[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]
అధ్యాయం 1
సంస్కృతాలంకారికులు – భక్తి
సంస్కృతాలంకారికులలో కొందరు భక్తిరసాన్ని గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఆ వివరాలనూ భక్తిరసాన్ని గురించి ఆయా ఆలంకారికులు వెలిబుచ్చిన అభిప్రాయాలనూ ఈ అధ్యాయంలో పేర్కొంటున్నాను.
అలాగే మరికొందరు ఆలంకారికులు భక్తిరసాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడక పోయినా రససంఖ్య గురించి మాట్లాడారు. వారిలో భరతుడు చెప్పిన సంఖ్యకే రసములు పరిమితం కావాలని అన్నవారూ ఉన్నారు. అలా పరిమితం కానవసరం లేదని అభిప్రాయపడిన వారూ ఉన్నారు, అంటే భరతుడు చెప్పిన ఎనిమిది లేక తొమ్మిది భావాలు మాత్రమే రసస్థాయిని పొందగలవని అనుకోనక్కర లేదనీ, ఆ ఎనిమిది లేక తొమ్మిది స్థాయిభావాలే కాక ఇతర భావాలు కూడా రసస్థాయిని పొందగలవనీ చెప్పినవారన్నమాట. అలా రసముల “సంఖ్య” గురించి భరతుడు చెప్పినదానికి భిన్నంగా ఎవరైనా చెప్పి ఉంటే అటువంటి వ్యాఖ్యానాలను కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాను.
రసచర్చతో నిమిత్తం లేకుండా “భక్తికి సంబంధించిన” అంశాల గురించి, లేదా “భక్తికి అనుబంధమైన” అంశాల గురించి పూర్వాలంకారికులు వెలిబుచ్చిన అభిప్రాయాలేమైనా ఉంటే, వాటిని కూడా ఈ అధ్యాయంలో పేర్కొంటున్నాను.
రససిద్ధాంతం గురించీ రసానుభూతి గురించీ ఆలంకారికులు ప్రతిపాదించిన సాధారణమైన విషయాలను, భక్తితో సంబంధం లేని అంశాలను ఇక్కడ చెప్పడం లేదు. తరువాతి అధ్యాయాలలో భక్తిరసాన్ని గూర్చిన విశ్లేషణ చేస్తున్నపుడు పూర్వాలంకారికులు ఇతరత్రా వెలిబుచ్చిన అభిప్రాయాలను, అంటే రసనిష్పత్తికీ రసానుభూతికీ సంబంధించిన అభిప్రాయాలను అక్కడ అవసరమైన మేరకు ప్రస్తావిస్తాను.
1.1 ఆలంకారికుల ప్రతిపాదనలు
1.1.1 భరతుడు
మనకి ప్రస్తుతం లభిస్తున్న అలంకారశాస్త్ర గ్రంథాలలో మొట్టమొదటిది భరతుని నాట్యశాస్త్రం. భరతుడు నాట్య శాస్త్రంలో అష్టరసములనే చెప్పాడని కొందరు, కాదు నవరసములని చెప్పాడని కొందరు అంటారు. వివాదాస్పదమయిన ఆ తొమ్మిదవ రసము శాంతము. ఇది అందరకు తెలిసిన విషయమే. నాట్యశాస్త్రము యొక్క పూర్వ పాఠాలలో అష్టరసములని ఉన్నప్పటికీ, అభినవగుప్తుని కాలానికన్నా చాలా పూర్వమే శాంతం నవమ రసంగా అంగీకరించబడిందనీ, అభినవగుప్తుడు నాట్యశాస్త్రానికి రెండు పాఠాలు చూచి ఉన్నాడనీ తెలుస్తున్నది.
శృంగారహాస్యకరుణరౌద్రవీరభయానకాః
బీభత్సాద్భుతసంజ్ఞౌ చేత్యష్టౌ నాట్యే రసాః స్మృతాః
అష్టరసములని చెప్పే శ్లోకం పై విధంగా ఉంటే, నవరసములని చెప్పే శ్లోకం ఈ క్రింది విధంగా ఉంటుంది.
శృంగారహాస్యకరుణరౌద్రవీరభయానకాః
బీభత్సాద్భుత శాంతాశ్చ నవ నాట్యే రసాః స్మృతాః
ఈ రెండవ శ్లోకము ప్రక్షిప్తమని విజ్ఞుల అభిప్రాయము. అయితే, ఈ శ్లోకం ప్రక్షిప్తం అయినా కాకున్నా, “శాంతమును రసమనడం భరతుడికి అభిమతమే” అని చెప్పడానికి శాంతరస సమర్థకులు మరికొన్ని ఆధారాలు చూపుతారు. భరతుడు శాంతాన్ని ప్రత్యక్షంగా ప్రవచించకపోయినా, పరోక్షంగా చెప్పాడంటూ ఈ క్రింది శ్లోకాలను చూపిస్తారు.
దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినామ్
విశ్రాంతి జననం కాలే నాట్యమేతద్భవిష్యతి (1-114)
దేవానామసురాణాం చ రాజ్ఞామథ కుటుమ్బినామ్
బ్రహ్మర్షీణాం చ విజ్ఞేయం నాట్యవృత్తాన్త దర్శకమ్ (1-118)
నాట్యప్రయోజనాలను ప్రస్తావించే ఈ శ్లోకాలలో నాట్యం తపస్వులకు కూడా విశ్రాంతి జనకమని, బ్రహ్మర్షులకు కూడా చూడదగినదని చెప్పడాన్ని బట్టి భరతుడు శాంత రసానికి కూడా నాట్యంలో స్థానం ఉందని అంగీకరించాడని, పరోక్షంగా శాంత రసాన్ని సమర్థించాడని వారు అంటారు.
1.1.2 నందికేశ్వరుడు
నాట్యశాస్త్రం తర్వాత పేర్కొనదగిన గ్రంథం అభినయదర్పణం. ఇది క్రీ.శ. 3 వ శతాబ్ది తర్వాత రచింపబడి ఉండవచ్చు. అభినయదర్పణానికి లభించిన వ్రాతప్రతులన్నీ తెలుగులిపిలోనే ఉన్నాయి కాబట్టి అభినయదర్పణం తెలుగుగడ్డ మీదే రచింపబడి ఉంటుందని భావించవచ్చు. నాట్యశాస్త్రంలో భరతుడు నాట్యాన్ని ప్రధానంగాను నృత్తాన్ని అనుషంగికంగాను వివరించాడు. ఆ తర్వాత నృత్యం ప్రత్యేక కళగా రూపొందింది. అలా ప్రత్యేక కళగా రూపొందిన నృత్యం కోసం వచ్చినదే అభినయదర్పణం. నందికేశ్వరుడు రచించిన అభినయదర్పణంలో కూడా “నాట్యం దుఃఖార్తి శోక నిర్వేదాలను పోగొట్టే సాధనమనీ, బ్రహ్మానందాన్ని మించిన ఆనందాన్ని ఇచ్చేది” అనీ వ్యాఖ్యానించడం; “లేకుంటే నారదాది మునులను కూడా అది ఎలా ఆకర్షించగలిగింది?” అని ప్రశ్నించడం ఉంటుంది.
దుఃఖార్తి శోక నిర్వేద విచ్చేద సాధనం
అపి బ్రహ్మ పరానందాదిద మభ్యధికం మతం
జహార నారదాదీనాం చిత్తాని కథ మన్యథా (శ్లోకం 18)
నాట్యశాస్త్రంలో రసదృష్టులు, స్థాయిభావదృష్టులు, సంచారిభావ దృష్టులు విడిగా చూపబడ్డాయి. కానీ అభినయదర్పణంలో మొత్తం ఎనిమిది దృష్టిభేదాలే చెప్పారు. ఆ ఎనిమిది దృష్టులలో నాట్యశాస్త్రంలో కనబడని ఒక క్రొత్త దృష్టి కనబడుతుంది. అది నిమీలితదృష్టి. దాని వివరణ ఇలా ఉంటుంది. “దృష్టి సగమే కనిపించినపుడు అది నిమీలిత దృష్టి అవుతుంది. ఋషివేషం, పారవశ్యం, జపం, ధ్యానం, నమస్కారం, ఉన్మాదం, సూక్ష్మదృష్టి – ఈ అర్థాలలో నిమీలిత దృష్టి తగును” (పుట 94). ఇది ఒక ఆసక్తికరమయిన, గమనించవలసిన అంశం.
