[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]
అధ్యాయం 3 – రెండవ భాగం
3.1.10 పింగళి లక్ష్మీ కాంతం
వీరు తమ “సాహిత్య శిల్ప సమీక్ష” గ్రంథంలో “రససంఖ్య” గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో చర్చించారు (పుట 91). నవరస సిద్ధాంతాన్ని సమర్థించారు. శాంతరసాన్ని ఒప్పుకోవడానికి అభినవగుప్తుని మాటలనే ఉదాహరించారు. శాంతానికి స్థాయిభావంగా శమమును చెప్పారు.
రుద్రటుడు చెప్పిన ప్రేయోరసము, మధుసూదన సరస్వతి ప్రతిపాదించిన భక్తిరసము వంటివి శృంగార రసములోనే అంతర్భవిస్తాయని వీరి అభిప్రాయం.
లోకంలో ప్రతి హృదయవేదనను వ్యావహారికంగా రసము అనడం ఉందనీ, దయారసం కలవాడు, స్నేహరస పూరితుడు, వినయరసభరితుడు అంటూ కొందరిని వర్ణించడం వారి హృదయ స్వభావాన్ని వర్ణించడమేననీ అంటారు లక్ష్మీకాంతం గారు. ఆ లోకాచారాన్ని బట్టే రసములు అనంతములు అనే సూక్తి ఏర్పడింది కాబోలు అని వ్యాఖ్యానించి “ఈ భక్తి వాత్సల్యాదులును ఆ యనంత రససంఖ్యలో చేరదగినవే” అంటూ భక్తిరసాన్ని గురించిన చర్చ ముగించారు (పుట 95).
3.1.11 రూపనగుడి నారాయణరావు
నారాయణరావుగారి కావ్యనిదానంలో రసము, భక్తి అన్న పదాలు వాడిన తీరు కొంత విభిన్నంగా ఉంటుంది. అలంకారశాస్త్ర పరిభాషను దృష్టిలో పెట్టుకుని వాడినదా కాదా అన్న విషయం స్పష్టంగా అర్థం కాదు. కళోత్పత్తి అనే వ్యాసంలో ఆదిమమానవుడు ప్రకృతిలోని కొన్ని విషయాలను చూసి భయానికీ మరికొన్నిటిని చూసి ఆశ్చర్యానికీ లోనయ్యాడనీ, ఆ భయాశ్చర్యాలు అతని చిత్తంలో భక్తిభావాన్ని అంకురింప చేశాయనీ చెప్పి “భక్తి యనునది యొక విధమైన ప్రేమయె కదా!” అంటారు. “క్రమక్రమముగాఁ దనయందలి యీ యాశ్చర్యరసము బహిఃప్రపంచమును దెలిసికొనుటకుఁ గారణముకాఁగా, పెంపందిన ప్రేమరసము అంతఃప్రపంచమును దెలిసికొనుటకుఁ బ్రేరకమాయెను” అంటారు (పుట 7). ఇక్కడ భక్తి ఒక విధమైన ప్రేమయె అనడాన్నీ, ఆ ప్రేమను రసము అనడాన్నీ గమనించవచ్చు. వ్యాసం చివర్లో “కళోత్పత్తికి మానవునిలోఁ గల భయాశ్చర్యప్రేమరసములే మూలకారణములు” అన్న విషయాన్ని కళోత్పత్తి విషయమై తేలిన ఒక సిద్ధాంతంగా చెప్తారు (పుట11).
వీరు మామూలుగా అన్నిరసములూ అని వాడవలసి వచ్చిన సందర్భాలలో వాడుకలో ఉన్న ధోరణినే అనుసరించి నవరసములు అనడమూ కనిపిస్తుంది, మరలా భక్తిని గురించి మాట్లాడిన సందర్భాలలో భక్తిరసము అనడమూ కనిపిస్తుంది. ఉదాహరణకి కళాప్రయోజనము అనే వ్యాసంలో “వివిధ కళారసాస్వాదనమువలన నవరసానుభూతి గలుగఁగా హృదయంబు శుద్ధమయి బుద్ధి సునిశితమగును” అన్న వాక్యం కనిపిస్తుంది (పుట 52).
“లలిత కళలు – వాని ప్రయోజనము” అనే మరొక వ్యాసంలో “గానము జనుల హృదయములను భక్తి శృంగార వీర కరుణ రసంబులతో నింపి వారి జీవితములకుఁ బలురీతులఁ బ్రయోజన పడుచుండును” అన్నారు (పుట 55). అయితే ఇక్కడ భక్తిని రసముగా పేర్కొనడమూ, దానిని మిగిలిన రసముల కన్నా ముందుగా చెప్పడమూ యథాలాపముగా జరిగినది కాదని అనుకోవడానికి కావ్యనిదానంలో మనకు ఒక ఆధారం దొరుకుతుంది. “లలిత కళలు – వాని ప్రయోజనము” అనే వ్యాసంలోనే గానము, చిత్రకళ, కవితారచనముల గురించి అరవిందుల మాటలు చెప్పిన తర్వాత నారాయణరావుగారు “ఒక కళావిదుఁడు చిత్రలేఖన చిత్రరంజనమునఁ దాను భగవంతుని దర్శించునట్లును, గానమున నాతని పలుకు వినునట్లును, కవిత్వమున నాతని ననుభవించునట్లును వచియించి తన రసానుభూతిని నావిష్కరించినాడు” అంటారు.
