[ప్రపంచ జానపద కథలలో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న కథ ‘తెలివైన సోదరులు’.]
ఒక ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడు. ప్రతిదీ పరిశీలనగా గమనించేవాడు. మందూ వెనకా ఆలోచించేవాడు. సరైన సమాధానాన్ని కనుగొనేవాడు. తొందరపాటు గానీ భయం కానీ అస్సలు వుండేవి కావు. ఆయనకు ముగ్గురు కొడుకులు. అందరిలా చిన్నప్పటినుంచి వాళ్ళను పుస్తకాలకు, ఇంటికి మాత్రమే పరిమితం చేయకుండా చుట్టూ ఉన్న లోకాన్ని పరిచయం చేశాడు. ఓపికగా చిన్నప్పటినుంచి అడిగిన ప్రతి ప్రశ్నకు విసుక్కోకుండా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. మంచి మంచి పుస్తకాలు చదివించాడు. దాంతో వాళ్లు ముగ్గురూ మిగతా పిల్లల్లా కాక చాలా తెలివైన వాళ్లుగా తయారయ్యారు.
ఆయన చనిపోయే ముందు ముగ్గురు కొడుకులను పిలిచి “నాయనలారా.. నేను మీకు ఉండటానికి మిద్దెలు మేడలు కొనలేదు. వేసుకోవడానికి నగలు హారాలు సంపాదించలేదు. కానీ వీటన్నిటికన్నా అమూల్యమైన తెలివితేటలు మాత్రం మీకు బహుమానంగా ఇచ్చాను. నేను చనిపోయాక వాటిని ఉపయోగించి రాజాస్థానంలో మంచి ఉద్యోగం సంపాదించి హాయిగా పదిమందికి మేలు చేస్తూ బ్రతకండి” అన్నాడు.
తండ్రి చనిపోయాక వాళ్ళు రాజధానికి బయలుదేరారు. అది చాలా దూరం. నాలుగురోజులు పగలూ రాత్రీ ఆగకుండా అలసిపోకుండా నడిచాక వాళ్లు ఒక అడవికి చేరుకున్నారు. అది దాటితే చాలు రాజ్యంలో అడుగు పెట్టవచ్చు. వాళ్ళు అలా దారిలో చుట్టుపక్కల నిశితంగా గమనిస్తూ మాట్లాడుకుంటూ పోతూవుంటే మొదటివాడు “అన్నలూ.. మనకంటే ముందు ఈ దారిలో ఒక పెద్ద ఒంటె పోయినట్లుంది కదా” అన్నాడు చుట్టూచూస్తూ.
ఆ మాటలకు “నువ్వు చెప్పింది నిజమే తమ్ముడు. కానీ దానికి ఒక్క కన్ను మాత్రమే కనబడుతోంది. కుడి కన్ను లేదనుకుంటా” అన్నాడు రెండవవాడు.
మరి కొంచెం దూరం పోగానే మూడవవాడు “ఆ ఒంటెపై ఒక స్త్రీ తన కుమారుడితో ప్రయాణిస్తూ ఉంది” అన్నాడు.
అలా వాళ్ళు మాట్లాడుకుంటూ పోతూవుంటే దారిలో ఒక సైనికాధికారి ఆందోళనగా ఏదో వెతుకుతూ రావడం కనిపించింది. అతన్ని చూసి మొదటివాడు “ఏం వెతుకుతా వున్నారు. ఒంటె కోసమా” అన్నాడు.
“అవును” అన్నాడు అతను.
“ఆ ఒంటెకు కుడికన్ను కనబడదు కదా” అన్నాడు రెండోవాడు.
“అవును” అన్నాడు అతను.
“ఆ ఒంటెపై ఒక స్త్రీ తన కుమారునితో ఉంది కదా” అన్నాడు మూడోవాడు.
“అవును.. మీ ముగ్గురు చెప్పింది నిజమే. మీకు నా ఒంటె కనపడిందా. అది ఎక్కడ ఉంది” అడిగాడు అతను.
దానికి వాళ్లు నవ్వి “లేదు.. లేదు.. మేము నీ ఒంటెను గానీ, నీ పెళ్ళాంబిడ్డలను గానీ అస్సలు చూడలేదు” అన్నారు.
ఆ మాటలకు అతను “చూడకుండానే వివరాలన్నీ ఒక్కటీ పొల్లు పోకుండా ఎలా చెబుతారు. మీరే వాళ్ళను ఎక్కడో దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నారు” అన్నాడు కోపంగా.
దానికి వాళ్లు “అదేం లేదు. మేము మా తెలివితేటలు ఉపయోగించి ఊహించామంతే. మీరు వెంటనే ఉత్తరం వైపుకు వేగంగా వెళ్ళండి. వాళ్లు దొరుకుతారు” అన్నారు.
