[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]
అధ్యాయం 6 – మొదటి భాగం
కావ్యాధారిత విశ్లేషణ
భక్తికి రసప్రతిపత్తిని నిరాకరించడం సమంజసమేనా అన్న విషయాన్ని ఆలంకారిక శాస్త్రాలను, విమర్శకుల అభిప్రాయాలను ఆధారం చేసుకుని చర్చించడం అయిదవ అధ్యాయంలో జరిగింది. అంటే అక్కడ పాఠకుని యొక్క అనుభూతి ఆధారంగా భక్తిరసప్రతిపత్తి చర్చించబడింది. ఈ అధ్యాయంలో కవి యొక్క అభివ్యక్తి ఆధారంగా భక్తిరసప్రతిపత్తి చర్చించబడుతుంది.
నిజానికి భక్తి విషయంలో తెలుగు కవుల అనుభూతి ఏమిటి, భక్తికి వారు ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటి అన్న విషయాలు కూడా నాలుగవ అధ్యాయంలో చర్చించబడినాయి. ఆదికవి నన్నయ్య నుండి ఆధునిక కవుల వరకూ తమ కావ్యాలలోను, ఇతరత్రా వ్యక్తం చేసిన అభిప్రాయాలలోను, భక్తిని ఎలా పరిగణించారన్న విషయాన్ని ఆ అధ్యాయంలో స్థూలంగా పరిశీలించడం జరిగింది. ఈ అధ్యాయంలో కవి యొక్క అభివ్యక్తి, కావ్యనిర్వహణ అనే కోణాల నుంచి భక్తిరసపోషణను మరికొంత సూక్ష్మంగా పరిశీలించడం జరుగుతుంది.
ఈ విధంగా కవివైపు నుంచీ కావ్యనిర్వహణ వైపు నుంచీ ఈ విషయాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం. నిజానికి అసలు రసముల విభజన ఎందుకు చేయాలి? ఆ విభజన వలన ప్రయోజనమేమిటి అని ఆలోచిస్తే రససంఖ్యను గూర్చిన పరిశీలన ముఖ్యంగా కవి వైపు నుంచే జరగాలని అర్థమవుతుంది. ఎందుకంటే అంతిమంగా రసం ఉద్భవించేది సామాజికునిలోనే అయినప్పటికీ అందుకు దోహదం చేసే కావ్యనిర్మాణం చేపట్టవలసినది కవి. ఏ రసం వలన తాను ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనేది సామాజికునికి అంత ప్రధానమైన విషయం కాదు. కానీ పాఠకునిలో రసానందాన్ని కలిగించడానికి ఎన్ని మార్గాలున్నాయి, వాటి విశిష్టతలేమిటి అన్న విషయ పరిజ్ఞానం కవికి ముఖ్యం. అటువంటి పరిజ్ఞానం ఉన్న కవి ఆయా మార్గాలను తన కావ్యంలో చక్కగా ఆవిష్కరించగలుగుతాడు.
సామాజికునికి రసాస్వాదన శక్తి ఉంటే చాలు, రసవివేచన శక్తి అవసరం లేదు. కానీ కావ్యంలో రసాన్ని నిర్వహించవలసిన, పండించవలసిన కవికి రసభేదాల విషయంలో చాలా స్పష్టత ఉండాలి. అలంకారశాస్త్ర రచన కవికి ఆ స్పష్టతను ఇచ్చేందుకు దోహదపడాలి.
కాబట్టి ఫలానా రసం ఫలానా రసంలో అంతర్భవిస్తుంది అని తేల్చి వేసే ముందు దీని వలన కావ్య నిర్మాణానికి కావలసిన సౌలభ్యాన్నీ కవికి అందవలసిన ప్రయోజనాన్నీ ఏమన్నా దెబ్బ తీస్తున్నామా అని ఆలోచించడం చాలా ముఖ్యం. రెండు విభిన్న రసాల పోషణలో ఉండే భేదాలను లోతుగా చర్చించకుండా స్థూలంగా అవి రెండూ ఒకటేనని నిర్ణయించడం వలన కవికి ఆ రసపోషణకు సంబంధించిన సహాయం అలంకారశాస్త్రం నుండి లభించదు. విమర్శకులకు పరిశోధకులకు ఆ రసం గురించి మరింత లోతుగా ఆలోచించే పరిశీలించే అవకాశమూ దొరకదు.
