[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]
~
పద్మ భూషణులు
భారత రత్న, పద్మ విభూషణ్ పురస్కారాలకు ముందు పద్మ భూషణ్ పొందిన గ్రహీతల జీవనరేఖలు ముందే వివరించాను గాబట్టి వారిని ఇందులో పరిహరిస్తున్నాను. 1954లో తొలిసారిగా పద్మ పురస్కారాలు ప్రకటించినపుడు ఇద్దరు తెలుగువారు పద్మ భూషణ్ పొందారు. ఆర్కాట్ లక్ష్మణ స్వామి మొదలియార్, రెండవవారు సివిల్ సర్వీసు రంగానికి చెందిన పి. సత్యనారాయణరావు. లక్ష్మణ స్వామి మొదలియార్‌కు 1963 లో పద్మ విభూషణ్ లభించింది.
పి. సత్యనారాయణరావు:
వీరికి సివిల్ సర్వీసు నిభాగంలో 1954లో ఆంధ్రప్రదేశ్ నుండి పద్మ భూషణ్ లభించింది. వివరాలు పూర్తిగా లభించడం లేదు. పెండ్యాల సత్యనారాయణ రావు అని మాత్రమే ఉంది. ఆ సంవత్సరమే యం.యన్. సుబ్బలక్ష్మి కూడా సంగీత విభాగంలో పొందారు. అది తొలి సంవత్సరం. ఆసారి పలువురు సివిల్ సర్వీసు అధికారులు పొందడం గమనార్హం. ఉన్నత పదవులలో ఉండి నీతి, నిజాయితీలతో వ్యవహరించినవారికి ఆ గౌరవం విశిష్టం.
1954లో పొందిన అధికారులు:
1.కె. యస్. తిమ్మయ్య – కర్ణాటక 2. మహాదేవ అయ్యర్ గణపతి – ఒడిస్సా 3. ఆర్. ఆర్. హండ – పంజాబ్ 4. రాధాకృష్ణ గుప్త – ఢిల్లీ 5. సుకుమార్ సేన్ – పశ్చిమ బెంగాల్ 6. వి. నరహరిరావు – కర్ణాటక
సుకుమార్ సేన్ భారతదేశ తొలి ఎన్నికల కమీషనరు (1950-58). వీరి ఆధ్వర్యంలో 1952, 1957లలో రెండు మార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆయన ఐఎఎస్ అధికారి.
వి.నరహరిరావు 1948-54 మధ్య భారతదేశ తొలి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈయన I. A. & A.S అధికారి.
2000 సంవత్సరం తర్వాత సివిల్ సర్వీసు అధికారులకు పద్మ పురస్కారాలు ఇవ్వడం తగ్గించారు. పద్మ పురస్కారాలకు మోడీ ప్రభుత్వం మారుమూల పల్లెలకు చెందిన విస్మృత వ్యక్తులు, కళా సాంస్కృతిక రంగాలలో ప్రతిభ కనబరచిన వారిని ఎంపిక చేయడం ముదావహం – పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నిసార్లు నామినేట్ చేస్తాయి. వ్యక్తులు కూడా తమ పేర్లు నామినేట్ చేసుకునే దరఖాస్తులు లభ్యమవుతున్నాయి. జనవరి 26న ఏటా పద్మ పురస్కారాలు రాష్ట్రపతి ప్రకటిస్తారు. జులై 2024 నుండి 2025 సంవత్సరానికి దరఖాస్తులు సమర్పించవచ్చు.
హైదరాబాదు నగర తొలి నేపయర్ మాడపాటి హనుమంతరావు (22 జనవరి 1885-11 నవంబరు 1970):
క్రమంగా శాసన సభానియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ రాష్ట్ర శాసన మండలిలో స్థానం లభించింది. 1958లో శాసన మండలి తొలి అధ్యక్షులయ్యారు. తెలంగాణాలో రాజకీయ చైతన్యాన్ని తెచ్చిన తొలి నాయకుడిగా ఆయనకు పేరు. హైదరాబాదు నగరంలో ఆయన గృహం – ఆంధ్ర కుటీరం – పలువురు నాయకులకు సందర్శనా స్థలం. దాశరథి రంగాచార్య తన నవల ‘చిల్లర దేవుళ్లు’లో మాడపాటిని ఒక పాత్రగా మలచారు. అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఆయనది. సత్యాగ్రహం చేసి జైలు పాలు కావడం కంటే కోర్టుల్లో వీరికి ఏదైనా సహాయం చేస్తానని ప్రకటించారు. నిజాం పాలనలో అజ్ఞానాంధకారాన్ని పారద్రోలగానికి నడుం కట్టారు. కమ్యూనిస్టులు కూడా ఆయనను గౌరవించేవారు.
గ్రంథాలయోద్యమం:
ఆనాటి రాజకీయ నాయకులు గ్రంథాలయ స్థాపనకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ క్రమంలో మాడపాటి 1912లో హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంను, 1904లో హనుమకొండలోని రాజరాజు నరేంద్ర ఆంధ్ర గ్రంధాలయంను అభివృద్ధి చేశారు. గ్రంథాలయాల ద్వారా రాజకీయ చైతన్యం తీసుకు రావాలని వారి సంకల్పం.
ప్రప్రథమ బాలికల పాఠశాలను నారాయణగూడ, హైదరాబాదులో స్థాపించడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. రాజకీయాలలో ఆయన మితవాది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాడపాటిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించగా, భారత ప్రభుత్వం 1955లో పద్మ భూషణ్ పురస్కారం అందించింది.
రచయితగా:
మాడపాటి కథకులు. 1911లోనే ‘మల్లికాగుచ్ఛం’ కథల సంపుటి వెలువడింది. తెలంగాణా ఆంధ్రోద్యమ గ్రంథం ఆయనకు చారిత్రక రచయితగా పేరు తెచ్చింది. పాత్రికేయునిగా ఆయనకు గుర్తింపు లభించింది. రైతాంగ జీవితం ప్రతిబింబించే తొలి కథానిక 1912 లో ప్రచురితమైంది. శ్రీ ప్రేమ్‌చంద్ హిందీ నవలలను రచనలను తెలుగులోకి అనువదించారు. శాసనమండలి సభా కార్యక్రమ నిర్వహణలో మనకీర్తి సాధించిన మాడపాటి యశస్వి.
వాస్తుశిల్పా జైన్ యార్ జంగ్ (1889-1961):
ఆర్కిటెక్ట్:
నిజాం ప్రభువు ప్రపంచంలోని అందమైన భవనాల అధ్యయనానికి నవాబ్ జైన్ యార్ జంగ్, సయ్యద్ అలీ రజాలను విదేశాలకు పంపారు. వారు ఈజిప్టు వెళ్లి జాన్సర్‍ను కలిసి హైదరాబాదు ఉస్మానియా విశ్వవిదాలకు రూపురేఖలకు ఆధ్వర్యం వహించమని కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ శాశ్వత భవనాలు, ఆర్ట్స్ కళాశాల భవనం ఏర్పడటంలో జంగ్ తోడ్పడ్డారు. జూబ్లీహాల్, రాజభవన్ ఆయన పర్యవేక్షణలో నిర్మితమయ్యాయి.
తొలిసారిగా హైదరాబాదులో నీటి పారుదల శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జంగ్‌ను పూర్తి చేయమని ప్రభుత్వం కోరింది. హైదరాబాదు నగరంలోని రోడ్లను చూసి 1938లోనే భారతదేశ రోడ్ కాంగ్రెసు సభ్యులు జంగ్‌ను ప్రశంసించారు. 1951లో భారత ఇంజనీర్ల సంస్థకు ఆయన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. లండన్‌లో జరిగిన కామన్వెల్త్ కాంగ్రెసుకు భారత ప్రతినిధిగా హాజరయ్యారు.
రాజకీయ అరంగేట్రం:
1944లో జంగ్ తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి అయ్యారు. ప్రభుత్వంలో పట్టు సాధించారు. హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి సంబంధించిన నిబంధనల రూపకల్పనలో జంగ్ నిజాం రాజదూతగా హాజరయ్యారు. స్వతంత్ర భారత ప్రభుత్వంలో నిజాం – కేంద్ర ప్రభుత్యాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదర్చడానికి జంగ్ ప్రయత్నించారు. పోలీసు చర్య అనంతరం రాష్ట్ర మంత్రి అయి మొదటి సాధారణ ఎన్నికల వరకు ఆ పదవిలో కొనసాగారు.
నిజాం ప్రభువు ఆయనకు ‘నవాబ్’ బిరుదు నివ్వగా, 1956లో ప్రభుత్వం పద్మ భూషణ్ సత్కారం అందించింది. 1961లో జంగ్ మరణించగా నిజాం రాజు స్వయంగా వారి యింటికి వెళ్లి నివాళులర్పించారు. జంగ్ కుమారుడు సాదత్ అలీఖాన్ ఇరాక్‍లో భారత ప్రభుత్వ రాయబారిగా పనిచేశారు.
శ్రీమతి ఆండాళమ్మ (1894 – 1969):
మదరాసు హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ ముత్తా వెంకట సుబ్బారావును 1928లో ఆండాళమ్మ వివాహమాడారు. బ్రిటీషు ప్రభుత్వం సుబ్బారావును ప్రశంసిస్తూ ‘నైట్‌హుడ్’ ప్రదానం చేసింది. ఆ దంపతులు సేవాసంస్థ స్థాపించాలని సంకల్పించి 10వేల రూపాయల మూలధనంతో ‘మదరాసు సేవాసదన్’ నెలకొల్పారు. ఎనిమిది మంది అనాథ బాలికలకు అందులో వసతి, భోజన సదుపాయలు కల్పించారు. క్రమక్రమాభివృద్ధి చెంది అది తర్వాతి కాలంలో మహిళలు, బాలబాలికలకు ఆధారమైన సంక్షేమ కేంద్రంగా ఎదిగింది.
మదరాసు సేవాసదన్ పక్షాన – లేడీ ఆండాళ్ వెంకట సుబ్బారావు మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూలు నడపసాగారు. తరువాత ‘సర్ ముత్తా వెంకట సుబ్బారావు సంగీత హాలు’ ప్రారంభించారు. ఈ రెండు సంస్థలు ప్రజోపయోగకరంగా పేరు తెచ్చుకొన్నాయి. ఆండాళమ్మ సామాజిక సేవను భారత ప్రభుత్వం గుర్తించి 1957లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. 75 ఏళ్ల జీవితాన్ని మహిళా సేవలో వినియోగించిన ఆండాళమ్మ 1969లో కన్నుమూశారు.
1956లో మదరాసుకే చెందిన భరతనాట్య కళాకారిణి శ్రీమతి రుక్మిణీదేవి అరండేల్‌కు లభించింది. అంతకుముందు 1955లో శ్రీమతి కమలాదేవి చటోపాధ్యాయ (పశ్చిమ బెంగాల్) కు సామాజిక సేవకు పద్మ భూషణ్ లభించింది. తమిళనాడుకు చెందిన క్రీడాకారుడు సి.కె.నాయుడుకి 1956లో ప్రకటించారు. అదే సంవత్సరం ప్రముఖ హిందీ రచయిత్రి శ్రీమతి మహాదేవి వర్మ పొందారు. 1957లో ప్రముఖ గాయని టి. బాల సరస్వతి, సమాజ సేవకురాలు లక్ష్మీ మీనన్ (కేరళ), సాహిత్యరంగంలో కె. వి. నీలకంఠశాస్త్రి పొందారు. 1957లో మొత్తం 16 మంది పద్మ భూషణ్ పొందగా దాక్షిణాత్యులు పలువురు వుండటం గమనార్హం.
Images Credit: Internet
(మళ్ళీ కలుద్దాం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.