Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-7

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 3 – మొదటి భాగం

ఆధునిక తెలుగు విమర్శకులు – భక్తి

ఆధునిక విమర్శకులు చాలామంది తాము రచించిన గ్రంథాలలో, వ్యాసాలలో భక్తిరసము అన్న మాటను వాడారు. అయితే వీరిలో కొంతమంది సిద్ధాంతపరమైన వివరణతో ఆ పదాన్ని ప్రయోగిస్తే, మరి కొంతమంది కావ్యానుభవాన్ని ఆధారం చేసుకుని ప్రయోగించారు. అంటే కొంతమంది ఆలంకారిక నిర్వచనాల ప్రకారం భక్తి కూడా రసమే అవుతుందని అభిప్రాయపడి, భక్తిరసము యొక్క విశిష్టతను స్పష్టంగా వివరించారు. మరికొంత మంది శాస్త్ర నిర్వచనాల మాట తీసుకురాకుండా కొన్ని కావ్యాలలో తాము గమనించిన భక్తిరసపోషణను గురించి ప్రస్తావించారు. ఈ రెండు వర్గాల వారే కాకుండా ఇతర విషయ ప్రస్తావనలలో యథాలాపంగా వాడారేమో అనిపించేలా భక్తిరసము అనే పదాన్ని వాడినవారూ కొందరు ఉన్నారు. అయితే వీరెవ్వరూ కూడా సామాన్యమైన వారు కారు. అటు అలంకారశాస్త్ర పరిజ్ఞానమూ ఇటు సాహిత్యాధ్యయనమూ కూడా మెండుగా ఉన్నవారే. రససంఖ్యపై ఉన్న చర్చలన్నీ తెలిసినవారే. కనుక ఎంత యథాలాపంగా వాడినట్లుగా కనిపించినప్పటికీ వీరి మాటలను కూడా తేలికగా తీసుకోలేము.

ఉదాహరణకి గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారు విన్నపము అనే ఒక వ్యాసంలో “పరిచయముగల భాషలో బోధించినది తెలుసుకోవడము సులభము గనుక అపభ్రంశమన్నా సరే, గ్రామ్యమన్నా సరే, వైకృతమన్నా సరే, మ్లేచ్ఛమన్నా సరే లౌకిక భాషలోనే కావ్యములు కూడా వ్రాయవచ్చును. కావ్యమనగా రసవంతమైన వాక్యము. రసమునకు ప్రధానమైనది శబ్దము కాదు; శబ్దార్థము. మాట అనీ అనడముతోనే రసము స్ఫురించితేనే కానీ ఆనందము కలగదు; శృంగారరసము కానీ, భక్తిరసము కానీ. అట్టి స్ఫురణ వాడుకలో ఉన్న మాటల వల్లనే కలుగుతుంది” అంటారు (పుట 96). ఇక్కడ వారు శృంగారరసమునూ భక్తిరసమునూ మాత్రమే ప్రత్యేకంగా చెప్పడం కనిపిస్తుంది. అంటే వారు ఆలంకారిక నిర్వచనాల ప్రకారం కాకున్నా, తమ పరిశీలన ప్రకారమైనా భక్తిని రసముగా భావించారని అనుకోవలసి ఉంటుంది.

కాబట్టి భక్తిరసానికి సంబంధించినంతవరకూ ఆధునిక విమర్శకులు మూడు రకాలుగా కనిపిస్తారు. ఆలంకారిక నిర్వచనాల ప్రకారం భక్తిని రసముగా ఒప్పుకోవచ్చునని అన్నవారు; తమ తమ పఠనానుభవాల ఆధారంగా భక్తి కూడా రసస్థాయి అందుకోగలదని భావించినవారు; భక్తిరసము అన్న మాటను అలవోకగా వాడినవారు. ఇలా మూడు రకాలుగా ఉన్న ఆధునిక విమర్శకుల రచనలనన్నిటినీ అవకాశమున్నంత వరకూ అధ్యయనం చేసి ఆ వివరాలను ఈ అధ్యాయంలో పొందుపరిచాను. తెలుగు విమర్శకు ఆద్యుడిగా చెప్పబడే కందుకూరి వీరేశలింగంతో ప్రారంభించి కొందరు ప్రసిద్ధ ఆధునిక విమర్శకుల అభిప్రాయాలను ఇపుడు పరిశీలిస్తాను.

