Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-5

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 2 – మొదటి భాగం

తెలుగు ఆలంకారికులు – భక్తి

తెలుగులో వచ్చిన లక్షణ గ్రంథములలో ఛందస్సుకు సంబంధించినవి ఎక్కువ. ఆ తర్వాతి స్థానంలో వ్యాకరణమునకు సంబంధించిన గ్రంథాలు ఉంటే, వాటి తర్వాతి స్థానంలో అలంకార విషయ సంబంధమైన గ్రంథాలు ఉన్నాయి.

సంస్కృతాలంకార గ్రంథాలను పలువురు పండితులు తెలుగులోకి అనువదించారు. కావ్యాదర్శం, కావ్యప్రకాశం, ధ్వన్యాలోకం, సాహిత్యదర్పణం, రసగంగాధరం, చంద్రాలోకం మొదలైన గ్రంథాలన్నీ తెలుగులోకి అనువదించబడినాయి. వాటన్నిటి గురించి గత అధ్యాయంలో చెప్పుకున్నాము కనుక ఇక్కడ మళ్ళీ వాటిని గురించి ప్రస్తావించడం లేదు.

అయితే సంస్కృత గ్రంథాలకు అనువాదాలుగా వ్రాయబడిన వాటిలో భానుదత్తుని రసమంజరి ఒకటి. ఇది చాలామంది పండితులచే తెలుగులోకి అనువదించబడింది. ఇంతకు ముందరి అధ్యాయంలో సంస్కృత అలంకార గ్రంథాలను గురించి చెప్పుకున్నపుడు భానుదత్తుని రసతరంగిణి గురించి చెప్పుకున్నా, రసమంజరి గురించి చెప్పుకోలేదు. కనుక రసమంజరి అనువాదాన్ని గురించి ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాను. అలాగే ఆంధ్రుడైన అహోబలపండితునిచే సంస్కృతంలో వ్రాయబడిన కవిశిరోభూషణము, కొల్లూరి రాజశేఖర పండితుని అలంకారమకరందము, దేవేశ్వరమహాకవి రచించిన కవికల్పలత – వీటిని గురించి కూడా ఇంతకు ముందు చెప్పుకోలేదు కనుక ఈ గ్రంథాల తెలుగు అనువాదాలను కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాను.

ఇక కేవల అనువాదాలుగా వ్రాయబడినవి కాకుండా, ఇతర సంస్కృత/ఆంధ్ర అలంకార గ్రంథాలను అనుసరించి వ్రాయబడినప్పటికీ కొంత స్వతంత్రత కనిపించే తెలుగు గ్రంథాలను ఈ అధ్యాయంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నాను.

2.1 ఆలంకారికుల అభిప్రాయాలు

2.1.1 విన్నకోట పెద్దన

14 వ శతాబ్దానికి చెందిన పెద్దన రచించిన గ్రంథం కావ్యాలంకార చూడామణి. ఇతడు నవరసవాది.

క.
క్రమమున శృంగారము హా
స్యము కరుణము వీర రౌద్ర సంజ్ఞంబులు ఘో
రము బీభత్సము నద్భుత
సమాఖ్య శాంతములు ననగ జను నవరసముల్ (2-88)

అంటూ నవరసములనే పేర్కొన్నాడు. శాంతరసమునకు శమమును స్థాయిభావంగా చెప్పి, శమమును ఈ క్రింది విధంగా నిర్వచించారు.

క.
దూరీకృత సంసార వి
కారము శమమనఁగ నిగమసారంబై పెం
పారు నదిగలిగెనేని వి
చారము గడునొప్పు నెపుడు చతురులకెల్లన్ (1-133)

అంటే ప్రధానంగా తత్త్వజ్ఞానాన్ని చెప్పారని, అభినవగుప్తుడ్ని అనుసరించారని అనిపిస్తుంది. ఇక శాంతరసానికి విన్నకోట పెద్దన ఇచ్చిన ఈ ఉదాహరణను గమనిస్తే, తత్త్వజ్ఞానంతో పాటు భక్తినీ కలిపారని అర్థమవుతుంది.

శా.
డంభాచారములుజ్జగించి రిపుగాఢ క్రీడ నిర్జించి లో
శుంభద్విద్యలఁ జేర్చి సద్గుణములన్ శోభిల్లి శక్తిత్రయా
రంభం బొప్పగ రాజయోగ విదుఁడై బ్రహ్మప్రబోధ స్థితిన్
శంభుశ్రీచరణార్చలం బ్రబలు విశ్వక్ష్మావరుండెప్పుడున్ (2-132)

2.1.2 అనంతామాత్యుడు

15 వ శతాబ్దానికి చెందిన అనంతామాత్యుడు తాను రచించిన రసాభరణములో రసములు తొమ్మిదిగా పేర్కొన్నాడు. ప్రథమాశ్వాసంలో రతిని ఈ క్రింది విధంగా నిర్వచించాడు.

క.
తరుణులుఁ పురుషులు నితరే
తర సంభోగేచ్ఛ లెలమి దలకొనగాఁ ద
త్పరమతిఁ దివురుట శృంగా
రరసజ్ఞుల మతమునందు రతియన నెగడున్ (1-4)

అక్కడ రతికి ఉదాహరణగా ఈ క్రింది పద్యాన్ని ఇచ్చారు.

ఉ.
మారుఁడు రూపవంతుఁడు హిమద్యుతి చల్లనివాఁడు రమ్యసం
చారవినోదశీలుఁడు వసంతుఁడు వెండియు సద్గుణాఢ్యులు
న్నారు మహీశులెవ్వరును నా హృదయంబున కింపు గారు నా
కోరిక సర్వసేవ్యుఁడగు గోకుల నాయకుఁడే తలోదరీ! (1-5)

ఆ తర్వాత శృంగారానికి కూడా ఉదాహరణ ఇచ్చారు.

ఉ.
శ్రీకుచకుంభకుంకుమరుచి న్మణిరోచులు వైజయంతికా
స్తోకమరీచులుం గనక శోభితవస్త్రములు న్నిజోజ్వల
శ్రీకి నవీన విస్ఫురణ జేయఁగ గోప వధూ సమేతుఁడై
గోకుల వీధుల న్మెఱయు గోపకుమారుడుదార లీలతోన్ (1-38)

ఇక్కడ రతి అనే భావానికీ, శృంగార రసానికీ కూడా శ్రీకృష్ణుని గురించిన ఉదాహరణలే ఇవ్వడాన్ని గమనించవచ్చు. నిజానికి ఈ గ్రంథంలో రత్యాది స్థాయిభావములు ఎనిమిదింటికి, శృంగారాది అష్ట రసములకు కూడా భగవత్సంబంధమైన ఉదాహరణలే ఇచ్చారు, హాస్యానికి గజాననుడు, రౌద్రానికి త్రినేత్రుడు, భయానకానికి మహాకాళి – ఈ విధంగా. ఇక శాంత రస విషయాన్ని చూస్తే శాంతరసానికి స్థాయిభావంగా చెప్పిన శమమునకు నిర్వచనమివ్వలేదు కానీ ఉదాహరణ ఇచ్చారు.

చ.
కటకట రాజ్యమంత్య నరకంబటె దేవపదంబు లన్నియుం
గుటిలనిశాటభర్జనలకు న్సదనంబటె యింక సౌఖ్య మే
మిటఁ గలదంచు సర్వమును మిథ్యగఁ జూచు బుధాళి లోని సం
కటములు బాహ్యదుర్దశలుఁ గ్రాఁగు గదాధరరక్షణంబునన్ (1-21)

ఆపైన శాంతరసానికి కూడా ఉదాహరణ ఇచ్చారు.

