Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-14

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 4 – నాల్గవ భాగం

4.1.25 కంకంటి పాపరాజు

18వ శతాబ్ధికి చెందిన పాపరాజుగారి ఉత్తరరామాయణము ప్రసిద్ధి పొందిన రచన. ఈ కవి కృష్ణ భక్తులు. “చారుకవిత్వము నేర్చి జానకీజాని కథల్ రచింపక యసత్కథ లెన్ని రచించెనేనియున్ వాని వివేకమేమిటికి వాని కవిత్వ మహత్త్వ మేటికిన్” అన్న అభిప్రాయం ఉన్నవారు. కృష్ణుడు ఆయన కలలో కనబడి తనకు అంకితముగా వ్రాయమని అడిగితే వ్రాసిన కావ్యమిది.

రావణునికి సంబంధించిన విషయాలతో నడిచే ఈ ఉత్తర రామాయణ కథలో భక్తిరస పోషణకు అనుకూలమైన ఘట్టాలు ఎక్కువగా లేక పోయినా, కొన్ని పద్యాలు కవి దృష్టిలో భక్తికి సంచారిభావాన్ని మించిన స్థాయి ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ఉదాహరణగా హనుమ నోటి నుండి వినబడే రెండు పద్యాలు పేర్కొంటున్నాను.

క.
శ్రీరామ నీకథామృత,
ధారలు కర్ణాంజలులను ద్రావెడిధన్యుల్
కోరుదురే యమరత్వము,
తారుదురే జన్మ మరణ దారుణరుజలన్ (5-301)

సీ.
కౌసలేయ త్వదీయకథ లూఁకొనిన వాసరంబు కల్మషధూసరంబు గాదె
తాటకాంతక నిన్ను ధ్యానంబు సేయని క్షణము నివారితక్షణము గాదె
జానకీరమణ నీస్మరణం బొనర్పని ఘటిక విషాపూర్ణఘటిక గాదె
సాకేతనిలయ యుష్మత్పూజ సలుపని జాము మృత్యువు నిల్చు గీము గాదె

తే.
శ్రీరఘూత్తమ నిన్ను దర్శింపకురక,
నడచు కాలంబు గాలంబు కరణి గాదె
రామ యటుకాన నిన్ను నారతము వినుట,
దలచుట స్మాదృశుల కుచితంబ కాదె (5-302)

“ఉత్తర రామాయణం కావ్యశిల్పం” అనే గ్రంథంలో తిక్కన రచనను, పాపరాజు గారి రచననూ పోల్చి చూసిన గడియారం వేంకటశేష శాస్త్రి గారు తిక్కన శ్రీరాముడిని ఒక మానవుడిలా రాజులా చిత్రిస్తే పాపరాజు గారు భగవంతుడిలా నారాయణుడిలా చూపడానికి ప్రయత్నించారనీ అందుకు వారి భక్తి కారణమనీ అంటారు.

ఈ విధంగా నన్నయతో ప్రారంభించి 18వ శతాబ్ధం వరకూ ఉన్న ప్రసిద్ధకవుల కావ్యాలలో భక్తి ఎలా పరిగణించబడింది, పోషించబడింది అన్న విషయాలను అవకాశమున్నంతవరకు పరిశీలించాను. భక్తి విషయంలో కవి అభిప్రాయాన్ని అర్థం చేసుకునేందుకు కొంతవరకైనా దోహదం చేసిన కావ్యాల గురించీ, కవుల గురించీ ఈ అధ్యాయంలో తెలియచేశాను. అలా దోహదపడని కావ్యాలను, అంటే ఒక విశ్లేషణకు పరిశీలనకు అవకాశం ఇచ్చేంతగా భక్తి పోషింపడని కావ్యాలను, వాటిని రచించిన కవులను పేర్కొనలేదు.

