[శ్రీ ప్రశాంత్ రచించిన – తెలుగు ముత్యాల సిరి ముసి (మూసీ నది) – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది రెండవ, చివరి భాగము.]
కొలనుపాక:
ఈ ఆలేరు నది తీరంలో ఉన్న మరో ముఖ్య రాజనగరం కొలనుపాక. ఇది కళ్యాణి చాళుక్యుల నెలవీడులలో (సామ్రాజ్య రాజధాని) ఒకటి. ప్రాచీన పేరు కొల్లిపాక/కొల్లిపాకె/బింబావతిపురం/సోమశేఖర పురం/ కుదుటపురం.. మొదలయినవి [కొలనుపాక చరిత్ర – శాసనాలు, విరువంటి గోపాలకృష్ణ, 1998].
సామాన్య శకం 1030-34 మధ్య కొల్లిపాక నగరం కల్యాణి చాళుక్య రాజధానిగా మారింది.
తెలంగాణలో కొల్లిపాక (కొలనుపాక) మరియు పొట్లచెరువు నగరాలు కల్యాణి చాళుక్యుల సామ్రాజ్య నెలవీడులుగా (రాజధానులుగా) ఉండుట చేత ఘనకీర్తిని సంపాదించుకున్నవి [The Chalukyas Of Kalyana And The Kalachuris by B.R Gopal 1982], [State And Society in Andhra under The Kalyana Chalukyas (973 A.D. 1162 A.D.) by N Saibabu 2011]. కొలనుపాక ప్రాచీన కాలం నుండే ప్రముఖ జైన స్థలిగా, జైన విద్యా కేంద్రంగా ప్రసిద్ధము. అక్కడ ఉన్న జైన మందిరం చాలా పురాతనమైనది. కొలనుపాకలో రాష్ట్రకూటుల కాలం నుంచి శాసనాలు లభ్యం అవుతున్నవి, కొల్లిపాక ఈ ఊరి ప్రాచీన పేరు. ఇక్కడ 7-8వ శతాబ్దం నాటి సోమేశ్వర, విష్ణుమూర్తి యొక్క శిలా ఫలకాలు, శిల్పాలు దొరికినవి [కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల by ఎన్.రమాకాంతం 1976]. దీన్నిబట్టి 8వ శతాబ్ది పూర్వమే ఇక్కడ కాలముఖ మరియు వైదిక సంప్రదాయాలు వర్థిల్లినవి అని చెప్పవచ్చు.
ఇక్కడ ఎక్కువ కల్యాణి చాళుక్యుల పాలనా కాలం నాటి శాసనాలు లభించినవి [Inscriptions of Andhra Pradesh, Nalgonda district, Volume 1, edited by Dr. P.V. Parabrahma Sastry, 1992]. ఈ కొల్లిపాక ఎంత ప్రముఖమైన స్థలమో చెప్పుటకు చోళ సామ్రాజ్య శాసనాలు ఎన్నో కొల్లిపాకను గెలిచినట్టు ప్రస్తావించుట ఒక ఆధారం. కొల్లిపాక కల్యాణి చాళుక్య సామ్రాజ్య రాజధాని కాక పూర్వం నుంచే చోళులు కొల్లిపాకను ప్రముఖంగా పేర్కొంటూ ఉండుట వల్ల రాష్ట్రకూట కాలం నాటికే ఈ కొలనుపాక ఒక ప్రసిద్ధ జైన మరియు వైదిక విద్యా కేంద్రంగా ఎదిగినట్టు అర్థమవును.
కొలనుపాక వీరశైవ పంచ మహాపీఠాల్లో ప్రథమమైనది. ఇక్కడ వివిధ కులాలకు చెందిన 22 వీర శైవ మఠాలు ఉన్నవి. ఈ మఠాలు 11వ శతాబ్దం నుంచి ఏర్పడినట్టు చరిత్ర [కొలనుపాక చరిత్ర – శాసనాలు, విరువంటి గోపాలకృష్ణ, 1998]. వీరశైవ సంప్రదాయానికి చెందిన రేణుకాచార్య అనే గురువు కొలనుపాక సోమేశ్వర ఆలయంలోని శివలింగం నుంచి జన్మించి దేశంలో వీరశైవ సంప్రదాయ ప్రచారం చేసినట్టు ఐతిహ్యం.
చారిత్రకంగా, చాళుక్య సోమేశ్వర చక్రవర్తి కొలనుపాక, పొట్లపల్లి, రాయప్రోలు వంటి ప్రాచీన ప్రముఖ పంచ మఠాలకు దానం చేసినారు. జైన, వీరశైవ విద్యాకేంద్రం అవుట వలన కొలనుపాకను ఏలిన రాజులు, సందనాయకులు వివిధ కాలాల్లో ఇక్కడ విద్యార్థులకు, ఆచార్యులకు భోజన, గృహ వసతి కలిపించినట్టు శాసనాలు ద్వారా తెలుస్తున్నది.
కల్యాణి చాళుక్య మహా సామ్రాజ్య శాసనాలలో కొల్లిపాక గావ (రక్షక) అని ప్రస్తావించబడిన శాసనాలు కూడా చాలా లభ్యం అయినాయి. కళ్యాణ కటక మరియు కొల్లిపాకకు ఇట్లు ప్రముఖంగా రక్షక బిరుదులు ఎక్కువగా కల్యాణి చాళుక్య శాసనాల్లో కనిపించుట, అది కూడా సామ్రాజ్య రాజధాని కళ్యాణ కటకానికి మార్చిన తర్వాత కూడా వారి సామ్రాజ్యంలో ముఖ్య పాత్ర పోషించి ఉండే కొలనుపాక.
