[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]
అధ్యాయం 5 – మొదటి భాగం
శాస్త్రాధారిత విశ్లేషణ
భక్తిరసంపై ప్రాచీనాలంకారికుల నుండి ఆధునిక కవులు, విమర్శకుల వరకూ పలువురు సాహితీవేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మునుపటి అధ్యాయాలలో పరిశీలించబడినాయి. ఇప్పుడు ఆ అవగాహన నేపథ్యంగా స్వయంగా విశ్లేషణకు పూనుకుంటున్నాను. భక్తిని రసంగా పరిగణించవచ్చునా లేదా అన్న విషయంపై నా వివేచన రెండు రకాలుగా సాగబోతున్నది.
మొదటిది శాస్త్రగ్రంథాలను ఆధారం చేసుకుని విశ్లేషించడం. అంటే రసస్వరూపం, రసనిర్ణాయకతత్త్వాలు మొదలైన వాటి గురించి ఉన్న విభిన్న నిర్వచనాలను, దృక్పథాలను, అవగాహనలను శాస్త్రగ్రంథాలలో పరిశీలించడం. ఇంతకు ముందరి అధ్యాయాలలో భక్తిరసం గురించీ, రససంఖ్య గురించీ ఆలంకారికులు, కవులు, విమర్శకులు సూటిగా వెల్లడించిన అభిప్రాయాలను పరిశీలించాను. ఆ అభిప్రాయాలలో ఉన్న లోటుపాట్లేమిటి, అవి ఇతరత్రా ప్రతిపాదించబడిన సిద్ధాంతాలతో, అభిప్రాయాలతో ఎంతవరకు పొసగుతున్నాయి, వాటిలో ఏవి అంగీకరయోగ్యాలు, ఏవి కావు అన్న విషయాలను ఈ అధ్యాయంలో చర్చిస్తాను. ఇక్కడ ‘ఇతరత్రా’ అన్న పదం రెండు అంశాలను సూచిస్తుంది. ఒకటి, ఒకరు చెప్పిన అభిప్రాయం వారే ఇతర సందర్భాలలో చెప్పిన అభిప్రాయాలతో, అంటే రససిద్ధాంతానికి సంబంధించి వారు చేసిన ఇతర వ్యాఖ్యలతో పొసగుతోందా లేదా అన్నది. రెండవది, ఒకరు చెప్పిన అభిప్రాయం ఇతర పండితులందరూ అంగీకరించిన అంశాలతో సరితూగుతున్నదా లేదా అన్నది. ఈ విషయాలన్నిటినీ అలంకార శాస్త్రగ్రంథాలను ఆధారం చేసుకుని ఈ అధ్యాయంలో (శాస్త్రాధారిత విశ్లేషణ) విశ్లేషిస్తాను.
అయితే అన్ని అభిప్రాయాలనూ, ప్రతిపాదనలనూ శాస్త్రగ్రంథాలను మాత్రమే ఆధారం చేసుకుని విశ్లేషించలేము. కొన్ని అభిప్రాయాలను కావ్యాలలో పరిశీలించవలసి ఉంటుంది. ముఖ్యంగా అభివ్యక్తిని గురించి, అంటే కావ్యంలో రసాన్ని నిర్వహించడం గురించి చేసిన ప్రతిపాదనలను కావ్యాలలోనే పరిశీలించి నిర్ధారించుకోవాలి. ఇది రెండవ విధమైన విశ్లేషణ. ఈ విశ్లేషణ, అంటే రసనిర్వహణకు కవులు వాడే సామాగ్రిని ఆధారం చేసుకుని సాగే వివేచన, ఆరవ అధ్యాయంలో (కావ్యాధారిత విశ్లేషణ) చేయబడుతుంది. అలాగే ప్రస్తుత అధ్యాయంలోని విశ్లేషణ ఆధారంగా వెలుగుచూసే క్రొత్త ప్రతిపాదనలేమయినా ఉంటే వాటిని కూడా తరువాతి అధ్యాయంలో కావ్యాలను ఆధారం చేసుకుని చేసే పరిశీలనలో నిర్ధారించుకోవచ్చు.
