[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]
అధ్యాయం 5 – రెండవ భాగం
5.1.3 చిత్తవృత్తులు
రసప్రసంగంలో ఆలంకారికులు చిత్తవృత్తుల గురించి ప్రస్తావించారు. శృంగారాది రసాలకు, మాధుర్యాది గుణాలకు, వికాసం, విస్తారం వంటి చిత్తవృత్తులకు మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పారు. చిత్తవృత్తులు ఎన్ని, వాటి స్వరూపం ఏమిటి అన్న విషయాల మీద ఆలంకారికులు చెప్పిన వివిధ రకాలయిన అభిప్రాయాలను పాటిబండ్ల మాధవశర్మ గారు తమ సిద్ధాంత గ్రంథంలో క్రోడీకరించారు (పుట 121-126).
రసములు, గుణములు, చిత్తవృత్తులు – వీటిలో ఏది ముందు ఏది వెనుక, ఏవి కార్యాలు ఏవి కారణాలు అన్న విషయంలో ఆలంకారికులలో భిన్నాభిప్రాయాలున్నాయి. రసాన్ని ఆస్వాద్యంగా పరిగణిస్తామా లేక ఆస్వాదంగా పరిగణిస్తామా, కావ్యగత విషయమంటామా, సహృదయగతమంటామా అన్న దానిపై ఆధారపడి బహుశా ఈ అభిప్రాయభేదాలు ఏర్పడి ఉంటాయి. అయితే ఏ విధంగా చూసినప్పటికీ చిత్తవృత్తులకీ రసాలకీ మధ్య ఒక సంబంధం ఉందన్న విషయాన్నయితే అందరూ చెప్పారు కనుక చిత్తవృత్తుల ఆధారంగా కూడా భక్తిరసం విభిన్నమా కాదా అని విశ్లేషించే అవకాశం ఉందని అనిపించింది. అందువలన ఆ విధమైన పరిశీలన కొంత చేశాను.
ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలో ద్రుతి, దీప్తి అనే చిత్తవృత్తులను పేర్కొన్నాడు. విప్రలంభ శృంగారంలోను, కరుణంలోను మాధుర్య గుణము, ఆర్ద్రతా రూప చిత్తవృత్తి ఉంటాయని, రౌద్రాది రసాలలో ఓజోగుణమూ, దీప్తి అనే చిత్తవృత్తీ ఉంటాయనీ ఆనందవర్ధనుడి అభిప్రాయం. రౌద్రాది అన్నపుడు వీరాద్భుతాలు కూడా గ్రహించబడతాయని అభినవగుప్తుడి వ్యాఖ్య. ఇక మూడవదైన ప్రసాదగుణము సర్వరసాలకూ సాధారణమైన గుణమన్నారు కానీ దానికి సంబంధించిన చిత్తవృత్తిని ఆనందవర్ధనుడు చెప్పలేదు.
ఆనందవర్ధనుడి తర్వాత అభినవగుప్తుడి గురించి చెప్తూ మాధవశర్మ గారు “అభినవగుప్తుడు ఆస్వాదమనబడు భోగము ద్రుతి విస్తర వికాస రూపమని చెప్పుచు మూడు వృత్తులు పేర్కొనిరి” అన్నారు. కానీ నిజానికి లోచనాన్ని పరిశీలిస్తే, భోగం (కావ్యాస్వాదం) ద్రుతి విస్తర వికాస రూపమైనది అన్న మాట భట్టనాయకుడిదనీ, అభినవగుప్తుడు దానిని కేవలం పేర్కొన్నాడనీ అర్థమవుతున్నది. లోచనంలోని ఈ వాక్యాలకు రజోవిజృంభణము ద్రుతిరూపము, తమోవిజృంభణం విస్తార రూపము, సత్త్వవిజృంభణం వికాసరూపము అన్న బాలప్రియ వ్యాఖ్య కనిపిస్తుంది.
నిజానికి భట్టనాయకుని మాటలను పేర్కొన్న తర్వాత అభినవగుప్తుడు చిత్తవృత్తులు కార్యాలూ, సత్త్వరజస్తమో గుణాల కలయిక లోని వైచిత్ర్యం వాటికి కారణమూ అయితే, వైచిత్ర్యం (కారణం) అనంతం కనుక చిత్తవృత్తులు (కార్యాలు) కూడా అనంతంగానే ఉంటాయని అన్నట్లుగా కనిపిస్తున్నది.
ధనంజయుడు దశరూపకంలో వికాస, విస్తర, క్షోభ, విక్షేపములనే నాలుగు రకాలైన చిత్తవృత్తులను చెప్పాడు (4-43, 44, 45). అవి వరుసగా శృంగార, వీర, బీభత్స, రౌద్ర రసాలకు, మళ్ళీ అవే వరుసగా హాస్య, అద్భుత, కరుణ, భయానక రసాలకు మూలములని అన్నాడు. అంటే శృంగార హాస్య రసాలు రెండిటిలోనూ చిత్తవికాసము, వీరాద్భుతాలలో చిత్త విస్తారమూ, బీభత్స భయానక రసాలలో చిత్తక్షోభము, రౌద్ర కరుణ రసాలలో చిత్తవిక్షేపము ఉంటాయి. అహోబలపండితుడు కూడా వికాస విస్తర క్షోభ విక్షేపాలనే నాలుగు చిత్తవృత్తులనే చెప్పి, వాటికి శృంగారాది రసాలతో ధనంజయుడు చెప్పిన విధంగానే సంబంధం చెప్పాడు. భోజుని సరస్వతీ కంఠాభరణములో చిత్తక్షోభమునకు బదులుగా చిత్తసంకోచము చెప్పబడింది (ప్రథమ సంపుటి పుట 308). అంటే బీభత్స భయానకములలో చిత్తసంకోచము కలుగుతుందన్న మార్పు కనిపిస్తుంది. మిగిలిన మూడు చిత్తవృత్తులూ ధనంజయుడు చెప్పిన విధంగానే ఉన్నాయి.