ఆసక్తికరమయిన మరొక విషయం ఏమిటంటే అటు నాట్యశాస్త్రంలోను, ఇటు అభినయ దర్పణంలోను కూడా అసంయుత హస్తాలలో మొదటిదైన “పతాక”, సంయుత హస్తాలలో మొదటిదైన “అంజలి” – రెండూ కూడా భక్తి ప్రకటనకు సంబంధించినవే. పతాక హస్త వివరణ చూడండి. “పూర్వం, ధాత ఒంటరిగా పరబ్రహ్మను సందర్శించి, పతాక ఆకారంగా హస్తం పట్టి “జయజయ” అని స్తుతించినపుడు పతాక హస్తం జన్మించింది. అందుచేతనే ఇది అన్ని హస్తాలకు మొదటి హస్తం అయింది” (పుట 155). అసంయుత హస్తాల్లో మొదటిదైన అంజలి “దేవతలకు గురువులకు విప్రులకు నమస్కరించడంలో వినియోగపడుతుంది” (పుట 249).
21వ శ్లోకంలో “రసభావ వ్యంజనాది యుక్తం నృత్యమితీర్యతే” అని, 25వ శ్లోకంలోని “ఏతన్నృత్యం మహారాజ సభాయాం కల్పయేత్ సదా” అని, నందికేశ్వరుడు చెప్పిన మాటలను వివరిస్తూ “భంగ్యంతరముగా చెప్పవలయునన్నచో ఆరాధనా సమయములందు నృత్తము ప్రాధాన్యము వహించినచో రాజసభలందు “అభినయము” ప్రాధాన్యము వహించునన్నమాట” అంటారు పోణంగి శ్రీరామ అప్పారావుగారు నృత్తరత్నావళికి వ్రాసిన పీఠికలో. భక్తిసంబంధమైన ప్రదర్శనలో అభినయానికన్నా నృత్తానికే ప్రాధాన్యమన్న ఈ వ్యాఖ్య గమనింపతగినది.
1.1.3 కోహలుడు
కోహలుని గ్రంథము మనకు లభ్యం కాదు కానీ కోహలుడు చెప్పినట్లుగా అభినవగుప్తుడు చెప్పిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెప్పుకోవాలి. అభినయదర్పణము పీఠికలో పోణంగి శ్రీరామ అప్పారావు గారు ఈ విషయాన్ని ప్రస్తావించారు (పుట xviii).
సంధ్యాయాం నృత్యతః శంభోర్భక్త్యాగ్రే నారదః పురాః
గీతవాం స్త్రిపురోన్మాథం తచ్చిత్తస్త్వథ గీతకే
చకారాభినయం ప్రీత స్తతండుం చ సోఽబ్రవీత్
నాట్యోక్తాభినయే నేదం వత్స యోజయ తాండవం
హిమాలయం మీద ఒకనాటి సంధ్యాకాలంలో శివుడు నృత్తం చేస్తుండగా ఆయన ఎదుట నారదుడు భక్తితో త్రిపురోన్మాథగీతం గానం చేసినాడు. ఆ గీతం వింటున్న శివుడు ప్రీత మనస్కుడై ఆ గీతం యొక్క అర్థాన్ని అభినయించినాడు. అంతట శివుడు తండువును పిలిచి “ఈ తాండవాన్ని నాట్యంలో చెప్పబడిన అభినయాలతో కూర్చుము” అని ఆదేశించినాడు. అంటే శివుడు మొట్టమొదట అభినయించినది ఒక భక్తిగీతాన్నే. కాబట్టి భక్తి అభినయయోగ్యమేననీ, సాక్షాత్తూ నారద మునీంద్రుల స్థాయిలోని భక్తిని కూడా అభినయించవచ్చునని ఈ శ్లోకం మనకు తెలియచెప్తున్నది.
1.1.4 జాయపసేనాని
జాయన నృత్తరత్నావళి అనే గ్రంథాన్ని క్రీ.శ.1253-54లో రచించాడు. భక్తిని గురించిన, భక్తిరసానికి సంబంధించిన అంశములేవీ ఈ గ్రంథంలో కనబడలేదు.
1.1.5 దండి
దండి రచించిన కావ్యాదర్శంలో రసములను అలంకారాలలో భాగంగా చెప్పడం కనిపిస్తుంది. ద్వితీయ పరిచ్ఛేదంలోని ఈ క్రింది శ్లోకంలో ఊర్జస్వి, రసవత్, ప్రేయోలంకారాలకు నిర్వచనమిచ్చిన దండి తర్వాతి శ్లోకాలలో వాటికి మూడింటికీ ఉదాహరణలు కూడా ఇచ్చాడు.
