Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-17

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 5 – మూడవ భాగం

5.2 భక్తిరసచర్చ – విశ్లేషణ

ఈ అధ్యాయంలో ఇప్పటి వరకు అలంకార శాస్త్రాలలో చెప్పిన వివిధ అంశాలు భక్తికి, భక్తికి స్థాయిభావంగా చెప్పబడిన భగవద్రతికి వర్తిస్తాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించాను. ఈ పరిశోధనను మొదలుపెట్టినపుడు ఒక ఊహాప్రతిపాదనను ఏర్పరచుకోవడం జరిగింది. ఆ ప్రతిపాదనలో రెండు అంశాలున్నాయి. ఒకటి, “భక్తికి రసత్వాన్ని పొందే శక్తి ఉంది” అన్న ప్రతిపాదన, రెండవది “భక్తిరసం మిగిలిన రసములలో, అంటే శృంగారంలో కానీ శాంతంలో కానీ అంతర్భవించదు” అన్న ప్రతిపాదన. ఈ రెండు లక్షణాలనూ నిర్ధారణ చేసుకున్నపుడు మాత్రమే ఊహాప్రతిపాదనను ఒప్పుకోగలము కనుక ఆ రెండు లక్షణాలనూ ఇపుడు నేరుగా పరీక్షించబోతున్నాను.

ఈ పరీక్షను నాలుగు ప్రశ్నలుగా విభజించాను. భక్తిరసాన్ని గూర్చిన చర్చలన్నీ ఆ నాలుగు ప్రశ్నల క్రిందికే వస్తాయి కనుక వాటికి సమాధానాలు చెప్పుకోవడం ద్వారా ఊహాప్రతిపాదనలోని రెండు అంశాల విషయంలోనూ స్పష్టత సాధించవచ్చు. ఈ అధ్యాయంలో ఇప్పటికే పరిశీలించిన విషయాలను, పైన చెప్పుకున్న విభాగాల క్రిందికి రాకుండా మిగిలి పోయిన మరికొన్ని విషయాలను కూడా విశ్లేషించడం ద్వారా ఈ నాలుగు ప్రశ్నలకూ సమాధానాలను సాధించే ప్రయత్నం చేస్తాను.

5.2.1 భగవద్రతి స్థాయిభావమా? సంచారిభావమా?

*ఏది స్థాయిభావము ఏది సంచారిభావము అన్న విషయాన్ని నిర్ణయించడానికి చెప్పిన రసనిర్ణాయక తత్త్వాలు ఆరింటి గురించి ఇంతకు మునుపు ప్రస్తావించబడింది. భగవద్రతికి ఆ ఆరు తత్త్వాలు ఉన్నాయని గమనించడమూ జరిగింది. నిజానికి ఈ తత్త్వాలు రత్యాది ఎనిమిది భావాలకి మాత్రమే ఉంటాయా అన్న వివేచన కూడా ఆధునిక సాహిత్యకారులు చేశారు. ముఖ్యంగా హిందీ మరాఠీ సాహిత్యకారులు ఈ విషయాన్ని విస్తృతంగా పరిశీలించడం కనిపిస్తుంది.

అటు మానసికశాస్త్రాన్ని ఇటు అలంకార శాస్త్రాన్ని కూడా ఆధారం చేసుకుని రససిద్ధాంతాన్ని అధ్యయనం చేసిన పండితులు సంచారిభావాలను వివిధ రకాలుగా వర్గీకరించారు. సంచారిభావాలుగా చెప్పబడుతున్నవన్నీ మానసికమైన అవస్థలు కాదనీ వాటిని శారీరిక, మానసిక, బౌద్ధిక అవస్థలన్న మూడు విభాగాలుగా చూడవచ్చుననీ వారు అభిప్రాయపడ్డారు. సాధారణంగా శ్రమ, ఆలస్యం, గ్లాని వంటి శారీరక అవస్థల రూపంలోని సంచారిభావాలు, అలాగే స్మృతి, వితర్కం, మతి వంటి బౌద్ధిక అవస్థల రూపంలోని సంచారిభావాలు ఎప్పుడూ సంచారిభావాలుగానే ఉంటాయనీ, మనోభావ ప్రధానమైన సంచారిభావాలు మాత్రం సమర్థవంతుడైన రచయిత ఎవరైనా ఉత్కటత్వాన్ని అందించగలిగితే స్థాయిత్వాన్ని పొందగలవనీ వారి అభిప్రాయం (ఆధునిక్ హిందీ మరాఠీ సాహిత్య్ పుట 73,74).

విశ్వనాథ సత్యనారాయణగారు క్రోధం గురించి చెప్తూ “వాడు జీవితములో నట్టివాడు కావచ్చును కాకపోవచ్చును. కాని వాని ప్రకృతిలో అది నిగూఢమై యుండును” అంటారు (కావ్యానందం పుట 134). అంటే ఒక వ్యక్తిలో లోపల నిగూఢంగా ఉన్నప్పటికీ బయటకు లేనట్లుగా కనిపించే లక్షణం భక్తికి మాత్రమే కాదు ఇతర రసాలకూ ఉంటుంది. అలా బయటకు లేనట్లుగా కనిపించే అవకాశం శృంగారము, క్రోధము వంటి వాటికి కూడా ఉంటుందన్నది ఇక్కడ గమనించవలసిన విషయం. ఒక వ్యక్తిలో శృంగారాదులు బయటకు కనబడకపోయినా లోపల నిగూఢంగా ఉంటాయని ఒప్పుకోవడానికీ, చెప్పడానికీ కారణం శృంగారాది ఎనిమిది రసాలు మానవ ప్రవృత్తిలో సహజమైనవని భావించడం.

