Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-4

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 1- మూడవ భాగం

లాగే ఈ అధ్యాయంలో పైన భరతుని అభిప్రాయాన్ని పేర్కొన్నపుడు శాంతరసాన్ని సమర్థించే మరొక వాదనను చెప్పుకున్నాం. “నాట్యం తపస్వులకు కూడా విశ్రాంతి జనకమని, బ్రహ్మర్షులకు కూడా చూడదగినదని” చెప్పే శ్లోకాల ఆధారంగా భరతుడు శాంతరసానికి అనుకూలుడేనని చెప్పడం ఉంది. అయితే శాంత రసానికి అనుకూలంగా చేసే ఈ వాదన అంతా భక్తిరసానికి కూడా వర్తిస్తుంది. అంటే ఈ వాదనలో శాంతరసం అని ఉన్న చోట ఆ పదాన్ని తీసివేసి భక్తిరసం అన్న పదాన్ని చేర్చినా కూడా ఆ వాదన సముచితంగానే అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే, “బ్రహ్మర్షులకు కూడా విజ్ఞేయము” అన్నమాట నిజానికి శాంతి కన్నా భక్తికే ఎక్కువగా సరిపోతుంది. ఈ వాక్యం శాంత రసాన్ని కాక భక్తిరసాన్ని సమర్థించేదిగా ఉంది అనడానికి రెండు కారణాలు చూపవచ్చు.

మొదటి కారణం:

శాంతరసం ఇచ్చే ఆనందాన్ని బ్రహ్మర్షులు ఒక దృశ్య కావ్యం నుండో శ్రవ్య కావ్యం నుండో పొందరు. అది నిరంతరం వారితోనే ఉంటుంది. శాంత రసానందాన్ని పొందడానికి వారు ప్రత్యేకించి మళ్ళీ ఏమీ చేయనక్కర లేదు. కానీ భక్తి రసం అలా కాదు. భక్తిరసానందాన్ని అనుభవించేవారు ఆ అనుభవం కోసం మరల మరలా కీర్తనాదులు చేస్తారు. భగవంతుని లీలలను కథలను పదే పదే చెప్పుకుంటారు. అలా చెప్పుకోవడం ద్వారా, పఠించడం ద్వారా, వినడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. బ్రహ్మర్షి అనగానే స్ఫురించే నారద మునీంద్రుల దగ్గర నుంచి ఇప్పటి కాలానికి చెందిన శంకరాచార్యులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వంటివారి వరకూ ఎవరి కథలనూ చరిత్రనూ గమనించినా ఈవిషయం అర్థమవుతుంది. భక్తి శాస్త్రం అని పేర్కొనదగిన శివానందలహరిలోని ఈ శ్లోకం చూడండి.

కంచిత్కాల ముమా మహేశ! భవతః పాదారవిందార్చనైః
కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్కథా కర్ణనైః
కంచిత్కంచి దవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం
యః ప్రాప్నోతి ముదాత్వదర్పిత మనాః జీవన్సముక్తః ఖలు (81)

కొంతసేపు ఉమామహేశుని పాదార్చనలో, కొంచెం సేపు ధ్యానంలో, కొంచెం సేపు నమస్కరించడంలో, మరికొంత సేపు శివుని కథలను వినడంలో, ఆయన రూపాన్ని చూడడంలో, కీర్తించడంలో జీవన్ముక్తుడైన భక్తుడు పొందే ఆనందాన్ని చెప్తున్నారు శంకరులీ శ్లోకంలో.

ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కానీ నేనిక్కడ రెండు మూడు మాత్రమే ప్రస్తావిస్తున్నాను.

ఆంధ్ర మహా భాగవతాన్ని తీసుకుంటే, అందులో “నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండును నైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె?” (1-138) అన్న శౌనకుడి ప్రశ్నకు సూతుడు ఇచ్చే సమాధానం చాలా ప్రసిద్ధం.

ధీరులు నిరపేక్షులు నాత్మారాములునైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు నారాయణుఁ డట్టి వాఁ, డనవ్యచరిత్రా! (1-139)

ఇక్కడ ధీరులు, నిరపేక్షులు అనడం ద్వారా అటు బాధలూ ఇటు కోరికలూ కూడా లేనివారన్న విషయం స్పష్టమవుతోంది. అటువంటి వారు కూడా నిష్కారణంగా హరిభజన ఎందుకు చేస్తారంటే, “నారాయణుడట్టి వాడు కనుక” అంటూ ఆత్మారాములైన మునులు కూడా నారాయణుని కథలను మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడంలో ఆనందాన్ని పొందుతారన్న విషయాన్ని పోతన గారు చమత్కారంగా చెప్పారు. అలాగే మరొక ప్రసిద్ధ గ్రంథమైన నారాయణీయంలోని ఈ క్రింది శ్లోకంలో “నిస్పృహైశ్చోపగీతం” అన్నమాట చెప్పేదీ అదే భావం.