ప్రేయః ప్రియతరాఖ్యానం రసవద్రసపేశలమ్
ఊర్జస్విరూఢాహఙ్కారం యుక్తోత్కర్షం చ తత్త్రయమ్ – శ్లో. 275
ప్రియమైన విషయాన్ని చెప్పడం ప్రేయోలంకారమని, రసముచే సుందరమైనది రసవదలంకారమని, రూఢాహంకారము కలది ఊర్జస్వి అలంకారమని లక్షణం చెప్పాక, మొదట ప్రేయోలంకారానికి రెండు ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి విదురుడు కృష్ణునితో మాట్లాడే ప్రియమైన మాటలు; మరొకటి ఈశ్వరుడు ప్రత్యక్షమయినపుడు రాతవర్మ చేసే ఆనంద ప్రకటన. దీని తర్వాత రసవదలంకారాన్ని చెప్పి వరుసగా శృంగారాది ఎనిమిది రసములకూ ఉదాహరణలు ఇచ్చారు. రసవదలంకారాన్ని వివరించడానికి ఇచ్చిన శ్లోకం ఈ క్రింది విధంగా ఉంటుంది.
ప్రాక్ ప్రీతిర్దర్శితా సేయం రతిః శృఙ్గారతాం గతా
రూపబాహుల్య యోగేన తదిదం రసవద్వచః (శ్లో: 281)
ఈ శ్లోకానికి అర్థం పుల్లెల శ్రీరామచంద్రుడు గారి అనువాదంలో ఈ క్రింది విధంగా కనిపిస్తుంది. “ఇంతకు పూర్వం ప్రీతి చూపబడింది. ఇప్పుడు ఆ రతియే విభావాదులతో పరిపుష్టమై శృంగార రసత్వాన్ని పొందింది.”
ఈ అనువాదంతో పాటు ఇచ్చిన వ్యాఖ్యానంలో శ్రీరామచంద్రుడు గారు “రతి అనగా ప్రేమ. గురు దేవతాది విషయకమగు రతిని భక్తియందురు. మిత్రుని విషయమున రతి స్నేహము. పుత్రాదుల విషయమున రతి వాత్సల్యము. కాంతాదుల విషయమున రతి అనురాగము. ఇచట దేవతా విషయక రతినే దండి ప్రీతి అని పేర్కొన్నాడు” అని అన్నారు (పుట 180). అయితే ఇదంతా తరువాతి కాలంలోని ఆలంకారికులు చేసిన ప్రతిపాదనలను అనుసరించి ఇచ్చిన వివరణగా కనిపిస్తుంది కానీ దండి చెప్పినదానికి యథాతథ అనువాదంగా కనిపించదు. నిజానికి శ్రీరామచంద్రుడు గారే ముందు పుటలో మూడు అలంకారాలకీ లక్షణం చెప్పిన “ప్రేయః ప్రియతరాఖ్యానం..” అన్న శ్లోకాన్ని (శ్లో. 275) వివరిస్తున్నపుడు “దీనికి కొందరు వ్యాఖ్యాతలు దేవాది విషయక రత్యాది భావములను, ఇతరములగు నిర్వేదాది భావములను ప్రకటించుట ప్రేయోలంకారమని అర్థము చెప్పినారు. అది అర్వాచీనాలంకారికుల లక్షణమును దృష్టిలో నుంచుకొని చెప్పినట్లు కనబడును. కాని, వక్తకును, శ్రోతకును అత్యంత ప్రియమగు విషయమును చెప్పుట ప్రేయోలంకారమని మాత్రమే దండి అభిప్రాయమై యుండును.” అని స్పష్టంగా చెప్పారు (పుట 177).
1.1.6 భామహుడు
భామహుడు కూడా రసమును అలంకారములలో భాగంగానే చెప్పాడు. భామహుడు రచించిన కావ్యాలంకారం లోని తృతీయ పరిచ్ఛేదంలో మొదటి శ్లోకం రసవదలంకారం గురించి చెప్తుంది.
ప్రేయో రసవదూర్జస్వి పర్యాయోక్తం సమాహితమ్
ద్విప్రకారముదాత్తం చ భేదైః శ్లిష్టమపి త్రిభిః
దండి వలెనే భామహుడు కూడా ప్రేయోలంకారము, రసవదలంకారము, ఊర్జస్వి అలంకారము – మూడిటినీ ఒకే శ్లోకంలో వరుసగా పేర్కొన్నాడు కానీ వాటికి నిర్వచనాలేమీ ఇవ్వలేదు. ఉదాహరణలు మాత్రమే ఇచ్చాడు. ప్రేయోలంకారానికి భామహుడు కూడా విదురుడు కృష్ణునితో మాట్లాడే మాటలనే ఉదాహరణగా ఇచ్చాడు. రసవదలంకారములో ఒక్క శృంగార రసమునకు మాత్రమే ఉదాహరణ ఇచ్చాడు. భక్తిరసము గురించి గాని రససంఖ్య గురించి గాని ఇతడు ప్రత్యేకముగా ఏమీ చెప్పలేదు.