3.1.12 బసవరాజు అప్పారావు
బసవరాజు అప్పారావుగారు తాము రచించిన ఆంధ్ర కవిత్వ చరిత్రములో రససిద్ధాంతానికి సంబంధించిన వివిధ విషయాలను గురించి వివరంగానే చర్చించారు. వీరి అభిప్రాయం ప్రకారం రసములు అనంతములు. ఈ గ్రంథంలోని “అనంతో వై రసః” అనే అధ్యాయంలో వీరు చిత్తవృత్తులు అనంతములు కనుక రసములు కూడా అనంతములన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ప్రపంచమున నెన్ని కోట్ల భిన్నప్రకృతులు, మిశ్రప్రకృతులు, విపరీత ప్రకృతులు, అతీత ప్రకృతులు కలరో, అన్ని వింతభావములును, విపరీత రసములును, వర్తిలుచునే యుండును. రసములు తొమ్మిదియే యని మన లాక్షణికులు తెల్పునది యంత శుద్ధ సత్యము కాదు. సృష్టియు, మానవప్రకృతియు నెట్లనంతములో భావమును రసమును నట్టులే యనంతములు” అన్నారు (పుట 197).
3.1.13 దువ్వూరి రామిరెడ్డి
దువ్వూరి రామిరెడ్డిగారు “రసరామణీయకములు” అనే వ్యాసంలో రససంఖ్యను గూర్చి ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించారు.
“ప్రతివస్తువును జిత్తము నందొక భావమును రేఁపును. అట్టి భావములు ఆనుకూల్య ప్రాతికూల్యముల ననుసరించి సుఖదాయకములుగనో క్లేశదాయకములుగనో యుండును. సుఖ దుఃఖ తారతమ్యముల కనురూపముగ భావములు కొన్ని దుర్బలములుగను, మఱికొన్ని తీవ్రములుగనుండును. భావములవలె రసములును అనంతములు. అయినను ఇందుఁ బ్రధాన రసములు తొమ్మిది. వాని యొక్క సాంకర్య సాజాత్య భేద సంబంధముల వలన రసములు వివిధము లగుచున్నవి” అంటూ వీరు కూడా రసములు అనంతములన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు (కవికోకిలగ్రంథావళి పుట 40).
భక్తిరసము గురించి ప్రత్యేకముగా చెప్పకపోయినా మర్మకవిత్వము అనే మరొక అధ్యాయంలో “వివిధ మత సంప్రదాయముల యందును ఇట్టి కవిత్వ మంకురించి శాఖోపశాఖలుగ నభివృద్ధి నొందినది. వైష్ణవకవుల కీర్తనలయందు రసమాధుర్యములు పొంగిపొరలినవి. ఇందుకుఁ గొన్ని కారణములు గలవు. వైష్ణవులకు భక్తి ప్రధానము, ప్రేమ యాలంబము. ఆత్మకును బరమాత్మకును గల సంబంధమును రాధాకృష్ణుల ప్రేమలీలలుగ సంకేతించి వారు సంకీర్తనము చేసిరి” అంటారు (కవికోకిలగ్రంథావళి పుట 83). ఇక్కడి ఈ వాక్యాలను బట్టి వీరు భక్తికవిత్వంలో భక్తిరసము అంగిగా శృంగారరసము దానికి పోషకంగా ఉంటాయని భావించినట్లు కనిపిస్తుంది.
3.1.14 విశ్వనాథ సత్యనారాయణ
విశ్వనాథ సత్యనారాయణగారు రసానందాన్ని గురించి, రసనిష్పత్తికి సంబంధించిన వివిధ అంశాల గురించి విస్తృతంగా చర్చించిన గ్రంథం కావ్యానందం.
ఆ పుస్తకంలో మొట్టమొదటిసారి రససంఖ్య గురించి ప్రస్తావించినపుడు వారు “దీనిని తొలుత భరతుడు ఎనిమిదిగా చెప్పెను. తరువాత శాంతము కలిసి తొమ్మిది యయ్యెను. తరువాత తరువాత భక్తి కూడ రసమన్నారు” అని చెప్పి, ఎనిమిదో తొమ్మిదో పదో ఎన్నయినా ముందు రసస్వరూపం ఏమిటో చూద్దాం అంటూ ఆ చర్చలోకి వెళ్తారు (పుట 45). ఇక్కడ వారు నవరసములతో పాటు ఒక్క భక్తిని మాత్రం జోడించి చెప్పడాన్ని గమనించాలి. వత్సలాది ఇతర రసముల ప్రస్తావన చేయలేదు.
అయితే గ్రంథం మొదట్లో ఈ విధంగా చెప్పినప్పటికీ, నిజానికి విశ్వనాథ అభిప్రాయంలో కావ్యరసములు ఎనిమిదే. శాంతరసాన్ని కూడా వారు పూర్తిగా ఒప్పుకోలేదు. “కావ్యానందం” చివరి అధ్యాయాలలో ఈ విషయాలను చర్చిస్తూ, శమము అంటే ఇంద్రియనిగ్రహమే కాబట్టీ, ఇంద్రియ నిగ్రహం జరిగినపుడే రసానుభూతి జరుగుతోంది కాబట్టీ శాంతమును వేరే రసముగా చెప్పనక్కరలేదంటారు. చెప్పినా నష్టం లేదనీ అంటారు (పుట 171).
