Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-13

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 4 – మూడవ భాగం

4.1.17 మాదయగారి మల్లన

మాదయగారి మల్లన రచించిన రాజశేఖర చరిత్ర శృంగార రసము అంగిగా ఉన్న చిన్న కావ్యమే అయినా అందులో భక్తికి ఇచ్చిన ప్రాధాన్యం తక్కువది కాదు. ఈ కావ్యంలో కరుణారసము అనే మాట మూడు నాలుగు చోట్ల కనబడుతుంది కానీ ఇతర రసములేవీ ఎక్కడా వాచ్యంగా పేర్కొనబడలేదు. అయితే కొన్ని సన్నివేశాలలో భక్తి ముందుకు వచ్చి నిలబడటం, భక్తిని ఆధారం చేసుకుని కథ ముందుకు నడవడం కనిపిస్తుంది.

“కడలేని సంసార జడధిలో మునిఁగిన జనుల పాలిటి నావ శంభుసేవ; కడు దూరమై యున్న కైవల్య సీమకుఁ జక్కని పెనుద్రోవ శంభుసేవ” వంటి శివభక్తి విశిష్టతను చెప్పే పద్యాలు, “జగదభి నిర్మాణ చాతుర్య విఖ్యాతి మెచ్చి ధాతకు నెవ్వరిచ్చినారు” వంటి విష్ణుమహిమను చెప్పే పద్యాలు ఉన్నాయి. “కొప్పుపై నొప్పెడు కొదమ చంద్రునితోడఁ గస్తూరికా తిలకంబు తోడ” ప్రత్యక్షమయే చక్కని అమ్మవారి వర్ణన ఉంది.

శివభక్తుల భాగ్యాన్ని వర్ణించే అందమైన పద్యాన్నొకదానిని పేర్కొంటున్నాను.

తే.
నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తి రిసుమంత నెవ్వడు పాఱవైచుఁ
గామధేనువు వానింటి గాడి పసర
మల్లసురశాఖి వానింటి మల్లెచెట్టు (1-65)

ఇటువంటి పద్యాలు, ఈ రచనలో భక్తిని పొందుపరచిన తీరు, ఈ కవి మనసులో భక్తికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియచేస్తాయి. ఒకవేళ భక్తి ప్రధానమైన ఇతివృత్తాన్ని తీసుకుని ఉంటే, భక్తికి రసత్వాన్ని కలిగిస్తూ కావ్యం వ్రాయగలిగి ఉండేవాడన్న అభిప్రాయాన్నీ కలిగిస్తాయి.

4.1.18 తెనాలి రామలింగడు

రామకృష్ణ కవి వ్రాసిన కావ్యాలన్నిటిలోనూ ప్రసిద్ధి పొందినది పాండురంగ మాహాత్మ్యం. ఇందులో కవి భక్తికి ఇచ్చిన ప్రాధాన్యం సుస్పష్టం. మరో రెండు గ్రంథాలు ఉద్భటాచార్య చరిత్రం, ఘటికాచల మాహాత్మ్యం కూడా భక్తిరచనలే.

పాండురంగ మాహాత్మ్యం కావ్యాదిలో చేసిన స్తుతిపద్యాలలో కృతిభర్తకు “విష్ణుభక్తి మహిమాతిశయం బనయంబు నీవుతన్” అన్న ప్రార్థన కనిపిస్తుంది (1-6). కృతిభర్తకు సంపదనీ ఆయువునీ కీర్తినీ ప్రసాదించమంటూ దేవతలను కోరడం సాధారణంగా కావ్యాలలో చూసే విషయమే. కానీ రామకృష్ణుడు వాటన్నిటితో పాటు “విష్ణుభక్తి మహిమాతిశయము”ను కూడా చేర్చడం భక్తికి అతడు ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలియచేస్తోంది.

అలాగే కావ్యం మొదట్లో “ఠవణింతునొక్క శ్రీ భాగవత చరిత్రంబుఁ” (1-18) అంటూ కవి చేసుకున్న సంకల్పమూ, ఆశ్వాసాంతాలలో ఇది పాండురంగమాహాత్మ్యమనే పరమభాగవత చరిత్రమని చెప్పడమూ కూడా ఈ కావ్యంలో కవి పోషించదలచుకున్నదీ, పోషించాననుకున్నదీ భక్తినేనని తెలియచేస్తాయి.