3.1 విమర్శకుల అభిప్రాయాలు

3.1.1 కందుకూరి వీరేశలింగం

వీరేశలింగంగారు రససంఖ్యను గురించి, భక్తిని రసముగా పరిగణించడం గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు కనబడదు. కానీ ఆంధ్రకవుల చరిత్రములో పోతన గురించి చెప్తున్నపుడు మాత్రం “పోతన కవిత్వము భక్తిరస ప్రధానమయినది; పదలాలిత్యము గలదయి, యమకాది శబ్దాలంకార భూయిష్ఠమయి, శ్రావ్యముగా నుండును” అన్నారు (పుట 604). యమకాది శబ్దాలంకారాలతో కలిపి చెప్పారు కనుక ఇక్కడ రసము అనే మాటను వారు వ్యావహారిక అర్థంలో కాక ఆలంకారిక పరిభాషగానే వాడారని భావించవచ్చు.

3.1.2 కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి

వీరు “శ్రీకృష్ణుఁడు జారుఁడా!” అనే ఒక వ్యాసంలో కృష్ణలీలలు కేవల బాలక్రీడలని, కాబట్టి అవి చదువరుల హృదయాలలో కామవికారమును అంకురింపచేయజాలవని చెప్పి “భక్తులెల్లరు నీకథ భక్తిరసప్రధానమయినదిగా గ్రహించుకొనుచున్నారు గాని కామతంత్రముగాఁ దలంచుటలేదు” అనడం కనిపించింది (ఉపన్యాసపయోనిధి పుట 303).

ఇంతకు ముందు చెప్పినట్లు బ్రహ్మయ్యశాస్త్రిగారి వంటి పండితులు భక్తిరసము అన్న మాటను వాడినపుడు, భక్తికి రసత్వం ఉందన్న పరిశీలనతో కాక యథాలాపంగా వాడి ఉంటారని అనుకోలేము. అయితే ఇక్కడ వీరు పాఠకులు అని కాక “భక్తులు” అని అన్నారు కనుక ఈ విషయాన్ని సాహిత్యపరమైన అంశంగా కాక మతపరమైన అంశంగా చెప్పారని అనుకోవడానికి అవకాశం ఉంది.

నిజానికి భక్తిరసమును సాహిత్యాంశంగా చర్చించిన విశ్వనాథ సత్యనారాయణ వంటి వారు కూడా భక్తులను పాఠకులను కలగలిపి మాట్లాడటం కనిపిస్తుంది. దానిని సంపత్కుమార వంటి వారు ఖండించడమూ కనిపిస్తుంది. ఈ పదప్రయోగంలోని ఔచిత్యానౌచిత్యాల గురించి ఈ అధ్యాయంలోనే ముందు ముందు చర్చించబడుతుంది.

3.1.3 కట్టమంచి రామలింగారెడ్డి

కట్టమంచి రామలింగారెడ్డిగారు కవిత్వ తత్త్వ విచారము అనే తమ గ్రంథంలోని ప్రథమ భాగంలో “కవియొక్క ప్రతిజ్ఞయుఁ దత్ఫలములును” అన్న శీర్షిక క్రింద కవి “సర్వలక్షణములును బలాత్కారముగనైన తెచ్చి రాసివేయవలె”నని అనుకోవడం వలన కథ సహజంగా పక్వానికి రాకుండా అక్కడక్కడా ఊదరవేయబడినట్లుగా అయిందని అంటారు. దానిని వివరిస్తూ “రసములు తొమ్మిది. శృంగార వీర కరుణాద్భుత హాస్య భయానక బీభత్స రౌద్ర శాంతములని” అని పేర్కొంటారు. సూరన అన్ని రసాలకూ స్థానములనేర్పరచాలనుకున్నాడనీ, అందువలన అన్ని రసాలకూ చోటు దొరికేంత విశాలమైన కథను కల్పించవలసి వచ్చిందనీ అంటారు (పుట 69).

ఈ సందర్భంలో భక్తిని గురించి ప్రస్తావించలేదు. కానీ తృతీయ భాగంలో ఈ వ్యాఖ్యకు కొనసాగింపుగా భక్తిని కూడా జోడించారు. అక్కడ వారు కళాపూర్ణోదయంలోని అనౌచిత్యాలను చర్చిస్తూ “ఇంత దనుక చవులూరెడు కామక్రీడలు వర్ణించి రతివర్ణనకు నాహుతిగా నీయఁబడిన పద్యములు సుమారు 25 తటుక్కున వైష్ణవ రాద్ధాంతముతో భక్తిరసముఁ గొంతదింపి గ్రంథసమాప్తి యొనర్తమని, లక్ష్మీనారాయణసంవాదమనెడు గతిమోక్షమును లేని ఘట్టమొకటి తెచ్చి వేసికొనినాఁడు” అంటారు. కృతిపతికి కామమోక్షాలు రెండూ కాంక్షితాలేమో అన్న పరిహాసపూర్వకమైన వాక్యం రాసి, ఆతర్వాత “కలయికలేని రసములఁ గలుపఁ జూచిన నరుచి” అంటారు. పాలలోచక్కెర వేస్తే దోషం లేదు కానీ ఉప్పు వేయకూడదంటారు (పుట 209).

