న భక్తి గూడా భావమవుతుందా? కాదు. అందుకే దండి ప్రీతి, భక్తి అనేవాటిని విడివిడిగా పేర్కొన్నాడు” అనే కీలకమైన విషయాన్ని వారు చెప్పారు. చాలా మంది ఈ సూక్ష్మాన్ని గుర్తించకుండా దండి భక్తిని భావంగా పరిగణించాడని అభిప్రాయపడడం కనిపిస్తుంటుంది. దండిది భక్తి గూర్చిన ప్రాథమికమయిన ఆలోచన మాత్రమేనని చెప్తూనే “భక్తి విషయమైన రస-భావ భావన కావ్య శాస్త్రారంభం నుంచే ఆరంభమయిందన్నదే ఇక్కడ ప్రధానం”గా గుర్తించవలసిన అంశమని తెలియచేస్తారు.

భరతుడు చెప్పిన రససంఖ్యను మార్చకూడదన్న అభిప్రాయంలోని అసమంజసత్వాన్ని కూడా చక్కని తర్కంతో వివరించారు సంపత్కుమార. అసలు రససంఖ్య విచ్ఛిన్నం కావడం అన్నది ఒక విధంగా చూస్తే భరతుడి వల్లనే జరిగిందనిపిస్తుందంటారాయన. భరతముని శృంగార వీర రౌద్ర బీభత్సాలను ప్రధాన రసాలుగా చెప్పి మిగిలినవి ఆ నాలుగింటి నుంచీ ఏర్పడ్డాయని చెప్పడాన్ని ప్రస్తావించి ఆ విధంగా చూసినపుడు రసాలు నాలుగేననవలసి ఉంటుంది కదా అంటారు. ఇంకా బీభత్స, భయానక, రౌద్రములు అంగిరసములుగా కావ్యములేవీ రచించబడలేదన్న విషయాన్ని కూడా వీరు ఎత్తి చూపారు.

అలాగే భరత ముని చెప్పిన రససంఖ్య మారితే శాస్త్ర సంప్రదాయం విచ్ఛిన్నమయిపోతుందని భయపడనక్కర్లేదంటారు. శాస్త్రం వికసించే లక్షణం కలిగి ఉంటుంది కానీ కుంచించుకు పోయే లక్షణం కలిగి ఉండదనీ, అది కాలక్రమంలో అనేకమైన అంశాలను స్వీకరిస్తూ పురోగమిస్తుందనీ అంటారు. ఇదే చివరిమాట అనడాన్ని కాలం అంగీకరించదనీ అలా అంగీకరించేదే అయితే శాస్త్రం భరతుడి దగ్గరో దండి భామహుల దగ్గరో ఆగిపోయి ఉండేదనీ జగన్నాథ పండితుని దాకా వచ్చేది కాదనీ వివరిస్తారు.

3.1.26 గుంటూరు శేషేంద్ర శర్మ

శేషేంద్ర ప్రాచీన సాహిత్యం గురించి ఎక్కువగానే వ్రాశారు. రసానుభవం గురించీ మాట్లాడారు. కానీ రససంఖ్యను గురించి కానీ భక్తిని గురించి కానీ ప్రత్యేకంగా చర్చించలేదు. కొత్త ప్రతిపాదనలనూ అభిప్రాయాలనూ వ్యక్తపరచలేదు. పరోక్షంగా చేసిన ఒకటి రెండు వ్యాఖ్యలు మాత్రం కనిపిస్తాయి.

“ఆంధ్రసాహిత్యంలో హాస్యరసం” అనే ఒక వ్యాసంలో శేషేంద్ర “దశావతారాల్లో కల్క్యవతారం నవరసాల్లో హాస్యం శ్రేష్ఠమైనవని నిర్ణయించాను” అంటారు (సాహిత్య కౌముది పుట 114).

