[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]
అధ్యాయం 3 – నాల్గవ భాగం
3.1.28 సి. నారాయణరెడ్డి
నారాయణరెడ్డి గారు పోతన గురించి వ్రాసిన వ్యాసాలలో భక్తిరస ప్రసక్తి తేవడం కనిపిస్తోంది. వారి వ్యాససంకలనం “సమీక్షణం” లో “పోతన: పునఃపరిశీలన” అనే వ్యాసం ఉంది. అందులో వారు “అవతారికలోని రచనాలక్ష్యాన్ని పరికించినా నాందీపద్యాన్ని పరిశీలించినా పోతన్న ధ్యేయం కైవల్యమేనని బోధపడుతుంది. భవబంధరాహిత్యం, జన్మసాఫల్యం కైవల్యం వల్లనే సాధ్యం. ఆ కైవల్యం పోతన్న వాంఛించిన పరమపదం; పురాజన్మతపఃఫలం. ఈ కైవల్యకాంక్ష ప్రవృత్తిలా భాసించే నివృత్తి; భాగవతంలోని ప్రధానరసమైన భక్తికి ఆదిలోనే ఎత్తిన వైజయంతిక” అంటారు.
అలాగే మరొక చోట “నవవిధభక్తులను కథాత్మకంగా ప్రపంచించిన ప్రథమ గ్రంథం వ్యాస భాగవతం. ఆ భక్తిరస ఘట్టాలను ఇంతకు రెండింతలుగా విస్తరించి తొలిసారిగా మధురభక్తికి పచ్చలతురాయిని కూర్చిన తెలుగు కావ్యం పోతన్న భాగవతం” అంటారు. “గజేంద్రుని సంశయంలో, ప్రహ్లాదుని నిశ్చయంలో, గోపికల ఉద్వేగంలో, వామనుని ఉత్తేజంలో – ఇవేకాక నవవిధ భక్తిలతల బహుముఖ వికాసంలో, భక్తిరస తరంగితమైన పోతన్న చిత్తవృత్తి పలువిధాలా ప్రస్ఫుటమవుతుంది” అన్న ఇంకొక వాక్యం కూడా మనకు ఈ వ్యాసంలో కనిపిస్తుంది. ఇక్కడ రెండవవాక్యంలోని “భక్తిరసఘట్టాలను” అన్న మాటను, మూడవ వాక్యంలోని “భక్తిరస తరంగితమైన పోతన్న చిత్తవృత్తి” అన్న మాటను శాస్త్ర నిర్వచనాలను దృష్టిలో పెట్టుకుని కాక మామూలుగా వాడారని అనుకున్నా, మొదటి వాక్యంలోని “ప్రధాన రసమైన భక్తి” అన్న మాట నారాయణరెడ్డి గారు భక్తిని రసముగానే భావించారని తెలియచేస్తుంది. ఈ వ్యాసమే కొంత సంక్షిప్త రూపంలో “పోతన వ్యక్తిత్వము” అన్న శీర్షికతో “భాగవతవైజయింతిక” అనే వ్యాససంకలనంలో ఉంది. అక్కడ కూడా ఈ మూడు వాక్యాలూ మనకు కనబడతాయి.
3.1.29 తుమ్మపూడి కోటీశ్వరరావు
అమరేశం రాజేశ్వర శర్మ, కోవెల సంపత్కుమారాచార్యల సంపాదకత్వంలో వచ్చిన “పోతన పంచశతీ స్మారిక” లో తుమ్మపూడి కోటీశ్వరరావు గారు వ్రాసిన “భక్తిరసవాదం” అనే వ్యాసం ఉంది. ఆ వ్యాసంలో కోటీశ్వరరావుగారు భక్తికి ఉన్న వివిధ నిర్వచనాలను తెలిపి, ఎక్కడ చూచినా ప్రేమ చిత్త వృత్తినే భక్తి అన్నారు కాబట్టి అది శృంగార స్థాయి కంటె భిన్నం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
సాహిత్య దర్పణాదులన్న – శృంగమనగా మన్మథోద్భేదమన్నది సరైన నిర్వచనం కాదనీ, అది లౌకిక నిర్వచనమనీ అన్నారు. జగన్నాథుడు చెప్పిన నిర్వచనం ప్రకారం స్త్రీ పురుష ప్రేమ రతి అనడం భక్తిరసవాదం తరువాత వచ్చిన నిర్వచనమన్నారు. మతవాదుల దృష్టిలో శృంగారమంటే లౌకికం కాబట్టి వారు భక్తి అనడాన్ని ఇష్టపడతారని, కానీ నిజానికి శృంగారం కూడా అలౌకికమేననీ అన్నారు. “ఏ భావమైనా నాట్యాయమానమైతే రసమౌతుంది. ఆధునికుల రాజకీయం కళలోకి తర్జుమా చేస్తే వీరరసమౌతుంది. పౌరాణికులు చెప్పే భక్తిని కవిత్వంలోకి మారిస్తే శృంగారమౌతుంది” అన్నారు. కళాచిత్రణలో భక్తి శృంగారమే అవుతుందని చెప్తూ “పురాణంలో భక్తిగా చెప్పబడుతున్న తత్త్వ విషయం నాట్యాయమానమై శృంగారమౌతున్నదన్నమాట” అని వివరించారు.
భక్తి రసం కాదు భావమేనన్న అభిప్రాయంతో వ్యాసాన్ని ముగిస్తూ వారు కొన్ని విషయాలు ప్రస్తావించారు.
- భక్తి ప్రత్యేక రసమైతే దానికి పురుషార్థం ఏమిటి? అని ప్రశ్నించి, శాంతానికి మోక్షం, వీరానికి ధర్మం, రౌద్రానికి అర్థం, శృంగారానికి కామం పురుషార్థాలనీ, భక్తి ప్రత్యేక రసమయితే దానికి మరొక పురుషార్థం చెప్పవలసి ఉంటుందనీ, ఒకవేళ భక్తికి పురుషార్థం మోక్షమేనంటే అపుడు భక్తి శాంతమే కావాలనీ అన్నారు.