భక్తిరసాన్ని గురించి లోతైన చర్చ లోకి వెళ్ళబోయే ముందు భక్తి అని దేనిని అంటున్నామో స్పష్టంగా చెప్పుకోవాలి. భక్తి అనే పదాన్ని ఇంద్రాది దేవతలపై, గురువులపై, పెద్దలపై చూపే గౌరవం అన్న అర్థంలో కాక ఆద్యంత రహితుడైన పరమాత్మపై ఉండే అవ్యాజ ప్రేమగా అర్థం చేసుకోవాలి. అంటే నారద భక్తి సూత్రాలు నిర్వచించిన “సాత్వస్మిన్ పరమప్రేమరూపా” అన్న అర్థంలో తీసుకోవాలి. మధుసూదన సరస్వతి వంటివారు దానిని “హరిభక్తి” అన్నారు. అది హరి కావచ్చు, హరుడు కావచ్చు. హరికీ హరునికీ భేదం లేదు. నారద భక్తిసూత్రాలలో వ్రజగోపికలను అటువంటి భక్తికి ఉదాహరణగా చెప్పారు. ఆ సూత్రాలు, ఆ ఉదాహరణ కైవల్యప్రదాత అయిన పరమాత్మకు సంబంధించిన భక్తిని చెప్తున్నాయని అర్థం చేసుకోవాలి. భక్తిరసము అన్న చర్చలో మనం మాట్లాడుతున్నది అటువంటి “భక్తి” గురించి అని గుర్తు పెట్టుకోవాలి.
ఈ అధ్యాయంలో రసస్వరూపం, రసనిర్ణాయక తత్త్వాలు వంటి అంశాల ఆధారంగా భక్తిని ప్రత్యేక రసంగా పరిగణించవలసిన అవసరం ఉన్నదా లేదా అన్న విషయాన్ని చర్చిస్తాను. గ్రంథారంభంలో పేర్కొన్న ఊహాప్రతిపాదనను ఈ అంశాలను ఆధారం చేసుకుని పరిశీలిస్తాను.
5.1 శాస్త్రాంశాల పరిశీలన
5.1.1 రసస్వరూపం
భారతీయ అలంకార శాస్త్రంలో రసస్వరూపానికి సంబంధించి రెండు దృక్పథాలున్నాయి. అంటే రసానికి రెండు రకాల నిర్వచనాలున్నాయి. ఒకటి వస్తుపరమయినది. రెండవది ఆత్మపరమయినది.
మొదటి దృక్పథం ప్రకారం రసం అనేది “భావమూలకమయిన కావ్యసౌందర్యం”, అంటే “భావానికి కళాత్మకమయిన అభివ్యక్తి”; దాని నిష్పత్తి కావ్యంలో జరుగుతుంది. రెండవ దృక్పథం ప్రకారం రసం “భావమూలకమయిన కావ్య సౌందర్యపు అనుభూతి”; దాని నిష్పత్తి పాఠకుడి హృదయంలో జరుగుతుంది. మొదటి దృక్పథం ప్రకారం రసం విషయగతం, అంటే ఆస్వాద్యం. రెండవ దృక్పథం ప్రకారం రసం విషయిగతం, అంటే ఆస్వాదం. వీటిలో మొదటిదే మౌలికమైనది. భరతుడు, ధ్వనిపూర్వకాలానికి చెందిన ఆలంకారికులు మొదటి అర్థాన్నే (వస్తుపరమయిన స్వరూపాన్నే) చెప్పారు. కానీ తర్వాతి కాలంలో అభినవగుప్తుని పునరాఖ్యానం తర్వాత రెండవ అర్థం, అంటే అనుభూతి పరమయిన అర్థం ప్రధానంగా మారింది.
కాబట్టి భక్తిని ప్రత్యేక రసంగా పరిగణించాలా లేదా అన్న విషయాన్ని రసస్వరూపం ఆధారంగా, రసం అనే పదానికి ఉన్న నిర్వచనం ఆధారంగా చర్చించాలంటే, అభివ్యక్తి, అనుభూతి అనే ఈ రెండు దృక్కోణాల నుండీ పరిశీలించవలసి ఉంటుంది.
అభివ్యక్తికి సంబంధించిన పరిశీలన అంటే, భక్తి రసస్థాయిని అందుకోవడానికి కవి ఎటువంటి వ్యక్తీకరణ పద్ధతిని ఎంచుకుంటాడు, ఆ పద్ధతి శృంగారాది నవరసములను వ్యక్తీకరించే పద్ధతి కన్నా భిన్నంగా ఉంటుందా ఉండదా అన్న విషయాలను పరిశీలించడం. వాటిని కావ్యాధారంగానే పరిశీలించాలి కనుక ఆ పరిశీలన తరువాతి అధ్యాయంలో చేస్తాను.
