[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘తెలుగు కవుల ప్రతిభ’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]
1.తెలుగు కవులు పద్య నిర్మాణమునకై బహు విధ క్లిష్ట నియమముల నేర్పరచి,దక్షతతో నట్టి యద్భుత పద్య రచనతో ననేక మహత్తర కావ్యములను వెలువరించినారు. అట్టి మహనీయులకు మనము శిరస్సు వంచి నమస్కరింప వలయును. ఒక పదమున కొక చోట యతి నుంచుట గాక, మరి యొకటి, రెండు,మూడు చోట్ల యతి నుంచ వలసిన నియమ నిర్దేశనము గావించిరి .బిందు పూర్వకము,లఘువు, గురువు,ద్విత్వాక్షరము ,సంయుక్తాక్షరములు మొదలగు వానికా రీతి లోనే యతిని ఉంచవలెనని ఆదేశించిరి. నాటి కవుల మేధకు దృఢతర పరిశ్రమను కల్పించిరి. దాని కనుగుణముగా కవులు మేధావులై, బృహత్తర కావ్యముల నిర్మాణమును గావించి, కీర్తిని గడించిరి.
2. అవధాన ప్రక్రియ మన తెలుగు భాష కొక ఆణి ముత్యమగు భూషణము.ఇందు అవధానికి న్యస్తాక్షరి,నిషిద్ధాక్షరి,సమస్య,దత్తపది–ఇత్యాది ప్రక్రియలలో ప్రశ్నలను సంధించి,ఏక కాలమున వారి ధారణచే తగిన పూరణలను రాబట్టుట ఒక అద్భుత విన్యాసము.పద్య విద్య మేధకు పదును పెట్టుటకై చాల దోహద మొనర్చు చున్నది. జ్ఞాపక శక్తిని పెంపొందించు చున్నది.
3. ఒక పద్య పాదము నందు మొదటి గణము ప్రథమాక్షర,ద్వితీయాక్షరములను మార్చి, ఆ పద్యమునే వేరొక పద్యముగా మార్చుట శక్యము కాగలదు. ఉదాహరణగా —
1) ఉ: కొల్చెద విష్ణునిం బతిగ కొల్చెద నీశ్వరు స్వామిగా , మదిన్
చం: కొలిచెద విష్ణునిం బతిగ,కొల్చెద నీశ్వరు స్వామిగా,మదిన్
2) మ: కొలువై యుంటివి షిర్డి యందు ఘన సత్కీర్తిన్ ప్రకాశించి,మా
శా: కొల్వై యుంటివి షిర్డి యందు ఘన సత్కీర్తిన్ ప్రకాశించి,మా
3) మ.కో : షిర్డియే గద భక్త కోటికి శ్రేయ ధామము ధాత్రిలో
త: శిరిడియే గద భక్త కోటికి శ్రేయ ధామము ధాత్రిలో
పద్యము వ్రాయుటకు యత్నించు వారు ,మొదటిగా తేటగీతి, ఆటవెలది పద్యములతో ప్రారంభించ వలెను. తరువాత ఇతర పద్యముల రచన కుపక్రమించ వచ్చును.
తెలుగు పద్య విశిష్టత
అనేక ప్రసిద్ధ తెలుగు కవులీ పద్య రచన యందు వివిధ రకములుగా సాము(గారడీ)లను ప్రదర్శించినారు.
1. ఒక కంద పద్య పాదమును మొదటి నుండి చివరకు ,చివర నుండి మొదటికి చదివినా ఒకే పాద ముండ గలదు. ఇది కవి ప్రతిభయే కదా. (శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు. 1957)
కం:
సరిగాని సాని గారిస
మారిని గని మారి మారి మాని గనిరి మా
దరి గాద మా దగారిద
దారి సని పదా పగా పదా పని సరిదా
ఇది సంగీత, సాహిత్య సమ్మేళనమును తెలుపు పద్యము.
2, ఒక ఛందస్సు పద్యము నందు అవే అక్షరములతో ఏర్పడు మరొక ఛందస్సు గల పద్యమును నాటి కవులు రచించి చూపగలిగిరి.
1) మత్తేభ గర్భ సీసము 1 + కంద గర్భ సీసము 2
1. సీ:
వి(నయ సంపన్న! రవి ప్రభూత! రమణీ
నాథా! పయోజేక్షణా!)నరాప్త
వి(భయదాకార!హవిర్భుగాయత!రిపు
ప్రాణానిలాహీశ్వరా!)వరేణ్య!
వి(జయకాలానల విక్రమ ప్రథిత సా
లగ్రావ వృద్ధశ్రవా!)వరేణ్య!
వి(జయశీలా!యదువీర!కౌస్తుభ ధరా!
చక్రీ!యశోదాత్మజా!) ముకుంద!
2. గీ:
(కరివదన! పూతనాంతక!) (గరుడ గమన!
సత్య సహిత!కామ జనక!శం) (కర సఖ!
కనక వసన! సుం)(దర దేహ!వనధి శయన!
సనక ముని వినుత (తా)!) చరణ సరసిజ యుగ!
(కవి–శ్రీ పోకూరి కాశీపత్యావధానులు –1998)
2. కంద గర్భ సీసము (స్వీయరచన)
సీ: మనసు (నందలి భీతి మన ధృతిన్)
(క్రిందికి పడద్రోయును కద కేవలము పగను(న్)
శక్తి (నంద వలయు సత మిలలో)
(నందరును కలసి సలిపి ననవరతమును (ంబున్)
3. నాటకము లందు పద్య పఠనమును రాగ తాళ యుక్తముగా నటులు పాడి, ప్రేక్షకుల మనోరంజకముగా నటించుట తెలుగు కవుల మరొక అద్భుత సృష్టి. పలు చారిత్రక,పౌరాణిక,సాంఘిక నాటకము ల0దీ పద్యములను చదువ గలరు.
4. ఒకే పదము నుపయోగించి, వివిధార్థములు వచ్చు రీతిగా కావ్యమును వ్రాసి,రెండు గాని,మూడు గాని గాధలను వర్ణించుట నాటి మేటి కవుల మేధాశక్తికి, ప్రజ్ఞాపాటవములకు తార్కాణము.
రాఘవ పాండవీయము —పింగళి సూరన,హరిశ్చంద్ర నలోపాఖ్యానము— భట్టు మూర్తి. ఇవి ద్వ్యర్థి కావ్యములు.
కాశీపతి చమత్కృ తి—త్యర్ధి కావ్యము —శ్రీ పోకూరి కాశీపత్యావధానులు(1998)
శివపార్వతుల,తారాచంద్రుల,సారంగధరుని చరిత్ర నొక పద్య కావ్యముగా రచించిరి.
5. ఒకే పద్యమున ముప్పది దేవతలను ప్రస్తుతించినది—త్రింశదర్థ పద్యము.
6. నిర్వచన, నిర్యోష్ట్య శుద్ధాంధ్ర హరిశ్చన్ద్ర నలోపాఖ్యానము. శ్రీ వీరేశలింగము గారు
ద్విప్రాసము—పద్యమున నాలుగు పాదము లందును మొదటి రెండు అక్షరము లొకటే ఉండ వలెను.
త్రిప్రాసము— పద్యము నందలి నాలుగు పాదము లందును మొదటి మూడక్షరములు ఒకటే ఉండవలెను.
7. ఏకాక్షరి, ఏక పాది, ద్విపాది, పాద భ్రమకము,కంద ద్వయ చంపక నాగ బంధము
(చంపకమాల యందు రెండు కంద పద్యము లిమిడి యుండును)
గణితమును వివరించు పద్యములు కూడా రచింప బడినవి.
8. ఇట్టి బహు విధ చిత్ర, విచిత్ర నియమ ప్రక్రియలను ప్రదర్శించి పూర్వ కవులు ప్రఖ్యాతులైరి. వారి దీక్షా దక్షతల నెల్లరు ఉగ్గడింప వలయును.