ఐశ్వర్యం శఙ్కరాదీశ్వరవినియమనం విశ్వతేజోహరాణాం
తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతమ్ ।
అఙ్గాసఙ్గా సదా శ్రీరఖిలవిదసి న క్వాపి తే సఙ్గవార్తా
తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్ఛబ్దముఖ్యాశ్రయోఽసి ॥ ( 1-10)

ఇలా నిర్వాణ తత్పరులు నిరపేక్షులు అయిన వారు, సాక్షాత్తు శుకయోగి వంటివారు కూడా భక్తిరసాస్వాదన కోసం కావ్యాలాపన చేస్తారని చెప్పడానికి మనకి ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి కానీ, శాంతరసాస్వాదన కోసం ముముక్షువులు “కావ్యపఠనం” చేస్తారనీ, చేశారనీ చెప్పే ఉదాహరణలు ఎక్కడా దొరకవు.

రెండవ కారణం:

భరతునిచే చెప్పబడిన “నాట్యం బ్రహ్మర్షులకు కూడా విజ్ఞేయము” అన్నమాట శాంతరస సమర్థనకు దోహదం చేయదని చెప్పడానికి మరొక ముఖ్యమైన కారణం కూడా కనబడుతుంది. రససిద్ధాంతం ప్రకారం రసత్వమును పొందాలంటే, స్థాయిభావం మొదట విభావాదులచే ప్రబుద్ధమై వ్యభిచారులచే పరిపుష్టమవాలి. కానీ బ్రహ్మర్షులలో శమము అనే స్థాయిభావము ఎప్పుడూ ప్రబుద్ధమయ్యే ఉంటుంది. దానిని విభావాదులచే ప్రబుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అందువలన బ్రహ్మర్షులు నాట్యం ద్వారా శాంతరసానుభవాన్ని పొందుతారని చెప్పడం పొసగదు.

కాబట్టి బ్రహ్మర్షులకు కూడా నాట్యం చూడదగినది అన్న భరతుని మాటనీ, నాట్యం ద్వారా వారు పొందేది శాంతరసం కాక పోవచ్చునన్న పై వాదననీ కలిపి ఆలోచిస్తే – శృంగారాది అష్ట రసాల కోసం నాట్యం బ్రహ్మర్షులకు విజ్ఞేయమవుతుందని చెప్పడం అసలు పొసగదు కాబట్టి, ఇక నాట్యం వలన బ్రహ్మర్షులు పొంద గలిగేది భక్తిరసం మాత్రమేనని అనుకోవలసి వస్తుంది. భక్తిరసానికి తప్ప మరిక ఏ రసానికీ ఆ అవకాశం లేదు కనుక నాట్యం “నానాభావోప సంపన్నమని, బ్రహ్మర్షులు కూడా చూడదగిన”దని చెప్పిన భరతుడు భక్తిరసానికి అనుకూలుడేనని భావించవలసి ఉంటుంది.

ఈ విధంగా పరిశీలించినపుడు భరతుడు, ఆనందవర్ధనుడు చెప్పిన విషయాలపై అభినవగుప్తుడు అందించిన వ్యాఖ్యానములు కానీ, ఇతర వాదనలు కానీ భక్తిరస ప్రతిపాదనకు బాధకాలుగా కాక సాధకాలుగానే ఉండడం కనిపిస్తుంది.

1.2.4 రససంఖ్యకు సంబంధించి నూత్న ప్రతిపాదనలు చేసినవారు

ఇంతకు మునుపు చెప్పుకున్నట్లు అభినవగుప్తునిచే సమర్థించబడిన నవరసములనే ఆలంకారికులందరూ సామాన్యంగా అంగీకరించారు. అయితే వాటికి అదనంగా ఇతర రసముల ప్రస్తావన చేసినవారు కూడా కొందరు ఉన్నారు. ఈ అధ్యాయంలో పరిగణించిన ముప్పై తొమ్మిది మంది ఆలంకారికులలో అటువంటివారు నలుగురు కనిపిస్తారు. రుద్రటుడు, భోజుడు, భానుదత్తుడు, విశ్వనాథుడు. వీరిలో రుద్రటుడు, భోజుడు చెప్పిన ప్రేయోరసము భక్తిరసమునకు దగ్గరగా ఉందన్న విషయం స్పష్టం. అంతేకాదు వీరిద్దరూ కూడా స్థాయిభావములుగా చెప్పబడుతున్న ఎనిమిది తొమ్మిది భావములు మాత్రమే కాక ఇతర భావములన్నీ కూడా రసస్థితిని అందుకోగలవని అభిప్రాయపడినవారే.