ఈ విషయాన్ని అర్థం చేసుకుని పరిశీలిస్తే భక్తిరసము మరొక రసంలో అంతర్భవిస్తుంది లేదా అంతర్భవించదు అన్న నిర్ణయాన్ని కేవలం సామాజికుని వైపు నుంచి చేయడం కన్నా కవినీ కావ్యాన్నీ కూడా పరిగణన లోకి తీసుకుని చేయడం ద్వారా ఎక్కువ స్పష్టతనీ ప్రయోజనాన్నీ సాధించవచ్చునని అనిపిస్తుంది.
ఎందుకంటే పాఠకుని వైపు నుంచి చేస్తే ఆనందం ఆధారంగా చేయాలి. ఆనందంలో భేదాన్ని గుర్తించడం కష్టమూ అస్పష్టమూ కూడా. అదే కవి వైపు నుంచి అయితే, కవితా ద్రవ్యాల ఆధారంగా పరిశీలిస్తాము కనుక నిర్ణయం సులభమూ స్పష్టమూ అవుతుంది.
“తెలుగు విమర్శ – రసనిర్ణయ పరిశీలన” అన్న తమ సిద్ధాంతగ్రంథంలో భారతిగారు కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తూ “రసము సహృదయుని అనుభూతి అన్నది సత్యమే కాని సహృదయానుభూతిని నిరూపించే కొలమానాలు లేవు. కావ్యంలో రసం నిర్వహింపబడిందంటే అది సహృదయ అనుభవానికి వచ్చినట్లే. అందుకని కావ్యంలో రసం నిర్వహింపబడిన పద్ధతిని వివేచించాలి” అంటారు (పుట 194).
అలాగే కావ్యంలో ప్రధాన రసమేదో నిర్ణయించడానికి మార్గమేమిటో వివరిస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలా అంటారు. “ఎట్లు నిర్ణయింపవలెనో కొన్ని గుర్తులున్నవి. ఆ గుర్తులు కవి నిక్షేపింపవలయును. అనగా కవి తనే రసమును ప్రతిపాదించబోవుచున్నాడో ఆ రస ప్రతిపాదన కొరకు శ్రద్ధ వహించవలయును. ఇది కావ్యకథా నిర్మాణ శిల్పములో నొక భాగము” (కావ్యానందము పుట 169).
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, భక్తిరసపోషణ ఉన్న కావ్యాలుగా విమర్శకులు పేర్కొన్న భాగవతము, శ్రీకాళహస్తి మాహాత్మ్యము, పాండురంగ మాహాత్మ్యము, ఆముక్త మాల్యద వంటి కొన్ని కావ్యాలను ఆధారం చేసుకుని భక్తి శృంగారాది రసముల కన్నా భిన్నమా కాదా అన్న అంశాన్ని పరిశీలించే ప్రయత్నం ఈ అధ్యాయంలో చేస్తున్నాను. ఇతివృత్తం, సన్నివేశ కల్పన, పాత్రచిత్రణ, శైలి, అలంకారాలు వంటి కోణాల నుండి ఆయా కావ్యాలలోని భక్తిరసపోషణను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నాను.
6.1 కావ్యాంశాల పరిశీలన
6.1.1 ఇతివృత్తం
భక్తిప్రధానమైన కావ్యాలలో తరచుగా కనబడేవి, భక్తిరసపోషణకు బాగా దోహదం చేసేవి అయిన ఇతివృత్తాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు, భగవంతుని యొక్క “భక్తపరాధీనత” భక్తికావ్యాలలో ఎక్కువగా కనిపించే ఒక ఇతివృత్తం. భగవంతుడు భక్తులకు ఎలా వశమై పోతాడో, సేవకుడైపోతాడో చెప్పడం భక్తిరసపోషణకి దోహదం చేసే బలమైన అంశం. అందుకే భక్తి కావ్యాలలో అవకాశమున్నచోటల్లా ఈ విషయాన్ని తాము స్వయంగా చెప్పడం కానీ, పాత్రల చేత చెప్పించడం కానీ చేస్తుంటారు కవులు.
