[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[బాబ్రీ మసీదు ధ్వంసం తరువాత దేశమంతా అట్టుడికింది. మతసామరస్యం సాధించేందుకు కొందరు బుద్ధిజీవులు హైదరాబాదులో ‘రాం రహీం ఏక్తా యాత్ర’ అన్న సంస్థను స్థాపించి, దాని తొలి సమావేశాన్ని నిర్వహిస్తారు. వేణు, గోవిందులతో స్వామి ఆ సమావేశానికి హాజరవుతాడు. కేశవరావు జాదవ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వాలు చేసిన తప్పులను ప్రసావిస్తారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ అప్పటి ప్రధాని నిష్క్రియాపరత్వాన్ని ప్రస్తావిస్తారు. పాశం యాదగిరి అనే జర్నలిస్ట్ మాట్లాడుతూ, శ్రీకృష్ణ కమీషన్ నివేదిక గురించి వివరిస్తారు. ప్రభుత్వం ఆ నివేదికని తిరస్కరించిన వైనం, అందుకు జస్టిస్ శ్రీకృష్ణ బాధపడడం గురించి చెప్తారు. తదుపరి గురించి రాబోయే సమావేశంలో చర్చించుకుందామంటూ ఆ సమావేశాన్ని ముగిస్తారు. స్వామి తల్లికి అనారోగ్యం చేసి, చికిత్స పొందుతూ చనిపోతుంది. తల్లికి మాట ఇచ్చిన ప్రకారం సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలన్నీ జరిపిస్తాడు స్వామి. తనలో వస్తున్న మార్పులని విశ్లేషించుకుంటాడు. తన లోపలి మనిషి హృదయం ముక్కలైనట్టు భావిస్తాడు స్వామి. – ఇక చదవండి.]
అధ్యాయం-14: నెల నెలా వెన్నెల
“నువ్వు ఇట్లానే ఉంటే.. ‘మకాన్ సే దుకాన్, దుకాన్ సే మకాన్’ లా ఉంటే తొందరగనే తుప్పు పట్టి పోతవ్. జాగ్రత్త సుమా” అని వేణు చనువుగా హెచ్చరించాడు ఒక ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి.
సెలవు అంటే కడుపు నిండా కమ్మగా తిని కంటి నిండా సుఖంగా నిద్రపోయి వారం రోజుల ఆఫీసు అలసటా, చికాకులను మరచిపోవటమే అని స్వామి ఉద్దేశ్యం.
ఈ మధ్య స్వామికి శారీరక పని అలసట కన్నా మానసిక అలసట ఎక్కువగా ఉంది.
“మరి ఏం చేయాలి” అడిగిండు. “ఏం చేయాలి అంటే ముందు ముఖం కడుక్కుని ఆ నిద్ర మబ్బు వదిలించుకోవాలి. తర్వాత బట్టలు వేసుకుని నా వెంబడి నడవాలి” అని ఆదేశించాడు.
‘ఆరుగంటల ఆట సీన్మాకేమో’ అనుకున్నడు స్వామి.
వేణు మామ వచ్చిండంటే ఇద్దరు పిల్లలకు పండుగ. వారితో కబుర్లు చెప్పి, జోకులు వేసి పకపకా నవ్విస్తడు. తనూ నవ్వుతడు. అతనిది మొదటి నుండి ‘పిల్లల కోడి’ స్వభావం. పిల్లల ప్రేమికుడతను. అతను ఏ ఇంటికి వెళ్లినా నవ్వులపువ్వులు వెల్లివిరుస్తాయి.
ఆంజల్య వేణును పలకరించి ఇద్దరికీ చాయ్‌లు అందించింది. వేణు స్వామిని తీసుకుని ఆటోలో మాసాబ్ టాంక్ శ్యాంనగర్‌లో కమ్యూనిటీ హాలుకు తీసుకుపోయిండు.
అక్కడ ప్రతి నెలా చివరి ఆదివారం సాయంత్రం ఆరుగంటల నుండి రెండుగంటల పాటు ‘నెలనెలా వెన్నెల’ సాహిత్య సమావేశాలు జరుగుతుంటాయి. నగరంలోని కవులు, రచయితలు, సాహితీ అభిమానులే కాక అప్పుడప్పుడూ ఇతర ప్రాంతాల నుండి కొంతమంది అ సమావేశానికి వస్తుంటారు. సీనియర్ అండ్ జూనియర్ కవులు తాము రాసిన తాజా కవితలు వినిపిస్తారు. వాటిపై ప్రతి స్పందనలు, చర్చ ఉంటుంది. అప్పుడప్పుడూ ఎవరో ఒకరు ఒక అంశంపైననో లేదా పుస్తకం గురించో ప్రసంగిస్తారు. అట్లా అదొక అందమైన ‘లిటరరీ మెహఫిల్’. సకలకళలు ప్రదర్శించే పూర్ణచంద్రుడి వెన్నెల ప్రతి నెలా ఒకసారే ప్రసరించినట్లు ఈ కవితా సమావేశాలు కూడా నెలలో ప్రతి చివరి ఆదివారం సాయంత్రం ఒకసారే జరుగుతుంది.
దాని సమావేశ కర్త సి.వి. కృష్ణరావుగారు. పదవీ విరమణ పొందిన ఒక ప్రభుత్వ అధికారి. చూడటానికి చాలా సింపుల్‌గా సాదాసీదాగా కనబడుతాడు గాని అతని లోపలి మనిషి మాత్రం అన్ని విధాలా ఉత్తమం, ఉన్నతం. చాలా నెమ్మదిగా, మెత్తగా మెల్లమెల్లగా దోబుచులాడుతూ పున్నమినాటి రాత్రి వచ్చే వెన్నెలలా చల్లగా, హాయిగా ఉంటాడు.
ఆ రోజు పదిహేను, ఇరవై మంది వచ్చారు. అన్ని వయసుల వాళ్లు. అందులో సిద్దార్థ ఒక్కడే తనకు తెలుసు. అందరూ గుండ్రంగా కూచున్నారు. ప్రతిసారీ ముందు కొత్త కవులకే ప్రాధాన్యత. ఇద్దరు, ముగ్గురు కొత్త కుర్ర కవులు భయంభయంగా, జంకుతూ తత్తర పడుతూ తమ కవితలను వినిపించారు. అందరూ శ్రద్ధగా, నిశ్శబ్దంగా విని వారు చదవటం అయిపోగానే తమతమ ప్రతిస్పందనలు సూచనలు ప్రోత్సాహకరంగా తెలిపారు. ఆ పిల్ల కవుల ముఖాలు వెలిగిపోయినయి.