ఉదాహరణకు కావ్యయుగంలోని మరికొన్ని కావ్యాలను పరిశీలించినపుడు, కొలని గణపతి దేవుడు రచించిన శివయోగసారము, గౌరన రచించిన నవనాథ చరిత్రలలో భక్తి ప్రసక్తి ఉన్నప్పటికీ వాటిలో ప్రధానంగా అరిషడ్వర్గాలను జయించడం గురించి యోగసాధన గురించి చెప్పబడింది. గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం, కొరవిగోపరాజు సింహాసనద్వాత్రింసిక, జక్కన విక్రమార్కచరిత్రము, తాళ్ళపాక తిమ్మక్క రచించిన సుభద్రాకళ్యాణము – వీటన్నిటిలో అక్కడక్కడా కాశీ వంటి క్షేత్రాల మహిమను చెప్పడం, కావ్యంలోని పాత్రలు తాము దర్శించిన దేవతలను స్తుతించడం వంటివి ఉన్నా అవి భక్తి పట్ల ఆయా కవుల అభిప్రాయాన్ని తెలుసుకోగలిగేంత విశేషంగా లేవు. ప్రబంధయుగంలోని కవులలో రామరాజభూషణుడు భక్తికి ప్రాధాన్యం ఇచ్చినట్లు కనపడలేదు.

17వ శతాబ్ధంలో పురాణ కథలను ఆధారం చేసుకుని రచించిన విజయవిలాసం, తపతీ సంవరణోపాఖ్యానం వంటి కావ్యాలు శృంగారరసప్రధానాలుగానే నడిచాయి. భక్తి ప్రధానంగా కాకపోయినా పోషకముగా కూడా కనబడలేదు. ఈ శతాబ్ధానికి చెందిన సారంగు తమ్మయ తన వైజయంతీవిలాసము కావ్యాన్ని శ్రీరామచంద్రుడు తనకు కలలో కనబడి అడిగితే వ్రాసిన కావ్యంగా చెప్పాడు. ఒక భక్తుని విశిష్టతను తెలిపే కథావస్తువునే ఈ కవి ఎంచుకున్నాడు కనుక భక్తికి అతడు ఇచ్చిన ప్రాధాన్యం తెలుస్తోంది కానీ పాఠకులను భక్తిపరవశులను చేసేంత విశిష్టంగా ఈ కావ్యంలో భక్తి పోషింపబడినట్లు కనిపించదు.

నిజానికి దక్షిణాంధ్ర యుగ సాహిత్యంలో శృంగారరస ప్రధానమైన రచనలే ఎక్కువగా వచ్చాయన్నది ప్రసిద్ధంగా ఉన్న మాట. అయితే పాక్కళ్ళ సుభద్రమ్మగారు “దక్షిణాంధ్రయుగ సాహిత్యం – భక్తి సిద్ధాంతం” అన్న తమ సిద్ధాంత వ్యాసంలో ఈ యుగంలోని కవులు “భక్తికి కట్టిన పట్టం మెచ్చుకోదగినంతగా ఉంది” అంటారు.

దక్షిణాంధ్రయుగం యక్షగానాలకు ప్రసిద్ధి. ఆ కాలం నాటి యక్షగానాలలో విజయరాఘవుడు, మాతృభూతకవి, శాహాజీ, గిరిరాజకవి మొదలైన వారు చేసిన స్తుతులలోని భక్తిభావాన్ని సుభద్రమ్మగారు తన గ్రంథంలో వివరించారు. మాతృభూతకవి యక్షగానాలలో వినాయకుని గూర్చి, మహావిష్ణువు గురించి ఉన్న చక్కని స్తుతులను ఉదాహరించి, “గుండెల నిండా మెండైన భక్తి భావం కలిగి ఉంటే తప్ప ఇలాంటి రూప చిత్రణ చేయడం సాధ్యం కాదు” అంటారు (పుట 140).

అలాగే తమ సాహిత్యానికి భక్తినే ప్రధానంగా చేసుకున్న త్యాగయ్య, క్షేత్రయ్య, ముద్దుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, రామదాసు, సారంగపాణి వంటి వాగ్గేయకారులందరూ ఈ కాలం వారేనంటూ వారి సాహిత్యంలోని భక్తి ప్రాముఖ్యాన్ని సుభద్రమ్మగారు విపులంగా చర్చించారు.

