[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]
అధ్యాయం 5 – నాల్గవ భాగం
5.2.4 భక్తి శాంతరసంలో అంతర్భవిస్తుందా?
ఇంతకు మునుపు రసముల పరస్పర సంబంధం అన్న విభాగంలో ఈ విషయాన్ని చర్చించి “భక్తి శాంతరసంలో అంతర్భవిస్తుందన్న మాట అంగీకారయోగ్యంగా లేదు” అని గమనించాము. మరి అభినవగుప్తుడు, ఆయన్ని అనుసరించిన కొద్దిమంది ఆలంకారికులు ఇలా చెప్పడానికి కారణమేమై ఉంటుందన్న ఆలోచనతో వారి గ్రంథాలను పరిశీలించినపుడు నా దృష్టికి వచ్చిన అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.
అభినవగుప్తుడు శాంతరసస్థాపన చేసిన తర్వాత కూడా శారదాతనయుని వంటి కొందరు ఆలంకారికులు శాంతరసాన్ని ఒప్పుకోలేదు. అందుకు వారు ముఖ్యంగా చెప్పిన కారణం అనుభావరాహిత్యం. తగినన్ని అనుభావాలు లేవు కనుక అభివ్యక్తికి అవకాశం ఉండదన్నదే శాంతాన్ని రసంగా అంగీకరించకపోవడానికి వారు చెప్పిన కారణం. కాబట్టి శాంతాన్ని రసంగా ప్రతిపాదించాలనుకునేవారికి భక్తిని శాంతములో కలపడం అనివార్యమై ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే భక్తిని తీసివేస్తే శాంత రస పోషణకు వారు చెప్పగల విభావాలు, అనుభావాలు ఎక్కువ లేవు. భక్తితో సంబంధం లేకుండా శాంతాన్ని వ్యక్తం చేస్తున్న ఉదాహరణలూ కావ్యాలలో లభించకపోయి ఉండవచ్చు. బహుశా అందుకే శాంతరసానికి ఉదాహరణలుగా వారంతా భక్తిరసానికి చెందిన పద్యాలనే చూపడం కనిపిస్తుంది. శాంత రసాన్ని అంగీకరించి, భక్తి శాంతరసంలో అంతర్భవిస్తుందని చెప్పిన ప్రసిద్ధ ఆలంకారికుల గ్రంథాలను పరిశీలిస్తే ఈ అభిప్రాయమే కలుగుతుంది.
విశ్వనాథుడు శాంతరసానికి చెప్పిన విభావాలన్నీ భక్తిరసానికి చెందినవే. విశ్వనాథుని ప్రకారం శాంతరసానికి పరమాత్మస్వరూపం ఆలంబన విభావం. పుణ్యాశ్రమములు, హరిక్షేత్రములు, తీర్థములు, రమ్యములైన వనములు మహాపురుష సంగము ఉద్దీపన విభావాలు. రోమాంచాదులు అనుభావాలు. నిర్వేద హర్ష స్మరణ మతి భూతదయాదులు వ్యభిచారులు. ఈ విధంగా శాంతానికి విభావానుభావాలను చెప్పాక విశ్వనాథుడు దేవతావిషయక రతి శాంతంలో అంతర్భవిస్తుందని చెప్పి, ఆ దేవతావిషయక రతికి ఉదాహరణగా “కదా వారణాస్యామమర తటీ నీరోధవి వసన్/వసానః కౌపీనం శిరసి నిదధానోంజలిపుటం/అయే! గౌరీనాథ! త్రిపురహర! శంభో! త్రినయన/ప్రసీదేత్యాక్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్” అన్న శ్లోకాన్ని ఇచ్చాడు. ఇది కాకుండా శాంత రసానికి విడిగా మరొక ఉదాహరణ ఏమీ ఇవ్వలేదు. విద్యాధరుడు ఏకావళిలో ఈ శ్లోకాన్నే శాంతరసానికి ఉదాహరణగా ఇచ్చాడు.
మమ్మటుడు శాంతరసానికి నిర్వేదాన్ని స్థాయిభావంగా చెప్పినా ఉదాహరణగా ఇచ్చిన పద్యంలో నిర్వేదం కాక, శివభక్తీ ఆ శివభక్తి వలన వచ్చిన జ్ఞానమూ (అన్నిటినీ సమంగా చూసే స్థితి) కనిపిస్తాయి. వీటన్నిటినీ గమనించడం వల్లనే కావచ్చు జగన్నాథ పండితరాయలు భక్తిరసానికి చెందిన పద్యాన్ని శాంతానికి ఉదాహరణగా ఇవ్వరాదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు.
