Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విస్తృత పరిశోధనల ఫలసిద్ధి – ‘తెలంగాణ తొలితరం కథకులు – కథన రీతులు’

[శ్రీ కె. పి. అశోక్ కుమార్ రచించిన ‘తెలంగాణ తొలితరం కథకులు – కథన రీతులు’ అనే వ్యాససంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్]

ప్రముఖ రచయిత, సాహితీవిమర్శకుడు శ్రీ కె. పి. అశోక్ కుమార్ విస్తృతంగా పరిశీధన జరిపి, తెలంగాణ తొలితరం కథకులపై వెలువరించిన వ్యాస సంపుటి ‘తెలంగాణ తొలితరం కథకులు – కథన రీతులు’.

“ఇది గతం గురించి రాసినట్టు కనబడుతున్న వర్తమానం గురించిన పుస్తకం. గత వర్తమానాల సంభాషణల పుస్తకం” అని తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు శ్రీ ఎన్. వేణుగోపాల్.

“1956 కి ముందు తెలంగాణలో ప్రఖ్యాతులైన, విస్మృతికి గురైన 30 మంది కథకుల జీవిత విశేషాలతో వారి కథా రచనా ప్రస్థానాన్ని వివరిస్తూ అశోక్ కుమార్ రాసిన ఈ పరిశోధనాత్మక పరిచయ వ్యాసాలు తెలంగాణ కథా సాహిత్య చరిత్ర నిర్మాణంలోనే కాదు; నిజాం పాలనలో తెలంగాణ సాంస్కృతిక పునర్వికాసోద్యమ కాలం నుంచి, సాయుధ రైతాంగ పోరాటం కాలం మీదుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వరకు, రెండు తరాల సామాజిక చరిత్ర అవగాహనకు సైతం ఎంతగానో దోహదం చేస్తాయి” అని అభిప్రాయపడ్డారు శ్రీ ఎ.కె. ప్రభాకర్.

వ్యాసకర్త అశోక్ కుమార్ తన ముందుమాట ఈ వ్యాసాలు రచించడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. తొలి తరం కథకుల కాల నిర్ణయం ఎలా జరిగిందో తెలియజేశారు.

~

‘మాడపాటి హనుమంతరావు సాహిత్య సేవ’ అనే వ్యాసంలో “మాడపాటి వారి రచనలన్నీ ఒక ఎత్తు, వారి ‘తెలంగాణ ఆంధ్రోద్యమము (1950)’ మరొక ఎత్తు. ఇది రెండు భాగాలుగా సాగిన ఆంధ్రోద్యమ చరిత్ర. ఆంధ్రోద్యమ చరిత్ర అంటే ఒక రకంగా మాడపాటి వారి ఆత్మకథ” అన్నారు రచయిత. మాడపాటి వారి కథాసంపుటి ప్రచురణ కాలం విషయంలో జరిగిన పొరపాటును ఎత్తి చూపారు. మాడపాటి వారి ‘నేనే’ కథకూ, గురజాడ వారి ‘దిద్దుబాటు’ కథకూ కొన్ని పోలికలు కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. మాడపాటి వారి అనువాద కథల గురించి వ్రాస్తూ, “తాము అనువదించినవి ప్రేమ్‌చంద్‌వని ఒక ముక్క చెప్పారే తప్ప, అవి ఎక్కడ ఎప్పుడు వచ్చాయో చెప్పలేదు. మాడపాటి వారి మీద పరిశోధన చేసిన మారంరాజు ఉదయ కుమార్, మాడపాటి వారి కథా వివరాలను పక్కన పెట్టి, ఒరిజినల్ కథల తాలూకు వివరాలను సేకరించి తమ సిద్ధాంత గ్రంథంలో ఇచ్చారు” అని తెలిపారు అశోక్ కుమార్. “కథలలో ఎక్కడా ఆధునికత-సమకాలీనత లక్షణాలు కనిపించవు. వస్తు శిల్పాలలో నవ్యత గోచరించదు. కథలన్నీ గ్రాంథికంలో రాయడం మరో మైనస్ పాయింట్” అని వ్యాఖ్యానించారు.

