Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగుజాతికి ‘భూషణాలు’-2

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

భారత రత్నలు:

2024 సంవత్సరంలో కేంద్రప్రభుత్వం ఒకేసారి ఐదుగురికి భారత రత్నలు ప్రకటించింది. సంవత్సరానికి ముగ్గురికి మించి ప్రకటించరాదు అనే నియమం వుంది. ఆయినా వివిధ కోణాలలో ఆలోచించి ఈ ప్రకటన చేశారు. 1954 నుండి 2024 మధ్యకాలంలో 70 సంవత్సరాలలో 53 మందిని ‘భారత రత్న’ వరించింది. అందులో దాక్షిణాత్యులు పలుపురు (14) వుండటం విశేషంగా గమనార్హం. ప్రభుత్వ జాబితా ప్రకారం ఆయా రంగాల దాక్షిణాత్య ప్రముఖులు.

క్ర. సం. సంవత్సరం ప్రముఖులు రంగము
1. 1954 సి. రాజగోపాలాచారి రాజనీతిజ్ఞులు
2. 1954 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రథమ ఉపరాష్ట్రపతి, ద్వితీయ రాష్ట్రపతి
3. 1954 సర్ సి. వి. రామన్ గణిత శాస్త్రజ్ఞుడు
4. 1955 మోక్షగుండం విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజనీరు, రాజనీతిజ్ఞులు
5. 1975 వి.వి.గిరి కార్మిక నాయకులు, రాష్ట్రపతి
6. 1976 కె.కామరాజ్ రాజనీతిజ్ఞులు, మదరాసు ముఖ్యమంత్రి
7. 1988 యం.జి. రామచంద్రన్ సినీ నటులు, తమిళనాడు ముఖ్యమంత్రి
8. 1997 ఏ.పి.జె. అబ్దుల్ కలాం రక్షణరంగ శాస్త్రవేత్త, రాష్ట్రపతి
9. 1998 యం. యస్. సుబ్బులక్ష్మి కర్ణాటక సంగీత విద్యాసురాలు
10. 1998 సి. సుబ్రమణ్యం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి
11. 2009 భీమసేన్ జోషి హిందూస్థానీ సంగీత విద్వాంసులు
12. 2014 సి. యన్. ఆర్. రావు శాస్త్రవేత
13. 2024 పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి

ప్రముఖుల జీవన రేఖలు:

రాజాజీ:

భారత రత్న అవార్డు పొందిన తొట్ట తొలి వ్యక్తులు (1954) ఇద్దరూ దాక్షిణాత్యులే. ప్రప్రథములు రాజాజీగా ప్రసిద్దులైన సి. రాజగోపాలాచారి (10 డిసెంబరు 1878 – 25 డిసెంబరు 1972). స్వాతంత్రోద్యమ నాయకులైన రాజాజీ రాజనీతిజ్ఞులు. న్యాయవాదిగా 1900 దశకంలో తమిళనాడు లోని సేలం కోర్టులో జీవనగమనం ప్రారంభించారు. సేలం మునిసిపాలిటీ చైర్మన్‌గా వుండగా మహాత్మా గాంధీ సన్నిహితుడిగా జాతీయ కాంగ్రెసులో ప్రముఖ పాత్ర వహించారు. వేదారణ్యం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930లో జైలు శిక్ష అనుభవించారు (ఆంద్రుడు కాకపోయినా ఇక్కడ వారిని స్మరిస్తున్నాం). 1937లో ఉమ్మడి మదరాసు రాష్ట్ర ప్రధాని (ముఖ్యమంత్రి)గా పదవిని చేపట్టి 1940 వరకు కొనసాగారు. జర్మనీ పై బ్రిటీషు ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన కారణంగా నిరసనగా పదవికి రాజీనామా చేశారు.

తాత్కాలిక కేంద్రప్రభుత్వంలో 1946లో పరిశ్రమలు, విద్య, ఆర్థికశాఖల మంత్రిగా నియుక్తులయ్యారు. స్వాతంత్రానంతరం 1947-48 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నరు. 1948-50 మధ్య తొలి గవర్నర్ జనరల్. 1951-52 మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి. తిరిగి 1952-57 మధ్య మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి.

1959లో భారత జాతీయ కాంగ్రెసుకు రాజీనామా చేసి స్వతంత్ర సార్టీని స్థాపించి 1962, 1967, 1971 లలో ఆ పార్టీ అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడాన్ని ప్రోత్సహించారు. రాజాజీ కుమార్తె లక్ష్మి, గాంధీజీ కుమారుడు దేవదావ్ గాంధీని వివాహమాడింది. రాజాజీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ, పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియమితులయ్యారు. రాజాజీ రచించిన రామాయణ మహాభారతాది ఆంగ్ల గ్రంథాలు బహుళప్రచారం పొందాయి. సరళమైన భాషలో వారి రచనలు కొనసాగాయి.

మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళితులకు ఆలయ ప్రవేశం కల్పించి సాంఘిక విప్లవం తెచ్చారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 1967లో ప్రముఖ గాయని శ్రీమతి యం.యస్. సుబ్బులక్ష్మి గానం చేసిన ప్రార్థనాగీత రచయిత రాజాజీ. మద్యనిషేధం కోసం నిరంతరం పట్టుబట్టిన వ్యక్తి రాజాజీ. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఆయన వ్యతిరేకించారు. రాజాజీ చిత్రపటం పార్లమెంటు భవనంలో ఏర్పరచారు. అట్టి విశిష్ట వ్యక్తిని భారతరత్న తొలిసారిగా వరించింది. అందుకే వారి ప్రస్తావన ఇక్కడ.

~

సర్వోన్నత శిఖరం – డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (5 సెప్టెంబర్ 1888 – 17 ఏప్రిల్ 1975):

మహోన్నత గిరిశిఖరం వలె భారతీయ తాత్విక చింతనను పాశ్యాత్యాదేశాలకు పంచి పెట్టిన వేదాంతి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలోని తిరుత్తణిలో తెలుగు దంపతులైన వీరాస్వామి, సీతమ్మ దంపతులకు ముగ్గురు తోబుట్టువులలో రెండవ వాడిగా జన్మించారు. 1896 లో తిరుపతి లోని లూథరన్ మిషన్ పాఠశాలలో కొంత కాలం విద్యాభ్యాసం చేశారు. బాల్యం నుండి అసాధారణ మేధావి. మదరాసు విశ్వవిద్యాలయ మాస్టర్స్ డిగ్రీ చదివారు. బ్యాచిలర్ డిగ్రీ చదువుతూ ‘The Ethics of the Vedanta and Its metaphysical Prepositions’ అనే థీసిస్ సమర్పించిన ధీశాలి.

అప్పటి కాయన వయుస్సు 20 సంవత్సరాలు. రాజకీయాలలో ప్రవేశించలేదు. స్వాతంత్రోద్యమంతో సంబంధం లేదు. గాంధీజీతో అనుబంధం లేదు. కాని విద్యావేత్తగా, వేదాంత ప్రముఖుడిగా ఆయనకు అఖండ ఖ్యాతి లభించింది. మైసూరు విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో ఆచార్య పదని నధిష్ఠించి వన్నెతెచ్చారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవి (1931-36)

కట్టనుంచి రామలింగారెడ్డి తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రాధాకృష్ణన్ 1931లో ఉపాధ్యక్షులయ్యారు. వారి పిలుపుననుసరించి హిరేన్ ముఖర్జీ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ప్రాచ్య మతాల గౌరవాధ్యాపకులు. 1939లో పండిత మదనమోహన మాలవ్యా ఆహ్వానాన్ని అంగీకరించి ప్రతిష్ఠాత్మకమైన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులయ్యారు.

భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా 1946లో ఎంపిక కావడంలో ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. ఆ తరువాత అనేక పదవులాయనను వరించి వచ్చాయి.

1949-52 మధ్య, రష్యాలో భారత రాయబారిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. 1950 వరకు పలుమార్లు భారతదేశం పక్షాన యునెస్కో సభ్యబృందానికి అద్యక్షత వహించి భారతీయ ఖ్యాతిని చాటిచెప్పారు. 1952లో రాధాకృష్ణన్ మాస్కో నుండి భారతదేశానికి వచ్చి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టడానికి ముందు స్టాలిన్ రాధాకృష్ణన్‌ను కలిసినప్పుడు తన మనోభావాలను ఆయనతో పంచుకున్నారిలా:

“You are the first person to treat me as a human being and not as a monster. You are leaving us and I am sad. I want you to live long. I have not long to live.” అని నిర్వేదం ప్రకటించాడు స్టాలిన్. 6 నెలల తర్వాత స్టాలిన్ మరణించాడు.

రాధాకృష్ణన్ సంభాషణా చతురులు. సాధారణంగా వేదాంతులు హాస్యానికి దూరం – కాని రాధాకృష్ణన్ అందుకు అపవాదు. రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గ్రీక్ దేశరాజుకు స్వాగతం పలుకుతూ అన్న మాటలు అందుకు నిదర్శనం –

“You’re Majesty! You are the first king of Greece to come to India on invitation. Alexander the great came uninvited.”

దశాబ్దికాలం ఉపశాస్త్రపతి (1952-62):

ఉపరాష్ట్రపతిగా నియుక్తులైన రాధాకృష్ణన్ ఆ పదవిలో 10 సంవత్సరాలు నిరాడంబరంగా జీవించారు. రాజ్యసభ అధ్యక్షులుగా ఆ సభ ప్రతిష్ఠను ఇనుమడింప జేసి సత్సంప్రదాయాలను నెలకొల్పారు. ఆ సందర్భంలో సమయోచితంగా సంస్కత శ్లోకాలను, బైబిల్ సూక్తులను తన ప్రసంగంలో పొందుపరచేవారు. దిగ్దంతులైన వ్యక్తులు ఆ దశాబ్దంలో పెద్దల సభలో సభ్యులు. వారి ఆదరం పొందిన వ్యక్తి రాధాకృష్ణన్.

ఆదర్శ రాష్ట్రపతి (1962-67):

బాబూ రాజేంద్రప్రసాద్ తొలి దశాబ్ది కాలం రాష్ట్రపతి. ఆ తర్వాత రాధాకృష్ణన్ ఆ పదవికి 1962లో ఎంపికయ్యారు. ఆయన పదవికాలంలో ముగ్గురు ప్రధానులు బాధ్యతలు చేపట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, శ్రీమతి ఇందిరా గాంధీ. రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబరు 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా భారత ప్రజలు పాటిస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందిస్తారు. రాధాకృష్ణన్ కుమారుడు సర్వేపల్లి గోపాల్ చారిత్రిక విభాగంలో ప్రొఫెసర్‍గా వ్యవహారించి రాధాకృష్ణన్ జీవిత గ్రంథాన్ని వెలువరించారు. భారతీయ తాత్విక చింతనకు ప్రతిరూపంగా నిలిచి, విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్ష పదనికి వన్నె తెచ్చి, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ప్రజాదరణ పొందిన రాధాకృష్ణన్ జాతిరత్నం.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version