[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]
ఉపోద్ఘాతము
తెలుగు ఎం.ఎ. చదువుతున్నపుడు అలంకారశాస్త్రాధ్యయనంలో భాగంగా రస సిద్ధాంతాన్ని గురించి సంస్కృతాలంకారికులు వ్యక్తం చేసిన వివిధములైన అభిప్రాయాలను తెలుసుకున్నాను. మధుసూదన సరస్వతి, రూపగోస్వామి అనే వారు భక్తిని రసముగా ప్రతిపాదించారనీ, కానీ ఆ ప్రతిపాదనను అందరూ అంగీకరించలేదనీ చదువుకున్నాను. అక్కడ ఆ విషయం చాలా క్లుప్తంగా మాత్రమే చెప్పబడడం వలన, భక్తిరస ప్రతిపాదన అందరికీ ఆమోదయోగ్యం కాకపోవడానికి కారణమేమిటో, భక్తిని రసముగా అంగీకరించడానికి ఇతర ఆలంకారికులు చెప్పిన అభ్యంతరాలేమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో మమ్మటుడు రచించిన కావ్యప్రకాశం, జగన్నాథ పండితరాయలు రచించిన రసగంగాధరం చదివాను. అయితే నాకు అక్కడ స్పష్టమైన ఖండన ఏమీ లభించలేదు. ముఖ్యంగా ఇతర విషయాలను సునిశితంగా సూక్ష్మంగా విశ్లేషించి, తనకు అసంబద్ధం అనిపించిన పూర్వాలంకారికుల అభిప్రాయాలను నిస్సంకోచంగా ఖండించిన జగన్నాథ పండితరాయలు భక్తిరసం విషయంలో మాత్రం భరతుని అభిప్రాయాన్ని అనుసరించడమే మంచిదన్న సూచనతో చర్చను తేల్చివేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
మరొకవైపున భక్తికావ్య పఠనం వలన పాఠకులకు కలిగే ఆనందాన్ని గమనించినపుడు, అది మిగిలిన కావ్యముల పఠనం కంటే భిన్నమన్న విషయాన్ని స్వానుభవం ద్వారానూ ఇతరులను పరిశీలించడం ద్వారానూ కూడా గ్రహించినపుడు ఈ విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని అనిపించింది.
అలంకార శాస్త్రాన్ని పాఠ్యాంశాలలో భాగంగా బోధించేటపుడు రససంఖ్యను తొమ్మిదిగా పేర్కొనడమూ, భక్తిని రసముగా పరిగణించక పోవడమూ జరుగుతోంది. కానీ కావ్యవిశ్లేషణలలో మాత్రం భక్తిరస ప్రస్తావన కనిపిస్తూనే ఉంది. సాధారణ పాఠకులే కాదు అలంకారశాస్త్రంతో పరిచయం ఉన్న విమర్శకులు, పండితులు కూడా నేటికీ భక్తిని రసముగా ప్రస్తావించడం సమాంతరంగా సాగుతూనే ఉంది.
కనుక ఒక సమగ్ర అధ్యయనం ద్వారా ఈ వైరుధ్యానికి కారణాన్ని అన్వేషించాలని, కావ్యరచనలో భక్తిరసానికి ఉన్న స్థానాన్ని పరిశీలించాలని, అర్థం చేసుకోవాలని అనుకుని ఈ పరిశోధనాంశాన్ని ఎన్నుకున్నాను.
అధ్యాయం 0
భక్తిరస నేపథ్యము
0.1 పరిశోధనాంశ పరిచయము
భక్తిని కొందరు ఆలంకారికులు రసముగా ప్రతిపాదించారనీ, కానీ దానిని అందరూ అంగీకరించలేదనీ పాఠ్యపుస్తకాలలో చదివినపుడు, అందుకు కారణమేమిటి? అన్న సందేహము, కుతూహలము కలిగాయి. ఆ కుతూహలంతో ఈ పరిశోధన ప్రారంభమయింది.
అయితే పాఠ్యపుస్తకాలలో చెప్పినది సంస్కృతాలంకారికుల విషయం. సంస్కృత సాహిత్యాన్ని బట్టి వారు వ్యక్తం చేసిన అభిప్రాయం. మరి తెలుగు విషయమేమిటి? తెలుగు సాహిత్యానికి సంబంధించి భక్తిరసానికి ఉన్న స్థానం ఏమిటి? అన్న ప్రశ్నతో నేను నా అధ్యయనం మొదలుపెట్టాను. తెలుగులో రససిద్ధాంతంపై వచ్చిన ప్రసిద్ధమైన పుస్తకాలు ఏవో తెలుసుకుని చదవడం మొదలుపెట్టాను. ఆచార్య నగేంద్ర గారి రససిద్ధాంతం, జి.వి. సుబ్రహ్మణ్యం గారి రసోల్లాసం వంటి కొన్ని పుస్తకాలు చదివినపుడు దేశి సాహిత్యంలో, అంటే ఆధునిక భారతీయ భాషల సాహిత్యంలో ఈ విషయంపై జరిగిన చర్చలు కొంతవరకూ పరిచయమైనాయి.
దేశి సాహిత్యంలో భక్తికావ్యాలు విస్తారంగా వచ్చాయనీ, సంస్కృతం విషయం ఎలా ఉన్నా దేశి సాహిత్యానికి సంబంధించినంతవరకూ భక్తిని రసముగానే పరిగణించవలసి వస్తుందనీ రససిద్ధాంతంపై లోతుగా పరిశోధించిన ఆచార్య నగేంద్ర అభిప్రాయపడ్డారు.
“భక్తిమూలకమయిన రసశాస్త్ర పరికల్పనకు చాలమటుకు భారతీయ భాషల్లోని కావ్యమే ఆధారం. ఈ ప్రవృత్తికి మూలాధారాలయిన గ్రంథాలు సంస్కృతంలో వ్రాయబడిన ఉజ్జ్వల నీలమణి, భక్తిరసామృతసింధువు అయినప్పటికీ ఈ నూతన భక్తి రస శాస్త్రానికి ఆధారం సంస్కృత కావ్యం కాదు. భారతీయ భాషల్లో విస్తారంగా వ్రాయబడ్డ భక్తికావ్యమే” అంటారు వారు (రససిద్ధాంతం పుట 78). సంస్కృతంలో కంటే దేశభాషా వాఙ్మయంలో రససిద్ధాంతం పూర్తిగా ప్రతిష్ఠించబడిందనీ, అందుకు కారణం భక్తకవులేననీ అంటారు. సంస్కృతంలో రసానికి ప్రాధాన్యం లభించినా సంస్కృత కావ్యశాస్త్రానికి ప్రాతినిధ్యం వహించే సిద్ధాంతం ధ్వని సిద్ధాంతమేననీ, “భారతీయ వాఙ్మయంలో రసధ్వని ఆవరణను తొలగించి, శుద్ధ రస సిద్ధాంతాన్ని సుప్రతిష్ఠం చేసిన గౌరవం ఈ భక్తకవులదే” ననీ వ్యాఖ్యానిస్తారు.
హిందీలో సూరదాసు, నందదాసు, ధృవదాసు మొదలైనవారి రచనలు, వంగదేశంలో కృష్ణదాస్ బాబాజీ రచించిన భక్తమాల్, బృందావనదాసు రచించిన చైతన్యభాగవతం, గుజరాత్‌లో దయారాం రచించిన రసికవల్లభ్ వంటి వాటిని ఆయన ఈ సందర్భంలో పేర్కొన్నారు.