భానుదత్తుడు ప్రతిపాదించిన మాయారస సిద్ధాంతంలో కొంత అస్పష్టతా అసమంజసత్వమూ ఉన్నాయి. అందుకే అది ఇతర ఆలంకారికులచే అంగీకరించబడలేదు. అయితే ప్రవృత్తి నివృత్తి అంటూ భానుదత్తుడు చేసిన విభజన ఒకరకంగా ద్వైత అద్వైత భావనలు అనే విభజనకు దగ్గరగా ఉంది. నివృత్తిలో శాంతరసం ఉంటుంది, ప్రవృత్తిలో మాయారసం ఉంటుంది అంటూ ఆయన చేసిన ప్రతిపాదనని ద్వైత అద్వైత భావనల భేదంగా అర్థం చేసుకుంటే మాయారసానికి భక్తిరసంతో పోలిక కనిపిస్తుంది. ఆవిధంగా చూస్తే భానుదత్తుని మాయారస లక్షణాలన్నీ భక్తిరసానికి దగ్గరగానే ఉన్నాయి. మిగిలిన స్థాయిభావాలన్నీ మాయారసానికి అంగాలు అవుతాయన్న వివరణ భక్తిరస లక్షణాన్ని పోలి ఉంది.

ఇక విశ్వనాథుడు దేవతావిషయక రతి భావమేనని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆ అభిప్రాయాన్ని ఒక ప్రత్యేకమైన అభిప్రాయంగా పరిగణించలేమనిపిస్తుంది. ఎందుకంటే సాహిత్య దర్పణంలోని అభిప్రాయాలను చదువుతున్నపుడు అది ఒక విషయంపై పూర్వ ఆలంకారికులు చెప్పిన అంశాలన్నిటినీ ఒకచోట చేర్చడంగా కనిపిస్తుంది కానీ ప్రత్యేకంగా తన ఆలోచనను వ్రాయడంగా కనిపించదు. అందుకే కొన్ని విషయాలలో పరస్పర వైరుధ్యము, పొసగమి, పునరుక్తులు కనిపిస్తాయి.

ఉదాహరణకు వీర రస భేదాలు చెప్పినపుడు ధర్మవీరం, దయావీరం, యుద్ధవీరం, దానవీరం అనే నాలుగు భేదాలను వీరరస భేదాలుగా చెప్పారు. మరలా శాంతరసమును చెప్తున్నపుడు దయా ధర్మవీరాదులు దేవతా విషయక రతి అందులో అంతర్భవిస్తాయంటారు. అంటే దయావీర ధర్మవీరాలను రసములంటున్నారా భావములంటున్నారా? రసములయితే అవి వీరరసములో అంతర్భవిస్తాయా? శాంతంలోనా? దయావీర ధర్మ వీరములు రసములయితే దేవతా విషయకరతిని వాటితో కలిపి చెప్తున్నపుడు దానిని కూడా రసమని అనుకోవాలా? భావ మని అనుకోవాలా?- ఇటువంటి ప్రశ్నలు వస్తాయి.

అలాగే భావముల గురించి చెప్తున్నపుడు ప్రధానములగు సంచారులు, దేవాది విషయకమయిన రతియు, ఉద్భుద్ధమాత్రమైన స్థాయియు మూడింటినీ భావములుగా చెప్పారు. ఇక్కడ సంచారి భావములు భావములే అనడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, సంచారి భావం ఎంత గట్టిగా ఉన్నా దానిని మించిన మరొక భావం అక్కడ ఉంటుందనీ, పెండ్లి కొడుకైన భృత్యుడికి రాజు సమక్షంలోనూ తాత్కాలికంగా ప్రాధాన్యం లభించినట్లు సంచారి భావము యొక్క ప్రాధాన్యం కూడా తాత్కాలికమేననీ, అది స్థాయిగా మారదనీ వివరణ ఇచ్చారు. అలాగే ఉద్బుద్ధమాత్రమయిన స్థాయి భావములు కూడా రసములు కావు అనడాన్నీ అర్థం చేసుకోవచ్చు. ఉద్బుద్ధమాత్రములు అంటే ‘విభావాదులచే పరిపుష్టి చెందనివి’ అన్న వివరణ దానికి కూడా ఇచ్చారు. ఈ రెండు వివరణలూ కూడా అలంకార శాస్త్ర నిర్వచనాల ప్రకారంగా ఉన్నవే, ప్రసిద్ధంగా చెప్పబడేవే. కానీ మధ్యలో దేవాది విషయికమైన రతిని భావములలో ఎందుకు చేర్చాలో వివరణ లేదు.