కానీ ఆ సైనికధికారి వాళ్ళ మాటలు నమ్మలేదు. ముగ్గురిని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకుపోయాడు. రాజు జరిగిందంతా తెలుసుకున్నాడు. అతనికి కూడా ఆ ముగ్గురు చెప్పిన మాటలు అంత నమ్మదగినవిగా అనిపించలేదు. దాంతో వెంటనే కోపంగా “మర్యాదగా తప్పు ఒప్పుకొని ఆ ఒంటెను, అతని పెళ్ళాం బిడ్డలను ఎక్కడ దాచారో చెప్పండి. లేదంటే జీవితాంతం కారాగారంలో బందీ కావలసి ఉంటుంది. జాగ్రత్త” అని హెచ్చరించాడు.
దానికి వాళ్లు “మహారాజా.. మేము చెప్పింది నిజం. కేవలం మా తెలివితేటలతో, ఊహాశక్తితో జరిగిందేదో కనుక్కున్నాంగానీ మాకే పాపమూ తెలియదు” అన్నారు.
రాజు ఆలోచనలో పడ్డాడు. వాళ్ల మొహాల్లో తప్పు చేశామన్న భయంగానీ, మాటల్లో తడబాటు గానీ ఏమీ లేవు. దాంతో “సరే నిజంగా మీరు అంత తెలివైనవాళ్లే అయితే మీకు ఒక పరీక్ష పెడతాను. అందులో గెలిస్తే బహుమతి ఇచ్చి సత్కరిస్తా.. ఓడిపోతే కొరడాలతో కొట్టి శిక్షిస్తా.. సరేనా” అంటూ ఇద్దరు సేవకులను పిలిచి వాళ్ళ చెవిలో రహస్యంగా ఏం చేయాలో చెప్పాడు. అలాగేనంటూ వెళ్ళిన ఆ ఇద్దరు సేవకులు కాసేపటికి ఉత్తరం వైపు నుంచి ఒక చెక్కపెట్టె మోసుకుని వచ్చి సభ మధ్యలో పెట్టారు.
మహారాజు వాళ్ళ ముగ్గురి వంక చూస్తూ “మీరు దొంగలో, దొరలో ఇప్పుడే ఇక్కడే తెలిసిపోతుంది. మీ తెలివితేటలు ఉపయోగించి ఈ పెట్టెలో ఏముందో కనుక్కోండి చూద్దాం” అన్నాడు.
ముగ్గురూ కాసేపు మౌనంగా ఆలోచనలో పడ్డారు.
“ఆ పెట్టెలో ఉన్నది ఏమాత్రం బరువైనది కాదు. చాలా తేలికైనది. చిన్నది” అన్నాడు మొదటివాడు.
“అవునవును. అది గుండ్రని ఆకారంలో ఉంది” అన్నాడు రెండవవాడు.
“ఆ పెట్టెలో ఉన్నది దానిమ్మపండు” అన్నాడు మూడవవాడు.
మహారాజు పోయి పెట్టె తెరిచి చూస్తే ఇంకేముంది.. వాళ్ళు చెప్పినట్లే అందులో ఒకే ఒక దానిమ్మపండు కనపడింది. అది చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. వాళ్ళ ముగ్గురి వంకా తిరిగి “శభాష్.. మీ తెలివితేటలు, ఊహాశక్తి అద్భుతం. ఇంతవరకు ఇలాంటి వాళ్లను నా జన్మలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదు” అంటూ మెచ్చుకొని వాళ్ళకు బహుమతిగా ఒక బంగారు పళ్లెంలో ఘుమఘుమలాడిపోతున్న తీయని తినుబండారాలను తెప్పించి స్వయంగా అందించాడు.
ఆ సైనికాధికారిని పిలిచి “వీళ్ళు చెప్పేది నిజమే.. నీవు వెంటనే వేగంగా వాళ్ళు చెప్పిన దిక్కుపోయి నీ పెళ్ళాం బిడ్డల్ని కాపాడుకో” అని చెప్పి ఆ ముగ్గురిని ఒక వారం పాటు తన ఆతిథ్యం స్వీకరించమని ఆహ్వానించాడు. వాళ్లు సంతోషంగా ‘సరే’ అన్నారు.
రాజుకి ఆ ముగ్గురు మీద అనుమానం పూర్తిగా తొలగిపోలేదు. ఆరోజు రాత్రి రహస్యంగా మారువేషంలో వాళ్లు వుంటున్న గది వెనుకకు చేరుకున్నాడు. కిటికీ దగ్గర నిలబడి వాళ్ల మాటలు వినసాగాడు. అన్నదమ్ములు ముగ్గురూ హాయిగా తిని కబుర్లలో పడ్డారు.