ఒక యువకుడు చాలా ఆత్మస్థైర్యంతో స్పష్టమైన ఉచ్చారణతో, అందంగా వినబడే జీరగొంతుతో కవిత చదవటం ప్రారంభించాడు. ఆ కవితా శీర్షిక ‘రండి మనం అంతా కలిసి చనిపోదాం’. అతను ఆ శీర్షిక ఎంత ఈజీగా, అలవోకగా అన్నాడంటే “రండి మనమందరం కలిసి చాయ్ తాగుదాం” అన్నంత సులువుగా అన్నాడు. ఆ శీర్షిక పేరు వినగానే ముందు అందరి ముఖాలలో నవ్వులు కనిపించాయి. ఆ కవిత చాలా పెద్దగానే ఉంది. కాని అంతా తలక్రిందులుగా, తిక్కతిక్కగా ఉంది. ఏం చెబుతున్నాడో తెలవక గందరగోళంగా ఉంది స్వామికి. ఐనా అది ఐపోగానే అందరూ ప్రత్యేకంగా చప్పట్లు కొట్టారు. ఎవరితను అని వేణును అడిగితే అతని పేరు దెంచనాల శ్రీనివాస్ అని కవి మాత్రమే కాక నాటకాలు స్వయంగా రాసి ప్రదర్శిస్తుంటాడని తెలిసింది. ఒకప్పుడు అతను, హబీబ్ తన్వీర్, బాదల్ సర్కార్, సఫ్దర్ హాష్మీలతో దేశమంతా తిరుగుతూ నాటక రంగంలో వారి దగ్గర శిష్యరికం చేసాడట.
ఆ తర్వాత తనకు బాగా తెలిసిన మిత్రుడు సిద్ధార్థ తన కవిత చదవటం ప్రారంభించాడు. దాని పేరు ‘బొమ్మల బాయి’. ఆ కవిత అసాంతం తెలంగాణా యాస పల్లె పదాలు, ప్రకృతి చిత్రణ అనేక ఉపమానాలు, అలంకారికంగా ఉంది. సిదార్ధ చదివే పద్ధతి స్వామికి నచ్చింది. చాలా మంది కవులు గొంతు చించుకుని, వీరావేశంతో చదువుతుంటారు. ముఖ్యంగా అభ్యుదయ, విప్లవ కవులు. సిద్ధార్థ అట్లా కాకుండా మంత్ర స్వరంతో, భావాత్మక విధానంతో చదవటం నచ్చింది. అయితే ఆ కవిత కూడా చాలా మార్మికంగా, నిగూఢంగా ఉండి స్వామికి అర్థం కాలేదు.
కవిత అయిపోగానే ఒక శ్రోత “కాస్తా అర్థం అయ్యేటట్లు రాస్తే మేం కూడా విని సంతోషిస్తాం కదా” అని ప్రశ్నించాడు. దాంతో ఒకరిద్దరు యస్.యస్. అని ఆయనకు వంత పాడారు.
అప్పుడు సిద్దార్థ కొంచెం సీరియస్‌గా “అసలు ఈ సమాజం దీని ధోరణి మీకేమైనా అర్థం అయ్యేటట్టు ఉన్నదా? అంతా తలక్రిందులే కదా. ఈ తలక్రిందుల సమాజాన్ని నేను తలక్రిందుల కవిత ద్వారానే చెబుతాను. కొన్ని మార్మికమైన సాంకేతిక సంజ్ఞల ద్వారానే చెబుతాను. అయినా పాలు తెల్లగా ఉండును, కాకి నల్లగా ఉండును అన్నట్లు నేనే అరటి పండు విప్పి చేతిలో పెట్టినట్లు రాస్తే అది కవిత్వం ఎట్లా అవుతది” అని ప్రశ్నించాడు.
“నా కవితలకు నేను అర్ధమూ, తాత్పర్యాలు చెప్పను. దానిని విప్పి అర్థం చేసుకునే ‘ఓపెన్ సిసేమ్’ మంత్రాన్ని మీరే కనుక్కోవాలి మీరే అర్థం చేసుకోవాలి” అని చెప్పాడు.
వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడు వచ్చాడో తెలవదు కాని గోవిందు తమ వెనకే ఉన్నడు.
వేణు తను రాసిన ‘రిక్షా వాలా’ కవిత వినిపించాడు. అది పక్కా పాతనగరం యాసలో ఉంది. ఆ కవితలో హాస్యము, విషాదమూ రెండు కలిసి చార్లీ చాప్లిన్ సీన్మాలో ఒక కంట కన్నీరు మరో కంట పన్నీరులా ఉంది. ఆ రిక్షా ఒక పాత డొక్కు రిక్షా. అది లుకలుకలాడుతూ కటకటక శబ్దం చేస్తుంది. నూనె వెయ్యని చైను ‘పటపటా’ అంటుంది. రిక్షావాడు దమ్ము తీసుకుంట చెమటలు కక్కుకుంట చడావ్లో రిక్షా తొక్కుతున్నాడు అందులో తిష్టవేసి కూచున్న ఒక బొర్ర ఆసామి.
“ఎందిర భై ఈ రిక్ష. ఏమన్న దీన్ని జుమ్మేరాత్ బజార్ల సెకండ్ హాండుకు కొన్నవా ఏంది?” అని క్రూరంగా మజాక్ చేస్తడు. అప్పుడు ఆ ముసలి రిక్షావాడు. పల్లెలో పనిలేక బ్రతకలేక ఈ పట్నం వచ్చినానని ఆఖరికి ఈ రిక్షానే గతి అయ్యిందని, ఈ రిక్షానే కాదు తన కీళ్లు కాళ్ళు అన్నీ కూడా ఈ పాత చైను లాగనే పటపట అంటున్నవని తన కష్టాల కన్నీటి గాథ చెబుతాడు. అదీ ఆ కవిత సారాంశం.
దానిని అందరూ శబ్బాష్ అన్నరు. అప్పుడు వెనక ఉన్న గోవిందుడు. “ఈ కవిత చదువురాని మా ముసలి అమ్మకు భీ సమజవుతదని” అనంగనే అందరూ గొల్లున నవ్వారు.
సుమనశ్రీ అనే సీనియర్ కవి ‘దెంచనాల, సిద్దార్థ కవితలు ఆధునికానంతర కవిత్వమని (Post Modern Poetry) రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరపులో ఈ కవిత్వ ధోరణి వచ్చిందని ఇప్పుడు చాలా ఆలస్యంగా మన తెలుగు కవిత్వంలో ప్రవేశించింద’ని వివరించాడు.
మీ రిక్షావాలా కవితకు ఇన్స్పిరేషన్ ఏమిటని కృష్ణారావు అడగగా, “బిమల్ రాయ్ తీసిన ‘ధో భీగా జమీన్’ సీన్మా అనీ, అందులో భూమి కోల్పోయిన పేదరైతు పట్నానికి వచ్చి కలకత్తా నగరంలో మనిషిని మనిషిలాగే ‘ఎక్కా’ను నడుపుతాడని, అదే తన కవితకు ప్రేరణ అని వేణు చెప్పాడు.