కాకతీయుల కాలంలో కూడా కొలనుపాక తగిన గుర్తింపు, స్థానం లభించింది. కాకతీయులు ఇక్కడ ఆలయాలను కట్టించి, పాత ఆలయాలు, మఠాలు బాగుచేసిరి. కాకతీయులు కొలనుపాకలో ప్రవహిస్తున్న ఆలేరు నది (ముసి నది యొక్క ఉపనది) నుంచి వంశవర్ధన అనే అద్భుత నీటి కాల్వ నిర్మించి నగర తాగు సాగు నీటి అవసరాలు తీర్చిరి [కొలనుపాక చరిత్ర – శాసనాలు, విరువంటి గోపాలకృష్ణ, 1998].
సాంస్కృతికంగా, తెలుగు నాట ఎందరో కవులకు , వేదాంతులకు నెలవు కొలనుపాక. కొలనుపాక వైభవం చెప్పాలంటే మరో పుస్తకమే అవుతుంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను.
రాచకొండ:
కాకతీయుల అనంతరం తెలంగాణను దిల్లి సుల్తానుల నుండి విడిపించి తిరిగి స్థానిక పాలన నెరపిన రాజ్యాలు ముసునూరి నాయకులు, రేచెర్ల పద్మనాయకులు. 1369లో రేచెర్ల పద్మానాయకులు ముసునూరి నాయకుల మీద విజయం సాధించి యావత్ శ్రీశైలం నుంచి వింధ్య పర్వతాల మధ్య యున్న ప్రాంతానికి అంతటికీ ఏలికలు అయినారు [Inscriptions of Andhra Pradesh, Nalgonda district, Volume 1, edited by Dr. P.V. Parabrahma Sastry, 1992]. ఈ ప్రాంతం దాదాపు ఇప్పటి తెలంగాణతో సమానం అని భావించవచ్చు. ఈ రేచెర్ల పద్మ నాయకుల రాజ్యానికి రాచకొండ ప్రధాన రాజధానిగా, శత్రు దుర్భేద్యమైన కోటగా ఉండెను. తర్వాత పాలనా పరమయిన వెసులుబాటు కొరకు రేచెర్ల వంశస్తులు రాచకొండ, దేవరకొండ నగరాలను రెండు కేంద్రాలుగా చేసుకుని రాజ్యాన్ని పాలిస్తూ ఉండిరి. రాచకొండ మహా దుర్గంగా, ఎన్నో ఆలయాలు, మండపాల నిర్మాణాలు, కవి సార్వభౌములు, కళాకారుల నిలయంగా వెలిగింది. ఈ రాచకొండ మహదుర్గం ఎంతో విశాలమైనది, ముప్పై మైళ్ళ చుట్టుకొలతతో కోటగొడలు, మధ్యలో పది మైళ్ళ వరకు వ్యాపించిన రాచకొండ రాజధాని నగరం, ఎన్నో ఆలయాలు, సరస్సులు, బావులు, మరియు రాచకొండ కోటకు ఈశాన్య సరిహద్దులో నది కలదు [A family history of Venkatagiri Rajas by Sastri, Alladi Jagannatha 1922].
ముసి ఉపనది అయిన ఒక వాగు కలదు. మూసి నది రాచకొండకు ఉత్తర, తూర్పు దిక్కులో కొంత దూరంలో మూసి నది కలదు.
ముసినది తీర ఆలయాలు:
మూసి నది పరివాహక ప్రాంతానికి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలదు. మూసి నది వెంబడి ఎన్నో ప్రాచీన నగరాలు, ఆరామాలు, ఆలయాలు, అగ్రహారాలు కలవు. అందులో కొన్ని చారిత్రకంగా ముఖ్యమయినవి కలవు. మూసి జన్మస్థానం అయిన అనంతగిరి కొండల వద్ద నుంచి మూసి కృష్ణా మూసి సంగమ క్షేత్రమయిన ఓడపల్లి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు కలవు.
వాడపల్లి/ఓడపల్లి:
తెలంగాణలో కృష్ణా ముసి సంగమ స్థలి. గొప్ప పుణ్య క్షేత్రం. చారిత్రకంగా అత్యంత ప్రాముఖ్యత కల ముసిక నగరం ఇదే.
హరిహర క్షేత్రం. అగస్త్యేశ్వర ఆలయం ఎంతో ప్రత్యేకం, ఇక్కడ లింగము పైన బిలము కలదు. స్థలపురాణం ప్రకారం ఒక బోయవానికి శివుడు తన తలలో నుంచి ఇచ్చిన మాంస భాగం కు గుర్తుగా అట్లా శివ లింగంపైన బోయవాని వ్రేళ్ళ గుర్తులు, మాంశ ఖండ తీసుకోగా ఏర్పడిన గుంట కలవు. ఆ బిలంలో గంగమ్మ గాయన్ని మాన్పుటకు వచ్చింది అని స్థలపురాణం. ఆ లింగం పైన ఉన్న నిలం లోతు చాలా ఎక్కువని స్థానిక కథనం.
వాడపల్లిలో నారసింహ క్షేత్రం కూడా కృష్ణా నదీ తీరంలో వెలసిన పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా చారిత్రకంగా అధ్యాత్మిక పరంగా బహు ప్రాముఖ్యత కలదు. శాసనాల్లో ఈ క్షేత్రానికి బదరికాశ్రమం అని పేరు. ఇక్కడి కృష్ణా మూసీ సంగమ ప్రదేశంలో బ్రదుకేశ్వర ఆలయం ఉన్నట్టు ఇక్కడ లభించిన కాకతీయ గణపతి దేవ కాలం నాటి శాసనం ద్వారా తెలియవస్తున్నది.
వాడపల్లి నారసింహ క్షేత్రానికి కల చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యతను ఇనుమడింప చేస్తూ, ఈ మధ్య నారసింహ స్వామి ఆలయ ముఖ మండపంలో బాదామి చాళుక్యుల కాలం నాటి కన్నడ దాన శాసనం ఒకటి దొరికినది
నాగులపాడు:
సూర్యాపేట జిల్లాలో ఉన్న అద్భుత ఆలయ సముదాయం, ప్రాచీన నగరం.