అయితే ఈ ఎనిమిది మాత్రమే మూలప్రవృత్తులనీ, మరింకేవీ కాదనీ చెప్పడానికి, అటు అద్వైతం వంటి భారతీయ దర్శనాల ప్రకారం కానీ ఇటు ఆధునిక మానసిక శాస్త్రం ప్రకారం కానీ ప్రమాణమేమీ లేదు. భారతీయ వేదాంత శాస్త్రాల ప్రకారం భక్తి కూడా సహజమే. పైకి కనబడినా కనబడకపోయినా అది వ్యక్తులలో నిగూఢంగా ఉంటుందని చెప్పే శంకరాచార్యులు, రేణుకాచార్యుల వంటి వారి వ్యాఖ్యలు ఇంతకు మునుపు ప్రస్తావించబడ్డాయి.

ఇక ఈ విషయాన్ని గురించే చెప్తూ రాకేశ్ గుప్తా Psychological Studies in Rasa అనే తన పుస్తకంలో “There is no evidence to suppose that it is in the case of Sthayibhavas and Sthayibhavas alone that they exist in the mind in a latent form when not manifested” అంటారు (Pg 110).

రాకేశ్ గుప్తా అసలు ఈ మౌలికత్వం అనే లక్షణాన్ని స్థాయిభావానికి నిర్ణాయక తత్త్వంగా అంగీకరించనేలేదు. ఈ లక్షణాన్ని ఆధారం చేసుకుని స్థాయి సంచారిభావాల విభజన చేయలేమని వారి అభిప్రాయం. ఈ లక్షణాన్నే కాదు, స్థాయిభావాలను సంచారిభావాల నుంచి వేరుచేసే ఇతర కారణాలన్నిటినీ కూడా నిరాధారాలంటూ వారు తోసిపుచ్చారు. ఆలంకారికులు చెప్పిన కారణాలన్నిటినీ చర్చించిన పిమ్మట వారు “Thus we see that all the points of difference between a Sthayi and Sancharibhava are unreal and that it is impossible to have an absolute classification of the Bhavas of this nature.” అని వ్యాఖ్యానించి, భారతీయ ఆలంకారికులలో “రసములు అనంతములు” అన్న రుద్రటుని సమర్థిస్తారు.

*స్థాయిభావాలను సంచారిభావాలను గుర్తించడానికి అభినవగుప్తుడు మరొక లక్షణం కూడా చెప్పాడు. సంచారిభావాలకయితే “దేనివలన” అన్న ప్రశ్న వస్తుంది కానీ స్థాయిభావాలకయితే రాదు అని. అంటే అతనికి గ్లాని కలుగుతోంది అంటే దేనివలన గ్లాని కలుగుతోంది అన్న ప్రశ్న ఉంటుంది కానీ అతనికి ఉత్సాహంగా ఉంది అంటే దేనివలన అన్న ప్రశ్న రాదని. అభినవగుప్తుడు చెప్పిన ఈ లక్షణాన్ని కొందరు ఆలంకారికులు, విమర్శకులు తమ గ్రంథాలలో ఉటంకించడం కనిపిస్తుంది కానీ వారిలో ఎంత మంది దానితో ఏకీభవిస్తారన్న విషయం తెలియదు. ఇంతకు మునుపే చెప్పినట్లు రాకేశ్ గుప్తా గారు అయితే తన గ్రంథంలో(Psychological studies in Rasa) దీనిని స్పష్టంగా ఖండించడం కనిపిస్తుంది. క్రోధం వంటి స్థాయిభావాల విషయంలో “దేనివలన” అన్న ప్రశ్న వచ్చే అవకాశం లేకపోతే, అమర్ష ఉగ్రత వంటి సంచారిభావాల విషయంలో మాత్రం ఆ ప్రశ్న వచ్చే అవకాశం ఎందుకు ఉంటుందని ఆయన అంటారు. నిజమే, స్థూలంగా చూసినపుడు, ఈ “దేనివలన” అన్న ప్రశ్న స్థాయిభావాలకి రాకపోతే సంచారిభావాలకి మాత్రం ఎందుకు వస్తుందనీ, లేదా సంచారిభావాలకి వచ్చే అవకాశం ఉంటే స్థాయిభావాలకి మాత్రం ఎందుకు రాదనీ అనిపించవచ్చు.