హరవిలాసంలో చిరుతొండడు చెఱకు మోపు మోయలేకపోతే శివుడు స్వయంగా వచ్చి తానొక చేయి వేస్తాడు. అలా భక్తుడి కోసం చెఱకు మోపు మోసిన శివుడికి చెమటలు పట్టడం చూసి కైలాసంలో పార్వతీదేవి ఈ చెమటలేమిటని అడుగుతుంది. శివుడు విషయం చెప్పి, “నేను భక్తులకి ఇలాగే సేవలు చేస్తుంటా”నంటాడు. “భక్తిగతి లింగపతి అనేమాట ఈనాటిదా!” అంటూ, తనకూ భక్తులకూ మధ్య ఉండే ప్రేమను వివరిస్తాడు. హరవిలాసంలోనే మరొక సన్నివేశంలో పార్వతీ దేవి తపస్సు చేసినపుడు శివుడు ఆమెకు ప్రత్యక్షమై “నీ తపస్సుకు అమ్ముడుపోయాను, నేను నీ సేవకుడిని” అంటాడు. భక్తపరాధీనతను చెప్పే ఇటువంటి కథలు భాగవతాది భక్తిప్రధాన కావ్యాలన్నిటిలోనూ ఎక్కువగానే కనిపిస్తాయి.
ఈ పరిశోధనలో భాగంగా వివిధ భక్తికావ్యాలను పరిశీలించినపుడు భగవంతుని లీలలు; కరుణ, నిర్మలత, సమర్థత వంటి ఆయన లక్షణాలు; ఆయన చేసే దుష్టశిక్షణ, శిష్టరక్షణ వంటి కార్యాలు; అలాగే భక్తి యొక్క మహిమ, భాగవతుల మహిమ, భాగవతుల ధర్మాలు, భగవంతుని పట్ల వారి కృతజ్ఞతాప్రకటన మొదలైనవి భక్తికావ్యాలలోని వస్తువులుగా కనిపించాయి. ఈ ఇతివృత్తాలన్నీ కూడా భక్తిరసపోషణను, ఆస్వాదనను సుగమం చేస్తాయి. తెలుగు కావ్యాలలో “భాగవతుల మహిమ” అనే ఇతివృత్తంతో రచించబడిన రెండు ప్రసిద్ధ కథలని క్లుప్తంగా చెప్పుకోవడం ద్వారా ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాము.
భాగవతుల మహిమను తెలిపే కథలలో ఒక గొప్ప కథ ఆముక్తమాల్యదలోని మాలదాసరి కథ. ఈ కథలోని దాసరి కురంగుడి అన్న పుణ్యక్షేత్రానికి మూడుయోజనాల దూరంలో నివసిస్తూ ఉంటాడు. రోజూ పొద్దున్నే స్వామి వద్దకు వెళ్ళి మంగళకైశికీ గానంతో స్వామిని కీర్తిస్తూ ఉంటాడు. పులకించిన దేహంతో, చెక్కిళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోగా, ఎండనీ ఆకలిదప్పులనీ పట్టించుకోకుండా, మధ్యాహ్నం దాకా భగవంతుని కీర్తిస్తూ తాండవం చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతడు తెల్లవారిపోతోందని భ్రమపడి అర్ధరాత్రిపూటే గుడికి బయల్దేరతాడు. అడవిలో దారి తప్పి ఒక బ్రహ్మరాక్షసుడి చేతికి చిక్కుతాడు. ఆ బ్రహ్మరాక్షసుడు గతజన్మలో చోళదేశంలో నివసించిన ఒక బ్రాహ్మణుడు. పాపకర్మలతోనూ లోభత్వంతోనూ చాలా ధనాన్ని కూడబెట్టి, చివరికి దొంగల చేతిలో ఆ ధనాన్నీ ప్రాణాలనూ కూడా పోగొట్టుకుని, తాను చేసిన పాపకర్మల ఫలితంగా బ్రహ్మరాక్షసుడయినవాడు.
తనను తినేయాలనుకునే బ్రహ్మరాక్షసుడితో దాసరి, రోజూ కురంగుడి వెళ్ళి స్వామిని కీర్తించడం అనేది ఒక వ్రతంగా చేస్తున్నాననీ, ఆ వ్రతానికి ఆరోజే చివరి దినం కనుక తనని ఒకసారి విడిచిపెడితే గుడికి వెళ్ళి వ్రతసమాప్తి చేసుకుని మరలా రాక్షసుని దగ్గరకు వస్తాననీ చెప్తాడు. బ్రహ్మరాక్షసుడు మొదట ఒప్పుకోడు కానీ దాసరి బ్రతిమలాడగా, ఒట్లుపెట్టుకోగా, చివరికి విడిచిపెడతాడు. దాసరి వెళ్ళి భగవంతుని కీర్తించి, వ్రతసమాప్తి చేసుకుని, అన్నమాట ప్రకారం రాక్షసుడి దగ్గరకు తిరిగి వస్తాడు.