మరొకవైపున దక్షిణాది సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ జి.వి. సుబ్రహ్మణ్యంగారు కూడా ఇదే విధమైన వ్యాఖ్య చేస్తారు. “భరతనాట్య సంప్రదాయం ప్రకారం అష్టవిధ రసాలు ప్రసిద్ధి. నవమరసమైన శాంతం మీద వాదోపవాదాలున్నాయి. దక్షిణాది నుండి ప్రసిద్ధి చెందిన మరొక సంప్రదాయం ఉంది. దాన్ని దేశిగా పేర్కొంటాం. తమిళ సాహిత్యంలో దాని ప్రాచీన ప్రాతిపదికలు, వికాసదశలు గోచరిస్తున్నాయి. దేశి సంప్రదాయంలో భక్తిరసం, వత్సలం, సఖ్యం, దాస్యం, శాంతం మొదలైన భావాలు కూడా రసస్థాయిని పొందుతాయి. శృంగారాన్ని తనలో సమన్వయించుకొన్న భక్తి మధురభక్తిగా, రసరాజంగా పరిగణింపబడుతుంది” అని వారు ‘భక్తిరసవాదం దేశీయం’ అనే వ్యాసంలో వివరిస్తారు (కొలమానం పుట 32).
ఆ వ్యాసంలో జి.వి.ఎస్. ఆచార్య నగేంద్ర గురించి కూడా ప్రస్తావిస్తారు. క్రీ.శ. 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు దక్షిణాది భాషలలో భక్తిరస కావ్యప్రయోగాలు అనేకం జరిగాయనీ; భక్తికీ శృంగారానికీ తదితర రసాలకూ ఉండే సంబంధాలను గురించి ఆనాటి కవులు – అంటే శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య వంటి వారు – లక్ష్యాలు రాశారనీ; అయితే వాటికి తగిన లక్షణ సూత్రాలు గానీ లక్షణ గ్రంథాలు గానీ రాలేదని నగేంద్ర వంటి ప్రసిద్ధ విమర్శకులు వివేచిస్తున్నారనీ, జి.వి.ఎస్. వివరిస్తారు.
ఇక నగేంద్ర గారు తన పుస్తకంలో తెలుగు, కన్నడం, గుజరాతీ, మరాఠీ, హిందీ, తమిళం ఇలా వివిధ భారతీయభాషలలో జరిగిన కృషిని క్లుప్తంగా చెప్పారు. వర్తమానయుగంలో, అంటే 19వ శతాబ్దం మధ్యభాగం తర్వాత భారతీయభాషలలో కావ్యశాస్త్రం అతిత్వరగా వికసించిందనీ, ముఖ్యంగా “హిందీ, మరాఠీ భాషల్లో జరిగిన కృషి గుణం, పరిణామం రెంటి దృష్ట్యా చాలా మహత్త్వపూర్ణమయినది” అనీ అన్నారు (రససిద్ధాంతం పుట 79).
ఆ విషయం తెలిశాక హిందీ మరాఠీ భాషలలోని సాహితీవేత్తలు భక్తిరసం గురించి చేసిన చర్చలను తెలుసుకునే ప్రయత్నం చేశాను. హిందీలో ఈ విషయాన్ని వివరించిన సిద్ధాంతగ్రంథాలను చదివాను. డా. వాట్వే రచించిన ‘రసవిమర్శ్’ గ్రంథాన్ని మరాఠీ మిత్రులతో చదివించుకున్నాను. (ఆ గ్రంథాల నుండి తెలుసుకున్న విషయాలను అనుబంధం-1 లో సంక్షిప్తంగా పేర్కొన్నాను.)
ఆ గ్రంథాల వలన మరాఠీ సాహితీవేత్తలలో అధికులు భక్తిని రసముగానే పరిగణించారని తెలిసింది. అలాగే “హిందీలో భక్తి వాత్సల్యాలను కూడా కలిపి ఏకాదశ రసాలను సర్వమాన్యరసాలుగా చెప్పడం కనిపిస్తుంది” అన్న విషయమూ తెలిసింది (హిందీ కావ్యశాస్త్ర్ మే రససిద్ధాంత్, పుట 156).
ఇటువంటి కృషి తెలుగులో జరగలేదు. అంటే తెలుగు సాహిత్యానికి సంబంధించి భక్తిని ఎలా పరిగణించాలి? రసముగానా? భావముగానా? అన్న విషయంలో స్పష్టమైన ప్రతిపాదన తెలుగు సాహితీవేత్తలు ఎవరూ చేయలేదు.
కనుక ఈ అంశాన్ని – తెలుగుసాహిత్యానికి సంబంధించి భక్తిని ప్రత్యేక రసముగా పరిగణించవలసిన అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని – నేను పరిశోధనకు ఎంచుకున్నాను. ఈ పరిశోధనకు ఏర్పరచుకున్న లక్ష్యము, పరిధి, పరిశోధనాప్రణాళిక వంటి అంశాలను వివరించడానికన్నా ముందుగా ఈ పరిశోధన ఎందుకు అవసరమనిపించిందో చెప్పబడుతున్నది.
0.2 ఆవశ్యకత
1.భక్తిరసాన్ని ప్రతిపాదించిన రూపగోస్వామి, మధుసూదన సరస్వతి వంటివారు కేవలం భక్తులుగా మాట్లాడలేదు. భక్తిరసం అనే మాటను వ్యావహారిక అర్థంలో ప్రస్తావించలేదు. ఆలంకారిక పరిభాషను వాడుతూ విభావానుభావాల గురించీ సంచారిభావాల గురించీ వివరంగా చెప్పారు. తన ప్రతిపాదనలో ఆలంకారిక సాంప్రదాయానికి భిన్నంగా ఉన్నాయనిపించే అంశాలన్నిటికీ మధుసూదన సరస్వతి వివరణ ఇచ్చాడు.
కాబట్టి భక్తిరస ప్రతిపాదనను త్రోసి పుచ్చాలంటే మొదట మధుసూదన సరస్వతి ఇచ్చిన వివరణను సమర్థవంతంగా ఖండించాలి. సరైన ఖండన లేకుండా అస్పష్టమైన అసంబద్ధమైన కారణాలతో ఒక ప్రతిపాదనను ప్రక్కన పెట్టడం సబబు కాదు. అయితే అటువంటి ఖండనల కోసం చూసినపుడు, భక్తి అనేది రసము కాదు భావమే అని ఒక్క వ్యాఖ్యతో సరిపెట్టిన గ్రంథాలే కనిపిస్తున్నాయి కానీ, భక్తిరస ప్రతిపాదనను సమర్థవంతంగా ఖండించిన గ్రంథాలేవీ కనబడడం లేదు.
2. వత్సలరసం వంటి మాటలని, నిజానికి శృంగారరసం బీభత్సరసం వంటి మాటలని కూడా సాహిత్యకారులు (కవులూ విమర్శకులూ పాఠకులూ కూడా) విస్తృతంగా వాడడం కనబడదు. కానీ “భక్తిరసం” అనే మాటని ఎందరో కవులు, ప్రాచీనులైన ఎర్రన తిక్కన సోమనల నుంచి ఈనాటి రచయితల వరకూ విరివిగా వాడటం కనిపిస్తుంది. అంతేకాదు, విశ్వవిద్యాలయాలలో సదస్సులలో సమర్పించబడుతున్న సిద్ధాంత గ్రంథాలలోనూ పరిశోధన పత్రాలలోనూ కూడా భక్తిని రసంగా పరిగణించడం ఉంది. ఈ పరిశోధనలో భాగంగా పరిశీలించిన సిద్ధాంత గ్రంథముల జాబితా గ్రంథం చివర్లో ఇవ్వబడింది. వాటన్నిటిలోనూ పరిశోధకులూ, పర్యవేక్షకులూ, వాటికి పరిచయ వాక్యాలు వ్రాసిన ఎందరో ఆచార్యులూ, సాహితీవేత్తలూ భక్తిని రసంగానే ప్రస్తావించడం కనిపించింది.