ఇక శాంతరస స్థాయిభావమైన శమము అనిర్వచనీయమనీ; అయితే ముదిత, మైత్రి, కరుణ, ఉపేక్ష అన్నవాటి ద్వారా శమం ప్రకటించబడుతుందనుకున్నట్లయితే అపుడు అవి వికాస విస్తర క్షోభ విక్షేపములనే చిత్తవృత్తుల క్రిందికే వస్తాయనీ దశరూపకంలోని వ్యాఖ్య.
చిత్తవృత్తుల గురించి ధనంజయుని వ్యాఖ్య కావ్యం వైపు నుండి చేసినట్లుగా ఉంటుంది. ఆస్వాదన గురించి కాక ప్రకటన గురించి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. సహృదయుడి వైపు నుంచి వ్యాఖ్యానించడం అభినవగుప్తుని తర్వాతనే ప్రారంభమయింది కనుక ఇది సహజమే.
ఇక పాత్రల చిత్తవృత్తిని గురించి కాక సహృదయుని చిత్తవృత్తిని గురించి వ్యాఖ్యానించిన మమ్మటాదుల అభిప్రాయాలు పరిశీలిస్తే, మమ్మటుడు చిత్తద్రుతి కారణమైన ఆహ్లాదకత్వమే మాధుర్యమనీ అది శృంగారంలో ఉంటుందనీ అంటాడు. ఆ మాధుర్య గుణం సంభోగ శృంగారం కంటే కరుణ లోను, దానికంటే విప్రలంభంలోను, దానికంటే శాంతంలోను అధికంగా ఉంటుందని కూడా కావ్యప్రకాశం చెప్తుంది (పుట 513, 514). అలాగే చిత్తానికి విస్తార రూపమైన ప్రజ్వలనాన్ని కలిగించేది ఓజస్సు అనీ, అది వీరం లోను, దాని కంటే ఎక్కువగా బీభత్సంలోను, అంతకంటే ఎక్కువగా రౌద్రం లోను ఉంటుందని చెప్తుంది. అంటే మాధుర్యం చిత్తద్రుతినీ, ఓజస్సు విస్తారాన్నీ, ప్రసాదం వికాసాన్నీ కలిగిస్తాయని చెప్పడము, వాటిలో మాధుర్యం శృంగార, కరుణ, శాంతాలకు; ఓజస్సు వీర, రౌద్ర, బీభత్సాలకు వర్తిస్తాయనీ, ప్రసాద గుణం సర్వత్రా అంటే సర్వ రసాలకు వర్తిస్తుందనీ చెప్పడము కావ్యప్రకాశంలో కనిపిస్తుంది. సాహిత్య దర్పణం కూడా ఈ విషయాలను కావ్యప్రకాశంలో వలెనే చెప్తుంది.
చిత్తవృత్తులకు గుణాలను కాక రసాలనే కారణంగా చెప్పడం సబబని జగన్నాథుని అభిప్రాయం. ఈ విషయంలో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఏ రసాలకు ఏ చిత్తవృత్తులతో సంబంధమన్న విషయాన్ని మాత్రం జగన్నాథుడు కూడా మమ్మటాదుల వలెనే చెప్పాడు. అంటే శృంగార కరుణ శాంతాలు చిత్తద్రుతికి, వీర రౌద్ర బీభత్సాలు దీప్తికి కారణమవుతాయనే చెప్పాడు (నవరసగంగాధరము పుట 149-154).
ఇలా చిత్తవృత్తుల సంఖ్యను గురించి, వాటి పేర్లను గురించి, ఆలంకారికులు రకరకాల అభిప్రాయాలను వెలువరించినట్లు కనబడుతున్నా, ప్రధానంగా అవి రెండే విభాగాలు. ఒకటి ధనంజయాదులు చెప్పిన వికాస, విస్తర, క్షోభ, విక్షేపములనే విభాగం. రెండవది మమ్మటాదులు చెప్పిన ద్రుతి, విస్తర, వికాసములనే విభాగం.
ఇక రసముల విషయానికి వస్తే, భక్తి శాంత రసంలో అంతర్భవిస్తుందని కొందరు, శృంగార రసంలో అంతర్భవిస్తుందని మరి కొందరు అన్నారు కనుక ఆరెండు రసాలకు సంబంధించిన చిత్తవృత్తులనే ఇప్పుడు పరిశీలించాలి.