“అనుభూతి” ఆధారంగా చూసినపుడు భక్తి మిగిలిన రసాల కంటే భిన్నమా కాదా అన్న విషయానికి వస్తే, అనుభూతి అనేది విషయిగతమైనది (subjective) కనుక అసలు దానిపై ఆధారపడి ప్రతిపాదనలు చేయడం సాధ్యమేనా అన్నది మొదట రాగల ప్రశ్న. అయితే సహృదయుల అనుభవాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రతిపాదనలు చేయడమనేది అలంకారశాస్త్రాలలో ఉంది. విశ్వనాథుడు కరుణరస కావ్యాలు కూడా ఆనందదాయకాలే అని చెప్పడానికి “కరుణాదావపి రసే జాయతే యత్పరం సుఖం సచేతసామనుభవ ప్రమాణం తత్ర కేవలం” అనడం (సాహిత్యదర్పణం తృతీయ పరిచ్ఛేదం), జగన్నాథ పండితరాయలు “సకల సహృదయ ప్రత్యక్షం”, “సహృదయ హృదయప్రమాణకః” వంటి పదములను వాడడం (రసగంగాధరం ప్రథమాననం) కనిపిస్తుంది.
“సహృదయుల అనుభూతి” అన్న నిర్వచనం ఆధారంగా భక్తి యొక్క రసత్వాన్ని నిర్ణయించాలంటే సహృదయుల అభిప్రాయాలను సేకరించి పరిశీలించాలి. ఇంతకు పూర్వపు అధ్యాయాలలో చేసినది అటువంటి పరిశీలనే. నాలుగు అధ్యాయాలలో విస్తృతంగా చేసిన ఆ పరిశీలనలో నిర్ధారణ అయిన ముఖ్యాంశాలను ఇక్కడ పేర్కొంటాను.
సంస్కృతాలంకారికులలో భక్తిని రసంగా ఒకరిద్దరు ప్రతిపాదించినప్పటికీ ఎక్కువమంది ఆలంకారికులు ఆ విషయాన్ని ఒప్పుకోలేదనేది సాధారణంగా వినబడుతూండే మాట. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే సంస్కృతాలంకారికులలో రససంఖ్య గురించి క్రొత్తగా వ్యాఖ్యానించినవారూ, క్రొత్తరసాలను ప్రతిపాదించిన వారూ చేసిన వివేచన అంతా భక్తిరసానికి అనుకూలంగానే ఉందని నా పరిశీలనలో అర్థమయింది.
రసానుకూల వర్గానికి చెందిన వారే కాదు, రసప్రతికూల వర్గంగా చెప్పబడే దండి, రుద్రటుడు వంటి వారు చెప్పిన అంశాలు కూడా భక్తిని రసంగా పరిగణించడానికి అనుకూలంగానే ఉన్నాయని పూర్వ అధ్యాయాలలో వివరించాను. భక్తిని గూర్చిన ప్రాథమికమయిన ఆలోచన దండి నుంచే, అనగా కావ్య శాస్త్రారంభం నుంచే ఆరంభమయిందన్న సంపత్కుమార మాటలని ఇంతకు ముందరి అధ్యాయంలో పేర్కొన్నాను.
సంప్రదాయాన్ననుసరించి భక్తిని రసంగా పేర్కొనని జగన్నాథుని వంటి వారు సైతం అనుభూతిపరంగా దాని ప్రత్యేకతను గుర్తించారన్న విషయం కూడా పూర్వ అధ్యాయాలలో ప్రస్తావించబడింది. “జగన్నాథుడు భరత-అభినవగుప్తుల మీద గౌరవంతో భక్తిని రసంగా నిరాకరించాడు గాని ఆయన ఆలోచనలో, వివేచనలో ఏమూలో భక్తి రసమేనన్న భావన దోబూచులాడుతున్నట్లు కనబడుతుంది. ఇందుకు ఆయన భక్తి విషయంగా చేసిన వివేచన, నిరాకరణలే సాక్ష్యం” అన్న సంపత్కుమార గారి మాటలను ఇక్కడ మరొకసారి గుర్తుచేసుకోవాలి.
అలాగే శాంతరస సమర్థనలో ఉదాహరించే భరతుని వ్యాఖ్యలు శాంతం కన్నా భక్తికి ఎక్కువ అనుకూలమన్న విషయాన్ని కూడా మొదటి అధ్యాయంలో వివరించాను.
ఇక తెలుగు సాహిత్యం విషయానికి వస్తే ఈ అనుకూలత మరింతగా కనిపిస్తుంది. నిజానికి సంస్కృతసాహిత్యం సంగతి ఎలా ఉన్నా భారతీయ భాషలలో వచ్చిన సాహిత్యాన్ని బట్టి అయితే భక్తికి రసస్థాయి ఇవ్వవలసినదేనన్న అభిప్రాయాన్ని రససిద్ధాంతాన్ని లోతుగా పరిశీలించిన విమర్శకులు వ్యక్తపరిచారు. ఈ విషయాన్ని కూడా గ్రంథారంభంలో వివరించాను.