ఒకప్రక్కన విశ్వవిద్యాలయాలు బోధించే పాఠాలలో రసములు తొమ్మిదేననీ, భక్తి అనేది కావ్యరసము కాదనీ చెప్తూండటము, మరొకప్రక్కన భక్తి కూడా రసమేనన్న పూర్వసిద్ధాంతం(premise)తో అవే విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరుగుతూ ఉండడమూ, సిద్ధాంతగ్రంథాలు సమర్పించబడడమూ కనిపిస్తోంది.
3. సమాజంలో కానీ సాహిత్యంలో కానీ భక్తికి అంతగా ప్రాధాన్యం లేకపోయి ఉంటే భక్తిని రసముగా పరిగణించాలా, భావంగా పరిగణించాలా అన్న విషయంలో ఉన్న అస్పష్టతను పట్టించుకోకుండా వదిలేయవచ్చు. కానీ భక్తిరసము పోషింపబడినట్లుగా పాఠకులు, విమర్శకులు భావిస్తున్న కావ్యాలు తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. భక్తిరసమే అంగిరసంగా ఉందని చెప్పబడుతున్న కావ్యాలూ ఉన్నాయి. అటువంటపుడు భక్తిని రసముగా పరిగణించాలా లేదా అన్న విషయంపై స్పష్టత అవసరం. ఎందుకంటే ఒక కావ్యంలో శబ్దాలు, ఛందస్సు, అలంకారాలు, గుణాలు అన్నీ ఆ కావ్యంలో పోషింపబడే రసానికి అనుకూలంగా ఉండాలి కనుక. ఒక రసానికి గుణమైన విషయాలు మరొక రసానికి దోషం అయ్యే అవకాశం ఉంది కనుక.
ఇటువంటి కారణాల వలన ఈ విషయాన్ని మరింత విస్తృతంగా అధ్యయనం చేయవలసిన అవసరమూ, తెలుగు సాహిత్యాన్ని ఆధారం చేసుకుని పరిశీలించవలసిన అవసరమూ ఉన్నాయని అనిపించింది.
ఈ విధంగా పరిశోధనాంశాన్ని నిర్ణయించుకున్నాక, నా పరిశోధనకు ఒక లక్ష్యాన్ని, పరిధిని నిర్ణయించుకోవడానికంటే ముందుగా ఈ విషయంపై తెలుగులో ఇప్పటికే జరిగిన అధ్యయనాలు, పరిశోధనలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలనుకున్నాను.
ఆంధ్ర, ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర, కాకతీయ, నాగార్జున మొదలైన విశ్వవిద్యాలయాలలో అటు రస సిద్ధాంతాన్ని గురించి, ఇటు భక్తిసాహిత్యాన్ని గురించి, అలాగే తెలుగు కావ్యాలలోని రసపోషణను గురించి జరిగిన పరిశోధనలనన్నిటినీ గుర్తించి, ఒక జాబితా తయారు చేసుకుని, ఆ సిద్ధాంతగ్రంథాలన్నిటినీ సేకరించి అధ్యయనం చేశాను. ఆ అధ్యయనంలో నేను గమనించిన విషయాలను వివరిస్తాను.
0.3 పూర్వ పరిశోధనలు
ఈ విషయంపై వివిధ విశ్వవిద్యాలయాలలో జరిగిన పరిశోధనలను మూడు రకాలుగా విభజించవచ్చు.
రస సిద్ధాంతం గురించీ, తెలుగు కావ్యాలలోని రసనిర్ణయం గురించీ జరిగిన పరిశోధనలు మొదటిరకం. ఈ పరిశోధనల లక్ష్యం భక్తిరసాన్ని గురించిన ప్రత్యేక అధ్యయనం కాదు కనుక వీటిలో భక్తిరసం గురించిన క్రొత్త విశ్లేషణలు కానీ ప్రతిపాదనలు కానీ ఏమీ లేవు.
ఒక నిర్ణీత కాలంలో వచ్చిన కావ్యాలను కానీ, లేదా ఒక ప్రత్యేక కవి యొక్క కావ్యాలను కానీ, లేదా ఏదో ఒక ప్రసిద్ధ కావ్యాన్ని కానీ తీసుకుని, వాటిలోని “భక్తి తత్త్వాన్ని” అధ్యయనం చేసిన పరిశోధనలు రెండవ రకం. వీటిలో భక్తికి ఉన్న నిర్వచనాలనూ భక్తిలోని భేదాలనూ వివరించడం, నవవిధ భక్తులు ఆ కావ్యంలో ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో చెప్పడం, ఆయా కావ్యాలలో ఉన్న భక్తుల కథలను వివరించడం వంటి అంశాలు కనిపించాయి. ఇటువంటి పరిశోధనలన్నీ కూడా దాదాపుగా భక్తిని రసముగానే అంగీకరిస్తున్నట్లు చెప్పాయి. అయితే వీరు రససంఖ్యను గూర్చి పూర్వాలంకారికుల అభిప్రాయాలను వివరించి, ఆపైన తమ అభిప్రాయంలో భక్తి కూడా రసమేనని చెప్పారు కానీ, తాము ఆ అభిప్రాయానికి రావడానికి గల కారణాలను వివరించలేదు.
ఇక ఒక ప్రత్యేక కావ్యంలో రసపోషణ ఎలా జరిగిందన్న విషయాన్ని అధ్యయనం చేసినవి మూడవ రకం పరిశోధనలు. వీటిలో భిన్న రసాలను గురించి ప్రస్తావించిన గ్రంథాలు ఉన్నాయి. భక్తిని గురించి మాట్లాడినవీ ఉన్నాయి. అయితే వీటిలో కూడా భక్తిరస పోషణ అనే మాటని వాడడం కనిపించినప్పటికీ, భక్తిరస పోషణ ఆ కావ్యంలో ఎలా జరిగిందో పరిశీలించడం ఆ పరిశోధన యొక్క లక్ష్యంగా చెప్పినప్పటికీ, సిద్ధాంత గ్రంథంలో ఆ అంశాన్ని స్పష్టంగా వివరించడం జరగలేదు. భక్తి రసముగా ఎలా పరిణమించింది అన్న అంశాన్ని స్పష్టం చేసే వివరణలు కనబడలేదు. ధూళిపాళ శ్రీరామ్మూర్తిగారి ‘భాగవతానుశీలనం’ అన్న సిద్ధాంత గ్రంథంలో మాత్రమే ఆ వివరాలు కొంతవరకూ ఇవ్వబడినాయి.
కొన్ని పూర్వ పరిశోధనల గురించి క్లుప్తంగా తెలియచేస్తాను.