సమావేశం ముగిసింది. ప్రతి సారి రమ్మని పెద్దాయన స్వామికి చెప్పాడు. సరే అని తలూపాడు స్వామి.
“స్వామి మనిద్దరి ప్రస్థానం ప్రారంభమయ్యింది సాహిత్యం ద్వారానే. మధ్యలో రాజకీయాలు వచ్చాయి మళ్ళీ పోయినై. ఇప్పటికీ నీ ప్రవృత్తి సాహిత్యమే. నీ వృత్తిలో నీవెదురుకుంటున్న చికాకుల్ని తాత్కాలికంగ మరిచి పోవాలంటే ఈ సమావేశాలు ఒక ఓదార్పుగా రిలీఫ్‌గా ఉంటాయి. దీనికి రెగ్యులర్‌గా వస్తుండు” అని చెప్పి వేణు గోవింద్‌తో కలిసి నిష్క్రమించాడు.
ఎప్పుడూ ‘క్షరం’ కానిది అక్షరమే కదా అనుకుంటూ స్వామి ఇంటి దారి పట్టాడు.
***
ఒక రోజు ఉదయం ఆఫీసులో కూచుని ఇన్స్పెక్షన్ రిపోర్టు రాసుకుంటుంటే ఒక యువకుడు గదిలోకి వచ్చి “నమస్తే సర్” అన్నడు.
తలెత్తి చూస్తే “నల్లని వాడు తెల్లని నయనమ్ముల వాడు, చిరుదరహాస మందస్మిత మోము గలవాడు”.. డీలరు కాబోలు అనుకుని ఎదుటి కుర్చీ చూపిస్తూ “కూచోండి” అన్నడు.
అతను కూచోకుండా నిలబడే “సర్ నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఈ రోజే ఈ ఆఫీసులో నా జాయినింగు రిపోర్టు హెడ్ క్లర్కుకు ఇచ్చాను సర్. నా పోస్టింగ్ కూడా మీ దగ్గరే క్లర్కుగా” అన్నాడు చాలా వినయంగా.
స్వామికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. తర్వాత జ్ఞాపకం వచ్చింది. బాస్‌ను ఒక క్లర్కు కావాలని రిక్వెస్టు చేసిన సంగతి. అతను ఇంకా నిలబడే ఉన్నాడు ప్రోటోకాల్గ. కూర్చో అన్నాడు మళ్లీ కుర్చీ చూపిస్తూ. ఆ యువకుడికి లోలోపల సంతోషం కల్గింది. మామూలుగా అధికారులెవరు క్రింది స్థాయి క్లర్కులకు కూచోమని చెప్పరు అలుసైపోతామన్న భయంతో, అనుమానంతో. రాస్తున్న పెన్నును పక్కన పెట్టి కూర్చున్న అతడిని “నీ పేరు?” అని అడిగాడు.
“విలియం కేరీ సర్.”
స్వామి పెదాల మీద సన్నని చిర్నవ్వు మొలిచింది. సార్ ఎందుకు నవ్వాడో తెలియక ఆ ‘కేరీ’ తికమకపడ్డాడు.
బజర్ నొక్కగానే వచ్చిన అటెండరుకు రెండు చాయ్‌లు తెమ్మని పురమాయించాడు శుభారంభంగా ఉండాలన్న పాజిటివ్ మూడ్‌తో.
క్లర్కులకు చాయ్‌లు ఆఫర్ చేసే అధికారులను చాలా తక్కువ మందిని చూసాడు ‘కేరీ’ తన ఆరు సంవత్సరాల సర్వీసులో.
తన కళ్లద్దాలను తీసి రాస్తున్న కాగితం మీద పెట్టి “ఆఁ ఏం పేరన్నావూ?” అని మరచినట్లు మళ్లీ అడిగాడు స్వామి.
“విలియం కేరీ సర్.”
విలియం కేరీ నల్లని ముఖం చూడటానికి అంత సుముఖంగా లేకపోయినా ఆ నలుపులో ఒక విధమైన మెరుపు ఉంది. ఆ మెరుపు తరచుగా అతని కండ్లద్వారా పండ్ల ద్వారా వ్యక్తమవుతుంది. బహుశా అతని లోని మంచితనం అట్లా బయటపడుతుందేమో. తెలుపులోని అందాన్ని త్వరగా అందరూ గుర్తించగలరు కాని నలుపులోని అందాన్ని కొందరే గుర్తించగలరు.
యశోద తనయుడైన కృష్ణుడైనా, గరళఖంఠుడూ గంగాధరుడైన శివుడైనా నల్లని ముఖారవిందాలలో తెల్లని నయనాలు కల్గిన వాళ్లే కదా. ఇంగ్లీషు వాడు బ్లాక్ బ్యూటీ అన్నాడే తప్ప వైట్బ్యూటీ అని ఏనాడు అనలేదు కదా! కావున చరాచర జగత్తులో కొన్ని నల్లబంగారాలు కూడా ఉండటం కద్దు.
సారు పరాకుతనం, ఆబ్సెంట్ మైండ్ చూసిన విలియం కేరీ ముందు కొంత కంగారు పడ్డాడు. చాయ్‌లు వచ్చి చల్లారి పోతున్నయి కూడా.
“సర్” అన్నడు.
ఉలికిపడి ఈ లోకంలోకి ఊడిపడ్డాడు అతని కొత్త బాసు.
స్వామి తన స్వహస్తాలతో చాయ్ కప్పు అందిస్తే ఉబ్బితబ్బిబ్బు అయ్యాడా అల్పజీవి.
An administrator should conquer the hearts & minds of his subordinates అన్న పబ్లిక్ అడ్మిన్ట్రేషన్ సూక్తి చాలా బాగా తెలుసు స్వామికి.
“చూడు కేరీ పనికి తొందరేమీ లేదు. ఈ రెండు రోజుల్లో ముందు నీ టేబుల్ నీటుగా సర్దుకో. వనజ ముజీబుల అల్మారాలు ఓపెన్ చేసి ఫైల్స్ అన్నింటినీ పద్దతి ప్రకారం సర్దుకో. పెండిరగ్ ఫైల్స్లలో అర్జెన్సీ ఉన్న వాటిని ముందు అటెండ్ కావాలి. హెడ్ ఆఫీసుకు పంపే గణాంకాల స్టాటిక్టిక్స్ రిపోర్టులను ప్రత్యేకంగా అర్జెన్సీ ట్రేలో పెట్టుకో.
రెండు రోజుల తర్వాతే పని ప్రారంభిద్దాం. నా దగ్గర టెన్షన్ ఏమీ ఉండదు. నిదానంగా పనిచేసుకుందాం. ‘జల్దీకా కామ్ షైతాన్ కా కామ్’. మరో ముఖ్యమైన మాట ఉదయం పదిన్నరకల్లా ఆఫీసులో ఉండాలి. ఇక సాయంత్రం సంగతి ఎప్పుడు కొంపలకు చేరుతామో ఆ పైనున్న ‘జీసస్’కే తెలుసు అని చిన్న లెక్చర్ ముగించాడు.
