[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]
~
శాస్త్ర సాంకేతిక రంగాలు – ‘పద్మ శ్రీ’లు:
ఈ రంగానికి చెందిన 24 మంది తెలుగువారికి గత 70 సంసంవత్సరాల కాలంలో ‘పద్మ శ్రీ’లు లభించాయి. అందులో కొందరికి – ఏ.యస్. రావు వంటి వారికి పద్మ భూషణ్ లభించడం విశేషం. 1960లో తొలిసారిగా ఏ.యస్.రావుకు ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. 1964లో జి. రామకోటయ్యకు ‘పద్మ శ్రీ’ లభించింది. వారి పూర్తి వివరాలు దొరకలేదు. డా. గద్దె రామకోటేశ్వరరావు పేరు పద్మశ్రీలు పొందిన ‘కమ్మ’ వారి పేర్ల జాబితాలో వుంది. అలానే 1981లో డా. ఏ. వి. రామారావుకు, డా. కాకర్ల సుబ్బారావు, డా. యలవర్తి నాయుడమ్మ, డా. ఐ.వి. సుబ్బారావు, డా. యం.వి. రామ్, డా. కోట హరినారాయణ, తదితర్ల పేర్లు (శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందినవారు) ఆ జాబితాలో కనిపిస్తున్నాయి.
సయ్యద్ ఫరీదుద్దీన్ 1967లో ‘పద్మ శ్రీ’ పొందారు. డా. ఏ. వి. రామారావుకు 1991లో ‘పద్మ శ్రీ’, 2016లో ‘పద్మ భూషణ్’ లభించాయి (లోగడే ప్రస్తావించాను).
డా. బి. యల్. దీక్షితులు (1936 అక్టోబరు 31):
బులుసు లక్ష్మణ దీక్షితులు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో ప్రొఫెసర్ గాను, ISRO కు చెందిన నేహనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డైరక్టరుగాను వ్యవహారించిన ప్రముఖ శాస్త్రజ్ఞులు. డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌లో నిపుణులు. బెనారస్ హిందూ యూనివర్శిటీ నుండి ఇంజనీరింగ్ పట్టభద్రులు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుండి మాస్టర్స్ డిగ్రీ, పి.హెచ్.డి పొందారు. 1991లో ‘పద్మ శ్రీ’ వరించింది ఒరిస్సాలో జన్మించిన ఆంధ్రులు.
డా. వి. కె. సారస్వత్ (1949 మే):
గ్వాలియర్‌లో జన్మించిన వీరికి పద్మ భూషణ్ పురస్కారం లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పొందారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ సభ్యులు. గతంలో రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి. భారత రక్షణ పరిశోధనా సంస్థ DRDO డైరక్టర్ జనరల్‍గా గణనీయమైన కృషి చేశారు. ఆర్యభట్ట అవార్డు అందుకున్నారు. జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ గాను, భారత రక్షణమంత్రికి ముఖ్య సలహాదారుగా పనిచేశారు.
డా. యం. వెంకటేశ్వరరావు (21 జూన్ 1928 – 2016 మార్చి 8):
మంగిన వెంకట వెంకటేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెంలో జన్మించారు. వ్యవసాయ శాస్త్ర రంగంలో ప్రముఖులు, హరితవిప్లవంలో ప్రముఖపాత్ర పొషించారు. నూనెగింజలు, గోధుమల ఉత్పత్తిలో పరిశోధనలు చేసిన ఘనుడు. ICAR డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా, ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ పదవీబాధ్యతలు నిర్వహించారు. బోర్గోగ్ అవార్డు (1993), ‘పద్మ శ్రీ’ (1999)లో అందుకున్నారు.
డా. దశిక దుర్గా ప్రసాదరావు (1939):
వీరు ప్రముఖ జియో శాస్త్రవేత్త. 1939లో గుంటూరు ప్రాంతంలో జన్మించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డైరక్టర్‍గా పని చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి ఫెలోగా 1998లో ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం 2001లో ‘పద్మ శ్రీ’ అందించింది. ప్రతిష్ఠాత్మకమైన భాస్కర అవార్డు 2003లో దక్కింది.