- “విభావానుభావ – అనుభవ దృష్ట్యా పురుషార్థ దృష్ట్యా భక్తి శృంగారంగానో, శాంతంగానో అనుభవానికి వస్తున్నదే తప్ప దానికొక ప్రత్యేక స్థితి ఉన్నట్లు తోచదు” అన్నారు.
- భక్తికి వాక్కు శృంగారమేననీ అంటే భక్త్యనుభవాన్ని ప్రకటించే భాషంతా శృంగార రసోచితమేననీ దీని ద్వారానే దానికి వ్యక్తీకృతి అనీ అన్నారు. ప్రపంచ సర్వసాహిత్యాల్లోనూ దైవానుభవం శృంగారాత్మక శబ్దంతోనే ప్రకటించబడిందని అన్నారు.
వీటిలో మొదటి అభ్యంతరాన్ని చదువుతున్నపుడే అందులోని అసంబద్ధత స్పష్టంగా అర్థమవుతుంది. రెండు రసాలకు ఒకే పురుషార్థం ఉండకూడదన్న సిద్ధాంతమే ఉంటే అపుడు అష్టరస వ్యవస్థ కూడా అసంభవమే అవుతుంది. ఉన్నవి నాలుగు పురుషార్థాలే కాబట్టి రసములు కూడా నాలుగే అని చెప్పవలసి వస్తుంది. ఇక్కడ నాలుగు పురుషార్థాలకు వీరం, రౌద్రం, శృంగారం, శాంతం అనే నాలుగు రసాలను కోటీశ్వరరావుగారు చెప్పారు. మరి మిగిలిన నాలుగు రసముల మాటేమిటి? కరుణరసమునకు పురుషార్థమేమిటి? ఈ అభ్యంతరాన్ని పరిగణిస్తే కరుణరసము కూడా రసము కాదనవలసి వస్తుంది.
ఇక రెండవ అంశాన్ని తీసుకుంటే, “విభావానుభావ – అనుభవ దృష్ట్యా పురుషార్థ దృష్ట్యా భక్తి శృంగారంగానో, శాంతంగానో అనుభవానికి వస్తున్నదే తప్ప దానికొక ప్రత్యేక స్థితి ఉన్నట్లు తోచదు” అన్నారు. ఇక్కడ వారు అనుభవం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానిని బలమైన అభ్యంతరంగా పరిగణించలేము. ఎందుకంటే “అనుభవం” అన్నపుడు అది వ్యక్తిగతమా సార్వజనీనమా అన్న ప్రశ్న వస్తుంది. కోటీశ్వరరావుగారు చెప్తున్న ఈ అనుభవం సార్వజనీనం కాదన్నది స్పష్టం. సర్వజనులకూ భక్తి శృంగారంగానో, శాంతంగానో మాత్రమే అనుభవంలోకి వస్తే అసలు భక్తిని రసముగా పరిగణించాలన్న ప్రతిపాదనే వచ్చేది కాదు. అనుభవంలో భక్తికీ ఇతర రసాలకూ మధ్య ఒక భేదాన్ని అటు ఆలంకారికులలోను ఇటు విమర్శకులలోనూ కూడా ఎంతోమంది గుర్తించారు. నిజానికి ఎక్కువమంది సాహితీవేత్తలు అనుభవం దృష్ట్యానే భేదాన్ని గుర్తించారు, సిద్ధాంత రీత్యా కాదు. అనుభవం దృష్ట్యా గుర్తించిన భేదాన్ని సిద్ధాంతపరంగా నిరూపించే ప్రయత్నం కొందరు చేశారు. కొందరు చేయలేదు. భక్తిరస ప్రతిపాదనను సిద్ధాంతపరంగా పూర్తిగా ఒప్పుకోని వారు కూడా అనుభవం దృష్ట్యా భక్తి ప్రత్యేకతను గుర్తించడం మనకు ఇప్పటివరకూ పరిశీలించిన సాహితీవేత్తల అభిప్రాయాలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది. జగన్నాథ పండిత రాయల వంటి వారు భక్తి శాంతరసం కంటే భిన్నమని చెప్పడం ఒక ఉదాహరణ.
ఇకపోతే రసవివేచనకు సామాజికుని అనుభవం ఒక పార్శ్వం అయితే కావ్యం మరో పార్శ్వం. కోటీశ్వరరావుగారి అభిప్రాయం ప్రకారం అనుభవం ప్రకారమే కాక కావ్యంలో అది ప్రకటించబడే భాషను బట్టి కూడా భక్తికి ప్రత్యేకత లేదు. ఇది కూడా అంగీకరించదగిన విషయం కాదు. నిజానికి ఇక్కడ వారు అన్నది సర్వసాహిత్యాల్లోనూ దైవానుభవం శృంగారాత్మక శబ్దంతోనే ప్రకటించబడిందని. ఇది నిజం కాదని చెప్పడానికి తెలుగు సాహిత్యం లోనే చాలా ఉదాహరణలు దొరుకుతాయి. శ్రీకాళహస్తి మాహాత్మ్యం, భాగవతం వంటి భక్తిప్రధానమైన గ్రంథాలన్నిటి నుండీ ఈ వ్యాఖ్యకు వ్యతిరేకమైన ఉదాహరణలు చూపవచ్చు. అంతేకాదు, అసలు దైవానుభవ ప్రకటన వేరు భక్తిరసపోషణ వేరు. దైవానుభవ ప్రకటన మాత్రమే భక్తిరసపోషణ కాదు. భక్తిరస పోషణ ఇంకా విస్తృతమైనది.