శాంతం విషయమే ఇలా ఉంటే ఇక మధుర వత్సలాది రసముల మాట చెప్పనక్కరలేదంటూ వాటినీ తిరస్కరిస్తారు. “భక్త్యాదులు కూడ రసములని వానికి విభావానుభావాదులు సృష్టించి, వత్సల రసమని, మధుర రసమని చేయుట, కొందరు మహాపండితులు తమ తర్కశాస్త్ర పాండిత్యము యొక్క యాధిక్యము చేత చేసిరిగాని, నిజముగా నట్లు చేయుట న్యాయము కాదని మనవి” అంటారు (పుట 177). విశ్వనాథ వారి ఈ అభిప్రాయానికి కారణాలేమిటో వారు ఇచ్చిన వివరణలేమిటో వరుసగా చూద్దాము. “రసములెన్ని” అన్న అధ్యాయంలో ఈ విషయాలను విశ్వనాథ వివరిస్తారు (పుట 173-180).
భక్తిని రసముగా చెప్పడం న్యాయం కాదన్న వ్యాఖ్యకి ఇచ్చిన వివరణలో భాగంగా విశ్వనాథ
- ఆనందాన్ని పొందడంలో కావ్యపాఠకులకు, భక్తులకు చాలా భేదం ఉంది అన్న విషయాన్ని చెప్తారు.
- పాఠకులకు భగవంతుడూ ఆనందమూ అన్న బుద్ధీ, ఆ ఆనందాన్ని సంపాదిద్దామన్న బుద్ధీ ఉండదనీ, కావ్యాన్ని చదివేటపుడు కవి యొక్క శక్తి చేత పాఠకుని మనస్సు త్రవ్వుకొని త్రవ్వుకొని పదునెక్కి పదునెక్కి సహజముగా ఒక నిర్వృతిని పొందుతుందనీ అది కావ్యానందమనీ అంటారు.
- భక్తుల విషయం అలా కాదనీ, వాళ్ళు భగవంతుని భావిస్తున్నారనీ, ఆ భగవంతుడు కనిపించాలని అనుకుంటున్నారనీ, శరీరాలను శోషపెట్టి, వాటికి ఆయాసము కల్పించి, అవి సొమ్మసిల్లి పోయినపుడు తామొక బండబారిన స్థితిలో ఉన్నపుడు భగవద్దర్శనము కావచ్చునని ఆశపడతారనీ అంటారు.
భక్తులను గురించి విశ్వనాథ వారి ఈ పరిశీలన సరిగా ఉందా లేదా అన్న విషయాన్ని అలా ఉంచితే, కావ్యంలో భక్తికి రసత్వం ఉంటుందా ఉండదా అన్న చర్చకూ లోకంలో భక్తులు ఆనందానుభూతిని ఎలా పొందుతారన్న విషయానికీ అసలు సంబంధం లేదు. భక్తులు శరీరాన్ని శోషపెడతారు ఆయాసము కల్పిస్తారు – ఇత్యాది విషయాలు ఈ చర్చకు సంబంధించిన విషయాలు కావు. పాఠకులు కావ్యంలో శృంగారాది రసములను ఎలా అందుకుంటారన్న విషయాన్ని చర్చించేటపుడు లోకంలో ఒక శృంగారి లేదా ఒక వీరుడు ఆనందాన్ని ఎలా పొందుతాడు, ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉంటాడు అన్న విషయాలను చర్చించము. అక్కడ లౌకిక శృంగారానికీ, వీరత్వానికీ, కావ్యపఠనం ద్వారా పొందే శృంగార వీరరసానుభవాలకీ భేదాన్ని స్పష్టంగా గమనిస్తాం. ఆ రెండిటినీ కలపము. ఒకదాన్ని గురించి చర్చిస్తున్నపుడు మరొకదాన్ని తీసుకురాము. అలాగే కావ్యానికి సంబంధించిన భక్తిరస చర్చలో లౌకికంగా భక్తి వలన భక్తులు ఆనందాన్ని ఎలా పొందుతారన్న విషయానికి స్థానం లేదు. ఆ ప్రస్తావన ఇక్కడ అసంగతం.