కానీ కొంత పరిశీలనగా చూస్తే సంచారిభావాల విషయంలో “ఫలానా దానివలన” అని చెప్పడం కొంత సులభమని అర్థమవుతుంది. ఆధునిక విమర్శకులు సంచారిభావాలను మూడు రకాలుగా విభజించారని చెప్పుకున్నాం. శారీరక అవస్థల రూపంలో ఉండేవి, బౌద్ధిక అవస్థల రూపంలో ఉండేవి, మానసిక అవస్థల రూపంలో ఉండేవి అని. వీటిలో శారీరక అవస్థల రూపంలో ఉండే శ్రమ, ఆలస్యం; బౌద్ధిక అవస్థల రూపంలో ఉండే స్మృతి, వితర్కం వంటి వాటి విషయంలో కారణం మరింత స్పష్టంగా ఉంటుంది. మానసిక అవస్థల రూపంలో ఉండే సంచారిభావాల విషయంలో కొంత సందేహం వచ్చే అవకాశం ఉంది కానీ వాటి నిర్వచనాలను గమనిస్తే వాటన్నిటికీ నిర్వచనాలలోనే స్పష్టమైన కారణాలను చెప్పారని అర్థమవుతుంది. సంచారిభావాలన్నిటికీ ఫలానా కారణం ‘వలన’, ఫలానా కారణం ‘చేత’ ఏర్పడతాయన్న వివరణలున్నాయి. ఉదాహరణకు మాత్సర్యం, ద్వేషం, అనురాగం వంటి వాటి వల్ల ఆలోచించకుండా పనులు చేయడాన్ని “చాపల్యం” అనే సంచారిభావంగా చెప్పారు..

ఇలా సంచారిభావాలకు ఒక పనినో, ఒక పరిస్థితినో, లేదా మరొక భావాన్నో కారణంగా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ రతి, ఉత్సాహం వంటి వాటికి అలా చెప్పడం కష్టం. వాటికి కూడా విభావాలు, అంటే కారణాలు చెప్పబడ్డాయి. అయినప్పటికీ రతి, ఉత్సాహం వంటి భావాలు తలెత్తడానికి ఆయా విభావాల కన్నా ఆ వ్యక్తి యొక్క సంస్కారమే ప్రధాన కారణమని అనిపిస్తుంది. రాఘవన్ గారు The Number of Rasas అన్న తమ గ్రంథంలో ఈ విషయాన్నే మరొక రకంగా చెప్తారు – ఒకడు గ్లానితో ఉన్నాడు అన్నపుడు ఆ గ్లాని దేనివలన అన్న ప్రశ్న వస్తుంది. ప్రియురాలి వియోగం వలననా (విప్రలంభం), ఒకడితో పోరాడినందువలనా (వీరం), యోగసాధన వలననా (శాంతం) అని. కానీ రాముడు సీత పట్ల రతి కలిగి ఉన్నాడు అన్నపుడు ఆ రతి దేనివలన అన్న ప్రశ్న రాదు. – అన్నది వారి వివరణ.

ఈ లక్షణం ప్రకారం చూస్తే భగవద్రతిని కూడా స్థాయిభావమే అని చెప్పవలసి ఉంటుంది. భగవద్రతి దేనివలన ఉత్పన్నమయింది అని చెప్పలేము. అది వ్యక్తికి లోపలినుండి వచ్చే స్వభావం. నిజానికి “భగవద్రతి” అందరికీ ఉండదు అన్న అభ్యంతరమే అది స్థాయిభావం అనడానికి సమర్థన. భగవద్రతిని గూర్చిన ఆ అభ్యంతరమే దానిని ఉత్పన్నం చేసే కారణాలు స్పష్టంగా లేవన్న విషయాన్నీ, అది ప్రధానంగా చిత్తసంస్కారానికి సంబంధించినది అన్న విషయాన్నీ తెలియచేస్తుంది. అయితే వాసనలు బలంగా ఉన్నవారికి స్పందన ఎక్కువగా ఉంటుంది. లేనివారికి స్పందన బలహీనంగా ఉంటుంది. అది అన్ని రసములకు వర్తించే అంశమే. సామాజికులలో అరసికులయినవారు కూడా ఉంటారన్న విషయమూ, వారు ఏ రసాన్నీ ఆస్వాదించలేరన్న విషయమూ విదితమే.

*భగవద్రతిని వ్యభిచారిభావంగా చెప్పిన ఆలంకారికులు స్త్రీపురుష సంబంధమయిన రతిని ఒక వైపు, గురుపుత్రదేవ సంబంధమైన రతిని మరొక వైపు ఉంచారు. మొదటిది స్థాయి అని రెండవది వ్యభిచారి అనీ అన్నారు. అందుకు కారణం బహుశా మొదటిది రెండవదానికన్నా బలవత్తరమైనదని భావించడం. అయితే ఈ “బలవత్తరం” అనేది వ్యక్తిగతమైన అభిప్రాయం (subjective). కామినీ విషయమైన రతి బలమైనదా భగవద్విషయమైన రతి బలమైనదా అనే ప్రశ్నకు అందరి నుండీ ఒకేరకమైన సమాధానం రాదు. అందుకే జగన్నాథుడు కూడా ఈ ప్రశ్న దగ్గర చర్చను ఆపివేశాడు. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ‘బలవత్తరం’ వంటి విశేషణాలపై కాక మూలలక్షణాలపైనా నిర్వచనాలపైనా ఆధారపడి చర్చించడం మంచిది. ఉదాహరణకి శాంతానికి స్థాయిభావమైన నిర్వేదం విషయంలోను ఈ విధమైన చర్చ ఉంది. అక్కడ కూడా ఆపద, ఈర్ష్య మొదలైన వానివల్ల కలిగే నిర్వేదం వ్యభిచారి భావమనీ, తత్త్వజ్ఞానం వల్ల కలిగే నిర్వేదం స్థాయి అనీ చెప్తారు (కావ్యప్రకాశం పుట 134). చర్ల గణపతి శాస్త్రిగారి సాహిత్య సౌందర్య దర్శనంలో శాంతానికి స్థాయిభావమైన నిర్వేదాన్ని “నిత్యానిత్య వస్తు విచారము వలన కలిగిన విషయవైరాగ్యము నిర్వేదము” అని వివరించి, “గృహకలహాదుల వలన కలిగిన నిర్వేదము వ్యభిచారి యగును” అంటారు( పుట 210).