‘జీసస్’ పేరు వినగానే విలియం కేరీ ముఖం చాటంత అయ్యింది. స్వామి మాట మంత్రంలా మారి అతని మీద పని చేసింది. నాగస్వరానికి పడగ ఊపే నాగు పాములా మారిపోయాడు.
***
స్వామి అప్పుల ఊబిలో కూరుకపోయి చివరికి ‘అప్పుల అప్పారావు’గా మిగిలాడు.
ప్రతి నెలా చిట్ కంపల్సరీగా ఐదవ తారీఖు లోపల కట్టాలి. లేకపోతే ఆరు ఉదయం వాడు పంపిన మనిషి ప్రొద్దున్నే ఇంటిముందు నక్షత్రకుడిలా వసూలు కోసం నిలబడతాడు. ప్రతి నెలా అతను అక్కకు ఇవ్వవలసిన ఐదువేలు రెగ్యులర్‌గా ఇర్రెగ్యులర్ అవుతున్నయి. కాశీయాత్ర కోసం తెచ్చిన అప్పు అసలు సంగతేమో కాని వడ్డీ కట్టటమే కనాకష్టంగా ఉంది. తమ్ముళ్లకు ఇప్పటి వరకూ ఒక పైసా కూడా ఇవ్వలేదు. వాళ్లు కూడా చిన్న చిన్న అల్ప ప్రాణులే. వాళ్ల అవసరాలు వాళ్లకుంటాయి. అయినా “అన్నయ్యా..” అని నోరు తెరిచి అడగలేక పోతున్నారు. అమ్మ అంత్యక్రియలు, దిన వారాల ఖర్చులు, బ్రాహ్మల సంభావనలు, విజయవాడ కృష్ణానదిలో ఆమె అస్థికల నిమజ్జనం, అందరూ పోను, రాను ఖర్చులు తన వంతుకు తన ప్రాణానికి పెద్ద మొత్తమే అయ్యింది.
ఇద్దరు పిల్లల స్కూలు ఫీజులు, నెలనెలా రెండు స్కూలు ఆటోల ఖర్చులు, సమతకు సాయంత్రం ట్యూషన్ ఫీజులు, నెలకోసారి సీన్మాలు, సంతోషాలు, కాస్తా మంచి బట్టల సరదాలు, డాక్టర్ల ఖర్చులు అన్నీ స్వామిని భయపెడుతూనే ఉంటాయి.
కొడుకు రాజాను హైదరాబాద్‌లో వున్న గొప్ప స్కూలులో చదివించాలన్న గొప్ప గొప్ప కలలతో పేరు ప్రతిష్ఠలున్న ‘హైద్రాబాద్ పబ్లిక్ స్కూలు’లో ఒకటవ తరగతిలో చేర్చారు. నైజాం కాలంలో దానిని ‘జాగిర్దార్ స్కూలు’ అనేవారు. జాగిర్దారులు, ఉన్నత వంశాల నవాబుల పిల్లలు అక్కడ చదివేవారు. ఇప్పుడు అవే ప్రమాణాలు, హంగులతో అది నడుస్తున్నది. ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ఆరోగ్యకరం, పుష్టికరమైన ‘లంచ్’, డైనింగ్ హాల్లో తెల్లటి కాటన్ నాప్కిన్లు, ఫోర్కు అండ్ స్పూన్కల్చర్. ఆటపాటలు, ఇతర హాబీలు అన్ని కంపల్సరీ. ఆ స్కూలు భవనాలు ఇండో ఇస్లామిక్ యూరోపియన్ వాస్తుశైలిలో ఉన్నతంగా ఆడంబరంగా ఉండటంతో పాటు ఆటల కోసం విశాలమైన మైదానాలు, శాంతినికేతనాన్ని తలపించేలా వృక్షాలు, వనాలు కూడా ఉన్నాయి.
అన్నీ బాగానే ఉన్నాయి కాని స్వామి జేబులు మాత్రం ఎప్పుడూ ‘టన్టన్ గోపాలానే! ఖానే కో గతీ నహీఁ లేకిన్ లంజకు బులావ్’ అన్నట్లయ్యింది స్వామి పరిస్థితి. తప్పని అవసరమే అని భావించి ఫైనాన్స్ కంపెనీలో ఒక కొత్త హీరోహోండా మోటారు సైకిల్ కొన్నాడు. అది సరిపోదన్నట్లు దానికి తోడుగా ఒక పంచరంగుల టి.వి. వాటి నెలనెలా ‘కిస్తులు’ కలిపితే ఇంటి ఆర్థిక పరిస్థితి ‘ఊపర్ శేర్వానీ అందర్ పరేషానీ’లా తయారయ్యింది.
ఒకప్పుడు రెండుగదుల స్వంత పెంకుటిల్లు, ఒక పాప, సైకిలు తొక్కుకుంటనో, ఆర్టీసీ బస్సులు ఎక్కుకుంటనో, కాలేజీలో పాఠాలు చెప్పుకుంట ప్రశాంతంగ బ్రతికిన స్వామికి ‘స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే చింతలు లేని చిన్న బ్రతుకే ‘జీవనమే మధురము అన్నట్లు’ ఉండేది. ఇప్పుడు జమానా బదల్ గయా, రోజులు మారాయి. ఎంతైనా ప్రపంచ కుగ్రామంలో (globalization) తనూ ఒక విశ్వపౌరుడే కదా!
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి అయిన అక్క దగ్గర ఇంకా చిన్న చిన్న చేబదుళ్లు తీసుకుంటున్న స్వామిని చూసి బావ.
“ఏం రా.. కొత్త ఉద్యోగంలో చేరి రెండు యాడాదులు దాటి పాయె. నువ్వేమో ఇంకా ఎక్కడపడేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉన్నవ్. అదే పాత వాలకం. మీ డిపార్ట్మెటుల అందరూ సాయంత్రం కాంగనే రెండు జేబులూ నింపుకుని గరం గరం జోరుమీద ‘తాష్కెంట్’ (బార్‌కు కోడ్ వర్డ్)ల కూసుంటరట కదా” అని మజాక్ చేసిండు.
‘సబ్ ఖుచ్ సీఖా హమ్నే నా సీకీ హోషియారీ’లా స్వామి ముఖం పెట్టాడు.
***
రాజా చాలా చిన్నగా ఉన్నప్పుడు సాయంకాలాలు త్వరగా ఇంటికి రాని డాడీ కోసం ఎదిరిచూసే వాడు. సమత మాత్రం అట్లా కాదు. హైస్కూలు చదువులకు వచ్చింది. దాని చదువులు, దాని దోస్తులు వీలుంటే టి.వి.లో సీన్మాలు చూడటం, అట్లా దానిలోకంలో అది ఉండేది.