ఇకపోతే భక్తులు మామూలుగా భక్తివలన పొందే ఆనందం విషయం కాకుండా, భక్తికావ్యపఠనం చేస్తున్నపుడు పొందే ఆనందానికి సంబంధించినది విశ్వనాథ ఇచ్చిన రెండవ వివరణ. ఆ వివరణలో వారు – భక్తులు భజనలు చేస్తారు, కీర్తనలు పాడతారు, భక్తికావ్యాలు పఠిస్తారు. అయితే వారిది కావ్యజగత్తు కాదు. భక్తిజగత్తు. వాళ్ళ భక్తి ఆ కావ్యాలలో నుండి పుట్టడం లేదు, వాళ్ళు సహజంగానే భగవంతుని యందు లగ్న చిత్తులు. ఆ లక్షణము వాళ్ళకి జన్మసిద్ధం – అంటారు. భక్తి కీర్తనలు, కావ్యాలు వారి తన్మయత్వానికి సాహాయ్యకారులు మాత్రమేనంటారు. అంటే ఆ తన్మయత్వమూ ఆనందమూ వాళ్ళ సహజలక్షణమైన భక్తి వలన కలిగినవే కానీ “కావ్యంలోని విభావానుభావ సాత్త్విక వ్యభిచారి భావముల చేత పరిణమించినవి కావు” అన్నది విశ్వనాథ అభిప్రాయం. భక్తిని రసముగా అంగీకరించకపోవడానికి వారు చెప్పిన ప్రధాన కారణం ఇదే. త్యాగరాజు కీర్తనల వలన ఎవరికైనా రససిద్ధి కలిగితే అది “ఆ కీర్తనలయందలి యర్థము చేత ప్రకోపింప జేయబడిన భగవద్భావనా సంజనితము గాని విభావానుభావాల చేత కలిగినది కాదు” అంటారు (పుట 173).
అయితే సహజంగా పాఠకుడిలో ఉన్న భక్తి వలననే అతడు భక్తి కావ్యం నుండి ఆనందాన్ని పొందడం, భక్తికావ్యపఠనం అందుకు సహాయకారి మాత్రమే అవడం – ఇదే భక్తిని రసముగా అంగీకరించడానికి విశ్వనాథ వారికి ఉన్న అభ్యంతరమయితే, ఇది మిగిలిన రసానుభవాలకు చెప్పుకుంటున్న వివరణకన్నా ఎక్కువ భిన్నంగా ఏమీలేదు. అభినవగుప్తుని తర్వాత నుండీ ఆలంకారికులందరూ అంగీకరించిన అభిప్రాయం ప్రకారం శృంగారాది అష్టరసాల అనుభూతి విషయంలో కూడా అదే వివరణ ఇవ్వబడుతోంది. పాఠకునిలో వాసనా రూపంగా ఉన్న రత్యాదులు కావ్యపఠనంతో ఉద్బుదమవుతాయన్నదే కదా రసానుభూతికి ఇస్తున్న వివరణ! పాఠకునిలో సహజంగా ఉండే భక్తి అనే లక్షణానికి కావ్యంలోని విషయాలు సాహాయకాలు అవుతాయన్న విషయాన్ని విశ్వనాథ కూడా చెప్తున్నారు. కాకపోతే భక్తిని రసముగా ప్రతిపాదిస్తున్న వారు పరమ ప్రేమగూడా పాఠకునిలో వాసనారూపంగా మౌలిక చిత్తవృత్తిగా ఉంటుందంటారు. విశ్వనాథ ఉద్దేశంలో “బహుశా” అది వాసనా రూపమయిన అంశం కాక స్వభావంలో ఏర్పడిన ఒకానొక లక్షణం. “బహుశా” అని ఎందుకంటున్నానంటే ఈ మాటను విశ్వనాథ స్పష్టంగా చెప్పలేదు. శాంతమును రసముగా ఒప్పుకోలేకపోవడానికి కారణాలు చెప్పిన సందర్భంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. శమము మిగిలిన గుణాలకంటే భిన్నమనీ అవి సహజ సముద్భూతములు అయితే శమము అభ్యాస జన్యమనీ చెప్పారు. అంటే రత్యాదుల కన్నా శమము భిన్నం కాబట్టీ, వాటిలాగా అది జీవలక్షణం కాదు కాబట్టీ శమమును ఒక స్థాయిభావంగా శాంతమును రసముగా చెప్పలేమన్నది శాంతం విషయంలో వారి వివరణ. భక్తి విషయంలో ఆమాట – భక్తి సర్వజీవులలో ఉండే సామాన్య లక్షణం కాదన్న మాట- సూటిగా చెప్పలేదు కానీ ఈ విషయంపై వారు ఇచ్చిన మిగిలిన వివరణలను బట్టి భక్తి విషయంలో వారి అభిప్రాయం అదే అని అనిపిస్తుంది.
‘మేము కావ్యజ్ఞులం, లౌకికులం, ఇంద్రియములలో బడి దొర్లుచున్నవాళ్ళం, భగవద్భావనపై మనసు నిలపలేని వాళ్ళం. భక్తులను తీసుకు వచ్చి మాలో కలపకండి, వారు వేరు, మేము వేరు’ అనడాన్ని బట్టి భక్తిని జీవులందరిలో ఉండే సామాన్య లక్షణంగా కాక, కొందరిలో మాత్రమే ఏర్పడే ఒక ప్రత్యేక లక్షణంగా గుణంగా విశ్వనాథ భావిస్తున్నారని అర్థమవుతుంది. భక్తి జీవులందరిలో సామాన్యంగా ఉండే లక్షణమా కాదా అన్నది కొంత లోతుగా పరిశీలించి తెలుసుకోవలసిన అంశం.