అలాగే ఇంతకు ముందరి అధ్యాయాలలో పరిశీలించిన అభిప్రాయాల ప్రకారం తెలుగు సాహితీవేత్తలలో అధికులు భక్తికి రసపరిణతిని అందుకోగల శక్తి ఉన్నట్లుగానే భావించినట్లు అర్థమవుతుంది. రససంఖ్యను పేర్కొనేటపుడు నవరసాలు అని వ్యాఖ్యానించిన వారు కూడా భక్తి గురించి మాట్లాడిన సందర్భాలలో భక్తిరసం అని పేర్కొనడం పలుసందర్భాలలో కనిపించింది. ఈ పరిశీలన కోసం తెలుగుసాహిత్యంలో రససిద్ధాంతాన్ని గురించి మాట్లాడిన ప్రసిద్ధ విమర్శకులందరి అభిప్రాయాలనూ సేకరించాను. వారిలో ఎనభై శాతం వరకూ భక్తి రసాన్ని స్పష్టంగా సమర్థించారు. మిగిలినవారిలో కూడా భక్తిని రసంగా పరిగణించలేమని సూటిగా చెప్పినవారు ఒకరిద్దరే.
కాబట్టి రసస్వరూపానికి ఉన్న ఒక దృక్కోణం ప్రకారం, అంటే “రసం ఆస్వాదం” అన్న నిర్వచనం ప్రకారం పరిశీలిస్తే తెలుగుసాహిత్యానికి సంబంధించినంతవరకూ భక్తిని రసంగానే పరిగణించవలసి ఉందని అర్థమవుతుంది. రెండవ దృక్కోణం (రసం ఆస్వాద్యం) ప్రకారం భక్తిని ఎలా పరిగణించాలన్న విషయాన్ని ఆరవ అధ్యాయంలో చర్చిస్తాను.
5.1.2 రసనిర్ణాయక తత్త్వాలు
రసస్వరూపం గురించి భారతీయాలంకారికులలో రెండు దృక్పథాలున్నాయని పై విభాగంలో చెప్పుకున్నాం. మొదటి దృక్పథం ప్రకారం రసనిష్పత్తి కావ్యంలో జరుగుతుంది. కావ్యం జీవితాన్ని అనుసరించే నడుస్తుంది. జీవితంలో కనిపించే వివిధ భావాలే కావ్యంలో ప్రతిబింబిస్తాయి. అయితే జీవితానికి సంబంధించిన భావమూలక స్థితులు అసంఖ్యాకాలయినా అవి ప్రధానంగా ఎనిమిది లేక తొమ్మిది స్థాయిభావాలలో అంతర్భవిస్తాయనీ, కాబట్టి రసములను ఎనిమిది లేక తొమ్మిదిగా వర్గీకరించవచ్చుననీ ఆలంకారికులు అన్నారు. రెండవ దృక్పథం ప్రకారం రసం ఆత్మాస్వాదమయినది. రసనిష్పత్తి పాఠకుడి హృదయంలో జరుగుతుంది. అయితే ఇది కూడా స్థాయిభావాల ఆధారంగానే జరుగుతుంది. కనుక ఏ దృక్పథం ప్రకారం చూసినా స్థాయిభావాన్ని గురించిన చర్చ ప్రధానం. అంటే భక్తిని రసంగా పరిగణించాలా లేదా అన్న విషయం ‘భక్తికి సంబంధించిన భావం స్థాయిభావము అవుతుందా లేదా’ అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది.
అయితే ఒక భావం స్థాయిభావం అవుతుందా లేదా అన్న విషయాన్ని ఎలా నిర్ణయిస్తాం? దానికి అభినవగుప్తాది పూర్వాలంకారికులు చెప్పిన తత్త్వాలు నాలుగు ప్రధానంగా ఉన్నాయి – 1)స్థాయిత్వం, 2)ప్రబలత్వం, 3)పురుషార్థోపయోగిత్వం, 4)సాధారణీకృతం కావడానికి సామర్థ్యం. వాటికి ఆధునికరసవాదులు అంటే డా. వాట్వె వంటి వారు చెప్పిన “మౌలికత్వం”, “ఉదాత్తత్వం” అనే మరొక రెండు తత్త్వాలను కూడా కలుపుకుంటే, మొత్తం ఆరు తత్త్వాలు అవుతాయి. వీటినే రస నిర్ణాయక తత్త్వాలు అన్నారు.