కాకతీయుల నాటి అద్భుత శిల్ప సంపద ఉన్న ఆలయాల్లో రామప్ప, స్వయంభూ దేవాలయం, వేయి స్తంభాల గుడి వంటి అద్భుత నిర్మాణాల చెంత నాగులాపాడు ఆలయాలు కూడా ఉంటాయి. నల్లరాతి మీద అత్యంత సుందర శిల్ప సంపద కల ఈ ఆలయాలు కాకతీయ శైలిలో ఉన్న ప్రత్యేక అందమయిన ఆలయాలు. ఇక్కడ గర్భగుడిలో పరమేశ్వరుడు లింగ రూపంలో కాకుండా అద్భుతంగా అర్చారూపంలో ఉంటారు. హరిహర ఆలయాలు. నాగులపాడు కాకతీయుల కాలంలో ఒక ముఖ్య పట్టణం. ఇక్కడ కాకతీయ శాసనాల్లో కూడా ముసి నది నుంచి తవ్వబడిన కాలువల గురించి ప్రస్తావన చూడవచ్చు [Corpus of Inscriptions of Telingana districts, Volume 1&2].
సోమవరము:
భృగుమాలికా సోమేశ్వర ఆలయం. సూర్యాపేట జిల్లాలో మూసి నదీ తీరంలో చాళుక్య కాలం నాటి ప్రాచీన ఆలయం. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించిన పిదప ప్రాయశ్చిత్తం కోసం భూలోకంలో ముసినది తీరాన ప్రశాంత వాతావరణంలో తపస్సు చేసి సోమేశ్వర స్వామి శివలింగ ప్రతిష్ఠ చేసినట్టు స్థల పురాణము. అద్భుతమయిన చాళుక్య కాకతీయ వేసర శైలిలో నిర్మాణం అయిన ఆలయం.
అనంతగిరి అనంత పద్మనాభ స్వామి ఆలయం:
ముసి నది జన్మ స్థానం అనంతగిరి కొండల్లో కలదు. ఆ సమీపముననే అందమయిన అనంతగిరి కొండల్లో ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం కలదు. ముచుకుందుడు అనే విష్ణు భక్తుడు తపః ఫలితముగా ముచికుందా నదిగా మారింది ఇచ్చోటనే. ముసి నది జన్మ స్థానం ఈ క్షేత్రానికి సమీపంలో ఒక కోనేరు వద్ద ఉండును. ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం ఈ కలియుగంలో, సుమారు నాలుగు వందల ఏండ్ల కిందట ఇక్కడకు వేటకు వచ్చిన ఒక గోల్కొండ నవాబు గారికి కలలో ప్రత్యక్షమై స్వామి తాను అక్కడ ఉన్న విషయం చాటుకున్నట్టు, ఆ నవాబు కాలంలోనే ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలియవస్తున్నది [అనంతగిరి మహాత్యం, కొండాపురం అనంతాచార్యులు]. అయితే, కాకతీయుల కాలంలో, రేచెర్ల కాలంలో తెలంగాణలో అనంత పద్మనాభ స్వామి ఆలయాలు ఎక్కువగా వెలిసిన కారణంగా ఈ ఆలయం కూడా అప్పుడే వెలసినది అని తోచుచున్నది. అనంతగిరి ఆలయాన్ని 1800 -1820 మధ్య నాటి హైదారాబాద్ ప్రభువులు మరమ్మత్తులు చేసి ఇనాములు ఇచ్చినారు. 1820లో హిందుస్థాన్ జియోగ్రఫీ రాసిన బ్రిటిష్ రచయిత హామిల్టన్ గారు ఔరంగాబాద్, బీదర్ సుబాల సమాచారం బాగా రాసిరి. అయితే, తెలంగాణ ఉన్న హైదారాబాద్ సుబాలో ఎప్పటికీ ఇంకా సర్వే పూర్తి కాని కారణంగా ఎక్కువ సమాచారం తెలంగాణ లేదా హైదారాబాద్ సుబ గురించి ఇవ్వలేదు. తెలంగాణలో వారు ఆ పుస్తకంలో చెప్పిన ఒకే ఒక ఆలయం ఈ అనంతగిరి కొండల్లోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం.
సంగం భీమలింగ క్షేత్రం:
యాదాద్రి భువనగిరి జిల్లాలో ముసినదిలో చిన్నేరు అనే ఉపనది కలిసే సంగమ ప్రదేశం సంగం భీమలింగం. ఈ సంగమ ప్రదేశంలో చిన్న దీవి వంటిది ఏర్పడినది (నది పరివాహక కంటే కొంత ఎత్తులో ఉండే రాతి నేల). ఆ దీవి మధ్యలో ప్రాచీన భీమేశ్వర శివలింగం కలదు. దగ్గర్లో ముసి నదిలో మంటపం కూడా కట్టినారు.
ఆమ్మనబ్రోలు:
నల్లగొండ – యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దులో ముసి నది తీరాన అమ్మనబ్రోలు గ్రామం కలదు. ఇక్కడ ముసి నదికి ఎడమ గట్టున అందంగా ఒక గుట్ట కలదు, ఆ గుట్ట వాలుపైన ముసి నడికి అభిముఖంగా, ప్రాచీన చాళుక్య శైలిలో చెక్కబడిన గంగాభవాని అమ్మవారి విగ్రహం కలదు, స్థానిక ప్రజలు నిత్యం ఆరాధించే దేవత. ఆధునిక యుగంలో అక్కడ ఒక ఆలయం నిర్మించిరి.
ఆమనగల్లు:
ఇది ప్రాచీన గ్రామం. కల్యాణి చాళుక్య కాలంలో అనుమగల్లుగా పిలువబడింది. ముసి నది తీరంలోనే ఈ ప్రాచీన నగరం కలదు. ఇపుడు ఒక గ్రామం. కాకతీయ, రేచెర్ల నాయకుల కాలంలో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఆమనగల్లు గుట్ట మీద చాళుక్యుల కాలం నాటి అద్భుత శివాలయం ఉన్నది. అందులో శివలింగం చాలా అరుదయిన పాలరాతి విగ్రహంతో ఉండును. గుట్ట పక్కనే చెరువు కూడా ఉండుట వలన రమణీయమైన దృశ్యంగా పరిసరాలు కనిపించును.