అపుడు అతని సత్యసంధతకు రాక్షసుడు కరిగిపోయి అతని పాదాల మీద పడి నమస్కరిస్తాడు. అతని ధృతినీ, జ్ఞానాన్నీ, సత్యసంధతనూ, హరిభక్తినీ పొగిడి, “నీ కైశికీగానఫలం నాకిచ్చి నన్ను ఈ పాపజన్మ నుంచి విముక్తుడిని చేయి” అని అడుగుతాడు.
దాసరి అందుకు ఒప్పుకోకపోతే, గానఫలంలో సగమైనా ఇవ్వమనీ, పావుభాగమైనా ఇవ్వమనీ, కనీసం ఆరోజు పొద్దున చేసిన గానఫలమైనా ఇవ్వమనీ వేడుకుంటాడు.
మీలాంటి భాగవతులు అనుగ్రహించకపోతే మాకిక గతి ఏమిటంటూ ఆ రాక్షసుడు చేసిన ప్రార్థనకి దయతో కరిగిపోయిన మనసుతో దాసరి ఆనాటి గానఫలమివ్వడానికి ఒప్పుకుని, “భగవంతుడు నిన్ను రక్షిస్తాడు” అనగానే రాక్షసుడు పాపజన్మ నుంచి విముక్తుడవుతాడు.
నిష్కల్మషమైన, నిష్కామమైన భక్తితో ఒక భాగవతుడు ఒక్క పూట, ఒకే ఒక్క పూట చేసిన గానానికి ఎంతటి మహిమ ఉందో తెలిపే ఈ కథ సహృదయుల చిత్తాన్ని భక్తిరసానందంలో ముంచివేస్తుంది.
ఈ కథలో బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణకులంలో పుట్టిన వాడు, విద్యాధికుడు. కానీ అతను భ్రష్టుడై రాక్షస జన్మ పొందినపుడు భాగవతుడైన దాసరి అతడిని రక్షించగలుగుతాడు. అందుకే, “ఎంతటి ఘోరపాపం చేసిన వాడినయినా, భగవత్ ద్రోహం చేసిన వాడినైనా భాగవతుడు రక్షించగలుగుతాడు, కానీ భాగవతుల పట్ల ద్రోహం చేసిన వాడిని భగవంతుడు కూడా రక్షించడు” అని చెప్తూ ఉంటారు. ఇందులో మొదటి విషయానికి ఈ మాలదాసరి కథ ఉదాహరణ అయితే రెండవ విషయానికి ఉదాహరణగా నిలిచేది భాగవతంలోని అంబరీషోపాఖ్యానం.
అంబరీషుడు గొప్ప విష్ణుభక్తుడు. నిరంతరమూ హరిస్మరణలోనే ఉండేవాడు. ఒకసారి అతడు నిష్ఠతో ఏకాదశీ వ్రతం చేసి, హరికి అభిషేకం చేసి, విప్రులకు గోదానాదులు చేసి, భోజనాలు పెట్టి, తాను కూడా పారణము చేయబోతూండగా దుర్వాస మహాముని అతిథిగా వస్తాడు. అతిథిమర్యాదలు అందుకున్నాక ముని కాళిందీ నదిలో స్నానం చేసేందుకు వెళ్తాడు. సమయం గడిచి పోతున్నా తిరిగిరాడు. ద్వాదశి ఘడియలు దాటేలోపల పారణ చేయకపోతే వ్రతానికి లోపం. అతిథి రాకుండా తాను ముందు భోజనం చేయడమూ దోషమే. ఏమి చేయాలో పాలుపోక అంబరీషుడు బ్రాహ్మణులను సలహా అడిగితే వాళ్ళు నీళ్ళు త్రాగితే భోజనం చేసినట్లూ కాదు, చేయనట్లూ కాదు, కాబట్టి నీళ్ళు త్రాగడం ధర్మసమ్మతమని చెప్తారు. అంబరీషుడు ఆ పనే చేస్తాడు. కానీ తిరిగివచ్చిన దుర్వాసుడు అంబరీషుడు చేసిన పనికి ఆగ్రహించి, కృత్య అనే శక్తిని ప్రయోగిస్తాడు. ఆ విషయం తెలిసి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపుతాడు. అది మొదట అంబరీషుని మీదికి వస్తున్న కృత్యను దహించి ఆతర్వాత దుర్వాసుని పైకి వెళ్తుంది. సుదర్శన చక్రం నుండి తప్పుకోవడం కోసం దుర్వాసుడు అన్ని లోకాలకూ పరుగెడతాడు. ఏ లోకానికి వెళ్ళినా చక్రం వెంబడిస్తుంది. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటే ఆయన విష్ణువు చక్రాగ్నిని ఎవరూ ఆర్పలేరని చెప్తాడు. కైలాసానికి పరుగెత్తి శివుడిని వేడుకుంటే ఆయన “విష్ణువు ఆయుధాన్ని తప్పించడం మాకెవరికీ సాధ్యం కాదు, నువు వెళ్ళి ఆయన్నే ప్రార్థించ”మని చెప్తాడు. అపుడు దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి శరణు వేడతాడు. “నీ భక్తుడి పట్ల అపరాథం చేశాను, నన్ను క్షమించు” అంటూ ఆయన పాదాలమీద పడతాడు.
అప్పుడు అలా తన కాళ్ళపై పడిన దుర్వాసునితో విష్ణువు చెప్పే ఒక్కొక్క మాటా పాఠకుని చిత్తంలోని భగవద్రతిని పైపైకి తీసుకువెళ్ళడానికి కవి వేసిన ఒక్కొక్క మెట్టులా ఉంటాయి.
“భక్తులు నా మనసును సులభంగా దొంగిలించివేస్తారు. మద గజాన్ని నేర్పుగా బంధించినట్లు వాళ్ళ నిర్మల భక్తి అనే తీగలతో నన్ను కట్టివేస్తారు. వాళ్ళ మీద వాత్సల్యంతో నేను తప్పించుకుపోకుండా అలా బంధితుడిగా ఉండిపోతాను” అని చెప్తాడక్కడ హరి. ఆమాట చెప్తున్న వాడి మీద సహృదయ పాఠకుడికి రతి కలగకుండా ఆపడం కానీ, పాఠకుని చిత్తంలో పెల్లుబికిన భగవద్రతిని రసస్థితికి చేరకుండా నిలపడం కానీ అసాధ్యమనిపిస్తుంది. “నా భక్తుడు ఎక్కడకువెళ్తే అక్కడికి, ఆవు వెంట పోయే దూడ లాగా నేనూ వెళ్తాను” అన్న మాట చదివిన పాఠకుడికీ రసానందానికీ మధ్య మరిక ఏ విఘ్నాలూ చోటుచేసుకునే అవకాశమే లేదనిపిస్తుంది.
ఇలా అయిదు అందమైన పద్యాలలో తనకీ భక్తుడికీ మధ్య ఉండే బంధం ఎటువంటిదో చెప్తాడు విష్ణువు ఇక్కడ. “నాహృదయం వాళ్ళది, వాళ్ళ హృదయం నాది” అంటాడు. “నాతేజస్సు భాగవతులలో నెలకొని ఉంటుంది. వాళ్ళని కష్టపెట్టేవాళ్ళని అది అగ్నిశిఖ లాగా భయపెడుతుంది” అంటాడు. ఇంతకీ ఇదంతా చెప్పాక, తన కాళ్ళ మీద పడిన దుర్వాసుడిని తానే రక్షించడు హరి. వెళ్ళి అంబరీషుడినే శరణు వేడమంటాడు.
ఇక్కడికే రసస్థితికి సంపూర్ణంగా చేరిపోయిన పాఠకుడి చిత్తం ఇక ఆ తర్వాత దుర్వాసుడు వెళ్ళి అంబరీషుని శరణు వేడడం, ఆ భాగవతోత్తముడు దయతో కరిగిపోయి, మునిని విడిచిపెట్టమంటూ సుదర్శన చక్రాన్ని ప్రార్థించడం వంటి విషయాలను చదువుతున్నపుడు రసానందపు లోతుల్లో మునిగిపోతుంది.
