Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహితీ శిఖరం: ఆరుద్ర శత జయంతి నివాళి

[ఆరుద్ర శతజయంతి 2025 సందర్భంగా సారధి మోటమఱ్ఱి గారు అందిస్తున్న ప్రత్యేక రచన.]

ముందుమాట

Image Courtesy: Mr. Ravi Kishore Pemmaraju

కొండగాలిని, గోదారి వరదని, అంత్య ప్రాసల అనునయాన్ని కలబోసి, జగతిని మధుర కవితతో అలరించిన తెలుగు సాహితీ శిఖరం: ఆరుద్ర!

ఒక సాహితీకారుడుగా, సాహితీ వేత్తగా బహు కొద్ది మంది మాత్రమే రాణించ గలుగుతారు. అందులో ఆరుద్రది తెలుగు సాహిత్యం లో ఒక ప్రత్యేక స్థానం, అది నిర్వివాదాంశం. ఆటలపాటలతో అలరారే ప్రాధమిక పాఠశాల చదువుల నాడు, “గాంధి పుట్టిన దేశామా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది” అనే పాట ఎంతో తెలియని ఆవేదనని కలిగించింది. ఉన్నత పాఠశాల చదువుల నాడు, ఎప్పడూ అనునయించి, కన్నీరు తెచ్చిన పాట:

“పదిమంది కోసం నిలబడ్డ నీకు, ఫలితం ఏమిటి యమపాశం

ఎవరికివారే ఈ లోకం, రారు ఎవ్వరూ నీ కోసం!”

అప్పటికి జీవతమంటే పూర్తిగా తెలియదు! ఏవో కొన్ని అనుభవాలు, అనుభూతులు, చుట్టూ ఉన్న పరిస్థితులు నేర్పుతున్న పాఠాలు. ఆత్రేయ, ఆరుద్ర లాంటి వారి పాటలు వింటూ ఎంతో అనుభూతిని పొందుతూ, రేడియోలో ఆ చక్కటి పాటలు వస్తున్నాయి అంటే, పాట అన్ని వివరాలు, సాహిత్యం కాగితంపై రాసుకోవడం అలవాటు.

“నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవతకాలం పాటు లేటు”! అన్న, “ఎదగదాని కెందుకురా తొందరా, ఎదర బ్రతుకంతా చిందరవందర” అన్నా, ఆరుద్రకే చెల్లింది.

నిజానికి ఆరుద్ర సృష్టించిన కావ్యం, “త్వమేవాహం” మరియు “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” చదవడం సాధ్యపడలేదు. “కూనలమ్మ పదాలు”, “పలకల వెండి గ్లాస్” డిటెక్టివ్ నవల కొన్ని దశాబ్దాల క్రితం చదివాను. ఎక్కువ విన్నది, పరిచయం చేసుకున్నది, సినీ పాటల సాహిత్యమే. 1977 లో విజయవాడలో, ఆకాశవాణి వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో ఎందరో కవులు శ్రీశ్రీ, ఆరుద్ర, జంధ్యాల పాపయ్యశాస్త్రి లాంటి వారిని  ప్రత్యక్షంగా చూడటం జరిగింది. 1970 దశకంలో, ఆరుద్ర ఆంధ్రజ్యోతిలో వెలువరించిన “రాముడికి సీత ఏమవుతుంది” అనే వ్యాస పరంపర తప్పక చదివేవాడిని.

పరిశోధన ప్రతిపాదన

ఆత్రేయ శతజయంతి సందర్భంగా ఒక ప్రత్యేక వ్యాసం రాశాను. అలాగే ఆరుద్ర సినీ వ్యాసంగములో దర్శక, నిర్మాత, నటులతో అనుబంధం ఎలా ఉంది అనేది ఈ వ్యాస ముఖ్య ఉద్దేశ్యం. ఆదుర్తి-అక్కినేని-ఆత్రేయ, బాలచందర్-ఆత్రేయ, కె. యస్. ప్రకాశరావు-ఆత్రేయ, వి. మధుసూదనరావు-ఆత్రేయ, వి. బి. రాజేంద్రప్రసాద్-ఆత్రేయ లాంటి అవినాభావ సంబంధం, బాపు-ముళ్ళపూడి-ఆరుద్ర, కె. బి. తిలక్-ఆరుద్ర కావచ్చని ఒక మౌలిక ప్రతిపాదనతో ఈ పరిశోధన సాగింది. ఇంకా కొంత సమాచారం, విశ్లేషణ కొనసాగాలి. ఆ దిశలో ఇది తొలి ప్రయత్నంగా భావింపమని మనవి.