ఈ దృష్టితో పరిశీలించినపుడు భక్తి శాంతంలో అంతర్భవిస్తుందని చెప్పడం శాంతాన్ని రసంగా నిలబెట్టే ప్రయత్నంతో జరిగినదే కానీ, భక్తిని గురించి సమగ్రంగా ఆలోచించడం వలన జరిగినది కాదన్న అభిప్రాయం కలుగుతుంది. భగవద్రతి లక్షణాలేమిటి; దానికీ, శాంతానికి స్థాయిభావాలుగా చెప్పబడుతున్న తత్త్వజ్ఞానం, నిర్వేదం, శమం వంటి వాటికీ మధ్య ఉన్న సామ్యాలేమిటి, భేదాలేమిటి అన్న విషయాలను సమగ్రంగా పరిశీలించకపోవడం వల్లనే భక్తిని శాంతంలో అంతర్భవింపచేశారని అనిపిస్తుంది. అందుకే భగవద్రతి లక్షణాలను గూర్చి ఎంతో కొంత ఆలోచించిన జగన్నాథుడు భక్తిని శాంతంలో కలపడాన్ని స్పష్టంగా ఖండించాడనీ అర్థమవుతుంది.
5.3 అలంకార శాస్త్రాలలో భక్తిరస ప్రతిపాదన
అలంకార శాస్త్ర గ్రంథాలలో చెప్పబడిన నిర్వచనాలను, నియమాలను ఆధారం చేసుకుని, వివిధ కోణాల నుంచి ఇప్పటివరకూ చేసిన పరిశీలనల వలన భక్తిరస ప్రతిపాదనను అంగీకరించవచ్చునని నిర్ధారణ అయింది. తెలుగు కావ్యాలను ఆధారం చేసుకుని కవులు భక్తిరసపోషణను ఎలా నిర్వహించారన్న విషయాన్ని తరువాతి అధ్యాయంలో పరిశీలించవలసి ఉంది. సంస్కృతాలంకారికులైన రూపగోస్వామి, మధుసూదన సరస్వతి తమ గ్రంథాలలో భక్తిరసాన్ని గురించి చెప్పిన విషయాలను ఇక్కడ సంక్షిప్తంగా పేర్కొంటున్నాను.
రూపగోస్వామి భక్తిరసామృతసింధువు, ఉజ్జ్వల నీలమణి అనే రెండు భక్తిరస సిద్ధాంత గ్రంథాలను రచించగా, మధుసూదన సరస్వతి భక్తిరసాయనమనే గ్రంథాన్ని రచించారు.
భక్తిరసామృతసింధువు లో నాలుగు విభాగాలున్నాయి. పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర విభాగాలు. పూర్వవిభాగంలో నాలుగు లహరులు ఉన్నాయి. ప్రథమ లహరిలో భక్తిని నిర్వచించి లక్షణాలను చెప్పాక, సాధన భక్తి, భావభక్తి, ప్రేమభక్తి అనే మూడు భక్తి భేదాలను చెప్పి ఆ మూడింటినీ తర్వాతి మూడు లహరులలో వివరించారు. దక్షిణ విభాగం లోని అయిదు లహరులలో భక్తిరసానికి చెందిన విభావాలు, అనుభావాలు, సాత్త్విక భావాలు, సంచారిభావాలు, స్థాయిభావాల లక్షణాలను వివరంగా చెప్పారు. ఆలంబన విభావమైన శ్రీకృష్ణుడికి చెప్పిన అరవై నాలుగు లక్షణాల గురించి, మరొక ఆలంబన విభావమైన భక్తునికి చెప్పిన ఇరవైతొమ్మిది లక్షణాల గురించి ఈ అధ్యాయంలోనే పైన ప్రస్తావించాను. ఆ విధంగానే మిగిలిన అంశాలన్నీ కూడా ఈ గ్రంథంలో చాలా వివరంగా చెప్పబడ్డాయి. పశ్చిమ విభాగంలో అయిదు ముఖ్య భక్తిరసాలు వివరించబడినాయి. అవి శాంత భక్తిరసము, దాస్య భక్తిరసము, సఖ్యభక్తి రసము, వాత్సల్య భక్తిరసము, మధుర భక్తిరసము. ఇక ఉత్తరభాగంలో ఏడు గౌణ భక్తిరస భేదాలను వివరించారు. అవి హాస్య, అద్భుత, వీర, కరుణ, రౌద్ర, భయానక, బీభత్స భక్తిరసాలు. ఇక్కడ పేర్కొన్న ఈ అంశాలన్నీ ఒక్కొక్కటీ చాలా వివరంగా చెప్పబడ్డాయి ఈ గ్రంథంలో. సాధన భక్తిలోని వైధీ, రాగానుగ వంటి భక్తి భేదాలు, భక్తులలో ఉత్తమ, మధ్యమ కనిష్ట భేదాలు, విధిరూపమున, నిషేధ రూపమున పాటించవలసిన భక్త్యంగములు, భక్తిరసాస్వాదనలోని చిత్తావస్థలు, అలాగే ముఖ్య గౌణ భక్తిరసాలకు సంబంధించిన స్థాయిభావాలు, వ్యభిచారాది భావాలు, వర్ణాలు, దేవతలు, మిత్రత్వ శత్రుత్వ రస సంబంధాలు అన్నీ చాలా వివరంగా చెప్పబడ్డాయి. ఇక ఉజ్జ్వలనీలమణిలో మధురభక్తిరసాన్ని గూర్చి మరింత విపులంగా చెప్పారు. పదిహేను ప్రకరణాల ఈ గ్రంథంలో నాయక భేదాలు, నాయికా భేదాలు, దూతీ భేదాలు మొదలైనవన్నీ వివరించబడినాయి.