అయితే నిజానికి భక్తులు జీవితంలో (భక్తివలన) పొందే ఆనందాన్ని గురించిన ప్రస్తావన భక్తిరస చర్చలోకి తేవడం అసంగతం అని ఇంతకుమునుపు చెప్పుకున్నాం. అదే విధంగా కావ్యపాఠకులను భక్తులు అన్న దృష్టితో చూడడం కూడా అసంగతమే. అది, శృంగారాది రసాలను గురించి చర్చిస్తున్నపుడు కావ్యపాఠకుడు వీరుడా భీరుడా, శృంగారియా విరాగియా అన్న ఆలోచన చేయడం వంటిదే. “భక్తిరస విషయంలో కావ్యపాఠకుడు ‘భక్తుడు’ అన్న ధోరణిలో ఆలోచించడం సరయిన విధానం కాదనిపిస్తుంది” అన్న మాటను సంపత్కుమారాచార్య కూడా అంటారు. ఆ విషయాన్ని ఈ అధ్యాయంలో తరువాత చూడవచ్చు.
ఇక రససంఖ్యతోను భక్తిరసంతోను సంబంధం లేకుండా విశ్వనాథ ఈ గ్రంథంలో వ్యక్తం చేసిన అభిప్రాయం మరొకటుంది. అది కరుణరసము అన్నిటికన్నా ఉత్తమమయినదన్న అభిప్రాయం. కరుణరసమునకు స్థాయిభావమైన దుఃఖం వలన ఆత్మజ్ఞానము కలగడం మిగిలిన భావాల కంటే తేలిక అని అనిపిస్తుందని, సొమ్మసిల్లి పడిపోవడం, తనకేమీ అక్కరలేదనడం, తన ఒడలు తనకు తెలియకపోవడం, ఇంద్రియోపరతి – ఇవన్నీ దుఃఖంలో ఉన్నాయనీ, కాబట్టి పాఠకుడు నాగరకుడు, పరీపాకము గల హృదయము కలవాడు అయితే కావ్యంలోని ప్రధానరసము కరుణమైనపుడు రసానందం పొందడం చాలా సులభమని అంటారు విశ్వనాథ (పుట 140). అది చదివినపుడు ఇక్కడ చెప్పిన లక్షణాలు దుఃఖంలోనే సాధ్యమా! అన్న సందేహం కలుగుతుంది. ఈ లక్షణాలన్నీ భగవద్రతి వలన కూడా సంభవిస్తాయి కదా! అన్న ప్రశ్న వస్తుంది. ఆప్రశ్నను అలా ఉంచితే విశ్వనాథ ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా అంటారు. కరుణరసము ఉత్తమమైనదిగా చూపిన సమర్థనలో చివరిగా “ఈ దుఃఖముతో పరమేశ్వరుని పొందుట యెంత తేలిక! జ్ఞానవంతుడగుట ఎంత సులభము. మనస్సు యొక్క లోనికి లోనికి చొచ్చుకొని పోయి విజ్ఞానమయ జీవుని స్పృశించుట కంటె నింకొక సులభసాధనమున్నదా?” అని ప్రశ్నించి ఆ ప్రశ్న తర్వాత “అందుచేత కరుణరసము సర్వోత్తమమైంది” అంటూ ఆ అంశాన్ని ముగిస్తారు (పుట 143). పరమేశ్వరుని పొందడం అనేదే ఒక రసము ఉత్తమమయినదని నిర్ణయించడానికి ముఖ్యకారణమయితే ఆపరమేశ్వరుని పొందడానికి దుఃఖం కన్నా భగవద్రతి మరింత సూటి అయిన మార్గం కాదా అన్న మరొక ప్రశ్నను ఈ వివరణ కలుగ జేస్తుంది.
3.1.15 నోరి నరసింహ శాస్త్రి
నరసింహ శాస్త్రిగారు సుప్రసిద్ధ వాగ్గేయకారుడు నారాయణ తీర్ధులు రచించిన భక్తి కావ్యం “శ్రీకృష్ణ లీలా తరంగిణి” గురించి రెండు వ్యాసాలు వ్రాశారు. ఆంధ్రభాషలో ఎన్నో యక్షగాన ప్రబంధాలున్నాయనీ అయితే వాటిలో హాస్యం కొంత మోటుగా, శృంగారం కొంత పచ్చిగా, రచన కొంత పలుచగా ఉంటుందనీ, ఈ కావ్యంలో మాత్రం ఆ దోషాలు లేవనీ చెప్పారు.
“ఇది గ్రంథారంభము నుండి గ్రంథాంతము వరకు సర్వవిధముల నిర్దుష్టమై బ్రహ్మానందమును రంగభూమిపై ప్రదర్శించి సహృదయులను రసానంద తన్మయులను చేయగల ఉత్తమోత్తమ కావ్యము” అంటూ ప్రశంసించారు. (సారస్వతవ్యాసములు 5 – పుట 119). భక్తాగ్రేసరుడగు జయదేవుడు వర్ణించిన రాధాకృష్ణ శృంగారము ప్రాకృతులకు కాముక శృంగారముగా భాసించే ప్రమాదముందనీ, తీర్థుల వారి శ్రీకృష్ణలీలలో ఆభాస మాత్రముగా కూడ కాముక శృంగారం కనబడకపోవడం గొప్ప విశేషమనీ అన్నారు. (సారస్వతవ్యాసములు 5 – పుట 127).