“అన్నా.. నువ్వు రాజు విషయంలో ఏదైనా తేడా గమనించావా? అతని ప్రవర్తన రాజు హోదాకు తగినట్లుగా లేదు కదా” అన్నాడు మొదటివాడు.
“అవును తమ్ముడూ.. రాజు చాలా పేద కుటుంబంలో పుట్టినట్లు ఉన్నాడు” అన్నాడు రెండోవాడు.
“నిజమే.. బహుశా అతని తండ్రి వంటవాడు అయి ఉండవచ్చు” అన్నాడు మూడవవాడు.
ఆ మాటలు వినగానే రాజు అదిరిపడ్డాడు. తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. అది నిజమో కాదో వెంటనే కనుక్కోవాలని వేగంగా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయాడు. “అమ్మా.. నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు. నేను రాజ కుటుంబానికి చెందినవాడినా.. కాదా..” అన్నాడు.
అప్పుడు ఆమె అక్కడ ఉన్న అందరిని బయటికి పంపించి తలుపులేసి “నాయనా.. ఇంతవరకు నా గుండెల్లోనే భద్రంగా దాచిపెట్టుకున్న రహస్యాన్ని ఇప్పుడు చెబుతున్నా విను. మాకు పెళ్లయి ఎంత కాలమైనా పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం మొక్కని దేవుడు లేడు, చేయని దానము లేదు. కానీ దేవుడు మాత్రం కరుణించలేదు. అప్పట్లో మీ అమ్మానాన్న మా ఇంట్లో వంట చేసేవాళ్ళు. నాకు కడుపు పండకపోయినా మీ అమ్మకు మాత్రం పండింది. కానీ దురదృష్టవశాత్తు కాన్పు సమయంలో మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ అంటే మీ నాయనకు చాలా ఇష్టం. ఆమె లేకపోయేసరికి అతను విలవిలలాడిపోయాడు. నిన్ను తీసుకుని వచ్చి మా చేతిలో పెట్టి “అమ్మా.. ఈ బిడ్డను మీ బిడ్డనే అనుకోండి. ఈ రహస్యాన్ని ఎప్పటికీ ఎవరికీ చెప్పకండి. నా భార్య లేని లోకంలో నేను ఉండలేను” అంటూ వద్దు వద్దని వారిస్తున్నా వినకుండా కన్నుమూసి తెరిచేంతలోగా అక్కడే వున్న ఒక బావిలో పడి మరణించాడు. మాకు పిల్లలు లేకపోవడంతో నిన్ను సొంత కొడుకులాగే అల్లారుముద్దుగా, ఎటువంటి లోటు రాకుండా పెంచాము. ఈ విషయం ఎవరికీ తెలియదు కాబట్టి మీ నాన్న తరువాత నువ్వు ఈ రాజ్యానికి రాజయ్యావు” అంటూ జరిగిందంతా చెప్పింది.
రాజు తర్వాతరోజు ఆ ముగ్గురు యువకులను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఒంటరిగా వాళ్లతో సమావేశమయ్యాడు. “మీ తెలివితేటలు, ఊహాశక్తి నిజంగా చాలా అద్భుతం. కానీ ఎంత ఆలోచించినా అంత సరిగ్గా జవాబులు ఎలా కనుక్కుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. చూడకుండానే ఒంటె మీద తల్లీబిడ్డలు పోతున్నారని, ఆ ఒంటెకు ఒక కన్ను గుడ్డిదని ఎలా కనుక్కున్నారు” అన్నాడు రాజు.
“ఏమీ లేదు మహారాజా.. మేము వచ్చే దారిలో పెద్దపెద్ద పాదముద్రలు నేలపై కనపడ్డాయి. వాటిని బాగా పరిశీలించాను. అంత పెద్ద పాదముద్రలు ఉండేది ఒక్క ఒంటెకే కదా” అన్నాడు మొదటివాడు.
“దారిలో ఎడమవైపు ఉన్న చెట్ల ఆకులు, చిగుళ్ళు మాత్రమే ఆ ఒంటె తినింది గానీ కుడివైపు అస్సలు ముట్టుకోలేదు. దాంతో దానికి కుడి కన్ను కనపడదు అని అర్థమైంది” అన్నాడు రెండవవాడు.
“దారిలో ఒకచోట ఒంటె విశ్రాంతి కోసం కూర్చుని ఉన్నట్టు గడ్డి బాగా నలిగిపోయి కనపడింది. అక్కడ మాత్రమే ఒక స్త్రీ పాదముద్రలతో పాటు ఒక చిన్న పిల్లవాని పాదముద్రలు కూడా కనపడ్డాయి. దాంతో ఆ ఒంటె మీద వాళ్ళిద్దరూ వెళుతున్నట్లు ఊహించాను” అన్నాడు మూడవవాడు.