ఇక్కడ కట్టమంచి వారు “భక్తిరసము” అనే మాటను భక్తి కూడా రసస్థాయిని అందుకోగలదన్న అభిప్రాయంతో వాడలేదనీ, ఆలంకారిక పరిభాషను దృష్టిలో పెట్టుకోకుండా మామూలుగా వాడారనీ అనుకున్నా, ఇక్కడి వివరణను బట్టి ఒక విషయం మాత్రం స్పష్టం అవుతుంది. కట్టమంచి వారు శృంగారాన్నీ భక్తినీ కలపకూడదని భావించారు. ఆ రెండిటినీ కలపడాన్ని పాలలో ఉప్పుని కలపడంతో పోల్చారు.

గమనించవలసిన మరొక విషయమేమిటంటే తృతీయభాగంలో అసహ్యశృంగారము అన్న శీర్షిక క్రింద మధురలాలస మాటలను గురించి చెప్తూ వారు ఈ క్రింది పద్యాన్ని ఉదాహరిస్తారు.

తే.గీ.
ఆ లలిత చరణములొత్తు కేలుకేలు
కోర్కిఁ దద్వక్షమునఁ జేర్చు కుచము కుచము
దివుట దద్రహః కథవిను చెవులు చెవులు
పలుకులేల తద్రతిఁ గన్న బ్రదుకు బ్రదుకు

ఈ పద్యాన్ని విమర్శిస్తూ “పోతనామాత్యుని కమలాక్షు నర్చించు కరములు కరములు అను మహోత్తర పద్యమునకుఁ బట్టిన గ్రహచారమా యీ అనుగమనము!” అంటూ కట్టమంచి వారు వాపోవడం చూసినపుడు భాగవత పద్యానుభూతిని అందుకున్న సహృదయ విమర్శకులలో వారూ ఒకరని అర్థమవుతుంది (పుట 188).

3.1.4 మల్లాది సూర్యనారాయణ శాస్త్రి

వీరు తమ వ్యాసరత్నావళి అనే సంపుటిలోని వ్యాసములలో రసమునకు సంబంధించిన పలువిషయములు చర్చించారు. శృంగార రస విమర్శనము అనే వ్యాసంలో రసస్వరూపం అన్న విభాగంలో రస సంఖ్యను గురించి చెప్తూ అష్టరసములను, శాంతాన్ని, వత్సల రసాన్ని ప్రస్తావించి “ఇంకఁ గొందరు స్నేహభక్తులతో రసములు పండ్రెండని చెప్పిరి. కావున రసములు తొమ్మిదియె యని నియమము సిద్ధించుట లేదు” అన్నారు (సారస్వతవ్యాసములు పుట 53). ఆ వెంటనే “అయిన నీ విషయంబున పిత్రాదులకుఁ బుత్రాదులయందుఁ గన్పడు ప్రీతి స్థాయికమైన వత్సలరసమును, మిత్రాదులయందు తోఁచు నార్ద్రతా స్థాయికమైన స్నేహ రసంబును, ప్రభు గురు దేవతాదుల యందు గోచరమగు తాత్పర్య స్థాయికమైన భక్తిరసంబును విభావాది రతిసముల్లసితంబులై శృంగార రసంబున నంతర్భూతంబు లగుచున్నవి గావున వానికి వేఱుగా రసత్వము సిద్ధము గాదు” అనిచెప్పి చివరికి శాంతాన్ని కొందరాలంకారికులు సమ్మతించారు కాబట్టి నవరసములను ఒప్పుకోవచ్చునన్న వ్యాఖ్యతో ఈ విషయాన్ని ముగించారు (సారస్వతవ్యాసములు పుట 54).