అయితే నేను ఈ అధ్యాయం యొక్క పరిధిని కావ్యరచన చేసిన వారి వరకే పరిమితం చేసుకున్నందువలన ఇక్కడ శతకకవులను వాగ్గేయకారులను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ప్రసిద్ధములైన శతకములను పరిశీలించినపుడు, ఒక్క పాల్కురికి సోమన తప్ప ఇతర కవులెవరూ భక్తిరసము అనే మాటను వాడినట్లు కనబడలేదు. మల్లికార్జున పండితుని శివతత్త్వసారంలో “శివరస భూరి సుఖానుభవ భక్తపుంగవులు”, “శివయోగరసానుభవ విశిష్ట సుఖంబుల్” వంటి మాటలు కనిపిస్తాయి. అమలాపురము సన్యాసికవి వ్రాసిన విశ్వనాథ శతకంలో శృంగారాది నవరసములను ప్రకటించే విశ్వనాథుని స్తుతిస్తూ తొమ్మిది పద్యాలున్నాయి. తాళ్ళపాక అన్నమాచార్యుని వేంకటేశ్వర శతంలో “చక్కనితల్లికిన్‌ నవరసంబుల వెల్లికిఁ బుష్పవల్లికిం” అనడం కనిపిస్తుంది. అయితే ఇటువంటి సందర్భాలలో వ్యవహారంలో ఉన్న నవరసములనే మాటను కవి వాడినట్లుగా అర్థం చేసుకోవాలి కానీ అది రససంఖ్యపై కవి అభిప్రాయంగానూ భక్తికి రసత్వాన్ని అంగీకరించకపోవడంగాను పరిగణించలేము.

వాగ్గేయకారుల సాహిత్యంలో ప్రాధాన్యమంతా భక్తిదేనన్న విషయం స్పష్టం. కనుక వాగ్గేయకారుల దృష్టిలో భక్తి కేవలం సంచారిభావం మాత్రమే అయ్యే అవకాశం లేదన్న స్థూలమైన అవగాహనకు రావచ్చు. అయితే ఆయా వాగ్గేయకారులు భక్తిని భావమని కానీ రసమని కానీ ఎక్కడైనా పేర్కొన్నారా అన్న విషయాన్ని విస్తృతమైన వారి గేయ సాహిత్యంలో అన్వేషించడం వలన ఒనగూడే అధిక ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో వాగ్గేయకారుల సాహిత్యాన్ని ఆవిధంగా పరిశీలించలేదు. ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

ఇక ఆధునిక తెలుగు కవుల విషయానికి వస్తే రాయప్రోలు సుబ్బారావు, బసవరాజు అప్పారావు, దువ్వూరి రామిరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి, జంథ్యాల పాపయ్యశాస్త్రి, సి. నారాయణరెడ్డి, దాశరథి, శేషేంద్ర శర్మ వంటి ఆధునిక కవుల అభిప్రాయాలను “ఆధునిక విమర్శకులు-భక్తి” అన్న అధ్యాయంలో చెప్పుకోవడం జరిగింది.

ఆధునిక కవిత్వంలో ముఖ్యమైన ఉద్యమాలు రెండు – ఒకటి భావకవిత్వము, రెండవది అభ్యుదయ కవిత్వము. భావకవిత్వంలో భక్తికవిత్వము కూడా ఒక శాఖగా వర్ధిల్లింది. భక్తి కవిత్వం వ్రాసిన వారిలో వేంకట పార్వతీశ కవులు, వేదుల సత్యనారాయణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలైన వారున్నారు. వీరి భక్తిరచనలు పాఠకులకు ఆనందాన్ని కలిగించాయని చెప్పగలము కానీ భక్తిని గురించి అలంకార శాస్త్ర పరంగా వీరి అభిప్రాయమేమిటన్నది కేవలం వీరి రచనలను ఆధారం చేసుకుని చెప్పడం కష్టం. అవతారికల వంటివి ఉండవు కనుకా, నిడివి తక్కువ కనుకా గేయసాహిత్యం ఆధారంగా కవి అభిప్రాయాన్ని అంచనా వేయడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేయలేదు కానీ, ఆ కవులు ఇతరత్రా వ్రాసిన వ్యాసాలు లభ్యమయినపుడు వాటిలో వ్యక్తమయిన అభిప్రాయాలను పరిశీలించాను.

కృష్ణశాస్త్రి గారు ఒక వ్యాసంలో “పారిజాతం విరహి యయిన భక్తుని వంటిది; లోపల రక్తహృదయం, పైకి శాంతధవళ మూర్తి” అనడం కనిపిస్తుంది (కృష్ణశాస్త్రి సాహిత్యం-5, పుట 327). దానిని బట్టి వారు శాంతానికి భక్తికీ ఉన్న సూక్ష్మభేదాన్ని గుర్తించారనీ, ఒకరకంగా శాంతాన్నే భక్తిలో భాగంగా పరిగణించారనీ అనిపిస్తుంది. వీరి ధనుర్దాసు శ్రవ్యనాటికల సంకలనానికి శీర్షిక క్రింద “భక్తిరసాత్మకములు” అని వ్రాయడాన్ని బట్టి కృష్ణశాస్త్రిగారు భక్తిని రసముగానే భావించారని చెప్పవచ్చు.

భావకవిత్వం తర్వాత వచ్చిన అభ్యుదయ కవిత్వంలో భక్తికి ప్రాధాన్యం కనపడదు. భక్తిని అభ్యుదయకవులు రసముగా పరిగణించినట్లు కూడా కనపడదు. ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యములో పలువురు భక్త కవుల రచనలను గురించి పేర్కొన్నారు కానీ ఎక్కడా భక్తిరసము అన్న మాటను వాడలేదు. పోతనగారి గురించి వ్రాసినపుడు కూడా “భక్తిపారవశ్యం” అనే మాటను పలుమార్లు వాడడం కనిపిస్తుంది కానీ భక్తిరసము అన్న మాటను వాడడం కనబడదు. సమగ్ర ఆంధ్ర సాహిత్యములో భక్తి అన్న మాటను ఎప్పుడు చెప్పవలసి వచ్చినా భావము అనే చెప్పడం కనిపిస్తుంది. శృంగారాది రసములతో కలిపి చెప్తున్నపుడు కూడా వాటిని రసములని, భక్తిని భావమని స్పష్టంగా పేర్కొనడం కనిపిస్తుంది. ఉదా: “నాచన సోముని నవీనగుణాలు దేశంలో ప్రచారంలోకి వచ్చేదాకా కృత్యాదిని శ్రీకారం పద్యాలు శృంగారరసంతో కాక భక్తిభావాలతో ఉండేవని తెలుస్తుంది” (సమగ్ర ఆంధ్ర సాహిత్యము 1, పుట 584).

ఈ ధోరణే, అంటే భక్తికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడమనే ధోరణే అభ్యుదయ కవిత్వ కాలం నుండి ఈనాటివరకూ ప్రధానంగా కనిపిస్తోందని చెప్పవచ్చు, ముఖ్యంగా వచన కవిత్వంలో. ఇందుకు కారణాన్ని అర్థం చేసుకునే ఉద్దేశంతో సమకాలీన వచనకవులు కొందరితో ఈ విషయాన్ని చర్చించాను. ప్రసిద్ధ కవి బి.వి.వి ప్రసాద్ గారితో జరిపిన సంభాషణను గ్రంథాంతంలో జతచేశాను.

4.2. సారాంశము

ఇక ఆధునిక యుగంలో భావకవిత్వోద్యమ కాలంలో భక్తిసంబంధమైన రచనలు రావడమూ, కృష్ణశాస్త్రి వంటి కవులు తమ శ్రవ్యనాటికలను భక్తిరసాత్మకములు అని పేర్కొనడమూ కనిపిస్తుంది. ఆతర్వాతి కాలం నుండి నేటివరకు వస్తున్న వచనకవిత్వంలో భక్తికి ప్రాధాన్యం కనిపించడం లేదు.

(సశేషం)

Exit mobile version