కావ్యాన్ని పరిశీలించినపుడూ ఆ విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు ద్వితీయాశ్వాసాన్ని తీసుకుంటే, అందులో పుండరీకుని భక్తి, అతని పూజలు, అతడిని అనుగ్రహించడానికి వచ్చే కృష్ణుని రూపం – వీటన్నిటినీ వర్ణించే పద్యాలు, ఆ తర్వాత అలా ప్రత్యక్షమైన కృష్ణుని జూచి “హర్ష ధారావిల మానసుడు, కృతవిమూఢ బుద్ధి” అయిన పుండరీకుడి స్థితిని చెప్పే పద్యం, ఆపైన అతడు చేసే దశావతార స్తుతి, ఇవన్నీ ఇలా వరుసగా వ్రాసిన కవి భక్తిని ఒక సంచారిభావంగా పరిగణించాడని అనుకోలేము.

కృష్ణుని వక్షస్థలం, చేతులు, మెడ, పెదవులు, కళ్ళు, ముంగురులు ఇలా ఒక్కొక్క భాగాన్నీ, మొత్తం రూపాన్నీ వర్ణించే పద్యాలు కావచ్చు, భక్తుడైన పుండరీకుని ఆనందాన్ని పారవశ్యాన్ని వర్ణించే పద్యాలు కావచ్చు – ఇవన్నీ భక్తికి పోషకాలుగా నడచినవే. ఉదాహరణగా ఒక్క పద్యం పేర్కొంటాను.

చ:
విలిఖితమో! శిలాకృతమొ! విస్మృతి రూపు వహించెనో! యనున్
జలన విదూరుఁడయుఁ దొలుసావి పయోధర ధారఁ దోఁగున
య్యిలఁ దలయెత్తు క్రొత్తపులునేపున, వేపులకల్ తనూలతన్
మొలవఁగ నున్న నవ్వి యదుముఖ్యుఁడు తాపసముఖ్యు నిట్లనున్ (2-52)

అవతారికలో కవి చెప్పిన మాటలనీ, కావ్యం నడిచిన తీరునీ చూశాక ఈ కావ్యంపై సహృదయ విమర్శకుల అభిప్రాయాలెలా ఉన్నాయో కూడా పరిశీలించాను. ఈ కావ్యానికి వ్రాసిన ఉపోద్ఘాతంలో రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు “ఇందలి పెద్ద చిన్న కథలన్నియు భక్తిభావమును ప్రపంచించి శాంత రసమున పర్యవసించవలసినవి, కనుక సామాన్య ప్రబంధములవలె శృంగార రసవిలాసాలు, వీరవిహారాలును ఇందు లేవు” అంటారు (పుట 27). మరొక ప్రసిద్ధ విమర్శకులు పుట్టపర్తి నారాయణాచార్యులు కూడా రామలింగకవి ఈ కావ్యాన్ని భక్తిరసపోషకంగా వ్రాసినట్లుగానే భావించారని ఇంతకు ముందరి అధ్యాయంలో చెప్పుకున్నాము. ఇంకా ఈ కావ్యాన్ని పరిశీలించిన కొత్తపల్లి విశ్వేశ్వరశాస్త్రి గారు, కొండా సుబ్బారావుగారు కూడా ఈ కావ్యాన్ని “భక్తిరస” ప్రధానమైన కావ్యంగానే భావించారని తెలుస్తోంది (తెలుగు విమర్శ- రసనిర్ణయ పరిశీలన పుట 223-226).

ఇలా మూడు రకములైన పరిశీలనలూ రామలింగకవిని భక్తిరసానికి అనుకూలుడిగానే చూపించాయి.

4.1.19 కృష్ణదేవరాయలు

ఆముక్తమాల్యద కావ్య రచనకు స్ఫూర్తి, అందులోని కథలు, అవి నడిచిన తీరు – అన్నీ కూడా అది భక్తి ప్రధానమైన కావ్యమని స్పష్టం చేస్తూనే ఉంటాయి. కవి హృదయంలో భక్తికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియచేస్తూనే ఉంటాయి. కవికి స్వప్నంలో కనబడిన విష్ణువు “ఒక్క కృతి వినిర్మింపు మిఁక మాకుఁబ్రియముగాఁగ” అని అడిగితే వ్రాసిన కావ్యమిది. అందుకే సహృదయ విమర్శకులు పలువురు ఈ కావ్యంలోనుంచి భక్తిరసాన్ని అందుకున్నారు.

