[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[తన జీవితం అంత్యదశకి వచ్చిందని, తన వయసు ఎనభయ్యో, ఎనభై రెండో అయ్యుంటుందని అంటుంది తల్లి స్వామితో. ఉదయ్యాన్నే అశుభం మాటలు మాట్లాడదద్దని తల్లితో అని, అయినా నీ వయస్సుని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు, ఆ రోజుల్లో బర్త్ సర్టిఫికెట్లవీ లేవు గదా అంటాడు. తన లెక్క తనకుందంటూ, నగరంలో జరిగిన సంఘటనలతో ముడిపెట్టి ఆమె తన వయసుని అంచనా వేసి చెప్తుంది. తరువాత స్వామి లెక్కలు వేస్తే ఆమె అందాజా సరిపోతుంది. నాయనమ్మ పుట్టినరోజు దగ్గరలో ఉందని విన్న మనవరాలు కేక్ కోసి వేడుక చేసుకుందామంటుంది. అవన్నీ ఏం వద్దు గానీ, కాశీకి తీసుకెళ్ళమని కొడుకుని కోరుతుందామె. తప్పకుండా తీసుకువెళ్తానంటాడు స్వామి. స్వల్ప వడ్డీకి అప్పు తీసుకున్ని, దసరా శెలవల్లో, మరో నాలుగు రోజులు శెలవు పెట్టి కుటుంబసమేతంగా రైలు ప్రయాణం చేసి వారణాసి చేరుతాడు. గంగలో స్నానాలు చేస్తారు. విశ్వనాథుని దర్శించుకుంటారు. కొన్ని పట్టుచీరలు కొంటారు. ఓ సాయంత్రం దశాశ్వమేథ్‌ఘాట్‌లో జరిగే గంగాహారతిలో పాల్గొంటారు. కాశీ వీధులలో తిరుగుతుంటే స్వామిలో ఎన్నో జ్ఞాపకాలు! దేశ సంస్కృతి గురించి, హిమాలయాల గురించి, విశ్వవిద్యాలయం గురించి, రాజులు రాజ్యాల గురించి ఎన్నో ఆలోచనలు! తరువాత అక్కడ్నించి సారనాథ్ వెళ్ళి బుద్ధుడు జ్ఞానబోధ చేసిన స్థలాన్ని దర్శిస్తారు. మర్నాడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం చూసొస్తారు. తర్వాత మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లను చూస్తారు. దగ్గరలో కూర్చుని స్వామి భార్యతోనూ, అమ్మతోనూ జననమరణాలకి సంబంధించిన ఎన్నో విషయాలు మాట్లాడుతాడు. ఆ సందర్భంగా తల్లి అతన్ని ఓ కోరిక కోరుతుంది, తప్పకుండా తీర్చాలని అంటుంది. ఆమె కోరిక ప్రకారం – ఆమె మరణానంతరం – సాంప్రదాయికంగా, శాస్త్రప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తాననీ, కేశఖండన కూడా చేయించుకుంటాననీ మాట ఇస్తాడు స్వామి. కాశీయాత్ర ముగించుకుని అందరూ సంతోషంగా ఇల్లు చేరుతారు. – ఇక చదవండి.]
అధ్యాయం-12: వంచకురాలు వనజ – ముష్కరుడు ముజీబు
శిక్షణాకాలం పూర్తి చేసుకుని, రెగ్యులర్ పోస్టింగ్‌గా కొత్త ఆఫీసుకు వచ్చి కుర్చీలో కూచున్న స్వామికి ఆ సీటు చాలా హాట్ సీటుగా అనిపించింది. పని భారమూ, పని ఒత్తిడే గాక క్రింది సిబ్బంది, తోటి అధికారులు, పైన నెత్తిమీద ఉండే ‘మూలవిరాట్టు’ అధికారి పెత్తనమూ, అజమాయిషీల వలన సుఖంగా పిల్లలకు పాఠాలు చెప్పుకునే ప్రాణం పెనం మీద నుండి పొయ్యిలోకి దుంకినట్లయ్యింది. వృత్తికీ ప్రవృత్తికీ మధ్య పొంతన పొసగలేదు.
దీనికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి అతని మానసిక పరిస్థితి. రెండు అతని మధ్య వయసు.
పూర్వాశ్రమమంతా ఒక రెబెల్ విద్యార్థిగా, విప్లవ పార్టీలలో పని చేసిన కార్యకర్తగా, కవిగా, రచయితగా, భావుకునిగా ఆఖరికి తన ప్రవృత్తికి అనుగుణమైన లెక్చరర్‌గా పనిచేసిన ఆ మనిషికి లేటు వయసులో ఈ క్రొత్త ఉద్యోగానికి రాకముందే అతని మానసిక పరిస్థితి లేదా పరిపక్వత ఒక ‘స్థిరత్వానికి’ గురయ్యింది. అది అంత త్వరగా మారిపోదు, మాసిపోదు. బ్రతుకు తెరువుకోసం యాదృచ్ఛికంగా ఈ పన్నులు వసూలు చేసే శాఖలో అధికారిగా చేరాడు. ఇక్కడి మనుషుల ఆలోచనలూ, ప్రవర్తనా, పని సంస్కృతి ‘చాల్బాజీ తనమూ’ అతనికి పూర్తిగా కొత్త. పూర్తిగా విభిన్నం. ఆ కొత్త, భిన్నమైన పరిస్థితులకు ఈ మధ్య వయసులో సర్దుకుని ఉద్యోగం చేయటం అతనికి ‘కత్తుల వంతెన మీద ప్రయాణంలా’ అనిపించింది.
అతనికి సహాయకురాలిగా ఆ ఆఫీసులో ఒక సీనియర్ క్లర్కు ఉంది. పనిలో పది పన్నెండేండ్ల అనుభవం ఉండి బాగా రాటుదేలిపోయి ఉంది. మొదటగా ఆమెను ప్రథమ వీక్షణంలోనే చూసినపుడు రామాయణంలో కైకేయికి తొత్తుగా పని చేసి తంపులమారి వ్యవహారాలు సృష్టించిన మందరలా కనిపించింది. బజారులలో వ్యాపారుల దుకాణాలకు వెళ్లి తన వంతు వాటా వసూలు చేసుకుంటుందని ప్రతీతి.
రామిరెడ్డి సూపరిడెంటు ఆమె ‘ప్రవర’ ఇలా విన్నవించాడు.
“సార్ ఆమె జర వయసు మళ్లి ఇప్పుడు ఇట్లుందిగాని ఉద్యోగం చేరిన కొత్తలో పది రూపాయల కొత్త నోటులాగా అప్పుడే కొత్తగా విప్పిన మైసూరు శాండల్ సబ్బును చుట్టుకున్న ఉల్లిపొర కాగితంలా ఫెళఫెళ లాడుతూ, కళకళలాడుతూ ఉండేది. ఆమె కళకళలను, కులుకులను చూసిన ఓ ముసలి ఆఫీసరు ఇంకో సం॥లో రిటైర్ అయితడనంగ ఈమె విసిరిన వలలో ‘మత్యగ్రంధి సత్యవతి చూపుల వలలో పడిన హస్తినాపురపు ముసలి శంతన మహారాజులా’ విలవిలాడుతూ గిలగిలా కొట్టుకుంటూ గాలానికి చిక్కిన చేపపిల్లలా మునగానాం, తేలానాం అయినాడు.
