[‘తెలుగు భాష – సమాజ ప్రభావం’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
“భాష్యతే ఇతి భాష”. భాషింపబడేది భాష. వ్యక్తి తన మనసులోని భావాలను నలుగురికి తెలియజేయటానికి భాష ఒక ఉపకరణం. ఆదిమకాలంలో మానవులు సైగలు, కేకలు అరుపుల ద్వారా చిత్రాల ద్వారా తమ భావాలను వ్యక్తపరిచేవారు. అనంతరకాలంలో భాష అభివృద్ధి చెందింది. మన తెలుగు భాష లిపిని సంతరించుకొన్నది. నన్నయ కాలం నాటికి గ్రంథస్తమయింది. తర్వాత అనేక పరిణామాలు పొంది తమిళ కవియగు ‘సుబ్రహ్మణ్యభారతి’చే ‘సుందర తెలుగు’ అని కీర్తించబడింది. తెలుగు భాష ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని నికోలాయిడ్ కాంటే అను పాశ్చాత్యకవిచే కీర్తింపబడింది. తెలుగు భాషా పదాలు అచ్చుతో ఎలా అంతవుతాయో ఇటలీ భాషా పదాలుకూడా అలా అచ్చుతోనే అంతమవుతాయి. తెలుగు సాహిత్యం గద్య పద్యాత్మికమైన గ్రాంథిక భాషలో సాగింది. కవులు పాండిత్య ప్రదర్శన చాటుకోవటానికి ద్యర్థి, త్ర్యర్థి, చతుర్ధికావ్యాలను రచించారు.
“కాశీఖండం అయఃపిండం
నైషధమ్ విద్వదౌషధమ్”
అని పండితులే ప్రశంసించారు. కానీ తరువాత జన సామాన్యులకు అందుబాటులో ఉండేటట్లుగా కవుల రచనలు సాగాయి. ప్రథమాంధ్ర కవయిత్రిగా కీర్తింపబడిన తాళ్లపాక తిమ్మక్క రచించిన సుభద్రాపరిణయం ద్విపద కావ్యంలో తెలుగువారి భాషను, సంస్కృతి, సాంప్రదాయాలు వివరించబడ్డాయి. అనంతరము తేనె సోక నోరు తీయనగు రీతి సరళతరమగు రీతిలో తన కవిత్వంలో మొల్ల మృదుమధుర మగు భావాలను వ్యక్తం చేసింది. దక్షిణాంధ్ర యుగంలో పేరెన్నికగన్న రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు, రంగాజమ్మ వంటి కవులు తమ రచనల ద్వారా శైలి, సొబగు, సౌరభాలను వెదజల్లారు.
తరువాత కాలంలో అక్షరజ్ఞానం లేని వారికి సైతం అర్థమయ్యేరీతిలో మహాభారతంలోని ఘట్టాలను పద్య నాటకాలుగా తిరుపతి వేంకట కవులు రచించారు. ఆ నాటకాల ద్వారా సంభాషణా చాతుర్యాన్ని తెలుగువారి మనోభావాలకు స్పష్టమగునట్లు వివరించారు.
కందుకూరి వీరేశలింగంపంతులుగారు, గురజాడ అప్పారావుగారు, చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి వంటి కవులు సరళ గ్రాంథికంలో రాజశేఖర చరిత్ర, దిద్దుబాటు, కన్యాశుల్కం, గణపతి వంటి నాటకాలు ప్రహసనాలువంటి హాస్యరస ప్రధానమైన వస్తువులను స్వీకరించి వాటి ఆధారంగా రచనలు చేసి వానిలో ప్రజాసమస్యలని ప్రధానంగా ఇతివృత్తంగా స్వీకరించారు. గిడుగు రామ్మూర్తి పంతులు వంటి భాషావేత్తలు వ్యవహారిక భాషా ఉద్యమాన్ని చేపట్టి భాషకు మరింత సాలభ్యాన్ని చేకూర్చారు. తదనంతర కవులు సమాజంలోని ప్రతి వస్తువును కవితా వస్తువులుగా స్వీకరించి సాహిత్యాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తేవడమే కాక నాయకత్వ లక్షణాలను కూడా కల్పించారు.
“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొ కండ
యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాది
దేశ భాషలందు తెలుగు లెస్స”
అన్న కన్నడ రాయలు శ్రీకృష్ణదేవరాయలు మాటలను స్ఫూర్తిగా తీసుకొని మాతృభాషను కాపాడుకుంటే మనం మన తల్లిని కాపాడుకున్నట్లు. మన తల్లి భాషను కూడా మనమే కాపాడుకోవాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో కంప్యూటర్ వ్యవస్థలోని గూగుల్ సెర్చ్, ఈమెయిల్, ఎస్.ఎం.ఎస్., స్వరచక్ర యాప్ల ద్వారా విదేశాలలో ఉన్నవారు సైతం తెలుగు భాష మాధుర్యాన్ని తెలుసుకోవడం వలన ప్రపంచవ్యాప్తంగా భాషాభివృద్ధికి కంప్యూటర్ కూడా దోహదపడుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎందరో ఉన్నారు. వారిలో 8 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. దేశ జనాభాలో హిందీ తర్వాత ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. ఎప్పటికైనా భారతదేశంలో జాతీయ భాష కాగల సత్తా, అవకాశం దక్షిణాది భాషలోని తెలుగుకే ఉన్నదని శ్రీ.శ్రీ. పేర్కొన్నాడు. అంత గొప్ప భాషను మనం కాపాడుకోవాలంటే పానుగంటి వారు చెప్పినట్లు రోజు రాత్రిపూట భార్యాబిడ్డలతోటి కలిసి పది నిమిషాలు తెలుగు పత్రిక చదువు.. ఇంటా బయట బంధువులతో, మిత్రులతో చిన్న పిల్లలతో కలిసి చక్కగా తెలుగులో మాట్లాడగలిగితే మన భాష నిత్య చైతన్యంతో అలరారుతుంది. అన్ని భాషలను తనలో కలుపుకో గలిగింది మన తెలుగు భాష. అంతటి విశిష్టత కలిగిన భాషను మనం దూరం చేసుకోకుండా మన జీవనవ్యవహారంలో నిలుపుకున్నప్పుడే మన దేశము, జాతి, భాష క్షేమంగా ఉంటాయి. అదే మనకు శ్రీరామరక్ష.
“మన జాతి క్షేమం మన భాషా క్షేమంలో
మన భాషా క్షేమం మన చేతుల్లో ఉంది”
తెలుగు భాష – భావవ్యక్తీకరణ, భాషా వ్యాప్తి- మాతృభాష పరిరక్షణకు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు:-
- భాషా – ప్రాధాన్యం
- భాషా – పుట్టుక – పరిణామం
- సామాజిక దృక్పథం – భాష
- వ్యవహారిక భాష
- అనువాద సాహిత్యం – భాష
- భాష – మాండలికల ప్రభావం
- ప్రపంచీకరణ నేపథ్యంలో వెనుకబడుతున్న తెలుగు భాష
- ప్రసారమాధ్యమాలు – భాష
- వార్తా పత్రికలు
- రేడియో
- సినిమా
- దూరదర్శన్
- కంప్యూటర్
- మనం దూరంచేసుకుంటున్న మన మాతృభాష
తెలుగు భాషకు వెయ్యేళ్లు మించిన లిఖిత సాహిత్యం ఉంది. అపారమైన జానపద సాహిత్యంమున్నది. వేల సంవత్సరాల నాడు పుట్టి అనేక రూపాంతరాలను పొందినటువంటి మన మాతృభాషా సాహిత్య సంపద పరభాషా ప్రభావంచేత కనుమరుగు కాకుండా రక్షించుకోవడం భాషాభిజ్ఞుల కర్తవ్యం. పాశ్చాత్య పరిపాలనలో పారిశ్రామిక నాగరికతా పరిచయంతో అచ్చుయంత్రం రావడంతో పాశ్చాత్య సాహిత్య పరిచయం కలగడంతో తెలుగు సాహిత్యం కవిత్వంగా, నాటకంగా, కథానికగా, నవలగా, వచన కవిత, మినీ కవిత, హైకూలు, నానీలు అంటూ ఎన్నో రకాలైన ప్రక్రియ వైవిద్యాన్ని సంతరించుకున్నది. ఇంతటి శక్తివంతమైన భాషను మనము అభివృద్ధి సాధనంగా ఉపయోగించుకుని మాతృభాషా వ్యాప్తికి పాటుపడాలి. ఏ భాషా పదాలనైనా తనలో విలీనం చేసుకోగలిగిన మహోన్నతమైన శక్తి కలిగినది మన మాతృభాష.
ఆంగ్లభాషాప్రభావానికిలోనై కనుమరుగవుతున్న మన మాతృభాషను రక్షించుకోవాలన్నది మా కోరిక. తల్లి లాంటి మాతృభాషను మనం కాపాడుకోవాలి.
దేశ సంక్షేమం భాషా క్షేమానికి పునాది అన్న గిడుగు రామ్మూర్తి పంతులు గారి అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఆలోచించి మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగిస్తే భాషా సమస్య పరిష్కారమవుతుంది. ఈనాటి ప్రసారమాధ్యమాల నేపథ్యంగా ప్రధానంగా భాషోచ్చారణ, వ్రాతలో కూడా అనేక మార్పులు సంభవించాయి.
మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రా ప్రభుత్వ కార్యాలయాలలో మాతృభాషలోనే ఉత్తరప్రత్యుత్తరాలు జరపటం గమనార్హం. పాలనా రంగంలో నూటికి నూరుపాళ్ళు అమలు చేయగలగాలి. న్యాయవాదుల వాదోపవాదాలు, తీర్పులు కనీ సం జిల్లా కోర్టులలోనైనా మాతృభాషలోఉంటే బాగుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలలో రికార్డు లేకాక వివిధ రకాల పేర్లను, ఫలకాలను తెలుగులో వ్రాయించినప్పుడు మన మాతృభాషను మనం రక్షించుకున్నట్లు అన్నది అక్షర సత్యం. అందుకే
“మాతృభాష తల్లి పాలవంటిది
పరభాష పోతపాలవంటిది”
అని కూడా అన్నారు కొందరు.
భాషావేత్తలు సాహితీవేత్తలు, భాషా ఉద్యమకారులు ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ భాషోద్యమాన్ని చేపట్టినప్పుడు ‘తెలుగుభాష’ అజరామరంగా విరాజిల్లుతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
“ఒక భాష నశిస్తే ఒక జాతి నశించినట్లే” అన్న జవహర్ లాల్ నెహ్రూగారి మాటలను గుర్తుపెట్టు కొని మన భాషను, మన జాతిని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి కర్తవ్యం.