“సైనికాధికారి ఆందోళనగా చుట్టూ చూస్తూ అందరిని అడుగుతూ ఎదురుపడ్డాడు. అతని ముఖంలో ఆందోళన చూసి ఒంటె పోగొట్టుకున్నది అతనే అని అర్థమైంది” అన్నాడు మొదటివాడు.
ఆ జవాబులు విని రాజు చాలా సంతోషించాడు.
“మరి సభలోకి పెట్టెలో తెచ్చినది దానిమ్మ పండు అని ఎలా తెలుసుకున్నారు. అది కూడా చెప్పండి” అన్నాడు ఆసక్తిగా.
“ఏమీ లేదు మహారాజా.. మీ సేవకులు ఆ పెట్టెను చాలా సులభంగా, ఏమాత్రం కష్టపడకుండా అవలీలగా మోసుకొని వచ్చారు. దాంతో అందులో ఉన్నది చాలా తేలికైన వస్తువే అని అర్థమైంది” అన్నాడు మొదటివాడు.
“పెట్టెను లోపలికి తెస్తున్నప్పుడు పెట్టె కదిలినప్పుడల్లా లోపలి వస్తువు అటూ ఇటూ దొర్లుతున్న చప్పుడు వినపడింది. దాంతో లోపల వున్న వస్తువు గుండ్రంగా ఉంది అని అర్థమైంది” అన్నాడు రెండవవాడు.
“మేము సభలోకి వచ్చేటప్పుడు ఉత్తరం వైపు అంతా వరుసగా దానిమ్మ చెట్లు కనపడ్డాయి. సైనికులు పెట్టెను అటువైపు నుండే తీసుకువచ్చారు. దాంతో అందులో గుండ్రంగా తేలికగా ఉండే దానిమ్మపండే ఉండి ఉండవచ్చు అని ఊహించాను” అన్నాడు మూడవవాడు.
ఆ జవాబులకు రాజు ‘శభాష్’ అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు.
ఆ తర్వాత చుట్టూ చూసి ఎవరూ లేరని అర్థం అయ్యాక దగ్గరగా వచ్చి గుసగుసగా “మరి నేను రాజవంశంలో పుట్టలేదని, వంటవాని కొడుకునని ఎలా కనుక్కున్నారు” అన్నాడు.
ఆ మాటలకు ముగ్గురి మొహాలు పాలిపోయాయి. భయంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకోసాగారు. నోట మాట రాలేదు.
అది చూసి రాజు “నేను రహస్యంగా మీరు గదిలో మాట్లాడుకునే మాటలు విన్నాను. మీకేం భయం లేదు. నిజం చెప్పండి. మిమ్మల్ని ఏమీ చేయను” అన్నాడు.
అప్పుడు మొదటివాడు “ఏమీ లేదు మహారాజా.. మేము జవాబులు చెప్పగానే రాజవంశానికి చెందినవారైతే సంతోషంగా మెడలో ఉన్న ఏదో ఒక విలువైన నగనో, హారమో తీసి టకీమని బహుమానంగా ఇచ్చేస్తారు. కానీ మీరు అలా చేయకపోవడంతో మీరు రాజ కుటుంబానికి చెందినవారు కాదేమో అని అనుమానం వచ్చింది” అన్నాడు.
“రాజా.. మీరు విలువైన బంగారు హారానికి బదులు తీయని తినుబండరాలు బహుమతిగా తెప్పించి ఇచ్చారు కదా.. దాంతో సాధారణ కుటుంబానికి చెందిన వారై ఉండవచ్చు అనుకున్నా” అన్నాడు రెండవవాడు.
“ఆ తినుబండారాలు మీ సేవకులతో వడ్డించకుండా మీరే మాకు స్వయంగా వడ్డించారు కదా. దాంతో వంటవాని కుమారుడేమో అని ఊహించాను” అన్నాడు మూడవవాడు.
ఆ సమాధానాలకు రాజు చాలా ఆశ్చర్యపోయాడు. “ఏమో అనుకున్నాను కానీ మీరు సామాన్యులు కాదు. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం. మీలాంటి అద్భుతమైన ఆలోచనా శక్తి కలిగినవాళ్లు మా ఆస్థానంలో సలహాదారులుగా వుంటే మాకు ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. అదే సమయంలో పొరపాటున కూడా నా జన్మ రహస్యం ఎవరికీ చెప్పకండి. చెబితే ఏం జరుగుతుందో మీలాంటి తెలివైనవాళ్లకు చెప్పవలసిన అవసరం లేదు కదా” అన్నాడు చిరునవ్వుతో.
వాళ్ళు అలాగేనంటూ అంగీకారసూచకంగా తలలూపారు. రాజుకు సలహాదారులుగా చేరి అవసరమైనప్పుడల్లా సలహాలు ఇస్తూ హాయిగా జీవించారు.
వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212