ఇక్కడ భక్తిని రసంగా పేర్కొంటూనే దానికి “వేఱుగా రసత్వము సిద్ధము గాదు” అనడాన్ని బట్టి చూస్తే, వీరు భక్తికి రసానందాన్ని ఇచ్చే శక్తి ఉన్నదని భావించారనీ, అయితే దానిని వేఱుగా ఒక క్రొత్త రసముగా పరిగణించకుండా శృంగారంలో భాగంగా పరిగణించవచ్చునని అనుకున్నారనీ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ విధమైన అభిప్రాయాన్ని చెప్పిన వీరు ఆ తర్వాత “శృంగారము” అనే మరొక వ్యాసంలో శృంగార రసాన్ని గురించి చేసిన విపులమైన చర్చలో భక్తిని వివరించకపోవడాన్ని గమనించాలి. సంభోగము, విప్రలంభము; బాహ్యరతం, ఆభ్యంతర రతం; స్వీయ, పరకీయ మొదలైన శృంగారంలోని భేదాలను, రతిలోని భేదాలను, శృంగార నాయికా నాయకులలోని భేదాలను ప్రస్తావించిన ఈ వ్యాసంలో భక్తిని ఒకానొక శృంగార భేదంగా చర్చించలేదు. శృంగార రసాభాసలో భాగంగా పూర్వాలంకారికుల అభిప్రాయాలను రెండింటిని – విశ్వనాథ కవిరాజు గోపికలపై కృష్ణునికున్న ప్రేమ రసాభాసమనడాన్ని, జగన్నాథ పండితరాయలు గీతగోవిందంలో అనౌచిత్యముందనడాన్ని – పేర్కొన్నారు కానీ, ‘రసానందాన్ని ఇచ్చేదీ శృంగారంలో అంతర్భాగంగా పరిగణించదగినదీ’ అని చెప్పిన భక్తిని గురించి మాత్రం ప్రస్తావించలేదు.

3.1.5 అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి

అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ కావ్యనాటకాది పరిశీలనము అనే గ్రంథంలో ఉత్తర రామచరితం, అభిజ్ఞాన శాకుంతలం, మృచ్ఛకటికం వంటి రచనల గురించి చర్చించారు. వీరు ప్రత్యేకించి భక్తిరసం గురించి చర్చించలేదు. కానీ అభిజ్ఞాన శాకుంతలంలోని రసము గురించి మాట్లాడుతున్నపుడు “హాస్య భయానక శాంతాది రసములకును, వాత్సల్యము భక్తి మున్నగు భావములకు నచ్చటచ్చటఁ దగురీతిఁ బ్రవేశ మొసంగినను మహాకవివర్యుని యవిచ్ఛిన్న ప్రతిభాధారకు గోచరమై ధారావాహికగా నాటకమందాద్యంత వ్యాపి యైనది శృంగారమే” అన్నారు (పుట 60). దానిని బట్టి వారు భక్తిని భావముగానే పరిగణించారని అనిపిస్తోంది.

3.1.6 పురాణం సూరి శాస్త్రి

పురాణం సూరిశాస్త్రి గారి విమర్శగ్రంథాలలో మనకు భక్తిరసం గురించిన సిద్ధాంతపరమైన వ్యాఖ్యలు కాక నాటకాలలో భక్తిరసాన్ని విభిన్న నటులు ఎలా అభినయించారన్న వివరాలు దొరుకుతాయి.

పానుగంటి వారి రాధాకృష్ణ నాటకంలో రాధగా నటించిన పారుపల్లి సుబ్బారావు గారి అభినయాన్ని ప్రశంసిస్తూ సూరిశాస్త్రి గారు “భక్తిరసమందు మానస సంచారమంతా చల్లబడి సాధుత్వమొందును. మోహము, మిక్కిలి చాపల్యము కలుగచేయునది. అనేక అనుమానాలు, భ్రమలు, ఆయాసములు, యీసడింపులు, పొంగుపాటులు, అంతలో సంతోషము, యింతలో విచారము, వులుకు, నివ్వెరపాటు, మొదలయిన వికారములు ఎన్నో కలుగుతవి. వీటన్నిటినీ స్థిరమైన భక్తితో మేళవించి; మోహము, భక్తి ఒకటేనని చూపిస్తూ – ప్రతిపదార్థము తేజరిల్లునట్లుగా; రసభావములొక్కటియైన గొంకువడకుండ – తల, మొల, వొళ్ళు, కళ్ళు, కాళ్ళు చేతులు, పాకమెరిగిన సొంపులో నియమమెరిగిన కళా విచక్షణతో చక్కగ నాడించి సుబ్బారావు చూపినాడు” అంటారు (నాట్యాశోకము: పుట 94).

ఇంకా మహాత్మా కబీరు, రామదాసు వంటి నాటకాలు కలిగించే ఆనందము; కబీరు, రామదాసు, ప్రహ్లాదుడు – వీరి భక్తిలోని సూక్ష్మభేదాలు, అలాగే ఆ భక్తిని విభిన్న నటులు అభినయించిన తీరులు – ఇటువంటి విషయాలనెన్నిటినో సూరిశాస్త్రిగారు నాట్యాశోకంలో వివరించారు.