ఆయన అసలు పేరు కనకరాజు కాని డిపార్ట్మెంటులో బంగార్రాజు అన్న పేరు స్థిరపడి అందరూ అసలు పేరు మరిచి పోయారు. పేరులోనే పెన్నిది కలదు అన్నట్లు కనకమన్నా, బంగారం అన్నా ఒకటే కదా అన్న సదుద్దేశ్యంతో క్రింది సిబ్బంది ఆయనకొక తోక పేరు తగిలించారు. నిక్ నేమ్ అన్నమాట. అదీ బంగార్రాజు. ఈ డిపార్ట్మెంటులో కళ్లు మండి, కడుపు మండిన క్రింది ఉద్యోగులు పై అధికారులకు ముచ్చటైన ముద్దు పేర్లు తగిలిస్తుంటారు.
‘ఏక్ సౌ గ్యారా అని ఒకరికి, ‘లీటర్ – మీటర్’ అని మరొకరికి తోకలు తగిలించారు. కీర్తి ప్రతిష్ఠలు జీవితమంతా కొనసాగినట్లు ఆ తోకపేర్లు వారు రిటైర్ అయ్యేవరకూ కొనసాగుతాయి. ఒక వైష్ణవ మతానికి చెందిన అధికారి నుదుటిమీద హమేషా మూడు తిరునామాలు ఉండేవి కాని ‘అమ్యామ్యా’లలో ఆరితేరిన వాడు కావున ఆయనకు ముద్దుగా ‘ఏక్ సౌ గ్యారా’ తోకను తగిలించారు. మరొక అధికారి ‘లీటర్-మీటర్’. ఆయన సాయం కాలం కాగానే బార్లో ‘సంధ్యావందనం’ క్రమం తప్పక ఆచరించేవాడు అనగా లీటర్ల కొద్దీ బీర్లు సేవించి ఊబకాయంతో హై బి.పి. తెచ్చుకున్నందున ఆయనకు ‘లీటర్-మీటర్’ బిరుదును ప్రసాదించారు.
ఆ విధంబుగా ‘బంగార్రాజు’ పేరు వెనక కూడా ఒక వీనుల విందైన కథ కలదు. ఆయన తన మాంచి వయసులో పేట్రేగి వీరవిహారం చేస్తున్నప్పుడు, అనగా ‘అమెరికా అను పెద్ద వస్తాదు మద్దతుతో చోటా వస్తాదు ఐన ఇజ్రాయిల్ తన ప్రక్కన ఉన్న అల్పప్రాణి పాలస్తీనా మీద పేట్రేగినట్లు’ ఒక రాత్రి కనకరాజు లారీలు ఆపి, చెక్ చేస్తున్నడు దొంగ సరుకుల లారీలను పట్టుకోవాలన్న పవిత్ర కర్తవ్యంతో. అప్పుడు బొంబాయి నుండి ఒక లారీ బేగం బజారులోని మార్వాడీ వర్తకవ్యాపారి పేరుతో వచ్చింది. సాధారణంగా మార్వాడీలందరూ ఆవుపాలతో మాత్రమే శుద్ధి చేయబడిన ‘మిస్టర్ క్లీన్’లు అయినను ‘శంకా నివృత్తి నిమిత్తమై’ మన కనకరాజుగారు ఆ రాత్రి నిద్రకోర్చి, వ్యయ ప్రయాసలను లెక్క చేయక, నిబద్ధుడైన సర్కారు వారి సేవకుడుగా ఆ లారీ ఆపి అందులోని సరుకులన్నీ క్రిందికి దింపించాడు. దానిని పన్నుల శాఖలో ‘ఫిజికల్ వెరిఫికేషన్’ అంటారు. కొండొకచో ముద్దుగా ‘వస్త్రాపహరణం’ అని కూడా పేరు. అందులోని పెట్టెలను చెక్ చేస్తున్నప్పుడు ఆ పెట్టల క్రింద, అట్టడుగున ఒక చిన్న పెట్టె ‘బుజ్జి కూన ముండ’లా ఒదిగొదిగి పొందికగా కూచుని ఉన్నది. అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత పుట్టిన మన కనకంగారు దానిని జాగ్రత్తగా తన చేతులలోకి తీసుకోగా అది వింతగా ప్రత్యేక బరువుతో అలరారుతుంది. కాస్తా అటుఇటూ కదపగా ఘల్లుఘల్లున గజ్జెల చప్పుడూ వినిపించింది. మన కనకం దానిని కొంచెం విప్పి చూడగా కనక మహాలక్ష్మి బిళ్లలు బిళ్లలుగా దర్శనమిచ్చి కండ్లను జిగెల్ జిగేల్ మనిపించి మెరుపులు కురిపించింది. ఆ తర్వాత ఒక అర్ధగంటలోనే ఆ బేగం బజారు నుండి పెద్ద బోషాణంలా ఉన్న బొర్ర బొజ్జతో ఒక మార్వాడీ బేహారీ గునగునా గున్న ఏనుగులా నడుచుకుంటూ వచ్చి రోడ్డు పక్కనున్న చీకట్లో నిలబడి ముందుకు అతి కష్టంగా ఒంగి పాద నమస్కారం ఆచరించి ఆ పిమ్మట నిజంగానే ‘కాళ్ల బేరం’ సాగించాడు. మన కనకం ఆల్సేషియన్ డాగ్ లాంటి వాడు. పిక్క పట్టుకున్నడంటే అంత ఈజీగా వదిలే రకం కాదు. కుక్కలా కాకున్న మనిషిలా ఆ బొర్రోడి గొంతు రెండు చేతులతో పట్టుకుని “అడిగినంత ఇస్తావా లేక చస్తావా” అని బెదిరించగా ‘చావటమేమోగాని ముందు శ్రీకృష్ణ జన్మస్థానం మాత్రం తప్పద’ని ఆ బేహారి భయపడ్డాడు. ‘భయం చావుకన్నా, భయంకరం’ అన్న సత్యం మన శునకానికి సారీ కనకానికి మహా బాగా తెలుసు. ఎట్టకేలకు ‘ఫిప్టీఫిప్టీ’ అని ఆ సందులో బేరం సెటిల్ అయ్యి సగం కనక మహాలక్ష్మి సుఖంగా కనకం ఇంటికి చేరుకుంది. సరస్వతికి నిలకడ ఉంటుంది కాని లక్ష్మికి నిలకడ ఉండదు కదా! ఇంగువ వాసన ఇల్లంతా సోకినట్లు ఆ వార్త చాపక్రింది నీరులా ఆఫీసులో అందరికీ తెలిసింది కడుపు మండిన జీపు చోదకుడి పుణ్యమా అని!