3.1.30 ప్రసాదరాయ కులపతి
ప్రసాదరాయ కులపతి గారు “భాగవత విమర్శ” అనే తమ సిద్ధాంత గ్రంథంలో రసపోషణ గురించి మాట్లాడుతున్నపుడు, ప్రేయోరసం, వత్సల రసం, మాయా రసం, భక్తి రసం వంటివి ఆయా ఆలంకారికుల చేత ప్రతిపాదించబడటం గురించి చెప్పి, అవేవీ తర్వాతి కాలపు విద్వాంసుల విమర్శలకు నిలబడలేదన్నారు (పుట – 253). ఈ వ్యాఖ్య వలన వ్యక్తిగతంగా వారు భక్తిని రసముగా అంగీకరిస్తున్నారో లేదో స్పష్టంగా తెలియలేదు. తమ సిద్ధాంత గ్రంథం యొక్క పరిధిలో ఆ చర్చని వారు తీసుకు రాలేదు. గోపికా భక్తికి సంబంధించిన పద్యాలను శృంగార రసములో భాగంగానే వివరించారు. అయితే ఇదే గ్రంథంలోని మరొక చోట “భాగవతము వంటి భక్తిరస ప్రధాన గ్రంథమును భక్తి గౌరవములతో నాంధ్రీకరించిన పోతన కవిత్వములో నెన్నో విశేషములు కలవు” అన్నారు (పుట– 338).
3.1.31 తిప్పాభట్ల రామకృష్ణమూర్తి
తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారు తమ సిద్ధాంత గ్రంథంలో భక్తి రసమును గూర్చి పూర్వ ఆలంకారికుల అభిప్రాయాలన్నీ వివరించాక భక్తిరస వివేచన చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని ఇక్కడ సంక్షిప్తంగా తెలియచేస్తాను.
- శృంగారము వయోధర్మము మాత్రమే కానీ భక్తికి వయోనియతి అవసరం లేదు, సర్వావస్థల యందు భక్తిరసాస్వాదన సాధ్యమే.
- శృంగారాదులు అలౌకిక స్థితిలో ఆనందప్రదములైనా లౌకిక జీవితములో అవి ఒకచో దుఃఖప్రదాలు, కానీ భక్తి లౌకికాలౌకికోభయ దశలందును ఆనందహేతువే.
- మోక్షమునకు జ్ఞానమార్గము ఆధారమని, ఆ జ్ఞానమార్గ రూపమయిన శాంతమును ప్రకృతిరసమని మిగిలినవి వికృతిరసములని అంటున్నట్లుగా భక్తి కూడా మోక్షమునకు ఆధారము కాబట్టి దానిని ప్రకృతిరసమని మిగిలినవి వికృతిరసములని అనడంలో విప్రతిపత్తి ఏముంది?
- భక్తిని శాంతములో అంతర్భవించడం తగదు. ఎందుకంటే శాంతానికి నిర్వేదం ప్రధానం. భక్తిలో నిర్వేదం ఉండవలసిన అవసరం లేదు. ఆత్మనివేదన ఉంటే చాలు.
- భక్తికి స్థాయి యయిన రతికి స్థాయిత్వము పొందడం కుదరదేమోనన్న అనుమానమూ అవసరం లేదు. క్రోధ, జుగుప్స, విస్మయ, భయ, శమముల కున్నపాటి స్థాయిత్వము దానికి లేకపోలేదు. నిజానికి వాటికన్నా మించిన స్థాయిత్వమే భక్తికి సంభవించే అవకాశం ఉంది.
- అంతేకాదు, భక్తికి విభావ అనుభావ సంచారిభావాలు కూడా స్పష్టంగా ఉన్నాయి.
ఇలాంటి విషయాలన్నీ చెప్పి చివరికి “కాగా ఇట్లు విభావానుభావ వ్యభిచారి పుష్టత్వము, స్థాయిత్వము, అన్యరసములలో చేరకుండుట, ఇతర రసముల కన్న వైలక్షణ్యమును కల్గియుండుట, వలసినచో నితరములే ఇందంతర్భవించుట అను నీ కారణముల వలన భక్తికి రసత్వము నంగీకరించుటలో విప్రతిపత్తి లేదు” అని స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలియచేశారు (పుట 181,182).
అంతే కాదు, తెలుగు కవుల రసదృష్టి అనే అధ్యాయంలో కూడా అద్భుత రసాన్ని వివరిస్తున్నపుడు శ్రీనాథ పోతనల గురించి చెప్తూ “ఇరువురి కవితలను భక్తి శృంగారములు ప్రధానములయి అద్భుతము దానికంగమగును” అంటారు. అలాగే శాంత రసాన్ని వివరించేటపుడు ఆంధ్ర సాహిత్యంలో భక్తిప్రధానమయిన కావ్యాలు చాలా ఉన్నాయనీ భక్తిని రసమని అంగీకరించిన పక్షమున వాటిని భక్తిరస ప్రధానమని అనవచ్చునని లేకుంటే శాంతరసప్రధానమని అనవచ్చునని అంటారు.
3.1.32 కాకర్ల వెంకట రామనరసింహం
నరసింహం గారు సాహిత్య దర్శనము అనే గ్రంథాన్ని రచించారు. అందులో వారు రససిద్ధాంతము అనే అధ్యాయంలో రససంఖ్యను గూర్చి చాలా వివరంగా వ్రాశారు. భరతుడితో మొదలుపెట్టి జగన్నాథుడి వరకూ రససంఖ్యను గూర్చి వచ్చిన వివిధ ప్రతిపాదనలను వివరించారు. భక్తిరసమును గురించి రూపగోస్వామి, మధుసూదన సరస్వతి చేసిన ప్రతిపాదనలనే కాక బోపదేవుని అభిప్రాయాన్నీ ప్రస్తావించారు. భక్తిరసమును గురించి మధుసూదన సరస్వతి చెప్పిన విషయాలను చాలా వివరంగా పేర్కొన్నారు.