అలాగే ఇక్కడ రతి అనే భావాన్ని విభజించేటపుడు కూడా “ఆశతో కూడినది”, “ఏమీ ఆశించనిదీ” అన్న లక్షణాలను బట్టి విభజిస్తే, స్త్రీపురుష సంబంధమైన రతి, గురుపుత్రమిత్రాదులపై రతి వంటివన్నీ ఒక విభాగంలోకి వస్తే భగవద్రతి ఒక్కటీ మరొక విభాగంలోకి వస్తుంది. ఈ మొదటి విభాగంలోని వాటన్నిటిలో దేనిని స్థాయిభావమనాలి వేటిని వ్యభిచారి భావాలనాలి అని వివేచించినపుడు, ఇక వాటిలో లక్షణాన్ని బట్టి విభజించే అవకాశం లేకపోతే, అంటే వాటన్నిటి మధ్యా లక్షణాలను బట్టి ఏ వ్యత్యాసమూ లేకపోతే, అపుడు బలవత్తరం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ భగవద్రతి విషయంలో ఆ అవసరం లేదు, అది లక్షణాన్ని బట్టే భిన్నం. రసంగా ప్రతిపాదించబడుతున్న భక్తి ఎటువంటి భక్తో ఈ అధ్యాయం మొదట్లో చెప్పుకున్నాం. అది నారదభక్తి సూత్రాలలో చెప్పబడిన పరమప్రేమరూపమైన భక్తి, నిష్కామమైన భక్తి. అందుకే మధుసూదన సరస్వతి ఇంద్రాది దేవతల విషయంలో రతి భావమయితే కావచ్చు కానీ హరిభక్తి భావం కాదని ఆన్నాడు.

కనుక ఈ విధంగా భగవద్రతికి ఉన్న ముఖ్య లక్షణాన్ని గమనికలోకి తీసుకోకుండా గురుపుత్రమిత్రాదుల పట్ల ఉన్న రతితో దానిని కలపడము, కామినీ విషయ రతితో పోల్చి సంచారిభావమనడము సమంజసం కాదు. భక్తిని గూర్చి లోతుగా ఆలోచించిన మధుసూదనసరస్వతి వంటి ఆలంకారికులు భగవద్రతిని సంచారిగా కాక స్థాయిగా గుర్తించడానికి కారణం ఆ గమనింపే.

ఇలా స్థాయిభావం విషయంలో ప్రాచీనులు, ఆధునికులు వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ కూడా భగవద్రతిని స్థాయిభావంగా పరిగణించడానికి అనుకూలంగానే ఉన్నాయని తెలుస్తుంది. కనుక భగవద్రతి వ్యభిచారి భావం కాదనీ, స్థాయిభావమేననీ నిర్ధారణకు రావచ్చు.

5.2.2 భక్తి రసమా? భావమా?

నిజానికి భగవద్రతి స్థాయిభావమేనని నిర్ధారించుకోవడంతోనే ఈ ప్రశ్నకు కూడా సమాధానం లభించింది. అయినప్పటికీ కొన్ని చర్చలలో భగవద్రతి ప్రస్తావన తేకుండా నేరుగా భక్తి అన్న పదాన్ని తీసుకుని మాట్లాడటం కనిపిస్తుంది కనుక ఆ విషయాలను కూడ పరిశీలించేందుకు ఈ ప్రశ్నను మరలా విడిగా చర్చిస్తున్నాను.

ఒక స్థాయిభావము రసంగా పరిణమించదు అని అనాలంటే ఆ విషయాన్ని రెండు కోణాల నుంచి చూడవచ్చు. కవి దానిని కావ్యంలో నిర్వహించగలడా లేదా అన్న కోణం ఒకటి, పాఠకుడు అటువంటి అనుభవాన్ని పొందగలడా లేదా అన్నది ఒకటి. ఈ రెండింటిలో ఏదో ఒకదానినైనా నిరూపించకుండా ఒక స్థాయిభావం రసత్వాన్ని పొందదని తీర్మానించడం కుదరదు.

మొదటి కోణాన్ని తీసుకుంటే, ఇప్పటివరకూ అలా ఏ కవీ నిర్వహించలేకపోయాడనీ, భవిష్యత్తులో కూడా నిర్వహించే అవకాశం లేదనీ చూపవలసి ఉంటుంది. అలా ఒక భావం ఏ కవి చేతా ఎప్పటికీ రసస్థాయికి చేర్చబడలేదు అని చెప్పాలంటే ఆ భావానికే ఆ బలం లేదని నిరూపించాల్సి ఉంటుంది. అంటే ఆ భావాన్ని పెంచడానికి తగినన్ని అనుభావాలు లేకపోవడమో, ఆ భావంపై ఆధారపడి నిర్మించగల కథాంశాలు ఉండవనో – ఇలా ఏదో ఒక ఆధారం చూపాలి.

