Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-3

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 1- రెండవ భాగం

1.1.17 ధనంజయుడు

ధనంజయుడు తాను రచించిన దశరూపకంలోని నాలుగవ అధ్యాయంలో రసములను గురించి వివరిస్తూ రత్యుత్సాహాదులు ఎనిమిదింటిని మాత్రమే స్థాయిభావాలుగా పేర్కొన్నాడు. శమము రూపక యోగ్యము కాదు కనుక రూపకమునకు సంబంధించినంతవరకు స్థాయిభావములు ఎనిమిదేనని అన్నాడు.

నిర్వేదాది వ్యభిచారి భావములకు కూడా స్థాయిత్వము లేదు కనుక రసత్వము కూడా లేదని అన్నాడు. “ప్రీతిభక్త్యాదులు హర్షాద్యంతరభూతంబులు” అని ప్రీతి భక్తి వంటివి హర్షోత్సాహాలలోనే అంతర్భవిస్తాయనీ వాటిని రసములుగా పరిగణించనవసరం లేదనీ చెప్పాడు.

1.1.18 భోజుడు

శృంగారము ఒక్కటే రసమని భోజుని సిద్ధాంతం. ఇది నవరసములలో ఒకటిగా చెప్పే శృంగారం కాదు. అభిమానము, అహంకారము అనే నామాంతరాలున్న ఈ శృంగారము విలక్షణమయినది. భోజుని సిద్ధాంతం ప్రకారం అన్ని భావములకు అహంకారం మూలం. ఈ అహంకారం ఆత్మగుణం.

“రసోభిమానోహంకార శృంగార ఇతి గీయతే” అని సరస్వతీకంఠాభరణం అనే గ్రంథంలో పేర్కొన్న సిద్ధాంతాన్నే భోజుడు తన తర్వాతి గ్రంథమైన శృంగారప్రకాశంలో మరింత వివరించాడు. “దండి చెప్పిన ప్రేయః ప్రియతరాఖ్యానం రసవద్రసపేశలమ్ ఊర్జస్విరూఢాహఙ్కారం యుక్తోత్కర్షం చ తత్త్రయమ్” అన్న లక్షణంలోని అంశాలకు భోజుని వివరణ ఏమిటంటే ఈమూడూ రసమునకు చెందిన మూడు స్థితులు; పరాకోటి, మధ్యమావస్థ, ఉత్తరాకోటి.

పరాకోటి అనేది అహంకార స్థితి. ఇంతకు మునుపు చెప్పుకున్నట్లు ఈ ఆత్మగుణమే అన్ని భావాలకూ మూలము. దీని తరువాతి స్థితి ఆ అహంకారమే వివిధ విషయములపై అభిమానంగా పరిణమించినప్పటి స్థితి. దానికి దండి చెప్పిన రసవత్ తో సామ్యము చెప్తూ రతి, హాసము, ఉత్సాహము మొదలయిన భావాలు శృంగారాది రస స్థాయిని చేరుకునే ఆ స్థితిని మధ్యమావస్థ అన్నాడు భోజుడు. చివరి స్థాయి “ప్రేయః ప్రియతరాఖ్యానం” అన్న లక్షణానికి సాదృశంగా చెప్పినది. ఇది శృంగారము, హాస్యము, వీరము మొదలయినవన్నీ ఒకే రసముగా కలిసిపోయే ఉత్తరాకోటి. ఇది ప్రకృతి రసము. ప్రకృతిరసములో భేదాలు ఉండవు. అది ఒక్కటిగానే ఉంటుంది. రసములెన్ని అన్న ప్రశ్న మధ్యమావస్థ దగ్గరే వస్తుంది. ఉత్తరాకోటిలో ఉండేది ఒక్కటే రసము.

రససంఖ్యను గురించిన చర్చలో భోజుడు శృంగారాది అష్టరసములతో పాటు శాంత, ఉదాత్త, ఉద్ధత, ప్రేయో రసాలను ప్రస్తావిస్తాడు. ధీరశాంతుడు ఆలంబనముగా గలది శాంత రసమని, ధీరోదాత్తుడాలంబనముగా గలది ఉదాత్తరసమని, ధీరోద్ధతుడాలంబనముగా గలది ఉద్ధత రసమని, ధీరలలితుడు ఆలంబనముగా గలది ప్రేయోరసమని చెప్తాడు.