ఆ తర్వాత భక్తిరసము గురించి అభినవగుప్తుడు, హేమచంద్రుడు, జగన్నాథుడు, మొదలైన ఆలంకారికులు ఏమన్నారో తెలియచేశారు. జగన్నాథుడి మాటలను చెప్పాక “జగన్నాథుఁడు మొదట భక్తి వంక మ్రొగ్గియు, తుదకు జారవిడిచినాఁడు. హేతువాదపూర్వకముగ, తాను వేసికొనిన ప్రశ్నలకు తానే సమాధానము చెప్పలేక, భరతు నాశ్రయించినాఁడు” అని ఆక్షేపణగా పలికారు.
“ఏమైననేమి? భక్తిని రసముగా ఆలంకారికు లనేకు లంగీకరింపలేదు. వాఙ్మయమున మాత్రము, భక్తి స్నేహ వాత్సల్యాదులు బహుధా పోషింపఁబడి యున్నవి. వానివలన రసానందము కలుగుచున్నది. ఇందులకు సహృదయులే ప్రమాణము” అని చివరికి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు (పుట 196).
3.1.33 డా. ముదిగంటి సుజాతారెడ్డి
“మను, వసు చరిత్రల తులనాత్మక పరిశీలనము” అన్న తమ గ్రంథంలో సుజాతా రెడ్డి గారు భక్తిరస ప్రస్తావన చేశారు. కేవలం ప్రస్తావించడం కాదు, రసపోషణము అన్న అధ్యాయంలో శృంగారాది నవరసములతో పాటు భక్తిని కూడా చేర్చి, మను వసు చరిత్రలలో దశ రసముల నిర్వహణనూ పరిశీలించారు.
3.1.34 అద్దేపల్లి రామ్మోహన రావు
అద్దేపల్లి రామ్మోహన రావు గారు “శ్రీశ్రీ కవితా ప్రస్థానం” అనే పుస్తకంలో శ్రీశ్రీ కవిత్వాన్ని ఆలంకారిక సిద్ధాంతాల ఆధారంగా పరిశీలించారు. అందులో వారు “శ్రీశ్రీ మహాప్రస్థానం వీర కరుణ రసాల జంట ప్రవాహం” అంటారు. రససంఖ్యను గురించిన, భక్తిని గురించిన ప్రస్తావనలు ఈ పుస్తకం పరిధిలోకి రావు కానీ, రెండు చోట్ల భక్తిరసము అన్న మాటను రామ్మోహనరావుగారు వాడారు.
“శ్రీశ్రీ – ఆవేశం” అనే వ్యాసంలో ఆవేశమంటే ఏమిటి అని ప్రశ్నించి “ఒకానొక భావాన్ని తీవ్రమైన దశల్లో అనుభవించగల మూలభూతచైతన్యం” అని సమాధానం చెప్తారు. ఆతర్వాత, “ఈ ఆవేశం అన్ని రసాలకీ సంబంధించిందే ఐనా భక్తి రౌద్ర వీర రసాల్లో దీనికి స్ఫుటత్వం ఎక్కువ” అంటారు (పుట 41). అదే వ్యాసంలో మరొక చోట “నాచన సోమనలో వీరరసమూ, పోతనలో భక్తిరసమూ, తీవ్ర దశల్లో ఎన్ని విచిత్ర రచనా శిల్పాల్ని నిర్మించిందో, వారి కవిత ననుభవించిన వారికి వివరించ పనిలేదు” అంటారు (పుట 43).
ఇంతవరకు విమర్శకుల గ్రంథాలలోని అభిప్రాయాలను పరిశీలించాము. ఇపుడు కొన్ని వ్యాససంకలనాలలో లభిస్తున్న అభిప్రాయాలను చూద్దాము.
3.1.35 భాగవత వైజయంతిక
ఇది శ్రీ జంథ్యాల పాపయ్యశాస్త్రి (కరుణశ్రీ) గారి సంపాదకత్వంలో ప్రచురించబడిన వ్యాస సముచ్చయం. ముందుగా ఈ గ్రంథంలోని అనుబంధాలను పరిశీలిస్తే, “భాగవతంలో ఉన్నది భక్తిరసము” అనేమాటని పలువురు పెద్దలు చెప్పడం కనిపిస్తుంది.
శ్రీ కురుగంటి సీతారామయ్య గారు పోతన భాగవతములో భక్తిరసము అంగిరసమనీ శృంగారము అంగరసమనీ చెప్పారు. ఆనుముల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు “భక్తిరస ప్రధానమయిన భాగవతము” అన్నారు. డా. పల్లా దుర్గయ్య గారు పోతన మహాకవి భాగవతాన్ని భక్తిరసఘటికగా నాంధ్రీకరించారని అన్నారు. భక్తిరస పారావారమున నోలలాడునట్లు ఆంధ్రభాగవత ప్రబంధమును రచించిన పూతచరిత్రునిగా పోతనను కీర్తించారు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు. “..నీవలె నొకండును భక్తిరసామృత ప్రవాహమ్ముల కేతమెత్తిన మహాకవి యేడి తెలుంగు గడ్డపై?” అన్నారు కరుణశ్రీ.