అరువపల్లి:
సూర్యాపేట జిల్లాలో ఆరువపల్లి ముసి నదికి చేరువలో కల నారసింహ స్వామి క్షేత్రము, గుట్టపైన కలదు. ఇది తెలంగాణ ప్రసిద్ధ గిరి కోటల్లో ఒకటి. తెలంగాణలో శ్రీకృష్ణ దేవరాయలు గెలిచిన దుర్గాళ్ళో అటువపల్లి కూడా ఒకటి.
హైదారాబాద్ నగరంలో ముసి తీరం వెంబడి కాశీ బుగ్గ శివాలయం కలదు. అది ఎంతో ప్రత్యేకం. ఇంకా మూసి, యిసీ నదుల సంగమం కూడా భక్తులు పవిత్రంగా భావిస్తారు.
గోల్కొండ ఎల్లమ్మ గుడి, మల్లన్న మఠం:
గోలకొండ కోటలో ఉన్న ఎల్లమ్మ లేదా జగదాంబిక అమ్మవారు. కాకతీయుల కాలంలో గోల్కొండ కోట మట్టి కోటగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ మల్లన్న మఠం, ఎల్లమ్మ ఆలయం అన్నట్టు తెలియ వస్తున్నది. ఈ మల్లన్న మఠం ఏర్పాటు కాకతీయ రెండవ ప్రతాపరుద్ర చక్రవర్తి సమయాన జరిగినట్టు తెలుస్తుంది, ఈ మఠానికి సంబంధించిన యోగి పుంగవులు కుతుబ్‌షాహీ నవాబుల కాలంలో గోల్కొండ కోట కట్టుటకు ఎంతో సాయం చేసి, నవాబుల చేత ఆదరణ పొందిరి [ప్రాచీనాంధ్ర నగరాలు, ఆదిరాజు వీరభద్రరావు]. గోల్కొండ ఎల్లమ్మ జగదాంబ అమ్మవారి బోనాల పండుగ తోనే హైదారాబాద్ నగరంలో అత్యంత వైభోపేతంగా జరిగే బోనాల ఉత్సవం మొదలవును. నిజాం కాలం నుంచి ప్రభుత్వం తరఫున ఇక్కడ ‘సర్కార్ బోనం’ అమ్మవారికి సమర్పించే ఆచారం కలదు.
ఖిల్లా మైసమ్మ:
17వ శతాబ్ది ప్రారంభంలో గోల్కొండ సుల్తానులు మూసి నది తీరాన వెలసిన హైదారాబాద్‌కి తూర్పున, మూసి తీరంలో నేటి సరూర్ నగర్ ప్రాంతంలో కొత్త రాజకోట నిర్మాణం మొదలు పెట్టినారు, కానీ అర్ధాంతరంగా మధ్యలో ఆపేసినారు. ఆ కొత్త కోటకు కావలి ఉండేటి అమ్మవారు మైసమ్మ. కోటలో విశాల గదులు, గోడలు కలవు. సరూర్ నగర్లో చారిత్రక, ఆధ్యాత్మిక స్థలి. ఇంకా ఈ ఆలయ ప్రత్యేకత చెప్పే విధంగా ఈ ప్రముఖ ఆలయంలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది కొడండ్లు పూజారులుగా ఉండుట ఆసక్తికరం.
తెలంగాణలో గడిలకు, కోటలకు, చెరువు గండ్లకు మైసమ్మ అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఆరాధించుట సంప్రదాయం. కోట మైసమ్మ, గండి మైసమ్మ అనే పేర్లకు మూలం ఇదే. మైసమ్మ అమ్మవారే ఆ కోటలకు, గండ్లకు రక్షణ. ఈ ఖిల్లా మైసమ్మ ఆలయంలో ఉన్న కోట ద్వారాలు, గదులు ఎంతో అందంగా ఉండును.
లంగర్ హౌజు రామాలయం:
హైదారాబాద్ నగరంలో ప్రాచీన రామాలయల్లో ఒకటి.
శ్రీరామదాసును గోల్కొండ కారగరం నుంచి విడిపించిన తర్వాత రామ లక్ష్మణులు వెలసిన క్షేత్రం ఈ ముసి నది చెంత ఉన్న లంగర్ హవాజు రామాలయం. ఇక్కడ రాములవారు శంఖ చక్రములతో వైకుంఠ రాముని వలె (భద్రాచలంలో అన్నట్టు) దర్శనం ఇచ్చును.
కార్వాన్ దర్బారు మైసమ్మ ఆలయం:
కార్వన్ ప్రాంతం పూర్వం మూడు నది తీరాన ఉన్న వాణిజ్య కేంద్రం. గోల్కొండ సుల్తానులు కాలంలో ఇక్కడ వజ్రాల వ్యాపారం బాగుగా జరుగుతూ ఉండేది. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి మైసమ్మ అమ్మవారి ఆలయం ఉండేది. కార్వాన ప్రాంతం నుంచి గోల్కొండ కోట దర్బారుకు పోయే దారిలో ఈ ఆలయం ఉండుట చేత, ఈ అమ్మవారిని దర్బారు మైసమ్మ అని పిలుచుట సంప్రదాయంగా మారింది. హైదారాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే బోనాల ఉత్సవాలలో ఈ కార్వాన లోని దర్బారు మైసమ్మ ఆలయంలో బోనాలు కూడా అత్యంత ముఖ్య పాత్ర పోషించును. కార్వాన్, పురానా పూల్, బేగం బజారు ఇత్యాది నగర ప్రాంతాల ప్రస్తావన సుమారు 325 సంవత్సరాలుగా తెలంగాణలో ప్రముఖ జానపదం అయిన నాంచారు కథలో గోల్కొండ పట్టణం వర్ణనలో చూడవచ్చు [తెలుగు జానపద గేయ సాహిత్యం, బిరుదురాజు రామరాజు]. ఈ దర్బారు మైసమ్మ గుడిని చారిత్రకంగా ప్రముఖ వ్యక్తులు అక్కన్న మాదన్న, శివాజీ మహారాజు వంటి వారు దర్శించుకున్నట్టు స్థానిక కథనం.