ఆ వార్త విని కళ్లు మండి, కడుపు మండిన క్రింది వారంతా తానొక్కడే అంతా ‘నొక్కేసినందుకు’ అక్కసుతో, ఈర్ష్యా అసూయలతో చేసేదేమీ లేక ‘బంగార్రాజు’ అని ఒక వాలం తగిలించి సంతృప్తి పడినారు. అట్లా మన కనకరాజు బంగారురాజులా దినదిన ప్రవర్ధమానుడై వర్ధిల్లుతుండగా, బాలభానుడి తేజస్సుతో ధగధగ లాడుతుండగా, షట్చకవర్తులలో ఒకరైన కార్తవీర్యార్జునుడిలా చెలరేగుతుండగా ఒక దుర్దినాన దుర్ముహుర్తంలో అతని ‘హవా మహల్’ అను ప్యాలెస్‌పై ఎసిబి వారు దాడి చేసారు.
అతని ఆదాయానికి, ఆస్తులకూ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని ఎసిబి వారు నివేదిక సమర్పించటంతో ఏలిన వారు ఆయన్ని రెండు సంవత్సరాలు సస్పెన్షన్‌లో ఉంచి సగం జీతం ఇచ్చారు. అయితే ఇటువంటి కేసులు, బీసులు మన శునకరాజుకు అదే ఐమీన్ కనకరాజుకు ఉరఫ్ బంగార్రాజుకు ‘బాల్ కే బరాబర్’ అన్నమాట. మ్లేచ్చ భాషలో భేఖాతర్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్న ప్రావెర్బును ఆయన ఐదవ తరగతిలోనే మెదడుకు బాగా వంటబట్టిచ్చుకున్నాడు కావున అటు మంత్రిగారి పేషీ నుండి క్రింది ఏసిబి అధికారుల దాకా కాసుల వర్షం గలగలా కురిపించి ఎట్‌లాస్ట్ అనగా ఎట్టకేలకు అరణ్యవాసమూ, అజ్ఞాతవాసమూ దిగ్విజయంగా ముగించి ‘బ్లాక్‌ను అంతా వైటు’గా ఎసిబి కోర్టు ద్వారా చేయించుకుని మిస్టర్ క్లీన్‌గా బయట పడి ‘అగ్నిపునీత సీత’లా మళ్లీ సర్కారు వారి సేవలో పబ్లిక్ సర్వెంటుగా చేరిపోయాడు. అటువంటి మహామహాఘనత కల్గిన మన బంగార్రాజుకు ఒక సంవత్సరలో రిటైర్మెంటు ఉందనగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వనజ అను మాయలేడి బంగారు బిళ్లల కథ విని ఉండటంతో ‘చాంగు ఛాంగురే బంగారు రాజా’ అంటూ ఆ ముదుసలిని తన చిటికెన వేలి చుట్టూ తిప్పుకుంది. మాయ తెరలా అతన్ని కమ్ముకుంది.
అప్పుడు ఆ విధంబుగా కొంత కాలమయిన పిమ్మట పై అక్రమ సంపాదన ఈ మధ్య సక్రమంగా ఇంటికి చేరటం లేదని గమనించిన ‘గౌరవనీయులైన హోం డిపార్ట్మెంటు’ వారు పరిస్థితులు కొంపముంచుతున్నవని గ్రహించినవారై, పరిస్థితులు విషమించి చేయి దాటకముందే ఇల్లు చక్కదిద్ది నిలబెట్టుకోవాలన్న సదుద్దేశ్యంతో శ్రీవారి వద్ద కర్తవ్య నిర్వహణలో నిమగ్నుడైన అటెండరు అందించిన రహస్య సమాచారాన్ని సేకరించి అసలు సంగతి తెలుసుకున్న వారై ఒక శుభదినాన శుభ ముహూర్తంలో దొరవారి కార్యాలయానికి సీదాగా ఏతెంచి ఆ సదరు ‘వనజ’ అను వన్నెలాడిని ఉరఫ్ మాయలేడిని పట్టుకుని ఆ గృహిణీమణీ, ఆ భార్యారత్నం తన పాదాలకున్న పాదుకలతో తగురీతిన సత్కరించి సన్మానం చేసిందట. ఆ మరిడీ మహాలక్ష్మికి మహాతల్లికి, ఆదిపరాశక్తికి తోడుగా వచ్చిన కొంచెం వయసు మళ్లిన కూతురు కూడా సదరు క్యాండిడేటు తల నీలాలను తన కబంధ హస్తములతో గట్టిగా బిగించి, బంధించి ‘కుఁయ్యో మొర్రో’ అని పాపం ఆ అబల లబలబమని మొత్తుకుంటున్నా ఇంచుక కూడా కనికరం చూపక వదలకుండా కఠిన హృదయంతో కేశపాశములన్నింటినీ అటూ ఇటు చిందరవందరగా ఏకీ పీకీ ఆ కార్యాలయంలోనే పాపం ఆ నిస్సహాయురాలిని క్రింద పడేసి పాద తాండనం పీడనం బలంగా చేయగా షోకులాడికి షోశొచ్చి క్రిందపడి గుడ్లు తేలేసిందట.
ఆ ప్రకారంబుగా ఆ ఇద్దరు వీరనారీమణులు, ఆదిపరాశక్తులు ఇంకా కోపమూ కసీ చల్లారక ‘హిరణ్యకశిపుడి పొట్టను చీల్చి పేగులను ఇవతలికి లాగి, పీకి సంహరించినా ఇంకా కోపం తగ్గని ఉగ్రనర్సింహమూర్తి’లా సదరు ముసలి ఆఫీసరు అనగా వారి వారి మగడూ, తండ్రి ఐన ఆ శాల్తీ గదిలోకి మెరుపు దాడికి దిగిన ‘నక్సలైటు, మహిళా గెరిల్లాల’ మాదిరి దూసుకపోయినారట. కాని క్యా ఫాయిదా?
అప్పటికే ఆ ‘కలకలాన్ని’ ఆ ఊహించని ఉగ్రవాద ఉపద్రవాన్ని తెలుసుకున్న వాడై ‘తన చర్మ సంరక్షణా నిమిత్తమై’ పాపం ఆ ముదుసలి ఆఫీసు దొడ్డి తలుపుగుండా ప్రాణముల్ ఠావులు తప్పెను అన్నట్లుగా బయట పడి రోడ్డెక్కి వంథి మాగధులు, వాహనం లేకుండానే ఒక్కడే ఒంటరిగా పిక్కబలం చూపించాడట. రష్యా సైన్యాలకు భయపడిన అప్ఘనిస్తాన్ శరణార్దుల్లా పాపం ఆ శరణార్థి ఎక్కడెక్కడో రెండు మూడు రోజులు ఇటు ఆఫీసుకు రాక అటూ ఇంటికీ పోక రహస్యంగా ఎక్కడో ఆశ్రయం పొందాడట. అయితే సదరు ఆ కులుకులాడి రంకులాడి ఇంట్లో మాత్రం కాదు అని అభిజ్ఞవర్గాల వారి బోగట్టా.
రిటైర్ కాక ముందే అవమానాల పాలై చింతాక్రాంతుడై మనో వ్యధతో గుండెపగిలి ప్రేమకోసమై వలలో పడినే పాపం పసివాడు అన్నట్లు ఆ బంగార్రాజు అండ్ శునకరాజు ఉరఫ్ కనకరాజు ఒక రోజు తన కార్యాలయం కుర్చీలో ఆసీనుడై ఉండగానే హఠాత్తుగా గుండెపోటుతో ‘బాల్చీ’ తన్నేసి రంభా ఊర్వశులను వెతుక్కుంటూ స్వర్గారోహణ చేసాడట.