ఆముక్తమాల్యద ఉపోద్ఘాతంలో మేడేపల్లి వెంకట రమణాచార్యులు గారు “దీనిలో నంగముగా శృంగారాది రసములనుప్రవిష్టములయి యున్నను ప్రధానరసము శాంతరసాంతర్భూత భక్తిరసము” అన్నారు (పుట 68). “విష్ణుచిత్తీయమునందు శాంత రస పోషక మయిన విష్ణుచిత్తుని దాస భక్తి గోదాదేవి మధుర భక్తితో పోను పోను పొందు కలిసి కథావస్తువున కందము నొదవించినది” అనీ, “చివరి రెండాశ్వాసాలందు భక్తి సంయుతంబగు శృంగారము వర్ణింపబడినది. కావున అందలి రసము మధురభక్తి” అనీ అంటారు శిష్టా లక్ష్మీకాంతశాస్త్రిగారు (విజయనగరాంధ్ర కవులు పుట 562, 595). “ఆముక్తమాల్యదా పర్యాలోకనము” అనే గ్రంథంలో వెల్దండ ప్రభాకరరావుగారు ఆముక్తమాల్యదలో భక్తి, రౌద్రము, వీరము, బీభత్సము, అద్భుతము, శృంగారము అభివర్ణితములైనవనీ, ఈకావ్యంలో ప్రధానరసము భక్తి అనీ అభిప్రాయపడ్డారు (పుట 66).

తుమ్మపూడి కోటీశ్వరరావుగారు మాత్రం ఆముక్తమాల్యదలోని అంగిరసం శృంగారమన్నారు. దానికి వారు చూపిన కారణాలు ఆముక్తమాల్యద కావ్యరచన మధుసూదన సరస్వతి భక్తిరసమును ప్రతిపాదించడానికి ముందే జరగడం, గోద గోపికల వలె పరకీయ కాక స్వకీయ కావడం, ఆమెకు విష్ణువుతో వివాహం జరగడం వంటివి. అయితే లక్షణగ్రంథానికన్నా ముందు లక్ష్యగ్రంథం రావడాన్ని అభ్యంతరంగా పరిగణించలేము. అలాగే మధురభక్తికి ఆలంబనం పరకీయయే కానవసరం లేదు, ఆమాటకు వస్తే అసలు స్త్రీయే కానవసరం లేదు. ఏమయినా ఇక్కడ అంగిరసము ఏమిటన్న విషయాన్ని గురించి కాక కావ్యంలో భక్తి యొక్క ఉనికిని గురించి, కావ్యరచనలో కవి భక్తికి ఇచ్చిన ప్రాముఖ్యాన్ని గురించి ప్రస్తావించుకుంటున్నాము కనుక కృష్ణదేవరాయల అభిప్రాయంలో భక్తికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించడానికి కోటీశ్వరరావుగారి అభిప్రాయం ఆటంకం కాబోదు.

4.1.20 మొల్ల

మొల్ల రామాయణంలో “నీలమేఘచ్చాయ బోలు దేహము వాడు” వంటి కొన్ని చక్కని వర్ణనలతో కూడిన పద్యాలున్నాయి. “ఏయెడ జూచిన ధరణీ నాయకు శ్రీపాద యుగము నా చిత్తములో బాయదని విన్నవింపుము వాయు తనూజుండ!” అంటూ సీత హనుమంతుడితో చెప్పే పద్యం లాంటి పద్యాలలో భక్తి భావమూ కనిపిస్తుంది.

భక్తికి రసస్థాయిని కల్పించే ప్రజ్ఞ ఈ కావ్యంలో అంతగా కనబడదు. రాముని పాత్ర చిత్రణలో అక్కడక్కడా కనిపించే అనౌచిత్యాలున్నాయి ఉదాహరణకి యుద్ధకాండలో రాముడు రావణుడితో “అలములోన వానరుల నాలము సేసినయట్లు గాదు” అనడం వంటివి. అంతేకాదు శబరి, జటాయువు వంటి భక్తుల కథలను చాలా క్లుప్తంగా చెప్పడం కూడా భక్తికి రసస్థాయిని తెచ్చే అవకాశాన్ని వదులుకోవడమేననిపిస్తుంది. అయితే, భక్తిరసాత్మకంగా కావ్యాన్ని నిర్వహించే ప్రతిభ చూపగలిగినా లేకున్నా “చెప్పుమని రామచంద్రుఁడు సెప్పించిన పలుకుమీదఁ జెప్పెద నేనెల్లప్పుడు నిహపరసాధనమిప్పుణ్య చరిత్ర” అంటూ అవతారికలో ఆమె చెప్పిన కొన్ని పద్యాలను బట్టి రచనలో భక్తికి ఇవ్వాలనుకున్న ప్రాధాన్యం అర్థమవుతుంది.