ధనంజయాదులు చెప్పిన విభాగంలో శాంతరసానికి ప్రత్యేకంగా ఏ చిత్తవృత్తినీ చెప్పలేదు. దానిని ప్రకటించడానికి మైత్ర్యాదులే ఆధారం కనుక నాలుగు చిత్తవృత్తులూ వర్తిస్తాయని చెప్పాడు. అయితే ఈ మైత్ర్యాదులనేవి భక్తికీ వర్తిస్తాయి. లలితా సహస్ర నామాలలో “మైత్ర్యాది వాసనాలభ్యా” అనేది ఒక నామం. భక్తులు కూడా మైత్రి ముదిత కరుణ ఉపేక్ష అనే నాలుగింటినీ కలిగి ఉండాలని ఈ నామం చెప్తున్నది కనుక కావ్యాలలో భక్తిని వ్యక్తీకరించడానికి కూడా నాలుగు చిత్తవృత్తులూ ఉపకరిస్తాయని అనుకోవాలి. ఇక శృంగారానికి వికాసమనే చిత్తవృత్తితో సంబంధం చెప్పినా దాని లక్షణం స్పష్టంగా లేదు. శృంగార రసంతో సంబంధం చెప్పారు కాబట్టి దానిని మాధుర్య గుణ విశిష్టమని అనుకోవాలా, లేక రెండవ విభాగంలో (మమ్మటాదులు చెప్పిన విభాగం) చెప్పిన వికాసం వలె ఇది కూడా ప్రసాదగుణ విశిష్టమని అనుకోవాలా అన్న విషయం స్పష్టంగా లేదు. ఒకవేళ ప్రసాదగుణ విశిష్టమని అనుకుంటే ప్రసాదగుణం సర్వరస సామాన్యమని చెప్పారు కనుక ప్రత్యేకంగా చర్చించేందుకు ఏమీ లేదు. మాధుర్యగుణ విశిష్టమని అనుకుంటే అపుడు అది రెండవ విభాగంలో చెప్పిన ద్రుతి వంటిదే అవుతుంది.
మమ్మటాదులు చెప్పిన విభాగంలో శాంతానికీ శృంగారానికీ కూడా చిత్తద్రుతితోనే సంబంధం చెప్పారు. కాబట్టి భక్తి శాంతంలో కానీ శృంగారంలో కానీ అంతర్భవిస్తుందన్న మాట నిజమే అయితే భక్తికి కూడా చిత్తద్రుతితోనే సంబంధం చెప్పవలసి ఉంటుంది. కానీ భక్తిరస పూరితాలనిపించుకున్న రచనలను పరిశీలించినపుడు ఈ విషయాన్ని పూర్తిగా అంగీకరించలేమనిపిస్తుంది. భక్తిలో చిత్తద్రుతి మాత్రమే కాక దీప్తి కూడా ఉంటుందని అనిపిస్తుంది. మాధుర్యమే కాక ఓజస్సూ ఉంటుందనిపిస్తుంది.
భక్తిని రసంగా ప్రతిపాదించిన మధుసూదనసరస్వతి చిత్తద్రుతి, భగవద్విషయకత్వము అనేవి రెండూ భక్తిరసానికి అవసరమైన రెండు ముఖ్యాంశాలని చెప్తారు (భక్తిరసాయనము పుట 77). కామ క్రోధ భయ స్నేహ హర్ష శోక దయాదులు చిత్తద్రుతి కారకాలనీ, అవి భగవద్విషయకములయినపుడు భక్తిరసంగా పరిణమిస్తాయనీ వారు అంటారు (1-5). వీటిలో ఒక్కొక్కదానినీ వివరిస్తున్నపుడు హర్షము నాలుగు రకాలని చెప్తారు. మొదటి రకమైన హర్షము వలన కలిగే చిత్తద్రుతిలో భగవద్విషయకమగు రతి శుద్ధమై భాసిస్తుందనీ, రెండవ రూపమైన హర్షము వలన కలిగే చిత్తద్రుతిలో చిత్తవికాసరూపమగు హాసముందనీ, మూడవ రూపమైన హర్షజనితమగు చిత్తద్రుతిలో చిత్తవికాస రూపమగు విస్మయం ఉందనీ, నాలుగవరూపమైన హర్షము వలన ద్రవీభూతమైన చిత్తంలో చిత్తవిస్తార రూపమగు ఉత్సాహముంటుందని వివరిస్తారు (2-13,14,15,16).
ఇది భక్తిలో ఉన్న ఒకానొక విశిష్టతగా కనిపిస్తుంది. సాధారణంగా అధికారం చేసేవాడికి గర్వము, అతిశయం వంటివి ఉంటాయి. దాసుడికి ఉండవు. కానీ భక్తిలో “దాసుడిననే అతిశయం” ఉంటుంది. అందుకే భక్తి ద్రుతికీ దీప్తికీ కూడా కారణమవుతుంది. భగవద్రతి ప్రాపంచిక విషయాలపై అలక్ష్యాన్ని, నిరసనను కలిగిస్తుంది. అదే సమయంలో భగవంతుడే సర్వత్రా నిండి ఉన్నాడన్న స్పృహ వలన ప్రపంచంపై అవ్యాజమైన ప్రేమనీ కలిగిస్తుంది. భక్తికి ఉన్న ఈ విశిష్ట లక్షణం వలన భక్తిరచనలలో మాధుర్యమూ ఓజస్సూ కూడా చోటుచేసుకుంటాయనిపిస్తుంది.