ఈ గణాంకాల విశ్లేషణకు కావలసిన ముడి సమాచారం ఎంతో ప్రయాసతో నాకు అందించి సహకరించినవారు, మా సిడ్నీ వాస్తవ్యులు, డా. ఊటుకూరి సత్యనారాయణ గారు. ఆ ముడి సమాచారాన్ని 7 పట్టికలో అమర్చాను. ఆ పట్టికలు అంతర్లీనంగా మనకు అందించే సారాన్ని పరిశీలిద్దాము.

పట్టిక-1: ఆరుద్ర 1950 మొదలు తన 42 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 507 సినిమాలలో, సుమారు 1,498 పలు తరహా (భక్తి, దేశభక్తి, జానపద, సాంఘిక, క్లబ్, హాస్య, వ్యక్తిత్వ వికాస ..) పాటలను అందించి, సినీ గేయ సాహిత్యంపై  తనదంటూ ఒక ముద్రను వేశారు. ఆరుద్ర పాటలలో 206 పాటలకు మామ కె. వి. మహదేవన్ (13.8%) మరియు 150 పాటలకు సాలూరి రాజేశ్వరరావు (10.0%), ఆ తరువాత సత్యం, పెండ్యాల స్వరకల్పన అందించగా, సుమారు 528 అంటే 35.2 శాతం పాటలకు పట్టికలో చూపని మిగతా సంగీత దర్శకులు స్వరాలను అందించారు. అదే ఆత్రేయతో పోలిస్తే, ఆత్రేయ పాటలకు సింహభాగం (34.1%) సంగీతం అందించింది మామ మహదేవనే!

పట్టిక-2: ఈ పట్టిక సినీ దర్శకులతో ఆరుద్రకున్న అనుబంధాన్ని సూచిస్తుంది. ఆరుద్ర వి. మధుసూదనరావు దర్శకత్వములో అత్యధిక సినిమాలకు (30) పనిచేశారు అంటే తాను పాటలు రాసిన సినిమాలలో 7.2 శాతం విక్టరీ వారివే. ఒక విధంగా చూస్తే, కె. బి. తిలక్ తన ఆధ్వర్యంలో వచ్చిన సినిమాలకు ఆరుద్రకు 72.7 శాతం అవకాశం ఇచ్చారు, ఆ తరువాత, వి. రామచంద్రరావు, జి. రామినీడు, బావు నిలుస్తారు. ఆరుద్ర 57 శాతం సినిమాలు మిగతా వారి దర్శకత్వంలో వచ్చినవే.

అలాకాక, బావు, మధుసూదనరావు, రాజేంద్రప్రసాద్ మరియు తిలక్ దర్శకత్వంలోని సినిమాలలో వచ్చిన మొత్తం పాటలలో ఆరుద్రకు ఇచ్చిన అవకాశం ఎంత అని కూడా విశ్లేషించాను. బావు 34 సినిమాలలో 300 పాటలు (112, సంప్రదాయ కీర్తనలు) రాగా, అందు ఆరుద్ర 20 సినిమాలకు 82 పాటలు అందించారు (సుమారు 28 శాతమన్నమాట). మధుసూదనరావు 65 సినిమాలలో 513 పాటలు ఉండగా, ఆరుద్ర వంతు 84 పాటలు (16.4 శాతం). రాజేంద్రప్రసాద్ 24 సినిమాలలో (నిర్మాత, దర్శకుడు, లేదా రెండు) 169 పాటలు రాగా, ఆరుద్ర వంతు 24 పాటలు (14.2 శాతం). చివరగా తిలక్ 11 సినిమాలలో (నిర్మాత, దర్శకుడు, లేదా రెండు) 106 పాటలు ఉండగా, ఆరుద్ర రాసినవి 57 (53.8 శాతం).