భక్తిని రసంగా అంగీకరించలేమని అన్న ఆలంకారికులు ఎవరూ అలాంటి ఆధారాలు చూపలేదు. చూపే అవకాశమూ లేదు. ఎందుకంటే అందుకు వ్యతిరేకమైన ఉదాహరణలు ఇప్పటికే ఉన్నాయి. కావ్యాలలో భక్తిని రసస్థాయికి తీసుకు వెళ్ళిన కవులూ, దానిని అనుభవించిన పాఠకులూ కూడా ఇప్పటికే ఉన్నారు.

నాట్యశాస్త్రంలోని విషయమంతా లోకంలోని ప్రదర్శన మీద ఆధారపడినదే. వివిధ భావాలు లోకంలో ఎలా ప్రదర్శింపబడతాయి అన్న పరిశీలన మీద ఆధారపడే నాట్యశాస్త్రంలోని విషయాలన్నీ వివరించబడినాయి. ఆంగిక వాచిక సాత్త్వికాభినయాలు, ఆహార్యము వంటివి చెప్పబడ్డాయి. అయితే లోకంలో రతి, క్రోధము మొదలైనవన్నీ ఒక ప్రయోజనంతో ముడిపడి ఉన్నవి. కనుక ఆ భావాలు అవతలివారికి తెలియవలసిన, తెలియచేయవలసిన అవసరం ఉంది. కనుకనే వాటికి కొన్ని చేష్టలూ ఉంటాయి. కానీ సాత్త్విక భక్తులు తమ భక్తిని మరొకరికి తెలియచేయాలని అనుకోరు. కాబట్టి వారు ప్రయత్నించి చేసే చేష్టలు ఎక్కువగా ఉండవు. అప్రయత్నంగా చూపే సాత్త్విక భావాలే ఉంటాయి. ఇదంతా నిజమే కావచ్చు. అయితే దీనివలన ఒక కావ్యంలో భక్తిరసాభివ్యక్తి, భక్తిరసపోషణ అసాధ్యాలవుతాయా అన్న విషయాన్ని పరిశీలిద్దాము.

విభావానుభావ సంచారిభావాల సంయోగంతో రసనిష్పత్తి జరుగుతుందని ఆలంకారికులు చెప్పినప్పటికీ, అన్ని సందర్భాలలోను మూడూ తప్పకుండా ఉండాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఒక రసానికి మాత్రమే చెందడానికి వీలున్న విభావాదులను వర్ణించిన సందర్భాలలో మిగిలిన రెండింటినీ ఊహించుకోవచ్చుననీ, అక్కడ విభావానుభావ సంచారిభావాలు మూడూ ఉండాలన్న నియమం లేదనీ కావ్యప్రకాశం వివరిస్తుంది (పుట 109). మూడింటిలో ఒకదానిని చెప్పి మిగిలిన రెండింటినీ చెప్పనప్పటికీ కూడా రసాభివ్యక్తికి ఆటంకం కలగని ఉదాహరణలను కూడా కావ్యప్రకాశం పేర్కొన్నది.

ఈ నేపథ్యంతో భక్తిని పరిశీలిస్తే భక్తికి సంచారిభావాలు ఎక్కువగా లేవన్న అభ్యంతరం అనవసరమని అర్థమవుతుంది. ఎందుకంటే భక్తిలో ఆలంబన విభావానికి సంబంధించిన స్పష్టత ఎక్కువ. భక్తికి సంబంధించిన ఆలంబన విభావం భక్తికి మాత్రమే ప్రత్యేకం కనుక భక్తి విషయంలో అనుభావాదులు ఎక్కువగా లేవన్న సమస్య రాదు. రసభంగానికి కారణమయ్యే విభావాదుల కష్టకల్పన వంటి దోషాలు మిగిలిన రసాలకు వర్తించినంతగా భక్తికి వర్తించవన్న విషయాన్ని ఈ అధ్యాయంలో ఇంతకు మునుపు ప్రస్తావించడం జరిగింది.

మరొక విషయమేమిటంటే, పాత్రచిత్రణ పరంగా చూసినపుడు ఉదాత్తమైన పాత్రలు అనుభావ సంచారిభావాలను ఎక్కువగా ప్రకటించకపోవడమనేది ఒక్క భక్తికే కాదు, అన్ని రసాలకూ వర్తిస్తుంది. ఈ విషయాన్ని అటు ఆలంకారికులు ఇటు ఆధునిక విమర్శకులు కూడా అంగీకరిస్తారు. సంచారిభావాల వంటి వాటిని ఎక్కువగా చెప్పకుండానే రసాభివ్యక్తిని కలిగించడమనే మార్గాన్ని ఏ రసం విషయంలోనైనా కవులు పాటించవచ్చును. నన్నయగారి కవిత్వాన్ని విశ్లేషిస్తూ విశ్వనాథ “నన్నయగారు రసమును శబ్దసంయోజన శక్తి నుండి కలిగింతురు. విస్తరించి భావములను చెప్పుట చేతఁ జేయరు. ఇదొక చమత్కారమయిన విలక్షణమయిన మార్గము” అనడం కనిపిస్తుంది (నన్నయభారతి ప్రథమ సంపుటము పుట 833).