ఇక ప్రధాన వ్యాసాలలోకి దృష్టి సారిస్తే, ప్రసిద్ధులైన సాహితీవేత్తలెందరో స్పష్టంగా భక్తిని రసమని పేర్కొనడం కనిపిస్తుంది. పోతనామాత్యుని కవితాశిల్పం అనే వ్యాసంలో దాశరథిగారు సూటిగా “భాగవతంలో భక్తి అంగిరసం. శృంగార వీర కరుణాదులు అంగరసాలు” అన్నారు. అంతేకాదు, ఈ వ్యాసంలో దాశరథిగారు భక్తిరసానికి ఉదాహరణగా దశమస్కంధంలోని “ఈ చరణంబులే ఇందు నిభానన! సనకాది మునియోగ సరణినొప్పు” అన్న పద్యాన్ని ఇవ్వడాన్ని బట్టీ శాంతరసానికి ఉదాహరణగా ప్రథమ స్కంధంలోని ద్రౌపది పద్యాలను ఉదాహరించడాన్ని బట్టీ పరోక్షంగా శాంత భక్తి రసాల భిన్నత్వాన్ని ప్రస్తావించారని అనుకోవచ్చు.
“ఆద్యంతము భగవద్భక్తి తత్వ ప్రతిపాదకమై భక్తిరస సిద్ధాంతమున కాలంబనమై ప్రామాణికమైనది శ్రీమహాభాగవతము” అన్నారు నిడదవోలు వెంకటరావుగారు. పోతనని భక్తిరస సిద్ధుడైన మహనీయుడనీ, భక్తిరసావిష్కరణానుభవానికి అవసరమైన ఆంధ్రభాష పోతనకు వశ్యమైనదనీ పేర్కొన్నారు ఆంధ్ర భాగవత వైశిష్ట్యము అనే తమ వ్యాసంలో. ఇదే వ్యాసంలో మరి రెండు మూడు చోట్ల కూడా వెంకటరావుగారు భక్తిరసము అనేమాటని ప్రయోగించారు.
“బమ్మెరవారి కమ్మతెమ్మెరలు” అనే వ్యాసం ప్రారంభంలో చెలమచెర్ల రంగాచార్యులు గారు “శాంతరస ప్రధానమైన భాగవతము” అన్నప్పటికీ, వ్యాసాన్ని ముగిస్తూ “భక్తిని రసముగా అంగీకరించినచో ఆ భక్తిరసమే ఇందు ఆమూలాగ్రము విస్తరిల్లి రాజ్యమేలుచున్నదనవచ్చును” అన్నారు. అంతే కాదు, అదే వ్యాసంలో మరొక చోట భాగవతంలో పోతనగారు శృంగార రసాన్ని చక్కగా పోషించారని చెప్తూ, “ఒక్కొకచో శృంగారమును భక్తికి అంగముగా తీర్చి దానికి పావనత్వమును సంపాదించును” అన్నారు.
దీనిని బట్టి అలంకార శాస్త్రరీత్యా భక్తి రసముగా అంగీకరించబడనందువలన మాత్రమే ఆయన శాంతరస ప్రధానమనే మాట వాడారనీ, లేదంటే రంగాచార్యులుగారు భక్తిని రసముగా అంగీకరించారనీ అది భాగవతంలో అంగిగా ఉందని భావించారనీ తెలుస్తోంది.
శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు “పోతన-శృంగార రస పోషణము” అనే శీర్షికతో వ్రాసిన వ్యాసంలో భాగవతంలో పోతన శృంగారరసాన్ని ఎలా పోషించాడో చెప్పి చివరకు “భక్తిరసమును ఎంత బాగుగా పోషించినాడో శృంగార రసమును అంత సమర్థతతోనే పోతన చిత్రించినాడని చెప్పుటకు భాగవతమున ఎన్నియైనను చూపించవచ్చును” అంటారు. ఈవాక్యంలో భక్తిరసమునే ముందు చెప్పి, పోతన దానినెంత బాగా పోషించాడో అంతే బాగా శృంగారాన్నీ పోషించాడని చెప్పడంలో భక్తిని రసమని పేర్కొనడమే కాక భాగవతంలో దాని ప్రాధాన్యాన్ని గుర్తించడమూ కనిపిస్తుంది.
శ్రీవానమామలై వరదాచార్యులు గారు పోతన-శ్రీనాథుడు అనే వ్యాసంలో “శ్రీనాథుని రచనలలో శృంగారము ప్రధానముగా నుండును. పోతన కృతులలో భక్తి ప్రధానమైన రసము” అన్నారు. ఇదేవ్యాసంలో మరొకచోట “భక్తిశృంగారరసములీతని సొమ్ములు” అంటారు.
భాగవతము-రసపోషణము అనే వ్యాసంలో శ్రీ సేపూరి లక్ష్మీ నరసయ్య గారు “ముఖ్యముగ పోతన భక్తిరసమును కరుణ రసమును పోషించెను. శృంగారమును సరసముగ రమణీయముగ నిర్వహించెను. భక్తిరసమున నాంధ్ర వాఙ్మయమున ప్రధానపీఠము పోతరాజుదే” అన్నారు.
భాగవత భక్తి – ప్రహ్లాదుడు అనే వ్యాసంలో శ్రీ ఖండవిల్లి సూర్యనారాయణ శాస్త్రి గారు మధుసూదన సరస్వతి తన గ్రంథంలో భక్తికి సాంగముగా రసత్వమును జూపినాడని చెప్పి, సప్తమ స్కంధంలోని “వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై యొక్కఁడు నేడుచు నొక్కచోట” అన్న పద్యాన్ని ఉదాహరణగా తీసుకుని, అందులో భక్తిరస నిష్పత్తికి అవసరమైన విభావానుభావాలు, సాత్విక భావాలు, సంచారిభావాలు ఎలా ఉన్నాయో వివరించారు. “ఉక్తరీతిగా పై పద్యములోని భక్తిరసము విభావానుభావ సాత్విక సంచారి భావములతో స్వాదుత్వము గాంచి ‘ఒక్కచోట నిలచి యూరకుండుట’ (శాంతి) అను నేకాకార వృత్తి రూపమైన స్థాయిభావముతో పరిపుష్టమై సంపూర్ణ రసరూపము గాంచినది” అన్నారు.
