Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-8

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[ట్రెయినింగ్ పూర్తి చేసుకుని రెగ్యులర్ పోస్టింగ్‍లో కొత్త ఆఫీసులో చేరుతాడు స్వామి. ఈ పోస్టులో తీవ్రమైన పనిభారం ఉంటుంది. పై అధికారి అజమాయిషీ మరీ ఎక్కువగా ఉంటుంది. హాయిగా పాఠాలు చెప్పుకునే ఉద్యోగం వదిలి ఈ ఉద్యోగంలో చేరినందుకు బాధపడతాడు. తన సహాయకురాలిగా ఉన్న ఓ సీనియర్ క్లర్క్ వనజ వ్యవహారం స్వామికి నచ్చదు. ఆమె గుట్టు అంతా స్వామికి విప్పిచెప్తాడు సూపరిండెంటు రామిరెడ్డి. రెండుమూడు సార్లు హెచ్చరించినా ఆమె పద్ధతి మార్చుకోదు. పైగా పై అధికారితో సంబంధం ఉండడంతో, ఆమె ఆటలు సాగుతాయి. అయితే డీలర్ల దగ్గర లంచాలు మెక్కుతూ, చెక్స్ రియలైజేషన్‌లో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న పద్ధతిని గమనించిన స్వామి, ఆధారాలతో సహా ఆమె అవినీతిని పై అధికారి ముందు ఉంచేసరికి, తప్పనిసరై ఆమెను సస్పెండ్ చేస్తారు. అలాగే తన దగ్గర రిజిస్ట్రేషన్ క్లర్క్‌గా పనిచేస్తూ అవినీతిపరుడైన ముజీబ్ అనే గుమాస్తా ఆట కట్టిస్తాడు స్వామి. వ్యాపారుల దగ్గర తన పేరుమీదే ముజీబ్ లంచాలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. తెలివిగా సమాచారం రాబట్టి, అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఉప్పందేలా చేస్తాడు. వాళ్ళు రహస్యంగా పరిశోధన జరిపి, నిజాలు నిర్ధారించుకుని, ముజీబ్ ఇంటి మీద, బంధువుల ఇళ్ళ మీద ఏకకాలంలో రైడ్ చేసి అవినీతి సొమ్ము జప్తు చేస్తారు. అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. కానీ అతను తనదైన పద్ధతులు ఉపయోగించి, రిమాండ్ పూర్తి కాగానే బెయిల్ సంపాదించి, కొంతకాలనికి దేశం వదిలి పారిపోతాడు. కొన్నాళ్ళకి ఆ కేసుని కొట్టేయాల్సి వస్తుంది. తర్వాత పెద్దబాసుని కలిసి, మంచి క్కర్లుని ఇవ్వమని అడిగితే, ఆయన విలియం కేరీని పంపిస్తాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-13: రాం రహీం ఏక్తాయాత్ర

దేశంలో రామ రథయాత్ర పుణ్యమా అని బాబ్రీమసీదు కూలగొట్టబడిన తర్వాత దేశం మొత్తం కుతకుతలాడుతున్న అగ్నిపర్వతంలా మారి తర్వాత నెలరోజులకు పేలింది.  1992 డిసెంబర్‌ నుండి 1993 మధ్యదాకా భగభగ మండిరది. బొంబాయి మతకల్లోలాలతో చీకట్లో చిరుదీపమైనా వెలిగించి మతసామరస్యం సాధించాలన్న ఆలోచనలతో హైద్రాబాద్‌ నగరంలో కొంతమంది బుద్దిజీవులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు రామ రథయాత్ర జరిపిన విధ్వంసానికి వ్యతిరేకంగా ‘రాం రహీం ఏక్తా యాత్ర’ అన్న సంస్థను స్థాపించి దాని ప్రథమ రౌండ్‌టేబుల్‌ మీటింగ్‌ను ఆ రోజు సాయంత్రం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించబోతున్నారు.

ఆ సాయంత్రం ఐదు దాటినా పైళ్లలో తలదూర్చి ఏక దీక్షగా స్వామి పని చేసుకుంటుంటే వచ్చినవాడు ఫల్గుణుడన్నట్లు వేణు గోవిందును వెంటబెట్టుకుని స్వామి గదిలోకి ప్రవేశించాడు.

“ఊరకరారు మహాత్ములు,” అన్నాడు స్వామి అలసటతో కూడిన నవ్వు ముఖంతో.

“ఊరకనే ఉరికి వచ్చేతంద్కు మేమేమన్నా పనిలేని బేకార్‌ గాండ్లమా” అని గోవిందు మజాక్‌ చేసిండు.

“అబ్‌ దుకాన్‌ బంద్‌ కరోభై బాహర్‌ జానే కాహై,” అన్నడు వేణు.

‘క్యోం’ అన్నడు స్వామి. అప్పటికింకా హైద్రాబాదులో మాటల మధ్యల ఇంగ్లీష్‌ ఇంకా రాలేదు కాని స్థానికుల ముచ్చట్లల్ల ఉర్దూ భాష పాన్‌ సుపారీలా కలిసి పోయి ఉండేది. ఆ ఉర్దూ పదాలు, వాక్యాలు సంభాషణలకు సొగసులు అద్దేవి.