న చాష్టావే వేతి నియమః- యతః శాంతం ప్రేయాంస ముద్ధత మూర్జస్వినం చ కేచిద్రస మాచక్షతే – తన్మూలాశ్చకిల నాయకానాం ధీరప్రశాంత ధీరలలిత ధీరోద్ధత ధీరోదాత్త వ్యపదేశాః (శృంగారప్రకాశం)

నిజానికి భోజుడు స్థాయిభావములుగా చెప్పబడిన రత్యాది భావములే కాక సర్వభావములూ రసములు కాదగునని, పరిపోషింపబడనపుడు అవి భావాలుగా ఉంటాయనీ, పరిపోషింపబడితే అన్ని భావాలూ రసములవుతాయనీ అంటాడు. కనుక మధ్యమావస్థలో భోజుడు ఎనిమిదింటినో తొమ్మిదింటినో కాక అన్ని భావాలనూ రసస్థితిని పొందగలవిగా పరిగణిస్తాడు.

1.1.19 క్షేమేంద్రుడు

క్షేమేంద్రుడు ఔచిత్యవిచారచర్చ అనే తన గ్రంథంలో రసములను గురించి ప్రత్యేకించి చర్చించలేదు. కానీ రసౌచిత్యాన్ని గురించి చెప్పినపుడు నవరసములను పరిగణించాడు.

1.1.20 మమ్మటుడు

మమ్మటుడు కావ్యప్రకాశంలోని చతుర్థోల్లాసంలో 29వ కారికలో శృంగారాది ఎనిమిది రసాలను చెప్పాడు. ఆతర్వాత 34వ కారికలో నిర్వేదం స్థాయిభావంగా గల తొమ్మిదవ రసమైన శాంతం కూడా ఉంది అని చెప్పాడు. ఆతర్వాతి కారికలో “రతిర్దేవాది విషయా వ్యభిచారీ తథాఞ్జితః భావః ప్రోక్తః” అంటూ దేవ, ముని, గురు, నృప, పుత్రాదుల విషయకమైన రతి భావమని, కాంతా విషయకమైన రతి మాత్రమే శృఙ్గారరసమవుతుందనీ వివరించాడు.

1.1.21 రుయ్యకుడు

“రసభావతదాభాసతత్ప్రశమానాం నిబంధనేన రసవత్ప్రేయ ఊర్జస్వతి సమాహితాని” అన్నది రుయ్యకుని అలంకార సర్వస్వంలోని 83వ సూత్రం.

ఆ సూత్రానికి వ్రాసిన వృత్తి రసాన్ని సూచించేది రసవదలంకారమని, భావాన్ని సూచించేది ప్రేయోలంకారమని, ఆ రెండిటి అభాసను సూచించేది ఊర్జస్వి అని, ప్రశమనాన్ని సూచించేది సమాహితమని చెప్తుంది. అలాగే నిర్వేదాది సంచారిభావాలతో పాటు దేవాది విషయక రతిని కూడా భావంగానే పరిగణించాలని చెప్తుంది.

1.1.22 వాగ్భటుడు

12వ శతాబ్ధికి చెందిన వాగ్భటుడు వాగ్భటాలంకారమనే గ్రంథాన్ని రచించాడు. అతడు “శృంగారవీరకరుణా హాస్యాద్భుత భయానకాః రౌద్రబీభత్సశాంతశ్చ నవైతే నిశ్చితా బుధైః” అంటూ నవరసములను పేర్కొని ఆ తొమ్మిదింటి గురించీ స్వల్ప వివరణ ఇచ్చాడు కానీ ఇతర రసముల గురించి ప్రస్తావించలేదు.

1.1.23 హేమచంద్రుడు

కావ్యానుశాసనంలో ఎనిమిది అధ్యాయాలున్నాయి. రెండవ అధ్యాయంలో హేమచంద్రుడు రసముల గురించి వివరించాడు. “శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్సాద్భుత శాంతా నవ రసాః” అని చెప్తూ తొమ్మిది రసములనే అంగీకరించాడు. స్నేహము, లౌల్యము వంటివి ఇతర రసములలోనే అంతర్భవిస్తాయని చెప్పాడు. అలాగే “దేవమునిగురునృపపుత్రాది విషయా తు భావ ఏవ న పునా రసః” అంటూ దేవ విషయక రతి రసము కాదు భావమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

1.1.24 రామచంద్ర గుణచంద్రులు

నాట్యదర్పణము అనే వీరి గ్రంథంలో నవరసములనే పేర్కొన్నారు. రసములు తొమ్మిదేననీ, కొందరు చెప్పిన లౌల్యము, స్నేహము వంటి రసములు ఆ తొమ్మిదింటిలోనే అంతర్భవిస్తాయనీ అన్నారు. భక్తిరసము గురించి ప్రత్యేకించి చెప్పలేదు.