ఉ.
మ్రొక్కిన వెక్కిరించినను మోదిన గంధము దెచ్చి పూసినం
ద్రొక్కిన నెత్తుకొన్నఁ గృపతోఁ గుడిపించినఁ బస్తువెట్టిన
న్నిక్కును స్రుక్కులేక తరుణీజనులందును మ్రాఁకులందుఁ దా
నొక్కవిధంబ కా మెలఁగుచుండు మహాత్ములఁ జెప్ప నొప్పగున్  (1-46)

మరలా ద్వితీయాశ్వాసంలో ఇంకొంత వివరణ యిస్తూ రతియే నాయకనాయికాది పరమైనప్పుడు శృంగారమవుతుందని, దేవ గురు ద్విజాది విషయమైనపుడు భక్తి అవుతుందని, సుతమిత్రాశ్రితసోదరాది పరమైనప్పుడు వాత్సల్యమవుతుందనీ చెప్తారు.

మ.
రతి దానాయక నాయికాది పరతన్ రంజిల్లు శృంగారమై
క్షితిలో దేవగురుద్విజాది పరతం జెన్నొందు సద్భక్తియై
సుత మిత్రాశ్రితసోదరాది పరతన్ సొంపారు వాత్సల్యమై
మితి చెప్పం గలదే రసస్థితికి బేర్మిం జూడఁగా నెయ్యెడన్ (2-3)

ఇక్కడ భక్తి, వాత్సల్యం శృంగారంలో అంతర్భవిస్తాయన్నట్లుగా చెప్పకుండా విభావాలలో భేదాలను బట్టి రతి అనే స్థాయిభావం శృంగార, భక్తి, వాత్సల్యాలుగా భాసిస్తుందని చెప్పడం కనిపిస్తుంది. దీనిని బట్టి భక్తినీ వాత్సల్యాన్ని శృంగారం కంటే భిన్నమయిన రసములుగానే భావించినట్లు అనిపిస్తుంది. ఈ వివరణ తర్వాత “ఇట్టి శృంగార భక్తి వాత్సల్యంబుల కుదాహరణము” అని వచనంలో స్పష్టంగా చెప్పి ఈ క్రింది శార్దూల పద్యాన్ని ఇచ్చారు.

శా.
ప్రేమం జూచిరి ప్రాణనాథుఁడనుచున్ బింబాధరీ రత్నముల్
స్వామిత్వ ప్రణిపత్తిమైఁ గొలిచిరోజం బౌరలోకంబు చే
తోమోదంబునఁ బుత్రభావనఁ గడుం దోతేర నంతన్ ఘన
శ్రీమీఱ న్వసుదేవదేవకు లొగిన్ సేవించిరా వెన్నునిన్ (2-5)

2.1.3 భట్టుమూర్తి

భట్టుమూర్తి రచించిన అలంకారగ్రంథం కావ్యాలంకారసంగ్రహం. దీనినే నరసభూపాలీయమని కూడా అంటారు. కావ్యాలంకారసంగ్రహం సంస్కృతాలంకార గ్రంథమైన ప్రతాపరుద్రీయమును అనుసరించి వ్రాయబడినదిగా కనిపించినా కొన్ని భేదములు కూడా ఉన్నాయి.

కావ్యాలంకారసంగ్రహం తృతీయాశ్వాసంలో భట్టుమూర్తి “ధర శృంగారము హాస్యము కరుణయు వీరము భయానకము బీభత్సంబురురౌద్ర మద్భుతము శాంతరసంబును రసములనఁగఁ దనరుం గృతులన్” అని నవరసములను పేర్కొన్నాడు (3-6). “రతిహాస శోక యత్నము లతిభీతి జుగుప్స రోష మచ్చెరువు శమం బతుల క్రమమున నివి సాంప్రతము రసస్థాయిభావభావనఁ జెందున్” అంటూ తొమ్మిది స్థాయిభావములను చెప్పాడు (3-7).

పంచమాశ్వాసంలో అలంకారాలను చెప్తున్నపుడు రసవత్, ప్రేయో, ఊర్జస్వి, సమాహిత అలంకారాలను పేర్కొన్నాడు కానీ వాటికి లక్షణాలను ఉదాహరణలను ఇవ్వలేదు. అయితే అక్కడ “రసవత్ప్రేయము లూర్జస్వి సమాహితములు నిచట వివరింపఁగ లే/దసమరసప్రకరణమున రసభావాద్యుపనిబద్ధ రసములు గానన్” (5-230) అనడం ఆ అలంకారములను రసములుగానే భావించాడనీ, ప్రేయోరసమును ఒప్పుకున్నాడనీ అనుకోవడానికి అవకాశమిచ్చేలా ఉంది.

2.1.4 కాకునూరు అప్పకవి

17 వ శతాబ్దానికి చెందిన అప్పకవి తాను రచించిన లక్షణ గ్రంథం అప్పకవీయంలోని ప్రథమాశ్వాసంలో “స్థాయిభావంబులన రోష శమ జుగుప్సా భయోత్సాహ శోక హాస విస్మయ రతులనఁగఁ దొమ్మిది యొప్పు నవరసోదయ కారణంబులగుచుఁ” అంటూ స్థాయిభావములను (1-37), “గరిమ నా రసము శృంగారంబు హాస్యంబు రౌద్రము కరుణ వీరంబు నద్భుతంబు బీభత్సంబు దారుణంబును శాంతమును నాఁగ నవవిధంబుల మెలంగు” (1-38) అంటూ నవరసములను పేర్కొన్నాడు. ఇక్కడ స్థాయిభావంగా రోషమును పేర్కొనడం కనిపిస్తుంది. అయితే తర్వాత నవరసముల గూర్చి వివరంగా చెప్పేటపుడు “క్రోధంబు రౌద్రరూపము దాల్చె”(1-39) అనే అన్నారు. భక్తిని గురించిన అభిప్రాయాలేమీ ఈ గ్రంథంలో కనిపించవు.

2.1.5 వెణుతుర్ల వడ్డికవి

శృంగార రసాలవాలము అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించిన ఈతని దేశ కాలముల గురించి తెలుసుకోవడానికి తగిన ఆధారాలు లేవు. ఈయన తన గ్రంథాన్ని పూర్వకవుల గ్రంథాలను అనుసరించే వ్రాశానని చెప్పాడు. అయితే కొంత స్వతంత్రత కూడా కనిపిస్తుంది. జుగుప్సకు “ఆజి బలవంతు చేతఁ జీకాకు నొంది రోయుట” అని లక్షణం చెప్పడం, లక్ష్యంగా కృష్ణుని చేత పరాజితుడయిన రుక్మిని చూపడం వంటివి అటువంటి స్వతంత్రతకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు (ఆంధ్రాలంకార వాఙ్మయ చరిత్ర, పుట 33).

రససంఖ్య విషయానికి వస్తే ఇతడు రసములు తొమ్మిదనే పేర్కొన్నాడని తెలుస్తున్నది. అయితే తన గురించి, తన వంశనామము వంటి విషయాల గురించి చెప్పుకున్న ఒక పద్యం “శ్రీరఘువీర భక్తిరససింధు విహారుఁడ” అంటూ మొదలవుతుంది. మామూలుగా అయితే సాహితీవేత్తలయినవారు కూడా రసము, భావము వంటి పదాలను ఆలంకారిక నిర్వచనాలను పరిగణనలోకి తీసుకోకుండా వాడటం జరుగుతూనే ఉంటుంది, కానీ ఇది ఒక లక్షణ గ్రంథం కనుక కవి తన గురించి చెప్పుకున్న పద్యమే అయినప్పటికీ ఇక్కడ వాడిన “భక్తిరసం” అన్న మాటను తేలికగా తీసుకోలేమని అనిపిస్తుంది. భక్తికి రసత్వం ఉంటుందన్న అభిప్రాయం ఎంతో కొంత లేకుండా ఈ పదం వాడి ఉండరని అనిపిస్తుంది. తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారు కూడా తమ సిద్ధాంతగ్రంథంలో వీరి గురించి చెప్తూ “తాను శ్రీరఘువీర భక్తిరస సింధువిహారునని భక్తిరసమును పేర్కొని వాచ్యము చేసినాడు” అని అన్నారు (పుట 400).

2.1.6 పుట్రేవు నాగభూషణం

నాగభూషణంగారు “రసభావనాయికా సంప్రదాయము” అనే తమ గ్రంథంలో రసములను, భావములను, నాయికా నాయక భేదాలను వివరించారు. రసములను తొమ్మిదిగా పేర్కొన్న వీరు స్థాయిభావములను మాత్రం ఎనిమిదింటినే చెప్పారు. శాంతికి స్థాయిభావాన్ని చెప్పలేదు. శృంగారాది అష్టరసాలకు స్థాయిభావాలను లక్షణాలను చెప్పిన తర్వాత చివరిగా శాంతరసాన్ని గురించి “అకళంకమైనది గనుక రసికులీ రసమును స్వజ్ఞాన విశేషంబుచే నెఱుంగునది” అని మాత్రమే చెప్పారు (పుట 7).

2.1.7 నీడామంగళం తిరువేంకటాచార్యులు

వీరు భరతరసప్రకరణం అనే గ్రంథాన్ని రచించారు. సాహిత్య చింతామణి, ప్రతాపరుద్రీయం, రసార్ణవ సుధాకరం మొదలైన గ్రంథాల నుంచి ముఖ్యమైన విషయాలను ఎత్తి కూర్చి వాటికి తెలుగులో అర్థం వ్రాసి భరతరసప్రకరణం అనే పేరుతో ప్రచురించామని గ్రంథారంభంలో చెప్పారు. వీరు శాంతరసాన్ని పేర్కొనలేదు. శృంగారాది అష్టరసములను, వాటి స్థాయిభావాలను పేర్కొన్నారు. “రతి, ఉత్సాహము, శోకము, విస్మయము, హాసము, భయము, జుగుప్స, క్రోధము – ఇవి నాట్యమందుఁ జెప్పఁబడినవి” అనడాన్ని బట్టి ఈ గ్రంథంలోని విషయాలు శ్రవ్యకావ్యాన్ని కాక నాటకాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినవిగా కనిపిస్తాయి (పుట 55). శృంగార రస స్థాయిభావమైన రతిలో ప్రేమ, మానము, ప్రణయము, స్నేహము, రాగము, అనురాగము అనే ఆరు భేదాలను వాటి లక్షణాలతో సహా చెప్పారు. ఈ ఆరింటి లక్షణాలూ కూడా నాయికానాయకుల పరంగానే చెప్పబడినాయి.

ఈ గ్రంథంలో భక్తిని గురించిన ప్రస్తావన లేదు. అయితే రతిలో చివరి భేదమైన అనురాగానికి లక్షణం చెప్తూ “కొందఱు ప్రీతిని రతిభేదమని చెప్పుదురు” అన్నారు (పుట 59).

2.1.8 వేదం వెంకటరాయ శాస్త్రి

రసమంజరిని వేదం వెంకటరాయ శాస్త్రిగారే కాక గణపవరపు వేంకటకవి, గుడిపాటి కోదండకవి, అమరవాది నీలకంఠ సోమయాజి, తాడూరి లక్ష్మీనరసింహరావు వంటి పలువురు పండితులు అనువదించారు.

రసమంజరి ప్రధానంగా శృంగార రస స్వరూపాన్ని చెప్పే గ్రంథం. ఇందులో వివిధ శృంగార నాయికా నాయకుల లక్షణాలను వివరిస్తున్నపుడు కొన్నిచోట్ల శివపార్వతులను, రాధాకృష్ణులను, గోపికా కృష్ణులను ఉదాహరణగా చూపారు. అయితే అవి కేవలం నాయికా నాయక భేదాల వంటి పరిమిత అంశాలను వివరించడానికి ఉద్దేశించిన లక్ష్యాలు కనుక వాటి ఆధారంగా రస నిర్ణయం చేయడం కష్టం. అంటే అవి శృంగారరసాన్ని పండిస్తున్నాయా లేక భక్తినా అన్న విషయాన్ని చెప్పడం సాధ్యం కాదు. అయితే గ్రంథాంతంలో “సాక్షాద్దర్శనానికి” ఉదాహరణగా ఇచ్చిన పద్యాన్ని మాత్రం చెప్పుకోవాలి. స్వప్నదర్శనం, చిత్రదర్శనం, సాక్షాద్దర్శనం అని దర్శనం మూడు విధాలు. వీటిలో సాక్షాద్దర్శనానికి భానుమిశ్రుడు సంస్కృతంలో కృష్ణునికి సంబంధించిన ఉదాహరణనే ఇచ్చాడు.

చేతశ్చఞ్చలతాం త్యజ; ప్రియసఖి వ్రీడే; న మాం పీడయ
భ్రాతర్ముఞ్చ దృశౌ నిమేష, భగవన్ కామ; క్షణం క్షమ్యతాం
బర్హం మూర్ధని కర్ణయోః కువలయం వంశం దధానః కరే
సోఽయం లోచనగోచరో భవతి మే దామోదర స్సుందరః

దీనికి వెంకటరాయశాస్త్రిగారు ప్రతిపదార్థాన్ని, వచనంలో తాత్పర్యాన్ని ఇచ్చారు. నీలకంఠ సోమయాజి గారు చంపకమాలా వృత్తంలో ఈ క్రింది విధంగా చెప్పారు (నీలకంఠ సోమయాజి : పుట 59).

శిరమునఁబింఛమున్ శ్రుతుల జెన్నగు కల్వయుఁ జేత వేణువున్
నరగ ధరించి సుందరుఁడు నాకగుపించుచునుండెఁ గృష్ణుఁడే
డ్తెఱ మనమా! చలింపకుమ తిప్పలు పెట్టకు నన్ను వ్రీడ సో
దరుడ నిమేష! వీడుకనుదమ్ము లనంగ నిమేషమోర్చుమా

ఈ ఉదాహరణలో మాత్రం అటు సంస్కృతంలోనూ ఇటు తెలుగులోను కూడా భక్తి ప్రధానంగా కనబడుతోంది. వేంకటరాయశాస్త్రిగారు కూడా దీనికి ఇచ్చిన వివరణలో “దామోదరుఁడు అనుటచే యశోద ఈయన కడుపునకు త్రాడు చుట్టి ఈయనను ఱోటికి కట్టివేయుట లోనగునద్భుత వృత్తాంతస్మరణము సూచితము. దానిచే ఇంతకు ముందు అమితముగా శ్రవణ గోచరుఁడైన మహానుభావుడని సూచన. శ్రుతపూర్వుడు గావుననే “సోఽయం” అనుట. ఇట సాక్షాత్కారమును వర్ణించినాఁడు” అన్నారు (వెంకటరాయశాస్త్రి: పుట 142). అంతేకాదు, “ఏతద్గ్రంథ రచనా రూపోపాసనకు మెచ్చి శ్రీకృష్ణభగవంతుడు దర్శనమిచ్చినట్లు చమత్కారము” అంటూ భక్తినే ప్రధానంగా చెప్తూ ముగించారు (వెంకటరాయశాస్త్రి : పుట 143).

2.1.9 కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు

సంస్కృతంలో దేవేశ్వరమహాకవి రచించిన “కవి కల్పలత” కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారి ఆంధ్ర వివరణతో ప్రకటించబడింది. ఇందులో ప్రత్యేకించి రసముల గురించి కానీ రససంఖ్య గురించి కానీ వివరణలేమీ లేవు. పదసంఘటనము, వర్ణనా విధానము వంటి వాటిని వివరిస్తున్నపుడు సుబ్రహ్మణ్య దీక్షితులు రసముల గురించి ప్రస్తావించడం కనిపిస్తుంది కానీ అందులో భక్తిని గురించిన ప్రస్తావన ఏమీ లేదు.

2.1.10 సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి

సన్నిధానము సూర్యనారాయణశాస్త్రిగారు రామరాజభూషణుని కావ్యాలంకార సంగ్రహానికి వివరణ వ్రాశారు. రససంఖ్యను గురించి కావ్యాలంకార సంగ్రహంలో ఉన్న అంశాలను అభిప్రాయాలను ఈ అధ్యాయంలో పైన చెప్పుకున్నాము కనుక ఇక్కడ సూర్యనారాయణశాస్త్రిగారి వివరణను మాత్రం పేర్కొంటున్నాను. వీరు మూలంలో ఉన్న విషయాలకంటే అదనంగా కొన్ని విషయాలు చెప్పారు. కొందరు ఆలంకారికులచే ప్రతిపాదించబడిన ప్రేయో, వత్సల, భక్తి, మాయా రసములను గురించి వాటిపై ఇతర ఆలంకారికుల అభిప్రాయాలను గురించి వివరంగా తెలియచేశారు.

భక్తిరసం గురించి చెప్తున్నపుడు అక్కడ అభినవగుప్తుడు, జగన్నాథుడు మొదలైన వారందరి అభిప్రాయాలను చెప్పాక రూపగోస్వామి, మధుసూదన సరస్వతి చేసిన ప్రతిపాదనలను వివరించారు. రూపగోస్వామి చేసిన భక్తిరస ప్రతిపాదన గురించి చెప్పి “ఇది నిజముగా భక్తి కాదు. భక్తిలో నేకదేశము” అన్నారు. ఆ తర్వాత, “కాని మధుసూదనసరస్వతి తన భగవద్భక్తి రసాయనమను గ్రంథమునఁ బ్రతిపాదించిన భక్తి సంపూర్ణమయినది, ఉదాత్తము. అతఁడు ప్రమాణ ప్రమేయోపన్యాసపూర్వకముగా భక్తికి రసత్వమును స్థాపించెను” అని చెప్పి ఆపైన మధుసూదనసరస్వతి సిద్ధాంతాన్ని వివరించారు (పుట 315). దీనిని బట్టి సూర్యనారాయణశాస్త్రిగారు మధుసూదనసరస్వతి సిద్ధాంతాన్ని ప్రమాణపూర్వకంగా ఉన్నట్లే భావించారని తెలుస్తున్నది. వ్యభిచారిభావాలను వివరిస్తున్నపుడు మమ్మటుడు, జగన్నాథుడు మొదలైన వారి వ్యాఖ్యలను ఉదాహరించి, పూర్వాలంకారికులు దేవాదివిషయకరతిని వ్యభిచారిభావంగా పరిగణించారని తెలియచేశారు. పంచమాశ్వాసంలో రసవత్ ప్రేయోలంకారాదులను గురించి మూలంలో ఉన్నదానినే చెప్పారు. అధికంగా వివరణ ఏమీ ఇవ్వలేదు.

కావ్యాలంకార సంగ్రహం మూలంలో ఒక్క శృంగారరసాన్ని మాత్రమే విభావానుభావ సంచారిభావాలతో వివరించారు. వివరణగ్రంథంలో సూర్యనారాయణశాస్త్రిగారు తృతీయాశ్వాసం తర్వాత చేర్చిన అనుబంధంలో మిగిలిన రసములను కూడా విభావాదులతో వివరించారు. అక్కడ శాంతరసాన్ని వివరిస్తూ శాంతమునకు శమము స్థాయిభావమని, నిర్వేద హర్ష స్మృతి మత్యాదులు వ్యభిచారిభావాలని చెప్పారు.

క.
విడిది నికుంజాంతరములఁ
బడక శిలాతలములందుఁ బ్రాశము బిసముల్
మడుఁగులు నారలుకాఁగాఁ
గడఁగిరి తపమునకు నియతగతి నాభ్రాతల్

అన్న పద్యాన్ని శాంతమునకు ఉదాహరణగా ఇచ్చారు. పద్యాన్ని వివరిస్తూ “ఇట స్థాయిభావమగు నిర్వేదము పుష్టమై శాంతరసమగుచున్నది” అన్నారు (పుట 444). లక్షణంలో శమము స్థాయి అని నిర్వేదం వ్యభిచారి అని చెప్పి, ఉదాహరణను వివరిస్తున్నపుడు నిర్వేదాన్ని స్థాయి అనడం గమనించవలసిన అంశం.

2.1.11 చలమచర్ల రంగాచార్యులు

వీరు అలంకార వసంతమనే గ్రంథాన్ని రచించారు. అర్వాచీనములయిన కావ్య మీమాంసా గ్రంథములలో అలంకారములను మాత్రమే చెప్పిన గ్రంథములు అరుదు కనుక అలంకార జిజ్ఞాసువులకు ఉపకరించే విధంగా ప్రాచీన నవ్యాలంకారాల సమన్వయంగా ఈ గ్రంథం వ్రాయబడిందని అవతారికలో రంగాచార్యులు గారు వివరించారు. ఈ గ్రంథంలో వీరు ఉపమాది అర్థాలంకారాలతో పాటు రసవత్తు, ప్రేయము, ఊర్జస్వి, సమాహితము, భావోదయం, భావసంధి, భావశబలత అనే అలంకారాలను కూడా వివరించారు. ప్రేయోలంకారానికి వీరు చెప్పిన లక్షణమును, ఉదాహరణను గమనించవలసి ఉంది. “ప్రధానరసమునకు భావము అంగమగునెడల ప్రేయోలంకారమగును” అని ప్రేయోలంకారం యొక్క స్వభావాన్ని చెప్పి ఈ క్రింది పద్యాన్ని ఉదాహరించారు. (పుట 94).

సీ.
మంగళసరయూ తరంగిణీ శీకర
శీతలవాతముల్ చెలగుచుండ
అశ్రుధారామాలికాలంకృతాస్యుండు
మారుతి పాదపద్మములు గొల్వ
పరతత్త్వవేదులు బ్రహ్మవాదులు చిత్త
మిగురెత్త నిజతత్త్వ మెంచుచుండ
శ్రుత్యర్థములువోలె సొంపైన పీఠాన
వైదేహిరాములు వఱలుచుండ
తే.
నిలిచి నోరార రఘుపతీ! నీరజాక్ష!
యంచు నుతియించు భాగ్యము లమరునెపుడొ!
రమ్యగుణధామ! సజ్జనారామసీమ!
విశ్వనుతనామ! గోపాలపేటరామ!

ఈ పద్యాన్ని వివరిస్తూ రంగాచార్యులు గారు “నిరస్త లౌకికవృత్తుఁడగు నొక భక్తుఁడు సకల జగదభిరాముఁడగు శ్రీరామచంద్రుని సన్నిధానమెప్పుడుగల్గునా! యని ఆ భగవత్పరిసర సన్నివేశములను మనసున భావించుచున్నాఁడు. ఇది శాంతరసము” అన్నారు. అయితే ఆ శాంతరసానికి “ఆ భగవంతుని నుతించు భాగ్యములమరునెపుడొ” అన్న “చింత” అనే భావము అంగమైంది కాబట్టి ఇది ప్రేయోలంకారమని సమన్వయించారు. ఇది ఒప్పుకోదగిన విషయంగా కనిపించడం లేదు.

ఈ మూడు విషయాలనూ పరిగణనలోకి తీసుకున్నపుడు శాంతరసమునకు లక్ష్యములు ఇవ్వవలసి వచ్చిన సందర్భాలన్నిటిలోనూ ఆలంకారికులు ఎంతోకొంత సందిగ్ధతకు తావిస్తున్నారనీ, మరిముఖ్యంగా భక్తిని కలపకుండా శాంతరసానికి ఉదాహరణలు ఇవ్వడం అసలెక్కడా కనిపించడంలేదనీ అర్థమవుతుంది.

(సశేషం)

Exit mobile version