“ఈ రోజు అక్బార్‌ (దినపత్రిక) చూడలేదా?” అని గోవిందు అడిగిండు. గోవిందు ఎంత చదువుకున్నా సెంట్రల్‌ గవర్నమెంటు ఉద్యోగి ఐనా పురానా షహర్‌ ఉర్దూ అండ్‌ అసలైన పాతనగరం తెలంగాణా యాసలో మాట్లాడుతడు. ఆ భాష అతనికి సహజంగానే అబ్బింది.

“రాం రహీం ఏక్తా యాత్ర” ప్రథమ సమావేశం ఈ రోజు బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతుంది. అసల్‌ సిసల్‌ హైద్రాబాదీ ఆ మీటింగ్‌కు రాకపోతే ఏం బాగుంటది?” అని బలవంతం చేసాడు వేణు.

ఇక స్వామికి లేవక తప్పలేదు. ముగ్గురు బయటకొచ్చి గన్‌ఫౌండ్రీ బ్యాంకు పక్కనున్న బాంబే బేకరిలో మేతీ సమోసాలు తిని ఇరానీ చాయలు తాగి నడుచుకుంట ఎల్‌బి స్టేడియం చౌరస్తాలో ఉన్న ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడ ప్రొఫెసరు కేశవరావ్‌ జాదవ్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, జర్నలిస్టు పాశం యాదగిరి, మా భూమి సీన్మా నిర్మాత, పాత్రధారి బి. నర్సింగరావు, నటుడు భూపాల్‌, సంధ్యక్క, చిత్రకారుడు ఏలే లక్ష్మణ్‌, ఇంకా కొంతమంది కవులు, రచయితలు జమ అయినారు. గోవిందు తన కేమెరా తీసి ఫోటోలు తీసే పనిలో మునిగి పోయాడు.

అందరూ ముందు కేశవరావు జాదవ్‌ను మాట్లాడమన్నారు. అందరిలోకి సీనియర్‌. ఓ.యూ. ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంగ్లీష్‌ ప్రొఫెసరుగా రిటైర్‌ అయినారు. ఒకప్పుడు ఆయన సిటీ కాలేజీలో హరగోపాల్‌ సార్‌కు ఇంగ్లీషు పాఠాలు చెప్పారు. అతను పైదాయిషీ ఓల్డ్‌సిటీ హైద్రాబాదీ. పూర్వీకులు ఎప్పుడో అవధ్‌్‌ నుండి హైద్రాబాద్‌ వచ్చారట. తెలుగు ధారాళంగా మాట్లాడలేడు కాని తడుముకుంటూ తడుముకుంటూ ఉర్దూ ఇంగ్లీష్‌లను మేళవించి మాట్లాడతాడు. ఇప్పటికీ పాతనగరం హుస్సేనీ ఆలంలో పెద్దలు కట్టిన ఇంటిలో నివసిస్తూ మతకలహాలు జరిగిన ప్రతిసారీ హిందూ ముస్లింలను కలుపుకుని ఐక్యత మతసామరస్యం కోసం కృషి చేస్తుంటాడు.

ఆయన ఏ అంశం మాట్లాడినా పూర్వాపరాల్లోకి, పునాదుల్లోకి వెళ్లి నేపథ్యం అంతా వివరించి వర్తమాన పరిస్థితికి వచ్చి భవిష్యత్తులో ఏం చేయాలో దూరదృష్టితో వివరిస్తాడు. యౌవనంలో ఆయన సోషలిస్టు నాయకుడు  రాంమనోహర్‌ లోహియా శిష్యుడు.

ఆయన ఉపన్యాసాలు ఇవ్వడు. శ్రోతలతో సంభాషిస్తాడు.

“బుద్దుడి కాలం నుండి పదకొండో శతాబ్దం వరకు వాల్మీకి రామాయణం అంత ప్రచారంలో లేదు. కారణం దాని సంస్కృత భాష. అది కొద్ది మంది పండితుల భాష. కావున బౌద్ధ జైన మతాలు వెయ్యి సం॥లు అంటే సుమారు శంకరాచార్యుడు వచ్చే వరకు ఈ దేశాన్ని ప్రజలను ప్రభావితం చేసాయి. మెజార్టీ ప్రజలైన ఉత్పత్తి కులాల వాళ్లందరూ బౌద్ధ మతాన్ని ఆచరించారు రాజు అశోకుడితో సహా. ఆ రెండు మతాలు పాళీ, ప్రాకృతం అంటే ప్రజల భాషపై ఆధారపడినాయి. శంకరాచార్యుడి ‘అద్వైతం’ బౌద్ధ, జైనాలను దెబ్బతీసి హిందూ మతాన్ని పునరుద్దరించింది. మళ్లీ దేవభాష ఐన సంస్కృతం తలెత్తింది. అయినా అప్పటికీ రామాయణం ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు.

పదకొండో శతాబ్దంలో ఎప్పుడైతే మహమ్మద్‌ గజినీ సోమనాథదేవాలయాన్ని దోచుకుని, ధ్వంసం చేసాడో, ఆ తర్వాత ముస్లింల రాజ్యం ఏర్పడినాక హిందూ మతాన్ని, జాతిని, సంస్కృతిని జాగృతం చేయటానికి ‘రామాయణం’ ఒక సాధనంగా మారింది. పదిహేనవ శతాబ్దంలో అంటే మొగలుల కాలంలో సంత్‌ తులసీదాసు హిందీ భాషలో అంటే అవధీ మాండలికంలో రామాయణాన్ని ‘రామచరిత మానస్‌’గా రాయటంతో హిందూ జాతి ప్రజలను అది మేల్కొల్పింది. ప్రత్యేకంగా ఔరంగజేబు శివాజీల శత్రుత్వపు కాలంలో దేశంలో అక్కడక్కడా రాముడి ఆలయాలు ఏర్పడినాయి. ఇందులో మరాఠా జాతి పాత్ర కీలకం.  అప్పటి వరకూ ఆదివాసులకు శూద్రులకు పంచములకు వేరేవేరు దేవుళ్లు, దేవతలు, గ్రామదేవతలు ఉండేవారు. వారి పూజాపద్దతులు, సాంప్రదాయాలు హిందూ సంస్కృతికి దూరంగా ద్రావిడ సంస్కృతికి సంబంధించినవి.

సరయూనది తీరాన ఉన్న అయోధ్యలో కూడా ఒక రామమందిరం మొగలుల కన్నా ముందే ఉనికిలో ఉంది. అయితే బాబరు అయోధ్యకు సుబేదారుగా మీర్‌ బక్షీని పంపినపుడు రామాలయంపక్కనే అతను మసీదును నిర్మించాడు. అది ‘చిచ్చు’కు కారణమయ్యింది. దాని పేరే బాబ్రీ మసీదు.

1855లో అవథ్‌ నవాబు ‘వాజిద్‌ అలీషా’ కాలంలో హిందువులు తమ రామాలయ ప్రాంగణంలోనే మసీదు కట్టారని కొంతమందీ, మరికొంతమంది అక్కడ మరో చిన్న రామాలయం ఉంటే ఆ సుబేదార్‌ దాన్ని కూల్చి దాని పునాదుల మీదే మసీదు కట్టాడని అనటంతో అవథ్‌ రాజ్యమంతా మతకల్లోలాలు చెలరేగి చాలా మంది హిందువులే హతమైనారు. 1857సం॥ అవథ్‌లో ఇంగ్లీష్‌ వారి పరిపాలన మొదలైన తర్వాత వాళ్లు ఆ మసీదుకు తాళం వేసారు.

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో సోమనాథ్‌ దేవాలయం పునఃప్రతిష్ఠ, పూజలు, పునరుద్ధరణ జరిగింది. మనది సెక్యులర్‌ రాజ్యం కావున అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని నెహ్రూ వాదించాడు. దానికి విరుద్ధంగా సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ (హోంమంత్రి), బాబురాజేంద్రప్రసాద్‌ (రాష్ట్రపతి) అందులో పాల్గొనగా నెహ్రూకు వారికి మధ్య మనస్పర్థలు ఏర్పడినాయి. ఆ పునరుద్దరణ కార్యక్రమంలో ఆర్‌.యస్‌.యస్‌, గాంధీజీని చంపిన హిందూ మహాసభలు కీలక పాత్ర వహించాయి.

సోమనాథ్‌ తర్వాత మతతత్వ వాదుల కన్ను అయోద్యలోని  బాబ్రీమసీదుపై పడిరది. నెహ్రూ ఆ ఆలోచనను మొదట్లోనే వ్యతిరేకించాడు. కాంగ్రేసులో కూడా మతతత్వవాదులున్నారని బాధపడ్డాడు. అయోధ్యలో ఒక సివిల్‌ అధికారి నాయర్‌. అతను ఆర్‌.యస్‌.యస్‌. అభిమాని. ఒక చీకటి రాత్రి అతను మసీదు ప్రాంగణంలో రహస్యంగా రామలక్ష్మణ సీత విగ్రహాలను కొంతమంది చేత పెట్టించాడు.  మరునాడు హిందువులు దేవుళ్లు వెలిసారని ప్రచారం చేయటంతో వందలు, వేల సంఖ్యలో భక్తులు వచ్చి భజనలు ప్రారంభించారు. తర్వాత ఆ నాయర్‌ భార్య శకుంతలా నాయర్‌కు ఫైజాబాద్‌ లోకసభ టిక్కెట్టు ఇవ్వగా ఆ ఎన్నికలలో ఆమె హిందు మహాసభ పార్టీ అభ్యర్థిగా గెలిచింది. ఆ ఆలయానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని నెహ్రూ మొత్తుకున్నాడు.