రూపగోస్వామి చెప్పిన ఇన్ని సూక్ష్మమైన విభాగాలు తెలుగు కావ్యాలలో ఇప్పటివరకూ సంపూర్ణంగా నిర్వహింపబడినా లేకున్నా, భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకునే అవకాశమైతే ఉంది. కవులు భక్తికావ్యాలలోని పాత్రచిత్రణను సునిశితంగా నిర్వహించడానికి, సూక్ష్మమైన అంశాలను సైతం వివరించడానికి, వివిధ రకాలైన వినూత్నములైన భక్తుల పాత్రలను సృజించి క్రొత్త క్రొత్త కాల్పనిక కావ్యాలను భక్తిరసప్రధానంగా రచించడానికి ఉపయోగపడే విషయాలెన్నో రూపగోస్వామి రచించిన ఈ శాస్త్రగ్రంథాలలో విపులంగా, మరే రసానికీ చెప్పబడనంత వివరంగా చెప్పబడినాయి.
మధుసూదనసరస్వతి తాను రచించిన భక్తిరసాయనమనే గ్రంథంలో దేవాది విషయక రతి భావమేనన్న ఆలంకారికుల మాటను ఖండించి, ఆమాట ఇతర దేవతల విషయంలో చెల్లుతుంది కానీ పరమానంద రూపమైన పరమాత్మ విషయంలో చెల్లదని చెప్పారు. ఇతర దేవతలు జీవులు కనుక వారి విషయంలోని రతి భావం కావచ్చు కానీ సచ్చిందానంద రూపమైన పరమాత్మపై రతి రసమేనన్నది మధుసూదన సరస్వతి ప్రతిపాదన. అద్వైతం, సాంఖ్యం వంటి సిద్ధాంతాల ఆధారంగా ఆయన తన ప్రతిపాదనను సమర్థించారు. ఈవిధంగా మధుసూదన సరస్వతి రచించిన గ్రంథం భక్తిని రసంగా పరిగణించడానికి ఆలంకారికులకు ఉన్న అభ్యంతరాలకు స్పష్టమైన సమాధానాలు చెప్తే, రూపగోస్వామి రచించిన గ్రంథాలు భక్తిరసాన్ని కావ్యాలలో నిర్వహించడానికి కవులకు కావలసిన సమగ్రమైన సమాచారాన్ని అందించాయి.
5.4 సారాంశము
ఈ అధ్యాయంలో రసస్వరూపం, రస నిర్ణాయక తత్త్వాలు, చిత్తవృత్తులు, రసాల పరస్పర సంబంధం, రసవిఘ్నాలు, రసాభాస అనే అంశాలపై అలంకారశాస్త్రాలలో ఉన్న అభిప్రాయాలనూ నియమాలనూ ఆధారం చేసుకుని భక్తిని రసంగా పరిగణించే అవకాశం ఉన్నదా లేదా అన్న విషయాన్ని మొదట పరిశీలించాను. వీటన్నిటినీ పరిశీలించేటపుడు భారతీయ దార్శనికుల అభిప్రాయాలతో పాటు రససిద్ధాంతాన్ని పాశ్చాత్య మానసికశాస్త్ర దృక్కోణంతో పరిశీలించిన ఆధునికుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాను. అటుపైన ఆ పరిశీలనలన్నిటి నుండీ లభించిన ఫలితాల సహాయంతో ఊహాప్రతిపాదనను పరీక్షించాను. భగవద్రతి స్థాయిభావమా కాదా, భక్తి భావమా రసమా, అది శృంగారంలో కానీ శాంతంలో కానీ అంతర్భవించే అవకాశం ఉందా లేదా, అన్న విషయాలను విశ్లేషించాను. ఈ పరీక్షలన్నిటి ఫలితాలూ కూడా ఊహాప్రతిపాదనలోని అంశాలను సత్యాలుగా స్వీకరించవచ్చునన్న విషయాన్నే సమర్థించాయి. ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకు తరువాతి అధ్యాయంలో భక్తిరస ప్రధానములుగా ప్రసిద్ధిపొందిన కావ్యాలను ఆధారం చేసుకుని మరికొన్ని విషయాలను పరిశీలించాలనుకుంటున్నాను.
(సశేషం)
శ్రీ వల్లీ రాధిక చక్కని కథా రచయిత్రి. లోతైన తాత్వికతకు నిత్య జీవితంలోని సంఘటనల ద్వారా సరళంగా ప్రదర్శిస్తారు. ‘తక్కువేమి మనకూ’, ‘స్వయం ప్రకాశం’, ‘హేలగా… ఆనంద డోలగా..’ వీరి పేరుపొందిన కథల సంపుటాలు.