శీర్షిక చూసినపుడు బాగా పోలిక ఉందని అనిపించినది “తెలుగు సాహిత్యంలో భక్తితత్త్వం” అనే సిద్ధాంత గ్రంథం. దీనిని శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయానికి కొడాలి సోమసుందరరావు గారు సమర్పించారు. ఈ గ్రంథాన్ని పరిశీలిస్తే, ముందు మాటలోనే ఆచార్య గల్లా చలపతి గారు భక్తి రసమా? కాదా? అన్న విషయంలో ఆలంకారికులలో భేదాభిప్రాయాలున్నప్పటికీ మధుసూదన సరస్వతి, రూపగోస్వాములు భక్తి రసమేనని నిరూపించారనీ ఈ సిద్ధాంతగ్రంథంలో భక్తి రసముగానే వివరింపబడిందనీ చెప్పడం కనిపిస్తుంది. ఆ తర్వాత గ్రంథం మొదటి పుటలోనే సోమసుందరరావుగారు ప్రాచీనాలంకారికులు భక్తిని రసము కాదని అన్నా, అర్వాచీనులు భక్తిని రసముగా పేర్కొన్నారని, తెలుగు కవులయితే ఈ చర్చకు అంత ప్రాధాన్యాన్ని ఇవ్వలేదనీ అన్నారు. ఆలంకారికులు చెప్పిన విషయాలను శ్రీనాథుడు పోతన వంటి కవులు అంతగా పట్టించుకోలేదనీ వాళ్ళు భక్తిని రసముగానే భావించారన్న విషయాన్ని వాళ్ళ సాహిత్యం నిరూపిస్తుందనీ అన్నారు.
మరొకచోట (పుట 16) భాగవతంలో భక్తి భావ స్థితి నుండి రసస్థితికి పరిణతి పొందిందనీ, అందుకే భాగవతం భక్తిరస నిధానం అయిందనీ అన్నారు. సోమసుందరరావుగారు భక్తిని భావంగా కాక రసంగానే భావించడం సముచితమని మొదటి అధ్యాయం చివర్లో తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. అయితే అలా భక్తి రసమేనని అభిప్రాయపడడానికి తోడ్పడిన అంశాలేమిటన్న విషయాన్ని వారు వివరించలేదు. తెలుగు సాహిత్యంలో భక్తిరస పోషణ ఎలా జరిగిందన్న విషయం కూడా ఈ సిద్ధాంత గ్రంథ పరిధిలో లేదు. ‘అలంకార శాస్త్రం ప్రతిపాదించిన భక్తికి తెలుగు కవుల దోహదం’ అనే శీర్షిక క్రింద భక్తి రస పోషణ చేసిన కవులుగా పోతనను, అన్నమయ్యను పేర్కొన్నా వారు దానిని ఎలా సాధించారన్న విషయాన్ని వివరించలేదు. భక్తి రసాన్ని గురించి పూర్వాలంకారికులు చేసిన చర్చను సంక్షిప్తంగా తెలియచేశాక, భక్తి ఉద్యమాలు, భక్తి భేదాలు, వివిధ కవుల రచనలలో అవతారికలలో కనబడే భక్తి కథలూ స్తుతులూ వంటి వాటిని మిగిలిన గ్రంథంలో వివరించారు.
భక్తికి సంబంధించిన సిద్ధాంత గ్రంథాలు ఎక్కువగా శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయానికే సమర్పించబడినాయి. వాటిలో చాలావరకూ తులనాత్మక పరిశీలనలు. అన్నమయ్య, పోతన, త్యాగయ్య, రామదాసు, సారంగపాణి – ఇలా ఇద్దరు ముగ్గురు కవుల సాహిత్యాన్ని పోల్చి చూసిన సిద్ధాంత గ్రంథాలు. అటువంటి వాటన్నిటిలోను మొదటి అధ్యాయంలో ఆ కవుల జీవిత విశేషాలు వివరించబడినాయి. ఆ తర్వాత వివిధ అంశాలు (ఉదా: నవవిధ భక్తులు, రామాయణ భాగవత కథలు, క్షేత్రాలు, సామాజికాంశాలు) ఆయా కవుల రచనలలో ఎలా చిత్రించబడినాయి అన్న విషయాల వివరణ ఉంది. భాష, సంగీతం మొదలైన అంశాలలో ఆ కవుల రచనల్లోని సామ్యాలు భేదాల వంటివి ఉన్నాయి.
ఈ రకమైన గ్రంథాలలో రసము గురించిన చర్చ సాధారణంగా చోటు చేసుకోలేదు. రెండు మూడు గ్రంథాలలో మాత్రం రచయితల అభిప్రాయం పరోక్షంగా వ్యక్తమయింది.
పోతన అన్నమయ్య సాహిత్య దృక్పథాలు అనే మరొక సిద్ధాంత గ్రంథంలో వై. పరమేశ్వరయ్య గారు పోతన గురించి “భక్తికి రసత్వాన్ని కల్పించిన కవిగా కనిపిస్తాడు” అంటారు. పోతన విషయంలో భక్తి రసస్థాయికి చేరిందనీ పోతన వైరభక్తిని కూడా భక్తిరసత్వానికి భంగం కలగకుండా పోషించాడనీ అంటూ వివిధ ఘట్టాలలోని పద్యాలను ఉదాహరించారు (పుట 165).
“పోతన భాగవతం-ఉపాఖ్యానాల అనుశీలనం” అనే సిద్ధాంత గ్రంథంలో కె. మల్లప్ప గారు ఉపాఖ్యానాలలోని రస స్వరూపాన్ని వివరించడానికి ఒక అధ్యాయాన్ని కేటాయించినప్పటికీ భక్తిరసము గురించి స్పష్టమైన వ్యాఖ్యానాన్ని చేయలేదు. భక్తిరసం గురించి పూర్వ ఆలంకారికుల అభిప్రాయాలను చెప్పి ఊరుకున్నారు. ఉపాఖ్యానాలలోని భక్తిరస పోషణని దర్శింపచేయలేదు. భరతోపాఖ్యానం గురించి చెప్తున్నపుడు మాత్రం “ఈ పాత్రలో భక్తిరసం పతాకస్థాయిని అందుకున్నది”, “శాంతం భక్తి కరుణ దయా రసాలు మూర్తీభవించిన మహానుభావుడు భరతుడు” అన్న ఒకటి రెండు వాక్యాలు కనిపిస్తాయి (పుట 198).
భక్తికి సంబంధించిన పలు సిద్ధాంత గ్రంథాలను పరిశీలించినపుడు ఎక్కువ భాగం గ్రంథాలలో భక్తిరసచర్చ కనబడలేదు. ఒకవేళ ఎక్కడైనా ఆ ప్రస్తావన ఉంటే మాత్రం భక్తిని రసముగా అంగీకరించడమే కనిపించింది. ముఖ్యంగా భాగవతాన్ని భక్తిరస ప్రధానమైన గ్రంథంగానే అందరూ పేర్కొన్నారు.
అయితే శ్రీకృష్ణభాగవతము-వ్యాస పోతన భాగవతములతో తులనాత్మక పరిశీలన అన్న సిద్ధాంత గ్రంథంలో శనగవరపు రవిశంకర హృషీకేశ శర్మగారు మాత్రం భిన్నాభిప్రాయాన్ని వెలువరించారు. శ్రీకృష్ణభాగవతాన్ని వ్యాస పోతనల భాగవతములతో పోల్చి చేసిన తులనాత్మక పరిశీలనలో వారు రస సంఖ్య గురించి పూర్వ ఆలంకారికుల అభిప్రాయాలను వివరించి, భాగవతంలో అంగిరసం భక్తి అని కొందరు అన్నప్పటికీ అది లాక్షణిక ప్రమాణం కాలేదని చెప్పారు. భక్తి శాంతంలోనే అంతర్భవిస్తుందని అంటూ గజేంద్రమోక్షణ ఘట్టాన్ని ఉదాహరించారు. గోపికల మధురభక్తి శృంగారయుక్తమైనా అక్కడ కూడా శాంత రసమునకే ప్రాధాన్యమని, కనుక భాగవతంలో శాంతమే అంగిరసమనీ మిగిలినవి అంగరసాలనీ అన్నారు.