3.1.36 ఆంధ్ర మహాభాగవతోపన్యాసములు
ఆంధ్రసారస్వత పరిషత్తువారు ప్రచురించిన ఈ పుస్తకంలో మనకు కొన్ని విలువైన అభిప్రాయాలు లభిస్తాయి. ఈ సంకలనంలో శ్రీ కురుగంటి సీతారామయ్య గారు రచించిన “సంస్కృత భాగవతము పోతన అనువాద విధానము” అనే వ్యాసము ఉంది. ఆ వ్యాసం ప్రారంభంలో వారు శ్రీమద్భాగవతము సాహిత్య శాస్త్రమున గొప్ప విప్లవమును తెచ్చిపెట్టెను అంటూ రూపగోస్వామి తన గ్రంథాలలో భక్తిరసమునకు విభావాదులను సమన్వయించి స్థిరీకరించిన విషయాన్ని తెలియచేస్తారు (పుట 25). తర్వాత దశమస్కంధంలోని అనువాద విధానాన్ని గురించిన వివరణ మొదలుపెడుతూ “కృష్ణ జనన ఘట్టమునందలి సీసపద్యాదులు భక్తిరసపూరితములు” అంటారు (పుట 68). ఆపైన గోపికలు కృష్ణుని వెదికే ఘట్టాన్ని గురించీ గోపికాగీతల గురించీ చెప్తూ “భక్తిరసమీ ఘట్టమున వెల్లివిరిసినది” అన్నారు (పుట 77). చివరగా వ్యాసాన్ని ముగిస్తూ “పోతన భాగవతమున వ్రాసినంత శృంగార రసము నెవ్వరును రచియింప లేదు. కాని యావద్గ్రంథమును పఠించిన తరువాత పర్యవసించునది భక్తిరసము. శృంగారము అంగరసము. భక్తి యంగి” అని తేల్చి చెప్పారు (పుట 94).
పైన చెప్పుకున్న “భాగవత వైజయంతిక” లో శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారి వ్యాసం ఒకటి ఉంది. అందులో వారు పోతన గారి గురించి చెప్తూ “ఆయన రచించిన మహాభాగవతము తెలుగులోని కవతరించుటతో తెలుగువారి హృదయసీమల భక్తిరస ధునులు పొంగులెత్తినవను విషయము తెలియును” (పుట 19) అన్నారు. “పోతన వంశము కాలము కృతులు” అన్న ఆ వ్యాసాన్ని కొన్ని మార్పులతో “పోతన చరిత్ర-స్థల కాలములు” అన్న శీర్షికతో ఈ సంకలనంలో (ఆంధ్రమహాభాగవతోపన్యాసములులో) కూడా ప్రచురించారు. ఇక్కడ వ్యాసం మొదట్లో చేర్చబడిన క్రొత్త వాక్యాలలో “భాగవతమునకు ప్రశస్తి వచ్చినది పోతనామాత్యుని మధుర భక్తిరస పరిప్లుత రచనము వలననే”( పుట 5) అన్న అభిప్రాయం కనిపిస్తుంది.
అలాగే ఈ సంకలనంలో వేదాల తిరువెంగళాచార్యులు గారు రచించిన “వాసుదేవ తత్త్వము – అవతారములు- భాగవత వైష్ణవము” అనే వ్యాసంలో “భక్తిరస ప్రవాహ మా మహనీయుని కవితాధారగా స్రవంతిగా బ్రవహించినది” (పుట 335) అన్న వాక్యం ఉంది. ఇక్కడ కూడా భక్తిరసము అన్న మాటని అలంకారిక పరిభాషకు చెందిన అర్థంలో వాడారా లేక మామూలుగా వ్యావహారిక ధోరణిలో వాడారా అన్న సందేహం కలగవచ్చు. కానీ ఆలోచిస్తే, అలంకార శాస్త్ర విషయాలు, భక్తిరసాన్ని గురించిన వివాదాలు స్పష్టంగా తెలిసిన పెద్దలు అనాలోచితంగా ఒక పదాన్ని వాడే అవకాశం లేదనీ, ఒకవేళ వారు భక్తిని రసముగా భావించి ఉండకపోతే ఆ పదాన్ని వాడి ఉండరనీ, కాబట్టి మల్లంపల్లి సోమశేఖరశర్మ గారి దృష్టిలోనూ వేదాల తిరువెంగళాచార్యులు గారి దృష్టిలోనూ “భక్తి” రసమే అయి ఉండాలనీ అనిపిస్తుంది.
3.1.37 పోతన సాహిత్యగోష్టి
ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి సంపాదకత్వంలో ప్రచురించబడిన “పోతన సాహిత్యగోష్టి” అనే వ్యాస సంకలనంలో నుండి కూడా కొన్ని అభిప్రాయాలను చూద్దాము.
“పోతన భాగవతానువాదము” అనే వ్యాసంలో శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు “భాగవతము భక్తి రసబంధురమైన మహాపురాణము. ..అట్టి భక్తి ప్రధానమగు భాగవతమును “పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండఁట” అని భక్తిరసావశిష్టుడగు పోతన ఆంధ్రీకరించుటలో పెక్కు సందర్భములందుఁ బెంపుదల ప్రస్ఫుటమగుచున్నది” అంటారు. “పోతన-రచనాశిల్పం” అనే వ్యాసంలో కోలవెన్ను మలయవాసినిగారు “భక్తి రసామృతం భాగవతం. పోతన భాగవతోత్తముడు. భక్తిరస పోషణలో పోతన శిల్పం అందరికీ తెలిసినదే” అంటారు.