భక్తిరసాభినయంలో ఆంజనేయ నటేశం గారి ప్రతిభను గురించి చెప్తూ ఇలా అంటారు. “ప్రతివాడి నైజంలో, నిత్యానుభవంలో, కొద్దో గొప్పో కామక్రోధాలు చేరుచుంటవి. కనుక యేదో విధంగా శృంగార వీర రసాలను కొంచె మనుభవ సిద్ధంగా చూపగలరు. శోకరసం కూడా జీవుల నిత్యానుభవమైన దుఃఖం వల్ల ఏర్పడుతూ, సామాన్యంగా స్త్రీ వేషధారులందరూ శృంగారాభినయము తర్వాత చులకనగా, రక్తిగా, చూచువారి కడుపులు తెగిపోవునట్లు ప్రకటించగలిగియున్నది. కాని భక్తిరసం సామాన్య నిత్యానుభవం లోనిది కాదు. దీనిని లౌక్యులు తెచ్చిపెట్టుకొనుట కూడ కష్టము. దాని అనుభవము కలవాళ్ళె దానినభినయింప యోగ్యులు. అట్టి అనుభవసిద్ధమైన భక్తిరసాభినయములో ఆంజనేయ నటేశము తన నిత్యప్రవృత్తిని వెల్లడించుకొంటూ యొరుల కవలీలగ నందరాని తెరవుల విప్పొందుచున్నాడు” (పుట 151). ఆంజనేయ నటేశాన్ని ప్రశంసిస్తూ శాస్త్రిగారు వివిధ సన్నివేశాలలో అతడు భక్తిని ఎంత బాగా అభినయించాడో చెప్తారు. లంకా దహనంలో సాధక భక్తుడి లక్షణాలను, గరుడ గర్వభంగంలో సిద్ధభక్తుడి లక్షణాలను ఈషద్భేదాలతో ప్రకటించగా చూశానని అంటారు (పుట 153).

అయితే, భక్తిని రసముగా పేర్కొంటూ, అది కలిగించే ఆనందాన్ని వర్ణిస్తూ, దాని అభినయానికి సంబంధించిన సూక్ష్మ భేదాలను సైతం గమనించి చెప్పిన శాస్త్రిగారు అన్ని రసములు అని చెప్పవలసి వచ్చిన సందర్భాలలో వ్యవహారాన్ని అనుసరించి నవరసములు అనడం కనిపిస్తుంది. మృచ్ఛకటికలో “నవరసములు సమానప్రపత్తి నొందియున్నవి” అంటారు, మరొకచోట పి.రంగనాయకులు నాయుడు గారికి “నవరసములను, సర్వభావములను ప్రకటించు నేర్పు” ఉందన్న మాట ఉంటుంది.

ఇలా ఆనవాయితీ ప్రకారం నవరసములు అంటూనే భక్తిని రసముగా పేర్కొనడం నాట్యాంబుజంలో కూడా కనిపిస్తుంది. గ్రంథావలోకనం కంటే కూడా “ప్రపంచమును నవరసభరితమైన అవస్థలలో చక్కగా పరికించి చూడటం వలన” తనకు కావ్యనాటకకళా లక్షణాలు విస్పష్టంగా బోధపడినాయంటారొకచోట (పుట 11). మరొకచోట “తెలుగు పలుకుల తేటపదునులు నైజసంగీతలావణ్యమొప్పుచు భక్తిశృంగారకరుణా రసవాహక సామర్థ్యమున ప్రపంచములోని బాసలన్నింటి మించి యున్నవి” (నాట్యాంబుజము పుట 17) అంటారు.

ఇక్కడ ఒకటి రెండు ఉదాహరణలనే పేర్కొంటున్నప్పటికీ, నవరసములు అన్నమాటా, భక్తిరసము అన్న మాటా మరికొన్ని చోట్ల కూడా కనిపిస్తాయి నాట్యాంబుజంలో. భీష్ముడు, విదురుడు, రామదాసు వంటి పాత్రల ద్వారా భక్తిరసాభినయాన్ని బాగా చేసిన నటుల గురించి సూరిశాస్త్రి ప్రస్తావించారు.