అయితే ఇతర గ్రంథాలలో భామహుడు చెప్పినట్లుగా కనిపిస్తున్న కొన్ని వాక్యాలు ప్రస్తుతం లభిస్తున్న కావ్యాలంకారంలో కనిపించవు. కనుక భామహుడు అలంకారాలకు సంబంధించిన మరొక గ్రంథమేమైనా వ్రాసి ఉండవచ్చు. లోచనంలో అభినవగుప్తుడు “భామహాభిప్రాయేణ చాటుషు ప్రేయోలంకారస్య వాక్యార్థత్వేపి రసాదాయః అంగభూతాః ఇత్యేకం వాక్యం. భామహేనహి గురుదేవనృపతిపుత్ర విషయ ప్రీతి వర్ణనం ప్రేయోలంకార ఇత్యుక్తం” అని చెప్పడం కనిపిస్తుంది. ఈ వాక్యాలు కావ్యాలంకారంలో కనిపించవు.
1.1.7 భట్టలోల్లటుడు
ఇతడు క్రీ.శ. 800-840 కాలం వాడనీ, భరతుని నాట్యశాస్త్రానికి వ్యాఖ్య రచించాడనీ తెలుస్తున్నది. ఇతని గ్రంథం నేడు లభ్యం కాకపోయినా అభినవభారతిలో అభినవగుప్తుడు ఇచ్చిన వివరాల ఆధారంగా ఇతని అభిప్రాయాలను కొన్నిటిని తెలుసుకోవచ్చు. “అలంకారశాస్త్రచరిత్ర” అనే తమ గ్రంథంలో పుల్లెల శ్రీరామచంద్రుడు లోల్లటుని అభిప్రాయాలను పేర్కొన్నారు. “రసాలు అనేకం. అయినా ప్రసిద్ధమైన సాంప్రదాయిక గ్రంథాల ననుసరించి ఎనిమిది లేదా తొమ్మిది రసాలను మాత్రమే రంగస్థలం మీద ప్రదర్శించాలి” అన్న లోల్లటుని అభిప్రాయాన్నీ దానికి ఆధారమైన అభినవభారతి శ్లోకాన్నీ ఇచ్చారు (పుట 54).
“తేనానంత్యేఽపి పార్షద ప్రసిద్ధ్యా ఏతావతాం ప్రయోజ్యత్వమితి యద్భట్టలోల్లటేన నిరూపితం తదవలేపనా పరామృష్ట్యా ఇత్యలమ్”
పోణంగి శ్రీరామ అప్పారావు గారు తాము అనువదించిన నాట్యశాస్త్రములో లోల్లటుని గురించి చెప్తూ, “విభావములు, అనుభావములు, స్థాయిభావములు, సంచారిభావములు మొదలగునవన్నియు ప్రత్యేక ప్రత్యేకములుగా రసములుగా పరిణమించగలవని, కాని లోకప్రసిద్ధి లేకపోవుటచే ఎనిమిది రసములనే భరతుడు చెప్పెనని లోల్లటుడు నిరూపించినాడు” అన్నారు (పుట 881).
తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారు కూడా తమ సిద్ధాంత గ్రంథంలో ఈ విషయాన్నీ, ఈ శ్లోకాన్నీ పేర్కొన్నారు (పుట 129). అంతేకాదు, శాంత రసాన్ని గురించి వివరించే సందర్భంలో వారు “భరతుని నాట్యశాస్త్ర వ్యాఖ్యాతలలో భట్టలోల్లటుడు ఆనంత్యమునే అంగీకరించిన వాడగుటచే శాంతము నంగీకరించెననియే వచింపవలసి ఉన్నది” అంటారు. ఆప్రకారంగా చూస్తే భట్టలోల్లటుడు భక్తిని కూడా అంగీకరించినట్లే భావించవలసి వస్తుంది.
1.1.8 వామనుడు
“కావ్యాలంకార సూత్రం” రచించిన వామనుడు క్రీ.శ 800 ప్రాంతానికి చెందిన వాడు. ఇతడు రీతివాది కాబట్టి రసానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. దండి రసాన్ని అలంకారంగా పరిగణిస్తే వామనుడు రసాన్ని ఒక గుణంలో పొదిగాడు. ఓజస్సు, ప్రసాదం వంటి పది శబ్దగుణాలు, అవే పేర్లతో పది అర్థగుణాలూ చెప్పిన వామనుడు అర్థగుణాలలో ఒకటయిన “కాంతి”లోనే రసాన్ని అంతర్గతం చేశాడు.