కాబట్టి నాలుగు రకాలైన అభినయాలలో ఆంగిక, సాత్త్విక, ఆహార్యాలకు అవకాశం ఉన్నా లేకున్నా, ఒక్క వాచికం ద్వారానే బాగా పోషించడానికి అవకాశమున్న భక్తి విషయంలో తగినన్ని అనుభావాలు, సంచారిభావాలు లేవనే అభ్యంతరానికి అసలు ఆస్కారమే లేదని అనుకోవచ్చు.

ఈవిధంగా శాస్త్రాంశాలను ఆధారం చేసుకుని ఇప్పటివరకూ చేసిన విశ్లేషణల ప్రకారం భక్తిని రసంగానే పరిగణించాలన్న విషయం నిర్ధారణ అవుతుంది.

5.2.3 భక్తి శృంగార రసంలో అంతర్భవిస్తుందా?

భక్తికి రసంగా పరిణమించే శక్తి ఉన్నదన్న విషయాన్ని నిర్ధారించుకున్న తరువాత పరీక్షించవలసిన విషయం దానిని మరొక రసంలో భాగంగా చూడగలమా లేదా అన్నది. కొందరు ఆలంకారికులు భక్తిని శృంగారరసంలో అంతర్భవింపచేయవచ్చునన్నారు. అయితే చిత్తవృత్తులు, రసముల పరస్పర సంబంధం వంటి అంశాల ఆధారంగా భక్తిరసాభివ్యక్తికి, శృంగార రసాభివ్యక్తికి తేడా ఉందన్న విషయాన్ని ఇంతకు మునుపు కొంత చర్చించడం జరిగింది. ఇపుడు మరికొన్ని అంశాలు చర్చించవలసి ఉంది.

శృంగారానికి స్థాయిభావమైన రతిని సార్వజనీనమని ఒప్పుకోవడానికి ఆలంకారికులెవరూ సంకోచించడం లేదు. భగవద్రతి విషయంలో మాత్రం సందేహపడుతున్నారు. ఆ సందేహం కారణంగా భగవద్రతిని రతిలో అంతర్భవింప చేస్తున్నారు. ఇందులో వైరుధ్యం కనిపిస్తోంది. ఈ మూడు విషయాలూ ఒకదానితోనొకటి పొసగవు. భగవద్రతి రతిలో అంతర్భవిస్తుందంటున్నారంటే సహృదయుని చిత్తంలోని రతికీ భగవద్రతికీ కూడా ఒకే విధమైన వాసనాబలం కారణమవాలి. అపుడు ఒకటి సార్వజనీనమనీ మరొకటి కాదనీ చెప్పడం పొసగదు. లేదు ఆ రెండింటికీ కారణమయ్యే సంస్కారం ఒకే విధమైనది కాదంటే, అపుడు వాటిలో ఒకటి మరొక దానిలో అంతర్భవిస్తుందనడం కుదరదు.

రసానికి ఆధారం స్థాయిభావం. స్థాయిభావం ఉద్బుద్ధం అవడానికి విభావాలు కారణమయితే, అభివ్యక్తికి సాధనమయ్యేవి అనుభావాలు. కాబట్టి రసం యొక్క అభివ్యక్తీ, సహృదయుని ద్వారా దాని ప్రతీతి ముఖ్యంగా విభావానుభావాల మీదే ఆధారపడి ఉంటుందని పండితులు అంగీకరిస్తారు. ఆ విభావానుభావాలు శృంగారానికీ భక్తికీ భిన్నం. అతిముఖ్యమైన ఆలంబన విభావమే రెండిటికీ భిన్నం. వీరరౌద్రాలకు ఆలంబనవిభావం ఒక్కటే అయినప్పటికీ స్థాయిభావం వేరన్న కారణంగా వాటిని భిన్నరసాలుగా పరిగణించారు. వీరరౌద్రాల విషయంలో స్థాయిభావాలలోని భేదాన్ని లెక్కలోకి తీసుకుంటూ, భక్తిశృంగారాల విషయంలో విభావాలలోని భేదాన్ని కూడా లక్ష్యపెట్టక పోవడం సబబు కాదనిపిస్తుంది. వీరరౌద్రాలకు భేదం చెప్పడానికి కారణం ఒకదానిలో వివేకం ఉండడం, మరొక దానిలో వివేకం లేకపోవడం అంటారు (కావ్యప్రకాశం పుట 121). అలాగే కరుణము విప్రలంభశృంగారము – ఈ రెండిటి మధ్యన ఉన్న భేదాన్ని చెప్పేటపుడు కూడా సాపేక్షా భావమున్నచో విప్రలంభమని నిరాపేక్షా భావమున్నచో కరుణమని అన్నారు. ఆ విధమైన భేదాలు శృంగారానికీ భక్తికీ కూడా చాలా ఉన్నాయి. ఆరెండింటిలో ఒకటి సకామం. మరొకటి నిష్కామం. ఒకదానిలో దేహభావన ఉంటుంది, మరొకదానిలో ఉండదు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన భేదాలే అయినప్పటికీ ఆలంకారికులు వీటిని పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరం.