1) స్థాయిత్వం : ఇతర భావాల దృష్ట్యా స్థిరంగా ఉండే ప్రభావం
ఈ లక్షణం నిజానికి అంత కచ్చితంగా గీత గీసి చెప్పగలిగినది కాదు. పాఠకుని అనుభవానికి సంబంధించి ఏవి స్థిరమయిన భావాలు, ఏవి కాదు అన్న విషయంలో అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉంది. ఈ లక్షణాన్ని ఆధారం చేసుకుని రత్యాదులను స్థాయిభావాలుగాను, అసూయాదులను సంచారిభావాలుగాను చెప్పడాన్ని రాకేశ్ గుప్తా వంటి ఆధునికులు అంగీకరించలేదు. అటువంటి అభ్యంతరాలను గురించి, ఆ అభ్యంతరాల నేపథ్యంలో భక్తిని ఎలా చూడాలన్న విషయాన్ని గురించీ ఈ అధ్యాయంలోనే తరువాత చర్చిస్తాను. ప్రస్తుతానికి ఆ అభ్యంతరాలను పక్కన పెట్టి రత్యాదులను స్థాయిభావాలుగా నిర్ణయించడానికి ఆధారాలుగా, నిర్ణాయక తత్త్వాలుగా చెప్పబడిన ఈ లక్షణాలు భక్తికి వర్తిస్తాయా లేదా అన్న విషయాన్ని పరిశీలిద్దాము.
మరొక విషయమేమిటంటే, స్థాయిభావాలుగా చెప్పబడుతున్న రతి, ఉత్సాహం వంటి భావాలకు స్థాయిత్వం ఉందనీ, అవి సంచారిభావాలుగా చెప్పబడే గ్లాని, అమర్ష వంటి వాటికంటే స్థిరమయినవనీ స్థూలంగా ఒప్పుకున్నప్పటికీ, ఒక్కొక్కసారి స్థాయిభావాలు కూడా సంచారిభావాలు కావచ్చునన్న విషయాన్ని కూడా ఆలంకారికులు చెప్పారు. నాట్యశాస్త్రంలోని సప్తమాధ్యాయంలో భరతుడు రతికి సంచారిభావాలను నిర్దేశిస్తూ చెప్పిన శ్లోకాలలో ఆలస్యము, ఉగ్రము, జుగుప్సా తప్ప మిగిలినవి (46 భావాలు) శృంగారానికి పోషకాలు అవుతాయని చెప్పాడు. ఆ నలభై ఆరు భావాలలో హాసము, శోకము కూడా ఉన్నాయి. ఈ విధంగా భరతుడు హాసము, శోకము వంటి స్థాయిభావాలను శృంగారానికి సంచారిభావాలుగా పేర్కొనడాన్ని బట్టి, స్థాయిభావము ఒక్కొకసారి సంచారి కావచ్చునన్నది భరతుని అభిప్రాయంగా ఆలంకారికులు చెప్తారు. అంటే సాధారణంగా రత్యాదులు మిగిలిన భావాల కంటే స్థిరమయినవని అనుకున్నప్పటికీ కావ్యంలో కవి ఆయా భావాలను నిర్వహించిన తీరుని బట్టి ఒక భావం మరొక భావం కన్నా స్థిరంగా నిలబడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో భగవద్రతిని పరిశీలించినపుడు దానికి ఇతర భావాల దృష్ట్యా స్థిరంగా ఉండే లక్షణం ఉందనే చెప్పుకోవాలి. నిజానికి ఉత్సాహం విస్మయం వంటి ఇతర భావాలు భగవద్రతికి పోషకాలు అయ్యే అవకాశం ఉంది కానీ భగవద్రతి ఇతర భావాలకు పోషకం అయ్యే అవకాశం లేదు. భక్తిని రసంగా పరిగణించని విశ్వనాథ సత్యనారాయణ గారు సైతం ఈ విషయాన్ని ఒప్పుకోవడం మనకు కనిపిస్తుంది. భక్తి కనక ఒక సన్నివేశంలో ప్రవేశిస్తే అదే మిగిలిన భావాల కంటే ప్రధానమవుతుందని వారు కూడా అన్నారు. కొన్ని ఇతర కారణాల దృష్ట్యా విశ్వనాథ భక్తిని రసంగా ఒప్పుకోరు. అయితే వారు కూడా ఈ స్థాయిత్వం అన్న లక్షణం మాత్రం భక్తికి ఉందని అంగీకరించారు. భక్తి రసం కాదని అంటూనే ఒకవేళ అది రసం అయితే మాత్రం అదే ప్రధానమవుతుందని వారు అంటారు.
“భక్తి యెప్పుడును దక్కిన రసములను విరచును. ఒకవేళ నది రసమయినచో దానిని గూర్చి ప్రస్తావించినంతనే యది రాజయి కూర్చుండి ప్రధానరసమును సేవకుని జేయును. భక్తి యెప్పుడు నంగము కాదు. అది యంగిగా భాసించును.” (ప్రసన్న కథా కలితార్థయుక్తి పుట 150-151).