సూరిశాస్త్రి గారి మరొక గ్రంథం విమర్శక పారిజాతములో కావ్యానికి సంబంధించిన వివిధాంశాలపై పాశ్చాత్యుల అభిప్రాయములే ముఖ్యముగా అందించబడినాయి. గ్రంథాంతంలో మాత్రం రచయిత కొన్ని విషయములపై తన అభిప్రాయాలను క్లుప్తంగా చెప్పారు. అక్కడ వారు “కావ్యప్రయోజనము కవిదే గాని లోకులదంతగా కాదు” అని ఒక వ్యాఖ్య చేశారు. దానిని వివరిస్తూ “అనగా, పోతనగారు భాగవతము రచించుటయందనుభవించిన పరమానందములో పదియవవంతు మహారసజ్ఞులగు భాగవత పాఠకులు కూడ ననుభవించరని నా నమ్మకము” అన్నారు (పుట 263).

రసానందాన్ని గురించి ఒక ఉదాహరణ ఇవ్వవలసి వచ్చినపుడు వారు పోతన భాగవతాన్ని ఎంచుకోవడం గమనించవలసిన అంశంగా కనిపిస్తుంది.

ఇక్కడ ఆంజనేయ నటేశం గారి ప్రతిభను ప్రశంసిస్తున్న సందర్భంలో సూరిశాస్త్రి గారు చెప్పిన “భక్తిరసానుభవము కలవాళ్ళె దానినభినయింప యోగ్యులు” వంటి కొన్ని అభిప్రాయాల విషయంలో చర్చకు అవకాశం ఉంది. భక్తిరసానుభవం లేని నటులు కూడా భక్తిరసాన్ని పండించిన సందర్భాలు ఉండవచ్చు.

అంతే కాదు, అసలు సూరిశాస్త్రి గారు భక్తిరసము వంటి పదములను వాడుతున్నపుడు ఆలంకారిక నిర్వచనాలను ఎంతవరకు దృష్టిలో పెట్టుకున్నారన్న ప్రశ్న కూడా ఒకటి రావచ్చు. ఎందుకంటే వారు నాట్యాంబుజంలో చాలా చోట్ల కరుణరసం అన్న మాటను కాక శోకరసం అన్నమాటను వాడతారు. అలాగే తన గ్రంథాల ముందుమాటలలోను లోపలి పుటలలోనూ కూడా తన రచనలు శాస్త్రాధ్యయనం మీద కన్నా తన అనుభవం మీద ఎక్కువగా ఆధారపడినవని చెప్పుకున్నారు.

అయితే నాటకరంగాన్ని విస్తృతంగా పరిశీలించిన, అధ్యయనం చేసిన ఒక సహృదయ విమర్శకుడి అనుభవానికి ఉండే విలువని తక్కువగా పరిగణించలేము. ఆ అనుభవం ఆధారంగా ఆయన భక్తి కూడా రసానందాన్ని కలిగించ గలదని వ్యాఖ్యానిస్తే ఆ వ్యాఖ్యను స్వీకరించకుండా ఉండలేము..

3.1.7 అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు

నేటికాలపు కవిత్వం అనే తమ గ్రంథంలో వీరు శృంగారాన్నీ, భక్తినీ పోలుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. భక్తిని ఆత్మాశ్రయంగా చెప్పవచ్చు కానీ శృంగారాన్ని చెప్పకూడదనీ ఎందుకంటే ఆలంబనం యొక్క ఉత్తమత్వం భక్తికి ప్రధానం కాదు కానీ శృంగారానికి ప్రధానమని అంటారు (పుట 115).

పూర్వాలంకారికులు చెప్పిన తీరులోనే వీరు శృంగారాన్ని రసమనీ భక్తిని భావమనీ అన్నారు. “భగవంతుడి మీద గురువుల మీద తండ్రి మీద మిత్రుడి మీద ఉండే ప్రేమకు భావమని పేరు. అది వ్యక్తమయ్యే కావ్యం భావాత్మక కావ్యం భావకావ్యం భావధ్వని అని వ్యపదేశం పొందుతున్నది” అన్నారు (పుట 138).

అయితే శృంగారానికి ఆత్మ పరమాత్మ సంయోగం లాంటి పవిత్రతలు ఆపాదించకూడదని చెప్పే సందర్భంలో “భారతీయ సాహిత్య వేత్తలు ఆత్మల సంయోగం ప్రియులైన స్త్రీ పురుషుల విషయంలో గాక జీవాత్మ పరమాత్మల విషయంలో ప్రతిపాదించారు. అది భగవద్రతి. స్త్రీపురుషుల రతి నుండి వేరుగా నిర్వచించడానికి దానిని భావంలో చేర్చారు” అని చెప్తారు.