ఈ సంకలనానికి సంపాదకత్వం వహించిన కొర్లపాటి శ్రీరామమూర్తిగారు తన వ్యాసంలో కానీ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో కానీ భక్తిరస ప్రస్తావన చేయలేదు కానీ, సురవరం పుష్పలత గారి మధుర భక్తి – ముగ్ధభక్తి అనే సిద్ధాంత గ్రంథానికి వ్రాసిన ముందుమాటలో వారు భక్తిరసాన్ని గూర్చి ప్రస్తావించడం కనిపిస్తుంది. అక్కడ వారు “భక్తి రసం కాదని ఆలంకారిక సిద్ధాంతాలున్నట్లే రసమగునని ఆలంకారిక సిద్ధాంతములును కలవు. కాదన్న సిద్ధాంతములకు గల ప్రసిద్ధి అగునన్న సిద్ధాంతములకు అంతగా లేదు. కారణము భక్తి రసమని ప్రతిపాదించిన అలంకార శాస్త్రములు అర్వాచీన గ్రంథములగుట కావచ్చును” అంటారు.
3.2 సారాంశము
భక్తిరస ప్రస్తావన కొరకు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయిన విమర్శకులందరి రచనలనూ దాదాపుగా పరిశీలించాను. భక్తిరసము గురించి కాని రససంఖ్యను గురించి కాని ప్రత్యేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారందరినీ పైన పేర్కొన్నాను. ప్రసిద్ధులైన మరెందరో అధునిక విమర్శకుల రచనలను సైతం పరిశీలించినప్పటికీ రససంఖ్యను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనందు వలన వారిని ఇక్కడ పేర్కొనలేదు.
ఉదాహరణకు ప్రసిద్ధ విమర్శకులు కోరాడ రామకృష్ణయ్య గారు తమ సారస్వత వ్యాసాలలో రససంఖ్య గురించిన ప్రస్తావన ఏమీ చేయలేదు. “ఆంధ్ర భారత కవితా విమర్శనము” లో తిక్కన రసపోషణరీతులని వివరించేటపుడు శృంగార, వీర, హాస్య, రౌద్ర, భయానక, అద్భుత, శోక రసములు ఏడింటిని తిక్కన ఎలా పోషించాడో ఉదాహరణలతో చెప్పారు. ఆ సందర్భంలో కూడా రససంఖ్యను గురించి కాని భక్తిని గురించి కాని ప్రస్తావించలేదు. అయితే అక్కడ రామకృష్ణయ్య గారు అందరూ అంగీకరించిన బీభత్స శాంత రసములను కూడా పేర్కొనలేదు. కాబట్టి వారు భక్తిని పేర్కొనకపోవడం భక్తిని రసముగా భావించక పోవడం వలన అయినా కావచ్చు లేక భారతంలో ఆ రసపోషణ లేదని భావించడం వలన అయినా కావచ్చు.
సంజీవదేవ్ వ్యాససంకలనం కాంతిమయిలోని రసచర్చ, రసతత్త్వం అనే రెండు వ్యాసాలలో రసానుభూతికి సంబంధించిన ప్రాచ్య పాశ్చాత్య భావాలను గురించి వివరించినా రససంఖ్య గురించి కొత్తగా ఏమీ చెప్పలేదు. రెండు వ్యాసాలలోను కూడా ఆలంకారికులు రససంఖ్యను తొమ్మిదిగా నిర్ణయించారన్న మాటను మాత్రమే చెప్పారు.
అలాగే మార్క్సిస్టు దృక్పథంతో అలంకారశాస్త్ర విషయాలను పరిశీలిస్తూ జి.వి.కృష్ణారావుగారు రచించిన కావ్యజగత్తులో కూడా రససంఖ్యను గురించి నూతన అభిప్రాయాలేమీ లభ్యమవలేదు.
తెలుగులో తొలితరం విమర్శకులు తమ విమర్శలలో అలంకార శాస్త్ర సిద్ధాంతాలను సూత్రాలను ఎక్కువగా ఉపయోగించారు. తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యంలో విభిన్న విమర్శ రీతులు ప్రవేశించాక, అలంకార శాస్త్రం ఆధారంగా చేసిన విమర్శ క్రమంగా తగ్గడమూ, ప్రాచీన సాహిత్యంపై చేసిన విమర్శలలో కూడా అలంకార శాస్త్ర సిద్ధాంతాలకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకుండా నూతనమైన దృక్పథాలతో పరిశీలించడమూ కనిపిస్తుంది. ఉదాహరణకు ఆర్. ఎస్. సుదర్శనం గారు మనుచరిత్రపై చేసిన విమర్శలో రసపోషణను కాక మనుచరిత్ర కావ్యరచనలో వ్యక్తమయే రచయిత దృక్పథాన్నే ప్రధానంగా చర్చించారు. కాత్యాయనిగారు ప్రాచీన సాహిత్యాన్నీ అలంకారశాస్త్రాన్నీ కూడా స్త్రీవాద కోణం నుంచి పరిశీలించారు.
ఈ విధంగా వివిధ గ్రంథాలనుండి వ్యాసాల నుండి యాభై మందికి పైగా ఆధునిక విమర్శకుల అభిప్రాయాలను పరిశీలించినపుడు గమనించిన ముఖ్యాంశాలను ఇపుడు చెప్పుకుందాము.
- విమర్శకులందరూ దాదాపుగా – అటు శాస్త్రపరంగా కావచ్చు ఇటు అనుభూతిపరంగా కావచ్చు ఏదో ఒక కోణం నుంచి – భక్తిని రసముగానే పరిగణించారు. అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వంటి ఒకరిద్దరు భక్తిని రసముగా పేర్కొనకపోయినా వ్యతిరేకమైన వాదనలు కూడా చేయలేదు. స్పష్టముగా భక్తికి రసత్వాన్ని నిరాకరించినవారు ఇద్దరే – విశ్వనాథ సత్యనారాయణగారు, తుమ్మపూడి కోటీశ్వరరావు గారు.