2) ప్రబలత్వం : రంజనాధిక్యం లేదా ఉత్కటంగా ఆస్వాదమానత్వం
భక్తిరసం యొక్క ఆస్వాదమానత్వం గురించి “రసస్వరూపం” అన్న విభాగంలో చర్చించాను. పోతన పద్యాలను, త్యాగయ్య కీర్తనలను భక్తులే కాక సహృదయులందరూ ఆస్వాదిస్తారు. ఇంతకు ముందరి అధ్యాయాలలో చేసిన పరిశీలనను బట్టి భక్తి యొక్క ఆస్వాదమానత్వాన్ని సాహితీవేత్తలలో అధికులు అంగీకరించారని గమనించాము.
భక్తిరస సమర్థకులే కాదు, భక్తిని ప్రత్యేక రసంగా అంగీకరించని వారు కూడా భక్తి యొక్క రంజనాధిక్యతను, ఆస్వాదమానత్వాన్ని నిరాకరించలేదని గమనించాము.
3) పురుషార్థోపయోగిత్వం : జీవితంలోని పరమ పురుషార్థాల పట్ల ఉపయోగిత్వం
ఇది భక్తికి ఉన్నదన్నది స్పష్టమే. భక్తి నాల్గవ పురుషార్థమైన మోక్షాన్ని ఇస్తుందనడానికి “మోక్షకారణసామగ్య్రాం భక్తిరేవ గరీయసీ” అన్న శంకరాచార్యుల మాటలు ప్రమాణం.
అంతేకాదు, కృష్ణ భక్తులు మోక్షాన్ని కూడా ధిక్కరిస్తారనీ ఎందుకంటే వారు మోక్షానందాన్ని మించిన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారనీ భక్తిగ్రంథాలు చెప్తాయి. శ్రీచైతన్య మహాప్రభువులు భక్తిని పంచమ పురుషార్థంగా చెప్పారు. ‘ధర్మ, అర్థ, కామ, మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. కానీ, ‘కృష్ణ ప్రేమ’ అనే పంచమ పురుషార్థం ముందు ఇవన్నీ తృణప్రాయాలే’- (శ్రీచైతన్య చరితామృతం: ఆది లీల- 7.84).
4) సాధారణీకృతం కావడానికి సామర్థ్యం : సార్వజనీన స్వీకృతి
భక్తి సర్వజనులచే స్వీకరించబడే భావం కాదనీ, భక్తికావ్యాన్ని భక్తులు మాత్రమే ఆస్వాదించగలరనీ కొందరు విమర్శకులు అభిప్రాయ పడటం పూర్వాధ్యాయాలలో గమనించాము. ‘భగవంతునిపై నమ్మకం లేనివారు భక్తి కావ్యాన్ని ఎలా ఆస్వాదించగలరు?’ అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకునేముందు కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి.
రసాస్వాదనకు కేవలం సహృదయుడి భావుకత మాత్రమే ప్రమాణం కాదు, కవి భావుకతకు కూడా అంతే విలువ ఉంది. ఎందుకంటే, ఎప్పుడయినా కేవలం ఒక కథను చెప్పడం కోసం మాత్రమే కవి కావ్యాన్ని రచించడు. ఆ కావ్యం ఆధారంగా తన అనుభూతిని అభివ్యక్తం చేయడం కవి యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. లేకపోతే ఇతరులు చెప్పిన కథనే కవులు మళ్ళీ మళ్ళీ రాయడం జరగదు. ఒకే పాత్ర ఒక కవి రచనలో చారిత్రక వ్యక్తిగా, మరొక కవి రచనలో అవతారపురుషుడిగా, ఇంకొక కవి రచనలో ఒక ప్రజానాయకుడిగా చిత్రీకరించబడవచ్చు. మూడు కావ్యాలూ పాఠకులకు రసానందాన్ని కలిగించవచ్చు. ఇది సాహిత్య రంగంలో తరచుగా గమనిస్తూ ఉండే విషయమే. అంటే ఒక కావ్యాన్ని ఆస్వాదించడానికి ఆ కావ్యంలోని పాత్ర యొక్క చారిత్రక అస్తిత్వం కన్నా, వ్యక్తిత్వం కన్నా, ఆ పాత్రను పాఠకుడి అంతరంగం మీద కవి ఎలా ముద్రిస్తున్నాడన్నది ముఖ్యం. ఇది ఏ రసానికి సంబంధించిన కావ్యానికయినా వర్తించే విషయమే.
అలాగే భక్తి కావ్యాన్ని ఆస్వాదించడానికి కావలసినది, కావ్యంలో వర్ణించబడే దేవుని మీద నమ్మకం కాదు, కావ్యంలో కవి వ్యక్తం చేయాలనుకున్న భావం మీద నమ్మకం. కవి రామభక్తిలోని ఆనందాన్ని తన కావ్యం ద్వారా వ్యక్తపరిస్తే దానిని ఆస్వాదించడానికి సహృదయుడికి కావలసినది రాముడిపై నమ్మకమూ రాముడిపై గౌరవమూ కాదు. కవికి రాముడిపై ఉన్న భక్తిపై నమ్మకమూ గౌరవమూ. అదే అలంకారశాస్త్రం ప్రకారం “సహృదయత” అన్న పదానికి చెప్పబడిన లక్షణం.