ఇంతటి ఘనమైన చరిత్రా నేపథ్యం కల్గిన ఆ వనితా శిఖామణి వనజగారు మీకు అసిస్టెంటు కావున జర భద్రం సారో” అని ఆ రామిరెడ్డి ‘జర భద్రం కొడుకో’ లెవల్లో స్వామిని హెచ్చరించి హితవు చెప్పాడు.
కొద్ది రోజుల తర్వాత రామిరెడ్డి హెచ్చరించినట్లే అయ్యింది.
సంధ్యావందనం చేయటానికి ఒక సాధుపుంగవుడు నది నీళ్లలో దిగి నీళ్లను దోసిలిలో పట్టటానికి సిద్దం కాగా పాపం ఒక తేలు రక్షించండి, రక్షించండి అని ఆ ప్రవాహంలో కొట్టుకపోతూ సహాయం కోసం అరుస్తున్నదట. జాలి తలచి ఆ సాధువు ఆ తేలును జాగ్రత్తగా తన దోసిలిలో పట్టి ఒడ్డుమీద దయతో వదిలాడట. అది పోతూపోతూ ఆ మునిపుంగవుని చిటికెన వేలును కసుక్కున కుట్టిందట.
“ఇదేంది ఇట్లా కాటేసినవు. కృతజ్ఞత అయినా చెప్పకుండా” అన్నాడట సాధువు.
“రక్షించటం నీ స్వభావం. కుట్టటం నా స్వభావం” అని కన్ను కొట్టి వెక్కిరించి ప్రక్కనే ఉన్న ఒక తొర్రలోకి ఆ వృశ్చిక రాణి ఎత్తిన తోక వయ్యారంగ ఊపుతూ తుర్రున మాయమైందట. ఆ వృశ్చికమే ఈ జన్మలో వనజాగా జన్మించిందని స్వామికి ఒక రోజు స్పష్టంగా తెలిసి పోయింది. అదేలయనగా..
పెద్దపెద్ద బడా వ్యాపారస్తులందరూ లక్షల రూపాయల పన్నులను చెక్కుల ద్వారా చెల్లిస్తారు. ఆ చెక్కులను బ్యాంకులకు ప్రజెంట్ చేస్తేనే అవి రియలైజ్ అయ్యి ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఆ పని వనజ చేయాలి. ఆమె చెక్ రిజిస్టరులో అవన్నీ వచ్చినట్లు, నెలనెలా టార్గెట్లు రీచ్ అవుతున్నట్లు స్వామికి చూపించేది. కాని చెక్స్ రియలైజేషన్‌లో బ్యాంక్ చాలాన్స్ ఎంట్రీ చేసిన రిజిస్టర్‌ను చూపించేది కాదు. ఆ పుణ్యకార్యం చేస్తున్నందుకు ప్రతి నెలా డీలర్లు ఆమెకు ‘ఆడపడుచు కట్నం’ అందించేవారు. ప్రభుత్వ రెవెన్యూ సరిగ్గానే వస్తుందని స్వామి నిశ్చింతగా ఉన్నాడు. ఒకనాడు పై పీఠాధిపతి ఫోను చేసి ప్రతి నెలా రెవెన్యూ పడిపోతుందని, టార్గెట్లు రావటం లేదని స్వామికి గట్టిగా అక్షింతలు వేసి ఆ చెక్కులు వాటి రిజిస్టర్లు తీసుకుని ఆఘమేఘాల మీద హెడ్డాఫీసుకు తరలి రమ్మని హుకూం జారీ చేసాడు.
స్వామికి చెమటలు పట్టాయి. కాలింగ్ బెల్ కొట్టగా వచ్చిన అటెండరుకు వనజను ప్రవేశపెట్టమని పురమాయించాడు. “ఆమె ఈ రోజు రాలేదు సార్” అన్నడు. స్వామి ఇవతలికి హాలులోకి వచ్చి ఈ రోజు వనజ రాలేదా అని హెడ్క్లర్కును అడిగాడు.
“వరలక్ష్మీ వ్రతం అని ఆమె ఈరోజు లీవు పెట్టింది సార్” అన్నాడతను.
రిజిస్టర్లన్నీ ఆమె అల్మారాలో ఉంటాయి. దానికి తాళం వేసి ఉంది. చచ్చీ చెడి ఆమె డ్రాయర్ సొరుగు వెదికితే ఆ తాళం చెవి దొరికింది. బీరువా తెరవగానే ఒక మూలన బ్యాంకుకు ప్రజెంట్ చేయకుండా దాచి పెట్టిన ‘చెక్కుల కట్ట’ దొరికింది. అవన్నీ లక్షల ఆదాయం వచ్చే చెక్కులు. దొంగ వ్యాపారులతో కుమ్మకై, లాలూచీ పడి వాటిని నెల అయిన తర్వాత చాలా లేటుగా బ్యాంకులకు ప్రజెంట్ చేస్తున్న గూడుపుఠాణీ తెలిసిపోయింది.
స్వామికి బిపి వచ్చి కళ్లు తిరిగినంత పని అయ్యింది. హతవిధీ! ‘వృశ్చికం, వృశ్చికమే కదా’ అనుకున్నాడు.
ఆ చెక్కులను ఇంకా రిజిస్టర్లన్నీ తీసుకుని హెడ్డాఫీసుకు వెళ్లాడు. పెద్ద బాసు గారిని కలుసుకుని ఆ సాక్ష్యాలన్నీ ఆయన దివ్య సముఖానికి సమర్పించాడు. ఆయన అవన్నీ చాలా తీరికగా ఓపికగా పరిశీలించి పెద్ద నిట్టూర్పు విడిచి “ఆ బిచ్ గురించి నాకు కూడా తెలుసు” అన్నాడు.
స్వామికి ధైర్యం వచ్చింది.
“సార్ ఆమెను ఆ సీటు నుండి, అసలు ఆ ఆఫీసు నుండే ట్రాన్స్ఫర్ చేస్తారా లేక నన్ను లాంగ్ లీవ్‌లో వెళ్లమంటారా? దయచేసి చెప్పండి” అని వినయంగానే ‘దమ్కీ’ ఇచ్చాడు. అతనిలో పాత స్వామి ఇంకా బ్రతికే ఉన్నాడు.
ఆ ముక్కుసూటి తనానికి ఆయన ఒక్క క్షణం నివ్వెరపోయి తర్వాత నిశితంగా చూస్తూ “ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. మీరు వెళ్లి ప్రశాంతంగా పని చూసుకోండి” అని హామీ ఇచ్చాడు.
స్వామి తెల్లారి ఆఫీసుకు వెళ్లే సరికి అంతా హల్చల్గా ఉంది. స్టాఫ్ అంతా భయభక్తులతో గుడ్మార్నింగులు, నమస్కారాలు చెప్పారు. ఏదో విశేషం ఉంది అని స్వామి అనుకొంటుండగా రామిరెడ్డి వచ్చి నవ్వుకుంటూ “సార్ మీరు చిన్నోళ్లు కాదు” అన్నాడు. “ఏమయ్యింది రెడ్డి” అని అడిగాడు స్వామి.