ఈ రెండు రసాలకు చెందిన ఆలంబన విభావాలను స్థూలంగా పరిశీలిస్తేనే ఎన్నో భేదాలు కనిపిస్తాయి. అలంకారశాస్త్రాలు శృంగారనాయికలకు చెప్పిన లక్షణాలు భక్తికి వర్తించవు. రసమంజరి ఇరవై ఆరు మంది శృంగార నాయికలను వర్ణిస్తుంది. వీటిలో చాలావరకు ముగ్ధభక్తికి వర్తించవు. అసలు స్వీయ, పరకీయ, సామాన్యమనే ముఖ్య భేదాలే కృష్ణుని చేరాలనుకునే నాయికకు ఉండవు. అలాగే జ్యేష్ట, కనిష్ట అనే తేడాలూ అక్కడ ఉండవు.

శృంగార రసానికి ఆలంబనాలయిన నాయికా నాయకుల విషయంలో రూపము, యౌవనము, లావణ్యము, కులము వంటి వాటికి ప్రాధాన్యం ఉంది. శృంగార రసానికి ఆలంబనాలుగా నాయికానాయకులను చెప్పినపుడు ఆలంకారికుల అభిప్రాయం రూప లావణ్యాదులలో విశిష్టమైన వారు అనే. విన్నకోట పెద్దన అయితే శృంగార రసానికి ఆలంబన విభావాలుగా నాయికా నాయకులను కాక నేరుగా యౌవన, కాంతి, శ్రీ, లావణ్యాదికాలనే చెప్పాడు. అయితే భక్తిరసపోషణకు ఇవేవీ అవసరం లేదు.

భాగవతంలోని ప్రహ్లాదుడు, ధృవుడు మొదలయిన వారి కథలకు గాని; భీష్ముడు, కుంతి మొదలైన వారి భక్తిని వర్ణించే సన్నివేశాలలో కానీ; అలాగే శ్రీకాళహస్తి మాహాత్మ్యం వంటి కావ్యాలలోని కన్నప్పాదుల కథలకు కానీ ఈ లక్షాణాలేవీ వర్తింపచేయలేము. వాటి విషయంలోనే కాదు గోపికా కృష్ణుల విషయంలోనూ ఈ లక్షణాలను వర్తింపచేయలేము. శృంగారరస పోషణలో ప్రాముఖ్యం వహించే ఈ అంశాలన్నిటికీ భక్తిరస పోషణలో అసలే మాత్రమూ ప్రాధాన్యం లేదు.

భక్తిని రసంగా ప్రతిపాదించిన రూపగోస్వామి విభావానుభావాలను సమగ్రంగా వివరించారు. భక్తిరసామృతసింధులోని వివరణ ప్రకారం ఆలంబన విభావమైన శ్రీకృష్ణుడికి అరవై నాలుగు లక్షణాలు చెప్పబడ్డాయి. వాటిలో ఇరవైతొమ్మిది లక్షణాలు మరొక ఆలంబనవిభావమైన భక్తులకీ వర్తిస్తాయి. అవి సత్యవాక్యః, ప్రియంవదః, వావదూకః (శ్రవణానందకరమైన వాక్కులను పలుకువాడు), సుపాండిత్యః, బుద్ధిమాన్, ప్రతిభాన్వితః, విదగ్ధః, చతురః, దక్షః, కృతజ్ఞో, సుధృఢవ్రతః, దేశకాల సుపాత్రజ్ఞః, శాస్త్రచక్షుః, శుచిః, వశీ, స్థిర, దాన్తః, క్షమాశీలః, గంభీరః, ధృతిమాన్, సమః, వదాన్యః, ధార్మికః, శూరః, కరుణః, మాన్యమానకృత్ (మాన్యులను గౌరవించువాడు), దక్షిణః, వినయీ, హ్రీమాన్ (లజ్జాశీలుడు) అనే లక్షణాలు. వీటిలో చాలావరకు శృంగారనాయికలకు వర్తించవని గమనించవచ్చు. అంతేకాదు, కృష్ణుని విషయంలో చెప్పిన సురమ్యాంగః, సర్వసల్లక్షణాన్వితః వంటి లక్షణాలు భక్తుల విషయంలో చెప్పలేదన్న విషయాన్ని కూడా గమనించాలి. అంటే భక్తుల విషయంలో రూప లావణ్య యౌవనాదులకు ప్రాముఖ్యం లేదు.

ఆలంబన విభావాలలోనే కాదు, ఉద్దీపన విభావాలలో కూడా రెండురసములకూ పోలిక కనబడదు. భక్తిరసానికి భగవానుని గుణములు, క్రియలు, హాసము, చరణచిహ్నములు, నూపురములు, క్షేత్రములు, భక్తులు వంటి పద్నాలుగు ఉద్దీపన విభావాలు చెప్పబడ్డాయి. వాటిలో శ్రీకృష్ణునికే ప్రత్యేకమైన వేణువు వంటి వాటిని తీసివేసినా ఇక్కడ చెప్పిన ఈ విభావాలన్నీ రామునికి, శివునికీ సంబంధించిన భక్తిరస కావ్యాలకు కూడా వర్తిస్తాయి. శృంగారసానికి ఉద్దీపనలుగా చెప్పబడే చంద్రుడు, మలయానిలము, వెన్నెల వంటివి ఈ జాబితాలో లేవు. అవి భక్తిరసానికి వర్తించవు. భక్తిరసంలో చెప్పబడిన “భక్తులు” వంటి ఉద్దీపన విభావాలు శృంగారరసానికి వర్తించవు. ఇక్కడ కృష్ణుడికీ అక్కడ నాయకుడికీ, ఇక్కడ భక్తులకీ అక్కడ నాయికలకీ పోలిక అనుకుంటే, శృంగార రస పోషణలో ఇతర నాయికల ప్రసక్తి రసోద్దీపనకు కారణమయ్యే అవకాశం లేదు. కానీ భక్తిరస పోషణలో ఇతర భక్తుల ప్రసక్తి ఒక ముఖ్యమైన ఉద్దీపన విభావం.