‘ఆదిరాజు వీరభద్రరావు కథలు’ అనే వ్యాసంలో వీరభద్రరాజు గారి జీవిత విశేషాలను వెల్లడించారు. ఎన్ని కథలు వ్రాశారో ఖచ్చితంగా తెలియకపోయినా, లభించిన ఆరు కథలను విశ్లేషించి, వాటి నాణ్యతను, గొప్పదనాన్ని వివరించారు. ‘బిజిలీ సంపాదనము’ జంతు ప్రేమ గురించి, ‘సౌగంధి’ యువతీయువకుల ప్రేమ గురించి, ‘ఆదిలక్ష్మి’ దాంపత్య ప్రేమ గురించి చెప్పిన కథలు. రమేశ చంద్ర దత్తు, అజంతా ఎల్లోరా, పెరుస్సుసు, శ్రావణి – అనే నాలుగు రచనలను కథలుగా పరిగణించి ‘లలిత కథా మంజరి’ గా వెలువరించారని తెలిపారు.

‘వడ్డేపల్లి సోదరుల కథలు’ అనే వ్యాసంలో వడ్డేపల్లికి చెందిన బెల్లంకొండ నరసింహాచార్యులు, బెల్లంకొండ వెంకటాచార్యులు అనే అన్నదమ్ములకి వడ్డేపల్లి సోదరులు అనే పేరు ఎలా వచ్చిందో వివరించారు. వారు రాసిన కావ్యాలను, నవలలను ప్రస్తావించారు. సోదరులిద్దరూ కలిసి, విడి విడిగానూ కథలు వ్రాసారని వివరించారు. సముద్రగుప్తుడు రాజ్యకాంక్షతో జరిపిన యుద్ధాలు, వాటి విషాద ఫలితాలపై ‘అంతర్వేదన’ అనే కథ; సారస్వత గ్రంథాలయాల స్థాపనతో ప్రజలలో నెలకొన్న చైతన్యాన్ని వివరించే ‘సంఘ సంస్కార సభ’ అనే కథ గురించి తెలిపారు. నిజామ్‍కు వ్యతిరేకంగా, ప్రజా చైతన్యం పెంపొందించే దిశగా వీరు మరికొన్ని కథలు వ్రాశారని తెలిపారు రచయిత. వీరి కథలు సరళ గ్రాంథికంలో ఉండి ఇప్పటికీ చదివిస్తాయని వ్యాఖ్యానించారు అశోక్ కుమార్.

‘ఒద్దిరాజు సోదరుల కథలు’ అనే వ్యాసంలో ఇనుగుర్తికి చెందిన ఒద్దిరాజు సీతారామచంద్రావు, ఒద్దిరాజు రాఘవరావు అనే అన్నదమ్ముల గురించి వివరిస్తూ, కొత్తదనం కోసం వెతుకులాట వారిద్దరి జీవితంలోనూ కనిపించే ప్రధాన అంశమని అన్నారు రచయిత. వీరు కావ్య ప్రబంధాలతో పాటు నవలలూ, కథలూ వ్రాశారనీ తెలిపారు. విదేశీ చదువుల పేరిట కన్న తల్లిదండ్రులను, సొంతూరిని వదిలి వెళ్ళి, తమ బాధ్యతలు మరచి అక్కడే స్థిరపడిపోయిన విద్యార్థుల గురించి, వారి తల్లిదండ్రుల కష్టాల్ని వర్ణిస్తూ ఎన్నో కథలు వచ్చాయనీ, అయితే ఈ ధోరణి ఆంగ్లేయుల పాలన నుండే మొదలయిందని ఒద్దిరాజు సోదరులు రాసిన ‘లండన్ విద్యార్థి’, ‘నీవేనా’ అనే కథల ద్వారా తెలుస్తుందని అన్నారు. ‘రక్తమూల్యము’ అనే కథలో అతి నాటకీయత చోటు చేసుకుని ఆకట్టుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. ‘అదృశ్యవ్యక్తి’ కథకి బహుశా హెచ్.జి. వేల్స్ సైన్స్ ఫిక్షన్ కథ ‘ఇన్విజిబుల్ మెన్’ ప్రేరణ కావచ్చని అంటూ, ఈ కథలో దొర్లిన ఒక పొరపాటును ప్రస్తావించారు. ఒక న్యాయవాది తన కష్టాలను తొలగించుకునేందుకు, బతుకుతెరువుకై చేసిన పనులు అన్నీ విఫలమై, అసలు మోసం వచ్చిన వనాన్ని హాస్యంగా చెప్పిన కథ ‘పనిలేని న్యాయవాది’. రాశిలో తక్కువైనా, వాసిలో మిన్న ఈ కథలని అంటారు.

