[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన డా. మైలవరపు లలితకుమారి గారి ‘తెగిన బంధాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
అప్పుడు సమయం ఉదయం 7 గంటలయింది. వేసవికాలమేమో, సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అప్పుడే నిద్ర లేచిన సుగుణ తన గది నుండి బయటికి వచ్చింది. కిందకి చూస్తే ఆగిన కార్లు, జనంతో హడావిడిగా ఉన్నది ఆశ్రమం. ఏం జరిగిందా? అని తన పక్కగదిలో ఉన్న రాధమ్మ దగ్గరకు వెళ్ళింది సుగుణ.
“రాధమ్మా! జానకమ్మగది ముందంతా హడావుడిగా ఉన్నది, ఏం జరిగింది?” అన్నది సుగుణ.
“నీకు తెలియదా సుగుణా! రాత్రి రెండు గంటల సమయంలో జానకమ్మ గుండెపోటుతో నిద్రలోనే చనిపోయిందిట” అన్నది రాధమ్మ.
“అయ్యో అలాగా! నేనిప్పుడే లేస్తున్నాను. రాత్రంతా ఎందుకో నిద్రపట్టలేదమ్మా” అన్నది సుగుణ. “పోనీలే జానకమ్మ తన బాధ తీర్చుకుని పోయింది” అన్నది.
“నిజమే సుగణా! చిన్నప్పుడే పెళ్ళయిందిట జానకమ్మకు. కాని పిల్ల పుట్టిన తరువాత భర్త మరణించాడు. అన్నల, అక్కల పంచన కాలం గడిపింది పాపం. అయినా ఏవో చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎవరికి భారం కాకుండా పిల్లని బాగా చదివించింది. ఆ పిల్ల రేఖ కూడా చాలా తెలివయిన పిల్ల. తల్లి కష్టం తెలుసుకొని స్కాలర్షిప్లతోనే చదువుకుందిట” అన్నది రాధమ్మ.
“ఇక్కడే ఏదో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది నిజమేట. నచ్చినవాడికిచ్చి పెళ్ళి చేసింది. వాళ్ళకు పిల్లలు పుట్టారు. జీవితం హాయిగా గడుస్తున్నది కదా అనుకుంది జానకమ్మ” అన్నది సుగుణ.
“కానీ ఇంతలో కూతురికి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందటగా?” అన్నది రాధమ్మ.
“ఆ విషయం విన్న జానకమ్మ ఎందుకు రేఖా అంత దూరం వెళ్ళటం. ఇక్కడ బాగానే ఉన్నదిగా అన్నది”.
“ఆఁ కాని ఈకాలం పిల్లలకి ఈ అమెరికా పిచ్చి పట్టింది కదు రాధమ్మా! అందుకేగా మనమంతా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది” అన్నది బాధతో సుగుణమ్మ.
“అప్పుడు రేఖ ‘ఆఁ ఎంతమ్మా! ఒక్క అయిదేళ్లు కళ్ళుమూసుకుంటే బోలెడు డబ్బు సంపాదించు కోవచ్చు. అప్పుడు మళ్ళీ వచ్చేస్తాంలే’ అంటూ, ‘ముందు మేము వెళ్ళి కాస్త స్థిరపడ్డాక నిన్ను తీసుకుపోతా. నిన్ను వదిలి నేనుండలేను’ అన్నదట రేఖ.”
“సరేనమ్మా! మీయిష్టం అంటూ నేనెక్కడికి రాను ఇక్కడ ఇంట్లోనే ఉంటానన్నది జానకమ్మ.”
“ఎలా అమ్మా! అలా అంటే అన్నది రేఖ.”
“ఏం? నాకిక్కడ అంతా అలవాటే కదా! నాకేం భయలేదులే” అన్నది జానకమ్మ.
“అలా వద్దు. నువ్వు రానంటే ఇక్కడికి దగ్గరలో ఆనంద నిలయం అని ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ అంతా దాదాపు నీవయసు వాళ్ళే ఉంటారు. అదీకాక మాఫ్రెండ్స్, కొలిగ్స్ తల్లిదండ్రులు అత్తమామలు ఉన్నారు. అందరూ నాకు తెలిసినవాళ్ళే. నీకు కూడా కాలక్షేపం చాలా బాగుంటుంది అన్నది రేఖ.”
‘బాగుంటుందా? ఏం బాగుంటుంది? ఎవ్వరూ లేని అనాథబ్రతుకు కదా! అని నిస్పృహతో అనుకుంది జానకమ్మ.’
రేఖ తను అనుకున్నట్లుగా ఒక మంచిరోజున తల్లిని తీసుకెళ్ళి ఆశ్రమంలో చేర్పించింది.
ఒక చిన్నహాలు, వంటగది, బెడ్రూమ్, ఎటాచ్డ్ బాత్రూమ్, దేవుడి గది, టి.వి., ఫ్రిజ్, గీజర్, బీరువా అన్నీ హంగులతో ఇల్లు లాగానే ఉన్నది. ఇంట్లో ఉండే పిల్లలే కరువు అని మనసులో అనుకున్నది జానకమ్మ.
‘అమ్మా! బాగుందా! అన్ని సదుపాయాలు చక్కగా ఉన్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్, టీ, రాత్రి డిన్నర్ అన్నీ టైం ప్రకారం ఇస్తారు.’
‘అవును చాలా బాగుంన్నది రేఖా! ఇంతకీ ఇక్కడ ఎంత కట్టాలమ్మా’ అన్నది జానకమ్మ.
‘ఆఁ ఎంతమ్మా నెలకి ఒక లక్షన్నర కడితే చాలు’ అన్నది రేఖ.
‘మరి డాక్టర్ వారం వారం వస్తాడు కదా! మిగిలిన ఏర్పాట్లన్నీ ఇక్కడే కదా!’
‘రాములవారి గుడి కూడా ఉన్నదమ్మా! నీకు మంచి కాలక్షేపం అన్నది రేఖ.’
‘అవును నిజమే! ఒంటరి జీవితానికి అదే కాలక్షేపంలే’ అని మనసున అనుకుంది జానకమ్మ.
ఆ తరువాత ఒక నాలుగురోజులు రోజూ వచ్చి తల్లిని చూసి వెళ్ళింది రేఖ. ‘ఒక రోజు అమ్మ మేము ఈనెలలో వెళ్ళాలి అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి కదా రేపటి నుంచి రోజూ రాలేను, మళ్ళీ వెళ్ళేముందు రోజున వచ్చి వెళతాను అన్నది రేఖ.’
‘సరేనమ్మా! జాగ్రత్త’ అన్నది జానకమ్మ బాధ కనపడనీయకుండా!
ఆ రోజునుంచి ఆమె ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం గుడికి వెళ్ళేది. ఆ భగవంతుని సన్నిధిలో కూర్చుని
‘అనాయాసేన మరణం వినాదైన్యేనజీవితం।
దేహంతే తవసాయుజ్యం దేహిమేపార్వతీపతే॥’
అని ధ్యానించేది.
“ఆ ప్రార్ధన తప్ప ఆమె నోటి వెంట మరో నామం, మరో ధ్యాస లేకుండా స్వామిని వేడుకుంది. జానకమ్మ” అన్నది రాధమ్మ.
“నిజమే రాధమ్మ! ఆమె మొరని విన్న పరమేశ్వరుడు ఆమె బంధాలను దూరం చేస్తూ కూతురు అమెరికా వెళ్ళకుండానే ఆమెకి ముక్తినిచ్చాడు కదా!” అన్నది సుగుణ.
“నువ్వన్నది నిజమే సుగుణా” అన్నది రాధమ్మ.
“ఎంత సంపాదించినా ఏమున్నది అక్కడ?”
“అవును నిజమే ఒకప్పుడు మనిషి డబ్బును సృష్టించాడు. ఇవ్వాళ ఆ డబ్బే మనిషిని నడుపుతుంది సుగుణా. నీవు చెప్పింది నిజం సుగుణా! అయినవాళ్ళందరిని వదిలిపెట్టి ఆ డబ్బులోనే అన్నీ చూసుకుంటున్నారు ఈనాటి పిల్లలు” అన్నది రాధమ్మ.
“డబ్బేలోకం అయిన ఈ కాలంలో మమతలు బంధాలకు విలువలేదని తెలుసుకున్న జానకమ్మ కూతురు దూరమవటాన్ని తట్టుకోలేకపోయింది. ఆ పిల్ల కోసం కొట్టుకున్న గుండె ఇప్పుడు ఆగిపోయింది కదా! అలాంటి రోజు నాకెప్పుడు వస్తుందో రాధమ్మా!” అన్నది సుగుణ.
“నీకే కాదు ఇక్కడ ఉన్నవారందరి బాధ ఒక్కొక్కరిది ఒక్కొక్కరకం. ఆప్యాయతలు కరువై ఆ భగవంతుడి పిలుపు కోసం ఎదురుచూస్తూ కాలం వెళ్ళదీస్తున్న వారమే కదా అందరం” అన్నది రాధమ్మ.
“ఎంతయినా జానకమ్మ అదృష్టవంతురాలు సుగుణా!”
“అవును రాధమ్మా! జానకమ్మను కడసారి చూసివద్దాం! రా!” అనుకుంటూ…
తమ బంధాలను తెంచుకుంటూ నిస్పృహ నిండిన మనసులతో అడుగులు కదిపారు రాధమ్మా, సుగుణ.
ఈనాడు ఇలాంటి వారెందరో కదా!
సర్వేజనాస్సుఖినోభవంతు
You must be logged in to post a comment.
అమెరికా డాలర్లు
చిలకలు వాలని చెట్టు
సామాన్యుల జీవితాల గురించి అద్భుతమైన కవిత – ‘సామాన్యుడు’
సంచిక – పదప్రహేళిక జనవరి 2022
శ్రీవర తృతీయ రాజతరంగిణి-38
రజనీగారూ… కొన్ని జ్ఞాపకాలూ
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-18
పాపం కోటిగాడు
శ్రీపర్వతం-52
రేపు తెలవారుఝామున
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®