“వనజను అన్టిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకూ సస్పెండ్ చేసారు. పైగా ఆమె మీద పెద్ద చార్జిషీట్ కూడా పెట్టారు. పోలీసు కేసు కూడా పెడ్తరేమో” అన్నాడు. ఆ దెబ్బతో స్వామి హవా డిపార్ట్మెంట్లో పైలాయించింది. పాపం వరలక్ష్మిపూజా మహాత్యం వనజను రక్షించలేక పోయింది.
మళ్లీ కొన్ని రోజుల తర్వాత మరో ముష్కరుడి తోక కూడా వాడికే అతాపతా తెలియకుండా నీటుగా కత్తిరించి సున్నం పెట్టి ఇంటికి పంపించాడు.
ఆ ముష్కరుడి పేరు ముజీబు. ఆ ముజీబు పేరుకే చిన్న గుమాస్తా కాని చాలా ఆడంబరంగా అట్టహాసంగా కనిపిస్తాడు. ఎడమ చేతికి బంగారు గొలుసు గల స్విస్ గడియారమూ, కుడి చూపుడు వేలికి నవరత్నాలు పొదిగించిన ఇరవైనాలుగు క్యారట్ల బంగారంతో చేసిన భారీ ఉంగరమూ అదియును గాక మధ్యవేలికి అజ్మీర్ ఖ్వాజా గరీబ్ నవాజ్ షరీఫ్ దర్గాను సందర్శించి తీసుకొచ్చిన ఆకుపచ్చ నీలం రాయి పొదిగిన మరో సువర్ణపు ఉంగరాన్ని ధరించిన వాడై, అదియునూ తృప్తిపొందక గోల్టు ఫ్రేముగల సులోచనాలు, మెడలో బాగా వజన్ కల్గిన ఓ పసిడి గొలుసుతో పాటు సదా అనగా ఎల్లప్పుడూ లేదా హమేషా క్రొత్తక్రొత్త ఖడక్ ఖడక్ చలువ చేసిన సఫారీ దుస్తులను ధరించి ఆ స్థాయికి తగ్గని తళతళ మెరిసే నల్లని బాటా బూట్లు తొడిగిన వాడై దుబాయి నవాబు షేక్ సో అండ్ సో అబ్దుల్లా గారి చిన్న తమ్ముడిలా నిరంతరం ‘చౌధ్వీకా చాంద్’లా వెలిగి పోతుంటాడు. అతను రాసుకుని, పూసుకుని, అద్దుకుని వచ్చిన దుబాయి చమేలీ అత్తరుల పరిమళాలతో ఆ కార్యాలయం గుభాళించి గుమ్మెత్తిపోయి, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వాడికి ఒక స్వంత ఎసికారు ఇంటి దగ్గర వున్నా లోకుల పాపపు కళ్లకు భయపడి పాపం ఆ లోకభీతి గల సర్కారీ సేవకుడు కొత్త హీరో హోండా మీద మాత్రమే ఆఫీసుకు వస్తుంటాడు.
ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే కొన్ని డిపార్ట్మెంటులలో అటెండర్లు, చిరుచిరు చిన్న గుమస్తాలు ధగధగలాడే దుస్తులు ధరించి శ్రీవారి కన్నా ముందు ఫోటోకాల్ ప్రకారం నడుస్తుంటే వెనక సాదాసీదాగా సింపుల్ డ్రెస్సులలో ఉన్న ఆఫీసర్లను అటెండర్లనీ ముందున్న అటెండర్లే ఆఫీసర్లనుకుని భ్రమపడి వారికే వ్యాపారులు సలాములు, నమస్కారాలు సమర్పించటం కద్దు. దేవుడి కన్నా పూజారుల ‘హవా’ ఎక్కువ కదా!
స్వామి ఖర్మకొద్దీ జనాబ్ ముజిబుద్దీన్ సాహెబ్ స్వామి దగ్గర రిజిస్ట్రేషన్ క్లర్కుగా పని చేస్తున్నాడు. కొత్తగా వ్యాపారాలను, కార్ఖానాలను ప్రారంభించే వారు రిజిస్ట్రేషన్ నంబరు కోసం ధరఖాస్తులు సబ్మిట్ చేయాలి. అప్పుడు స్వామి వారి పూర్వపరాల వివరాలన్నీ సేకరించి, స్థిరాస్తి వివరాల డాక్యుమెంట్ల జిరాక్సు కాపీలు తీసుకుని, వారికి బాగా తెలుసున్న ఇద్దరు వ్యాపారస్తులనుండి ఐదువందల రూపాయల స్టాంపు పేపరు మీద జమానతులు తీసుకుని, సదరు డీలర్ దగ్గర పెద్ద మొత్తం ఐదు సం॥ల ఫిక్స్డ్ డిపాజిట్ డాక్యుమెంట్లు ప్రభుత్వం పేర తీసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు నంబరుతో సహా ఇవ్వాలి. అదొక సుదీర్ఘ తతంగం.
లేకపోతే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన దొంగ వ్యాపారులు లక్షలు కోట్ల రూపాయలతో బిజినెస్సులు చేసి ఒక్క పైసా టాక్సు కట్టకుండా మరో రాష్ట్రానికి ఉడాయించకుండా పరారీ కాకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. మొదట పన్నెండు నెలలు వారి మీద నిఘా పెట్టి ‘ట్రయల్ రిజిస్టరు’ ఓపెన్ చేసి ప్రతి నెలా టాక్సులు టంచన్‌గా కడుతున్నారా లేదా అని ఓ కన్నేసి పెట్టాలి. లాకప్‌లో ఉన్న దొంగ పారిపోకుండా పోలీసులు కాపలా కాసినట్లు.
ఈ సందర్భంలో ఇరువర్గాల మధ్య ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం తెరచాటున జరగటం సర్వసాధారణం లేదా అతి మామూలు సంగతి. వ్యాపారులు, ఉద్యోగుల సంబంధం పాన్ సుపారీ లాంటిది.
ఆ లావాదేవీలకు దూరంగా ఉంటూ, తన విద్యుక్త ధర్మం తాను నిర్వహిస్తున్న స్వామికి చాలా ఆలస్యంగా ఆ కాలాంతకుడైన ముజీబు ఆ కొత్త డీలర్ల వద్దకు వెళ్లి మా ఆఫీసరు నన్ను దూతగా పంపాడని చెప్పి నొప్పించకుండా వొప్పించి తన వాటానే గాక ఆఫీసరు వాటా కూడా తనే జేబులో వేసుకుని టింగురంగా అని బజారులలో చక్కర్లు కొడుతున్నాడని సమాచారం అంది స్వామికి ఒళ్లు మండింది. తన పేరు వాడుకుని లంచాలు దండుకుంటున్నందుకు. అప్పుడు స్వామి ఇద్దరు ముగ్గురు కొత్త వ్యాపారస్థులను పిలిపించి నిజం చెప్పమని లేకపోతే రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేస్తా అని బెదిరించాడు. వారు ఒప్పుకుని ఎంత మొత్తం ఇచ్చారో కూడా ఉన్నదున్నట్లు చెప్పారు. తనూ కొద్దిమంది దగ్గరికి వెళ్లి రహస్యంగా మరికొంత సమాచారం సేకరించాడు. అదంతా ఒక లిస్టు తయారు చేసాడు. వారి వారి పేర్లు, వ్యాపార సంస్థల స్టాంపులు సంతకాలు కూడా వేయించుకున్నాడు.