కార్వాన్ కేసరి హనుమాన్ ఆలయం:
ముసి నది ఒడ్డున హనుమంతుడు స్నానం ఆచరించిన ప్రదేశమని ఐతిహ్యం. ఈ స్థలిని కనుగొని నాలుగు శతాబ్దాల కిందట ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క గురువు సమర్థ రామదాసు గారు ఇక్కడ హనుమంతుని విగ్రహ ప్రతిష్ఠ గావించి ఆలయం నిర్మింప చేసినట్టు చరిత్ర. ఈ ఆలయంలో గర్భగుడి భూమి భూగర్భంలో ఉండును. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి వాడుతున్న అయిదు అఖండ దీపాలు నిత్యం వెలుగుతూ ఉండుట, స్వామి వారి పాదాల నుండి పవిత్ర జలము ఊరుట ఇక్కడ ప్రత్యేకం. ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో కాకుండా, కుంకుమ పువ్వుతో చందనం కలిపిన లేపనంతో అలంకరించుట అరుదయిన విషయం. మొక్కులు తీరినాక భక్తులు కూడా అఖండ దీపాలకు నేతిని, అలంకరణకు కుంకుమ పువ్వు చందన లేపనాన్ని సమర్పిస్తారు. ఆలయ నిర్మాణ శైలి కూడా కుతుబ్‌షాహీ కాలంలో ప్రసిద్ధినొందిన దక్కన్ నిర్మాణ శైలి లో ఉండును.
జియాగూడ శ్రీరంగనాథస్వామి క్షేత్రం:
సుమారు 450 సంవత్సరముల క్రిందట దక్షిణ దేశము నుంచి శ్రీరంగ క్షేత్ర గురువులైన వానమామలై మఠం జీయర్ స్వామి వారు హైదారాబాద్ నగరానికి వచ్చినపుడు, ముసి నదీ తీరంలో నివసించే వారు. ఈ ప్రాంతంలో ఉన్న తెలుగు భక్తుల కోరిక మేరకు జీయర్ స్వామి ఇక్కడ రంగనాథ స్వామిని ప్రతిష్ఠించి ఆరాధన చేసినారు. జీయర్ స్వామి నెలకొల్పి ఆరాధిందించిన ప్రదేశం కావున ‘జీయర్ గూడెము’ అని ఈ ప్రాంతానికి పేరు. కాల క్రమంలో ‘జీయర్ గూడ’ గా మారి చివరికి ‘జియాగూడ’ అని పిల్వబడుతున్నది. హైదారాబాద్ నగరంలో ప్రముఖ వైష్ణవ ఆలయాలలో ఒకటి జియాగూడ రంగనాథ స్వామి ఆలయం. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగును.
కిషన్ బాగ్ కృష్ణ ఆలయం కాశీ బుగ్గ ఆలయం:
మూసి నది చెంత నగరంలో కిషన్ బాగ్‌లో సుమారు రెండు వందల పది సంవత్సరాల క్రింద అద్భుతమయిన శివాలయాన్ని మూసి నది ఒడ్డున స్థానిక జాగిర్దారు రాజా రాఘవ్ రాంజీ గారు కట్టించినారు. ఈ ఆలయంలో శివబాభిషేకానికి నిత్యం నీరు వచ్చే విధంగా ఒక అద్భుత సాంకేతిక వ్యవస్థ ఏర్పాటు చేసినారు. ప్రధాన ఆలయం భూ ఉపరితలానికి దిగువగా ఉండును. ఇక 1850వ దశకంలో కిషన్ బాగ్‌లో ఎంతో పెద్ద ప్రాకారాలతో కృష్ణ ఆలయాన్ని రాజ రఘు రాం బహద్దూర్ నిర్మించెను. ఎంతో ఎత్తయిన ద్వారాలు, ప్రాకారాలు, ఉద్యానవనాలు, ఆలయ సిబ్బంది నివసించుటకు క్వార్టర్లు, గోశాల, ఆలయ పూజా సమయాల సూచించే పెద్ద ఢమరుకములు మ్రోగించే నఖర్‌ఖానా, మొదలయినవి కలవు
ఈ రెండు ఆలయాల నిర్మాణ శైలి కూడా కుతుబ్‌షాహీ కాలంలో ప్రసిద్ధినొందిన దక్కన్ నిర్మాణ శైలిలో ఉండును. ఇది ఉత్తర దక్షిణ భారత దేశ నిర్మాణ శైలిల మిశ్రమంగా ఉండును.
ఇట్లా హైదరాబాదు నగరంలో పాత నగరంలో మూసీ తీరాన ఇంకా ఎన్నో ఆలయాలు కలవు మరియు హైదారాబాద్ నగర శివారు క్షేత్రాల్లో మూసి నది తీరాన ఎన్నో ప్రాచీన ఆలయాలు కలవు.
మూసి తీర ప్రాంత మధ్యయుగ సాంస్కృతిక ప్రాముఖ్యత:
ముసి నదికి ముచికుందా/ముచుకుంద అనే పేరు కలదు. ముచికుందుడు అనే విష్ణు భక్తుని పేరు మీద ఏర్పడిన నది అని ఆ పేరు. ముసి నది చారిత్రకంగా ఎంత ప్రాముఖ్యత కలదో ఇదివరకు చూసినాము. ఆ చారిత్రక వైభవానికి దర్పణం పట్టే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మంగళ హారతి పాటయిన “శ్రీ లక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ” అనే పాటలో ముచికుందా నది, తుంగభద్రా నదుల ప్రస్తావన ఉండును. ఈ పాట తెలంగాణములో బతుకమ్మ పాటల్లో అత్యంత ముఖ్యమైన పాటల్లో ఒకటి కూడా. ఈ పాటలోని ముచికుందా నది తెలంగాణా ప్రాంతానికి సాంస్కృతిక ప్రతినిధిగా, తుంగభద్రా నది రాయలసీమకు సాంస్కృతిక ప్రతినిధిగా అర్థం చేసుకోవచ్చు అని బిరుదురాజు గారు చెప్పినారు [తెలుగు జానపద గేయసాహిత్యం, బిరుదురాజు రామరాజు, 1958]. ఈ విధంగా ఎంతో చారిత్రక సాంస్కృతిక ప్రాశస్త్యం ఉన్న మూసి నదికి కల మరిన్ని సాంస్కృతిక అంశాలు ఈ కింద కొన్ని పొందుపరుస్తున్నాము.
పానుగల్లు నగరం:
ఇది ప్రాచీన నగరం. మధ్య యుగంలో కల్యాణిచాళుక్య కాలంలో మూసి నది జలాల వాళ్ళ ఎంతో పెద్ద ప్రముఖ నగరంగా ఎదిగి కందూరు చోళుల రాజధాని అయ్యెను. తెలుగునాట కృష్ణా గోదావరి నడుమ ఎంతో సుందరమయిన ఆలయాలు కల ప్రాంతంగా పానుగల్లు వినుతికెక్కింది. ఇక్కడి పచ్చల సోమేశ్వర ఆలయము, ఛాయాసోమేశ్వరాలయము నాటి ఆర్థిక సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. పానుగల్లు క్షేత్రానికి ప్రముఖ వీరశైవ ఆచార్యుడయిన పండితారాధ్యుడు వచిన్నట్టు పాల్కురికి సోమనాథుని రచన ద్వారా తెలియవస్తున్నది. పానగల్లు నగర వైభవం యొక్క ప్రస్తావన పండితారాధ్య చరిత్రలో కూడా ఉండుట ఈ క్షేత్ర సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను దర్పణం. పల్నాటి వీర చరిత్రలో పానుగంటి నుండే కలుకోడిని తీసుకపోయినారు. వ్యవసాయ సమృద్ధి వాళ్ళ, పాడి సంపద కూడా పుష్టిగా ఉండి ఉండవచ్చు, అందుకే ఇక్కడి కోడికి ప్రాముఖ్యత [పల్నాటి చరిత్ర, శ్రీనాథుడు]. తెలుగు నాట పానుగంటి/పానగంటి అని ఇంటిపేరు కలవారు ఎందరో ఉన్నారు. ఈ ప్రాచీన పానుగల్లు నగరంతో వారి పూర్వీకులకు సంబంధం ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు.
తమిళనాడులో ‘చోళ గ్రాండ్ ఆనికట్’ తమిళ చరిత్రకు ఎంత ముఖ్యమో, మన తెలుగు వారి చరిత్రకు, వైభవానికి ముసి నది పైన ఉన్న ప్రాచీన నమిలె ఆనకట్ట అంత ప్రాముఖ్యత కలదు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు, చరిత్ర పరిశోధకులు, వ్యవసాయ వేత్తలు, ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ప్రాచీన ఆనకట్టను యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తు వచ్చే విధంగా కృషి చేయ వలెను. మంచి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయవలెను.
మూసి నదికి నైరుతి దిశలో నల్లగొండ జిల్లాలో ఉన్న అహల్యానది తీరంలో సా.శ. 790 నాటికే కాలముఖ శైవ ఆచార్యులకు ఎన్నో దానాలు వేములవాడ చాళుక్య రాజు మొదటి అరికేసారి చేసినట్టు వారి కొల్లిపారా శాసనము ద్వారా తెలియవస్తున్నది [వేములవాడ చరిత్ర శాసనములు, బీ ఎన్ శాస్త్రి] [The l(v)emulawada Chalukyas, N Venkataramanayya]. ఈ అహల్యా నది చెంత వెలసిన పెరూరు అనే పట్టణం వేములవాడ చాళుక్య, కల్యాణి చాళుక్య, కందూరు చాలా, కాకతీయ రాజవంశాల కాలములలో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడి సోమేశ్వర ఆలయం తెలుగు నాట అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన సోమేశ్వర ఆలయాల్లో ఒకటి.
శ్రీశైల మల్లికార్జున సా.శ. 1315 నాటి ప్రతాప రుద్ర శాసనంలో తెలుగు నేలలో కల చాలా ప్రాంతాల/నాడుల నుంచి పల్లెలను శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయమునకు దానం చెసిన సమాచారం కలదు. ఆ శాసనంలో చెప్పబడిన ‘యిందుల వాయ స్థలం’ అని ఒక ప్రాంత ప్రస్తావన ఉన్నది [South Indian Inscriptions, volume 10]. ఆ యిందుల వాయ స్థలము ఇంద్రపురం ఉన్న ప్రాంతం, అంటే ముసి ఒడ్డున కల భువనగిరి నల్గొండ జిల్లాలలోని ప్రాంతాలు.
ఇదే ప్రాంతానికి గోల్కొండ రాజ్య కాలపు శాసనాల్లో చెప్పబడిన పేర్లు – ‘యిందుపుకేల సీమ’, ‘యిందులపాల పడ్డ’. ఉమ్మడి నల్లగొండలోని వలిగొండ పక్కన ప్రాచీన ఆనకట్ట ఉన్న ఈ ముసి నది ప్రాంతానికి రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ప్రముఖ స్థానం కలదు అని అవగతమవుతున్నది.
కుతుబ్‌షాహీల కాలంలో కూడా ఇక్కడ కాలువలు మరమ్మత్తు ద్వారా మరింత అభివృద్ధి చెందినవి.
కుతుబ్‌షాహీల కాలంలో జరిగినదిగా భావిస్తున్న బాలనాగమ్మ కథ జరిగిన ప్రాంతం మూసి నది జలాల చేత పునీతమయిన పానుగల్లు నగరమే [ఆంధ్ర సంస్థానాలు – సాహిత్య పోషణ, టీ. దోణప్ప, 1969], [ సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు, ఆంధ్ర సారస్వత పరిషత్తు, 1988].
ఇక్కడి నుంచి బుట్టిన ఈ జానపద కథ తెలుగునాట ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఆ కథ తెలుగునాట ఎన్నో నాటకాల్లో ప్రదర్షింపడబడింది, ఆ కథను తెలుగు సినిమా లాగ కూడా రెండుసార్లు నిర్మించినారు. అల్లసాని పెద్దన పద్యంలో కూడా పానుగంటి ప్రస్తావన కలదు.
ఇక కాకతీయుల కాలంలో పశ్చిమ ప్రాంతంలో రక్షణకు నిర్మించిన మానుగల్లు కోట, నేటి గోలకొండ. అదే కుతుబ్ షాహీల కాలంలో గోలకొండ నగరంగా అభివృద్ధి చెందింది. తరువాత 1590 దశకంలో హైదరాబాదు నగరం మూసి నది ఒడ్డున మైదాన ప్రాంతంలో కట్టబడింది. తెలుగు సుల్తాన్లుగా తమను తాము పిల్చుకున్న కుతుబ్ షాహీలు తెలుగు భాష, సాహిత్యం కళలను ఎంతో ఆదరించి పోషించారు, తెలుగు ప్రజలకు తగు ప్రాధాన్యతను ఇచ్చినారు. ఆ కాలం నుండే గోలకొండ, హైదరాబాదు నగరాలూ ప్రపంచ వాణిజ్య పటంలో ఎంతో పేరు గడించినాయి. తెలుగు సాంస్కృతిక నగరంగా హైదరాబాదు ఎదిగింది.
మరింగంటి కవులు:
తెలుగునాట తాళ్ళపాక కుటుంబం తరువాత అంత సుదీర్ఘంగా సాహిత్య, ఆధ్యాత్మిక భక్తి సేవ చేసిన కుటుంబాల్లో మరింగంటి వారు మొదటి వరుస. నల్లగొండ మూసి జలాలచే పునీతమయిన పానుగల్లు సమీపములో వీరి కుటుంబం మొదట బయలుదేరి, తెలంగాణ అంతటా విస్తరించి, కోస్తాలో కొన్ని జిల్లాల్లో కూడా విస్తరించింది. తెలంగాణలో ప్రముఖ వైష్ణవ క్షేత్రాలకు యావత్ ఆంధ్ర దేశం అంతటా ప్రాచుర్యం కలిపించుటలో వీరి పాత్ర అద్వితీయం. తెలంగాణ భక్తి సాహిత్యాన్ని, స్థానిక క్షేత్ర మహత్యలను, సంకెర్తన సాహిత్యాన్ని, శతకాలను సుసంపన్నం చేసిన మహనీయులు ఎందరో ఈ సాహిత్య కుటుంబంలో జన్మించెను. యాదగిరి గుట్ట పైన తొలి రచనలు వీరి కుటుంబం వారే. కుతుబ్‌షాహీ రాజు ఇబ్రహీం కుతుబ్ షాహ్కి మల్కాభిరాం అన్న బిరుదు నొసంగిన తెలుగు పండితుడు మరింగంటి సింగరాచార్యుల వారే [మరింగంటి కవుల సాహిత్యసేవ – టీ శ్రీరంగస్వామి, 1990].
ఈ ప్రాచీన మధ్యయుగ ప్రాముఖ్యతను ముందుకు తీసుకపోతూ, ఆధునిక యుగంలో కూడా మూసి నది యొక్క సాంస్కృతిక పాత్ర విశేషంగా గుర్తించ బడినది. పైన (మొదటి భాగంలో) చెప్పుకున్నట్టు 19వ శతాబ్దిలో 1830 నాటి కాశీ యాత్రా చరిత్రలో ముచుకుందా నది గొప్పది అని, స్థానికులు మూసి అని పిలుస్తారు అని రాసెను. ఇక 1852 నాటి వాడపల్లి శాసనంలో కృష్ణా ముసి సంగమ క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుపుతూ కృష్ణ ను గంగతో పోల్చినారు, ముసి (ముశి అని శాసనంలో) నదిని యమునతో పోల్చిరి. మూసి నది వరదల గురించి జగిత్యాల కవి జైశెట్టి రాజయ్య గారు ముచుకుందా ప్రళయ తాండవం 1908 లో రాసిరి.
ఈ పరంపరలోనే ఒక అద్భుత విషయం చూద్దాము. 1957-58వ సంవత్సరంలో ప్రచురితమయిన నారాయణీయము అనే సాహిత్య కృతిలో కూడా చూడవచ్చు. 1957 కాలములో నాటి ప్రముఖ తెలుగు కవుల్లో ఒకరు అయిన కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారి అనువాద రచన. దీనికి మూలం సా. శ. 1586 లో కేరళ ప్రాంత కవి నారాయణ భట్టతిరిచే వ్రాయబడిన సంస్కృత కావ్యమైన ‘నారాయణీయం’. ఈ తెలుగు అనువాద కృతి అయిన ‘నారాయణీయము’ ను కృతికర్త కల్లూరి గారు నాటి కేరళ రాష్ట్ర గవర్నరు, సాహితీ వేత్త, మాజీ హైదారాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బహుభాషా కోవిదుడు, నాటి ముఖ్య తెలుగు నేతల్లో ఒకరైన బూర్గుల గారికి సమర్పించిరి. బూర్గుల గారు ఈ కావ్యాన్ని మేళతాలాలతో ఊరేగిస్తూ గురువాయూర్ స్వామికి అంకితం ఇచ్చినారు.