భాగవతంలోని ఎన్నో ఓజోగుణ సంపన్నాలయిన పద్యాలను సహృదయులు భక్తిరసపూరితాలుగా పేర్కొనడం కనిపిస్తూ ఉంటుంది. మాధుర్యానికి పరమోదాహరణగా చెప్పబడే “మందార మకరంద” వంటి పద్యంలో కూడా ఎత్తుగీతి లోని “అంబుజోదరు దివ్యపాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము” అన్న దీర్ఘ సమాసం, అందులోని శకార షకారాలు, మత్త, చిత్త వంటి పదాలు ఇవన్నీ ఓజస్సును రేఖామాత్రంగా భాసింప చేస్తాయి. శబ్దమే కాదు, అర్థాన్ని బట్టి చూస్తే కూడా ఈ పద్యంలో వినయమూ, అతిశయమూ ఏకకాలంలో భాసిస్తున్నాయని గమనించవచ్చు.
తరువాతి అధ్యాయంలో కావ్యాలను ఆధారం చేసుకుని పరిశీలించడం ద్వారా ఈ విషయాన్ని మరికొంత విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. కానీ స్థూలపరిశీలనకు భక్తికి చిత్తద్రుతితో మాత్రమే సంబంధాన్ని చెప్పలేమనీ అది ద్రుతి విస్తర వికాసాలు మూడింటినీ కలిగిస్తుందనీ అర్థమవుతున్నది.
ఈ గ్రంథానికి అనుబంధంగా చేర్చిన “భక్తిశతకములు- ఛందఃశిల్పము” అన్న వ్యాసంలోని పరిశీలనలు కూడా ఈ విషయాన్నే తెలియచేస్తాయి. కాబట్టి సుకుమారములనీ, ఓజోగుణ విశిష్టమైన చిత్తవిస్తారానికి అవకాశమివ్వవనీ చెప్పబడే శృంగార శాంతముల కంటే భక్తి భిన్నమని అనిపిస్తున్నది.
5.1.4 రసాల పరస్పర సంబంధం
మొదట ఆనందవర్ధనుడు, ఆ తర్వాత మమ్మటుడు, విశ్వనాథుడు, జగన్నాథుడు కూడా రసముల మధ్య మైత్రిని గురించి, విరోధాన్ని గురించి ప్రస్తావించారు.
రసవిరోధం లేదా రసమైత్రిని మూడు రకాలుగా చెప్తుంటారు – ఆలంబనైక్యం, ఆశ్రయైక్యం, నైరంతర్యం. అంటే కొన్నిరసాలు ఒక ఆలంబనానికి విరుద్ధాలయితే కొన్ని ఆశ్రయానికి విరుద్ధాలు. కొన్ని ఒకదాని తర్వాత ఒకటి వ్యవధానం లేకుండా రావడం వలన విరుద్ధాలవుతాయి.
అయితే విరుద్ధమైన భావాలు వెంటవెంటనే కలగడం కూడా అసంభావ్యం కాదనీ, ప్రతిభావంతుడైన కవి అలాంటి సన్నివేశాలను కూడా జాగ్రత్తగా నిర్వహించి రసభంగం కావడానికి బదులు రసం మరింత బాగా పండడానికి కావలసిన నేర్పును ప్రదర్శిస్తాడనీ సాహితీవేత్తలు అంగీకరిస్తారు.
విరుద్ధ రసములను చెప్పిన ఆలంకారికులు ఆ వైరుధ్యాన్ని ఎలా పరిహరించాలి అన్న విషయాన్ని చర్చించి అటువంటి సందర్భంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కొన్నిటిని సూచించారు. 1) ఒక రసం అంగి అయినపుడు దాని విరోధి రసాన్ని అత్యంతంగా (అంగి కంటే ఎక్కువగా) పరిపుష్టం చేయకూడదు, 2) అంగిరసానికి విరుద్ధంగా వ్యభిచారి భావాలను ఎక్కువగా కూర్చకూడదు 3) అంగభూతమయిన రసాన్ని పరిపోషించినప్పటికీ నిరంతరం దాని అంగరూపత్వాన్ని మనసులో ఉంచుకోవాలి. ఇవి విరుద్ధ రసములను వెంటవెంటనే పోషిస్తున్నపుడు తీసుకొనవలసినవిగా ఆలంకారికులు చెప్పిన జాగ్రత్తలు.
ఆలంకారికులు చెప్పిన ఈ విషయాలు రెండింటినీ – రసాల మధ్య వైరుధ్యాలు, విరుద్ధ రసాలను పోషించేటపుడు తీసుకోదగినవిగా చెప్పిన జాగ్రత్తలు – దృష్టిలో పెట్టుకుని భక్తి యొక్క స్వతంత్ర రస ప్రతిపత్తిని పరిశీలిద్దాము.
భక్తిని శాంతరసంలో అంతర్భవింప చేయవచ్చునన్నది అభినవగుప్తుని అభిప్రాయం. అది సరికాదని జగన్నాథ పండిత రాయల అభిప్రాయం. ఆధునిక విమర్శకులైన డా. నగేంద్ర రాగానికి ప్రాచుర్యం ఉన్న సందర్భాలలో రతిలోను, నిర్వేదానికి ప్రాచుర్యం ఉన్న సందర్భాలలో శాంతం లోను భక్తి అంతర్భవిస్తుందని అభిప్రాయపడ్డారు. (రీతి కావ్య్ కీ భూమికా పుట 72).