1.1.25 జయదేవుడు

జయదేవుడు తాను రచించిన చంద్రాలోకంలోని ఆరవ మయూఖంలో రసభావములను వివరించాడు. శృంగారాది అష్టరసములను, శాంతమును రసములుగా పరిగణించిన జయదేవుడు “రతిర్దేవాది విషయా సన్తి చ వ్యభిచారిణః” అని దేవాది విషయక రతిని వ్యభిచారిభావముగా చెప్పాడు.

1.1.26 భానుదత్తుడు

భానుదత్తుడు తన రసతరంగిణి అనే గ్రంథంలో మాయారస ప్రస్తావన చేశాడు. చిత్తవృత్తి ప్రవృత్తి నివృత్తి అని రెండు రకాలుగా ఉంటుందనీ, నివృత్తిలో శాంతరసం ఉంటే ప్రవృత్తిలో మాయారసం ఉంటుందనీ అన్నాడు. రత్యాది అష్టభావాలు మాయారసానికి వ్యభిచారి భావాలు అవుతాయని అన్నాడు.

“చిత్తవృత్తిర్ద్విధా – ప్రవృత్తిర్నివృత్తిశ్చేతి, నివృత్తౌ యథా శాంతరసస్తథా ప్రవృత్తౌ మాయారస ఇతి ప్రతిభాతి” అన్నది రసతరంగిణిలోని సప్తమ తరంగంలో భానుదత్తుడు చేసిన ప్రతిపాదన.

1.1.27 శారదా తనయుడు

శారదాతనయుడు భావప్రకాశం అనే తన గ్రంథంలో మనోవృత్తులు, స్థాయిభావాలు ఎనిమిదేనన్నాడు. సత్తామాత్రమున శాంతము ఉండవచ్చును కానీ శాంతమునకు అనుభావాలు ఉండవు కనుక అది అభినయ యోగ్యం కాదన్నాడు.

1.1.28 విద్యాధరుడు

13వ శతాబ్దికి చెందిన విద్యాధరుడు ఏకావళి అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడు నవరసములను అంగీకరించాడు. దేవ విషయక రతిని భావమనే చెప్పాడు. కాంతావిషయరతి శృంగారమనీ దేవవిషయరతి భావమనీ చెప్తూ ఉదాహరణ ఇచ్చాడు.

“భావోహి నామ దేవద్విజగురుపుత్రమిత్రాదివిషయారతిః విభావాద్యాపూరితో
వ్యభిచారీ చ కాంతా విషయాయా రతేః శృంగారత్వేన అంగీకారాత్”

1.1.29 విద్యానాథుడు

13వ శతాబ్ధికి చెందిన విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణమనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు. ఇతడు వాత్సల్యము, భక్తి, స్నేహములను కొందరు రసములుగా ప్రతిపాదించడం గురించి, అలాగే రసములు అనంతములు అని మరికొందరు భావించడం గురించీ చెప్పి, ప్రామాణికులయిన పెద్దలు రసములు తొమ్మిది అని నిర్ణయించారు అంటూ నవరసములనే అంగీకరించాడు. రసములతో పాటు, రసవద్ప్రేయో ఊర్జస్వ్యాది అలంకారాలను గురిచి కూడా ఉదాహరణలతో వివరించాడు. ప్రేయోలంకారంలో స్నేహానికి సంబంధించిన ఉదాహరణ ఇచ్చాడు. భక్తికి సంబంధించిన ఉదాహరణ కాదు.

1.1.30 వాగ్భటుడు

ఇతడు రెండవ వాగ్భటుడు. 14 వ శతాబ్దానికి చెందిన వాడు. కావ్యానుశాశనమనే గ్రంథాన్ని రచించాడు. పంచమాధ్యాయంలో రసముల గురించి చెప్పినపుడు నవరసములను పేర్కొన్నాడు. రతి, హాసము,శోకము, క్రోధము, ఉత్సాహము, భయము, జుగుప్స, విస్మయము, శమము అనే స్థాయిభావాలు క్రమంగా శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత శాంత రసాలు అవుతాయని చెప్పాడు.