ఆ తర్వాత అతని సర్వీసు రిజిస్టర్ తెప్పించాడు. అతని పదేళ్ల సర్వీసులో రెండుసార్లు హస్తలాఘవానికి అనగా హైద్రాబాద్ భాషలో ‘హాత్ కీ సఫాయీ’ వలన సస్పెండు అయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఏకంగా భార్యకు అనారోగ్యం, ఆమెకు ట్రీట్మెంటు సాకుతో ‘లాస్ ఆఫ్ పే’ లీవ్ మీద ఐదు సంవత్సరాలు లీవులో ఉన్నాడని కూడా తేటతెల్లంగా తెలిసింది.
ఒకరోజు లంచ్టైంలో రామిరెడ్డిని ఇరానీ హోటల్‌కు తీసికెళ్లి ఆ మాటా ఈ మాట మాట్లాడి చాలా అమాయకంగా, దయగా ముఖం పెట్టి “పాపం ముజీబు ఐదు సం॥లు జీతం లేకున్నా లీవ్ పెట్టిండు” అని అన్యాపదేశంగా ప్రస్తావించాడు.
స్వామి తెప్పించిన ‘బన్ మస్కాను’ చాలా ప్రియంగా, ఇష్టంగా ఆరగిస్తున్న రామిరెడ్డి తినటం ఆపి “వాడా వాడొక పెద్ద దొంగ సార్” అన్నాడు కండ్లు పెద్దగ చేసి.
“అదెట్ల?” అన్నాడు ఇంకా అమాయకంగా ముఖం పెట్టి.
“వాడి పెండ్లాంకు ఏ రోగమూ నొప్పి లేదు సార్. అది సలక్షణంగా ఏటేటా పిల్లల్ని కంటనే ఉంది. వీడు మతాచారం పేరు చెప్పి మరో రెండు నిఖాలు కూడా చేసుకున్నాడు.”
“మరి వాడు ఆ ఐదు సం॥లు ఇంట్ల ఉత్తగనే కూచున్నడా?”
“వాడు దిమాక్ లేని హౌలాగాడా సార్ ఇంట్ల కూచునేందుకు..”
“మరి?”
“భార్యకు అనారోగ్యం, ట్రీట్మెంటు ఇప్పించాలి. హెడ్‌క్వార్టర్స్ నుండి బయటికి వెళ్లే అనుమతి ఇప్పించమని ఒక్క తెల్ల కాగితం ముక్క మీద లీవు లెటరు రాసి సంతకం గీకి పారేసి వాడొక్కడే ఏకంగా ఈ దేశాన్నే వదిలి దుబాయికి చెక్కేసిండు.”
వచ్చిన చాయ చప్పరిస్తూ ఇంకా చెప్పటం సాగించాడు. వాడు అక్కడికి వెళ్లి ఆ ఐదు సం॥లు అకౌంటెంటుగా పని చేసి బోలెడంత సంపాదించి మళ్లీ ఇక్కడికి వచ్చి డ్యూటీలో చేరిండు. వచ్చేటప్పుడు స్మగుల్డ్ బంగారాన్ని కూడా తీసుకొచ్చాడు. ఆ దుబాయి డబ్బుతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం బినామీ పేర్లతో చేసి ఆ ముగ్గురు పెండ్లాలతో పాటు ఆ పెట్టుబడికి కూడా మళ్లీ మళ్లీ పిల్లల్ని పుట్టించి ఇంత ఎదిగాడు. వాడికి ఈ జీతం ‘బాల్ కే బరాబర్’ (వెంట్రుకతో సమానం). అంగ్రేజీలో కేరేజాట్, కేరేపిన్ అన్నమాట. అయినా కుక్కబుద్ది పోనిచ్చుకోక కుక్కలాగే బజార్ల పొంట తిరిగి కనబడ్డ పెంట అంతా నాకుతడు” అని ముగించాడు.
“పోనీలే వాడి సంగతి మనకెందుకు” అని స్వామి ఆ సంభాషణ తనకు ఇష్టం లేనట్టుగా ముగించి లేచాడు.
ఆ తర్వాత ఒక పెద్ద ఆకాశరామన్న అప్లికేషను రాసి అందులో అన్ని వివరాలు తెలిపి తను తయారు చేసిన డీలర్ల పేర్లు అడ్రసులు గల లిస్టు కూడా జత చేసి అవినీతి నిరోధక శాఖా వారికి అనగా ఏసీబీకి పోస్టులో పంపించాడు. సాధారణంగా ఆ శాఖలో పోలీసు వారే ఎక్కువగా పని చేస్తుంటారు. ఆ అప్లికేషన్ అందుకోగానే వారు డేగ కళ్లతో నిఘా పెట్టి రేచు కుక్కల్లా పరిగెత్తి అందరి వ్యాపారస్థుల వద్దకు వెళ్లి రహస్య సమాచార సేకరణ ప్రారంభించారు.
కొందరు చెప్పకుండా వెనకా ముందుకు ఊగిసలాడుతుంటే మీరు ఉన్నదున్నట్లు చెబితే మంచిది లేదా మీమీద కూడా లంచాలు ఇచ్చినందుకు కేసులు పెడతం అని బెదిరించారు. ఇక వారు నిజం కక్కక తప్పలేదు. కాని ప్రతి ఒక్కరు స్వామి అనే అధికారి తప్పు మాత్రం లేదు అతను ఎవరినీ పీడించడు సరికదా ఉల్టాగా మాకే చాయ్ తాగించి మర్యాదగా మాట్లాడి పని చేసి పెడతాడు అని క్లీన్ సర్టిఫికేట్లు ఇచ్చారు.
తదుపరి ఆ ఆ సదరు వ్యాపారులను కేసులలో ఇరికించి కిరికిరీలు పెట్టటం లేదు కావున వారి నుండి కొంత రొక్కం వసూలు చేసి తమ సహజ స్వభావం చూపించారు.
ఆ తర్వాత ఒక ఏసీబీ గూఢచారి వారం పదిరోజులు ముజీబును నీడలా వెంబడిరచి ఆదివారం సెలవు దినాలతో సహా వాడు ఎక్కడెక్కడికి వెళ్లుతున్నది ఎవరెవరిని కలుస్తున్నది వివరాలన్నీ చాలా రహస్యంగా సేకరించాడు.
వన్ ఫైన్ మార్నింగ్ ఆ ముజీబు అను దొంగ నవాబు గారు మూడో భార్య సమేతంగా కింగ్ సైజు బెడ్డు, సుతిమెత్తని పడకమీద రాత్రంతా కేళీ విలాసాల రత్యానంతరం కోడి కూసే వేళలో అలసి సొలసి పాపం సుఖ నిద్రలో ఉండగా ఇంకా సరిగ్గా తెలతెల వారకముందే, ముసిముసి చీకట్లు ఇంకా పూర్తిగా తొలగక ముందే, పక్షుల కిలకిలా రావాలు ఇంకా మొదలవ్వక ముందే, బహు క్రూరహృదయం గల ఏసీబీ అధికారుల గుంపు ఆ గృహంపై అకస్మాత్తుగా దాడి చేసారు. ఏక కాలంలో, అదే సమయంలో వాడి ముగ్గురు పెళ్లాల బంధుమిత్ర పరివారం మీద కూడా దాడులు జరిగాయి.