ఈ ఘట్టంలో అంబరీషుడు సుదర్శనచక్రానికి చేసే ప్రార్థన చాలా అందంగా ఉంటుంది. అయితే ఆ అందానికంతటికీ పరాకాష్టగా చివరికి అతడు చెప్పే మాట అమృతతుల్యంగా ఉంటుంది.
“సర్వాత్మకుడు అయిన శ్రీమహావిష్ణువు కనుక నా పూజలకి సంతోషించి ఉన్నట్లయితే, అందుకు నిదర్శనంగా ఈ మునీశ్వరుడు ఇప్పుడే శాంతిని పొందుగాక” అంటాడు అంబరీషుడు. అంతే, అంబరీషుడు ఆమాట అనగానే చక్రం వెనుతిరుగుతుంది. పాఠకుని చిత్తం ఆ రసానందంలో అలా నిలిచిపోతుంది. ఎంత అద్భుతమైన మాట ఇది! అర్థమయిన కొద్దీ ఆనందాన్ని ఇచ్చే మాట. హరి సర్వాత్మకుడు. అంటే అందరిలోనూ ఉండేవాడు. అలా అందరిలోనూ ఉండే హరిని భాగవతుడు సంతోషపెడతాడు. తద్వారా అందరికీ శాంతినీ ఆనందాన్నీ కలిగిస్తాడు. అదీ భాగవతుల మహిమ!
ఇటువంటి కథలను చూసినపుడు కావ్యాలలో భక్తిరసాన్ని నిర్వహించడానికి తగిన ఇతివృత్తాలకు కొదవ లేదనీ, ఇతివృత్తపరంగా భక్తిరసపోషణకు పుష్కలమైన అవకాశాలున్నాయనీ అర్థమవుతుంది.
6.1.2 సన్నివేశ కల్పన
భక్తిరసపోషణలో కవులు కల్పించే సన్నివేశాలు ఎలా ఉంటాయని చూస్తే, ఒకవైపు భగవంతుడి కరుణని, మహిమని చెప్పడం; మరొకవైపు భక్తుల స్థైర్యాన్నీ ధీరత్వాన్నీ విశ్వాసాన్నీ అనురాగాన్నీ చెప్పడం కనిపిస్తుంది. ఇతివృత్తం ఏదైనా ఇటువంటి అంశాలతో కూడిన సన్నివేశాలను సంభాషణలను కల్పించడం ద్వారా కవులు భక్తిరసపోషణ చేస్తారు.
ఆంధ్రభాగవతంలో అటువంటి సన్నివేశాలనెన్నిటినో పోతనగారు కల్పించడం, తద్వారా దానిని భక్తిరసాత్మకం చేయడం మనకు తెలిసిన విషయమే. గజేంద్రమోక్షణ కథనే తీసుకుంటే అందులో ‘గజేంద్రుడు ప్రార్థించాడు, విష్ణువు వచ్చి రక్షించాడు’ అని కేవలం విషయాన్ని మాత్రమే చెప్పి ఊరుకోకుండా, అల వైకుంఠపురిలో, సిరికిం జెప్పడు వంటి ఎన్నో పద్యాలను పోతనగారు చేర్చారు. ఒక సన్నివేశాన్ని కల్పించారు.
గజేంద్రుడు ప్రార్థించే సమయానికి విష్ణువు వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలోని సౌధానికి సమీపంలో, ఒక అమృత సరస్సు దగ్గరలో చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు, అలా వినోదిస్తూన్న సమయంలో గజేంద్రుని దీనాలాపన విన్నాడు. అతనిని కాపాడాలని తొందరపడ్డాడు. ఆ వేగిరపాటుతో లక్ష్మీదేవికి చెప్పనైనా చెప్పకుండా బయల్దేరాడు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను కానీ, వాహనమైన గరుత్మంతుని కానీ పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడిని సవరించుకోలేదు. చివరికి ప్రణయ కలహంలో చేపట్టిన లక్ష్మీదేవి పైటకొంగును కూడా వదలి పెట్టలేదు. భక్తుని మొర వింటూనే పరుగులు తీశాడు. ఆయన అలా తటాలున బయలు దేరగానే, ఆయన వెనుక లక్ష్మీదేవి, ఆమె వెనక అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడుడు, ఆ వెనుక శంఖచక్రాది ఆయుధాలు, నారదుడు, విష్వక్సేనుడు, ఆపైన వైకుంఠపురంలోని ఆబాలగోపాలమూ పరుగులు తీశారు. ఆ సంరంభాన్నంతా ఆకాశవీథిలో నిలబడి దేవతలు అబ్బురంగా చూశారు. “అడుగడుగో హరి, అదిగో లక్ష్మి, అదిగో పాంచజన్య శంఖధ్వని, అదిగో చక్రం, అదిగో గరుత్మంతుడు” అని చెప్పుకుంటూ నమస్కారాలు చేసుకున్నారు.