“దీప్తరసత్వం కాంతిః” అన్నది కావ్యాలంకారసూత్రం లోని తృతీయాధికరణంలో “కాంతి” అనే అర్థగుణాన్ని వివరించే సూత్రం (పుట 87: శ్లో. 15). అక్కడ శృంగారాది రసములు చక్కగా స్ఫురించడమే కాంతి అని చెప్పిన వామనుడు ఉదాహరణగా ఒక్క శృంగారరసాన్ని మాత్రమే పేర్కొని మిగిలిన రసాలను కూడా అలాగే చూసుకోవాలని అన్నాడు. ఇతడు భక్తిరసం గురించి గానీ రససంఖ్య గురించి కానీ ప్రత్యేకంగా ఏమీ వ్యాఖ్యానించలేదు.
1.1.9 ఉద్భటుడు
ఉద్భటుడు కూడా రసముల గురించి ప్రత్యేకం చర్చించకపోయినా అలంకారాలలో భాగంగా ప్రేయో, రసవత్, ఊర్జస్వి అలంకారాల గురించి చెప్పాడు.
రసవత్ అలంకారానికి చెప్పిన లక్షణం దండి, భామహుడు చెప్పినటువంటిదే. రసవదలంకారానికి చెప్పిన లక్షణంలో తొమ్మిది రసాలను పేర్కొన్నాడు. ఇక్కడ చెప్పిన తొమ్మిదవ రసమైన శాంతాన్ని ఉద్భటుడే జత చేశాడన్న అభిప్రాయం ఉంది. ఇక ప్రేయోలంకారానికి చెప్పిన లక్షణంలో ‘రత్యాది భావాలను అనుభావాలతో సూచిస్తూ చెప్పబడినది ప్రేయోలంకారం’ అన్నాడు. తానే రచించిన కుమారసంభవంలోని మాతృ పుత్ర సంబంధమయిన ఒక శ్లోకాన్ని ఉదాహరణగా ఇచ్చాడు. అయితే వ్యాఖ్యాతలు రసంగా పరిణమించని భావాలను చెప్పేది ప్రేయోలంకారం – అంటే దేవగురుపుత్ర సంబంధమయిన రతిని చెప్పేది – అని వ్యాఖ్యానించడం కనిపిస్తుంది.
1.1.10 రుద్రటుడు
నవరసములకు ప్రేయోరసాన్ని జోడించినది ఇతడే. తాను రచించిన కావ్యాలంకారం అనే గ్రంథంలో ప్రేయోరసమును దశమరసముగా చెప్పాడు.
శృంగార వీర కరుణా బీభత్సభయానకాద్భుతా హాస్యః
రౌద్రః శాంతః ప్రేయానితి మంతవ్యా రసాః సర్వే
ద్వాదశోధ్యాయము శ్లో. 3
రుద్రటుడు పది రసములనే పేర్కొన్నాడు కానీ నిర్వేదము మొదలైన వ్యభిచార భావాలు కూడా రసములు కావచ్చునని అంగీకరించాడు.
రసనాద్రసత్వమేషాం మధురాదీనామివోక్తమాచార్యైః
నిర్వేదాదిష్వపి తన్నికామమస్తీతి తేఽపి రసాః
ద్వాదశోధ్యాయము శ్లో. 4
పంచదశోధ్యాయంలో రుద్రటుడు ప్రేయోరసాన్ని ఈ క్రింది విధంగా నిర్వచించాడు.