కానీ అలంకార శాస్త్రం ప్రకారం శాంత శృంగారములకు విరోధమున్నది. రెండు విరుద్ధ రసాలతో భక్తికి సామ్యం చెప్పడంలో ఎంత సంబద్ధత ఉంది, సిద్ధాంతరీత్యా అది ఎలా పొసగుతుంది అన్నది ఒక ప్రశ్న. సంబద్ధత విషయమలా ఉంచితే ఈ రకమైన ప్రతిపాదన వలన ప్రయోజనమేమిటి అన్నది ఇంకా పెద్ద ప్రశ్న. ఎందుకంటే శాస్త్రంలో ఒక విషయం ప్రతిపాదించబడితే, అది కవి తన కావ్యాన్ని మెరుగుపరచుకోవడానికో, పాఠకుడు కవి నేర్పుని అర్థం చేసుకోవడానికో, కావ్యసౌందర్యాన్ని మరింత బాగా ఆస్వాదించడానికో ఉపయోగపడాలి.
రసములన్నీ చివరికి ఇచ్చేది ఒకే ఆనందానుభవం అయినపుడు, అసలు శృంగారాది రసముల విభజన ఎందుకు అవసరమయింది? దాని ప్రయోజనమేమిటి? అని ఆలోచిస్తే ఒక రసాన్ని నిర్వహించే పద్ధతికీ మరొక రసాన్ని నిర్వహించే పద్ధతికీ తేడా ఉంది కనుక అన్నది జవాబుగా కనిపిస్తుంది. ఒక రసం మిగిలినవాటి కంటే భిన్నమనో లేదా మరొక రసంలో అంతర్భవిస్తుందనో శాస్త్రం ఒక ప్రతిపాదన చేస్తే, ఆ ప్రతిపాదన ఒక కవి ఆ రసాలను మరింత బాగా నిర్వహించడానికి, ఒక కావ్యంలో రసనిర్వహణ ఎలా జరిగిందన్న విషయాన్ని ఒక విమర్శకుడు మరింత బాగా విశ్లేషించడానికి ఉపయోగపడాలి. భక్తి శాంతంలో కానీ శృంగారంలో కానీ అంతర్భవిస్తుందన్న ప్రతిపాదన వలన అటువంటి ప్రయోజనమేమీ సిద్ధించదు. మిత్ర రసాలుగా చెప్పుకునే శృంగారవీరాల వంటి వాటికి, జనక జన్య సంబంధం ఉందని చెప్పబడే వీరాద్భుతాల వంటి వాటికీ మధ్య ఉన్న భేదాన్ని కూడా స్పష్టంగా గుర్తించవలసి ఉండగా, రెండు విరుద్ధ రసాలను పక్క పక్కన పెట్టి వీటిలో ఏదో ఒక దానిలో భక్తి అంతర్భవిస్తుంది అని చెప్పడమే భక్తిని గురించిన ఆలోచన జరగవలసినంత శ్రద్ధగా జరగలేదనడానికి నిదర్శనంగా కనిపిస్తుంది.
నవరసగంగాధరంలో శృంగార శాంతరసాలకు సంబంధించిన వివరణలు ఈ క్రింది విధంగా ఉన్నాయి (పుట 101).
“శృంగారరసానికి స్త్రీపురుషులు ఆలంబన విభావములు. చంద్రిక, వసంతర్తువు, నానావిధోద్యానములు, పవనాంకురములు, రహఃస్థానము మొదలయినవి ఉద్దీపన విభావములు. ప్రియముఖావలోకనము, ప్రియా గుణశ్రవణము, కీర్తనము మొదలయినవిన్నీ, కంపనము మొదలయిన సాత్విక భావాలున్నూ అనుభావములు. స్మృతి చింత మొదలయినవి వ్యభిచారి భావాలు.”
“శాంతరసానికి అనిత్యముగా తెలియబడిన ఈ ప్రపంచము ఆలంబనము. వేదాంతశ్రవణము – తపోవనగమనము – తాపస దర్శనము మొదలయినవి ఉద్దీపనవిభావములు. ఆయా పదార్థములయందు అరుచి, శత్రుమిత్రాదులందు ఉదాసీనభావము, నిశ్చేష్టత్వము, నాసాగ్రదృష్టి మొదలయినవి అనుభావాలు. హర్షోన్మాదస్మృతిమత్యాదులు వ్యభిచారులు.”
విభావానుభావాలలో ఇంత వ్యత్యాసం ఉన్న ఈ రెండు రసాలలో ఏదో ఒకదానిలో భక్తి అంతర్భవిస్తుందని చెప్పడం సముచితంగా లేదు. అలా చెప్పడం వలన ఒనగూడే ప్రయోజనమూ కనిపించడం లేదు.
రాగానికి ప్రాచుర్యం ఉన్న సందర్భాలలో రతిలోను, నిర్వేదానికి ప్రాచుర్యం ఉన్న సందర్భాలలో శాంతంలోను భక్తి అంతర్భవిస్తుందన్న ఒక అభిప్రాయాన్ని పైన చెప్పుకున్నాం. కానీ సమస్య ఏమిటంటే భక్తిలో భగవంతుని పట్ల రాగమూ, ప్రపంచ విషయాలపైన నిర్వేదమూ ఏకకాలంలో ఉంటాయి. దానిని ఎలా నిర్వహించాలన్న విషయంలో ఈ ప్రతిపాదనలేవీ సహకరించక పోగా భక్తిరస పోషణ చేయాలనుకునే కవినీ, దానిని విశ్లేషించాలనుకునే విమర్శకుడినీ కూడా మరింత తికమక పెడతాయి.
లక్ష్మీకాంత శాస్త్రి గారు జైమిని భారతంలో వీరమును అంగిగాను భక్తిని ప్రధానాంగముగాను భావించారని తెలుగుకవులు-భక్తి అన్న అధ్యాయంలో ప్రస్తావించాను. భక్తి శాంతంలో అంతర్భవిస్తుందనేట్లయితే అది వీరానికి అంగం అయ్యే అవకాశం ఉండదు. జైమిని భారతంపై పరిశోధన చేసిన ముదిగొండ వీరేశలింగంగారు అందులోని కథలన్నీ భక్తివీరాన్ని జాటుచున్నాయి అన్నట్లుగా కూడా ఇంతకు ముందరి అధ్యాయంలో చూశాం. భక్తి శాంతంలో అంతర్భవిస్తుందనే మాటే నిజమయితే ‘భక్తివీరం’ అనడం కుదరదు. ఎందుకంటే వీరానికి శాంతాన్ని అంగంగా చేయడం, వీరాన్ని శాంతాన్ని కలిపి ‘శాంతవీరం’ అనడం ఆలంకారికుల అభిప్రాయాల ప్రకారం ఎంతమాత్రమూ పొసగదు. కానీ వీరమూ, భక్తీ పరస్పర పోషకాలుగా ఉన్న ఒక కావ్యం కనబడుతోంది. ఆ కావ్యంలో వీరాన్ని అంగిగా, భక్తిని అంగముగా నిర్ణయించిన విమర్శకులు, పరిశోధకులూ కూడా కనబడుతున్నారు. కాబట్టి భక్తి శాంతరసంలో అంతర్భవిస్తుందన్న మాట అంగీకారయోగ్యంగా లేదు.
5.1.5 రసవిఘ్నాలు
ఒక స్థాయిభావం రసంగా పరిణమించాలంటే ప్రతి సహృదయుడి చిత్తం నిర్విఘ్న దశలో దాన్ని ఆస్వాదించగలిగి ఉండాలి. ఈ నిర్విఘ్నదశను సాధించడం శృంగారాది రసముల కన్నా భక్తిరసంలో సులభంగా సాధ్యమౌతుంది.
భక్తికి స్థాయిభావమైన భగవద్రతి సామాన్య లౌకికరతి కాదు. రతి యొక్క ఉదాత్తరూపం. భగవద్రతికి ఆలంబనం అలౌకికం. ఇది భక్తిరసానికి ఉన్న ఒక ప్రత్యేకత. ఇక్కడ ఆలంబన విభావం అలౌకికమైనదవడం వలన ఇంద్రియాలను అధిగమించడం, రసానుభూతిని అందుకోవడం సులభమవుతుంది. మామూలుగా రసప్రక్రియలో, అంటే శృంగారాది రసాల విషయంలో విభావాలు లౌకికమైనవి కాబట్టి వాటి వర్ణన వలన పాఠకునికి లౌకికమైన వ్యక్తులు స్ఫురించే అవకాశం ఉంటుంది. అందువలన లౌకిక విషయాలను మరచి కావ్యంలో లీనమవడానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. కవి తన కల్పన ద్వారా ఆ ఆటంకాన్ని తొలగిస్తూ ఉండవలసి వస్తుంది. కాని భక్తిలో ఆలంబన విభావం యొక్క అలౌకికత్వం వలన అటువంటి విఘ్నబాధ ఉడదు. రససిద్ధి సులభమయిపోతుంది.
రసవిఘ్నాలకు లేదా రసభంగానికి ఆలంకారికులు చెప్పిన కారణాలను చూసినపుడు భక్తిరసంలో విఘ్నాలకు అవకాశం తక్కువేననిపిస్తుంది. విభావానుభావాల కష్టకల్పన అనేది ఆలంకారికులు రసవిఘ్నానికి కారణంగా చెప్పిన ఒక దోషం. రసానికి ఆధారం స్థాయిభావం. ఆ స్థాయిభావం ఉద్బుద్ధమవడానికి విభావాలు, అనుభావాలు కారణాలు. కాబట్టి విభావాలు, అనుభావాలు స్పష్టంగా లేకపోతే రసప్రతీతికి ఆటంకం ఏర్పడుతుంది. అదే కష్టకల్పన అనే దోషం. ఉదాహరణకు ఒక నాయకుడి వ్యాకులతను చెప్పినపుడు, వ్యాకులత అనే అనుభావం శృంగారానికి, కరుణం, భయానకం వంటి ఇతర రసాలకూ కూడా వర్తిస్తుంది కాబట్టి రసప్రతీతి కష్టం కావచ్చు. అలా కాకుండా ఉండేందుకే సంచారిభావాలను, అనుభావాలను స్పష్టంగా వర్ణించవలసి ఉంటుంది. కానీ భక్తిలో ఈ రకమైన దోషం ఏర్పడడానికి అవకాశం తక్కువ. భక్తిలో ఆలంబన విభావం మిగిలిన రసాల కన్నా ప్రత్యేకం అవడం వలన రసప్రతీతి కష్టం కాదు. అలౌకిక విభావం యొక్క ప్రవేశంతోనే అది భక్తిరసం అన్న విషయం స్పష్టమయిపోతుంది.