ఒక పాఠకుడికి రాముడిపై విశ్వాసం లేకపోవచ్చు. కానీ సమాజంలో కొందరికి రాముడి మీద భక్తి ఉందన్న విషయాన్నీ, ఆ భక్తి వారికి ఆనందాన్ని కలిగిస్తోందన్న విషయాన్నీ అతను గమనిస్తూనే ఉంటాడు. నాస్తికుడయిన పాఠకుడు కూడా భక్తి కావ్యాన్ని ఆస్వాదించడానికి కారణం ఆ అవగాహనే.
అలా ఆస్వాదించే సహృదయ పాఠకులు సమాజంలో కనబడతారు. నాస్తికులయినప్పటికీ భాగవతంతో రసానందాన్ని పొందుతామని చెప్పే పాఠకులు ఉన్నారు. సమకాలీనులలో నాస్తికులయిన సాహితీప్రియులు కొందరితో చర్చించడం ద్వారా ఈ విషయాన్ని నేను ధృఢపరచుకున్నాను. ప్రసిద్ధ కవి, విమర్శకులు కొప్పర్తి వెంకటరమణమూర్తిగారితో జరిపిన అటువంటి ఒక సంభాషణను అనుబంధం -2 లో పొందుపరిచాను.
కాబట్టి “భక్తి సార్వజనీనం కాదు, అది కొందరికి మాత్రమే వర్తించే విషయం” అని చెప్పడం సిద్ధాంతపరంగా కుదరదు. ఇక్కడ మరొక విషయం ఉంది. నిజానికి ఈ సమస్య – కొందరు పాఠకులకు ఒకానొక రసం పట్ల విముఖత ఉండడం అనే సమస్య – ఒక్క భక్తిరసానికి మాత్రమే ప్రత్యేకమయినది కాదు. ఇది అన్నిరసాలకూ వర్తించే సమస్యే. అసలు శృంగారాదిరసములలో ఏ రసానికీ స్పందించని అరసికులయిన పాఠకులు కూడా ఉంటారు. అలాగే జీవితంలో ఆవిధమైన ఆసక్తులను కనబరచనప్పటికీ కావ్యంలో ఆయా రసాలను ఆస్వాదించే వారూ ఉంటారు. అందరికీ ఉండదు కదా అనే ప్రశ్న భగవద్రతి విషయంలోనే కాదు మిగిలిన స్థాయిభావాల విషయంలోనూ వస్తుంది.
విశ్వనాథ సత్యనారాయణగారు కూడా ఒక సందర్భంలో “స్థాయిభావములనగా మన హృదయములలో నిత్యము నుండునట్టివి. స్థావరమేర్పరచుకొన్నట్టివి” (కావ్యానందము పుట 133) అని చెప్పి, “అందరికిని క్రోధముండదు గదా యనవచ్చును. అందరికిని శృంగారము మాత్రమున్నదేమి?” అని ప్రశ్నించి లోకంలో శృంగార రసం పట్టనివారు కూడా ఉన్నారని వివరిస్తారు.
కాబట్టి భక్తిరసాస్వాదనకు కావలసినది ‘జీవితంలో భక్తి కలిగి ఉండడం’ కాదనీ, ‘కావ్యపఠనంలో సహృదయత కలిగి ఉండడం’ అనీ అర్థం చేసుకుంటే, సాధారణీకృతం కావడానికి భక్తికి గల సామర్థ్యం విషయంలో సందేహం రాదు. ఆ అవగాహనతో పరిశీలించినపుడు సాహితీలోకంలో భక్తి యొక్క సార్వజనీన స్వీకృతి స్పష్టంగా కనబడుతుంది.
5) మౌలికత్వం : మానవునిలోని ఏదో ఒక మూలప్రవృత్తితో ప్రత్యక్ష సంబంధం
భక్తికీ వేదాంతానికీ సంబంధించిన గ్రంథాలు “భగవద్రతి” కూడా మానవుని చిత్తంలో వాసనా రూపంలో ఉంటుందని చెప్తాయి. వాటి ప్రకారం ఆత్మకు పరమాత్మతో నిత్యసంబంధం ఉంది. ప్రాపంచిక రాగద్వేషాల కారణంగా ఆ సంబంధం మరుగున పడినప్పటికీ, మానవచేతనలో అది స్థాయి రూపంలో ఉంటుంది. సిద్ధాంత శిఖామణిలో రేణుకాచార్యులు అగస్త్యునికి చేసిన ఉపదేశం ప్రకారం చంద్రకాంతశిలలో నీరు, సూర్యకాంతశిలలో నిప్పు, విత్తు నందు మొలక ఎంత సహజ సిద్ధంగా ఉంటాయో, జీవుడికి ఈశ్వరుని తోడి సంబంధం కూడా అంత సహజసిద్దంగా ఉంటుంది (5-34).