ప్రధానములగు సంచారులు, దేవాది విషయకమయిన రతియు, ఉద్భుద్ధమాత్రమైన స్థాయియు అని మూడింటినీ విడివిడిగా చెప్తున్నారంటే దేవాది విషయిక రతి ఇటు సంచారులకు, అటు ఉద్బుద్ధమాత్రమయిన స్థాయికి కూడా భిన్నం అనే కదా అర్థం! మరి అటువంటపుడు దేవాది విషయికమైన రతిని భావమని ఎందుకు అనాలి? అది రసము ఎందుకు కాదు? స్థాయి అయ్యేంత స్థిరత్వం దానికి లేదు కనుకనా? ఒకవేళ స్థాయి అయినా కూడా దానిని పరిపుష్టం చేయగల విభావాదులు లేవు కనుకనా? ఈ వివరణలేమీ ఇవ్వకుండా దేవాదివిషయిక రతి కూడా భావమే అని చెప్పడం సముచితంగా లేదు. అంతేకాదు, “ప్రధానములగు సంచారులు, ఉద్బుద్ధమాత్రములయిన స్థాయిభావములు” అన్నవి రెండూ భావాలకు సంబంధించిన సాధారణమైన విభాగాలను సూచించేవి అయితే దేవాది విషయక రతి అనేది ఒక ప్రత్యేకమైన భావం. ఆ ప్రత్యేకమైన భావాన్ని ఈ సాధారణమైన విభాగాలతో కలపడం సమంజసంగా లేదు.

నిజానికి ఇలా ఈ మూడిటిని కలిపి భావములుగా చెప్పడం సాహిత్యదర్పణంలోనే కాక మరికొన్ని ఇతర అలంకార గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. ఒక విషయాన్ని చెప్పేటపుడు ఆ విషయంపై పూర్వ ఆలంకారికులు వివిధ సందర్భాలలో చెప్పిన అంశాలన్నిటినీ కలిపి ఒకచోట చెప్పే ప్రయత్నం చేయడమే బహుశా అందుకు కారణం. మమ్మటుని కావ్యప్రకాశం లోని “దేవాది విషయక రతి మరియు వ్యంజించబడిన వ్యభిచారిభావాలు భావముగా చెప్పబడతాయి” అన్న వాక్యమే తరువాతి గ్రంథాలలో ఇలా కొద్ది మార్పులతో కనిపిస్తుంది.

ఒక విషయంపై చేసిన ప్రతిపాదన ఆ విషయంపై ప్రత్యేకంగా ఆలోచించి చేసిన ప్రతిపాదన అయితే అందులోని అన్ని అంశాలకూ వివరణ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆలోచించకుండా అప్పటికి ప్రచారంలో ఉన్న అభిప్రాయాలను సంగ్రహించి చెప్పడం మాత్రమే జరిగినపుడు, వివరణ ఉన్నవాటికి వివరణ ఇవ్వడం, లేనివాటిని ప్రస్తావించి ఊరుకోవడం జరుగుతుంది. ఇక్కడ దేవాది విషయికరతిని భావముగా పరిగణించాలి అన్న విషయానికి ప్రాచీనాలంకారికులు ఎవరూ వివరణ ఇవ్వలేదు కనుక వారిని అనుసరించి దానిని భావంగా పేర్కొన్న అర్వాచీనులూ ఇవ్వలేదు.

అలాగే వత్సలరసమును ప్రత్యేక రసముగా ఒప్పుకున్న విశ్వనాథుడు భక్తిరసమును ఒప్పుకోకపోవడానికి కూడా సరైన కారణమేమీ కనబడదు. గమనించవలసిన మరొక విషయమేమిటంటే విద్యాధరుడు ఏకావళిలో శాంతం అనే “రసానికి” ఉదాహరణగా చెప్పిన ఈ క్రింది శ్లోకాన్నే విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో దేవవిషయక రతి అనే “భావానికి” ఉదాహరణగా ఇచ్చాడు.

కదా వారణాస్యామమర తటీ నీరోధవి వసన్
వసానః కౌపీనం శిరసి నిదధానోంజలిపుటం
అయే! గౌరీనాథ! త్రిపురహర! శంభో! త్రినయన
ప్రసీదేత్యాక్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్

భక్తిని అర్థం చేసుకోవడంలోనూ, దానిని ఎలా పరిగణించాలన్న విషయాన్ని నిర్ణయించడంలోనూ ఆలంకారికులలో ఉన్న సందిగ్ధతలకు ఇది ఒక స్పష్టమైన నిదర్శనం.

1.2.5 భక్తిని ప్రత్యేక రసముగా చెప్పినవారు

రూపగోస్వామి, మధుసూదన సరస్వతి, కర్ణపూరుడు – వీరు ముగ్గురూ భక్తిని రసముగా ప్రతిపాదించి, అది మిగిలిన రసముల కంటే ఉత్కృష్టమని చెప్పినవారు. వీరి అభిప్రాయాలను పైన వివరించుకున్నాము. దేవాది విషయికమైన రతి భావమే కానీ రసం కాదన్న మమ్మటాదుల అభిప్రాయానికి మధుసూదన సరస్వతి ఇచ్చిన సమాధానాన్ని కూడా చూశాము. ఇంద్రాది దేవతలకు సంబంధించిన రతి భావమే కానీ పరమానందరూపుడైన పరమాత్మపై భక్తి రసమే అవుతుందన్నది మధుసూదన సరస్వతి వివరణ.