1.1.31 విశ్వనాథుడు

సాహిత్య దర్పణం అనే గ్రంథాన్ని రచించిన విశ్వనాథుడు 14వ శతాబ్ధికి చెందిన ఆలంకారికుడు. ఇతడు శాంత రసాన్ని అంగీకరించాడు. “దయావీరాదులు” అందులో అంతర్భవిస్తాయని అన్నాడు. ఇక్కడ ఆది శబ్దం ధర్మవీర, దయావీర, దేవతావిషయిక రతులను సూచిస్తుందనడము, దేవతా విషయిక రతికి ఉదాహరణగా “ఎప్పుడు వారణాసిలో సురనది ఒడ్డున నివసించుచు కౌపీనమును దాల్చినవాడినై శిరమున అంజలి పుటమును జేర్చుకుని ఓయి గౌరీనాథుడా! త్రిపుర హరుడా! శంభుడా! త్రినయనుడా! కరుణింపుము అని మొఱలిడుచు దినములను నిమిషములుగా గడిపెదనో!” అన్న వాక్యాలను ఇవ్వడం కనిపిస్తుంది (శ్లో. 3-249).

ఆపైన వత్సల రసాన్ని ప్రత్యేక రసముగా అంగీకరించి విభావాదులను చెప్పడం కనిపిస్తుంది (శ్లో. 3-251).

ఆతర్వాత భావములను వివరించేటపుడు ఈ క్రింది విధమైన వివరణ ఇవ్వడం కనిపిస్తుంది.

“సంచారిణః ప్రధానాని దేవాది విషయా రతిః
ఉద్భుద్ధ మాత్ర స్థాయీచ భావ ఇత్యభిధీయతే” (శ్లో. 3-260)

ఇక్కడ ప్రధానములగు సంచారులు, ఉద్బుద్ధమాత్రములయిన స్థాయిభావములు, దేవ విషయకమైన రతి – ఇవి మూడూ భావాల క్రిందికి వస్తాయని చెప్పి దేవవిషయక రతికి ముకుందమాల నుంచి ఉదాహరణ ఇచ్చారు.

1.1.32 సర్వజ్ఞ సింగ భూపాలుడు

14వ శతాబ్దానికి చెందిన సింగ భూపాలుడు అష్టరసవాది. ఇతడు తన గ్రంథమైన రసార్ణవ సుధాకరములో శాంత రస స్థాయిని విడచి మిగిలిన ఎనిమిదింటిని పేర్కొన్నాడు. నిర్వేదానికి స్థాయిత్వం లేదు కాబట్టి శాంతము రసము కాదని అన్నాడు.

1.1.33 విశ్వేశ్వరుడు

ఇతడు అష్టరసవాది. ఇతడు తాను రచించిన చమత్కార చంద్రికలో శివుని అష్టమూర్తుల వలె రసములు కూడా ఎనిమిది రూపాలలో ఉంటాయని అన్నాడు.

“శివోరస” ఇతి ప్రోక్తస్సత్యం భావకసత్తమైః
న చేల్లోకోపకారాయ కథమస్యాష్టమూర్తితా
అష్టధా స చ శృంగారహాస్యౌ వీరాద్భుతౌ స్థితౌ
ద్వంద్వశో రౌద్రకరుణౌ తౌ బీభత్సభయానకౌ

1.1.34 రూపగోస్వామి

భక్తిని మొదట రసముగా పరిగణించినవాడు ఇతడే. రూపగోస్వామి తాను రచించిన భక్తిరసామృతసింధువు అన్న గ్రంథంలో భక్తిని రసముగా పేర్కొని ఆ రసమునకు విభావానుభావాదులను వివరించాడు.

భక్తి రసమునకు శ్రీకృష్ణుడు, భక్తులు ఆలంబన విభావాలయితే మురళీనాదాదులు అనుభావాలని చెప్పాడు. ఇంకా స్తంభము, రోమాంచము మొదలైన ఎనిమిది సాత్త్విక భావాలను, నిర్వేదము, విషాదము మొదలయిన ముప్పదిమూడు సంచారిభావాలను చెప్పి, శ్రీకృష్ణ విషయకమగు రతిని స్థాయిభావంగా చెప్పాడు. అలాగే భక్తిరసములో ముఖ్య గౌణ భేదాలను కూడా చెప్పాడు.

శాంత, ప్రీత, ప్రేయో, వత్సల, మధుర భక్తిరసములు ముఖ్యములు కాగా హాస్య, అద్భుత, వీర, కరుణ, రౌద్ర, భయానక, బీభత్స భక్తి రసములు గౌణములు. వీటన్నిటికీ విభావానుభావ సంచారిభావాలను వివరించారు.

1.1.35 మధుసూదన సరస్వతి

రూపగోస్వామి తర్వాత భక్తిరసమును ప్రతిపాదించినవాడు ఇతడే. తాను రచించిన భక్తిరసాయనమనే గ్రంథంలో ఇతడు భక్తిని రసముగా ప్రతిపాదించి విభావానుభావ వ్యభిచారిభావాలను పేర్కొన్నాడు.