అంటే వీరు మమ్మటాదుల మాటలని ఉదాహరిస్తూ భక్తిని భావంగా శృంగారాన్ని రసంగా చెప్పినా, భక్తి శృంగారంలో అంతర్భవిస్తుందన్న అభిప్రాయానికి అనుకూలురుగా కనిపించరు. భక్తిని పోషించడంలోను శృంగారాన్ని పోషించడంలోను చాలా భేదముందన్న విషయాన్ని వీరు గుర్తించారు.

స్త్రీకి పురుషుడిలో పరమాత్మ దర్శనం ప్రాప్యమవడం, విషయాసక్తత నుండి దూరమవడం జరిగితే, అపుడది శృంగారమే కాదనీ దాని గురించి తాను చర్చించడం లేదనీ చెప్తూ “ఆ సందర్భంలో ఆ రతి శృంగార సంజ్ఞను వదిలి భావసంజ్ఞను పొందుతున్నది కనుక నాకు విప్రతిపత్తి లేదు. స్త్రీపురుషుల శృంగారం ఇక్కడ నాకు విచార్యవిషయం కానీ భగవద్రతి కాదు” అంటారు (పుట 188).

3.1.8 రాయప్రోలు సుబ్బారావు

రాయప్రోలు సుబ్బారావుగారు అమలిన శృంగారం అనే నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. రమ్యాలోకము, మాధురీదర్శనము అనే గ్రంథాలలో వీరు ఈ సిద్ధాంతం యొక్క లక్షణాన్ని వివరించారు. లక్ష్యాలుగా తృణ కంకణము, లలిత మొదలయిన కావ్యాలను వ్రాశారు. శారీరక సంభోగ ప్రసక్తి లేని ప్రేమను వీరు అమలినశృంగారం అన్నారు. రమ్యాలోకంలోని ఈ క్రిందిపద్యం ఆ విషయాన్ని తెలుపుతుంది.

తే.గీ.
సురతసంస్పర్శ లేని యీ శుచిమదమల
జీవితానురాగాదులన్ చిలకరించు
కానరాని శృంగార మాకర్షణ ప్ర
భావ విమలోపచార సుఖావహముగ (రమ్యాలోకము: పుట 40)

రాయప్రోలు సుబ్బారావుగారి రచనలపై పరిశోధన చేసిన లావణ్య సరస్వతిగారు ఈ అమలిన శృంగార సిద్ధాంతానికి భక్తిరస సిద్ధాంతంతో కొంత పోలిక కనబడే అవకాశం ఉందంటారు. “వైష్ణవ సంప్రదాయంలో భక్తి” అనే శీర్షిక క్రింద రూపగోస్వామి, మధుసూదన సరస్వతులు ప్రతిపాదించిన భక్తిరస సిద్ధాంతాన్ని వివరించి, “దైహిక సుఖాలకు ప్రాధాన్యం లేని అన్ని ప్రేమలు శృంగారంలో అంతర్భూతమవుతాయన్న రాయప్రోలువారి సిద్ధాంతానికి ఈ భక్తిసిద్ధాంతం కొంత ఆలంబనం అయిఉంటుందని ఊహించవచ్చు” అంటారు (పుట 315).

రాయప్రోలు సుబ్బారావుగారు శృంగార శబ్దాన్ని ప్రేమ అనే పదానికి సమానార్థకంగా గ్రహించినట్లు తోస్తుందని, ప్రేమ శృంగార శబ్దాలను పర్యాయ పదాలుగా ప్రయోగించినట్లు కనిపిస్తుందని అంటారు సరస్వతిగారు. రాయప్రోలు వారి సిద్ధాంతాన్ని అలంకార కౌస్తుభంలో కవికర్ణపూరుడు చేసిన “ప్రేమ అంగి, శృంగారము అంగము” అన్న ప్రతిపాదనతో పోలుస్తారు (పుట 323). అందుకు ఈ క్రింది పద్యం ఆధారం.

తే.గీ.
స్నేహ సురత వాత్సల్యముల్ జీవితమున
ప్రేమకంగంబులగు, అంగి ప్రేమ యొకడె;
ప్రేమ శిఖరారోహణాభిజ్ఞులయిన
మృదు సహృదయుల కివియెల్ల మెట్టులగును (రమ్యాలోకము: పుట 34)

రాయప్రోలు వారి సిద్ధాంతం ప్రకారం స్నేహ వాత్సల్యాలు కూడా శృంగార శాఖలే అని ఈ పద్యం ద్వారా అర్థమవుతుంది. మరొక పద్యంలోని “శృంగార శాఖలయిన స్నేహవత్సలాదులు” అన్న మాట కూడా ఆ విషయాన్నే తెలియచేస్తుంది. అయితే రాయప్రోలు వారి ప్రతిపాదనకు ఆలంకారికులు చేసిన రసచర్చతో ఎంతవరకు నిమిత్తం ఉంది అన్న విషయం మనకు ఈ క్రింది పద్యంలో అర్థమవుతుంది.