రససంఖ్య విషయములో వీరు ప్రచారంలో ఉన్న అభిప్రాయాన్నే పరిగణించినట్లు కనిపిస్తుంది. ఇదే గ్రంథములోని ఇతర వ్యాసములలో (“సాహిత్యము”, “కవితాలక్ష్యము”) నవరసములనే పేర్కొన్నారు. అక్కడ నరసింహశాస్త్రిగారు శాంత రసమునకు స్థాయిభావముగా నిర్వేదమును చెప్పారు. రససంఖ్య విషయంలో అభినవగుప్తుని అభిప్రాయాన్ని గౌరవించిన పలువురు సాహితీవేత్తలు శాంతమునకు స్థాయిభావాన్ని చెప్పేటపుడు మాత్రం అభినవగుప్తుడు ప్రతిపాదించిన తత్త్వజ్ఞానమును కాక నిర్వేదమును ఎంచుకోవడం గమనించవలసిన అంశం.
3.1.16 నండూరి బంగారయ్య
నండూరి బంగారయ్య గారు నన్నయ సూచించినట్లు కావ్యనాటకాలన్నీ ఉదాత్త రసాన్వితములుగా ఉండాలనీ అయితే అందులో మరలా పూర్వోదాత్తము, ఉత్తరోదాత్తము అనే భేదాలుంటాయని వివరించారు (శాకుంతల విమర్శనము పుట 68). శాకుంతలంలోనూ శృంగార రసమున్నది భాగవత దశమస్కంధములోను శృంగార రసమున్నది కానీ శకుంతలా దుష్యంతుల ప్రణయము రాధాకృష్ణుల ప్రణయము ఒక్కటి కావనీ ఆ రెండింటికీ అపార తారతమ్యముందనీ చెప్తారు. మొదటిది భోగమయమనీ అంటే స్వార్థ పరాయణమనీ రెండవది త్యాగమయమనీ అంటే స్వార్థశూన్యమనీ అంటారు. మొదటిది దేహాభిమాన కలుషితమనీ రెండవది దేహస్పృహయే లేని ఆత్మికప్రణయమనీ అంటారు. అలాగే వాల్మీకి రామాయణంలోని రసపోషణములోను కాళిదాసు రఘువంశంలోని రసపోషణములోనూ ఎంతో తారతమ్యమున్నదనీ అది అనుభవైకవేద్యమనీ అంటారు.
ఈ తారతమ్యమునకు హేతువు ఏమిటని ప్రశ్నిస్తే అందుకు సమాధానం వాల్మీకికి సత్యము ప్రత్యక్షోపలబ్ధమని, కాళిదాసుకు అది పరోక్షోపలబ్ధము లేదా విశ్వాసోపలబ్ధము అనీ చెప్తారు. వాల్మీకి పరమాత్మను స్వయంగా దర్శించాడనీ కాళిదాసు అలా దర్శించినట్లు కనబడదనీ అంటారు. కాళిదాసు శాస్త్రముల ద్వారా తెలుసుకుని పెద్దల ద్వారా విని సత్యమును చిత్రించుచున్నాడే కానీ అతడు చిత్రిస్తున్న సత్యం అతడికి ప్రత్యక్షోపలబ్ధము కాదంటారు. సత్య సందర్శనము అయిన తర్వాత పోషించే రసము ఉత్తరోదాత్తమనీ అంతకు ముందు పోషించే రసము పూర్వోదాత్తమనీ పేర్కొనవచ్చునంటారు.
శ్రీమద్భాగవతాన్ని ఉత్తరోదాత్త రసాన్వితములకు అలంకారంగా పేర్కొన్నారు. ఈ రకమైన విభజన పూర్వపురచనలు, ఆధునికరచనలు అన్న భేదాన్ని బట్టి జరగదనీ, వాల్మీకి కాళిదాసుకన్నా పూర్వుడు కాబట్టి అతని కావ్యం ఉత్తరోదాత్త కావ్యం కాలేదనీ చెప్తూ తమిళంలో ఆండాళ్ళమ్మ తిరుప్పావై, హిందీలో మీరాబాయి భజనావళి, తులసీదాసు రామాయణము, తెలుగులో తిక్కన భారతము మొదలైనవి ఉత్తరోదాత్త రసాన్వితాలేనని అన్నారు. ఇక్కడ బంగారయ్య గారు భక్తిరసము అనే మాటను పేర్కొనక పోయినా ఆయన చెప్పిన అంశాలన్నీ భక్తిరసపోషణలో ఉండే తారతమ్యాన్నే ఉద్దేశిస్తున్నాయి. భక్తిరసపోషణ భిన్నమని చెప్పడమే కాక ఆ భిన్నత్వానికి ఒక హేతువును కూడా ప్రతిపాదిస్తున్నాయి.
3.1.17 నిడదవోలు వెంకటరావు
నిడుదవోలు వెంకట రావు గారు తాము రచించిన పోతన అనే పుస్తకంలో అవతారికలోనే “భక్తిరస సిద్ధాంతమున కాలంబనమైనది భాగవతము” అంటారు.
వారు ఆ పుస్తకంలో “భక్తిశృంగారము” అనే కొత్త అంశాన్ని ప్రస్తావించారు. పోతన కావ్యరసాలలో రసరాజమనిపించుకున్న శృంగారాన్ని భక్తితత్త్వంతో సమ్మేళనం చేశాడనీ, కాబట్టి పోతన ప్రతిపాదించిన శృంగారము ఆలంకారికుల రసనిర్వచనాల కంటే భిన్నమైన “భక్తిశృంగారం” అనే కొత్త రసమనీ అన్నారు.