ఒక్క భక్తుడి దీనాలాపనకు వైకుంఠం మొత్తం కదలి వచ్చిందన్న ఈ వర్ణన పాఠకుల మనసులను ఊపేస్తుంది. హరి వెంట పరుగులు తీస్తూ “ఏ దీనురాలి ఆలాపనలు విని వెళ్తున్నాడో, ఏ వేదాలను రక్షించడానికి వెళ్తున్నాడో, ఏ దేవతలను అసురుల బారి నుంచి కాపాడడానికి వెళ్తున్నాడో” అంటూ లక్ష్మీదేవి చేసే ఆలోచనలు హరి కరుణనీ సమర్థతనీ పాఠకుల కళ్ళకు కడతాయి. వారి చిత్తాలలోని భగవద్రతిని జాగృతం చేస్తాయి. వచనంలో చెప్పుకుంటూంటేనే మనసును రసరంజితం చేస్తున్న ఈ సన్నివేశం కావ్యంలో చదువుతూన్నపుడు కలిగించే ఆనందం అనుభవైకవేద్యం.
ఇలా భాగవతంలోని చాలా కథలను తన కల్పనల ద్వారా పోతనగారు భక్తిరసాత్మకం చేశారు. ఉదాహరణకి నరకాసురవధ ఘట్టాన్ని తీసుకుంటే, పోతన, ఎర్రన, సోమన, ముగ్గురూ వ్రాసిన ఈ ఘట్టంలో పోతన గారు మాత్రమే యుద్ధానికి తనను కూడా తీసుకువెళ్ళమని సత్యభామ కృష్ణుని ప్రార్థించినట్లుగా వ్రాశారు.
ఎర్రన హరివంశంలో మొదట మునులు కృష్ణునితో నరకుని ఆగడాల గురించి చెప్పడం, ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి నరకాసురవధకు ఆయనను ప్రేరేపించడం అయ్యాక, కృష్ణుడు “గద్దియ డిగ్గి యదువృద్ధుల వీడుకొని యాయితంబైన చక్రశార్ఙ్గాది సాధనంబులు గైకొని సత్యభామ రావించి తత్సహితుండై గరుడస్కంథారోహణంబు సేసి” బయల్దేరాడని మాత్రమే ఉంటుంది. సోమన గ్రంథంలోనూ “యదునాయకుఁడప్పుడు సత్యభామతో నావిహగేంద్రునెక్కి వివిధాయుధుఁడై వియదంతరంబు పై త్రోవఁ జనంగ” అన్న ఒక్క వాక్యమే ఉంటుంది.
పోతనగారు ఇక్కడ మూడు పద్యాలు వ్రాశారు. మొదటి పద్యంలో “దేవా! నువు విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే చూడాలని కోరికగా ఉంది. దయతో నన్ను నీ వెంట తీసుకువెళ్ళు. నేను అక్కడ నీ ప్రతాపాన్ని చూసివచ్చి, ఇక్కడ రాణులందరికీ వివరంగా చెప్తాను” అని సత్యభామ అడగడము, ఆ తర్వాత మరో పద్యంలో శ్రీకృష్ణుడు రణరంగం ఎంత భయంకరంగా ఉంటుందో వివరించి “వలదు వలదు” అంటూ ఆమెను వారించడమూ ఉంటాయి. అపుడు సత్యభామ ఇలా అంటుంది.
శా.