భక్తిరసమునకు భగవంతుడు ఆలంబన విభావము. తులసీ చందనాదులు ఉద్దీపన విభావములు. నేత్ర విక్రియాదులు అనుభావములు. నిర్వేదాదులు వ్యభిచారిభావములు.

భక్తికి ఇతడు భగవదాకారక చిత్తవృత్తిని స్థాయిభావంగా చెప్పాడు. భక్తిని జ్ఞానంలో అంతర్భవింపజేయలేమని అన్నాడు. మధుసూదన సరస్వతి వివరణ ప్రకారం భక్తిలో నిర్వేదం స్థాయిభావం కాదు, వ్యభిచారి మాత్రమే.

ఇతడు భక్తిరసాన్ని గురించి కేవలం ప్రతిపాదన మాత్రమే చేయలేదు. ఆ ప్రతిపాదనపై ఉన్న సందేహాలకు సమాధానాలు కూడా చెప్పాడు. భగవంతుడే ఆలంబనము, భగవదాకార రూపమయిన చిత్తము స్థాయిభావము ఎలా అవుతాయి? ఆలంబన విభావమే స్థాయిభావము ఎలా అవుతుందన్న ప్రశ్నకు భక్తిరసాయనము వివరణ ఇస్తుంది. ఆలంబన విభావమైన భగవంతుడు బింబము వంటి వాడయితే, స్థాయిభావముగా చెప్పబడుతున్న భగవదాకారము ప్రతిబింబం. కనుక ఆలంబన విభావమూ, స్థాయిభావమూ ఒకటేనని అనరాదు. అలాగే దేవాది విషయికమైన రతి భావమే కానీ రసం కాదన్న మమ్మటాదుల అభిప్రాయాలకు కూడా ఇతడు సమాధానం ఇచ్చాడు. ఇంద్రాది దేవతలకు సంబంధించిన రతి భావమే కానీ పరమానందరూపుడైన పరమాత్మపై భక్తి రసమే అవుతుందని వివరించాడు.

రతిర్దేవాది విషయా వ్యభిచారీ తదోర్జితః
భావః ప్రోక్తః రసోనేతి యదుక్తం రసకోవిదైః
దేవాంతరేషు జీవత్వాత్ పరానందాప్రకాశనాత్
తద్యోజ్యం పరమానంద రూపో న పరమాత్మని

అంతే కాదు. కాంతాది విషయకమగు రతిలో పూర్ణానంద స్వభావము లేదని, మిణుగురు పురుగుల కాంతి కంటే సూర్యతేజము ప్రబలమైనట్లు క్షుద్ర రసములకంటే భగవద్రతి విశిష్టమైనదని అన్నాడు.

1.1.36 కవి కర్ణపూరుడు

16వ శతాబ్దానికి చెందిన కర్ణపూరుని గ్రంథం అలంకారకౌస్తుభం. పది కిరణములుగా విభజించబడిన ఈ గ్రంథంలోని అయిదవ కిరణములో రసములను గురించిన వివరణ ఉంది. కర్ణపూర గోస్వామి శృంగారాది అష్టరసములను, శాంతాన్ని, వాత్సల్యాన్ని అంగీకరించాడు. ప్రేమరసము, భక్తిరసము అనే మరొక రెండు రసములను అదనంగా చెప్పారు. రతి అనేది మైత్రి, ప్రీతి, సౌహార్ద్ర, భావ అనే నాలుగు రూపాలుగా ఉంటుందని చెప్పాడు. “ప్రేమరసే సర్వే ఏవ రసా అంతర్భవంతీత్యత్ర మహీయనేవ ప్రపంచః” అని పేర్కొన్నాడు.

1.1.37 కేశవమిశ్రుడు

16వ శతాబ్ది వాడైన కేశవమిశ్రుడు తన అలంకార శేఖరమనే గ్రంథాన్ని ఇరవై రెండు మరీచులుగా విభజించాడు. ఇరవయ్యవ మరీచిలో రసములను వివరిస్తూ నవరసములను పేర్కొన్నాడు.

రతిర్భవతి దేవాదౌ మునౌ పుత్రే నృపే గురౌ
శృంగారస్తు భవేత్సైవ యా కాంతా విషయా రతిః

అని దేవాదుల విషయంలోని రతిని భావంగాను, కాంతా విషయ రతిని శృంగారంగాను పేర్కొన్నాడు.

