తెలుగు సాహితీ వనం ఆధ్వర్యంలో, తెలంగాణా భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 09.నవంబర్.2025 తేదీన రెండు కవితా సంపుటాలు, ఒక నవలను రవీంద్ర భారతి సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.
సీనియర్ జర్నలిస్ట్ సత్యాజీ గారి నేతృత్వంలో ప్రొద్దున జరిగిన కార్యక్రమంలో, ముఖ్య అతిథి ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, విశిష్ట అతిథులుగా విచ్చేసిన డా. ఏనుగు నరసింహా రెడ్డి మరియు సినీ దర్శకులు వి.యన్. ఆదిత్య, పెద్దింటి అశోక్ కుమార్, డా. నాళేశ్వరం శంకరం తదితరులతో కలిసి విజయ్ అప్పల్ల రచించిన ‘అమలోద్భవిలో అర్జునుడు’ అనే జానపద నవలను, సుమనా ప్రణవ్ రచించిన ‘నక్షత్ర రాగం’ అనే కవితా సంపుటిని ఆవిష్కరించారు.
తదనంతరం వక్తలు మాట్లాడుతూ, మారుతున్న పాఠకుల అభిరుచులకు తగినట్టుగా జానపద నవలను రచించిన ప్రవాస భారతీయుడైన విజయ్ అప్పల్లను అభినందించారు. వచన కవిత్వాన్ని రాయడం కన్నా, అందులోనే కొనసాగడం అసిధారా వ్రతం వంటిదని చెపుతూ రచయిత్రి సుమనా ప్రణవ్ను ఈ సందర్భంగా వక్తలు అభినందించారు.
తెలుగు సాహితీ వనం నిర్వాహకులు శాంతి కృష్ణ సభాధ్యక్షతన మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో, ముఖ్య అతిథి డా.ఏనుగు నరసింహా రెడ్డి గారు. సత్యాజీగారు పుస్తక పరిచయం చేశారు. విశిష్ట అతిథులు డా.తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి, తురిమెళ్ళ కళ్యాణి, డా.శ్రీధర్, కె. మోహన్ రెడ్డి తదితరులతో పానుగంటి శ్రీనివాస్ రెడ్డి రచించిన ‘దివిటీ’ కవితా సంపుటిని ఆవిష్కరించారు.
వక్తలు మాట్లాడుతూ ప్రపంచం బాధను తన బాధగా భావించే కవి, ఉత్తమ కవితలను సృజించగలడన్నారు. తెలంగాణా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.ఏనుగు నరసింహా రెడ్డి గారు మాట్లాడుతూ, పురోగామి భావజాలంతో, కవిత్వాన్ని తన జీవితంలో అవిభాజ్య భాగంగా నిలుపుకున్నప్పుడే ఆ కవి, అతని కవిత్వం కాల పరీక్షకు తట్టుకుని నిలబడుతుందన్నారు.
ఈ సభకు సమన్వయకర్తలుగా కంచిపాటి వెంకట్, విజయ్ అప్పల్ల వ్యవహరించారు. అతిథులకు గౌరవ సత్కారానంతరం, సుమనా ప్రణవ్, సుధా కళ్యాణి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