మసీదుకు, అందులో ప్రతిష్ఠించిన దేవుళ్లకూ మళ్లీ తాళాలు పడినాయి.  1987లో టి.వి. సీరియల్‌ రామాయణం, రామాలయం విశ్వహిందు పరిషత్తుకు ఆయుధంగా మారింది. దీని వెనక చాణక్యం ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంస్థది. షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్దంగా ముస్లింలకు అనుకూలంగా రాజవ్‌గాంధీ నిర్ణయం తీసుకున్నందుకు హిందూ సంస్థలు ఆయనకు వ్యతిరేకమైనాయి. తిరిగి హిందువులను సంతోషపెట్టటానికి రాజీవ్‌గాంధీ మళ్లీ 1949 నుండి తాళాలు పడ్డ ఆ తలుపులు తెరిపించి మసీదుకు భంగం కలగకుండా పూజలు చేసుకొమ్మన్నాడు. దానితో ముస్లింలు ఆయనకు వ్యతిరేకమైనారు. ఇది ఆయన పొరపాటు నిర్ణయం. అనుభవం లేని రాజీవుడు మళ్లీ ముస్లింలను సంతోషపెట్టటానికి సాలమన్‌ రష్దీ రాసిన ‘సాటానిక్‌ వర్సెస్‌’ పుస్తకాన్ని నిషేధించాడు. ప్రపంచంలో ఏ రాజ్యమూ దానిని నిషేధించలేదు. అట్లా తప్పుమీద తప్పులు చేసిన ఆయన ఇరువర్గాల వారికి దూరమైనాడు.

అట్లా రాజీవ్‌ గాంధీ సీసాలో నిద్రపోతున్న దయ్యాన్ని మూత తీసి ఇవతలికి వదిలి పెట్టినట్లయ్యింది.

వి.పి.సింగ్‌ తీసుకొచ్చిన మండల్‌ కమీషన్‌ను ఆపటానికి సంఫ్‌ుపరివార్‌ సంస్థలు, బిజెపి దేశమంతటా ‘రామ రథయాత్రలు’ జరిపి రామభక్తులందరు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి, కర సేవకు  రావాలని పిలుపు ఇచ్చారు. దేశ ప్రజలందరూ ‘మండల్‌ – కమండల్‌’ మధ్య ఇరుక్కుని చీలిపోయారు. ఈ పరిణామాలు ముందు హిందువుల మధ్యన వైరుధ్యానికి దారి తీసి తర్వాత కాలంలో హిందువులు, ముస్లిల మధ్యన ఘర్షణలకు ఆజ్యం పోసింది.

చివరికి బాబ్రీమసీదు నేలమట్టమయ్యింది. ఇక్కడితో నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. మిగతా వక్తలు మిగిలిన సంగతులు చెపుతారు” అని జాదవ్‌ సాబ్‌ ఆగారు.

శ్రోతలకు కొంచెం విశ్రాంతి దొరకాలని చాయ్‌ పానీ, బిస్కెట్లూ తెప్పించారు. పది నిమిషాల విరామం తర్వాత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వివరించటం ప్రారంభించారు.

“తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఇందులో అందరి తప్పులూ ఉన్నయి. జాదవ్‌ సార్‌ చెప్పినట్లు అనుభవం లేని రాజీవ్‌, చచ్చిన భూతాన్ని నిద్రలేపాడు. మన పి.వి.నర్సింహారావు మాత్రం తక్కువా అగ్గిలో ఆయన తనవంతు ఆజ్యం పోసి ‘కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారన్నట్లు’ నిర్లిప్తంగా తన పాత్ర పోషించాడు. ఆయన పంచెకట్టు విప్పదీస్తే లోపల ఆర్‌.యస్‌.యస్‌ వాళ్లు ధరించే ఖాకీ చెడ్డీ ఉంటదన్న హాస్యం ఒక విధంగా నిజమే. అయోధ్యలో మసీదు విధ్వంసం జరుగుతుంటే ఈయన ఢిల్లీ నివాసంలో ఏ ఫోన్లూ పని చేయలేదు. వామపక్ష, సెక్యులర్‌ పార్టీల నాయకులు ఆ ‘కిష్కంధకాండ’ను ఆపమని ఫోన్లలో ప్రయత్నిస్తే అవన్నీ ‘ఔట్‌ ఆఫ్‌ ఆర్డర్‌’ అని తెలిసింది. ఆ పరమ నీరో చక్రవర్తి, అక్కడ విధ్వంసం జరుగుతుంటే ఇక్కడ తన పూజాగృహంలో పూజలో మునిగి ఉన్నాడు. చివరికి మసీదు మొత్తం కూలిందని పి.యె. వచ్చి చెవిలో చెప్పే వరకూ ఆయన పూజాగృహం నుండి ఇవతలికి రానేరాలేదు. తర్వాత ఫోన్లన్నీ యధావిధిగా పనిచేసాయి. ఇప్పుడు మీరే చెప్పండి – దీని భావమేమి తిరుమలేశా” అని హరగోపాల్‌ సార్‌ శ్రోతలను అడగానే అందరూ గొల్లుమని నవ్వారు.

“అయోధ్యలో మసీదును నేలమట్టం చేసిన శివసేన వీర సైనికులు బొంబాయికి రాగానే వీధులలో మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నరు. ఈ ఉత్సవాలు ముస్లింలకు పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. భరించలేక పోయారు. మళ్లీ మత కలహాలు జరిగాయి. నెలా నెలన్నర రోజులు అదుపులోనికి రాలేదు. పేదవాడి కోపం పెదవికి చేటన్నట్లు షరా మామూలుగా ఈసారి కూడా ముస్లింలే చాలా మంది చనిపోయారు. వారి దుఖాణాలు, ఇండ్లు, ఆస్తుల లూఠీలు ఇష్టారాజ్యంగా జరిగాయి. ఎప్పుడూ జరిగినట్లే పోలీసులు నిర్లిప్తంగా ఉండటమో లేదా వీలైతే దుండగులతో చేతులు కలపటమో చేసారు. ఇందిరమ్మ హత్య జరిగిన తర్వాత ఢిల్లీలో పోలీసులు దుండగులతో కలిసి పోయారు. ఇప్పుడు బొంబాయిలో కూడా అదే పునరావృతమయ్యింది.

ఇంత మారణహోమం జరుగుతున్నా ఢిల్లీలో ప్రధాని పి.వి.గారు మాత్రం తన సహజ ధోరిణి నిర్లిప్తతను అదే విధంగా పాటించారు. సైన్యాన్ని పంపమని ప్రతిపక్షనాయకులు మొత్తుకున్నా ఆయన మౌనమునిలా ఉండి చివరికి హోం మినిస్టరు శరద్‌పవార్‌ను బొంబాయికి పంపాడు. పవార్‌కు శివసేన పార్టీకి పూర్వం నుండీ జిగ్రీ దోస్తానా ఉందన్న సంగతి జగమంతా తెలుసు. ‘అయినను పోయి రావలెను బొంబాయికి’ అని ఆయన వెళ్లనూ వెళ్లాడు మళ్లీ రానూ వచ్చాడు. చేసిందేమీ లేదు.”

“తిప్పడు తిరపతికి పోనూ పోయాడు మల్లీ రానూ వచ్చాడు” అని ఎవరో శ్రోత కామెంటు చేయగానే అందరూ మరోసారి గొల్లుమన్నారు.

సార్‌ మళ్లీ కంటిన్యూ చేసాడు.

“బొంబాయి నగరం అంతా తగలబడి చల్లారిన తర్వాత ప్రధాని గారు నిద్ర నుండి లేచి అప్పుడు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఇట్లా ఈ మైనార్టీల హననంలో అందరి చేతులూ రక్తంతో తడిసి ఉన్నాయి.

ఈ సారి బొంబాయి మత కల్లోలాలలో ఒక కొత్త కోణం జత అయ్యింది. గతంలో మత గొడవలన్నీ ఒకరిమీద ఒకరు దాడులు చేసుకుని గాయపరచటం వరకే ఉండేది. ఈసారి బొంబాయిలో మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం ఏకంగా చంపటమే ముఖ్య లక్ష్యం అయ్యింది. మొదటిది హఠాత్‌ ఉద్రేకమూ కోపాల వల్ల జరిగితే రెండవది మాత్రం క్రుకెడ్‌ప్లాన్‌తో జరిగింది. ఇది తీవ్రమైన పరిణామం.

ఇంకొక్క సంగతి చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఈసారి హైద్రాబాద్‌, అయోధ్య బొంబాయి అల్లర్లలో మతోన్మాద శక్తులు ‘బాబర్‌కే సంతాన్‌ బాగ్‌ జావో భారత్‌సే’ అని నినాదాలు ఇచ్చారు. అంటే ముస్లింలంతా ఈ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాలని. ఇప్పుడొక ప్రశ్న మీ అందరికీ. ఇప్పుడు దేశం మొత్తంలో పదమూడు శాతం ఉన్న ముస్లింలందరూ ఆరవ శతాబ్దంలో మహమ్మద్‌ కాసిం ద్వారా, పదకొండో శతాబ్దంలో మహమ్మద్‌ గజనీ ద్వారా, పదిహేనవ శతాబ్దంలో బాబర్‌ వెంబడి ఆ కాలంలోనే వారితో పాటు గుర్రాల మీద స్వారీ చేసి కత్తులు పట్టుకొచ్చినవారా?”

“లేదు లేదు అన్నట్లు మళ్లి పకపక నవ్వులు. మరి కొన్ని చప్పట్లు.

“మరి మనువాద వర్ణ వివక్షత వల్లనే, మీ అంటరాని తనం వల్లనే దళిత కులాల వాళ్లు తమ ఆత్మ గౌరవం కోసం ఇస్లాంలో, క్రిస్టియానిటీలో కలిసినపుడు అది మీ తప్పు కాదా? మీ బాధ్యత కాదా? అని సార్‌ ప్రశ్నిస్తూ తన ప్రసంగాన్ని ముగించాడు.

అప్పుడు పాశం యాదగిరి లేచి నిలబడ్డాడు. ఒక జర్నలిస్టుగా ఆయన మత కల్లోలాలు జరిగిన బొంబాయి సందర్శించాడు. ఆయన ప్రత్యక్ష సాక్షి కావున ఆయన అనుభవాలు, అమూల్యమని శ్రోతలందరూ శ్రద్దగా చెవులప్పగించి వినసాగారు. పాశం యాదగిరి నిప్పులు, చెరుగుతున్నట్లుగా ఇట్లా మాట్లాడ సాగాడు.

“బాంబే అల్లర్ల మీద ఒక విచారణా సంఘాన్ని ప్రభుత్వం రిటైర్డ్‌ జస్టిస్‌ శ్రీకృష్ణను నియమించగా అతను తన నివేదికలో శివసేన నాయకుడు బాల్‌థాకరేతో సహా అనేకమందిని దోషులుగా అల్లర్లకు బాధ్యులుగా పేర్కొన్నాడు. ఆ మారణహోమంలో దుండగులకు వత్తాసుగ నిలిచిన పోలీసులను కూడా ఆ నివేదిక తప్పుపట్టింది. నిజానికి ఆయన హిందూ మతాభిమాని. అయినా సత్యం, నిజం వైపు నిలిచి ఆయన తన నివేదికను వెల్లడించాడు.

ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నివేదికను చెత్తబుట్టలో వేసాయి. ఆ సంగతి తెలిసిన శ్రీకృష్ణ ‘నా విలువైన సమయం వృథా అయ్యింద’ని వాపోయారు.

దేశంలో ఎక్కడైనా మత కల్లోలాలు జరిగితే మైనారిటీ ప్రజలే బలిపశువులు, బాధితులు. అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంపై దాడి ధ్వంసం ఒక శత్రుదేశంపై దాడి చేసినట్లుగానే సైన్యం ఫిరంగులతో మారణహోమం జరిపితే మైనార్టీ మతమైన సిఖ్కుల హృదయాలు ఎట్లా గాయపడ్డాయో ఊహించండి. ఆ గాయాలు మానక ముందే ఇందిరాగాంధీ మరణానికి ప్రతీకారంగా ఢల్లీిలో మళ్లీ ఊచకోతకు గురైంది వారే. ఈశాన్య భారతంలో క్రిష్టియన్లపై దాడులు మీకు తెలిసిన సంగతే కదా.

మైనారిటీలకు కూడా స్వేచ్చా స్వాతంత్య్రం భద్రత ఉంటేనే అది ఉత్తమమైన ప్రజాస్వామ్యమని రాజనీతి శాస్త్రజ్ఞుడు హెచ్‌జె. లాస్కీ అంటాడు.

బిజెపిలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి మొదటి నుండి ఉదారవాది. ఆయనకు రామరథయాత్ర, రామాలయం ఇష్టం లేని విషయాలైనందున వాటికి ఆయన దూరంగానే ఉన్నడు. బాబ్రీమసీదు కూలినప్పుడు ఆయన అమెరికాలో ఉన్నడు. మసీదు కూలిన రోజు ఆయనను విలేఖరులు ‘మీరు అక్కడ ఉండవలసింది ఇక్కడ ఉన్నారేమిటి’ అని ప్రశ్నించారట. దానికి ఆయన చాలా చమత్కారంగా ‘రామ భక్తులందరూ అయోధ్యలో ఉంటే ఈ దేశభక్తుడు ఇక్కడ ఉన్నాడు’ అన్నడట. ఆయన గాంధేయ సోషలిజం సంఘ్‌పరివార్‌కు నచ్చలేదు. సామరస్య సంప్రదింపుల ద్వారా “మందిర్‌ – మస్జిద్‌’ సమస్యను పరిష్కరించుకుందామంటే కాషాయ ధారులకు కాలీ టోపీ, ఖాకీ చెడ్డి, లాఠీ వాలాలకు ఆ మాట నచ్చలేదు.

దేశీయ ఇస్లాం ఉగ్రవాదానికి హిందుమత దురహంకారులే కారణం. అంతర్జాతీయ ఉగ్రవాదానికి “అందరికీ పెద్దన్న అమెరికానే కారణం. బిన్‌ లాడెన్‌ భూతాన్ని సృష్టించింది అమెరికానే కదా తర్వాత లాడెన్‌ అమెరికాపట్ల భస్మాసురుడిలా తయారయ్యాడు.” అని పాశం తన ఉపన్యాసాన్ని ముగించాడు.

“ఇప్పటికే కాలాతీతమైంది. తదుపరి కార్యాచరణ గురించి రాబోయే సమావేశంలో చర్చించుకుందాం” అని జాదవ్‌ సాబ్‌ అనటంతో ఆ ‘రాం రహీం ఏక్తా యాత్ర’ సభ ముగిసింది.

***

ఒక రోజు స్వామి హడావుడిగా ఆఫీసుకు తయారవుతుంటే అమ్మ..

“ఒరే నానీ నెత్తంత నిన్నటి నుండి బాగా నొస్తుందిరా” అన్నది.

తొందరలో వున్న స్వామి చికాకుపడి “నొయ్యదా మరి ఇంకా ఉప్పు కారం పై నుండి కూరల్లో బాగా వేసుకుని తిను” అన్నాడు కోపంగా. చాలా సార్లు ఆంజల్య కూడా “ఉప్పు, కారం అంత తినకు” అనంటే “ఇగ చచ్చేదాన్ని నాకెందుకూ ఆ పత్యాలు. చచ్చేదేదో అవన్నీ తినే చస్తా” అని మొండిగా అనేది. బి.పి. మందులతో సహా ఏ మందులు వాడని పాత కాలం మనిషి ఆమె. ఏ ఇబ్బంది వచ్చినా వంటింటి చిట్కాలనే నమ్ముకునేది.

స్వామికి మళ్లీ పాపం అనిపించి బయలుదేరే ముందు “సరెలే ఆంజల్యను తీసుకుని మధ్యాహ్నం డాక్టరు దగ్గరకు పోయి బి.పి చెకప్‌ చేయించుకో అన్నాడు”

సాయంత్రం నాలుగు గంటలకు ఆంజల్య ఫోను “బి.పి. చాలా ఎక్కువగా ఉందట. అంత ఉండొద్దట. కొన్ని టెస్టులు చేయటానికి జాయిన్‌ చేసుకున్నరు” అని చెప్పింది.

పనిలో మునిగి ఉన్న స్వామి విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ సాయంత్రం ఆఫీసు నుండి సీదా హాస్పిటల్‌కు వెళ్లాడు. అమ్మ తెల్లటి బెడ్డు మీద సుఖంగా కూచుని పక్కన మనుమడు రాజాతో ఆడుకుంటుంది. డాక్టరు ఇచ్చిన మందులతో రిలీఫ్‌గా ఉంది. ఆంజల్య కూడా అక్కడే ఉంది.

“ఒక ఇరవైనాలుగు గంటలు అబ్జర్వేషన్‌లో ఉండాలట. రేపు వెళ్లిపోవచ్చు అన్నడు డాక్టరు. నేను కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉంటా” అన్నది ఆంజల్య.

అమ్మతో ఆ మాటా ఈ మాటా మాట్లాడి ఇంటికి వచ్చాడు. తెల్లారి ప్రొద్దున ఆరు గంటలకే ఆంజల్య ఫోను.

“అమ్మమ్మ మాట్లాడటం లేదు. స్పృహలో లేదు. నువ్వు వెంటనే రా”

స్వామి పరిగెత్తాడు. ఆమె స్పృహలో లేదు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే ఉంది. కాని బాగా గురక పెడుతుంది. “అమ్మా అమ్మా” అని గట్టిగా ఊపి చాలా సార్లు అరిస్తే ఒక్కసారి చిన్నగా “ఊఁ” అంటుంది.

ఆంజల్య, స్వామిలకు ఎటూ తోచలేదు. అందరికీ ఫోన్లు చేసి వార్త చెప్పారు.

ఉదయం ఐదు వరకూ బాగానే ఉందట. ఆ తర్వాతే స్పృహ కోల్పోయిందట.

స్టాఫ్‌ నర్సు వచ్చి ఆక్సిజన్‌ మాస్క్‌ ఒకటి ముఖానికి పెట్టింది. గురక తగ్గింది. తొమ్మిదికి డాక్టరు వచ్చాడు. చూసాడు.

“ఇది బ్రెయిన్‌ స్ట్రోక్‌ లాగా ఉంది. ఈమె కోమాలోకి వెళ్లిపోయింది. ఇంకా ఏదైనా పెద్ద హాస్పిటల్‌కు వెంటనే షిప్ట్‌ చేయాలి అన్నాడు”.

అంబ్యులెన్స్‌లో ఒక మోస్తరు కార్పొరేట్‌ హాస్పిటల్‌ చేర్పించారు. ఈలోగా అందరూ వచ్చారు. డాక్టర్లు ఎన్ని రకాల ట్రీట్‌మెంట్లు ఇచ్చినా ఆమె ‘కోమా’ నుండి బయటికి రాలేదు.

ఆఖరికి సాయంత్రం నాలుగు గంటలకు ఆమె పల్స్‌ రేట్‌ ఆగిపోయింది. అక్కలందరూ ఆపుకోలేని దుఃఖంతో “అమ్మా అమ్మా” అని ఏడ్చారు. “అమ్మలను కన్న అమ్మలకే అమ్మలు పోతే దుఃఖం ఎక్కువగా ఉంటదేమో!” అన్నదమ్ములు ముగ్గురు ఇవతలికి వచ్చారు.

అమ్మకు ఎప్పుడూ ఒక ఫికరు ఉండేది. కాళ్లు చేతులు మంచిగ ఆడుతున్నప్పుడే టక్కున పోవాలి గాని తన అమ్మలాగ పక్షవాతం వచ్చి నెలల తరబడి మంచంలో పడి ‘నవిసి నవిసి’ చచ్చిపోవద్దని.

తనకు కోపం వచ్చినప్పుడు, అందరి మీద అలిగినప్పుడు “నాకేదైనా రోగం వచ్చి మంచంల పడితే ఎవరూ నాకు సేవలు చేయొద్దు. ఇంత విషం తెచ్చి నా నొట్లె వెయ్యండి.” అని నిష్ఠూరంగ అనేది.

తను కోరుకున్నట్లే ఇరవై నాలుగు గంటలలోపే ఎటువంటి అవస్థ పడకుండా, ఇతరులను అవస్థ పెట్టకుండా అన్ని కోరికలు నెరవేరి ప్రశాంతంగా కన్నుమూసింది.

మొత్తానికి తన పంతం చెల్లించుకుని స్వంత ఇంటిలో చనిపోయిందని కూడా అందరూ తృప్తి పడ్డారు. బాపుది చాలా మెత్తటి మనస్సు. అమ్మ కొంచెం పంతం గల మనిషి.

స్వామి గంగానది తీరాన అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఆమె అంత్యక్రియలూ, దినవారాలు వైష్ణవాచారం ప్రకారం అవే సాంప్రదాయిక పద్దతులూ, నియమాలతో జరిపించి శిరోముండనం కూడా చేయించుకున్నాడు. బాపుకు చేసిన అపచారాన్ని అమ్మకు చేసిన అపకర్మలతో సరిదిద్దుకున్నాడేమో?

స్వామి యౌవనంలో ఒకప్పుడు ఉన్న అప్పటి ఉడుకు రక్తం ఇప్పుడు మెల్లమెల్లగా చల్లబడుతుంది. మొండితనమూ, పట్టుదలలు సడలుతున్నాయి.

కాలం మనుషుల్ని వారి మనసుల్ని లొంగదీసుకుంటుంది. మనిషి తనకు తెలియకుండానే తను ‘మెటమార్ఫాసిస్‌’కు మారిపోతూ ఉంటాడు. దీనినే కారల్‌మార్క్సు ‘పరాయీకరణ’ Alienation అంటాడు. చివరికి “తను” తాను కాకుండా పోవటమే. తన ఉనికిని తానే రద్దు చేసుకోవటం. తన అస్తిత్వానికి తానే చాలా నెమ్మదిగా అంత్యక్రియలు జరుపుకోవటమే ‘మార్పు’కు అర్థమేమో!

ఈ మార్పు విషయంలో వ్యక్తి బాధ్యత సంపూర్ణం కాదు. కొంత వరకే. వ్యక్తి నిమిత్తమాత్రుడు సమాజంలో వచ్చే భౌతిక మార్పులు వ్యక్తి మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అతను తప్పించుకోలేడు. దీనిని క్లుప్తంగా పరిస్థితుల ప్రభావం అనవచ్చు. అందుకేనెమో వేదాంతులు మనుషుల్ని ‘మట్టి మనుషులు’, విధి చేతిలో ‘కీలు బొమ్మలు’, ‘ఆట బొమ్మలు’ అంటారు.

ఒక వ్యక్తిగా స్వామి మనస్తత్వాన్ని విశ్లేషిస్తే అతనిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలు, నిర్లిప్తతలు కూడా అతనిలోని మార్పుకు కారణమేమో!

కమ్యూనిస్టు ఉద్యమంలోని ఒడిదొడుకులు, కొంత మంది ప్రవర్తన అతన్ని లోతుగా గాయపరిచి గట్టిగా దెబ్బతీసింది. ఆ అనుభవాలు అతన్ని పచ్చి పుండులా సలుపుతూనే ఉన్నాయి. వాటికి తోడు 1989 తియాన్మిన్‌ స్క్వేర్‌లో ప్రజాస్వామ్య ఉద్యమకారులపై మిలిటరీ టాంకులను నడిపి “వందలాది మందిని పొట్టన పెట్టుకుని ఆ తర్వాత వేలాది మందిని వెంటాడి వేధించి అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ నియంతృత్వ ధోరణి అతడిని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఏది సత్యం ఏదసత్యం, ఏది నిజం ఏది అబద్దం అన్న మానసిక గందరగోళానికి గురైనాడు. మళ్లీ రెండు సంవత్సరాలైనా కాక మునుపే 1991లో ముక్కలు ముక్కలుగా పేక మేడల్లా, ఇసుక గూడులా కుప్పకూలిన సోవియట్‌ యూనియన్‌. అన్ని రిపబ్లిక్కులలో ఉగ్ర నర్సింహులైన ప్రజా సమూహాలు లెనిన్‌ విగ్రహాలను కూలగొడుతుంటే టి.వి.చానెల్స్‌లలో చూసిన స్వామి హృదయం కూడా ‘నిలువుటద్దం బ్రళ్లునా బ్రద్దలైనట్లు’ కన్నీళ్లు కార్చింది.

ఈ రాజకీయ కారణాలేగాక అతని వ్యక్తిగత కుటుంబ పరిస్థితులు, చికాకులు, గందరగోళాలూ అన్నీ కలిసి ‘మనిషి లోపలి’ విధ్వంసానికి దారితీసాయి. మనిషి పగిలి పోయిన అద్దం ముక్కలా మిగిలిపోయాడు. మేరా నామ్‌ జోకర్‌ సీన్మాలో పగిలిపోయిన హృదయం ముక్కలను ఒకొక్కటిగా ఏరుకుంటూ తెర వెనక్కి విషాద భారంతో వంగి వెళ్లుతున్న ‘జోకర్‌’లా.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version