ఆంధ్రమహాభాగవతము-రసపోషణ అన్న సిద్ధాంత గ్రంథాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించిన తాత వేంకట లక్ష్మి గారు భక్తిరసమును గురించి కొంత విస్తృతంగా చర్చించారు. వీరు భాగవతము భక్తిరస బంధురముగ తీర్చిదిద్దబడినదని, భక్తిరస సిద్ధాంతమున కాలవాలమయినదని అన్నారు. “ఆలంకారిక చర్చలతో నిమిత్తము లేకుండ సంస్కృతాంధ్ర భాగవతములను పఠించిన సహృదయులెల్లరు నాస్వాదించునది భక్తిరసమే” అని వీరు స్పష్టంగా పేర్కొన్నారు (పుట 117).
“శ్రీ మహాభాగవతమును రసదృష్టితో పరిశీలించినచో భక్తిరసము ప్రధానముగా పోషింపబడినదనియు, శృంగార హాస్య కరుణాదులు భక్తికి పరిపోషకములై, యందు లీనమైనట్లును గోచరించును. భక్తి యంగిరసము; శృంగారాదు లంగరసములుగ నిట స్పష్టము” అన్నారు (పుట 159).
భక్తిరసమును సమర్థించిన కొందరు తెలుగు సాహితీవేత్తల వ్యాఖ్యలను కూడా వీరు పేర్కొన్నారు. అయితే వీరి పరిశోధన ఉద్దేశం భాగవతంలో పోషించబడిన రసములన్నింటినీ పరిశీలించడం కనుక ప్రత్యేకంగా భక్తిరసమును గూర్చి వీరు సమగ్రమైన చర్చ చేయలేదు. భక్తి రసమేనన్న అభిప్రాయానికి అనుకూలంగా మాట్లాడిన కొందరి అభిప్రాయాలను పేర్కొన్నారు కానీ ప్రతికూలంగా మాట్లాడిన వారి అభిప్రాయాలను పరిశీలించలేదు. అనుకూలంగా మాట్లాడిన వారి జాబితా కూడా సమగ్రమైనది కాదు.
ఎన్ రాజేశ్వరి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించిన “పోతన- అతని కృతులు, కవితా వైభవ పరిశీలన” అన్న సిద్ధాంత గ్రంథంలో పోతన, ఎర్రన, నాచన సోమన – వీరు ముగ్గురి రచనలలోనూ ఉన్న నరకాసుర వధ, ప్రహ్లాద చరిత్ర వంటి కొన్ని ఘట్టాలను తీసుకుని రచనా విధానాన్ని పోల్చి చూశారు. ఆ అధ్యాయంలో వారు పోతన ప్రహ్లాద చరిత్రలో పాత్ర చిత్రణ ఎలా చేశాడో చెప్తూ, పోతన భాగవతంలోని ఆ ఘట్టంలో భక్తి ప్రధాన రసమనీ, భక్తిని ప్రధాన రసముగా పోషించదలచుకున్నాడు కనుకనే పోతన దానికి భంగకరమైన వర్ణన కాని, భక్తికి విరుద్ధమైన భావపోషణ కానీ చేయలేదనీ అంటారు. నరసింహావిర్భావ ఘట్టంలోని బీభత్స అద్భుత రసాలను కూడా భక్తికి అంగాలుగానే వాడుకున్నాడని అంటారు. అయితే ఎర్రన కావ్యతత్త్వం అది కాదనీ ఆయన కావ్యంలో భక్తిరసంతో పాటు శృంగారం కూడా ఉద్ధృతంగా కనిపిస్తుందనీ చెప్పి, ఎర్రన నృసింహ పురాణం భక్తి శృంగార సమ్మిశ్రితమైన ఆనంద ప్రవాహమయితే పోతన ప్రహ్లాద చరిత్ర నీరం లేని క్షీరం లాగా పొంగి పొరలిన భక్తిరసాయనమని అంటారు.
ఈ వివరణ చదివినపుడు మనకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి. 1. రాజేశ్వరి గారు భక్తిని రసముగానే పరిగణించారు, 2. భక్తిరసం శృంగారం కంటే భిన్నమని భావించారు.
వై. రెడ్డి శ్యామల గారు హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించిన “అన్నమాచార్యుల పదకవితలు: మధుర భక్తి” అనే తమ సిద్ధాంత గ్రంథంలో భక్తిరసము గురించి చర్చించారు. వారు భక్తిరసం గురించి పూర్వాలంకారికుల అభిప్రాయాలను వివరించిన పిమ్మట రససంఖ్యను ప్రక్రియాపరంగా నిర్వచించుకోవచ్చుననీ భక్తివాఙ్మయానికి భక్తే ప్రధాన రసమనీ వివరించి, సంకీర్తనలు భక్తివాఙ్మయ పరిధి లోనివే కాబట్టి అక్కడ కూడా భక్తి ఒక్కటే ప్రధాన రసమని పేర్కొన్నారు ( పుట 32).
సంకీర్తనలలో రసనిష్పత్తి ఎలా జరుగుతుందో చెప్తూ, సంకీర్తనలలో శబ్దార్థాలు, సంగీతము, వాగ్గేయకారుడి ప్రత్యేక ఆహార్యము, అభినయము, ఆతడి భక్తి – అన్నీ మిళితమయి ఉంటాయి కనుక శబ్ద అర్థ ధ్వనుల ద్వారా కావ్యరసం, స్వరాల ద్వారా సంగీత రసం లేక గానరసం, భక్తి వలన భక్తిరసం, అభినయాదుల వలన నాట్యరసం, నృత్యరసం కలిసి “సంకీర్తనరసం”గా ఏర్పడుతుందని భావించవచ్చునంటారు. వీటన్నిటి నిష్పత్తి సూత్రాలు కలవడం వలన సంకీర్తన ద్వారా భక్తిరస ఆవిష్కరణ తొందరగా జరుగుతుందని అంటారు ( పుట 35).
వీరపద్మజ గారు “శ్రీనాథయుగ సాహిత్యము – భక్తి” అన్న తమ సిద్ధాంత గ్రంథంలో రూపగోస్వామి వంటి వారు భక్తిరస ప్రతిపాదన చేయడం గురించి చెప్పారు. ఈ గ్రంథంలో “భక్తిరస తన్మయుడై స్తుతించాడు”, “భక్తిరసార్ద్ర చిత్తుడై శివుని స్తుతించాడు.” (పుట 109) వంటి వాక్యాలు కనిపిస్తాయి. దేవకీనందన శతకం గురించి చెప్తున్నపుడు భక్తిరస పూరితమైన శతకము అనడం కనిపిస్తుంది (పుట 192).
ఎం. వి.రాజ్యలక్ష్మి గారు భాగవత ఉపాఖ్యానాలు – రసపోషణ అన్న తమ సిద్ధాంత గ్రంథంలో ఉపాఖ్యానం అన్న శీర్షికతో ఉన్న పన్నెండు కథలలోని రసపోషణను చర్చించారు. వీరు భాగవతంలో శృంగారం కూడా ప్రధానంగానే ఉన్నా అంతిమంగా పాఠకుల మనసులో నిలిచేది భక్తిరసమేనంటారు. శృంగారం అంగరసంగా భక్తి అంగిరసంగా ఉన్న నవరస భరితమైన కావ్యం భాగవతం అంటారు.