రాజా అట్లా కాదు. వాడికి డాడీ అంటే మహాప్రేమ. వాడి చిన్న ప్రపంచం అంతా డాడీతో నిండి ఉంది.
“మమ్మీ! డాడీ ఎప్పుడొస్తడే. వానపడుతుంది. వానలో తడుచుకుంట ఎట్ల వస్తడే” అని బెంగతో ఎదిరి చూసేవాడు.
కొంచెం రాత్రి కాగానే “మమ్మీ చీకటి పడింది. చీకట్ల డాడీ ఎట్లొస్తడో ఏమో” అని భయపడేవాడు.
ఒకసారి వాడిని ఐస్‌క్రీం పార్లర్‌కు తీసుకుపోయి టుట్టీ ప్రూటీ ఐస్‌క్రీం తినిపిస్తే “యుఆర్ బెస్ట్ డాడీ ఇన్ ది వరల్డ్” అని కితాబు ఇచ్చాడు. పసి మనసులన్నీ పసిడి మనసులే కదా!
ఒక సాయంత్రం ఆఫీసులో ఉన్నపుడు వాడే ఇంటి నుండి ఫోన్ చేసి “డాడీ మన కాలనీలో అందరి డాడీలు ఇంటికి వచ్చేసారు. ఒక నువ్వు తప్ప” అని నిష్ఠూరంగా అన్నడు. ఆ మాటలు విన్న స్వామికి గుండెలు పిండినట్లయ్యింది.
‘ఛీ ఏం బ్రతుకు. ఏం ఉద్యోగం’ అని జీవితం మీదనే విరక్తి వచ్చింది. తన మీద తనకే అసహ్యం వేసింది. ప్రాచీన కాలంలో గ్రీసు, రోము నగర వీధులలో తమను తాము అమ్ముకున్న బానిసల జీవితాలు జ్ఞాపకం వచ్చాయి.
చీకటిని నెత్తిన మోసుకుంటూ ఇంటికి చేరేసరికి ఆ పసివాడు అందాకా ఎదిరి చూసి, ఎదిరి చూసి అప్పుడే నిద్రపోయినాడని ఆంజల్య చెప్పింది. స్వామి అలసిసొలసి ఇంటికి వచ్చేసరికి ప్రాణం ఉసూరుమన్నది. ఆ రాత్రి నిద్ర పట్టని రాత్రి. నిద్రలేని రాత్రి.
***
కనుకొలుకుల కొసలనుండి డాడీని గమనిస్తున్నాడు రాజా. ‘ఈ పెద్దవాళ్ల ముఖాలు ఇట్లా ఎందుకుంటాయో, నవ్వటం మరిచిపోయిన వాళ్లలాగా. ఎప్పుడూ ఏడుపుగొట్టు ముఖాలు’ అనుకుంటున్నాడు.
డైనింగ్ టేబుల్ మీద రాత్రి భోజనాలు. ఎదురుగా టీవీల చిన్న పిల్లల కార్టూన్. దానిని చూస్తూ తినటం మరిచిపోయి పకపక నవ్వులు కేరింతలతో అప్పుడే పూసిన రోజా పువ్వులా రాజా.
ఏదో ఆలోచిస్తూ అన్నంలో వేళ్ళు కెలుకుతూ, తలదించుకుని డాడీ. “డాడీ అటు చూడు. ఎంత మంచి జోకు. ఈ ఎపిసోడ్ ఎంత బాగుందో” సంతోషంతో అన్నాడు రాజా.
తలపైకెత్తి టీవీని నిర్వికారంగా, నిర్లిప్తంగా చూస్తూ కొడుకు కోసం బలవంతంగా నవ్వును పెదాలపై రప్పించుకుని ముఖానికి తగిలించుకున్నాడు.
కళ్లల్లో నవ్వులపువ్వుల ‘పూల్చెడీలు’ వికసించకపోతే అదేం నవ్వు. కాగితం పువ్వులాంటి నవ్వు. గడ్డిపూవ్వు లాంటి నవ్వు. వాసన లేని పువ్వు.
“నవ్వు డాడీ నవ్వు” అన్నాడు రాజా. నవ్వుల ప్రవాహంలో పువ్వుల పడవలా తేలుతూ ఆనందానందంగా.
అయినా నవ్వని డాడీ నవ్వురాని డాడీ నవ్వలేని డాడీ ఆయన కళ్లల్లోని నవ్వుల మెరుపుల్ని ఎవరు ఎత్తుకెళ్లారో. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలతో పరధ్యాన్నంగా, విచారంగా, విషాదంగా ఏదో కోల్పోయిన వాడిలాగా, కోల్పోయిన దానిని వెతుక్కుంటున్న వాడిలాగా.
నవ్వని డాడీని చూసి చిన్నబోయినాడు ఆ చిన్ని రాజా.
***
మంత్రనగరిలో మాయల ఫకీరు సృష్టించిన మాయాబజారు ఐమాక్స్థియేటర్.
రాజా బలంతం మీద బయలుదేరక తప్పలేదు డాడీకి. అందులోకి అడుగుపెట్టినప్పట్నీంచీ భూమికి బెత్తడు దూరంలో గాలిలోనే నడుస్తున్నాడు రాజా. ఎస్కలేటర్ మీదికి ఎక్కగానే పర్షియన్ మాయ తివాచీ మీదికి ఎక్కి ఆకాశంలోకి ఎగురుతున్నట్లే అనిపించసాగింది. అల్లాఉద్దీన్ అద్భుతదీపం సహాయంతో ఒక అద్భుతద్వీపంలోకి ఊడిపడినట్లనిపించింది. స్వప్న లోకంలో తన కోసమే వెలిసిన సంతోషచంద్రశాల ఈ ఐమాక్స్ థియేటర్ అనుకున్నాడు రాజా. చెవులు హోరెత్తే రకరకాల సంగీత సమ్మేళనాలు, కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతిపుంజాల రంగుల వలయాలు. దేవలోకంలో నుండి దిగివచ్చిన కిన్నెరకింపురుషులు, అసూర్యం పశ్యలు. వాళ్లంతా రెండు చేతులతో పచ్చనోట్లను పిచ్చికాగితాలుగా ఎగజల్లుతుంటే అవి గాలిలోకి ఎగిరి మెక్‌డోనాల్డ్ గూటిలోకి దూరి బర్గర్, పీజా, ఐస్క్రీంకోన్, కోకాకోలాలుగా మారిపోతున్నాయి.
అందులోకి కాలుపెట్టగానే అక్కడ అంతటా ధనం మదం కలిసి బలిసి బాగా పులిసిన వాసన డాడీ ముక్కు పుటాలకు సోకింది. అక్కడి రణగొణ ధ్వనుల శబ్ద కాలుష్యానికి ఆయన తల గిర్రున తిరిగి రక్తపు పోటు హెచ్చింది. కండ్లు బైర్లు కమ్మాయి. ఆశ్చర్యపోయినాడు. అతనికెందుకో హఠాత్తుగా పత్తిరైతుల ఆత్మహత్యలు గుర్తుకొచ్చినై. ఉరితాళ్లకు వేళ్లాడే సిరిసిల్ల చేనేత కార్మికులు గుర్తుకొచ్చారు. పురుగుల మందులు తాగి ప్రాణాలు వదిలిన పేదరైతులు, బుక్కెడు బువ్వ కోసం జానెడు బట్టకోసం వలసబోయే పాలమూరు కూలీలు, కాంట్రాక్టు కార్మికులు, మూలబడుతున్న చేతివృత్తులు, మాయమవుతున్న సంస్కృతులు, అభివృద్ధి వెలుగునీడల మధ్యన గల్లంతు బతుకులవుతున్న మూలవాసులు, కల్లోల కలల మేఘాలు కమ్ముకుంటున్న తెలంగాణా పల్లెలు, గోరటి వెంకన్న పాటలు అతడిని చుట్టుముట్టినై. అతని ‘మనాది’ మనస్సు, అడుగుపొరల నుండి మళ్లీ మీదికొచ్చింది. మననం, హననం, ఆత్మహననం మళ్లీ మొదలైంది. హఠాత్తుగా అతనికి తననెవరో ఈ మాయాబజారులో అవమాన పరుస్తున్నట్లు లోలోపలే కుతకుతా ఉడికిపోతున్నాడు. లీలగా అతని కళ్లల్లో కన్నీటి పొరలు.
“డాడీ అటు చూడు డాడీ” అన్నాడు రాజా ఆనంద ఉద్వేగాలతో. కన్నీటి చూపును అటు మళ్లించాడు డాడీ. రాజా అంత ఒక పిల్లవాడు ఓ తాడును తన నడుముకు కట్టుకుని ఇంకో తాడును రెండు చేతులతో పట్టుకుని కాళ్లను గోడకు అదిమిపట్టి ఆ గోడపైకి ఉడుములా ఎగబాకుతున్నాడు. అది రోప్ట్రెక్కింగ్. ఆకాశానికి నిచ్చెనలు వేసే హైటెక్ జీవనవిధానం. వస్తులౌల్య వినిమయ సంస్కృతిలో, విశ్వ విపణి వీధులలో అందని ద్రాక్షలకోసం నేల విడిచి సాము చేసే జీవన విధానానికి ఒక సంకేతమే ఆ రోప్ ట్రెక్కింగ్. కన్నీటి పొరల మధ్యన ఆ చిన్న పిల్లవాడి స్థానంలో తన రాజా కనబడ్డాడు. రేపటిరోజు తన కన్నకొడుకును కూడా తనకు దూరం చేసే విషమయ, వినిమయ ప్రపంచాన్ని ఊహించుకొని వణికిపోయినాడు డాడీ.
అందరూ చప్పట్లు చరుస్తున్నారు. అందరూ నవ్వుతున్నారు. శిఖరాగ్రానికి చేరుకోక ముందే నేలకూలిన ఆ బాలుడిని చూసి. ఆ వైఫల్యాన్ని చూసి, ఆ సురక్షిత పతనాన్ని చూసి.
అందరితోపాటు నవ్వుతున్న రాజా హఠాత్తుగా డాడీ ముఖంలోకి చూశాడు. చందమామ పత్రికల శాపవశాత్తు శిలగా మారిన మనిషి కథ జ్ఞాపకానికి వచ్చింది రాజాకు. అక్కడ అందరూ సంతోషంగా నవ్వుతున్నారు ఒక్క డాడీ తప్ప అని అనుకోగానే నవ్వులపువ్వులన్నీ నేలరాలి వాడి ముఖం వాడిపోయింది.
‘నవ్వు డాడీ నవ్వు. నువ్వు కూడా అందరిలాగానే ఎందుకు నవ్వవు? అందరి లాగానే ఎందుకు సంతోషంగా ఉండవు?’ అని డాడీ నవ్వుకోసం వాడు మనసు లోపలే దుఃఖించాడు.
తండ్రి కొడ్డుకులిద్దరూ నీరసంగా ఇంటిదారి పట్టారు.
రెండు భిన్న ప్రపంచాలకు ప్రతినిధులు వాళ్లు.
***
“డాడీ డాడీ ఈ సంగతి నీకు తెలుసా?” ఒర్లుకుంట, దమ్ములేపుకుంట పాతకాలపు భుగభుగ పొగల రైలు ఇంజనులా ఇంట్లోకి ఉరికొచ్చాడు రాజా.
“ఏందిరా?” నీరసంగా అడిగాడు.
“మన కాలనీల రిలయన్స్ ఫ్రెష్ ఓపెన్ అయ్యింది. రేపటి నుండి మనం కూరగాయలు, పండ్లు, చికెన్ కూడా అక్కడే కొనుక్కోవచ్చు. నువ్వేం వద్దు. అమ్మా నేను ఇద్దరం కలిసి రేపటి నుండి షాపింగ్ చేస్తాం”. ఉత్సాహంగా గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నాడు రాజా.
డాడీ షరా మామూలే. తీగలు తెగిన సారంగి పలుకదు కదా!
ఎటువంటి ప్రతిస్పందనలు లేకుండా సగం మనిషి సగం శిలగా ఉన్న డాడీని చూసి ఆనందం ఆవిరై విసుగొచ్చింది రాజాకు.
ఆ రోజు పొద్దునే దిన పత్రికలో బీహార్‌లో రిలయన్స్ ఫ్రెష్ పై పేదరైతులు, చిల్లర కూరగాయల వ్యాపారులు దాడి చేసి అద్దాలు పగులగొట్టి మా పొట్టలు కొట్టవద్దని నినాదాలు చేశారన్న వార్త డాడీ చదివాడని ఆ చిన్నవాడికేం తెలుసు.
రాజా తండ్రి మీద అలిగాడు.
తండ్రీకొడుకుల ప్రేమబంధాన్ని దెబ్బకొడుతున్న మార్కెట్ ఎకానమి, “అమ్మా నువ్వన్నా చెప్పవే. రిలయన్స్ ఫ్రెష్ అంటే ఏందో తెల్సా? మొత్తం షాప్ అంతా పుల్ ఎ.సి. అండ్లకు పోంగనే అంతా కూల్. ఎంత నీట్‌గ ఉంటదో తెల్సా? మంచి మ్యూజిక్ గూడ పెడ్తరు.”
“అరే ఉరుకులయ్యోడా! కూరగాయలు కొనేందుకు ఏ.సి. ఎందుకురా? వాడు ఉత్త పుణ్యానికే ఏసీ ఏస్తడా. ఆ కరెంట్ ఖర్చుకూడ మన నెత్తిమీద రుద్దడా. రైతు బజార్‌కు పోతే అగ్గువసగ్గువకు గంపలనిండా తీరున్నొక్క తాజా తాజా కూరగాయలు దొరుకవా?” అమ్మ క్లాస్ పీకింది.
రాజాకు ఉక్రోషం ముంచుకొచ్చింది.
“థూ, ఆ మార్కెట్ ఎంత గలీజ్గ ఉంటది? మీద నుండి ఎండ, చెమట, చికాకు. చారానా ఆఠానా బేరంకోసం ఆ పల్లెటూరు రైతులతో కైకై అని వొర్లుకుంట కొట్లాడాలె. నేనైతే అక్కడికి చచ్చినా రాను. మీరే పోయి మీరే కొనుక్కోండి”. ధూంధాం చేసుకుంట దుంకులాడినాడు రాజా.
ఈ పెద్ద పెద్ద సూపర్ బజార్లకు వొచ్చి కొనేటోళ్లంతా “కడుపుకు తినేది తక్కువా, వొంటికి రాసుకునేది, పూసుకొనేది ఎక్కువా కొంటుంటారు”. అని అమ్మ గుణుగుతనే ఉంది.
మౌనమునిలా డాడీ. ఘనీభవించిన సముద్రంలో గడ్డకట్టిన మంచుశిలలా డాడీ.
***
“ఇక ఈ దసుర పండుగ బట్టల షాపింగ్ అంతా ఆబిడ్స్ బిగ్ బజార్లనే.” అని అమెరికా వాడిలా ట్రేడ్‌వార్ డిక్లేర్ చేసిండు రాజా.
మాటల మిస్సైల్స్ తన మీద విరుచుకపడుతుంటే చదువుతున్న ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తకంల ముఖం దాచుకున్నాడు డాడీ.
వినబడుతున్నదా? గురి డాడీ మీదనే అయినా లడాయి అమ్మ మీదికి శరువైయ్యింది.
“నేనైతే అక్కడికి రాను. కావాలంటే పైసలిస్త. మీరిద్దరే వెళ్లి తెచ్చుకోండ్రి” మధ్యేమార్గాన్ని అనుసరించబోయాడు డాడీ.
“ఏం అక్కడికి నువ్వెందుకు రావు? వాడికీ నీకూ ఏమైనా దుశ్మనీనా? ఎప్పుడైనా మీరిద్దరు కొట్లాడుకున్నరా? ఒకరి ముఖం ఒకరు చూసుకోవద్దని ఏమైనా ఒట్టు పెట్టుకున్నరా?” వేలెడంత లేని రాజా వెటకారంగా కావాలనే రెచ్చగొట్టాడు తండ్రిని.
వాడి వెటకార చాతుర్యానికి డాడీకి నవ్వొచ్చి హ.హ.హ. అని పెద్దగా పగలబడి నవ్వాడు. నవ్వుతున్న డాడీని చూసిన రాజాకు దసరా దీపావళీ పండుగలు రెండూ కలిసి అడ్వాన్సుగా ముందే వచ్చేసినట్లు అనిపించింది. నవ్వుతున్న డాడీ ముఖం ఎంత అందంగా ఉందో అని లోలోపల మురిసిపోయాడు.
నవ్వటమే మరిచిపోయిన ఆ తండ్రి నవ్వీనవ్వీ కండ్లల్లో నీళ్ళు తిరిగి ఆ నవ్వే మళ్లీ దుఃఖంగా మారింది. అయితే అది లోపలి దుఃఖం. నిరంతరం కాల్చేసే దుఃఖం. అంతర్లీనంగా ప్రవహించే నదిలాంటి దుఃఖం. ఎన్ని ఏండ్ల నుండో వెంటాడుతున్న దుఃఖం. నిత్యజ్వరపీడిత దుఃఖం. జ్వరపడ్డ మనస్సు, గాయపడిన హృదయం లోలోపలే కుతకుతా ఉడుకుతున్న లావా. ఎంతకూ పేలని ఒక అగ్నిపర్వతం. నిరంతర మననం, హననం, ఆత్మహననం, యాది, మానాది. ఎప్పుడు మొదలయ్యిందో ఈ దుఃఖం. చదువుకునే రోజులలో ఎమర్జెన్సీ కన్నాముందే. రైల్వే సమ్మె కన్నా ముందే. జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవం కన్నా ముందే. విద్రోహానికి గురైన ప్రత్యేక తెలంగాణా పోరాటం నుండి కావొచ్చు. నేల తల్లి నగరాన్ని ప్రేమించి కీర్తించే హృదయం నుండి కావొచ్చు.
ఆబిడ్స్-ఆబిద్ షాప్. నెహ్రూ విగ్రహం ఎదురుగా ఇటాలియన్ ఇండోఇరానియన్ శిల్పకళసమ్మేళనా వైభవంతో ఎత్తైన తంతెలు, గుమ్మాలతో వెన్నెల వెలుగులతో వెల్లివిరిసిన తెల్లని తాజ్మహల్లా ప్యాలెస్ టాకీస్. బడి ఎగ్గొట్టి అండ్ల చూసిన దిలీప్‌కుమార్, దేవానంద్, రాజకపూర్ల నలుపు తెలుపుల సిన్మాలు. ఆనాటి దోస్తులు, ఆ కమ్మటి జ్ఞాపకాలు. గడిచిన రోజుల బాల్య యవ్వన జ్ఞాపకాలతో ముడిపడిన ప్యాలెస్ టాకీస్. దాన్నే నేలమట్టం చేసి దాని సమాధిపునాదుల మీద లాభాలు బేహారులు నిర్మించిన బిగ్‌బజార్. అయ్యోబిడ్డా నీకెట్ల చెప్పనురా తండ్రి! నా దుఃఖం నీకెట్ల వివరించనురా! హైద్రాబాద్ మీదికి దండెత్తుకొచ్చిన ‘లుఠేరాలు’ ఈ నగరసుందరి ముక్కు చెవుల్ని చెక్కేసి, దాని నామరూపాల్ని నాశనం చేసి కాసుల గలగలల కోసం, గల్లా పెట్టలు నిండటం కోసం ప్యాలెస్ టాకీస్‌ను కూల్చి, నా కలల మందిరాన్ని కూల్చి అక్కడ అదే స్థలంల బిగ్‌బజార్‌ను నిర్మించి నా అస్తిత్వాన్ని రూపుమాపి, నా అడుగుజాడల్ని నామోనిషాన్ లేకుండా చేసినారు. అటువంటి బిగ్బజార్ల నేనెట్ల కాలుబెట్టనురా బిడ్డా!
మందిర్ తోడో, మజ్జిద్ తోడో!
మగర్ ప్యార్ బరా దిల్ మత్ తోడో!!