శంకరాచార్యులు కూడా “స్వస్వరూపానుసన్ధానం భక్తిరిత్యభిధీయతే” అంటారు. స్వస్వరూపానుసన్ధానం అనేది కొందరికి మాత్రమే వర్తించేది కాదు. కాబట్టి భక్తి అనేది అందరిలోనూ ఉండే సహజలక్షణం. “ఊడుగు చెట్టు నుండి రాలిన విత్తనాలు ఆ చెట్టునే చేరినట్లు, సూది సూదంటు రాయినీ, పతివ్రత తన పతినీ, లత తరువునీ, నది సముద్రాన్నీ చేరినట్లు, చిత్తవృత్తి శివుడి పాదపద్మ ద్వయాన్ని ఎల్లప్పుడూ చేరి యుండే స్థితినే ‘భక్తి’ అంటారు” అని శంకరులు వివరించారు (శివానందలహరి శ్లో. 61).
నది ప్రవహిస్తున్నట్లు కనబడక పోవచ్చు, నిలకడగా ఉన్నట్లే తోచవచ్చు కానీ అది సముద్రం వైపు ప్రవహిస్తూనే ఉంటుంది. సముద్రం వైపు ప్రవహించడం నదికి సహజ లక్షణం. ఆ విధంగానే బయటకి కనిపించినా కనిపించకపోయినా, భక్తి అనేది జీవులందరిలోనూ ఉండే మౌలిక లక్షణమని భక్తిని గురించిన నిర్వచనాలు, వివరణలు తెలియచేస్తాయి.
అయితే ఇటువంటి వేదాంతపరమైన వివరణల ఆధారంగానే కాక, ఆధునిక మానసిక శాస్త్ర సిద్ధాంతాలను ఆధారం చేసుకుని కూడా భక్తి యొక్క మౌలికత్వాన్ని పరిశీలించిన వాట్వే వంటి పరిశీలకులు ఉన్నారు. అనుబంధం-1 లో ఆ వివరాలను చూడవచ్చు. ప్రతివ్యక్తిలోను తనకన్నా గొప్పదైన విషయం పట్ల గౌరవం, బలవత్తరమైన దాని ఆశ్రయం పొందాలన్న కోరిక, గూఢమైన విషయాలను గూర్చిన జిజ్ఞాస, ఉదాత్తమైన విషయంపై ఆకర్షణ వంటి భావాలు జన్మతః ఉంటాయి. ఆ భావాలన్నిటి సమ్మిశ్రణమే భక్తి. కాబట్టి భక్తిని సాధిత (derived) భావంగా పరిగణించలేమని, భక్తి సమ్మిశ్రిత భావం కనుక దానిని స్థాయిభావంగానే పరిగణించాలని వారు వివరించారు.
ఈ విధంగా అటు వేదాంతపరమైన నిర్వచనాలు, ఇటు ఆధునిక మానసిక శాస్త్ర సిద్ధాంతాలు, రెండింటి ప్రకారమూ కూడా భగవద్రతి యొక్క మౌలికత్వం సమర్థించబడుతోంది.
6) ఉదాత్తత్వం : పరిష్కృతమయిన అనుభూతి
భగవద్రతిలో ఆలంబన విభావం అలౌకికం కనుక అది సామాన్య లౌకిక రతి కాకుండా, రతి యొక్క ఉదాత్త రూపమవుతుందన్నది స్పష్టం. భక్తిని రసంగా అంగీకరించనివారికి కూడా ఈ ఉదాత్తత అన్న లక్షణం పట్ల, అంటే భగవద్రతి ఉదాత్తమయినది అన్న విషయం పట్ల సందేహం లేదు.
ఈ విధంగా రసనిర్ణాయక తత్త్వాలుగా చెప్పబడిన ఈ ఆరులక్షణాల ఆధారంగా పరీక్షించినపుడు భక్తికి రసత్వాన్ని అంగీకరించవచ్చునని స్పష్టమవుతుంది.
(సశేషం)
శ్రీ వల్లీ రాధిక చక్కని కథా రచయిత్రి. లోతైన తాత్వికతకు నిత్య జీవితంలోని సంఘటనల ద్వారా సరళంగా ప్రదర్శిస్తారు. ‘తక్కువేమి మనకూ’, ‘స్వయం ప్రకాశం’, ‘హేలగా… ఆనంద డోలగా..’ వీరి పేరుపొందిన కథల సంపుటాలు.