ఏతావాతా తేలిందేమంటే వాడి ఆదాయానికి కూడబెట్టిన ఆస్తులకు ఎక్కడా పొంతన లేదని వాడి ఆదాయం పాతాళంలో వుంటే ఆస్తులు మాత్రం ఆకాశహర్మ్యాలలో ఉన్నాయని కేసు ఫైలు చేసి వాడిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేటు గారు పదిహేను రోజుల రిమాండుకు ఆదేశాలిచ్చాడు.
పాపం ఆ ముజీబు రాత్రి నిద్రలో కట్టుకున్న గళ్లగళ్ల లుంగీతోనే ముఖమైనా కడగని పాచి పళ్లతోనే ‘అల్లా, అల్లా’ అనుకుంటూ ‘క్యా ఖయామత్ ఆయా’ అని వగచుకుంటూ చంచల్‌గూడ జైలుకు వెళ్లి చాలా రోజులు చింకి చాపమీద పడుకుని చిప్పకూడు తిన్నాడు.
ఆ మరునాడు అన్ని దినపత్రికలలో వాడి పేరు, ఊరు అరెస్టు వార్త ప్రచురించబడి వాడు అనుకోకుండా ప్రముఖుల జాబితాలో చేరిపోయాడు. పేపర్లలో పేరు రావటం మన లాంటి వారికి సాధ్యమా మరి!
అయితే వాడు వానపాము లాంటి వాడు. లేదా మిన్నాగు లాంటి వాడు. ఒక చోట నొక్కితే మరోచోట తలెత్తుతాడు. ఒక వకీలును సంప్రదించి వాడి సహాయంతో పదిహేనురోజుల రిమాండు పూర్తి కాకుండానే బెయిల్ సంపాదించి కొత్త కళతో మిసమిసలాడుతూ ఇంటికి వచ్చి దైవభక్తి కడుంగడు గల ఆ సచ్చా ముసల్మాన్, అల్లా కే బంధే, నమాజీ ఆద్మీ. ముగ్గురు బీవీలు వారి వారి పిల్లల సమేతంగా గుల్బర్గాలో వున్న ‘ఖాజా బందా నవాజ్ గేసు దరాజ్’ అను సూఫీ సాధువు దర్గా సందర్శనార్థం వెళ్లి అక్కడ ఒక వారం, పది రోజులు దైవచింతనలో మునిగి తేలీ పిమ్మట పవిత్ర శుక్రవారం నమాజుల అనంతరం ఆ ఇద్దరు పెళ్లాలకు ముగ్గురు పెళ్లాల సంతానపు బరువు బాధ్యతలు అప్పగించి ముచ్చటైన మూడో పెళ్లాం అను చక్కని చుక్కలాంటి చిన్న దానిని చంకలో ఇరికించుకుని ‘పాడు’ హైద్రాబాద్ ముఖం మళ్లీ చూడకుండానే గుల్బర్గా దాటి ముంబాయి నుండి దుబాయికి అరబ్ ఎమిరేట్స్ అను విలాసవంతమైన విమానంలో బహు సుఖంగా ఆకాశమార్గాన ఎగిరి పోయాడు కింగ్‌ఫిషర్ విజయమాల్యా లా.
ఎగిరి పోయిన కాలాంతకులు ఊరికే సోమరులుగా ఉండలేరు కదా వారు మన లాంటి సుఖజీవులూ బద్దకస్తులు గాక, కష్ట జీవులు గాన అనతి కాలంలోనే ‘దావూద్ ఇబ్రహీం’ అను సత్ప్రవర్తన, సచ్చీలుడైన ఒక అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తితో స్నేహమాచరించి మళ్లీ ఎటువంటి జాగు చేయకుండా త్వరలోనే ‘స్మగ్లింగు’ అనే పరమపవిత్రమైన దంధాను చేపట్టాడు.
ఆ తర్వాత కొంత కాలం పిమ్మట తన చక్కని చుక్కలాంటి చిన్న దానితో కలిసి ‘మక్కా’ను కూడా సందర్శించి, తరించి పొడుగైన గడ్డం పెంచి ‘హాజీ’గా మారాడు. గతంలో హాజీ మస్తాన్ అని ఒక పెద్ద స్మగ్లర్ ఉండేవాడు. బొంబాయిలో వాడిని ఎమెర్జన్సీ టైంలో ఇందిరమ్మ బొక్కలో వేసింది.
‘ఆఁ, ఏమడుగుతున్నారూ?
ఏసీబీ వారి కేసు ఏమయ్యిందని అడుగుతున్నారా? ‘హయ్యో హయ్యయ్యో’ పాఠకుల్లారా ఎంత అమాయకులండీ మీరు. పైగా సత్యమేవ జయతే అని కూడా అంటున్నారా? అనండి అనండి మంచిదే. అనటంలో తప్పేముంది? కాని ఏసీబీ వారు పాపం కొన్ని సం॥లు గౌరవనీయులైన ఆ ‘హాజీ’ ముజీబుగారి కోసం వేచి చూసి, చూసి, కన్నులు కాయలుగా కాచిపోయి, ఎట్టకేలకు ఆ వకీలుగారి సలహపై ‘ముజీబు అను వ్యక్తి కనబడటం లేదు. లేదా బహుషా చనిపోయి కూడా ఉండి ఉండవచ్చు’ అని పాము చావకుండా కర్ర విరగకుండా ఒక రిపోర్టు రాసి గౌరవనీయులైన కోర్టు వారికి మరియు సర్కారు వారికి కూడా సమర్పించి కొంత చేతులు తడుపుకుని అదే చేతులతో కేసుఫైలును మూసివేసి, ఏకంగా చేతులు కడుకున్నారు. ఆ ముక్కపట్టిన ఫైలు కాగితాలను ఇనుప బీరువాలో పెట్టగా అక్కడ ఉన్న చెదలు, బొద్దింకలు ప్రతి రోజు కొంతా కొంతా ఏంచక్కా భోంచేసి చివరికి తృప్తిగా త్రేన్చి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అయ్యాక ‘సర్కారు వారూ సుఖీభవ’ అని పెద్ద మనసుతో దీవించాయి. ఆగండాగండి! కథ ఇంకా కంచి దాకా రాలేదు పోలేదు. వకీలు గారి చాణక్యంతో, జప్తు చేసుకున్న ఆస్తులు కూడా చాలా భద్రముగా ముజీబుగారి ఇద్దరి భార్యలకు పువ్వుల్లో పెట్టి సదరు ఏసీబీ వారు అప్పగించారు. ఈ డీలింగులో వకీలు ద్వారా పెద్ద మొత్తం వారు కూడా స్వీకరించి తరించారు. అట్లా ‘సర్వేజనా సుఖినోభవంతు’ అయ్యింది.
జైహింద్ అన్నట్లు ‘హాజీ’ ముజీబు సీన్మా అట్లా ఏట్టకేలకు ముగిసింది.