అంగలూరు శ్రీరంగాచారి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి “తాళ్ళపాక అన్నమాచార్యుల శృంగార కీర్తనలు – మధురభక్తి” అన్న సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. ఈ సిద్ధాంతగ్రంథానికి వ్రాసిన ముందుమాటలలో ఎం. కులశేఖర్ రావు గారు చేసిన “కావ్య సంబంధమైన అన్ని లక్షణాలలో సంస్కృత మార్గాన్నే అనుసరించిన తెలుగు కవులు భక్తిని అవలంబించడంలో లక్షణకారులను అతిక్రమించినట్లే కనిపిస్తుంది. ఎందుచేతనంటే భక్తి యథార్థానికి భావమే అయినా, దానికి ఒక సమున్నత ప్రాధాన్యాన్ని కల్పించి దాన్ని రస స్థితికి చేర్చినారు” అన్న వ్యాఖ్య, ఎస్. టి. కె. ఎస్. రంగాచార్యులు గారు చేసిన “రసరాజయిన శృంగారమునకు భగవంతుడే ఆలంబన విభావమయినపుడు అదియే భక్తిగా వివర్తమగును. అందువలననే అన్నమయ్య కీర్తనలలో భక్తిరసమునకు శృంగార రసము అంగీభావము నొందినది” అన్న వ్యాఖ్యా కనిపించాయి.
సిద్ధాంతగ్రంథం లోపల శ్రీరంగాచారి గారు భక్తిరసమును గురించి ఉన్న సిద్ధాంతపరమయిన చర్చలన్నిటినీ ఒక అధ్యాయంలో పేర్కొన్నారు. భక్తిరసమును గూర్చి ఆలంకారికులలో ఉన్న భిన్నాభిప్రాయాలను వివరించాక అధ్యాయం చివర్లో “మొత్తముపై విచారించి చూడగా భక్తి యనునది రసమే కాని కేవల భావము కాదనియు, రసమునకుండవలసిన విభావాదిభావములు, ఆలంబన మొదలైనవన్నియును భగవంతుడే యనియు, దీనికి గల స్థాయిభావము సుస్థిరమైనదనియు, ఇతర రసములవలె చంచలమైన తాత్కాలికమైన నశించునదైన స్థాయిభావము వంటిది భక్తిరసమున లేదనియు సుస్పష్టమగుచున్నది. భక్తిరసమునందలి సుఖానుభూతి వంటిది ఇతర రసములందు మృగ్యము” అని తన అభిప్రాయాన్ని చెప్పారు. “అట్లు దివ్యరసానుభూతిని కలిగించుచు, నిరంతర సుఖానుభూతిని ప్రసాదించు హరిముకుందుని యందలి భక్తిని రసమనుటకు ఎట్టి విప్రతిపత్తియు కలగరాదు” అని నిశ్చయంగా చెప్తూ ఆ అధ్యాయాన్ని ముగించారు (పుట 47).
అయితే మరొక అధ్యాయంలో భక్తిరసపోషణకు అన్నమాచార్యుల కీర్తనల నుండి ఉదాహరణలు చూపే ప్రయత్నం చేసినపుడు మాత్రం ఆలంకారికులు శృంగార రస సంబంధంగా చెప్పిన అష్టవిధనాయికలు, దశకామావస్థలు, స్వీయ పరకీయ మొదలైన నాయికా భేదాలు – ఇటువంటి అంశాలనే ఆధారం చేసుకున్నారు. వాటిలోని భావం స్థూలదృష్టికి శృంగారంగా గోచరించినప్పటికీ అంతరార్థం భక్తేనని గ్రహించాలని అన్నారు. కానీ భక్తిరసపోషణకీ శృంగారరసపోషణకీ మధ్య ఉండే వ్యత్యాసమేమిటన్న పరిశీలన, వివరణ వంటివి ఈ సిద్ధాంత గ్రంథంలో లేవు.
“మధురభక్తి-ముగ్ధభక్తి” అన్న తమ సిద్ధాంత గ్రంథంలో సురవరం పుష్పలత గారు భక్తిరసము గురించి ప్రస్తావించారు. రూపగోస్వామి రచించిన భక్తిరసామృతసింధువు, ఉజ్జ్వలనీలమణి, మధుసూదనసరస్వతి రచించిన భక్తిరసాయనము – ఈ మూడు గ్రంథాలను వివరంగా పరిచయం చేయటానికే ఒక అధ్యాయాన్ని కేటాయించారు. తెలుగు సాహిత్య విమర్శలో భక్తిరస వివేచన చేయటానికి, భక్తిరస నిరూపణ చేయటానికి ప్రయత్నించిన గ్రంథములు తక్కువ అని, ఈ సిద్ధాంతగ్రంథం అటువంటి అనుశీలనకు – ముఖ్యంగా మధురభక్తిని ముగ్ధభక్తిని అనుశీలించటానికి – ఒక నిర్దిష్ట మార్గాన్ని చూపే ప్రయత్నం చేసిందనీ పుష్పలత గారు మలిపలుకులలో చెప్పారు.
అయితే ఈ సిద్ధాంతగ్రంథం భక్తి రసమా కాదా, అది ఇతర రసములలో అంతర్భవిస్తుందా లేదా అన్న విషయాలను చర్చించదు. భక్తి రసమేనన్న విషయాన్నీ, అది శృంగారాది రసములకంటే విశిష్టమన్న విషయాన్నీ అంగీకరించి, ఆ ప్రతిపాదనను స్వీకరించి, భక్తిరస అనుశీలన చేయడానికి పూనుకుంటుంది. ఆరంభంలోనే “భక్తిరస విచారమున భరతాదుల సంప్రదాయమొకటి, రూపగోస్వామి మధుసూదనసరస్వతి మొదలగువారు ప్రవర్తింప చేసిన వైష్ణవభక్తి సంప్రదాయము మరొకటి” అంటూ ఆ రెండిటి మధ్యా ఒక విభజన చూపడం, ఆపైన రూపగోస్వామి చెప్పిన లక్షణాలను ఆధారం చేసుకుని మధురభక్తినీ ముగ్ధభక్తినీ అనుశీలించే ప్రయత్నం చేయడం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. భక్తిరసమును గురించిన సమగ్రమైన విశ్లేషణ ఈ గ్రంథ పరిథిలో లేదు. కావ్యాలలో భక్తిరసపోషణను గురించి కూడా స్పష్టమైన, నూతనమైన ప్రతిపాదనలేవీ ఈ గ్రంథంలో లభ్యమవలేదు.
ఈ విధంగా భక్తిసాహిత్యానికీ, రససిద్ధాంతానికీ దగ్గరగా కనిపించిన యాభైకి పైగా సిద్ధాంత గ్రంథాలను పరిశీలించిన పిమ్మట నా పరిశోధనకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను.