‘నందగిరి వెంకటరావు కథనరీతుల విశ్లేషణ’ అనే వ్యాసంలో తాను అతి కష్టం మీద నందగిరి వెంకటరావు గారి 18 కథలను సేకరించగలిగానని తెలిపారు. ఈ కథలను విశ్లేషించి, “వస్తురీత్యా, శిల్పరీత్యా తన సమకాలీనుల కంటే మిన్నగా కథలను రాయడంలో నందగిరి వెంకటరావు మంచి ప్రతిభను కనబరిచారు” అని వ్యాఖ్యానించారు.

‘విలక్షణ కథకుడు సురవరం ప్రతాపరెడ్డి’ అనే వ్యాసంలో, ఆయన రాసిన కవితల కన్నా, నాటకాల కన్నా, కథానికలు ఎక్కువ వ్యాప్తి పొందినవని అన్నారు అశోక్ కుమార్. తెలంగాణ గ్రామీణ జీవితాన్ని, భాషను, పలుకుబడిని ప్రతాపరెడ్డిగారి కథలలో స్పష్టంగా పోల్చుకోవచ్చునంటారు. వీరు రాసిన మొఘలాయి కథలు అధిక్షేపపూరితాలనీ, వ్యంగ్యం ప్రధానంగా ఉండి పాఠకులకు గిలిగింతలు పెడతాయని తెలిపారు.

‘వెల్దుర్తి మాణిక్యరావు’ అనే వ్యాసంలో, మాణిక్యరావు గారు వ్రాసిన ‘ఒక్క నింషం’ కథ ఆడవాళ్ళ అలంకరణ మీద విసురనీ, ‘నిష్కామకర్మ’ కథ – ఇతరుల సాయం కోరకుండా స్వాభిమానంతో జీవించిన పుణ్యమూర్తుల కథ అనీ అంటారు. ‘నా దేశపు బట్ట’ కథ – విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాన్ని నెపోలియన్‍కు అన్వయిస్తూ వ్రాసిన కథ అనీ, ‘పిల్లలు – సొమ్ములు’ పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపిన కథ అనీ తెలిపారు.

‘తెలంగాణ జనజీవన వెతలు కాళోజీ కథలు’ అనే వ్యాసంలో, కాళోజీ మంచి కథకుడని ఇప్పటి తరానికి తెలియకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఒకప్పటి ‘కాళోజీ కథలు’ పుస్తకం మళ్ళీ పాఠకులకు అందుబాటులోకి రావడం మంచి పరిణామమని అన్నారు. 60 ఏళ్ళ తరువాత పునర్ముద్రణకి నోచుకున్నా, ఇప్పటికీ ఈ కథలు ప్రాసంగికతను కోల్పోలేదని ఆన్నారు. ‘రెండు గింజలు’ మనుగడ కోసం పోరాటం అనే సూత్రాన్ని చక్కగా వివరించిందనీ, ‘అపోహ’ కథ మంచి కొసమెరుపుతో సాగుతుందనీ, ‘కొసమెరుపు’ కథ ఆంగ్లానువాదమని తెలిపారు. ఈ కథలు 1940-50 దశకాల నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తాయనీ, తెలంగాణ నేటివిటీతో కూడుకుని ఉన్నాయని అన్నారు.

‘భాస్కరభట్ల కృష్ణారావు కథలు’ అనే వ్యాసంలో ఆయన రాసిన వెల్లువలో పూచిక పుల్లలు, యుగసంధి నవలల ద్వారా తెలుగు నవలా సాహిత్యంలో చెరగని ముద్ర వేశారని తెలిపారు రచయిత. ఆకాశవాణిలో పనిచెసిన కృష్ణారావు గారు బహుభాషా కోవిదుడనీ, వారి రచనా వ్యాసంగం 1937లో ప్రారంభమై 1957 వరకు కొనసాగిందని అశోక్ కుమార్ తెలిపారు. కృష్ణారావు గారు రచించిన పలు కథలను పరిచయం చేసి, “తాను చూసిన, తన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలను దృష్టిలో పెట్టుకునే ఈ కథలు రాశారు. అందుకే కథల్లో ఎక్కడా కృత్రిమమైన వస్తువు, పాత్రలు కనిపించవు” అన్నారు అశోక్ కుమార్. వారి రచనలన్నింటిలో మంచి పఠనీయతా గుణం ఉందన్నారు.