చాలా కాలానికి రామిరెడ్డి రిటైర్ అయినంక ఒక చోట దావత్లో స్వామిని కలిసి ముసిముసి ముసలి నవ్వులతో “సారూ అది మీరేనా? అదే ముజీబు” అని అర్ధాంతరంగా ఆగిపోయాడు.
స్వామి ఏ జవాబు చెప్పకుండా ఓ చిర్నవ్వు చిద్విలాసంగా విసిరాడు.
‘నమజ్నే వాలే సమజ్ గయే’
***
అటు వనజా ఇటు ముజీబు ఇద్దరు నిష్క్రమించాక స్వామికి చాలా రిలీఫ్ అయ్యింది. విధి నిర్వహణలో కంటకాలు, ఆటంకాలు తొలగించుకుని ఒక మంచి క్లర్కును ఇవ్వమని బాసును రిక్వెస్టు చేద్దామని కమీషనర్ ఆఫీసుకు వెళ్లుతుంటే క్రింద ప్రాంగణంలో ఒక యువకుడు అతన్ని ఆపి
“నమస్తే సర్” అన్నడు.
“నమస్తే” అని ముందుకు కదలబోతుంటే
“నేను ఒకప్పుడు మీ స్టూడెంటును సర్” అన్నాడు.
స్వామి తెప్పరాల్లి “ఏ స్టూడెంటు? ఎక్కడ స్టూడెంటు” అన్నడు.
“న్యూసైన్స్ కాలేజీ సర్. మీరు మాకు బి.యె.లో పాఠాలు చెప్పారు.”
“ఓహో. అట్లనా” అన్నాడు అదేదో పురాజన్మలో పూర్వస్మృతిలాగ.
“మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు సర్” పట్టువదలని బేతాళుడు విక్రమార్కుడిని మరో ప్రశ్న అడిగాడు.
సంగతేందో స్వామి క్లుప్తంగా చెప్పాడు.
“అరెరె. రామ రామ. మీరు ఈ డిపార్ట్‌మెంటులోకి ఎందుకొచ్చారు సార్? నేను క్లర్కుగా ఇక్కడ చేరినందుకే ప్రతి దినం బాధపడుతుంట. మీరు చాలా మంచి వారు సార్. మంచి లెక్చరర్ సార్. ఎంత బాగా పాఠాలు చెప్పే వారో. మీ లాంటి వారు ఈ డిపార్ట్‌మెంటులోకి అసలు రాగూడదు సర్. మీరు లెక్చరర్‌గానే ఉండాలి’’ అని ఆ శిష్యపరమాణువు ఏమేమో భక్తితో, ప్రేమతో గడగడా మాట్లాడాడు.
స్వామి ఏడవలేక ఒక చిర్నవ్వు నవ్వి ముందుకు తనను తాను ఈడ్చుకుంటూ కదిలాడు.
ఇంతకు ముందు కూడా ఇట్లాంటి సంఘటననే ఒకసారి షాపింగుమాల్లో జరిగింది. ఒక యువతి దగ్గరకొచ్చి నమస్తే సర్ అన్నది. త్వరగానే గుర్తించాడు. లలిత ఒకప్పుడు తన పాత స్టూడెంటు చాలా క్లెవర్‌గా ఉండేది.
“ఏం చేస్తున్నవ్ లలితా” అని ఆప్యాయంగా అడిగాడు.
“బి.యె. అయిపోగానే బియెడ్ చేసి గవర్నమెంటు స్కూల్లో సోషల్ టీచర్‌గా పని చేస్తున్న సర్. మీరింకా అదే కాలేజీలో పని చేస్తున్నారా లేక యూనివర్సిటీలో జాయిన్ అయ్యారా” అని ప్రశ్నించింది.
స్వామి మనస్సు చివుక్కుమంది. సంజాయిషీ ఇస్తున్నట్లు క్లుప్తంగా ఏదో చెప్పాడు.
“వెరీ సారీ సర్” అని ముఖం బాధగా పెట్టి హఠాత్తుగా “సర్ అప్ఘనిస్తాన్ సమస్య ఎంటిది సార్?” అని కుతూహలంగా మళ్లీ పాత విద్యార్థిలాగ ప్రశ్న అడిగి జవాబు కోసం ఎదురు చూస్తూ నిలబడిరది.
“సారీ లలితా నాకు ఆఫీసు పని భారంతో ఈ మధ్య నేను పేపరు కూడా సరిగ్గా చదవటం లేదు. నాకు కూడా తెలియదు” అని చెప్పి తప్పించుకోబోయాడు.
“సార్. సార్. సార్. మీరెప్పుడు నాకు తెలియదు అన్న మాట అనొద్దు సార్. ఆ మాట, అటువంటి మాట మీ నోటి నుండి ఎప్పుడూ రావొద్దు సార్. మా సార్‌కు అన్నీ తెలుసు అని మేం మా జీవితాంతం అనుకోవాలి. లేకపోతే తెలియదు అన్నమాట విని మేం భరించలేం సార్” అని కళ్ల తడితో భావోద్వేగంగా మాట్లాడి “వెళ్లొస్తాను సర్” అని భక్తిగా, రెండు చేతులు జోడిరచి నమస్కరించి భారంగా వెను తిరిగి నిష్క్రమించింది.
ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా స్వామి మనసు మళ్లీ పచ్చిపుండులా మారి సలపరిస్తుంది.
వెళ్లి పెద్దబాసుగారిని దర్శించుకుని ‘విన్నపాలు వినవలెనని’ మరి మరీ రిక్వెస్టు చేసాడు. “సరే స్వామీ మీకు ఒక మంచి క్లర్కును పంపిస్తాను” అని ఆయన హామీ ఇచ్చాడు.
అట్లా వచ్చిన వాడే ‘విలియం కేరీ’.
(మళ్ళీ కలుద్దాం)
పరవస్తు లోకేశ్వర్ 10 జూన్ 1951 నాడు హైదరాబాద్ పాత నగరంలో జన్మించారు. కథా నవలా రచయిత, అనువాదకులు. ట్రావెల్ రైటర్. యాత్రా కథనాల రచనలో అందెవేసిన చెయ్యి. పరదేశీగా దేశదేశాల సరిహద్దులలో, దారి కాని దారులలో ఒంటరి బాటసారిగా తిరగాలనేది రచయిత అంతర్జ్వాల. ప్రపంచ యాత్రికుడు పండిత్ మహామహోపాధ్యాయ్ పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ ప్రభావం తనపై చాలా ఉందని రచయిత అంటారు.
సలాం హైదరాబాద్, సిల్కురూట్‌లో సాహస యాత్ర, ఒక హిజ్రాకథ (సుప్రసిద్ధ హిందీ, ఉర్దూ అనువాద కథలు), ఛత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర, ఆనాటి జ్ఞాపకాలు, తెలంగాణ సంభాషణ, ప్రపంచ పాదయాత్రికుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర, 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు, నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు, ఎవరిది ఈ హైద్రాబాద్?, హైద్రాబాద్ జనజీవితంలో ఉర్దూ సామెతలు, కల్లోల కలల కాలం వంటి పుస్తకాలు వెలువరించారు. ‘సలాం హైద్రాబాద్’ కు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం లభించింది.
హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది చివరిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది.