Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు నేల తెలుగు మరువనేల

[శ్రీ అక్షరం ప్రభాకర్ మానుకోట రచించిన ‘తెలుగు నేల తెలుగు మరువనేల’ అనే గేయం పాఠకులకు అందిస్తున్నాము.]

వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం

నీ కన్న తల్లి పిలుస్తుంది
కదులు సోదరా
నువ్వు కదులు సోదరీ..//2//
నీ కన్న తల్లి కన్న మిన్న
ఏమి లేదురా,.. ఏమి లేదు సోదరీ

నీ మాతృభాష
మరణం అంచునున్నది ఓ చెల్లి
గుండె పగిలి తల్లడిల్లె
మన తెలుగు తల్లి,..//2//

వందేమాతరం
తెలుగే మనకున్న బలం
వందేమాతరం
తెలుగే మన మూలధనం
//వందేమాతరం//
//నీ కన్న తల్లి//

మన తల్లిపాలు
మనము తాగి పెరగలేదా
మన మిన్నీినాళ్ళు తెలుగు
చదివి ఎదగలేదా
మరి, పాలడబ్బ పాలతో
మనకెందుకు ఓనమాలు
పరాయి భాష మోజులో
మనకెందుకు మురిపాలు
తల్లి భాష అనాథైతే
తనయులుండి ఎందుకనీ
సొంత భాష చేదనే
చేవ చచ్చి బ్రతకనీ
పేగు బంధము మరిచిన
జాతి ఏది నిలవదనీ
అడుగుతుంది
నిన్ను నన్ను మన అందరి తల్లీ

వందేమాతరం
తెలుగే మన జీవజలం
వందేమాతరం
తెలుగే మన ఆత్మఫలం
//వందేమాతరం//
//నీ కన్నతల్లి//

మన తరతరాల చరితకు
నిప్పు మనమే పెడదమా
మన యుగయుగాల స్మృతులకు
ముప్పు మనమే తెద్దమా
మరి, లక్ష లేండ్ల సంస్కృతిని
మనమే బొంద పెడదమా
మన అక్షరాలకు శిక్ష లేసి
శిలువ మనమే వేద్దమా
మన ఇంటి జాడ నీడను ఎవడు
ఎట్ల మార్చెననీ మన యువత
భవిత భరోసా
ఎవడు నేల కూల్చెననీ
తెలుగు వెలుగు జిలుగుకు
తెగులు ఎట్ల పుడుతదనీ కదలమంది నిన్ను నన్ను
మన తెలుగు నేల తల్లి
//వందేమాతరం//
//నీ కన్న తల్లి//

మన జగతి ప్రగతి పథములో
సకల జనుల చేర్చుదాం
మన చెలిమి బలిమి పలుకులలో
పలుకుబడులు పలుకుదాం
మన బతుకు
బండి రథమును అమ్మనుడిగా నడుపుదాం
ఆటపాట ఊటలతో తెలుగు సేవకులవ్వుదాం
చేయి చేయి ఒక్కటైతే వెళ్ళిపోయే ఆంగ్ల దశ
నువ్వు నేను ఏకమైతే తెల్లబోదా తెల్లబాష
ఈ నిజము మరచి నిదురపోము
తెలుగు తనము మరువబోము
తెలుగోడి వాడి వేడి
గాడి తప్పనియ్యబోము
వందేమాతరం
తెలుగే మా నవతరం వందేమాతరం
తెలుగే మా యువతరం
//నీ కన్నతల్లి//

Exit mobile version