ఇక్కడ మధుసూదనసరస్వతి ఇచ్చిన ఈ వివరణను పెద్ద ప్రాముఖ్యం లేనిదానిగా భావించి పక్కన పెట్టడానికి లేదు. మమ్మటుడు దేవతారతిని భావం అన్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా తన వాదనను సమర్థించుకునేందుకో, లేదా తనకు హరి అంటే ఎక్కువ భక్తి కాబట్టో, మధుసూదన సరస్వతి “ఇతర దేవతల భక్తి రసస్థాయిని పొందలేదు కానీ కృష్ణభక్తి రసమవుతుంది” అని చెప్పాడని అనుకోవడానికి లేదు.

ఎందుకంటే ఇది మధుసూదన సరస్వతి ఒక్కడే చెప్పిన విషయం కాదు. కేవలం వాదన కోసం అప్పటికపుడు తీసుకువచ్చిన కొత్తవిషయం కాదు. ఈ విషయానికి శాస్త్రప్రమాణం ఉంది. ఇతర దేవతల భక్తికీ హరిభక్తికీ ఉన్న భేదం ఎన్నోచోట్ల చెప్పబడింది. హరి అంటే ఇక్కడ ఏ దైవాన్ని మనం పరమాత్మయనీ, సర్వస్వమనీ, చిదాలంబమనీ భావించి పూజిస్తామో ఆ త్రయీవేద్యమైన దైవం. మోక్షప్రదాత అయిన దైవం. శివానందలహరిలో శంకరులు క్షుద్ర ఫలాలనిచ్చే దేవతలెందరో ఉన్నారనీ; వాళ్ళనీ, వాళ్ళిచ్చే ఫలాలనీ కలలోనైన భావించననీ; శివుని పదాంభోజాలను అర్చించే భాగ్యమే కావాలనీ కోరుకుంటారు.

సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా
నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్ (4వ శ్లోకం)

అలా ఇతర దేవతలవైపు చూడడం ముత్యపుచిప్పలను వెండిగా, గాజురాళ్ళను మణులుగా, పిండినీళ్ళను పాలుగా, ఎండమావులను నీళ్ళుగా భ్రమించడం లాంటిదంటారు.

యథా బుద్ధిశ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణి
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం
తథా దేవభ్రాంత్యా భవతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే (8వ శ్లోకం)

భగవద్గీత కూడా ఈ విషయాన్నే వివరిస్తుంది. ఇంద్రాది దేవతలకు చేసే పూజలు లౌకిక ఫలాలను ఇస్తాయి. పరమానందస్వరూపుడైన కృష్ణునిపై ప్రేమ కృష్ణుడినే అంటే పరమానందాన్నే అందిస్తుంది. ఈ విషయాన్ని భగవద్గీత పదేపదే చెప్తుంది.

అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసామ్
దేవాన్దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి   (7 -23)

యాన్తి దేవవ్రతా దేవాన్ పితౄన్యాన్తి పితృవ్రతాః
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోఽపిమామ్ (9-25)

ఇలా “నాపై ప్రేమ నన్నే ఇస్తుంది, చ్యుతి లేని ఆనందాన్నే అందిస్తుంది” అన్న కృష్ణుని వాక్కును భగవద్గీత చెప్పడమూ ఉంది. అది నిజమేననీ; శివపూజతో, శివనామసంకీర్తనతో, భాగవతుల సాంగత్యంతో, శివ రూప ధ్యానంతో సారూప్య సామీప్య, సాలోక్య, సాయుజ్య ముక్తులను ఇప్పుడే పొందుతున్నామంటూ భక్తులు తమ అనుభవాన్ని పంచుకోవడమూ ఉంది (శివానందలహరి – 28).

సారూప్యం తవపూజనే శివ! మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే
సాలోక్యం సచరచరాత్మక తనుధ్యానే భవానీపతే!
సాయుజ్యం మమ సిద్ధ మత్ర భవతి స్వామిన్ కృతార్దోస్మ్యమ్

కాబట్టి ఇంద్రాది దేవతలకు సంబంధించిన రతి భావమే కానీ పరమానందరూపుడైన పరమాత్మపై భక్తి రసమే అవుతుందన్న వివరణ, తన ప్రతిపాదనని సమర్థించుకోవడం కోసం మధుసూదనసరస్వతి సృష్టించిన భేదం కాదనీ, భక్తిని భావమని వ్యాఖ్యానించే సందర్భంలో ఇతర ఆలంకారికులు గమనించని అంశమనీ గ్రహించాలి.