4.1.21 అయ్యలరాజు రామభద్రుడు

ఇతడు రామాభ్యుదయము అనే ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. రామాయణ కథను ప్రబంధంగా రచించాడు కనుక భక్తికి ప్రాధాన్యం కావ్యమంతా కనబడుతుంది.

సీ.
తొవతమ్మి విందు గన్దోయి మించిన వాఁడు,
జాళువా మిసిమి పచ్చడము వాఁడు
కన్ను వీనుల సెజ్జనున్న వన్నియవాఁడు
తపసి డెందపుటిండ్లఁ దనరువాఁడు
కలిమిచేడియఁ బంటనలఁతి నేలిన వాఁడు,
పుడమివేల్పులకుఁ జేపడని వాఁడు
తొంటి జేజేమూఁకఁ దూలింపఁ గలవాఁడు,
ముజ్జగంబుల చూలుబొడ్డువాఁడు
తే.
సొగసి నవ్వక నవ్వు నెమ్మొగమువాఁడు
కలుము లీనెడు తళుకుఁ గ్రేగంటివాఁడు
పేదసాదల బ్రదికించు పెంపువాఁడు,
పాలమున్నీటిలోనఁ జూపట్టెనపుడు (3-45)

ఇటువంటి చక్కని వర్ణనలతో పాటు శృంగారసన్నివేశాలలో సైతం భక్తిపరమైన భావాలను కలగలుపుకున్న అందమైన పద్యాలు ఈ కావ్యంలో ఉన్నాయి. సీతారాముల శృంగారసన్నివేశంలోని “తనువునఁ గంపమొంది తనుఁ దా సడలెన్ దృఢనీవీబంధ మోచన మగుటద్భుతమె రఘుచంద్రుని ప్రాపొక యింత గల్గినన్?” (4-164) వంటి పద్యపాదాలు అందుకు ఉదాహరణలు.

తే.
అతుల భూజాన్వితుండ వైనట్టి నీకు,
సర్వదా రామయుతకు నిజ్జనకసుతకు
నెఱుఁగరా దెండవడ దేవ! యిట్టి మీ ప
దాబ్జముల నీడ నున్న నా కలఁత గలదె? (5-48)

అన్న పద్యం కావ్యంలో లక్ష్మణుడు చెప్పినదే కావచ్చు కానీ అందులోని అందాన్ని ఆస్వాదించగల పాఠకుడికి మాత్రం కావ్యపఠనం తర్వాత కూడా పెదవులపై కదలాడే పద్యం. మొల్ల రామాయణం విషయంలో చెప్పుకున్న విషయం – భక్తిరసపోషణకు అవకాశం ఉండే ఉపాఖ్యానాలను సరిగా ఉపయోగించుకోకపోవడం అనే అంశం – ఈ కావ్యానికీ వర్తించినప్పటికీ, ఉన్న పద్యాలలో కనిపించే అందమూ, అవి కలిగించే ఆనందమూ తక్కువైనవి కావు.

4.1.22 రఘునాథ నాయకుడు

17వ శతాబ్దికి చెందిన రఘునాథ నాయకుని రచనలలో భక్తికి ప్రాముఖ్యం బాగా కనబడుతుంది. ఈయన రచించిన వాల్మీకిచరిత్ర, రామాయణాలలో చక్కని భక్తిప్రధానమైన పద్యాలు ఉన్నాయి. వాల్మీకిచరిత్ర సమగ్రంగా లభిస్తున్న కావ్యం కనుక ఆ కావ్యం ఆధారంగా కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.