1.1.38 జగన్నాథుడు

17వ శతాబ్ది వాడైన జగన్నాథుడు తాను రచించిన రసగంగాధరములో భక్తిరసమును గురించి చర్చించాడు. తొమ్మిది రసములనూ వివరించాక, ఇవి మాత్రమే రసములు అని ఎలా చెప్తాము? భాగవత శ్రవణం వంటి సందర్భాలలో రోమాంచము, అశ్రుపాతము వంటి అనుభావాలతో శ్రోతలు భక్తిరసమును అనుభవిస్తున్నారు కదా! అన్న ప్రశ్నలు తెచ్చాడు. భక్తి అనురాగమూ శాంతము వైరాగ్యమూ కనుక, అవి రెండూ పరస్పరవిరుద్ధములు కనుక, భక్తిని శాంతంలో ఇమడ్చడం కుదరదనీ చెప్పాడు. దేవ విషయిక రతి భావమేనన్న ప్రాచీనాచార్యుల సిద్ధాంతాన్ని ప్రస్తావించి, దేవ విషయకమయిన రతికి భావత్వాన్ని, కాంతా విషయక రతికి రసత్వాన్ని ఎందుకు చెప్పాలి? కాంతాది విషయక రతికే భావత్వాన్ని చెప్పి దేవాది విషయక రతికే రసత్వాన్ని చెప్పవచ్చు కదా అన్న ప్రశ్ననూ తీసుకువచ్చాడు.

ఈ ప్రశ్నలన్నిటికీ చివరన రసములు తొమ్మిది అన్న భరతముని వచనానికి వ్యాఘాతత్వమేర్పడుతుంది కాబట్టి అది తగదు అని సమాధానం చెప్పాడు. ఈ విధంగా మారుస్తూ ఉంటే పుత్రాదుల పట్ల ఉన్న ప్రేమ స్థాయిభావమెందుకు కాకూడదు, శోకము జుగుప్స వంటివి వ్యభిచారిభావాలెందుకు కాకూడదు వంటి ప్రశ్నలు వస్తాయనీ, కనుక రసములు తొమ్మిది అన్న సిద్ధాంతాన్ని అతిక్రమించకపోవడమే మంచిదనీ అన్నాడు.

1.1.39 అల్లరాజు

అల్లరాజు రచించిన రసరత్న ప్రదీపిక అనే చిన్న పుస్తకంలో రస సిద్ధాంతానికి సంబంధించి క్రొత్త ప్రతిపాదనలేవీ లేవు. శాంతాన్ని నవమ రసంగా ఇతడు అంగీకరించాడు. వత్సలమును ప్రత్యేక రసంగా భావించలేదు. దానిని రతిగానే పరిగణించాడు.

1.2 పరిశీలన

ఇక్కడ దాదాపుగా నలభై మంది ఆలంకారికుల రచనలను వారి అభిప్రాయాలను చూశాము. పుల్లెల శ్రీరామచంద్రుడు గారి అలంకార చరిత్ర, ముదిగంటి సుజాతారెడ్డి, గోపాలరెడ్డి గార్ల సంస్కృత సాహిత్య చరిత్ర వంటి గ్రంథాలను పరిశీలించినపుడు, పైన పేర్కొన్న ఆలంకారికులే కాక మరికొందరు ఆలంకారికుల వివరాలు కనిపిస్తాయి. అయితే వారు రచించిన గ్రంథాలలో చాలావరకూ కావ్యప్రకాశం, అలంకారసర్వస్వం వంటి గ్రంథాల నుండి సేకరించిన విషయాలకు సంకలనాల వంటివే కానీ, కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించినవి, మౌలికమైన విషయాలను చెప్పినవి కావు. ఉదాహరణకు వారణాసి ధర్మసూరి (సాహిత్య రత్నాకరం), పెదకోమటి వేమభూపాలుడు (సాహిత్య చింతామణి), ఆణివిళ్ళ వేంకటశాస్త్రి (అప్పారాయ యశశ్చంద్రోదయము), అక్బర్ షా (శృంగార మంజరి) వంటి ఆలంకారికుల రచనలు పూర్వాలంకారికులననుసరించి నవరసములను పేర్కొన్నాయి కానీ క్రొత్త ప్రతిపాదనలేమీ చేయలేదు. మహిమభట్టు రచించిన వ్యక్తివివేకం స్వతంత్రమైన వాదనను వినిపించిన గ్రంథమే అయినా అందులో రసమును గురించిన చర్చలు కానీ అభిప్రాయాలు కానీ లేవు.

కనుక సంస్కృత ఆలంకారికుల రచనలలో ప్రసిద్ధమైనవీ, మౌలికమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినవీ అయిన గ్రంథాలన్నీ కూడా ఈ ముప్పై తొమ్మిది గ్రంథాల పరిధిలోకి వస్తాయని భావించి ఈ గ్రంథాలలోని అంశాలను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ పేర్కొన్న ప్రసిద్ధ ఆలంకారికులలో కూడా రససంఖ్య గురించి ఏవిధమైన వ్యాఖ్యానమూ చేయని వారు కొందరు ఉన్నారు. వారి గురించి మొదట చెప్పుకుందాము.

1.2.1 రససంఖ్యను గురించి వ్యాఖ్యానించనివారు

రససంఖ్యను గురించి అసలు వ్యాఖ్యానించని సందర్భాలలో, భక్తిరసమును గురించి ఏ విధమైన అభిప్రాయాన్నీ చెప్పని సందర్భాలలో లేదా పూర్తి గ్రంథం లభ్యం కాని సందర్భాలలో విశ్లేషించవలసినది, విశ్లేషించగలిగినది ఏమీ ఉండదు. అటువంటి సందర్భాలు ఈ జాబితాలో ఏడు ఉన్నాయి. అవి నందికేశ్వరుడు, కోహలుడు, జాయపసేనాని, కుంతకుడు, వామనుడు, భట్టలోల్లటుడు, రాజశేఖరుడు – ఈ ఏడుగురి అభిప్రాయాలు. వీరిలో కూడా భట్టలోల్లటుడు, రాజశేఖరుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలు పరోక్షంగా భక్తిరస స్థాపనకు అనుకూలంగా కనిపిస్తాయి. రసములు అనంతములన్న భట్టలోల్లటుని అభిప్రాయం, సత్కావ్య పఠన సమయంలో పాఠకుడికి కలిగే అన్ని భావాలనూ భరతుడు ఊహించి ఉండలేదన్న రాజశేఖరుని అభిప్రాయం పరోక్షంగా భక్తిరసవాదానికి అనుకూలమైన అంశాలు.

1.2.2 రసమును అలంకారాలలో భాగంగా చూసిన ఆలంకారికులు

తర్వాత రసమును అలంకారాలలో భాగంగా చూసిన ఆలంకారికుల గురించి చెప్పుకుందాము. దండి, భామహుడు, ఉద్భటుడు, రుయ్యకుడు – వీరు నలుగురూ రసమును అలంకారాలలో భాగంగా పేర్కొన్నవారు. వీరిలో భామహుడు రసవత్ ప్రేయో అలంకారాలకు లక్షణం చెప్పలేదు. దండి కూడా భక్తి రసము కాజాలదని కానీ, భావము మాత్రమేనని కానీ స్పష్టంగా ఏమీ పేర్కొనలేదు.

“ప్రియంగా మాట్లాడటం” అన్నది మాత్రమే దండి ప్రేయోలంకారానికి చెప్పిన లక్షణం. ప్రేయోలంకారానికి ఇచ్చిన ఉదాహరణలో ఆ ప్రియమైన మాటలు విదురుడు కృష్ణుడిని ఉద్దేశించి చెప్పినవి కాబట్టి ప్రేయోలంకారం భక్తిని సూచిస్తుందని చెప్పడం, విభావానుభావాలతో కలిసి ఉన్నది రసవదంలంకారం కాబట్టి అలా లేనిది ప్రేయోలంకారమని అనుకోవడం – ఈ రెండు విషయాలకీ ముడిపెట్టి భక్తి రసము కాదు భావము అన్న నిర్ణయానికి రావడం సమంజసంగా లేదు. ఎందుకంటే ఈ రెండు లక్షణాలకీ అసలు పొసగదు. రసాన్ని సూచించేది రసవదలంకారం, భావాన్ని సూచించేది ప్రేయోలంకారం అని అనుకుంటే, శోకం, క్రోధం, జుగుప్స వంటి భావాలను సూచించడంలో ప్రియ సంభాషణ ఉండదు కదా! మరి దండి ప్రేయోలంకారానికి చెప్పిన లక్షణమే ప్రియమైన సంభాషణ. కనుక ఈ రెండు లక్షణాలనీ కలపడం కుదరదు.

“ప్రియతరాఖ్యానం” అని దండి చెప్పిన లక్షణాన్నీ, దండీ భామహుడూ ఉదాహరణగా ఇచ్చిన విదురుడి మాటలనీ, తర్వాతికాలంలో భావాన్ని సూచించేది ప్రేయోలంకారమన్న ఉద్భట, రుయ్యకుల అభిప్రాయాన్నీ – మూడిటినీ పొసగించడం కుదరదు. మొదటి రెండిటినీ లేదా చివరి రెండిటినీ కలిపే అవకాశం ఉంది కానీ మూడింటినీ కలిపే అవకాశం లేదు. కనుక దండి భామహుడు ఉద్భటుడు రుయ్యకుడు అనే నలుగురు లాక్షణికులు “దేవాది విషయక రతి రసముగా పరిణమించే అవకాశం లేదు” అని చెప్పారన్న నిశ్చయానికి రావడానికి లేదు.