0.4 పరిశోధన లక్ష్యము
రససంఖ్యను గురించీ భక్తిరసం గురించీ పూర్వ ఆలంకారికులు వ్యక్తపర్చిన అభిప్రాయాలపై ఉన్న స్థూల అవగాహన, ఆలంకారికులు సిద్ధాంతపరంగా భక్తిని రసముగా అంగీకరించనప్పటికీ ఎందరో కవులూ సాహితీవేత్తలూ భక్తిని రసముగానే ప్రస్తావిస్తున్నారన్న గమనింపు, వివిధ విశ్వవిద్యాలయాల నుండి భక్తిని అంశంగా తీసుకుని చేసిన పరిశోధనలలో కూడా భక్తిని రసముగానే ప్రస్తావించారన్న పరిశీలన – వీటన్నిటి ఆధారంగా ఒక ఊహా ప్రతిపాదనను ఏర్పర్చుకోవడం జరిగింది. ఆ ఊహాప్రతిపాదన సత్యమా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవడమే ఈ పరిశోధనకు లక్ష్యం.
0.4.1 ఊహాప్రతిపాదన
“భక్తి శృంగారాది రసములలో అంతర్భవించని ఒక విభిన్న రసము”
అన్నది ఈ పరిశోధనకు ఏర్పరచుకున్న ఊహాప్రతిపాదన.
అయితే ఒకే వాక్యంగా కనిపిస్తున్న ఈ ప్రతిపాదనలో రెండు అంశాలున్నాయి. అంటే నిజానికి ఇది రెండు ప్రతిపాదనలతో కూడుకుని ఉంది. ఒకటి, భక్తి అనేది భావము కాదు రసమేనన్న ప్రతిపాదన. అంటే భక్తికి కూడా రసముగా పరిణతి చెందగల శక్తి ఉన్నది అన్న ప్రతిపాదన. రెండవది, కొందరు ఆలంకారికులు పేర్కొన్నట్లుగా శృంగార రసంలో కానీ శాంతరసంలో కానీ భక్తి అంతర్భవించదు అన్న ప్రతిపాదన.
ఇలా రెండు అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి కాబట్టి ఈ ఊహాప్రతిపాదన సత్యమే అని నిర్ణయించాలంటే ఈ రెండు అంశాలనూ పరీక్షించాలి. రెండు అంశాలకూ ఆధారాలు లభించినపుడు మాత్రమే ఊహాప్రతిపాదన సత్యమేనన్న నిర్ణయానికి రావడం సాధ్యమవుతుంది. రెండు అంశాలలో దేనికి ఆధారం లభించకపోయినా ఊహాప్రతిపాదన తప్పు అని గ్రహించవలసి ఉంటుంది.
0.5 పరిధి
ఈ పరిశోధనలో రెండు భాగాలున్నాయి. మొదటిది తెలుగుసాహిత్యంలో భక్తిరసాన్ని గురించిన సమాచార సేకరణ, అధ్యయనం. రెండవది విశ్లేషణ. కాబట్టి అధ్యయనానికి, విశ్లేషణకు కూడా పరిధిని నిర్ణయించుకోవలసి ఉంది.
- అధ్యయనానికి పరిధి
తెలుగుసాహిత్యంలో భక్తిరసాన్ని గురించిన సమాచారాన్ని అధ్యయనం చేయడం అన్నపుడు ఏఏ గ్రంథాలను పరిశీలించాలి? అన్నది ఒక ప్రశ్న. తెలుగు సాహిత్యంలోని గ్రంథాలను నాలుగు ప్రధాన భాగాలుగా చూడవచ్చు – అలంకార శాస్త్ర గ్రంథాలు, సాహిత్య విమర్శా గ్రంథాలు, సిద్ధాంత గ్రంథాలు, సృజనాత్మక రచనలు.
సిద్ధాంత గ్రంథాల అధ్యయనం గురించి ఈ అధ్యాయంలోనే ఇంతకు మునుపు వివరించాను. పరిశీలించవలసిన సిద్ధాంతగ్రంథాల జాబితాను నిత్యానందరావుగారి “విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన” నుండి, అలాగే అంతర్జాలంలో తెలుగుథీసిస్, శోధ్‌గంగా వంటి వేదికల నుండి తయారు చేసుకున్నాను. రససిద్ధాంతానికి సంబంధించిన, భక్తిసాహిత్యానికి సంబంధించిన, లేదా కావ్యాలలో రసపోషణకు సంబంధించిన పరిశోధనలను అధ్యయనానికి పరిధిగా నిర్ణయించుకున్నాను.
అలంకార శాస్త్ర గ్రంథాలు, సాహిత్య విమర్శా గ్రంథాలు, సృజనాత్మక రచనలు – వీటిని అధ్యయనం చేసేటపుడు ఏఏ గ్రంథాలను ఎన్నుకోవాలన్న విషయానికి సాహిత్యచరిత్రల వంటి గ్రంథాలపై ఆధారపడ్డాను. తరువాతి విభాగంలో పరిశోధన ప్రణాళికను వివరిస్తున్నపుడు ఆయా జాబితాలను ఎలా తయారు చేసుకున్నానో తెలియచేస్తాను.
- విశ్లేషణకు పరిధి
ఇక విశ్లేషణ విషయానికి వస్తే, అది కూడా రెండు విధాలుగా చేయాలనుకున్నాను. ఒకటి శాస్త్ర గ్రంథాల ఆధారంగా, రెండవది కావ్యాల ఆధారంగా.
శాస్త్రాధారిత విశ్లేషణకు మొదటి మూడు అధ్యాయాలలో పరిశీలించే అలంకారశాస్త్ర, విమర్శన గ్రంథాలన్నీ పరిగణించబడతాయి. తెలుగుసాహిత్యం యొక్క విస్తృతి దృష్ట్యా కావ్యాధారిత విశ్లేషణకు భక్తిరస కావ్యాలుగా ప్రసిద్ధిచెందిన ప్రాచీన కావ్యాలు మాత్రమే పరిగణించబడుతున్నాయి. సన్నివేశ కల్పన, పాత్రచిత్రణ వంటివి పరిశీలించడానికి ఖండకావ్యాలలో, గేయాలలో కన్నా ప్రాచీన కావ్యాలలోనే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక పరిధిని ఈ విధంగా నిర్ణయించుకోవడం జరిగింది.
0.6 పరిశోధన ప్రణాళిక
నా పరిశోధనను ఏడు భాగాలుగా విభజించుకున్నాను. ఆ ఏడు భాగాలలో చేసే పరిశీలనలను, విశ్లేషణలను ఈ సిద్ధాంత గ్రంథంలోని ఏడు అధ్యాయాలలో వివరించాలనుకుంటున్నాను. అవి
- సంస్కృతాలంకారికులు-భక్తి
- తెలుగు ఆలంకారికులు-భక్తి
- ఆధునిక తెలుగు విమర్శకులు-భక్తి
- తెలుగుకవులు-భక్తి
- శాస్త్రాధారిత విశ్లేషణ
- కావ్యాధారిత విశ్లేషణ
- భక్తి-రసప్రతిపత్తి
ఒక్కొక్క అధ్యాయంలో ప్రస్తావించదలచిన విషయాలను ఇపుడు క్లుప్తంగా తెలియచేస్తాను.
భక్తిరసాన్ని గురించిన చర్చ సంస్కృతంలో మొదలయింది కనుక మొదటి అధ్యాయంలో సంస్కృతాలంకారికుల అభిప్రాయాలను పరిశీలించాలనుకుంటున్నాను. పుల్లెల శ్రీరామచంద్రుడు గారి అలంకార చరిత్ర, ముదిగంటి సుజాతారెడ్డి, గోపాలరెడ్డి గార్ల సంస్కృత సాహిత్య చరిత్ర వంటి గ్రంథాల ఆధారంగా ప్రసిద్ధ సంస్కృత అలంకార గ్రంథాల జాబితా తయారు చేసుకున్నాను. వాటిలో చాలావాటికి తెలుగు అనువాదాలు లభించాయి. తెలుగు అనువాదాలు లభించనపుడు హిందీ, ఇంగ్లీషు అనువాదాలపై ఆధారపడి భరతుని నుండి అల్లరాజు వరకు ముప్పై తొమ్మిది మంది ఆలంకారికుల అభిప్రాయాలను పరిశీలించి విశ్లేషించాలనుకుంటున్నాను.