ఈ కావ్యానికి ఇతివృత్తంగా ఒక భక్తుని కథను ఎంచుకోవడంలోనే రఘునాథనాయకుడు భక్తికి ఇచ్చిన ప్రాధాన్యం అర్థమవుతుంది. రఘునాథనాయకుడు ఈ కావ్యాన్ని రాముడు స్వప్నంలో కనబడి వ్రాయమని ఆదేశించగా వ్రాశానని చెప్పాడు. రామాయణమూ అంతే. రెండు కావ్యాలలోనూ స్వప్నంలో సీతాలక్ష్మణ సమేతుడై కనిపించిన రాముని వర్ణన రసభరితంగా ఉంటుంది. గ్రంథ విస్తరణ భీతి వలన అన్ని పద్యాలూ పేర్కొనడం లేదు. ఇక కావ్యంలోకి వెళ్తే, శ్రీరంగం, శ్రీశైలం వంటి వివిధ క్షేత్రాల విశేషాలు, బాలకృష్ణుడు, శివుడు, విష్ణువు మొదలైనవారిని స్తుతించిన పద్యాలు వరుసగా కనిపిస్తాయి.

తలగడ బాముఁజేర్చుకొని దయ్యము నెయ్యము నమ్మి యేటిలో
నెలవుగ నిల్లు గట్టుకొని నీవిటులుండఁగ నోర్చుటెట్లు మా
వలనగు మానసాబ్జముల వాసము సేయు; కొఱంతలేదు నీ
యలమట దీఱెడున్ విను విహంగమవాహన రంగమోహనా! (2-28)

వంటి భక్తిప్రకటనలు ఉంటాయి. రఘునాథనాయకుడు భక్తిని ఎలా వ్యక్తీకరించాడో అర్థమయేందుకు ఒక్క పద్యాన్ని మాత్రం ఉదాహరిస్తాను. కావ్యారంభంలో మునులందరూ సురముని నారదునికి నమస్కరించి “శ్రీవిష్ణుస్మరణ కథ వచింపుము మాకున్” అని అడిగిన సందర్భంలో నారదుని ఆనందాన్ని వర్ణించే పద్యమిది. మునిప్రవరులు “మురఘస్మర స్మరణరూప కథా శ్రవణానుషంగులై” వినుతి చేసినపుడు నారదుడు “వనజదళాక్షు భక్తవత్సలు నెమ్మదిలోఁ దలంచుచున్” ఉన్నప్పటి స్థితిని వర్ణించే పద్యం.

పులకలు మేనజాదుకొనఁబొంగుచుమాటికి హర్షభాష్పముల్
జలజలఁజిందఁగా హరితలంపునఁ జిందులుద్రొక్కఁ గొంతసే
పలయికవోలె మైమఱచి యంతటఁ గన్నులు విచ్చి చూచె మౌ
ను లడిగినట్ల యర్థము మనోగతమౌటకు నిచ్చమెచ్చుచున్ (1-55)

ఈ పద్యం చదువుతుంటే రఘునాథనాయకుడు భక్తిని ఒక సంచారిభావంగా మాత్రమే పరిగణించాడని అనిపించదు. భక్తిని రసముగా పరిగణించే కవి అయితేనే ఈ విధంగా వ్రాయగలడనిపిస్తుంది. ఒక కవిగా తాను భక్తిరస పోషణ చేయగలిగినా లేకున్నా వ్యక్తిగతంగా భక్తి యొక్క రసత్వాన్ని గుర్తించి ఉండాలనిపిస్తుంది.

4.1.23 తరిగొండ వెంగమాంబ

తరిగొండ వెంగమాంబ రచనలన్నీ భక్తిప్రధానాలే. తొలిరచన నృసింహ శతకములో “అతులితమైన మీ పదవి నంద దలంచి విశాల భక్తిచే వితరణగాను మీరిపుడు వేడ్కను వాక్కుల నిచ్చినంతలో శతకముగాను చెప్పెదను” అని నరసింహునితో చెప్పుకున్న వెంగమాంబ తదనంతరం విష్ణుపారిజాతం, బాలకృష్ణ నాటకం వంటి యక్షగానాలు, ద్విపద భాగవతము, వేంకటాచల మాహాత్మ్యం వంటి పద్య కావ్యాలు, గేయాలు రచించింది. బాలకృష్ణ నాటకంలో పోతన పద్యాలను, మొల్ల పద్యాలను పోలిన పద్యాలున్నాయి. వేంకటాచల మాహాత్మ్యంలో శ్రీనివాసుని దర్శించినప్పటి మునుల ఆనందాన్ని వర్ణించిన ఒక్క పద్యాన్ని ఇక్కడ పేర్కొంటున్నాను.

సీ.
శ్రీ నివాసుని జూచి ఆనందపరవశు
లై జడల్ జీరాడ నాడియాడి
ఇదమిత్థమననేర కెనలేని ముదమున
ఇందిరేశుని చెంత నెగిరి యెగిరి
భక్తియుక్తావేశ భరితాత్ములై అఫ్టు
చక్కగ చిందులు తొక్కి తొక్కి,
ఘనపదక్రమ జటకలిత స్వరంబుల
సకలవేదంబుల జదివి జదివి
తే.
నిలిచి ఆనంద దుగ్గాబ్ది నెమ్మిమునిగి
శ్రీ నివాసుని రూపంబు ప్రియము గదుర
కనుల పండువుగా జూచి మనములచట
మగ్నము లొనర్చి రెంతయు మౌనివరులు! (3-180)

భక్త్యానందాన్ని గురించి ఇంత విపులమైన వర్ణన ఉన్న ఈ పద్యాన్ని గమనించినపుడు వేంగమాంబ దృష్టిలో భక్తికి ఉన్న స్థానం సంచారిభావాన్ని మించినదే అయి ఉండాలన్న అంచనాకు రావచ్చుననిపిస్తుంది.

4.1.24 కనుపర్తి అబ్బయామాత్యుడు

18వ శతాబ్ధానికి చెందిన అబ్బయామాత్యుడు “నరసింహ పాద భక్తుఁడ, నరసింహ కృపాప్రసాద నయలబ్ధమతిన్; నరసింహార్పిత హృదయుఁడ, నరసింహుని కరుణఁ జాల నమ్మినవాఁడన్” అని చెప్పుకున్న భక్తకవి (అనిరుద్ధ చరిత్రము 1-32). అనిరుద్ధచరిత్రం, కవిరాజ మనోరంజనము అనేవి ఇతడిచే రచించబడిన ప్రబంధాలు.

“భగవంతుని సద్గుణములు పొగడు వివేకంబె తమ కపూర్వైశ్వర్యంబగుట, నరస్తుతి సేయరు జగతిన్ సత్కవులు తుచ్ఛసంపద కొఱకై” అని భావించి తన అనిరుద్ధచరిత్రం కావ్యాన్ని నరసింహస్వామికే అంకితం చేసినవాడు అబ్బయామత్యుడు (అనిరుద్ధ చరిత్రము 1-17).

అనిరుద్ధచరిత్రం కావ్యారంభం కూడా “భగవత్కథా సుధానుభవ కుతూహల సాంద్రులగు” శౌనకాదులు సూతుడిని అనిరుద్ధ చరిత్ర చెప్పమని అడిగితే మొదలుపెట్టినట్లుగా ఉంటుంది. ఇటువంటి కవి వ్రాసిన కావ్యంలో భక్తి పోషింపబడిందా, ఒకవేళ పోషింపబడితే అది ఎలా ఉంది అని చూసినపుడు కొన్ని రమ్యమైన పద్యాలు కనిపించాయి.

అవి అనిరుద్ధుడు ద్వారక నుంచి అదృశ్యమై, ఉషాసుందరి అంతఃపురంలో చేరి, ఆతర్వాత బాణుడిచే బంధింపబడి ఉన్న సమయంలో ద్వారకకి నారదుడు వచ్చే సన్నివేశంలోని పద్యాలు. సభామంటపంలో కృష్ణుడు

సీ.
చిఱునవ్వుటమృతంబు చిలుకు చెక్కిళ్లపై
నక్ర కుండల కాంతి యాక్రమింప
ధవళారవింద సుందరమైన కన్నుల
నుల్లాస రసము రంజిల్లుచుండఁ
గౌస్తుభ మాణిక్య కలిత వక్షంబున
వైజయంతీ వైభవంబు మెఱయ
జిగిబిగి సొగసు చేఁ జెలువొందు నెమ్మేనఁ
జర్చిత చందనచ్ఛాయ దనరఁ
తే.
జిత్ర సింహాసనమున నాసీనుఁడైయు
పాంతపీఠికనుంచిన యడుగుఁ దమ్మి
నతనృపాలశిఖామణి ద్యుతుల మెలఁగ,
భువన మోహన శృంగార పూర్ణుఁడగుచు (అనిరుద్ధ చరిత్రము 4-6)

ఉన్న సమయంలో నారదమునీంద్రుడు సభలోకి వస్తాడు. అపుడు

చ.
నయన యుగంబునందుఁ గరుణారసవృష్టి చెలంగభూషణో
దయరుచి చంచలాలతవిధంబునఁ బెంపురహింప సాధుసం
చయముఖ చాతకంబులకు సౌఖ్య మొసంగ సభాననభస్థలిన్
నయగుణశోభియై వెలయు నందతనూభవ నీల మేఘమున్ (అనిరుద్ధ చరిత్రము 4-8)

“కాంచి యానంద హృదయుఁడై కదియ వచ్చు” నారదమునీంద్రుడికి ఎదురేగి అర్ఘ్యాదులతో పూజించిన కృష్ణుడు “అయ్యా మా అనిరుద్ధు డెక్కడికి వెళ్ళాడో, మావాళ్ళందరూ చింతామయులయి ఉన్నారు, ఏంచేయాలో ఆనతీయండి” అని అమాయకంగా అడగడం, ఆ తర్వాత వచ్చే ఈ క్రింది పద్యం- ఇవన్నీ భక్తిపారవశ్య కారకాలే.

మ.
అనినం గృష్ణుని మోముఁ జూచి దరహాసాంచన్ముఖాంభోజుఁడై
ముని నాథాగ్రణి పల్కె సర్వమునకున్మూలంబవై సాక్షివై
పెనుపన్మన్పఁగఁగర్తవై పరుఁడవై పెంపొందియు న్నీ వెఱు
గని చందంబున నన్నుఁ గార్యమడుగంగా నెంత ధన్యుండనో (అనిరుద్ధ చరిత్రము 4-17)

రెండవప్రబంధాన్ని గురించి కూడా “ఒక్క పుణ్యకథారత్నంబు రచియించు యత్నంబునం గుతూహలదోహలంబైన చిత్తం”తో వితర్కించినట్లుగా చెప్పాడు అబ్బయామాత్యుడు. శ్రీరమణాంకితముగా రచించడానికి యోగ్యమై, వీరశృంగార రసాది లీలల ప్రగల్భతతో బుధులు మెచ్చుకునేట్లుగా, విస్తారము చేయదగిన సత్కథ ఏది అని ఆలోచిస్తూ, తన ఇష్టదైవమైన నరసింహస్వామిని తలచుకుంటూ నిద్రించినపుడు విష్ణువు కలలో కనబడినట్లూ, తన భక్తుడైన పురూరవుని కథని ప్రబంధంగా వ్రాసి తన గోపాల రూపానికి అంకితంగా ఇవ్వమని అడిగినట్లూ, అపుడు కవిరాజమనోరంజనం వ్రాసి రాజగోపాలుడికి అంకితం చేసినట్లు పీఠికలో వివరించబడింది.

ఈ విధంగా రెండు గ్రంథాలలోను భక్తికి తగు ప్రాధాన్యమీయబడింది. కవిరాజమనోరంజనంలో కూడా చెప్పుకోదగిన పద్యాలు ఎన్నో ఉన్నప్పటికీ గ్రంథ విస్తరణ భీతి వలన పేర్కొనడం లేదు. రెండు కావ్యాలలోను భక్తశిఖామణి అయిన నారద మునీంద్రుని గురించి రెండు పద్యాలు ఉన్నాయి. రెండూ కూడా చాలా చక్కని వర్ణనలు.

అబ్బయామాత్యుని కృతులను పరిశీలించిన వారణాసి వీరనారాయణశర్మగారు ఈ రెండు కావ్యాలలోను శృంగారాన్ని అంగిరసంగా పేర్కొన్నారు. కథావస్తువును బట్టి శృంగారం ప్రధానమయిన కావ్యాలలోనే భక్తిని ఇంత చక్కగా నిర్వహించిన ఈ కవి భక్తిప్రధానమైన కావ్యాన్ని వ్రాసి ఉంటే విమర్శకులు భక్తికి రసత్వాన్ని అంగీకరించేలా భక్తిని పోషించి ఉండేవాడని అనిపిస్తుంది.

(సశేషం)

Exit mobile version