- భక్తిరసాన్ని గురించి లోతుగా ఆలోచించిన, చర్చించిన సంపత్కుమారాచార్య, ధూళిపాళ శ్రీరామమూర్తి, తిప్పాభట్ల రామకృష్ణమూర్తి వంటివారు భక్తిని రసముగా పరిగణించడంపై ఉన్న అభ్యంతరాలన్నిటికీ తార్కికమైన సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా సంపత్కుమార భక్తి విషయమైన రస-భావ భావన కావ్య శాస్త్రారంభం నుంచే ఆరంభమయిందన్న విషయాన్ని నిరూపించారు. భక్తికీ శృంగారానికీ ఉన్న భేదాన్ని వివరించారు. అటు జగన్నాథుని వంటి ఆలంకారికుల అభ్యంతరాలలోనూ ఇటు విశ్వనాథ వంటి ఆధునిక విమర్శకుల అభ్యంతరాలలోనూ ఉన్న అసమంజసత్వాన్ని ఎత్తి చూపారు. భక్తిని రసముగా పేర్కొనడమే కాక మిగిలిన రసములకన్నా భక్తిరసము ఎందుకు విశిష్టమో కూడా వివరించి చెప్పారు.
- సంపత్కుమార గారు భక్తిరస విషయమై జగన్నాథ పండితరాయలు చేసిన చర్చ గురించి మాట్లాడుతూ “జగన్నాథుడు భరత-అభినవగుప్తుల మీద గౌరవంతో భక్తిని రసంగా నిరాకరించాడు గాని ఆయన ఆలోచనలో, వివేచనలో ఏమూలో భక్తి రసమేనన్న భావన దోబూచులాడుతున్నట్లు కనబడుతుంది. ఇందుకు ఆయన భక్తి విషయంగా చేసిన వివేచన, నిరాకరణలే సాక్ష్యం” అన్నారని ఈ అధ్యాయంలో చెప్పుకున్నాం.
- ఇది ఒక్క జగన్నాథ పండితరాయలకే కాక చాలామంది ఆధునిక విమర్శకులకీ వర్తిస్తుంది. కట్టమంచి, రూపనగుడి వంటివారు మామూలుగా రససంఖ్యను పేర్కొనవలసి వచ్చినపుడు వ్యవహారాన్ని బట్టి నవరసాలు అనడమూ, భక్తిని గూర్చి మాట్లాడుతున్నపుడు భక్తిరసం అని అనడమూ ఈ అధ్యాయంలో గమనించాము.
- భక్తిరసముపై వచ్చిన అభ్యంతరాల విషయానికి వస్తే, తుమ్మపూడి కోటీశ్వరరావు గారి అభ్యంతరాలలో అసలేమాత్రమూ సామంజస్యము కనిపించలేదు. భక్తికి ప్రత్యేక పురుషార్థం లేదు కనుకా, అనుభవ దృష్ట్యా ప్రత్యేకత లేదు కనుకా దానిని ప్రత్యేక రసంగా పరిగణించనవసరం లేదన్న వ్యాఖ్యలలోని అసమంజసత్వాన్ని పైన చర్చించాము. అలాగే వ్యక్తీకరణలో భక్తికీ శృంగారానికీ భేదం లేదన్న వ్యాఖ్య కూడా అంగీకారయోగ్యం కాదన్న విషయం స్థూల పరిశీలనతోనే – అంటే ప్రహ్లాద చరిత్రము గజేంద్ర మోక్షణము వంటి భాగవత కథలను, శ్రీకాళహస్తి మాహాత్మ్యం వంటి కావ్యాల లోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకోవడంతోనే – అర్థమవుతుంది.
భక్తికీ శృంగారానికీ వ్యక్తీకరణలో భేదం లేదన్న వ్యాఖ్య సత్యం కాదని అర్థం చేసుకోవడానికి ఎక్కువ పరిశీలన అవసరం లేదు. అయితే భేదం ఉంది అన్న అంశాన్ని నిర్ధారించుకోవడానికి – భక్తిరస పోషణ శృంగారాది రసముల పోషణ కన్నా భిన్నమన్న విషయాన్ని రూఢి చేసుకోవడానికి – సూక్ష్మ పరిశీలన అవసరం. అది తరువాతి అధ్యాయాలలో చేయబడుతుంది.
- భక్తిని రసముగా అంగీకరించని మరొక విమర్శకులు విశ్వనాథ. వారి వివరణలో కూడా ఔచిత్యం కనిపించలేదు. వారి విశ్లేషణ అంతా కావ్యపాఠకులు భక్తులు అన్న దృష్టితో సాగింది. ఆ ధోరణిలో ఆలోచించడం సరి కాదన్న విషయము పైన వివరించబడింది. అయితే భక్తి అనేది రత్యాదులలాగా సర్వజీవులలో ఉండే సామాన్యలక్షణం కాదన్న అభిప్రాయం విశ్వనాథకు ఉన్నట్లు కనిపిస్తుంది కనుక ఆ విషయాన్నీ, ఆ కారణంగా భక్తికి రసత్వాన్ని నిరాకరించవలసి ఉంటుందా అన్న అంశాన్నీ పరిశీలించవలసి ఉంది.
(సశేషం)
శ్రీ వల్లీ రాధిక చక్కని కథా రచయిత్రి. లోతైన తాత్వికతకు నిత్య జీవితంలోని సంఘటనల ద్వారా సరళంగా ప్రదర్శిస్తారు. ‘తక్కువేమి మనకూ’, ‘స్వయం ప్రకాశం’, ‘హేలగా… ఆనంద డోలగా..’ వీరి పేరుపొందిన కథల సంపుటాలు.