ఈ అనువాద కృతిలో కృతికర్త కల్లూరి గారు, కృతి స్వీకర్త అయిన బూర్గుల గారి ప్రశంసను పద్యముల రూపములో రాసిరి. అందులో ఒక చోట గోదావరి తీర మహా వేద విద్యా క్షేత్రాలు అయిన ధర్మపురి నరసింహుని కరుప్పుర నివాళులు అర్పించినారు. భారతదేశంలో ప్రముఖ వేదవిద్యా కేంద్రములలో ఒకటి, వేద ఘనాపాఠీలకు ప్రసిద్ధి అయిన తెలుగు నాట అతిపెద్ద అగ్రహారమయిన మంథెన(మంథని) లోని ఘనా పాఠీల వేద ఘోషకు మంగళం పాడినారు.
దక్షిణ కాశీగా ప్రముఖ హరిహర క్షేత్రం అయిన వేములవాడ లోని భీమకవికి వరమిచ్చిన భీమేశ్వర లింగానికి భక్తితో కౌగిలించుకున్నట్టు చెప్పినారు (వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పాటు ఎంతో చారిత్రక ప్రాధాన్యత, శిల్ప సౌందర్యం కల అతి పెద్ద భీమేశ్వర ఆలయం కూడా కలదు). వీటన్నిటితో పాటు ముచికుంద అని పేరు కల ముసి నది తీరంలో ఉన్న భాగ్యనగర దేవతల (అమ్మవార్లకు) యొక్క ఆనతులు తీసుకున్నట్టు చెప్పినారు. అందుకు వారు పద్యంలో “ముచికుందు పేరియమ్మూసీనదీ భాగ్యనగర దేవతల కానతులు సలిపి” అని చెప్పినారు. ఈ విధంగా వేద సంస్కృతికి ప్రాచీన క్షేత్రాల సరసన మూసి నది ప్రస్తావన కూడా చేర్చుట వలన ఈ నదికి ఎంత సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉండెనో స్పష్టంగా అవగతమవును.
మూసి నది చారిత్రక రాజకీయ ప్రాముఖ్యత:
మూసినది పరివాహకం నాటి ఖారవేల నుంచి నేటి హైదరాబాదు వరకు ఎంతో ప్రసిద్ధ వ్యాపార వాణిజ్య రాజకీయ ప్రాంతం. మూసి నది వెంబడి ఎన్నో పెద్ద నగరాలు, గొప్ప రాజధానులు వెలిసినాయి. కందూరు చోళులు, కల్యాణి చాళుక్యులు, రాచకొండ రాజ్యం, గోల్కొండ, నిజాము కాలములో మూసి నది పరివాహకమే రాజధాని నగరాలు. వీటికి తోడుగా ఇది వరకే చెప్పుకున్నట్టు, గజపతి మహాచక్రవర్తుల కాలంలో కూడా వారణాసి కటకం (నేటి ఒడిశాలోని కటకం) ప్రధాన రాజధాని అయితే, బెంగాల్ ప్రాంతం నుంచి కంచి వరకు వ్యాపించిన గజపతి సామ్రాజ్య చక్రవర్తి కొలువు తీరిన మరి సామ్రాజ్య రాజధాని, ‘మహదుర్గ కటక మణి’ మూసి తీరానికి దగ్గర్లో ఉన్న ఉండ్రుగొండనే అగుట ఎంతో అబ్బురపరిచే విషయం!
18వ శతాబ్దంలో పానుగల్లు నుంచి కాళహస్తికి వలస వెళ్లిన వెలమ రాజుల కుటుంబం కాళహస్తి సమీపంలో ఒక చిన్న ఎస్టేట్ సంపాదించి అక్కడ కోట కట్టుకున్నది. ఆ ఎస్టేట్‌ను వారి పూర్వ మహా నగరమయిన మూసి నది జలాల చేత పునీతమయిన నల్లగొండ పానుగల్లు పేరు మీదనే పానుగల్లు అని పేరు పెట్టినారు, ఈ వంశం లోని రాజే పానుగంటి రాజా వారు, మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి (ప్రధాని) అయినారు. వారే మద్రాసులో పానగల్ పార్కు కట్టించినారు. అది తెలుగు వారికి, తెలుగు సినిమాకి ఎంతో ఉపయోగం అయింది. వారి పేరు మీద వైజాగ్‌లో ఆంధ్ర విశ్వ విద్యాలయ వైద్య కళాశాల భవనానికి పానగల్ భవనం అని పేరు. నెల్లూరు, మదురై లలో పానగల్ రోడ్డులు కలవు. ఈ అన్నిటిలో ఉన్న పానగల్, కాళహస్తి ఎస్టేట్, అంటే నల్లగొండ పానుగల్లు పేరు మీద,. అంటే మూసి నది వైభవంలో ఒక చినుకు ఎంత దూరాలకు పోయిందో కదా!
ముసి నది చరిత్రకు, వైభవానికి దర్పణం పడుతూ తెలుగునాట గొప్ప చరిత్ర పరిశోధకులు, సాహితీవేత్త అయిన బీఎన్ శాస్త్రి గారు ‘మూసీ’ అనే తెలుగు సాహిత్య పత్రిక మీదకు పెట్టినారు. ఆ పేరును కొందరు నిరసించినపుడు, మూసి నది ఈ నేల యొక్క భౌగోళిక, చారిత్రక ప్రాముఖ్యతకు జీవధార అని ఒక సంపాదకీయంలో చెప్పిరి.
ఇంత ఘన చరిత్ర కల మూసి నదిని కాపాడుకోవాలి, ఈ నది చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యత గురించి అవగాహన ప్రచారం కలిపించలి, తద్వారా తెలుగు చరిత్రకు, నేలకు ఎంతో కొంత సేవ చేసిన వారము అవుతాము.
(సమాప్తం)