డా. చైతన్యమోయీ గంగులీ (1946 డిసెంబరు 31):
పశ్చిమబెంగాల్‌లో జన్మించారు. హైదరాబాదులోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అధిపతిగా హైదరాబాదులో పనిచేశారు. అటామిక్ ఎనర్జీ విభాగంలో 36 ఏళ్ళు కృషి చేశారు. 2002లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు.
డా. ఐ. వి. సుబ్బారావు (1934 డిసెంబరు – 2010 ఆగస్టు):
ఆచార్య డి. బాలసుబ్రమణ్యం (28 ఆగస్టు 1939):
దొరైరాజు బాల సుబ్రమణ్యం తమిళనాడులో జన్మించారు. హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా 1977లో నియమితులయ్యారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ డైరక్టర్‌గా 1998లో రిటైరయ్యారు. ఎల్.వి. ప్రసాద్ కంటి ఆనుపత్రిలో పరిశోధనా విభాగ డైరక్టరు. 2002లో వీరికి ‘పద్మ శ్రీ’ అందుకున్నారు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, ప్రాన్స్ దేశపు నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లభించాయి.
DRDO కన్సల్టెంట్‌గా వ్యవహరించిన డా. నాంపల్లి దివాకర్‌కు 2004లో ‘పద్మ శ్రీ’ వచ్చింది. ఆయన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో విద్యనభ్యసించారు DRDO శాస్త్రవేత్తగా మంచి పేరు. 2006 – 2012 మధ్య డైరక్టర్ (టెక్నికల్)గా పని చేశారు. పదవీ విరమణానంతరం 2013 నుండి సలహాదారు.
డా. లాల్జీసింగ్ (1947 జులై – 2017 డిసెంబర్):
బ్రిటీష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిస్సెస్‌లో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో యం.యస్.సి. చేశారు. DNA ఫింగర్ ప్రింటింగ్ పితామహుడిగా ప్రసిద్ధి. 1995లో సెంటర్ ఫర్ డి.ఎన్.ఎ. ఫింగర్ ప్రింటింగ్ సంస్థను స్థాపించారు. 2004లో జెనోమ్ ఫౌండేషన్ నెలకొల్పారు. 1998 -2009 మధ్య హైదరాబాదు లోని CCMB డైరక్టర్. బెనారస్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. 2004లో ‘పద్మ శ్రీ’ అలంకృతులు.
ఆచార్య సయ్యద్ హస్నయిన్ (ఏప్రిల్ 1954):
బీహార్ లోని గయలో జన్మించారు. DNA ఫింగర్ ప్రింటింగ్ సంస్థ తొలి డైరక్టర్‌గా 1999లో నియమితులయ్యారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయం ఏడవ వైస్-ఛాన్సలర్. ప్రస్తుతం ఢిల్లీ IITలో నేషనల్ సైన్స్ పీఠాధిపతి. 2006 లో ‘పద్మ శ్రీ’ పొందారు. జర్మనీ ప్రభుత్వ పురస్కారం 2014లో లభించింది.
డా. హరీష్ కె. గుప్త (1942):
హైదరాబాదులోని NGRI సంస్థ డైరక్టరుగా 1992 నుండి ఒక దశాబ్ద కాలం వ్యవహారించారు. భారత ప్రభుత్వ సముద్ర జలాల అభివృద్ధి సంస్థ కార్యదర్శి (2001-2005). ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శాస్త్రవేత్త. సునామీ హెచ్చరిక విధానాన్ని కనిపెట్టారు. 2006లో ‘పద్మ శ్రీ’ వచ్చింది. అంటార్కిటికా అన్వేషణకు 1983లో నాయకత్వం వహించారు.