“దానవులైన నేమి? మఱి దైత్యసమూహములైన నేమి? నీ
మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక? నీ
తో నరుదెంతు” నంచుఁ గరతోయజముల్ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని దన్ను భర్త బహుమాన పురస్సరదృష్టిఁ జూడఁగన్. (10.2-151)
ఈ పద్యం పాఠకుడిలోని భక్తి అనే వాసనని జాగృతం చేసే పద్యం. కరతోయజముల్ ముకుళించి మ్రొక్కిన సత్యభామా, “దానవులైన నేమి? మఱి దైత్యసమూహములైన నేమి?” అన్న ఆమె మాటలు భక్తిరస నిష్పత్తికి దోహదం చేసే అంశాలు. ఈ పద్యం చదివినపుడు “రాక్షసులుంటే ఏమిటి? ఇంకెవరుంటే ఏమిటి? నీ వెనకాల నిల్చుంటే ఇంక నాకు భయమేమిటి?” అంటున్న సత్యభామతో పాఠకుడు కూడా తాదాత్మ్యం చెందుతాడు. సహృదయుడైన పాఠకుడికి ఈ మాటలు ఒక భార్య భర్తతో చెప్తున్న మాటలుగా అనిపించవు. ఎందుకంటే ఇవి సత్యభామ నోటి నుంచి వచ్చిన మాటలు మాత్రమే కావు. పోతనగారి హృదయంలోనుంచి వచ్చిన మాటలు. ఇది కవి హృదయగత భావం. కవి హృదయం భక్తిరసాత్మకమవగా వచ్చిన మాటలు ఇవి. కాబట్టి ఆ భక్తిరసం సహృదయుడైన పాఠకుడినీ చేరుతుంది. భగవంతుడిని తల్చుకున్నపుడు ప్రతి భక్తుని మనసులోనూ నిండిపోయే ధైర్యాన్ని ఇక్కడ పాఠకుడు అనుభూతి చెందుతాడు. ఆ సాధారణీకరణం వలన భక్తిరసాన్ని అందుకోగలుగుతాడు.
భక్తుడి ధైర్యం భగవంతుడే. తన ప్రజ్ఞకూ పాండిత్యానికీ కారణం భగవంతుడే అన్న స్పృహతో ఉంటాడు భక్తుడు. భక్తుడిలో కనిపించే ఆ అహంకార రాహిత్యమే భక్తిలోని బలమైన అంశం. “నాకేమి తక్కువ” అనే అతిశయమూ, “నాదేమీ లేదు” అనే అహంకారరాహిత్యమూ కలగలిసి ఉండడమే భక్తిలోని విశిష్టత. అటు శృంగారం నుంచీ ఇటు శాంతం నుంచీ కూడా దానిని వేరు చేసే ప్రత్యేకత. ఆ విషయాన్ని ఈ పద్యం చక్కగా వ్యక్తీకరించింది. తద్వారా భక్తిరసావిష్కరణను సుగమం చేసింది.
ఒకే ఘట్టాన్ని ముగ్గురు కవులు వ్రాసినప్పటికీ భాగవతంలోని రచన ఎక్కువ భక్తిరసపూరితంగా అనిపించడానికి పోతనగారు చూపిన ఇటువంటి మెలకువలే కారణమని అనిపిస్తుంది. ఈ పద్యంలో “మ్రొక్కెన్” అన్న పదాన్ని వాడడం, అలాగే మొదటిపద్యంలోను “దేవా” అన్న సంబోధనను వాడడం వంటి అంశాలను కూడా ఈ సందర్భంలో గమనించవలసి ఉంది.
ఈ అంశానికి సంబంధించిన మరొక ఉదాహరణను గ్రంథాంతంలో జత చేసిన “భక్తిరసపోషణ-పోతన గారి పోహణ” అన్న వ్యాసంలో చూడవచ్చు. కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడు, భీష్ముని ధాటికి అర్జునుడు తట్టుకోలేకపోయిన సందర్భంలో ఆ ప్రతినను పక్కన పెట్టి చక్రాన్ని చేతిలోకి తీసుకోవడమనే సన్నివేశాన్ని పరిశీలించి, ఆ సన్నివేశాన్ని భక్తిరసపూరితం చేయడంలో పోతనగారు చూపిన నేర్పును అర్థం చేసుకునే ప్రయత్నం ఆ వ్యాసంలో జరిగింది.
(సశేషం)
శ్రీ వల్లీ రాధిక చక్కని కథా రచయిత్రి. లోతైన తాత్వికతకు నిత్య జీవితంలోని సంఘటనల ద్వారా సరళంగా ప్రదర్శిస్తారు. ‘తక్కువేమి మనకూ’, ‘స్వయం ప్రకాశం’, ‘హేలగా… ఆనంద డోలగా..’ వీరి పేరుపొందిన కథల సంపుటాలు.