అలాగే వివక్షిత రసానికి ప్రతికూలమయిన విభావాదుల వర్ణన చేయడమన్నది రసభంగానికి మరొక కారణం. దీనిగురించి ఇంతకు మునుపే చర్చించబడింది. భక్తిని రసంగా పరిగణించి ఆలోచిస్తే, ఇతర రసములు ఏవీ దానికి ప్రతికూలం కావని అనిపిస్తున్నది. ఆలంకారికులు భగవద్రతిని శృంగార రసానికి స్థాయిభావమైన రతిలోను, భక్తిని (అంటే ఆ స్థాయిభావం పరిపుష్టమైనపుడు కలిగే రసాన్ని) శృంగార రసానికి విరుద్ధమైన శాంతంలోను అంతర్భవింప చేయడమే దీనికి ఒక నిదర్శనం.
ఈ విధంగా రసవిఘ్నాల దృష్ట్యా చూస్తే భక్తిరసం మిగిలిన రసాల కన్నా ప్రత్యేకమని అర్థమవుతుంది.
5.1.6 రసాభాస
రసాభాస కోణం నుండి కూడా భక్తిరసం ప్రత్యేకమా కాదా అన్న విషయాన్ని వివేచించవచ్చు. అలంకార శాస్త్రం ప్రకారం రసాభాసకు ముఖ్యంగా చెప్పిన కారణం అనౌచిత్యం. భక్తికి సంబంధించినంతవరకూ అసలు ఔచిత్యాన్ని ఒక ప్రత్యేక దృష్టితో చూడవలసి ఉంది. లౌకికమైన ధర్మాలను తర్కాలను అతిక్రమించడం భక్తిలో ఉచితమే అవుతుంది. అయితే అది అజ్ఞానంతో కూడిన అతిక్రమణ కాదు. పరిపూర్ణమైన జ్ఞానంతో కూడిన అతిక్రమణ. ధర్మమూ తర్కమూ తెలియక పోవడం కాదు, వాటిని మించిపోవడం. ఈ సూక్ష్మాన్ని అటు కవి గ్రహించకపోయినా ఇటు పాఠకుడు గ్రహించకపోయినా భక్తిరసం పండదు.
విశ్వనాథుడు గోపిక పరాంగన కాబట్టి గోపికా కృష్ణుల మధ్య ఉండే అనురాగం రసాభాసమని అనడం, జగన్నాథ పండితరాయలు జయదేవుని గీతగోవిందం వంటి వాటిలో భగవంతుని శృంగారాన్ని వర్ణించడాన్ని అనౌచిత్యంగా పరిగణించడం కనిపిస్తుంది.
జగన్నాథుడు మూడు చోట్ల మూడు విషయాలు చెప్పాడు. రససంఖ్య గురించి చెప్పేటపుడు భక్తిని శాంతంలో కాక శృంగారంలో అంతర్భవింప జేయడమే సబబు అన్నాడు. రసాభాస గురించి చెప్పేటపుడు భగవంతుని శృంగారాన్ని వర్ణించడం అనుచితం కనుక అది శృంగార రసాభాస అన్నాడు. శృంగార రసానికి లక్షణం చెప్పేటపుడు స్త్రీపురుషులు ఆలంబన విభావాలని అన్నాడు. ఈ మూడు విషయాలూ పొసగవు. భక్తిని శృంగారంలో అంతర్భవింపచేయాలనడమూ, గోపికలకు కృష్ణునికీ మధ్య ఉన్న సంబంధాన్ని వర్ణించడం శృంగార రసాభాస అనడమూ పొసగవు. అలా కాదు, భక్తిని శృంగారంలో అంతర్భవింపచేయాలన్నపుడు ఆయన గోపికలను కాక ప్రహ్లాదాదులను దృష్టిలో పెట్టుకున్నాడని అనడానికీ లేదు. ఎందుకంటే శృంగార రసానికి స్త్రీపురుషులనే ఆలంబన విభావాలుగా చెప్పాడు. కాబట్టి ఈ మూడింటినీ కలిపి అంగీకరించడం కుదరదు.
మరొక ఉదాహరణ చూద్దాము. శ్రీకాళహస్తిమాహాత్మ్యంలోని నత్కీరుని కథను గూర్చి నోరి నరసింహశాస్త్రిగారు “నత్కీరుని కథ ఔచిత్యము” అన్న వ్యాసం వ్రాశారు (సారస్వత వ్యాసములు 5 – పుట 484). అందులో వారు స్కాంద పురాణంలోని మూలకథకు, ధూర్జటి కావ్యంలోని కథకు ఉన్న తేడాలను వివరించి ధూర్జటి కథలో ఔచిత్యం లోపించినదంటారు.
మూలకథలో నత్కీరుడు అసూయాదురంధరుడనీ, శివుడు పంపిన పద్యంలో దోషం లేకపోయినా అసూయాపరుడై ఆక్షేపిస్తాడనీ, అక్కడ శివుని వాదన న్యాయసమ్మతంగా ఉంటుందనీ, ధూర్జటి కావ్యంలో అదంతా మారిపోయిందనీ వివరిస్తారు. తెలుగు కావ్యాన్ని గూర్చి “ఏమైనను నిజముగా కథాంశము లందులో నున్నవున్నట్లు నిర్భయముగా సూక్ష్మదృష్టితో పరిశీలించిన యెడల నత్కీరుడు చేసిన సాహిత్య విమర్శ సహేతుకమనియే తోచును” అంటారు. తెలుగు కావ్యంలో “సరిగ్గా కొందరు ఆధునిక కవులు తమ పద్యములను తామే పొగడుకొన్నట్టే” శివుడు కూడా తన పద్యాన్ని తనే పొగడుకున్నాడని చెప్పి, శివుడు “తాను చేసిన పని సమర్థించుకోలేక, అధికారము ప్రదర్శించు అధికారి వలెనే, నత్కీరునితో హేతువాదము చేయలేక తన మహత్త్వము చూపి బెదిరింప దలచెను” అంటారు. “నత్కీరుడు ప్రదర్శించిన ధైర్యము అసూయా దోషదూషితులు చేయగలిగినది కాదు. అందువలన తుదకు అతని నీశ్వరుడు శపించుట అన్యాయముగా తోచును. ఈ సందర్భములో ఔచిత్యము లోపించినదని కూడ తోపక తప్పదు” అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.