స్నేహప్రకృతిః ప్రేయాన్సన్గతశీలార్యనాయకో భవతి
స్నేహస్తు సాహచర్యాత్ప్రకృతేరూచారసంబంధాత్ – శ్లో. 17
నిర్వ్యాజమానోవృత్తిః సనర్మసద్భావపేశలాలాపాః
అన్యోన్యం ప్రతి సుహృదోవ్యవహారోశ్యం మతస్తత్ర – శ్లో. 18
ప్రస్యందిప్రమదాశ్రుః సుస్నిగ్ధస్ఫారలోచనాలోకః
ఆర్ద్రాంతఃకరణతయా స్నేహపదే భవతి సర్వత్ర – శ్లో. 19
ప్రేయో రసానికి రుద్రటుడు చెప్పిన ఈ లక్షణాన్ని గమనిస్తే, అతడు ఇక్కడ భక్తి, భక్తిరసము అన్న మాటలు వాడకపోయినా, ఈ లక్షణం భక్తిరసానికి దగ్గరగా ఉందని అర్థమవుతుంది. ఈ ప్రేయోరసానికి రుద్రటుడు ఉదాహరణ ఇవ్వలేదు. ఉదాహరణ ఇచ్చి ఉంటే రుద్రటుని అభిప్రాయంలో ప్రేయోరసం ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమను సూచిస్తుందా, నాయికా నాయకుల మధ్య ప్రేమనా, దేవాది విషయకమైన రతినా లేక వీటన్నిటినీనా అన్న విషయం మరింత స్పష్టంగా అర్థమయ్యేది.
1.1.11 రుద్రభట్టు
కావ్యాలంకారం వ్రాసిన రుద్రటుడు, శృంగార తిలకం వ్రాసిన రుద్రభట్టు ఒకరే అని కొందరు భావించారు. కానీ వీరిద్దరూ వేరు వేరు అనడానికి ప్రబలమైన హేతువులున్నాయని పుల్లెల శ్రీరామచంద్రుడు తమ అలంకారశాస్త్ర చరిత్రలో వివరించారు (పుట 138). రెండు రచనలలోను కొన్ని ప్రధానమైన విషయాలలోనే వైరుధ్యాలున్నాయి. వాటిలో ఒకటి రససంఖ్య. రుద్రటుడు పదిరసాలను చెప్తే శృంగారతిలకం తొమ్మిది రసాలనే చెప్పింది.
“శృంగారహాస్యకరుణా రౌద్రవీరభయానకాః బీభత్సాద్భుతశాంతాశ్చ కావ్యే నవ రసాః స్మృతాః” అన్నది శృంగార తిలకం ప్రథమ పరిచ్ఛేదంలోని తొమ్మిదవ శ్లోకం.
1.1.12 ఆనందవర్ధనుడు
ఆనందవర్ధనుడు ధ్వనికి ప్రాధాన్యాన్నిచ్చిన ఆలంకారికుడు. ఆనందవర్ధనుని ధ్వన్యాలోకం, దానికి వ్యాఖ్యానంగా వచ్చిన లోచనం రసధ్వనిని పరిచయం చేసి దానిని కావ్యాత్మగా ప్రతిపాదిస్తాయి. అలాగే శాంతమును నవమరసంగా అంగీకరించి సమర్థిస్తాయి. క్వచిచ్ఛమః (కొన్ని చోట్ల శమం) అన్న భరతుని మాటను ఆధారం చేసుకుని శాంతరసం భరతునికి కూడా అంగీకారమేనన్న వివరణను ఇస్తుంది లోచనం. రసధ్వనిని కావ్యాత్మగా చెప్పడం, శాంతమును రసముగా ప్రతిపాదించడం అన్న ఈ రెండు విషయాలూ చాలామందిచే అంగీకరించబడినాయి. బహుశా అందుకే ఆనందవర్ధనునికన్నా పూర్వకాలంలోని ఆలంకారికులు రసములను అలంకారాలలో భాగంగా చెప్పినప్పటికీ ఆనందవర్ధనుని తర్వాతి ఆలంకారికులందరూ రసములను ప్రత్యేకంగా ప్రస్తావించడమూ, ఎక్కువమంది నవరసములనే పేర్కొనడమూ కనిపిస్తుంది.
1.1.13 రాజశేఖరుడు
రాజశేఖరుడు రచించిన కావ్యమీమాంస కవులకు మార్గదర్శకంగా రచించబడిన గ్రంథం. ఈ గ్రంథంలోని 18 అధ్యాయాలలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వివరించబడినాయి. ఇందులో అలంకారాలు, గుణాలు, రసాల వంటి విషయాల గురించిన ప్రతిపాదనలు లేవు. అయితే, ప్రస్తుతాంశానికి ఉపయుక్తంగా తోచే ఒక ఆసక్తికరమయిన అభిప్రాయం నాలుగవ అధ్యాయంలో కనిపిస్తుంది.
సత్కావ్యే విక్రియాః కాశ్చిత్భావకస్యోల్లసంతి తాః
సర్వాభినయనిర్ణీతౌ దృష్టా నాట్యసృజా న యాః (4. 18)
“సత్కావ్య పఠన సమయమందు భావకునకు ఒకానొక విధమైన, అనగా వర్ణింప శక్యము కాని మానస వికారములు కలుగును. అనేకవిధములగు అభినయములను నిర్ణయించినపుడు, నాట్యశాస్త్ర నిర్మాత యగు భరతుడు కూడ వాటిని గూర్చి ఊహించి ఉండలేదు” అన్న ఈ అభిప్రాయం గమనించతగినది.
1.1.14 అజితసేనుడు
ఇతను రచించిన గ్రంథం అలంకారచింతామణి. అయిదు పరిచ్ఛేదముల ఈగ్రంథంలోని చతుర్థ పరిచ్ఛేదంలో దండి భామహాదుల వలె అజితసేనుడు ప్రేయో రసవదూర్జస్వి అలంకారాలనూ వివరించాడు, మరలా పంచమ పరిచ్ఛేదంలో రసభావాదులనూ వివరించాడు. ప్రియమైన విషయాన్ని చెప్పేది ప్రేయోలంకారము, రససహితమైనది రసవదలంకారము, ఆత్మప్రశంసతో కూడినది ఊర్జస్వి అన్నవి అలంకారాలకు చెప్పిన లక్షణాలు. రససంఖ్య విషయానికి వస్తే, తొమ్మిది రసములు చెప్పబడ్డాయి. అంటే శృంగారాది అష్టరసములు, శమం స్థాయిభావంగా ఉన్న శాంతరసము చెప్పబడ్డాయి.
1.1.15 కుంతకుడు
వక్రోక్తి జీవితమనే గ్రంథాన్ని రచించిన కుంతకుడు క్రీ.శ 950-1050 సంవత్సరముల మధ్య ఉండి ఉండవచ్చు. వక్రోక్తి గురించే ప్రధానంగా మాట్లాడిన కుంతకుడు ప్రసంగవశాన రసవదలంకారం గురించీ ప్రేయోలంకారం గురించీ చర్చించి, వాటిని అలంకారాలనడమే అసంగతమన్నాడు. రసవద్ప్రేయోలంకారాలకు దండి, భామహుడు, ఉద్భటుడు చెప్పిన లక్షణాలను ఖండించాడు. అయితే రససంఖ్యను గురించి కాని, భక్తిని రసముగా పరిగణించవచ్చునా లేదా అన్న విషయాన్ని గురించి కానీ ఇతడు ఎటువంటి వ్యాఖ్యానమూ చేయలేదు.
1.1.16 అభినవుడు
అభినవగుప్తుడు భరతుని నాట్యశాస్త్రానికి వ్యాఖ్యానంగా రచించిన అభినవభారతిలో శృంగారాది అష్టరసములతో పాటు శాంతాన్ని కూడా నవమరసంగా పరిగణించాడు. మిగిలిన రసములన్నిటినీ ఖండించి రసములు తొమ్మిదేనన్నాడు. నవరసములకు మాత్రమే పుమర్థోపయోగిత్వము, రంజనాధిక్యము ఉన్నాయనీ కనుక అవి మాత్రమే రసములు అవుతాయనీ మిగిలినవి భావస్థితిలోనే అణగిపోతాయనీ అన్నాడు. కొందరు ప్రతిపాదించే స్నేహాది రసములు ఆ తొమ్మిదింటిలోనే అంతర్భవిస్తాయని అన్నాడు.
పిల్లలకు తల్లిదండ్రుల పట్ల, యువకులకు మిత్రుల పట్ల, లక్ష్మణుని వంటి వారికి సోదరుల పట్ల ఉండే స్నేహం వలెనే తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఉండే స్నేహం కూడా రతిలోనే అంతర్భవిస్తుందని అన్నాడు. అంటే వాత్సల్యమును ప్రత్యేక రసముగా పరిగణించనవసరము లేదని భావం. చివరగా భక్తి విషయము కూడా అంతేనని చెప్పాడు. శాంతరసమును గురించి చెప్తున్నపుడు ఈశ్వరప్రణిధాన విషయకమైన భక్తి శ్రద్ధలు శాంతంలో అంతర్భవిస్తాయని అన్నాడు.
(సశేషం)
శ్రీ వల్లీ రాధిక చక్కని కథా రచయిత్రి. లోతైన తాత్వికతకు నిత్య జీవితంలోని సంఘటనల ద్వారా సరళంగా ప్రదర్శిస్తారు. ‘తక్కువేమి మనకూ’, ‘స్వయం ప్రకాశం’, ‘హేలగా… ఆనంద డోలగా..’ వీరి పేరుపొందిన కథల సంపుటాలు.