గొరిపర్తి నరసింహరాజు యాదవ్:
వ్యవసాయరంగంలో అనేక నూతన నివాసాలకు నంది పలికిన నరసింహారాజు కృష్ణా జిల్లా గూడూరులో జన్మించారు. పూసా బాసమతి బియ్యాన్ని 7.5 టన్నుల పంట ఒక హెక్టార్‌లో పండించిన ఘనుడు భారత ప్రభుత్వం వారి వ్యవసాయ పరిశోధనా విభాగాలలో ప్రముఖ స్థానం వహించారు.కృషి రత్న, కృషికరత్న, కృషిసమ్రాట్ బిరుదులతో పాటు, 2009లో ‘పద్మ శ్రీ’ కైవసం చేసుకొన్నారు.
డా. డి. విజయ ప్రసాద్ (1948):
వీరు ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో జన్మించారు. ధన్బాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ నుండి ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పి.హెచ్.డి. చేశారు. హైదరాబాదులోని NGR1లో 1970లో శాస్త్రవేత్తగా చేరి 2001లో డైరక్టర్‌గా బాధ్యతలు చేపట్టి 2010 వరకు పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గౌరవాచార్యులుగా బోధించారు. ఖనిజ, వాయు నిక్షేపాల పరిశోధనలో అగ్రగణ్యులు. 2010లో ‘పద్మ శ్రీ’ స్వీకరించారు.
ఇ. ఏ. సిద్దిఖ్ (1937):
వీరు తమిళనాడులో జన్మించారు. మదరాసు విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొంది, ఢిల్లీలోని వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రఖ్యాత వ్యవసాయశాస్త్రవేత్త డా. యం.యస్. స్వామినాథన్ పర్యవేక్షణలో డాక్టరేట్ పొందారు. 1987లో హైదరాబాదులో రైస్ రిసెర్చి డైరక్టరుగా నియమితులై 1994 వరకు పనిచేశారు. సెంటర్ ఫర్ డి.ఎన్.ఎ. ఫింగర్ ప్రింటింగ్ సెంటరు గౌరవ ఆచార్య పీఠం అధిష్ఠించారు. 2011లో ‘పద్మ శ్రీ’ లభించింది.
యం. రామకృష్ణరాజు:
భీమవరంలో జన్మించారు. క్యాన్సర్ చికిత్సకు 35 సంవత్సరాలుగా పరిశోధనలు కొనసాగించారు. న్యూక్లియర్ ఫిజిక్సు శాస్త్రవేత్త, రేడియేషన్ థెరపీపై విదేశాలలో అనుభవం గడించారు. 2013లో ‘పద్మ శ్రీ’ పొంచారు.
చింతకింది మల్లేశం:
యాదాద్రి భువనగిరి జిల్లా సారాజ్ పేటలో జన్మించారు. చేనేత రంగంలో విశేష పరిశోధనలు చేసి లక్ష్మీ ఆసు యంత్రం కనిపెట్టారు. పోచంపల్లి చేనేత కార్మికులు ఈ యంత్రం ద్వారా ఆరు గంటల పనిని 90 నిముషాల్లో చేయగలిగారు. 2017లో ‘పద్మ శ్రీ’ లభించింది.
యం. వి. గుప్త (1939):
ఈయన మత్స్య శాస్త్ర ప్రముఖులు. బాపట్ల సమీపంలో జన్మించారు WORLD FISH సంస్థలో పరిశోధనా విభాగంలో అసిస్టెంట్ డైరక్టరు. నీలి విప్లవ పితామహుడు. సున్వాక్ శాంతి పురస్కారం (2018), ‘పద్మ శ్రీ’ (2023) లభించాయి.
డా. అబ్బారెడ్డి నాగేశ్వర రావు (1952):
ప్రఖ్యాత ఉద్యానవన శాస్త్రవేత్త. తూర్పు హిమాలయ ప్రాంతాలలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేశారు. 2023లో ‘పద్మ శ్రీ’ పొందారు.
ఈ విధంగా శాస్త్ర సాంకేతిక రంగనిపుణులు పలువురు ‘పద్మ శ్రీ’ పొందడం తెలుగువారికి గర్వకారణం.
(ముగింపు వచ్చే వారం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.