కవిసేన మేనిఫెస్టోలోని “ఆ కవిత్వం అర్థం కావడం లేదు” అనే ఒక వ్యాసంలో ఏది ఆత్మాశ్రయం, ఏది పరాశ్రయం అన్న విషయాన్ని గురించి మాట్లాడుతూ “భక్తి, ప్రేమ, క్రోధము, శోకము, కరుణ, ఇత్యాదులన్నీ ఆత్మాశ్రయాలే. వీటినే Feelings అంటారు ఇంగ్లీషులో, భారతీయభాషలో భావాలంటారు” అని చెప్పి అలంకారశాస్త్రం భావాలను స్థాయిభావ సంచారిభావాలుగా విభజించడాన్ని గురించీ, కవియొక్క స్థాయిభావాన్ని కవిత్వం ద్వారా పాఠకుడు ఎలా అనుభవించి రసీభవిస్తాడన్న విషయాన్ని గురించీ మాట్లాడతారు (పుట 115).

ఈ వ్యాఖ్యలు భక్తిరసచర్చకేమీ దోహదం చేయవు కానీ, రసభావ విషయముల గురించి మాట్లాడేటపుడు శేషేంద్ర భక్తిని ప్రధానంగా పేర్కొన్నారన్న విషయాన్ని గమనించేందుకు మాత్రం ఉపయోగపడతాయి.

3.1.27 అమరేశం రాజేశ్వరశర్మ

భారతదేశంలో 15వ శతాబ్ది తరువాత వ్యాపించిన భాగవతోద్యమానికి పోతన గారే తన భాగవత రచన ద్వారా దీపారాధనం చేశారనీ, అద్వైత వేదాంతంలో భక్తికి తగిన స్థానాన్ని సాధించిన మధుసూదన సరస్వతి, రూపగోస్వాముల కంటె ముందే పోతనగారు భాగవతంలో ఆ రెంటికి సమన్వయాన్ని సాధించి చూపారనీ అన్నారు అమరేశం రాజేశ్వర శర్మ గారు “బమ్మెర పోతన బహుముఖ వ్యక్తిత్వం” అనే తమ వ్యాసంలో.

భక్తిరసం గురించి వారు అక్కడ ప్రస్తావించారు. “ఈ విధంగానే, భక్తి రసం ఔతుందా? కాదా? అనే చర్చ సాగించడం, చివరకు భక్తి కూడా రసమే అని అంగీకరించవలసిన స్థితి ఆలంకారికులకు కలగడం భారతీయాలంకారిక శాస్త్ర చరిత్రలో మనకు తరువాతి కాలంలో కనిపిస్తుంది. అందులోను మొట్టమొదట మనకా చర్చ కనిపించేది జగన్నాథ పండిత రాయల రసగంగాధరంలోనని మనకు తెలుసు. పండితరాయలు తెలుగువాడు కనుక పోతన భాగవతం చూచే ఉంటాడు. జగన్నాథ పండిత రాయల నాటికి పోతన భాగవతం బాగా వ్యాప్తికి వచ్చి తెలుగుదేశం ఎల్లలు కూడా దాటి వెళ్ళిపోయింది. కనుక జగన్నాథ పండిత రాయలు భక్తి రసత్వ సిద్ధిని పొందిన విషయం గుర్తించే ఆ చర్చ లేవదీసి వుంటాడు. అయితే అతడు ముఖ్యంగా ఆలంకారికుడు. కనుక శాస్త్ర సంప్రదాయం అడ్డం వచ్చి భక్తికి రసత్వం నిరాకరించాడు. రూపగోస్వామి ముఖ్యంగా భక్తి మార్గానికి చెందినవాడు. కనుక భక్తికి రసత్వం యెప్పుడో తరువాత ఆలంకారికులు గుర్తించినా దాన్ని చాలా ముందుగానే పోతనగారు భాగవతంలో భక్తి రసమే అని గుర్తించ దగిన విధంగా రచన చేసి చూపినారు” అంటారు రాజేశ్వర శర్మగారు ఆ వ్యాసంలో (పోతన పంచశతీ స్మారక వ్యాసమంజరి పుట 12).

అంటే రాజేశ్వర శర్మగారు పోతన భాగవతంతో భక్తికి రసత్వం సిద్ధించిందనీ, దానిని తరువాతి కాలంలో ఆలంకారికులు గుర్తించారనీ భావించారు.

(సశేషం)

Exit mobile version