ఈ భక్తిశృంగారాన్ని తెలుగు సాహిత్యంలో మొదట ప్రవేశ పెట్టిన వాడు పాల్కురికి సోమనాథుడనీ, పోతన ఈ తత్త్వాన్ని పాల్కురికి సోమన నుంచే గ్రహించాడనీ అన్నారు (పుట121-122). ఎర్రన, సోమన, శ్రీనాథుడు మొదలగువారి రచనలలో భక్తిరసము పోషింపబడినదా లేదా అన్న విషయాన్ని చర్చించారు.
పోతన యావదాంధ్ర మహాజనుల హృదయాలను భక్తిరస క్షేత్రాలుగా చేశాడనీ, ఆంధ్ర కవితను భక్తిరస స్నిగ్ధముగ చేసిన ప్రథమ కావ్యతీర్థము భాగవతమనీ అన్నారు.
3.1.18 బులుసు వేంకటరమణయ్య
స్థాయిభావముల గురించి చెప్పేటపుడు కొంతమంది ఎనిమిదంటారని, కొందరు తొమ్మిదంటారని, కొందరు పది అంటారని ఇంకొందరు అసంఖ్యాకం అంటారని చెప్పి, చివరికి “కాని వీని ననుసరించిన రసములు తొమ్మిదని చాలమంది వివరించుటచే స్థాయిభావములు తొమ్మిదియని చెప్పవచ్చును” అన్నారు. రససంఖ్య విషయంలో అందరు ఆలంకారికుల అభిప్రాయాలనూ చెప్తూ, “రసస్వరూప వివరణ సందర్భమున జగన్నాథ పండితుడు కూడ స్థాయిభావములయినను భూయిష్ఠ విభావజనితము లగునపుడే స్థాయిభావములని, లేని యెడల వ్యభిచారులగునని చెప్పి యున్నాడు కదా! ఆ రీతినే తక్కిన భావములు భూయిష్ఠ విభావజములగుచో రసములగుటతో అనుపపత్తి లేదు” అంటారు. (ఆంధ్రాలంకార వాఙ్మయ చరిత్రము : పుట 59-65)
3.1.19 దివాకర్ల వేంకటావధాని
దివాకర్ల వేంకటావధాని గారు సాహిత్యసోపానములు అనే తమ గ్రంథములో అలంకార శాస్త్రానికి సంబంధించిన వివిధ విషయాలను వివరించారు. రససంఖ్య గురించి కూడా ప్రస్తావించారు. అక్కడ వారు భక్తిని రసముగా ప్రతిపాదించిన ఆలంకారికుల యొక్క అభిప్రాయాలు, రసము కాదన్న ఆలంకారికుల యొక్క అభ్యంతరాలు చెప్పారు కానీ రససంఖ్యను గూర్చి తన అభిప్రాయమేమిటన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పలేదు.
అయితే మరొకచోట కావ్యభేదములు అనే శీర్షిక క్రింద దండకమును వివరిస్తూ “ఇది సాధారణముగా భక్తిరసమయమై యుండును” (పుట 56) అన్నారు.
వీరు రచించిన మరొక గ్రంథం ఆంధ్ర వాఙ్మయ చరిత్రము. అందులోని కావ్యయుగము అనే వ్యాసంలో పోతన గురించి చెప్తూ, భాగవతానికి ఇంతటి ప్రచారం విశ్వజనీనత రావడానికి “అందలి మధుర మంజులమైన శైలియు భక్తిరస మయమైన వస్తువును కారణములు” (పుట 35) అన్నారు.
ఆ గ్రంథంలోనే క్షేత్రయ్య గురించి చెప్తున్నపుడు “గోపాలదేవుడాతని ఇలవేలుపు” అని తెలిపి, “ఆ దేవునిఁ గూర్చి ఆతఁడు రచించిన పదములు భక్తి శృంగారములకు నిధానములు” అంటారు (పుట 83). ఇక్కడ భక్తి శృంగారములు అన్న పదాలను రసములు అన్న దృష్టితో కాక వస్తువులు అన్న దృష్టితో వాడారని అనుకోవడానికి అవకాశం ఉంది. అయితే గ్రంథం మొదటి అధ్యాయంలోనే శాస్త్రాలకు కావ్యాలకు మధ్య వ్యత్యాసాన్ని చెప్తూ “శాస్త్రము జ్ఞాన ప్రధానము కావ్యము రసప్రధానము” అని చెప్పడం వలన, గ్రంథమంతటా వివిధ కావ్యాలను ప్రస్తావించినపుడు ఏ కావ్యం ఏ రస ప్రధానంగా వ్రాయబడినదన్న విషయానికి ప్రాముఖ్యమిచ్చి చెప్పడం వలన ఇక్కడ కూడా వారు రసాన్నే ఉద్దేశించారని మనం భావించవచ్చు.
అంతేకాదు, మరొక అధ్యాయంలో శతకముల గురించి చెప్తున్నపుడు “వస్త్వైక్యము లేమిచే నిందు రసపాత్ర పోషణమున కవకాశ మంతగాఁ గానరాదు. కాని శృంగార భక్తి హాస్య రస ప్రధానములైన శతకములు కొన్ని లేకపోలేదు” (పుట 135) అన్నారు.
ఆ తర్వాత భక్తిశతకముల గురించి చెప్తున్నపుడు భక్తిరసమను మాటను పెక్కు సార్లు వాడారు. జన్నమంత్రి వ్రాసి ఉండవచ్చునని భావిస్తున్న ఒక శతకాన్ని గురించి చెప్తూ “కాని దేవకీనందన శతక మనుపేర భక్తిరస భరితమైన యుత్తమ శతక మొకటి కనవచ్చుటచే నదే ఈతడు రచించిన శతకమని యూహింపబడినది” (పుట 141) అన్నారు. రామదాసు రచించిన దాశరథీ శతకము గురించి చెప్తున్నపుడు “ఇందలి ప్రతి పద్యమును నొక భక్తిరస వాహిని” (పుట 142) అన్నారు. అలాగే కృష్ణ శతకాన్ని గురించి “భక్తిరస పూరితము” అని, నృకేసరి శతకం గురించి “భక్తి రసోద్బోధకము” అని అన్నారు. వడ్డాది సుబ్బారాయుడు గారి భక్త చింతామణి శతకము గురించి “ఇందలి పద్యములన్నియు భక్తిరస నిధానములై, మనోహరములుగా నుండును” అన్నారు (పుట 145). ఇంకా తత్త్వశతకాల గురించి చెప్తున్నపుడు కూడా భక్తిరస ప్రస్తావన చేశారు.
ఇలా భక్తిరసము అన్న మాటను పదే పదే వాడడం వలన వేంకటావధాని గారు భక్తిని రసముగానే భావించారని అనిపిస్తున్నది. ముఖ్యంగా “శృంగార భక్తి హాస్య రస ప్రధానములైన శతకములు కొన్ని లేకపోలేదు” అన్న వాక్యం భక్తిని రసముగా పరిగణించడం పట్ల వారికి అభ్యంతరం లేదని తెలియచేస్తున్నది.
3.1.20 పుట్టపర్తి నారాయణాచార్యులు
పుట్టపర్తి నారాయణాచార్యులు తాము రచించిన వాగ్గేయకారులు- పదకృతి సాహిత్యం అనే పుస్తకంలో భక్తిని స్పష్టముగా రసమని పేర్కొనడం మనకు కనిపిస్తుంది. పద సాహిత్యంలో ఉన్న “శబ్దము” అనే జాతిని గురించి చెప్తూ “వీనిలోఁ బ్రధాన రసములు భక్తి శృంగారములు” అంటారు (పుట 60).
అంతేకాదు, “తెనాలి రామకృష్ణుడు” అనే వ్యాసంలో ఇలా అంటారు. “తాను వ్రాయుచున్నది మతగ్రంథము. ఒకవైపు పాండురంగని స్తోత్రమునే చేయుచున్నాడు. మరొకవైపు “ఎన్ని వేలేండ్లు గడచిన యేన యేండ్ల, వెలయు ప్రాయంబు గల కొయ్య విట్ఠలయ్య” అని యెవరికి దోచని సత్యము రామలింగనికి స్ఫురించినది. ఈ సందర్భమున నిది భక్తిరస పోషకము గాదు. మఱి యాతడెందుకు రసభంగము జేయుచున్నాడనగా-వాని వ్యక్తిత్వమే యట్టిది గాబట్టి” (పుట37).
ఈ వాక్యాలని బట్టి పాండురంగ మాహాత్మ్యాన్ని రామలింగడు “భక్తిరస” పోషకంగా వ్రాయ దలచినట్లు పుట్టపర్తివారు భావించారని అర్థమవుతున్నది.
నారాయణాచార్యుల వారే “పోతన కవిత్వము” అనే మరొక వ్యాసంలో “ధర్మములు ప్రపంచించినంత మాత్రమున చిత్తమునకు శాంతి లభించుట కల్ల. భక్తిరస ప్రధానమైన గ్రంథమును వ్రాయు”మని నారదుడు వ్యాసునితో చెప్పాడనీ, అప్పుడు వ్యాసుడు తన హృదయాన్ని గ్రుమ్మరించి భాగవతాన్ని వ్రాశాడనీ అన్నారు (ఆంధ్ర మహాభాగవతోపన్యాసములు, పుట 147).
ఈ వ్యాసంలోనే మరొక చోట “భక్తి శృంగారములు – కరుణ పోతనామాత్యులకు చాల ప్రియమైన రసములు” అంటారు (ఆంధ్రమహాభాగవతోపన్యాసములు, పుట 210). ఇక్కడ భక్తిని రసమని చెప్పడంలో అలంకార శాస్త్ర పరిభాషనే వాడారని స్పష్టమవుతున్నది.
(సశేషం)
శ్రీ వల్లీ రాధిక చక్కని కథా రచయిత్రి. లోతైన తాత్వికతకు నిత్య జీవితంలోని సంఘటనల ద్వారా సరళంగా ప్రదర్శిస్తారు. ‘తక్కువేమి మనకూ’, ‘స్వయం ప్రకాశం’, ‘హేలగా… ఆనంద డోలగా..’ వీరి పేరుపొందిన కథల సంపుటాలు.