అలాగే భామహుడు చెప్పినట్లుగా లోచనంలో కనిపిస్తున్న వాక్యాల గురించి ఈ అధ్యాయంలో పైన చెప్పుకున్నాము. ప్రేయోలంకారం విషయంలో ఆవాక్యాలను పరిగణనలోకి తీసుకుంటే, అవి భక్తిరసమునకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి.

1.2.3   రస-భావములను గురించిన మౌలికమైన చర్చలు చేసినవారు

భరతుడు, ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు – వీరు ముగ్గురూ రసమును గురించిన, భావములను గురించిన మౌలికమైన చర్చలు చేసినవారు. రసమును గురించి మొట్టమొదట చెప్పిన వాడు భరతుడు అయితే రసమును కావ్యాత్మగా ప్రతిపాదించినవారు ఆనందవర్ధన అభినవగుప్తులు. రసనిష్పత్తికి సూత్రాన్ని ఇచ్చినవాడు భరతుడు అయితే దానిని కావ్యంలో సాధించే పద్ధతుల గురించి మాట్లాడినవాడు ఆనందవర్ధనుడు. ఆ యిద్దరి అభిప్రాయాలనీ తన వ్యాఖ్యానాలతో స్థిరీకరించినవాడు అభినవగుప్తుడు.

రససిద్ధాంతానికి సంబంధించి ఆలంకారికులందరూ సామాన్యంగా అంగీకరించిన, అనుసరిస్తున్న మౌలికాంశాలన్నీ ఈ ముగ్గురి నుండి వచ్చినవే. వీరి నిర్వచనాలకు ప్రతిపాదనలకు భిన్నంగా మాట్లాడిన ఆలంకారికుల సంఖ్య చాలా తక్కువ. వీరి సిద్ధాంతాలను సమూలంగా ఖండించినవారయితే అసలు లేరు. రససంఖ్య గురించి వీరి అభిప్రాయాలను ఈ అధ్యాయంలో పైన చెప్పుకున్నాము. వాటిని ఇపుడు పరిశీలిద్దాము.

ముందుగా ఆనందవర్ధనుని అభిప్రాయాన్ని చూస్తే అతడు శాంతమును నవమ రసంగా అంగీకరించాడు. అతని అభిప్రాయాన్ని అభినవగుప్తుడు సమర్థించాడు. అయితే శాంతరసాన్ని సమర్ధిస్తూ అభినవగుప్తుడు చెప్పిన విషయాలను గమనిస్తే అవన్నీ భక్తిరసానికి కూడా అనుకూలంగా కనిపిస్తాయి.

శాంతరసమును సమర్థిస్తూ అభినవగుప్తుడు చేసిన వాదనలను చూద్దాము.

ఈ వాదనలు అన్నీ భక్తిరసానికి కూడా వర్తించేవే. నిజానికి అభినవగుప్తుడు చెప్పిన తత్త్వజ్ఞానం స్థాయిగా గల శాంతరసానికీ భక్తిరసానికీ సామ్యం ఉంది. ఎందుకంటే ఒక స్థాయిలో తత్త్వజ్ఞానానికీ భక్తికీ భేదం లేదు. సాధన స్థితిలో కాకపోయినా సిద్ధస్థితిలో, పోషణ విషయంలో కాకపోయినా ఆస్వాదన విషయంలో తత్త్వజ్ఞానానికి, భక్తికీ సామ్యం ఉంది. మోక్ష సాధనకు సంబంధించినంతవరకు తత్త్వజ్ఞానము, భక్తి ఒక్కటే. అందుకే అభినవ గుప్తుడు భక్తిని ప్రత్యేక రసముగా పరిగణించనవసరం లేదనీ అది శాంతంలోనే అంతర్భవిస్తుందనీ అన్నాడు. కానీ కావ్యరచనకు సంబంధించిన రసపోషణ గురించి మాట్లాడుతున్నపుడు అవి రెండూ ఒకటేనా అన్న విషయాన్ని అభినవగుప్తుడు పరిగణించినట్లు కనబడదు. శ్రవ్యకావ్యంలో రసనిర్వహణకు సంబంధించిన ఆలోచనలు చేసిన ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు ఆ కోణంలో భక్తి, శాంతములు అభిన్నములేనా అన్న విషయాన్ని పరిశీలించలించినట్లు కనబడదు.

(సశేషం)

Exit mobile version