1.2.6 పూర్వ ఆలంకారికుల అభిప్రాయాన్ని అనుసరించిన వారు

ఇక చివరిగా రసములెన్ని, అవి ఏమిటి అన్న విషయాలను పేర్కొన్నప్పటికీ వాటి గురించి చర్చించకుండా పూర్వ ఆలంకారికులు చెప్పిన విషయాలనే ప్రామాణికంగా భావించి ప్రస్తావించిన ఆలంకారికుల గురించి చూద్దాము. రుద్రభట్టు, క్షేమేంద్రుడు, వాగ్భటుడు, అజితసేనుడు, రామచంద్ర గుణచంద్రులు, అల్లరాజు – ఈ ఆరుగురు ఆలంకారికులూ రససంఖ్యను తొమ్మిదిగా పేర్కొని శృంగారాది అష్టరసములను, శాంతాన్ని అంగీకరించారు. శారదాతనయుడు, సింగభూపాలుడు, విశ్వేశ్వరుడు – వీరు ముగ్గురు శాంతాన్ని కూడా అంగీకరించకుండా, రసములు ఎనిమిదేనన్నారు. అయితే వీరెవెరూ భక్తిరసము గురించి తమ అభిప్రాయాన్ని ప్రత్యేకంగా చెప్పలేదు.

ధనంజయుడు కూడా శాంతరసాన్ని అంగీకరించలేదు. ఎనిమిదింటిని మాత్రమే స్థాయిభావములుగా పేర్కొని, ప్రీతి భక్తి వంటివి హర్షోత్సాహాలలోనే అంతర్భవిస్తాయనీ వాటిని రసములుగా పరిగణించనవసరం లేదనీ చెప్పాడు.

మమ్మటుడు మొదట శృంగారాది అష్టరసములను పేర్కొని ఆ తర్వాత నిర్వేదం స్థాయిభావంగా గల శాంతమనే రసం కూడా ఉందని అన్నాడని చెప్పుకున్నాము. ఒక చిత్రమయిన విషయమేమిటంటే, ఇతడు అభినవగుప్తుడు చెప్పిన తత్త్వజ్ఞానాన్ని కాక నిర్వేదాన్ని శాంతరసానికి స్థాయిభావంగా పేర్కొన్నాడు. కానీ శాంతరసానికి ఇతడు ఇచ్చిన ఉదాహరణలో మాత్రం నిర్వేదం కాక తత్త్వజ్ఞానమూ (సమదృష్టి), భక్తీ (శివనామస్మరణ) కనబడుతున్నాయి.

అహౌ వా హారే వా కుసుమశయనే వా దృషది వా
మణౌ వా లోష్టే వా బలవతి రిపౌ వా సుహృది వా
తృణే వా స్త్రైణే వా మమ సమదృశో యాన్తి దివసాః
క్వచిత్పుణ్యేఽరణ్యే శివశివ శివేతి ప్రలపతః (కావ్యప్రకాశం 34వ కారిక )

ఇక ముఖ్యమైన ముప్పై అయిదవ కారికను పరిశీలిస్తే, ఈ అధ్యాయంలో మునుపు చెప్పుకున్నట్లుగా ఆ కారికలో మమ్మటుడు దేవాది విషయ రతిని భావంగా పేర్కొన్నాడు కానీ ఆ అభిప్రాయానికి వివరణ ఇవ్వలేదు.

మమ్మటుని తర్వాతి ఆలంకారికులు చాలామంది కావ్యప్రకాశాన్ని అనుసరించిన వారే కనుక, “రతిర్దేవాది విషయా వ్యభిచారీ తథాఞ్జితః భావః ప్రోక్తః” అన్న మమ్మటుని మాటనే తమ గ్రంథాలలోనూ చెప్పారు. విద్యాధరుడు, కేశవ మిశ్రుడు, హేమచంద్రుడు, రెండవ వాగ్భటుడు, జయదేవుడు, విద్యానాథుడు – వంటి ఆలంకారికులందరూ ఈ విషయంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే ఈ కారిక “దేవతావిషయకమైన రతి భావంగా చెప్పబడుతుంది” అంటోంది కానీ ఆ భావం రసముగా మారే అవకాశం లేదు అని స్పష్టంగా ఖండించడం లేదు. కేవలం భగవద్రతిని భావము అని చెప్పడమే భక్తిరసమును ఖండించడం అవదు. ఎందుకంటే భక్తిని రసముగా పేర్కొనే వారు కూడా భగవద్రతిని భావం అనే అంటారు. భగవద్రతినే రసముగా వారూ చెప్పరు. భగవద్రతి భావమనీ, మిగిలిన స్థాయిభావాల లాగానే అది కూడా విభావానుభావ వ్యభిచారులతో పరిపుష్టమైనపుడు భక్తిరసముగా పరిణమిస్తుందనీ భక్తిరస సమర్థకులు చెప్తారు. ఆమాటకు వస్తే, కాంతా విషయక రతి కూడా రసము కాదు, భావమే. కాంతా విషయక రతి కూడా విభావానుభావ వ్యభిచారులతో పోషింపబడినపుడు మాత్రమే శృంగార రసంగా పరిణమిస్తుంది. సరిగా పోషించకపోతే భావంగానే ఉండిపోతుంది. ఇదే కాదు; మిగిలిన ఎనిమిది స్థాయిభావాలు కూడా సరిగా పోషించ బడకపోతే రసస్థితిని పొందవు. భావాలుగానే పరిగణింపబడతాయి (కావ్యప్రకాశం పుట 136).