‘నెల్లూరు కేశవస్వామి కథల విశ్లేషణ’ అనే వ్యాసంలో కేశవస్వామి అనువాదకునిగా, కథారచయితగా సుప్రసిద్ధులనీ, భారతి లాంటి ప్రముఖ పత్రికలలో కథలు వ్రాశారని, ‘పసిడి బొమ్మ’ (1969), ‘చార్మినార్’ (1981) అనే కథాసంపుటాలు ప్రచురించారని తెలిపారు రచయిత. ‘చార్మినార్’ సంపుటి లోని కథలను పరిచయం చేసి, ఒక చారిత్రిక నేపథ్యాన్ని, ఒక సాంస్కృతిక నేపథ్యాన్ని తన కథల్లో నిక్షిప్తం చేసిన గొప్ప రచయిత నెల్లూరి కేశవస్వామి అని అన్నారు. హైదరాబాద్ లోని ఇన్ని సాంస్కృతిక వైవిధ్యాలను ఇంత ప్రతిభావంతంగా మరే తెలుగు రాయిత తన కథల్లో వ్యక్తీకరించలేదని అన్నారు. ‘పసిడి బొమ్మ’ సంపుటిలో ప్రభుత్వం ఇచ్చే భరణంపై ఆధారపడి దైన్యస్థితిలో ఉన్న నవాబుల కథలు, అవకాశవాదుల రాజకీయాలను చాటిన కథలు, ప్రజలు నియోరిచ్ కల్చర్‍కు ఎలా అలవాటు పడుతున్నారో చెప్పే కథలున్నాయని తెలిపారు. ఈ రెండు సంపుటాలలో చోటు చేసుకుని మరికొన్ని కథలను విశ్లేషించారు. మైనారిటీల జీవితాన్ని ఇంత క్షుణ్ణంగా పరిశీలించినవారిలో కేశవస్వామి ప్రథములుగా నిలుస్తారని అంటారు.

‘బూర్గుల రంగనాథరావు కథలు’ అనే వ్యాసంలో రంగనాథరావు గారి గురించి తెలియజేసి, వారు కథల సంపుటాలను పేర్కొన్నారు. వీరి కథలను బాల్యవివాహాలు, సంస్కరణలు – ఆదర్శాలు, భార్యాభర్తల అనుబంధాలను, విఫల ప్రేమను, రచయితల మనస్తత్వాలను చిత్రించిన కథలుగా విభజించుకోవచ్చునని అశోక్ కుమార్ పేర్కొన్నారు. వీరు ప్రభుత్వంలో ఉన్న ఉన్నతోద్యోగిగా పని చేయడం వలన, వారికి తెలిసిన జీవితం గురించే రాయగలిగారనీ, వేరే వాటిని పట్టించుకోలేదని వ్యాసకర్త వ్యాఖ్యనించారు.

‘నందగిరి ఇందిరాదేవి కథలు’ అనే వ్యాసంలో ఇందిరాదేవి గారి కథలలోని విశేషాలని వివరిస్తూ, ఇందిరాదేవి గారు కుటుంబ వ్యవస్థ, స్త్రీ-పురుష సంబంధాల లోని వైరుధ్యాలు, సామాజిక సమస్యలు, మనిషి మనస్తత్వం వైచిత్రి వంటి ఇతివృత్తాలతో కథలు వ్రాశారని అన్నారు వ్యాసకర్త. ఈ కథలన్నీ 1940-42 మధ్యలో రాసినవనీ, అప్పట్లో తెలంగాణలో స్త్రీ విద్య చాలా తక్కువనీ, అలాంటిది ఒక విద్యాధికురాలు కథలు వ్రాయడం అరుదైన విషయమనీ, ఈ నేపథ్యంలో రచయిత్రి కథల గొప్పతనాన్ని అంచనా వేసుకోవాలని సూచించారు. ఆసక్తిగా చదివించే కథలని పేర్కొన్నారు.

పెండ్యాల శేషగిరిరావు గారు 17 ఏళ్ళ వయసులోనే, 1943లో తన కథా సంపుటి ‘దాంపత్యం’ ప్రచురించారు. తెలంగాణలో హైదరాబాదేతర ప్రాంతం (వరంగల్) నుంచి వెలువడ్డ తొలి తెలుగు కథా సంపుటి ఇది. 46 పేజీల ఈ సంపుటిలో 4 కథలున్నాయి. రచయిత కౌమార ప్రాయంలో రాసిన కథలు ఆ వయసుకు తగ్గట్టుగానే రూపొందాయని అన్నారు అశోక్ కుమార్. ఆనాటి కాలక్షేపం కథలకి ఇవి ఉదాహరణలన్నారు.

‘బిసి సమస్యల్ని పట్టించుకున్న తొలి రచయిత జి. రాములు’ అనే వ్యాసంలో, రాములు గారి కథలని విశ్లేషించి, నిజామ్ తెలంగాణలో వృత్తి కులాల వారిపై కొనసాగే అన్యాయాలు, అణచివేతలను కథావస్తువులుగా తీసుకుని కథలు వ్రాసారని అశోక్ కుమార్ తెలిపారు. వీరి కథల్లో ఆత్మఘోష, పిచ్చి శాయన్న పెరటి చెట్టు ముఖ్యమైనవి.

కాంచనపల్లి చినవెంకట రామారావు గారు మాజీ ఎమ్మెల్లే. కవి, రచయిత. వీరి ‘మన ఊళ్ళో కూడానా?’ కథా సంపుటి లోని కథలు గ్రామీణ జీవితంలోని వైరుధ్యాలను, దొరల దౌర్జన్యాలను, భూస్వామ్య సంబంధాలను, ప్రజల తిరుగుబాటు మనస్తత్వాన్ని తెలియజేస్తాయని అంటారు వ్యాసకర్త. ఈ సంపుటి లోని మొదటి ఆరు కథలు 1945-47 ప్రాంతంలో రాసినవనీ, మిగిలిన మూడు కథలు 1972లో రాసినవనీ తెలిపారు అశోక్ కుమార్. ఈ కథాసంపుటి మూడవ ముద్రణను నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు 2016లో తీసుకువచ్చారని తెలిపారు.

పొట్లపల్లి రామారావు గారు స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక తత్త్వవేత్త. కవి, కథకుడు. జైలు అనే కథా సంపుటి వెలువరించారు. వీరి కథలని పరిచయం చేసి, ఈ కథలన్నీ ఇతివృత్తానికి అనువైన కథాకథనాలతో ఆసక్తికరంగా రూపొందాయని అన్నారు వ్యాసకర్త. అప్పటి రచయితలకి భిన్నంగా వీరి భాష సులభమైన వాడుక భాష అని పేర్కొన్నారు. వీరు బాలల కోసం రాసిన ముల్లా కథలు – చక్కగా, చిక్కగా, చిన్నకథలుగా ఉండి పిల్లలనూ, పెద్దలనూ ఆకట్టుకున్నాయని అన్నారు అశోక్ కుమార్.

బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి కవి, కథకుడు, నాటకకర్త. తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. కథాకేళి, సశేషం అనే రెండు కథా సంపుటాలు ప్రచురితమయ్యాయి. కథాకేళిలో రైతాంగ సమస్యలు, విదేశీవస్తు బహిష్కరణ, పేదరికం అంశాలతో అల్లిన కథలున్నాయి. లోకరీతిని, కవుల మనస్తత్వాలను వెల్లడించే కథలున్నాయి. “కొన్నికథలు కొసమెరుపుతో ఉన్నాయి. కొన్ని కథలు హఠాత్తుగా ముగిసినట్లు అనిపించినా, ఆ ముగింపే సరైనదని మనం గుర్తించగలం” అన్నారు వ్యాసకర్త.

ఆవుల పిచ్చయ్య గారు రచించిన కథల్లో అయిదు కథలను సంపాదించి, వాటిని విశ్లేషించారు వ్యాసకర్త. చపరాసి దినచర్య కథ గురించి, ఆ కథ ప్రచురణ వెనుక కథ గురించి తిరుమల రామచంద్ర గారివి, అడవి బాపిరాజు గారి అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

జమీందారి కథకుడు పర్చా దుర్గా ప్రసాదారావు గారి గురించి, నిజామ్ వ్యతిరేక పోరాటంలో వారి పాత్ర గురించి వివరించి, వారు రాసిన కథలను పరిచయం చేశారు అశోక్ కుమార్. ‘గెలుపు మనదే’ అనే సంపుటి లోని కథలు 1947-48 ప్రాంతంలోవని అంటారు. ‘బియ్యపు గింజలు’ కథలో అతి నాటకీయత ఉందని వ్యాఖ్యానించారు.

దాశరథ కృష్ణమాచార్యులుగారు ప్రసిద్ధ కవిగా చాలామందికి తెలుసు. కానీ ఆయన చక్కని కథకులు కూడా. తెలంగాణ అమర వీరుని రక్తాంజలి, పూచిన మోదుగలు, నిప్పుపూలు, మారువేషం, నారింజపండ్లు అనే కథలను పరిచయం చేశారు వ్యాసకర్త. ఈ కథలన్నీ 1947 మొదలుకుని 1966 వరకు అప్పుడప్పుడు రాసినవనీ, ఎక్కువ కథలు నిజామ్ వ్యతిరేక పోరాటం నేపథ్యంలో వెలువడినవేననీ, కవితాత్మకమైన వచనంతో, వినూత్న వర్ణనలతో ఆద్యంతం ఆసక్తిగా చదివిస్తాయని పేర్కొన్నారు వ్యాసకర్త.

ధరణికోట శ్రీనివాసులు గారు చక్కని కథకులని చెబుతూ, తొలి దశలో సీరియస్ కథలే వ్రాశారనీ, తదుపరి మునిమాణిక్యం నరసింహారావు గారి ప్రభావంతో తేలికపాటి కథలు వ్రాశారనీ, మునిమాణిక్యం గారి ‘కాంతం కథలు’ లానే, వీరు ‘కనకం కథలు’ రాశారని తెలిపారు వ్యాసకర్త.

రజాకార్ల దౌర్జన్యాలను వివరిస్తూ, కథలు వ్రాసి, వాటితో సంకలనం వేసిన ఏకైక రచయిత అడ్లూరి అయోధ్యరామకవి అని తెలిపారు వ్యాసకర్త. 45 పేజీల ఈ చిన్న పుస్తకంలో, నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా సృజించిన కథలున్నాయన్నారు.

ఖమ్మం జిల్లా రచయితలలో భీష్మాచార్యుల వంటి వారు పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు అని చెబుతూ, వారి కథలను విశ్లేషించారు అశోక్ కుమార్. వీరు – పుల్లాభొట్ల కథలు (1955), దారి తప్పిన జీవితాలు (1965), మూడు వాక్చిత్రాలు (1965) మూడు కథా సంపుటాలను వెలువరించారని తెలిపారు. దారి తప్పిన యువతరం, కట్టుబాట్లు తెంచుకున్న మహిళల జీవితాలు విషాదకరంగా ముగుస్తాయని వీరి కథలు తెలియజేస్తాయని అన్నారు. ఈ మూడు సంపుటాలను, పుల్లాభొట్ల వారి సాహితీస్వర్ణోత్స ప్రచురణగా, 1990లో, ‘పిన్ని చాలా మంచిది’ అనే ఒకే సంపుటిగా ప్రచురించారని పేర్కొన్నారు.

అక్షరంతో, మాటతో సంబంధం ఉన్న అన్ని పనులు చేసిన మహనీయుడు వట్టికోట అళ్వారుస్వామి అంటూ, వారి కథలను విశ్లేషించారు వ్యాసకర్త. అళ్వారుస్వామి జైలులో ఉన్న కాలంలో రచించిన కథలో ‘జైలు లోపల’ అనే సంపుటి ప్రచురించారు. జైలులో ఖైదీలతో కలిసిపోయి, వారి గాథలను తెలుసుకుని వాటిని కథలుగా వెలువరించటం తెలుగులో ఇదే ప్రథమమంటారు అశోక్ కుమార్. పాత్రోచిత తెలంగాణ మాండలికంలో, సహజ సుందరమైన శైలిలో వాస్తవిక జీవితాలకు కథనరూపమిచ్చిన సజీవ శిల్పాలుగా వీరి కథలు నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు.

‘సంగీత సాహిత్యాల పెన్నిధి సామల సదాశివ’ అన్న వ్యాసంలో సదాశివ గారి సాహితీకృషిని వివరించారు వ్యాసకర్త. వారు రచించిన ఆరు కథలలో, లభ్యమైన నాలుగు కథలను పరిచయం చేశారు. పరివర్తనము, పర్యవసానము అనే కథలు సులభ గ్రాంథికంలోనూ, కళ పరమావాధి, ప్రాయశ్చిత్తము కథలు వ్యావహారిక భాషకు దగ్గరగా ఉన్నాయన్నారు. మంచి రీడబిలిటీ ఉన్న కథలని పేర్కొన్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి గిరిశనకుర్తి సురమౌళి గారి కథలు – బాల్యం, స్త్రీ హృద్యం, మధ్యతరగతి జీవితం, ఎన్నికలు, రాజకీయాలు, మనస్తత్వ విశ్లేషణ చుట్టూ తిరుగుతాయని అన్నారు అశోక్ కుమార్. ఈ కథలలో ఎక్కువ భాగం 1952-61 మధ్య కాలంలోనివనీ, ‘మలుపులు’ కథ అసంపూర్తిగా ఉందని తెలిపారు.

గూడూరి సీతారం గారి కథల్లోని భాషా సౌందర్యాన్ని వివరించిన వ్యాసంలో – ఆయన కథలన్నీ అసలు సిసలు తెలంగాణ మాండలికం భాషా సౌందర్యానికి ప్రతీకలని అంటారు అశోక్ కుమార్. అచ్చ తెలంగాణ మాండలికాన్ని పొదుపుకున్న ఈ కథలు, మాండలిక సాహిత్యంలో ఆణిముత్యాలుగా నిలిచిపోతాయని అన్నారు.

వల్లపురెడ్డి బిచ్చారెడ్డి గారి కథలను విశ్లేషించి, ఈ కథలు 1950 దశకం నాటి రాజకీయ, ఆర్థిక, సామాజికాంశాలను తెలియజేస్తాయని అన్నారు అశోక్ కుమార్. అన్యభాషా పదాలు లేకుండా, సరళ సుందరమైన తెలుగు భాషలో తీర్చిదిద్దిన ఈ కథలు ఆసక్తికరంగా చదివిస్తాయని అన్నారు వ్యాసకర్త.

స్వాతంత్ర్య సమరయోధుడు, సాహితీవేత్త హీరాలాల్ మోరియా గురించి వ్రాసిన వ్యాసంలో, వారి ‘బ్రతుకు బాటలు’, ‘పరిష్కారం’ అనే కథాసంపుటాలలోని కథలని పరిచయం చేశారు. ఈ రెండు సంపుటాలలో – ప్రేమ, విఫల ప్రేమని తెలియజేసే కథలు, బ్రతుకు పోరాటాన్ని చిత్రించిన కథలు, సంస్కరణాభిలాషని వెలిబుచ్చిన కథలున్నాయని వివరించారు వ్యాసకర్త.

~

విస్తృతంగా పరిశోధనలు చేసి, పలు వనరుల నుండి, మిత్రుల నుండి కథలు సేకరించి, వాటిని విశ్లేషించి, ఆయా కథకులను తిరిగి పాఠకుల ముందుకు తెచ్చిన అశోక్ కుమార్ గారి కృషి అభినందనీయం. “సాహిత్య చరిత్ర అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు ఇది రిఫరెన్స్ పుస్తకంలా పనిచేస్తుంది” అన్న ప్రచురణకర్తల అభిప్రాయంతో పాఠకులు ఏకీభవిస్తారు.

***

తెలంగాణ తొలితరం కథకులు – కథన రీతులు (వ్యాస సంపుటి)
రచన: కె. పి. అశోక్‍ కుమార్
ప్రచురణ: నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్
పేజీలు: 280
వెల: ₹ 280.00
ప్రతులకు:
నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్,
ఎం.హెచ్. భవన్, ప్లాట్ నెం. 21/1,
అజామాబాద్, ఆర్.టి.సి. కల్యాణమండపం దగ్గర,
హైదరాబాద్ 500020. 040-27673787
~
నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఇతర శాఖలు

~
శ్రీ కె. పి. అశోక్ కుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-kp-ashok-kumar/

Exit mobile version