తెలుగులో వచ్చిన అలంకారశాస్త్రగ్రంథాలలో ఎక్కువ భాగం సంస్కృత గ్రంథాలకు అనువాదాలు. సంస్కృత గ్రంథాల విశ్లేషణకు మొదటి అధ్యాయాన్ని కేటాయించాను కనుక కేవల అనువాదాలుగా వ్రాయబడినవి కాకుండా, ఇతర అలంకారశాస్త్ర గ్రంథాలకు అనుసరణలుగా వ్రాయబడినప్పటికీ కొంత స్వతంత్రత కనిపించే తెలుగు గ్రంథాలను రెండవ అధ్యాయంలో ప్రస్తావించాలనుకుంటున్నాను. తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి “రస సిద్ధాంతము – ఆంధ్రుల వరివస్య” వంటి పుస్తకాల సహాయంతో విన్నకోట పెద్దన వంటి తెలుగు ఆలంకారికుల జాబితా తయారు చేసుకుని భక్తిరసముపై వారి అభిప్రాయాల కోసం ప్రయత్నించాలనుకుంటున్నాను.
మూడవ అధ్యాయంలో ఆధునిక విమర్శకుల అభిప్రాయాలను పరిశీలించాలని అనుకుంటున్నాను. “ఆధునిక సాహిత్య విమర్శకులు – ప్రస్థానాలు” వంటి గ్రంథాలను ఆధారం చేసుకుని విమర్శకుల జాబితా తయారు చేసుకున్నాను. మనుచరిత్ర వసుచరిత్ర వంటి కావ్యాలపై విమర్శలు వ్రాసిన తొలితరం విమర్శకులు తమ విమర్శలలో అలంకారశాస్త్ర సిద్ధాంతాలను సూత్రాలను ఎక్కువగా ఉపయోగించారు. తర్వాతి కాలంలో అలంకారశాస్త్రం ఆధారంగా చేసిన విమర్శలు తగ్గాయి. అలంకారశాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా చేసిన విమర్శలలో కూడా అందరూ రససంఖ్య గురించి, భక్తిరసము గురించీ ప్రత్యేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఆధునిక విమర్శకు ఆద్యులైన కందుకూరి వీరేశలింగం గారితో మొదలుపెట్టి అవకాశమున్నంత మేర ఈ విషయంపై తెలుగు సాహితీవేత్తల అభిప్రాయాలను సేకరించి పరిశీలిస్తాను.
నాలుగవ అధ్యాయంలో భక్తిని గూర్చి రససంఖ్యను గూర్చి తెలుగు కవులు చెప్పిన అభిప్రాయాలేమైనా ఉన్నాయా అని పరిశీలించాలనుకుంటున్నాను. ఆరుద్ర “సమగ్ర ఆంధ్ర సాహిత్యము” వంటి గ్రంథాల ఆధారంగా తెలుగు కవుల సమగ్రమైన జాబితాను తయారు చేసుకుని భక్తిరసము గురించి వారి అభిప్రాయాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లభిస్తాయేమో చూడాలనుకుంటున్నాను. ఆదికవి నన్నయ్య గారి నుంచి 18వ శతాబ్దానికి చెందిన కంకంటి పాపరాజుగారి వరకూ తెలుగు కవులలో ప్రసిద్ధులైన వారి అభిప్రాయాలను లభ్యమైన మేరకు పరిశీలిస్తాను.
అయిదవ అధ్యాయంలో శాస్త్రాలను ఆధారం చేసుకుని ఊహాప్రతిపాదనను పరీక్షిస్తాను. అంటే ఆలంకారిక శాస్త్రాలను, విమర్శకుల అభిప్రాయాలను ఆధారం చేసుకుని రససంఖ్యను తొమ్మిదిగా నిర్ణయించడం సమంజసమేనా, రసము గురించి ఆలంకారిక శాస్త్రాలలో చెప్పిన వివిధ అంశాలు భక్తిని ప్రత్యేక రసంగా పరిగణించకుండా ఉండడానికి గానీ, లేక మరొక రసములో అంతర్భవింపజేయడానికి గానీ అనుకూలంగా ఉన్నాయా అన్న విషయాలను చర్చిస్తాను. భక్తిరసమును గురించి ప్రస్తావిస్తున్నపుడు కొందరు ఆలంకారికులు భక్తి రసము కాదు భావమేనని, మరికొందరు అది శృంగారంలో భాగమనీ, ఇంకొందరు శాంతంలో భాగమనీ ఇలా పలువిధాలుగా ప్రతిపాదించి ఉండవచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు అలంకారశాస్త్రాలలో ఇతర సందర్భాలలో చేసిన ప్రతిపాదనలతో, ఇతరత్రా ఉన్న నిర్వచనాలతో సూత్రాలతో పొసగుతున్నాయా లేక వైరుధ్యాలేమయినా ఉన్నాయా అన్న విషయాన్ని ఈ అధ్యాయంలో పరిశీలిస్తాను.
కావ్యంలోని ప్రతీ అంశాన్నీ రసానుకూలంగా నిర్వహించాలన్నది ఆలంకారికుల అభిప్రాయం. కావ్యంలో నిర్వహించబడే వివిధ అంశాలకు శృంగారాది రసములతో ఉన్న సంబంధాన్ని గురించి ఆలంకారికులు వ్యాఖ్యానించి ఉన్నారు కనుక ఆయా అంశాలను కవులు ఎలా నిర్వహించారన్న విషయాన్ని విశ్లేషించడం, తద్వారా ఊహాప్రతిపాదనను పరీక్షించడం ఆరవ అధ్యాయంలో జరుగుతుంది. ఇతివృత్తం, సన్నివేశ కల్పన, పాత్ర చిత్రణ వంటి వాటిని ఆధారం చేసుకుని తెలుగు కవులు భగవద్రతి అనే భావానికి రసపుష్టిని కలిగేలా కావ్యాలను నిర్వహించారా అన్న విషయాన్ని, ఒకవేళ నిర్వహిస్తే అది శృంగార శాంతరసాల పోషణ వలెనే ఉందా లేక భేదాలేమైనా ఉన్నాయా అన్న విషయాన్ని ఈ అధ్యాయంలో పరీక్షించడం జరుగుతుంది.
ఏడవ అధ్యాయంలో పరిశోధనా ఫలితం ప్రకటించబడుతుంది. ఊహాప్రతిపాదనను సత్యంగా స్వీకరించవచ్చునా లేదా అన్న విషయంపై ఏర్పడిన అవగాహన వివరించబడుతుంది.
(సశేషం)
శ్రీ వల్లీ రాధిక చక్కని కథా రచయిత్రి. లోతైన తాత్వికతకు నిత్య జీవితంలోని సంఘటనల ద్వారా సరళంగా ప్రదర్శిస్తారు. ‘తక్కువేమి మనకూ’, ‘స్వయం ప్రకాశం’, ‘హేలగా… ఆనంద డోలగా..’ వీరి పేరుపొందిన కథల సంపుటాలు.