మమ్మటుడు స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ దేవాది విషయిక రతికి రసత్వ స్థితిని పొందే సామర్థ్యం లేదు అన్నదే మమ్మటుని భావం అని ఒకవేళ అనుకున్నా, ఆ భావానికి ఆధారం ఏమిటి అన్న ప్రశ్న అలాగే ఉంటుంది. పోనీ ఆ ప్రశ్నను కూడా ప్రక్కకు పెట్టి మమ్మటుని అభిప్రాయాన్ని పరిగణన లోకి తీసుకున్నా, దానికి మధుసూదన సరస్వతి సమాధానం చెప్పారు. దేవ, ముని గురు విషయకమైన రతి వేరు, హరి భక్తి వేరు అని మధుసూదన సరస్వతి స్పష్టం చేశారు. అది భక్తిరస సమర్థకులు అందరూ ఒప్పుకునే మాటే. ఇంద్రాది దేవతలు, మునులు, గురువులు, రాజు – వీరిపై భక్తిని భక్తిరసముగా ఎవరూ చెప్పడం లేదు. కాబట్టి ఆధారరహితమైనందు వలన, మధుసూదనసరస్వతిచే ప్రమాణ సహితంగా ఖండించబడినందు వలన మమ్మటుని ఈ కారికను భక్తిరస స్థాపనను నిర్ణయించగల అభిప్రాయంగా పరిగణించలేము.

ఇక చివరిగా చెప్పుకోవలసినది జగన్నాథ పడితరాయల గురించి. శాంతరసానికి సంబంధించిన విషయంలోను, దేవాదివిషయక రతికి సంబంధించిన విషయంలోను జగన్నాథుడు మమ్మటుని అభిప్రాయాన్నే అనుసరించడం కనిపిస్తుంది. జగన్నాథుడు కూడా మమ్మటుని వలెనే శాంతరసానికి తత్త్వజ్ఞానాన్ని కాక నిర్వేదాన్ని స్థాయిభావంగా చెప్పాడు. దేవాది విషయక రతి భావమేనన్నాడు. దేవాది విషయక రతిని భావంగా ఎందుకు పరిగణించాలి అన్నప్రశ్నకు ప్రాచీనాచార్యుల సిద్ధాంతం అనుసరణీయం అన్న సమాధానం చెప్పాడు. అయితే ఈ సమాధానం సంతృప్తికరం కాదు. పైగా ఇటువంటి సమాధానం జగన్నాథ పండితుని నుంచి రావడం ఆశ్చర్యకరమైన విషయం కూడా. ఎందుకంటే ఇతర సందర్భాలలో ప్రాచీనాచార్యుల అభిప్రాయాలను జగన్నాథుడు ఖండించకపోలేదు. “జగన్నాథ పండితరాయలు ఒక సందర్భంలో ‘ఇవే గుణాలంకారాదులు, ఇన్ని మాత్రమే ఉన్నాయి అని ఎవరు నిర్ణయించగలరు’ అని సూచిస్తూ ‘గుణత్వాలంకారత్వాదేరననుగమాత్’ అని అంటాడు” అని కావ్యాదర్శానికి వ్రాసిన భూమికలో శ్రీరామచంద్రుడు అంటారు.

పూర్వ ఆలంకారికుల సంప్రదాయాన్ని గౌరవించి క్రొత్త ప్రతిపాదనలను చేయకుండా ఊరుకోవడం జగన్నాథుని వ్యక్తిత్వం కాదని మనకు అతని రచనలో తెలుస్తూనే ఉంటుంది. ‘తాను సాధారణంగా గౌరవించే ఆనందవర్ధన అభినవగుప్తుల అభిప్రాయాలతో కూడా విభేదించదలచుకున్నపుడు నిస్సంకోచంగా విభేదించడం అతడి స్వభావం’ అని జగన్నాథపండితుని గ్రంథాలపై పరిశోధన చేసిన శ్రీరామచంద్రుడు కూడా తమ సిద్ధాంత గ్రంథంలో చెప్పారు (పుట 18).

నిజానికి శాంతరసానికి స్థాయిభావాన్ని చెప్పడం విషయంలో కూడా పూర్వాచార్యుడైన అభినవగుప్తునితో జగన్నాథుడు విభేదించాడు. అభినవగుప్తుడు శాంతానికి తత్త్వజ్ఞానాన్ని స్థాయిగా చెప్పాడు కాబట్టి అతడు భక్తి శాంతంలో అంతర్భవిస్తుందని చెప్పడం కొంతవరకు పొసగుతుంది. కానీ మమ్మటుడు, జగన్నాథుడు తత్త్వజ్ఞానాన్ని కాక నిర్వేదాన్ని భక్తికి స్థాయిగా చెప్పారు. నిర్వేదానికి భక్తికి సామ్యం లేదు. బహుశా అందుకే వారిద్దరూ భక్తి శాంతంలో అంతర్భవిస్తుంది అన్న వ్యాఖ్య చేయకుండా భక్తిని భావంగా మాత్రమే చెప్పి వదిలివేశారు. కానీ అందుకు – భక్తిని భావముగా మాత్రమే ఎందుకు పరిగణించాలి అన్న విషయానికి – ఏ విధమైన ఆధారాలనూ చూపలేదు.

1.3 సారాంశము

ఈ పరిశీలన ఆధారంగా స్పష్టమయిన కొన్ని అంశాలు:

  1. భామహ రుద్రటాదుల వంటి ప్రాచీనుల నుంచి, భోజుడు భానుదత్తుడు వంటి అర్వాచీనుల వరకు – మౌలికమైన ఆలోచనలు చేసినవారిని, నూతన ప్రతిపాదనలు చేసినవారిని పరిశీలించినపుడు అలా నూతనంగా ప్రతిపాదించబడిన అలంకారములకు, ప్రేయోరసము, మాయారసము వంటి రసములకు, భక్తిరసముతో సామ్యము ఉందని అర్థమవుతుంది.
  2. విద్యాధరుడు ఏకావళిలో శాంత “రసానికి” ఉదాహరణగా చెప్పిన శ్లోకాన్నే విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో దేవవిషయక రతి అనే “భావానికి” ఉదాహరణగా ఇవ్వడం వంటివి భక్తిని అర్థం చేసుకోవడంలోనూ, దానిని ఎలా పరిగణించాలన్న విషయాన్ని నిర్ణయించడంలోనూ ఆలంకారికులలో ఉన్న సందిగ్ధతలను తెలియచేస్తాయి.
  3. రససంఖ్య విషయంలో క్రొత్త ఆలోచనలు, ప్రతిపాదనలు చేయకుండా ప్రాచీనులను అనుసరించినవారంతా ముఖ్యంగా అభినవగుప్తుని, మమ్మటుని అనుసరించారు. కనుక ప్రధానంగా చర్చించవలసినది వీరిద్దరి అభిప్రాయములనే.
  4. అభినవగుప్తుడు సమర్థించిన తత్త్వజ్ఞాన స్థాయికమైన శాంతరసానికీ భక్తిరసానికీ ఒక విధంగా సామ్యం ఉంది. మోక్ష సాధనకు సంబంధించినంతవరకు తత్త్వజ్ఞానము, భక్తి ఒక్కటే. కానీ కావ్యరచనకు సంబంధించిన రసపోషణ గురించి మాట్లాడుతున్నపుడు అవి రెండూ ఒకటేనా అన్న విషయాన్ని అభినవగుప్తుడు పరిగణించినట్లు కనబడదు.
  5. మమ్మటుడు, జగన్నాథుడు తత్త్వజ్ఞానాన్ని కాక నిర్వేదాన్ని భక్తికి స్థాయిగా చెప్పారు. నిర్వేదానికి భక్తికి సామ్యం లేదు కనుకనే బహుశా వారిద్దరూ భక్తి శాంతంలో అంతర్భవిస్తుంది అన్న వ్యాఖ్య చేయకుండా భక్తిని భావంగా మాత్రమే చెప్పి వదిలివేశారు. అయితే భక్తిని భావముగా మాత్రమే ఎందుకు పరిగణించాలి అన్న విషయానికి ఏ విధమైన ఆధారాలనూ చూపలేదు.
  6. భక్తిరసమును ప్రతిపాదించిన మధుసూదనసరస్వతి భక్తిరసము ఎందుకు ప్రత్యేకమో చెప్తూ, దేవాదివిషయిక రతిని భావంగా పరిగణించాలన్న మమ్మటుని వ్యాఖ్యకు సమాధానంగా ప్రామాణికమయిన వివరణను ఇచ్చారు.

(సశేషం)

Exit mobile version