తే.గీ.
స్థాయి రతిలేని బహ్వవస్థల రుచించు
ఆప్తశృంగారమును భావమనిరి; కాని
మూఢమగుటయు రసము సంభోగమున, వి
యోగమందు ఉవ్విళ్ళూర్చి లాగ గనమె (రమ్యాలోకము: పుట 41)

ఆలంకారికులు ఆప్తశృంగారాన్ని భావమని అన్నప్పటికీ నిజానికి సంభోగ శృంగారాని కంటే దైహిక స్పర్శ లేని ఆప్తశృంగారమే బలవత్తరమన్నది రాయప్రోలు వారి అభిప్రాయమని మనకు ఈ పద్యం అర్థం చేస్తుంది. సుబ్బారావుగారు అమలినశృంగారానికి చెప్పిన లక్షణంలో భక్తిని ప్రత్యేకంగా పేర్కొనలేదు కానీ రమ్యాలోకం చివరి పద్యంలో గోపికా కృష్ణుల ప్రేమనే ఉదాహరిస్తూ గ్రంథాన్ని ముగించారు.

తే.గీ.
అతిబలాత్కార రక్తలై, యదుకిశోరు
పరమ సౌందర్య మహిమ కవశ్యలయిన;
గొల్లభామల లీలలన్ గోచరించు
నీ యబోధ శృంగారమే యిగురువోసి (రమ్యాలోకము: పుట 42)

3.1.9 రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు రసమును గురించి మాట్లాడుతూ “ఏ భావములైనను వాని తీక్ష్ణదశలో నవిదిత వేద్యాంతరముగా ననుభవింప గల్గుదుమేని, యానందస్వరూపములై రసశబ్ద వాచ్యములగును” అంటారు. “జుగుప్సాభక్తివాత్సల్యాదులు గూడ రసములేయని వాదించువారు మనలో లేకపోలేదు. తర్కశాస్త్రము నోరు మూసినను హృదయమును మూయజాలదు” అంటూ రసశబ్దాన్ని గురించి, రససంఖ్య గురించి, కావ్యంలో రసనిర్వహణకు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి వివరంగా చెప్తారు “ఆంధ్ర వాఙ్మయమున నాచన సోమనాథుని కీయదగిన స్థానము” అన్న వ్యాసంలో (సారస్వతాలోకము పుట 117,118).

“రసమనగా, మన లాక్షణికులు నియమించినట్లు శృంగారము మొదలగు తొమ్మిది భేదములే గలిగి ‘యలౌకిక చర్వణావిషయ’ మగు నొక వివరింపరాని పదార్థమని నా యుద్దేశము గాదు” అంటారు. తర్కశాస్త్ర పరాధీనులైన మన లాక్షణికులు రస శబ్దమునకు మార్గమును సంకోచపరచారన్నది తన అభిప్రాయంగా చెప్పి “కవి భావనాబలముచే తనకుఁ గలుగు వివిధములగు శోకము, మోహము, అసూయ, ద్వేషము, సంతోషము, ప్రణయము మొదలగు భావములనబడు చిత్తవికారముల మూలమున వర్ణింపవలసిన పదార్థముల స్వరూపమును నిర్ణయించి, విగ్రహమును (ఏ విగ్రహమైనను సరే) సరళమగు భాషతో దీర్చి ఎదుర నిలిపినపుడు రసానుభవ సంస్కారముగల సహృదయుల కట్టి మనోవికారములే కలిగి అవి యెట్టివైనను, శిల్పమందుగల యొకానొక యనిర్వచనీయ మహిమచే, ఆనందముగాఁ బరిణమించును” అని వివరిస్తారు. ఆ అర్థమందే రసపదమును తాను ఉపయోగిస్తున్నానని చెప్పి “అది యిన్నే విధములని పలకపై సుద్దతో వ్రాసి చూప సాధ్యము గాదు” అని స్పష్టం చేస్తారు. ఈ వాక్యాలను గమనిస్తే, రసములు తొమ్మిదికే పరిమితం కాదనీ, భక్తి కూడా రసము కావచ్చుననీ, అందుకు సహృదయమే ప్రమాణమనీ అనంతకృష్ణశర్మగారు భావించారని అర్థమవుతుంది.

(సశేషం)

Exit mobile version