“శ్రీ కాళహస్తి మాహాత్మ్యము” అనే వ్యాసంలో విశ్వనాథ సత్యనారాయణగారు చేసిన విశ్లేషణ కూడా నత్కీరుడినే సమర్థిస్తుంది (కావ్యపరీమళము పుట 155). విశ్వనాథ నత్కీరుడు రసప్రధానమైన కవిత్వానికి ప్రతినిధి అయితే శివుడు వ్యక్తిగత కవిత్వానికి ప్రతినిధి అంటారు. “నత్కీరుడు పాండ్య రాజ ద్రవిడ భాషా పీఠ శంఖ ఫలక మహాసభ కధ్యక్షుడు. అతడు కవిత్వమునకు శాస్త” అని చెప్పి, అటువంటి వాడు ఒక వ్యక్తి యొక్క గొప్పదనానికో ఒక రాజు యొక్క అధికారానికో దాసుడై పోతే రసవత్కవితకే ద్రోహం చేసిన వాడవుతాడనీ, శివుడినైనా సరే ఎదిరించి తీరాలనీ, లేకుంటే సాహిత్యద్రోహం జరుగుతుందనీ అంటారు. అందుకే నత్కీరుడు నిర్భయంగా శివుడిని ఎదిరించాడంటారు. ఆపైన శివుడు శాపమివ్వడం, దాని నుండి బయటపడడం కోసం నత్కీరుడు కాళహస్తీశ్వరుని దర్శించుకోవడం గురించి చెప్పి, అప్పుడు కాళహస్తీశ్వరుడు నత్కీరునికి ప్రత్యక్షమవడాన్ని వర్ణించే పద్యాన్ని చూపుతారు. అందులో శివుడు నత్కీరుని “సాహిత్య శ్రీవర” అని సంబోధించడాన్ని చెప్పి, “అనగా శివుడు నత్కీరుని సాహిత్య సిద్ధాంతము నంగీకరించినాడని యర్థము. పట్టుదల చూపించినది శివుడు. నత్కీరుడు కాదు” అంటారు. ముక్తుడైన వాడికి ఉండే ప్రధాన లక్షణం భయం లేకపోవడమనీ, అది నత్కీరుడిలో శివుడిని ఎదిరించినపుడే కనబడిందనీ, అతడు అపుడే ముక్తుడనీ వివరిస్తారు.
నరసింహ శాస్త్రిగారి విశ్లేషణా, విశ్వనాథ వారి విశ్లేషణా కూడా భక్తిరసమును దృష్టిలో పెట్టుకుని చేసిన విశ్లేషణలు కావన్నది స్పష్టం. విశ్వనాథ భక్తిని రసంగా పరిగణించడాన్ని ఖండించారు. నరసింహశాస్త్రిగారు అంత సూటిగా భక్తి యొక్క రసప్రతిపత్తిని తిరస్కరించకపోయినా భక్తిని రసంగా పరిగణించినట్లు కూడా కనబడలేదు. ధూర్జటి కావ్యంలో అనౌచిత్యాలుగా ఆయన పేర్కొన్నవన్నీ నిజానికి భక్తిరస పోషకాలు. భక్తిని రసంగా పరిగణించేవారు ఆ కథలో ఏ విషయాలనయితే ఆస్వాదిస్తారో వాటన్నిటినీ శాస్త్రిగారు అనౌచిత్యాలన్నారు. ఇక విశ్వనాథ వారి విశ్లేషణ కూడా కవిహృదయాన్ని, కావ్యం యొక్క లక్ష్యాన్నీ పరిగణనలోకి తీసుకున్న సహృదయ విమర్శగా కనిపించడంలేదు. ఆలంకారికులు భక్తిని ప్రత్యేక రసంగా పరిగణించి, అన్ని రసాలకు గుర్తించినట్లుగా ఆ రసానికి కూడా రసాభాస లక్షణాలని ప్రత్యేకంగా గుర్తించి ఉన్నట్లయితే, ఈ కావ్యంపై వీరిద్దరి విశ్లేషణలూ మరొక విధంగా ఉండి ఉండేవని అనిపిస్తున్నది. ఈ పరిశీలన భక్తిని ప్రత్యేక రసంగా పరిగణించవలసిన అవసరాన్ని తెలియచేస్తున్నది.
(సశేషం)
శ్రీ వల్లీ రాధిక చక్కని కథా రచయిత్రి. లోతైన తాత్వికతకు నిత్య జీవితంలోని సంఘటనల ద్వారా సరళంగా ప్రదర్శిస్తారు. ‘తక్కువేమి మనకూ’, ‘స్వయం ప్రకాశం’, ‘హేలగా… ఆనంద డోలగా..’ వీరి పేరుపొందిన కథల సంపుటాలు.