అలాగే వ్యభిచారి భావాలలో, ‘ఆలస్యం’ శృంగార రసానికి వ్యభిచారి కాదు, కానీ భక్తిరస సంచారిభావాలలో ఆలస్యం కూడా ఉంది.

ఇన్ని భేదాలున్నప్పటికీ భక్తి ప్రత్యేక రసంగా గుర్తింపబడకపోవడం చూస్తే ఆలంకారికులు భక్తికి సంబంధించిన లక్షణాలను వివేచించడంలో చూపవలసినంత శ్రద్ధ చూపలేదనీ, భక్తిరసపోషణలోని వైవిధ్యాన్ని గురించి ఆలోచించవలసినంతగా ఆలోచించలేదనీ అనిపిస్తుంది. ఎందుకంటే రససంఖ్య గురించి మాట్లాడే సందర్భాలలో భక్తి కూడా శృంగారంలో భాగమని చెప్పినప్పటికీ, శృంగార రసం గురించి మాట్లాడే సందర్భాలలో, దానికి లక్షణాలను చెప్పే సందర్భాలలో ఎప్పుడూ కూడా భక్తి అందులో భాగమన్న దృష్టిని ఆలంకారికులు చూపలేదు.

భక్తి శృంగార రసంలో అంతర్భాగమని చెప్పిన సందర్భాలలో శృంగారరసమంటే స్త్రీపురుష కామానికి సంబంధించినది మాత్రమే కాదన్న వ్యాఖ్యను ఆలంకారికులు, విమర్శకులు చేస్తూ ఉండవచ్చును కానీ విడిగా శృంగార రసమును గూర్చి మాట్లాడే అన్ని సందర్భాలలోనూ దానిని స్త్రీపురుష కామ సంబంధిగానే ఆలంకారికులు, విమర్శకులు చూస్తారన్నదీ ప్రస్తావిస్తారన్నదీ వాస్తవం. శృంగార రసం గురించి మాత్రమే మాట్లాడే సందర్భాలలో భక్తిని శృంగార రసంలో భాగంగా గుర్తించడం ఎక్కడా కనబడదు. అందుకు ఎన్నో ఉదాహరణలు లభ్యమవుతాయి కానీ ఇక్కడ కొన్నిటిని మాత్రం చూపుతాను.

ఇలా అలంకారశాస్త్ర గ్రంథాలన్నిటిలోనూ శృంగారం అంటే యువతీయువకుల మధ్య ఉండే రతిగానే చెప్పబడింది. భగవద్రతి ప్రస్తావన లేదు. అలంకార శాస్త్రగ్రంథాలలోనే కాదు, ఆధునిక విమర్శకుల, పరిశోధకుల దృష్టిలోనూ శృంగారం అంటే స్త్రీపురుష సంబంధమైన రతియే.

ఆండ్ర కమలాదేవి గారు తమ సిద్ధాంత గ్రంథంలో కరుణరసాన్ని గురించి ప్రస్తావిస్తూ “శ్రీ కాశీభట్ట వారి అభిప్రాయానుసారము మానవుని జీవితమున గల నాలుగు అవస్థలలో బాల్య వార్ధక్యావస్థల యందు శృంగారమునకు ప్రమేయము లేదు. మరియు యమ నియమాది సాధన సంపత్తి కలిగి, లౌకిక జీవితము నుండి వైరాగ్యము నొందిన వాల్మీక్యాది మహర్షులకు కూడ నిట్టి దానియందు మనసు వర్తింపదు. కాని కరుణమునకు అట్టి విఘాతములేవియును లేవు. బాల్య యౌవన కౌమార వార్ధక్యములను నాలుగు అవస్థలందును కరుణమునకు ప్రచారము కలదు” అంటారు (పుట 211).

ఇవన్నీ కూడా శృంగార రసాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భాలలో ఆలంకారికులు, విమర్శకులు భక్తిని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం లేదన్న విషయాన్నీ, భక్తిని శృంగారంలో అంతర్భాగమని పరిగణించి వ్యాఖ్యానించడం లేదన్న విషయాన్నీ స్పష్టం చేస్తాయి.

కాబట్టి రససంఖ్య ప్రసక్తి వచ్చినపుడు సంప్రదాయాన్ని అధిగమించే ఉద్దేశం లేనందువల్ల మాత్రమే భక్తిని కూడా శృంగారంలో అంతర్భాగంగా చెప్తున్నారు కానీ లక్షణాలను బట్టి అయితే ఆ రెండింటినీ ఒకటిగా ఎవరూ పరిగణించడంలేదని అర్థమవుతోంది.

(సశేషం)

Exit mobile version