సంఖ్యాపరంగా మధుసూదనరావు ముందు ఉంటే, అధిక ప్రాధాన్యత ఇచ్చింది తిలక్ అని చెప్పవచ్చు. వారి జోడీలో వచ్చిన అత్యుత్తమ పాటలలో “ఉయ్యాల జంపాల” చిత్రం తెలుగు వారి మదిలో నిలిచిపోతుంది. ఒక “కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది” పాట చాలు వారిని చిరస్థాయిగా నిలపడానికి అనడంలో అతిశయోక్తి లేదు! అలాగే మధుసూదనరావు సారధ్యంలో ఆరుద్ర “రక్తసంబంధం” సినిమాకు రాసిన “అందాల బొమ్మ రావేమే, పందిట్లో పెళ్ళి జరిగెనే”, వీరాభిమన్యు, పవిత్రబంధం చిత్రాలు మేలు కలియికగా నిలుస్తాయి. బావు ఆరుద్రల అనుబంధానికి సాక్షి, బుద్ధిమంతుడు, ముత్యాలముగ్గు ఆదిగా అన్ని చిత్రాలలో విలువైన పాటలు మనకి అగుపడతాయి. ఆదుర్తి ఆత్రేయ లాగే, బాపు ఆరుద్ర ఒక మంచి కలియిక మేలి సాహిత్యం బయటకు రావడానికి.

పట్టిక-3: ఈ పట్టిక ఆరుద్ర పాటలు ఏ గాయక, గాయనీమణులు పాడారో తెలియచేస్తుంది. పి. సుశీల 533 ఆరుద్ర పాటలు పాడి ముందుంటే, యస్. పి. బాలు, ఘంటసాల రెండు, మూడవ స్థానాల్లో ఉన్నారు.

పట్టిక-4: ఏఏ నిర్మాతలు ఆరుద్ర చేత అత్యధికంగా పాటలు రాయించుకున్నారో తెలియచేస్తుంది. 12 సినిమాలకు ఆవకాశం ఇచ్చిన వై. వి. రావు గారు ఈ విషయంలో ముందుంటే, పి. బాబ్జీ మరియు డూండీ లు రెండు, మూడవ స్థానాల్లో ఉన్నారు. ప్రధానంగా మనకు తెలిసేదేమిటంటే, ఆరుద్ర చాలా ఎక్కవ మంది నిర్మాతలతో పనిచేశారని, ఏ నిర్మాతతోను  అద్వితీయ అనుబంధం ఉన్నట్టు అనిపించదు.

పట్టిక-5: ఆరుద్ర ఏ దర్శకుల చిత్రాలకు మాటలు అత్యధికంగా అందించారో మనం గ్రహించవచ్చు. తను 76 చిత్రాలకు మాటలు రాస్తే, సి. యస్. రావుతో 6 చిత్రాలకు అత్యధికంగా పనిచేశారు. ఏ దర్శకునితోను  అద్వితీయ అనుబంధం ఉన్నట్టు అనిపించదు. ఉదాహరణకు ఆత్రేయ మధుసూదనరావు దర్శకత్వంలో 22 చిత్రాలకు, ఆదుర్తితో 10 చిత్రాలకు పనిచేయడం మనకు కనిపిస్తుంది.

పట్టిక-6: ఆరుద్ర రాజేంద్రప్రసాద్ మరియు ప్రకాశరావులకు, 5 చిత్రాలకు మాటలు అందించి తొలిస్థానంలో ఉన్నారు. అదే ఆత్రేయ రాజేంద్రప్రసాద్ 11 చిత్రాలకు, రామానాయుడు 8 చిత్రాలకు రాసి, వారితో అనుబంధముంటే, ఆరుద్ర అనేకమంది నిర్మాతలతో పనిచేసినట్లు అవగతం అవుతుంది.

పట్టిక-7: ఆరుద్ర యన్. టి. రామారావు 15 చిత్రాలకు, 4 అక్కినేని చిత్రాలకు సంభాషణలు అందించారు. అదే ఆత్రేయ ఏకంగా 52 అక్కినేని చిత్రాలకు సంభాషణలు అందించి, ఆ రోజుల్లో ఆత్రేయ-అక్కినేని ఒక హిట్ కాంబినేషన్ అనడానికి ఒక ప్రాతిపదిక.

ఈ గణాంక విశ్లేషణ సశేషంగా భావిస్తూ, రాబోయే రోజుల్లో, మరింతలోతుగా ఈ వ్యాసాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను.

కృతజ్ఞతలు:

ఈ రచనకు కావలసిన ముడి సంఖ్యల వివరాలు అందించిన డా. ఊటుకూరి సత్యనారాయణ గారికి ఎన్నో కృతజ్ఞతలు. ఆ వివరాలు లేకపోతే ఈ గణాంక విశ్లేషణ అసాధ్యం.

Exit mobile version