ఒకప్పుడు భాగ్నగర్. ఆచోటు పాయె. ఆ చెరువులు, కుంటలు, బావులు అన్నీపాయె. చివరికి హుస్సేన్‌సాగర్‌ను కూడా కుదించి, కత్తిరించి, మురికి గుంటగ మార్చి ఐమాక్స్ థియేటర్‌ను కట్టిరి. అండ్ల నేనెట్ల కాలుబట్టను? అండ్ల అడుగుబెట్టంగనే నా ఆత్మ ఉక్కిరిబిక్కిరి గాదా?
ఇది నా దుఃఖం ఎంతకూ ఎడతెగని కాకిశోకం. అంతరంగంల వేదనలు సలసల మసులుతున్నప్పుడు పెదవుల మీదికి నవ్వెట్ల వస్తది?
దర్ద్ కో దర్ద్ హీ దవా హో గయా!
డాడీ మళ్ళీ తన మనోవల్మీకంలోకి. ఒంటరొంటరి ఏకాకి తనంలోకి. తన లోపలికి తనే నత్తగుల్లగా ముడుచుకుని. ఆది మధ్యాంతరహిత శూన్యాకాశంలో ఒక ఒంటరి నక్షత్రానికి తలక్రిందులుగా వ్రేలాడుతూ, నిర్వేదం, నిరాశ, విచారం, విషాదం, కలగాపులగంగా. తనని తానే ప్రతిరోజు కొంచెంకొంచెం కొరుక్కుంటూ, నములుకుంటూ ప్రతి క్షణం హరాకిరి. ఆత్మహననం. బాధ తనను కమ్ముకుందో లేక తనే బాధను కావలించుకున్నాడో తెలియని ఒకానొక మందకొడి ఉన్మాదావస్థ.
అయితే ఆమెకు అంతా తెలుసు. మూడు దశాబ్దాల, ముఫ్పై సంవత్సరాల కంటకావృత్తమైన కష్టాల కాలిబాటల మీద చేయి వీడని చెలిమి ఆమె. హమ్ సఫర్. హమ్ రాహీ. కల్లోల కలల మేఘాలు కమ్ముకున్నప్పుడు కటికచీకటి తుఫాను వాన రాత్రి అల్లకల్లోల కడలిలో జడివానలో చిక్కుకున్నప్పుడు దారిచూపే దీపస్తంభం కూడా ఆమెనే!
“ఒరే రాజా ఇటురా” కొడుకును లాలనగా పిలిచింది. వాడు బుద్ధిగా వచ్చి ఆమె దగ్గర కూచున్నాడు.
“చూడు బేటా చార్మినార్ అంటే నీకిష్టమేనా?”
“ఓ చాలా ఇష్టం”
“మరి ఎవరైనా ఆ చార్మినార్‌ను పూర్తిగా కూల్చేసి, నేలమట్టం చేసి ఆ స్థలంలో బిగ్‌బజార్ కడ్తే పండుగ బట్టలు కొనేందుకు నువ్వు అండ్లకు సంతోషంగ పోతవా?”
వానికి చర్రున కోపం వచ్చింది. ‘చార్మినార్‌ను ఎవడైనా ముట్టుకుంటే వాని చేతులు ఇరగ్గొడ్త’ కోపంగ అన్నాడు.
“ఇంకో సంగతి నాన్నా. మీ స్కూలు బిల్డింగ్ అంటే నీ కిష్టమేనా?”
‘ఓ’ కండ్లతో సంతోషాన్ని ప్రకటించాడు.
“మరి దాన్ని కూడా ఎవరైనా కూల్చేసి అక్కడ ఐమాక్స్ సిన్మాహాల్ కట్టితే..” ఆమె ప్రశ్న పూర్తికాలేదు.
“కట్టినోడి నెత్తి పగులగొట్టి వాడ్ని ఎర్రగడ్డ మెంటల్ దవాఖానాకు పంపిస్తా”.
“నా బంగారయ్యా” అని అమ్మ వాణ్ణి సంతోషంతో కావలించుకుంది.
గవ్వలు, గచ్చకాయలు, సీసపుగోళీలు అన్నీ ఒక్కసారే ఒకదానిని ఒకటి ఒరుసుకుంట, దొర్లుకుంట క్రిందపడి శబ్దం చేసినట్లు కళకళా గలగలా నవ్వాడువాడు. డాడీ పెదాలపై ఓ చిరుదరహాసం వికసించింది. కొడుకు మాటలతో స్వామికి భవిష్యత్తు మీద భరోసా ఉదయించింది. రేపటి తరం మీద ఆశ కలిగి కళ్లు కాంతులీనాయి. మనస్సుకు పట్టిన గ్రహణం వీడిరది.
నాన్న పెదాలపై చిగురిస్తున్న చిరునవ్వును గమనించిన రాజా ఒక్కగంతులో డాడీ ఒడిలోవాలి. “నవ్వు డాడీ నవ్వు. ఇంకా ఇంకా బాగా నవ్వు” అని డాడీ డొక్కలో గులగులలు పెట్టాడు.
ఒరే ఒరే ఒరే
హ హ హ.
ఇల్లు ఇల్లంతా నవ్వుల పువ్వుల నక్షత్రాలు గలగలా జలజలా రాలిపడుతున్నాయి. చల్లని పందిరిక్రింద నవ్వులపువ్వుల వాన జోరుగా కురుస్తుంది.
రాజా చందమామలా వెలిగిపోతున్నాడు.
(మళ్ళీ కలుద్దాం)
పరవస్తు లోకేశ్వర్ 10 జూన్ 1951 నాడు హైదరాబాద్ పాత నగరంలో జన్మించారు. కథా నవలా రచయిత, అనువాదకులు. ట్రావెల్ రైటర్. యాత్రా కథనాల రచనలో అందెవేసిన చెయ్యి. పరదేశీగా దేశదేశాల సరిహద్దులలో, దారి కాని దారులలో ఒంటరి బాటసారిగా తిరగాలనేది రచయిత అంతర్జ్వాల. ప్రపంచ యాత్రికుడు పండిత్ మహామహోపాధ్యాయ్ పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ ప్రభావం తనపై చాలా ఉందని రచయిత అంటారు.
సలాం హైదరాబాద్, సిల్కురూట్‌లో సాహస యాత్ర, ఒక హిజ్రాకథ (సుప్రసిద్ధ హిందీ, ఉర్దూ అనువాద కథలు), ఛత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర, ఆనాటి జ్ఞాపకాలు, తెలంగాణ సంభాషణ, ప్రపంచ పాదయాత్రికుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర, 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు, నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు, ఎవరిది ఈ హైద్రాబాద్?, హైద్రాబాద్ జనజీవితంలో ఉర్దూ సామెతలు, కల్లోల కలల కాలం వంటి పుస్తకాలు వెలువరించారు. ‘సలాం హైద్రాబాద్’ కు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం లభించింది.
హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది చివరిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది.