Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-5

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[ఎన్నో ప్రయత్నాలు చేసి నగరం నడిబొడ్డున ఆబిడ్స్‌లో ఉన్న ఓ ఇంగ్లీషు కాన్వెంటులో కూతురికి సీటు సాధిస్తాడు స్వామి. పాప బడికి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో గన్‌ఫౌండ్రీ ఏరియాలో మూడు గదుల ఇల్లు తీసుకుంటాడు. ఆంజల్యకి నెలలు నిండుతాయి. ఆఫీసులో ట్రెయినింగు దాదాపుగా చివరికి వచ్చేస్తుంది. స్టాప్ అందరి దగ్గరా కూర్చుని అన్ని పనులు నేర్చుకుంటాడు స్వామి. డిపార్టుమెంటును మోసం చేయడానికి ప్రయత్నించే వ్యాపారాల ఆట ఎలా కట్టించాలో తెలుసుకుంటాడు. లంచాలు మరిగిన సిబ్బంది ఎలా ధనవంతులవుతున్నారో గమనిస్తాడు. ఓ రోజు ఉదయం నిద లేచేసరికి రాజీవ్‍గాంధీ హత్యకు గురయ్యాడన్న వార్త తెలుస్తుంది. చాలా బాధపడతాడు స్వామి. కొన్ని రోజులకి స్వామికి కొడుకు పుడతాడు. రాజా అని పేరు పెట్టుకుంటారు. పాతబస్తీలోని ఇల్లు మూడు లక్షలకి అమ్ముడుపోతుంది. ఓ రోజు కుటుంబ సభ్యులంతా కూర్చుని ఉండగా, తను సొంతింటో చనిపోవాలని కోరుకుంటున్నట్లు స్వామి తల్లి చెబుతుంది. అక్క, తమ్ముళ్ళు, వచ్చిన మూడు లక్షలను స్వామినే ఉంచుకోమని చెప్పి, ఆ డబ్బుతో స్వామిని సొంత ఇల్లు కొనమంటారు. సరేననక తప్పదు స్వామికి. దేశ రాజకీయాలలో మార్పులు వస్తాయి. విపిసింగ్ మండల్ కమీషన్ రిపోర్టును అమలు చేస్తామని ప్రకటించగానే, అద్వాని రామరథయాత్ర ప్రారంభిస్తున్నానని ప్రకటిస్తాడు. ‘మండల్మందిర్’ సమస్య ఉద్రిక్తతలకు దారితీసి దేశ ప్రజలను నిట్టనిలువునా చీల్చేస్తుంది. ఆఫీసుతో తన బాసు కోడండపాణి చేసే వెలిలిచేష్టలు, ఆఫీసు బయట నడుపుతున్న రాసలీలలు స్వామి దృష్టికి వస్తాయి. అవన్నీ బహిరంగ రహస్యాలే. స్వామి తినడు, తాగడు, తిరగడు అని ఆయన హేళన చేస్తాడు. స్వామి పట్టించుకోడు. – ఇక చదవండి.]

అధ్యాయం-9: గేహమొక నందనము

“ఇల్లు ఎప్పుడు కొంటవురా” అని అమ్మ పోరు పెడుతుంది. ఇగ నేను ఏటికో, కాటికో అని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతుంది.

“ఇల్లు కొనాలంటే మాటలానే అమ్మా. బజారుకుపోయి బట్టలు కొనుక్కున్నంత ఈజీనా” అని విసుక్కునే వాడు.

నిజానికి ఆఫీసు పనులతో, అలసటతో స్వామికి సంక గోక్కునే పురుసత్‌ కూడా లేదు. పైగా శిక్షణా కాలం ఐపోయి కొత్త ఆఫీసుకు పోగానే కొండంత పని భారం అతని మీద పడ్డది. సహాయకులుగా ఇద్దరు, ముగ్గురు క్లర్కులు ఒకరిద్దరు అటెండర్లు ఉన్నా వారి తీరే వేరు. ఎవరికి వారే యమునాతీరే. గవర్నమెంటుకు వారందరూ అల్లుళ్లు అన్నట్లు ధీమాగా ఉండేవారు. తనొక్కడే ఆ గొడ్డు చాకిరీ అంతా చేసుకోవాలి. పైగా పనులు కావటం లేదని పై నుండి అధికారుల షంటింగులు. సర్కారీ ధప్తర్‌లలో గాడిదా, గుర్రం రెండూ సమానమే. ఆ డిపార్ట్‌మెంటులో ఆదివారాలు కూడా ఆఫీసులకు వచ్చి పని చేసుకుంటారు. స్వామి కూడా ఈడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అప్పుడప్పుడూ ఆదివారం కొలువుకు అటెండ్‌ అయ్యేవాడు. లెక్చరర్‌ జీవితం గుర్తొచ్చి ప్రస్తుతం బత్రుకు మీద విరక్తి కలిగేది.

అయితే ఒక పెద్ద రిలీఫ్‌ ‘రాజా’, ఆంజల్య, స్వామి, సమతలు కలిసి పెట్టుకున్న ముద్దు పేరు. నిజంగా రాజాబాబే. దట్టంగా ఉన్న నల్లటి ఉంగరాల జుట్టు. మెరిసే నల్లటి కండ్లు. పాలు, తేనె, కుంకుమ పువ్వు కొన్ని ఎర్ర గులాబీ రేకులు కలగలిపి మేళవించిన ముఖమూ, ఒంటిరంగూ, బంగారంలా మెరిసిపోతూ వుండేవాడు. వాడికి రెండు సంవత్సరాలు దాటినవేమో! స్వామి అలసటతో కొంచెం చీకటి పడ్డాక ఇంటికి రాగానే వాడు ఎర్రని లేత పెదాల కేరింతలతో నవ్వుతూ రెండు చేతులు చాచేవాడు. స్వామి ఎత్తుకోగానే తన రెండు లేత చేతులు డాడీ మెడ చుట్టూ గట్టిగా బిగించి కౌగలించేవాడు.

దాంతో స్వామి అలసట చికాకుల్ని మరిచి కొడుకుతోనే లోకమన్నట్లు ఉండేవాడు.

అంత చిన్న లేత వయస్సులనే వాడు మ్యూజిక్‌కు ఆకర్షితుడయ్యేవాడు. శిశుర్వేది అన్నట్లు టి.వి.లో తెలుగు వార్తల స్టార్టింగ్‌ సౌండ్‌ వచ్చినా ఉదయం సుప్రభాత సమయాన వందేమాతర గీతం వచ్చినా వాడు హడావుడిగా అంబాడుతూ టి.వి. ఉన్న గదిలకు వచ్చి దానివైపు ఆశ్చర్యంగా చూసేవాడు. ఇక టేపురికార్డర్‌ సరేసరి. దాన్ని క్రింద నేలమీద పెట్టమని డిమాండ్‌ చేసేవాడు. విన్నంతసేపు విని ఆ తర్వాత ఆ బటన్లన్నీ నొక్కి ఆ క్యాసెట్‌ ఇవతలికి తీసి దానిలోని ఫిల్మ్‌ లాంటి పల్చటి వైరును పీకి, లాగి దాన్ని కుప్పలు పెట్టేవాడు. వాడికి అదొక వినోదం, సరదా. ఆంజల్య పనికి రాని పాత క్యాసెట్లన్నీ వాడి ముందు పెట్టేది. వాడు తీరికగా ఆ వైర్లన్నీ పీకి పీకి కుప్పలుగా తన చుట్టూ పరచుకుని ఆడి చివరికి కాళ్లు చేతుల్ని ఆ వైర్లతో చుట్టుకుని వాటిని వదలించుకోలేక చికాకు పడేవాడు. కుక్కర్‌ మూతను నేలపై రుద్దుతూ ఆ చప్పుడుకు ఆనందిస్తూ త్వరత్వరగా అంబాడటం వాడికి చాలా ఇష్టమైన వినోదం.

అట్లా ఆ ముగ్గురి జీవితాలలో ఆ పసిడివాడు పున్నమి వెన్నెల చందురుడిలా ప్రవేశించి వెన్నెలను వెదజల్లాడు. సమత తన దోస్తులను తీసుకొచ్చి వారందరికీ తన తమ్ముడిని గొప్పగా చూపించేది. వాళ్లూ సంబరపడేవాళ్లు.

ఇల్లు, ఇల్లు అనే అమ్మపోరు పడలేక ఒకరోజు ఆలుమగలు కలిసి సుదీర్ఘంగా ఆలోచించారు. వారి వద్ద ఉన్న మూడు లక్షలకు ఏ స్థలం రాదు. ఒక వేళ చిన్నది వచ్చినా నగరం నడిబొడ్డుకు చాలా దూరంగా ఉంటది. స్థలం కొన్నా ఇల్లు కట్టుకునే తీరికా, ఓపికా ఇద్దరికీ లేవు. తనకు ఆఫీసూ ఆమెకు పిల్లల పెంపకం, పోషణలతోనే సరిపోతది. సిటీ మధ్యలో ఉంటే అన్నింటికీ సౌకర్యంగా ఉంటది. కావున పాత ఇల్లైనా ఫరవాలేదు కాస్తా దాగుదోగులు చేయించుకొని సున్నాలు, రంగులు వేయించుకుంటే సరిపోతుందని ఇద్దరూ నిర్ణయానికి వచ్చారు. తెలిసిన నలుగురికి కాస్తా చిన్న బడ్జెట్‌లో ఒక ఇండిపెండెంట్‌ ఇల్లు చూడమని చెప్పాడు.

అదృష్టం కొద్దీ త్వరలోనే మెహదీపట్నంలో ఒక మంచి ఇల్లు అప్పుడే కొత్తగా కట్టింది చూపెట్టాడు ఒక మిత్రుడు. ఒక బిల్డర్‌ రెండు బెడ్‌ రూంల ఇల్లు 150 గజాలలో కార్‌ పార్కింగ్‌ తప్ప మరి దేనికి స్థలం వదలకుండా విశాలమైన రూములతో అందంగా, గట్టిగా కట్టాడు. కాలనీ పరిసరాలు కూడా బాగున్నాయి. ఆ కాలనీ చాలా ఎత్తు ప్రాంతంలో ఉంది. విశాలమైన రోడ్డుకు రెండువైపులా గుబురుగా ఉన్న చెట్లు. అందులో కొన్ని వేపచెట్లు. ఇంటి ముందు నిలబడితే దూరంగా కనబడుతున్న గోల్కొండ కోట. హైద్రాబాదీ ప్రేమికుడైన స్వామికి దానిని తదేకంగా చూస్తుంటే ఒక అలౌకిక ఆనందం కలిగేది. అన్ని ఇళ్లకన్నా స్వామి చూసిన ఇల్లు ముందు భాగం ఇంకాస్తా ఎత్తున ఉండి ఆ గేటుకిరువైపులా జారుబండలా ఏటవాలుగా ఉన్న వాకిలి. మధ్యలో కొన్ని మెట్లు. అయితే ఆ ఇల్లు దక్షిణం వైపు ఉంది. ఏ విశ్వాసాలు పట్టింపులు లేని వారిద్దరూ ఆ వాస్తును పట్టించుకోలేదు. ఇంటి వెనక ఉన్న ఒక చిన్న గుట్ట దానిమీద కుతుబ్‌షాహీల కాలం నాటి చిన్న మసీదు కూడా ఆకర్షణీయంగా అనిపించింది.

వారిద్దరూ పిల్లలతో సహా ఆ ఇల్లు చూడగానే వెంటనే నచ్చింది. గేటు దాటి హాలు లోపలికి కాలుపెట్టగానే తల్లి ఒడిలో ఉన్న రాజా ఆ రంగుల ఇల్లుకు సంతోషించి గబాలున క్రిందికి దిగి ఆ కొత్త బండల మీద అటుఇటు పరిగెత్తాడు. సమతకైతే నేల మీద కాలు నిలవలేదు. ఇద్దరు పిల్లలు వాళ్ల కేరింతలు, సంతోషాలతో తమ అంగీకారాన్ని తెలిపారు. ప్రథమ వీక్షణంలోనే ఆంజల్యకూ నచ్చింది. స్వామికి నెత్తిమీదున్న కొండంత బరువు తొలిగిపోయింది. తర్వాత అమ్మా, అక్కా, బావ, ఆంజల్య అమ్మా, తమ్ముళ్లు అందరూ చూసి ఆమోద ముద్ర వేసారు. బిల్డర్‌ రేటు చెప్పగానే.. ‘హాథీ నికల్‌ గయా లేకిన్‌ దూమ్‌ అటక్‌ గయా’ అన్నట్లు అయ్యింది ఆ దంపతుల పరిస్థితి. వారి వద్ద ఉన్నది మూడు లక్షలు. రిజిస్ట్రేషన్‌తో అంతా కలిపి ఐదు చిల్లర. అప్పుడు పెద్ద డోలయమాన పరిస్థితిలో పడ్డారు. కింకర్తవ్యం, కింకర్తవ్యం అని ఇద్దరూ చేతులు పిసుక్కుంటుంటే..

బావ ధైర్యం చెప్పాడు. “అరే వారీ! అప్పు రెండు విధాలు. మంచి అప్పు, చెడు అప్పు. ఆస్తులు కొనుక్కోవటం కోసం చేసేది మంచి అప్పు. ఆడంబరాలూ విలాసాల కోసం చేసేది చెడు అప్పు. ఇప్పటికే ఇండ్లు, స్థలాల ధరలూ బాగా పెరుగుతున్నయి. మరీ ప్రత్యేకంగా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినంక ఇండ్ల ధరలు, స్థలాల ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు నీ వయస్సు నలభై. ఇక ముందు ముందు నువ్వు కొనలేవు. జీవితాంతం కిరాయి ఇండ్లల్ల పీకులాటలు తిప్పలు పడుతూ బ్రతకాలి సుమా” అని ఆయన భయపెట్టాడు.

అమ్మతో సహా అందరూ కొనవలసిందే అని ఒత్తిడి చేసారు. పెద్ద తమ్ముడు జ్ఞాని కూడా అన్నయ్యా ప్యూచర్‌లో నీకు దగ్గరలో పెద్దపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రాబోతున్నాయి. అప్పుడు నీ ఇంటి విలువ పెరుగుతుందని జోస్యం చెప్పాడు.

అప్పటికే చాలా కాలం నుండి సీనియర్‌ టీచర్‌గా పని చేస్తూ వచ్చిన అక్క ఆ క్లిష్టపరిస్థితులలో బడుగుదేశాలను ఆదుకునే ప్రపంచ బ్యాంకులా ముందుకొచ్చింది. ఒరేయ్‌ నేను నీకు చేబదులుగా ఒక లక్ష ఇస్తాను. నువ్వు మాత్రం ప్రతి నెలా నాకు టంచన్‌గా నెలకు ఐదు వేలు కట్టాలి అన్నది.

హమ్మయ్య ఒక గుర్రం మూడు నాడాలు దొరికాయి. ఇంకొ నాడా దొరికితే గుర్రం ఎక్కి ప్రయాణం సాగించ వచ్చని పాతకాలం ఇంగ్లీషు సామెత గుర్తుకొచ్చింది.

చిట్లు నడిపే ఒక తెలిసిన మనిషి దగ్గరికి వెళ్లాడు. సంగతి చెబితే లక్ష రూపాయల చీటీ మొదట నీకే ఇస్తాను. ఎటువంటి జమానతులు అవసరం లేదు కాని ప్రతి నెలా కిస్తులు మాత్రం తప్పని సరిగా కట్టాలి సుమా అని హెచ్చరించాడు.

‘ఎప్పుడూ ఉత్త చేతుల భిక్షపతి’ ఐన స్వామి తన చేతిలో ఒక్క రూపాయి లేకున్న ఒక ఇంటివాడు అయ్యాడు. నలుగురు నాలుగు చేతులు అందించినారు.

అమ్మ సంతోషానికి అంతులేదు. ఒకప్పుడు అమ్మను చాలా విషయాలలో బాధపెట్టిన తను చివరి దశలో ఆమె కోరిక నెరవేర్చానని తృప్తి చెందాడు.

ఉన్నంతలో నూతన గృహప్రవేశం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో బాగానే జరిగింది. వేణు ఫ్రెండ్‌ గోవిందు హాబీ రీత్యా మంచి ఫోటోగ్రాఫర్‌. అతను బోలెడన్ని ఫోటోలు అడగకుండానే తన ఆనందం కోసం తీసాడు. అందరి సాపాట్లు అయినంక అందరూ విశ్రాంతిగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో మిత్రుడు వేణు సందర్బోచితంగా ఒక కవిత వినిపించాడు. ఆ కవిత ఇట్లా సాగింది.

“గేహమొక నందనము
స్నేహ వద్రక్షకము
ఊహ ద్రాక్షాలతలు
ప్రాకించు పరిసరము.

శీతాతపాలు వ
ర్షాల తీవ్రత నుండి
చిక్కు తొలగించు
సుఖము పేరే ఇల్లు

రోగ కారకములౌ
ధూళి క్రిమికీటకాల్‌
విష సర్పముల బాధ
విడచేయుటే ఇల్లు

ఉత్సాహమే ఇల్లు
ఉల్లాసమే ఇల్లు
సల్లాప మల్లికా
వలి కాశలి ఇల్లు

దుర్మార్గులను దూర
ముగ నిల్పు ఒక కోట
దూరితము శ్రమ జేయ
గలిగేటి ఒక పాట

గేహమొక నందనము

వేణు ఆ కవిత స్పష్టంగా, లయబద్దంగా, రాగయుక్తంగా పాడగానే అందరూ ముగ్ధులై చప్పట్లు చరిచారు. గోవిందు ఆ కవితా సమావేశాన్ని ఆ క్షణాలను రాబోయే కాలం కోసం తన కెమెరాలో శాశ్వతంగా బంధించి పెట్టాడు. “వేణు ఈ కవిత నీదేనా” అని స్వామి అక్క అడగగా, లేదక్కా నల్లగొండలో గింజల నర్సింహారెడ్డి అనే కవి రాసాడు అని చెప్పాడు. ఆ కవితానందం నుండి అందరూ తేరుకునే లోగానే అందరికీ కాస్తా దూరంగా కూచున్న కవి మిత్రుడు సిద్దార్ధ తన మంత్రస్వరపు గొంతు మాధుర్యాన్ని మాయజలతారులా శ్రోతలపై వెదజల్లాడు. అది జగ్జీత్‌ సింగ్‌ పాట.

“ఏ దౌలత్‌ భీ లేలో
ఏ షోహరత్‌ భీ లేలో
బలే చీన్‌లో ముజ్‌సే మేరీ జవానీ
మగర్‌ ముజ్‌కో లౌటాదో
బచ్‌పన్‌క సావన్‌
ఓ కాగజ్‌ కి కష్తీ
ఓ బారిష్‌ క పానీ”

పాట మొత్తం విన్న శ్రోతలు ఒక్క క్షణం మంత్రించిన బొమ్మల్లా నిశ్శబ్దమై పోయి, తమ తమ బంగారు, అమాయకపు బాల్యంలోకి వెళ్లి తర్వాత ఇహలోకం లోకి వచ్చి వహ్వావహ్వా అని సిదార్థపై ప్రశసంల పన్నీరు కురిపించారు. అప్పుడప్పుడే సీనీ కవిగా వెండితెరకు పరిచయం అవుతున్న సుద్దాల అశోక్‌ తన తండ్రి సుద్దాల హనుమంతు రాసి, పాడిన ప్రఖ్యాతమైన పాటను వేదనా భరితమైన గొంతుతో అందుకున్నాడు.

“పల్లెటూరి పిల్లగాడ
పసులు గాసే మొనగాడా
పాలు మరిచి ఎన్నాళ్లయ్యిందో!

పాట విన్న శ్రోతలు ఆ పసులకాపరి పిల్లవాడి వెట్టి చాకిరికి కన్నీళ్ల పర్యంతం అయినారు. ఇక ఆ తర్వాత పచ్చి పల్లెటూరి జానపద గాయకుడు, ప్రకృతి ప్రేమికుడైన గోరేటి వెంకన్న చెక్క డైనింగు టేబుల్‌పై చేతి వేళ్లతో దరువులు వేస్తూ తన గొంతు విప్పాడు.

“కంచెరేగి తీపివోలె
లచ్చువమ్మో
నీ కంఠమెంతా మధురమేవో
లచ్చువమ్మా.
పారె ఏటీ అలలమీదా
పండు వెన్నెల రాలినట్టు
ఊరె ఊటా చెలిమలోనా
తేటనీరు తొలిగినట్టు
వెండిమెరుపుల నవ్వునీలో లచువమ్మో
ఎంత చక్కని రూపమేమే లచ్చువమ్మా.

శ్రోతలందరూ ఆ గొంతులోని జానపద మత్తుకు పరవశులైనారు. జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి అనేక హైద్రాబాద్‌ ఉర్దూ జోకుల్ని ఉర్దూలోనే వినిపించి నవ్వుల పువ్వులు పూయించాడు.

అట్లా ఆ గృహప్రవేశ శుభసందర్భంలో సాయంసంజె చీకట్లు పడే వరకూ ఆ కొత్త ఇల్లంతా పాటల పల్లకీలో ఊరేగిన తర్వాత ఆ కవి మిత్రులందరూ వలస వచ్చిన సైబీరియా పక్షుల్లా ఒక్కరొక్కరే తిరిగి వెళ్ల్లి పోయారు. పెళ్లి జరిగిన తెల్లారి ఏకాకిగా మిగిలిన పెళ్లిపందిరిలా, మౌన సముద్రం మధ్యన గడ్డకట్టిన మంచు శిలలా మళ్లీ ఆ ఇల్లు ఒంటరిగా మిగిలిపోయింది.

అధ్యాయం-10: సిగ్గుతో దేశం తలదించుకున్న రోజు

1992 డిసెంబరు ఆరు.

మహాత్ముడు గాంధీ మళ్ళీ రెండోసారి మరణించిన రోజు.

ఈశ్వర్‌ అల్లా తేరేనామ్‌ ప్రార్థనా గీతం గంగలో కలిసిన రోజు.

“మతములనియు మాసిపోవును మానవత్వమొకటే నిలిచి గెలుచును” అన్న గురజాడ కన్నీళ్లు పెట్టుకున్న రోజు.

బాబ్రీ మసీదు కూలిన రోజు బజారుకు, ఆఫీసుకు వెళ్లిన స్వామి ముస్లింలు ఎవరైనా ఎదురు పడితే ధైర్యంగా వారి కళ్లల్లో కళ్లు పెట్టి చూడలేక పోయాడు. ఏదో తప్పు తనే చేసినట్టు వాళ్లను తప్పించుకుని తిరిగాడు. ఆ రోజు ఇంట్లో నుండి శవం లేచినట్లు విషాదంతో కుంగిపోయాడు. చాలా దినాల వరకు జబ్బుపడి లేచి డీలాపడి తిరుగుతున్న రోగిష్టిలా మారిపోయాడు. మనసు పచ్చిపుండులా అయిపోయింది. ‘వినాశ కాలే విపరీత బుద్ది అన్నట్లు’ ఈ వినాశనం ఇంతటితో ఆగదని ఇక ఇది దేశమంతటా మహామ్మారిలా వ్యాపిస్తుందని ఊహించి భయంతో వణికి పోయాడు.

ప్రతిరోజూ ఈనాడు దినపత్రిక చదివే అమ్మ చాలా విచారంగా ముఖం పెట్టి “మన వాళ్లు ఇట్లా చేసుండకపోతే బాగుండేది రా” అన్నది. ఆంజల్య అమ్మకూడా ఆ రోజు స్వామి ఇంట్లనే ఉంది. ఆమె ముఖంలో ఆందోళన చాలా స్పష్టంగా తెలుస్తున్నది. “ఇగ వాళ్లు ఊరుకోరురా. ఇగ రాబోయే రోజులల్ల అందరూ కొట్టుక సస్తరు” అని జోస్యం చెప్పింది.

ఒకరోజు సమత “డాడీ ముస్లింలు మంచివాళ్లు కాదట గదా? మా దోస్తులు చెప్పుతున్నరు. మా క్లాసుల నాకు కొందరు ముస్లిం దోస్తులున్నరు. మరి నేను వాళ్లతో మాట్లాడాలా వద్దా” అని అమాయకంగా ప్రశ్నించగానే స్వామికి గుండెలో గునపం గుచ్చినట్లయ్యింది. మత విద్వేష రాజకీయాలు ఆఖరికి పిల్లల మనసులను కూడా విషపూరితం చేస్తున్నాయని దిగులు పడ్డాడు. కొంచెం తేరుకున్నాక

“కాదమ్మా అన్ని మతాలలోనూ కొందరు చెడ్డవాళ్లు చాలామంది మంచి వాళ్లూ ఉంటారు. మతంతో దీనికి సంబంధం లేదు. ఎక్కువకెక్కువగా, సాధారణంగా మనుషులందరూ మంచివాళ్లే” అని జాగ్రత్తగా దానికి అర్థం అయ్యేటట్లు వివరించాడు. దాని అనుమానం తొలిగిపోయింది.

తమ పక్కింటి ముస్లిం పిల్లలతో దానికి దోస్తానా ఉంది. ఒక సెలవురోజు ఆ కుటుంబమంతా తమ ఫాంహౌజ్‌కు వెళ్లుతూ దీనిని కూడా తీసుక పోయారు తిరిగి ఇంటికి వచ్చిన రాత్రి అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర అన్నాలు తింటున్నపుడు..

“మమ్మీ ఈ రోజు నేను వాళ్ల తోటలో వాళ్లతో పాటు ‘భీఫ్‌ బిర్యానీ’ తిన్నాను. బాగా టేస్టీగా ఉంది” అన్నది. ఆంజల్య, స్వామి ఒకరి ముఖాలు ఒకరు నిశ్శబ్దంగా చూసి ఏమీ మాట్లాడలేదు. తర్వాత కూడా దాన్ని ఏమీ అనలేదు. ఏమీ చెప్పలేదు.

స్వామికి విప్లవనాయకుడు తరిమెల నాగిరెడ్డి జ్ఞాపకం వచ్చారు. ఆయన ఎప్పుడూ ధర తక్కువా బలమెక్కువా అని ‘భీఫ్‌’ తినేవాడు. చిన్నప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు మదనపల్లిలో ఉన్న ‘రిషీవ్యాలీ’ స్కూలు సంస్కృతి అది. వేద కాలంలో రుషులందరూ ఎద్దుమాంసం, గుర్రపు మాంసం చాలా ప్రియంగా ఆరగించే వారని స్వయంగా ‘వేదాలే’ చెప్పిన సంగతి కూడా గుర్తుకొచ్చింది. ఆ దంపతులిద్దరూ రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచనల అభిమానులు.

మసీదు కూలిన పదిరోజుల తర్వాత ఒక సాయంత్రం గోవిందు వచ్చాడు. స్వామి కూడా ఇంట్లనే ఉన్నడు. గోవిందు ‘గోవిందుడు అందరి వాడేలే’ అన్నట్లు అన్ని ఇండ్లూ అతనివే. బ్రహ్మచారి. నలభై ఏండ్లు వచ్చినా పెళ్లి చేసుకోని ఆ ధ్యాసే లేని ఒంటి రామలింగం జీవితం అతనిది. కౌమార వయసు నుండి అతను ఆర్యసమాజిస్టు. బ్రహ్మచారిగా ఉండటానికి అది కూడా ఒక కారణం. శుద్ధ శాఖాహారి. మాంసం, మద్యానికి వ్యతిరేకి. మత దురహంకారం, మత ద్వేషం, మత చాంధసాలు అతనికి లేవు. వేదాలు మాత్రమే అతనికి ప్రామాణికం. గుళ్లను, విగ్రహారాధనలను, దేవుళ్లనూ ఒప్పుకునే వాడు కాదు. రాముడు కృష్ణుడు దేవుళ్లు కాదని కేవలం ఉత్త పురాణ పురుషులనీ, నియమ బద్ద జీవితం కలవాళ్లే బ్రాహ్మణులనీ, వెనుకబడిన కులాలకు చెందిన వాడైనా తనూ ఓ జంధ్యం వేసుకుని ప్రతి ఆదివారం ఉదయం పూట హోమం చేసేవాడు.

ఒకప్పటి హైద్రాబాద్‌ రాజ్యంల నైజాం వ్యతిరేక పోరాటాలకు ఆర్యసమాజమే నాంది పలికింది. తర్వాతనే కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు రంగం మీదికి వచ్చాయి. ఆంధ్రాల బ్రహ్మ సమాజం, మహా రాష్ట్రలో ప్రార్థనా సమాజంలాగా హైద్రాబాద్‌ స్టేట్‌లో ఆర్య సమాజం అనేక సంస్కరణలకు పునాది వేసింది.

మొత్తానికి గోవిందు మంచి స్నేహశీలి. కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగం. జీతమంతా ఫోటోగ్రఫీ హాబీకి, సీనిమాలకు, చాయ్‌ పానీ, పాన్‌లకు హారతి కర్పూరంలా ఖర్చు చేసేవాడు. కర్ణుడికి కవచ కుండలాల్లా ఎప్పుడూ కెమెరా అతని బుజానికి వ్రేలాడుతుండేది. అందరి ఇళ్లల్లోని పిల్లలను పెద్దలనూ తన ఖర్చులతో తస్వీర్లు తీసి పెద్దగ చేసి వారికి గిప్టులుగా అందచేసేవాడు.

అతను ఎంత లేటుగా వచ్చినా అతన్ని అడగకుండానే ఆ ఇంటి ఇల్లాలు రెండు పిడికిళ్ల బియ్యం ఎసరులో ఎక్కువగా వేసి అన్నం వొండేవారు.

ఆ రోజు గోవిందు చాలా నీరసంగా, దివాలా తీసినట్లు, చిన్న ముఖం చేసుకుని కూచున్నడు.

“ఏం భై చాలా రోజులయ్యింది కనబడక. పట్నంల లేవా” అని స్వామి అడిగిండు.

“పట్నంల లేను స్వామీ” అన్నడు.

“ఏం? ఎక్కడికి పోయినవ్‌”

“అయోధ్యకు”

ఉలికిపడ్డాడు స్వామి. నమ్మశక్యం గానట్లు నిజమా అని ప్రశ్నించాడు.

“నిజమే” అన్నడు తలవొంచుకుని.

స్వామి మనసులో మళ్లీ మంటరేగసాగింది.

తీక్షణంగా శత్రువును చూసినట్లు అతన్ని చూసి “నీకేం రోగం. అక్కడికి పోతందుకు” అని చనువుతో కోపంగా ప్రశ్నించాడు స్వామి.

“ఫోటోలు తీసేందుకు” అన్నడు తప్పు చేసిన గొంతు స్వరంతో

“ఆ ఘనకార్యానికి ఫోటోలు తీసేందుకు అంత దూరం వెళ్లాలా?” నిష్ఠురంగా అడిగాడు.

“నాకేం తెలుసు వాళ్లు అట్లా సడన్‌గా మసీదు మీదికెక్కి గుమ్మటాలు కూలగొడ్తరని. కరసేవ. లక్షలాది మంది ప్రజలు వస్తున్నారంటే వారిని, సాధువులను, సన్యాసులను, అఘోరాలను ఫోటోలు తీయాలని వెళ్లాను. ఇంతకు ముందు ఇట్ల ఎన్నిసార్లు నదుల పుష్కరాలను, కుంభమేళాలను ఫోటోలు తీయటానికి పోలేదూ? ఇదీ అట్లనే. ఇటువంటి పాపపు పని జర్గుతదని నేనేం కలగన్ననా?” అని గోవిందు క్షమాపణలు చెబుతున్నట్లు బాధపడుకుంట అన్నడు.

ఇంతల వంట పూర్తి చేసుకుని పిల్లలకు అన్నాలు పెట్టి ఆంజల్య కూడా వచ్చి వాళ్లిద్దరి ఎదురుగా కూర్చుంది. గోవిందు వివరణతో స్వామి కొంత శాంతించాడు కాని మనసుల మంట ఆరలేదు. అది రావణకాష్టంలా చిటపటలాడుతనే ఉంది.

“గోవిందు మీద నీకెందుకంత కోపం. ఆయనేమన్నా ముందే కలగన్నడా ఇట్ల అయితదని. ఆ దుర్ఘటనలను చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి నీ ముందు కూచున్నప్పుడు ఏం జరిగిందో వివరంగా తెలుసుకోరాదా? తప్పేముంది?” అని ఆంజల్య స్వామిని కొంచెం మందలించింది.

దానితో స్వామి పూర్తిగా చల్లబడి కుతూహలంగా మిత్రుడి ముఖంలోకి చూసాడు.

“నువ్వు మొత్తం కథ చెప్పు గోవిందూ” అని ఆంజల్య అతనికి మంచి నీళ్ల గ్లాసు అందించి వినటానికి తను కూడా సిద్దంగా కూచుంది.

నీళ్లు గటగటా తాగిన అతను జర దమ్ము తీసుకుని, కళ్లు మూసుకుని, గొంతు సవరించుకుని మహాభారత యుద్ధాన్ని ప్రత్యక్షంగా కళ్లారా చూసిన సంజయుడు కళ్లు లేని కబోది దృతరాష్ట్ర మహారాజు కళ్లకు కట్టేటట్లు చెప్పినట్లు ఆ గోవిందుడు ఆ దంపతులిద్దరికీ ఇట్లా సిగమొచ్చినట్లు చెప్పసాగాడు.

“కేంద్రంలో కాంగ్రేసు ప్రధానమంత్రిగా పి.వి. నర్సింహారావు ఉన్నా అయోధ్యలో జరిగే కరసేవ విషయంలో పూర్తిగా నిస్సహాయకుడిగా, నిష్క్రియాపర్వంలోకి జారిపోయాడు. ఆయన ఆచితూచి చూసే వైఖరే కొంపముంచింది. అప్పటికే రెండవ దశలోకి ప్రవేశించిన ‘రామరథ యాత్ర’ డిసెంబరు ఆరున అయోధ్యకు చేరుకోవాలని బీజేపీ ఇంకా సంఘ్ పరివార్‌ సంస్థలన్నీ ప్రణాళిక వేసుకున్నాయి. వారణాసి నుండి అద్వానీ మధుర నుండి మురళీ మనోహర్‌ జోషీ రెండు రథయాత్రలుగా బయలుదేరి ఆ ఆరవతారీఖున అయోధ్యలో కలుసుకున్నాయి. దేశ నలుమూలల్నుండీ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారు, అగ్రవర్ణాల వారందరూ అన్ని సముద్రాలు కలిసి ఒక్కటయ్యి పోటెత్తినట్లు అలలు అలలుగా అయోధ్యను ముంచెత్తినారు.

నేను ముందు జాగ్రత్తగా ఒక రోజు ముందే అయోధ్య చేరుకుని ఆ ఆరవ తారీఖు ప్రొద్దున్నే సరయూ నది తీరాన ఉన్న ఆర్యసమాజం భవనం పైకప్పు మీద బైనాక్యులర్సు, కెమెరా, కొన్ని బిస్కట్లు, పండ్లు, నీళ్ల బాటిల్స్‌తో కూర్చున్నాను. పొద్దెక్కుతున్న కొద్దీ అక్కడి దృశ్యాలు చూస్తుంటే నా ప్రతి రోమం రోమాంచితమై గుండె దబ్బ దబ్బ కొట్టుకుని బి.పి. పెరిగింది. అప్పుడే నాకు సన్నగా జ్వరం మొదలయ్యింది.

ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి. అక్కడి ఉద్రిక్త దృశ్యాలు వర్ణనాతీతం. వేల సంఖ్యలో మానవ కెరటాలు. అదే సంఖ్యలో కాషాయ ధ్వజాలు, సంజెకెంజాయ, కాషాయ కాసారం నా కండ్ల ముందు సాక్షాత్కరించింది. నలుదిక్కులా ఎటువైపు చూసినా ఒకే ఒక జన నినాదం. ‘జై శ్రీరాం’ భూమ్యాకాశాలను ఒక్కటిగా చేసే ఆ నినాదం. ‘జై శ్రీరాం’ ప్రచండఘోషకు భూమి బద్దలవుతుందా, నింగి ఫెటిల్లున పగిలి ముక్కలవుతుందా అని నేను భయపడ్డాను. చిన్నప్పుడు ఉరుములు, పిడుగులు పడుతుంటే మా అమ్మ మాతో అర్జునా, ఫల్గుణా అనిపించేది. మరి నాకా క్షణంలో ఏమనాలో తోచక నా నక్కిళ్లు కూలబడ్డాయి.

ఆ ఉదయమే అద్వానీ ‘రామరథ యాత్ర’ సరయూనది తీరానికి చేరుకుంది. ఆయన తన రథం దిగి ఆ పౌరాణిక పవిత్ర భూమి నుండి పిడికెడు ఇసుకను అతి పవిత్రంగా తన రెండు పిడికెళ్లతో తీసుకుని కాలినడకన అషేశ జనవాహినులు వెంటతోడు రాగా ‘రామకథాకుంజ్‌’ అనే డాబా మీద ఏర్పాటు చేసిన ఎత్తైన వేదిక మీద ఆసీనుడైనాడు. ఉదయం పదిగంటలకు అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, అశోక్‌సింఘాల్‌, ప్రమోద్‌ మహాజన్‌, ఉమాభారతి లాంటి మహా నాయకుల రెచ్చగొట్టే ఉపన్యాసాలు ప్రారంభమైనాయి.

ఉపన్యాసాలు ప్రారంభమైన అరగంటలోనే కరసేవకులు, రామభక్త హనుమాన్‌ దండులు, రామదండులు, బీజేపీ, శివసేన కార్యకర్తలు చీమల్లా ప్రాకుతూ వందల సంఖ్యలో బాబ్రీమసీదు పైనున్న మూడు గుమ్మటాలపైకి చేరుకున్నరు. ఉసిళ్ల పుట్టలా ఆ మూడు గుమ్మటాలను దట్టంగా కమ్ముకున్నారు.

నాయకులందరూ ఉపన్యాసాలను ఆపి ‘దయచేసి కరసేవకులందరూ క్రింది దిగిరావాల’ని రెండు చేతులూ జోడించి ప్రార్థిస్తూ అరవసాగారు. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు అయ్యింది. కరసేవకులు వందల సంఖ్యలో ‘జైశ్రీరాం’ అంటూ వెంట రహస్యంగా తెచ్చుకున్న సుత్తె, సమ్మెట, గునపం లాంటి ఇతర పరికరాలతో, గుమ్మటాలను పగుల గొట్టసాగారు. ఆ విధ్వసంలో మహారాష్ట్ర నుండి వచ్చిన శివసేన కార్యకర్తలదే ప్రధాన పాత్ర. వారు చేస్తున్న హర హరమహాదేవ, జై భవానీ, వీర శివాజీ నినాదాల వలన వారంతా మహారాష్ట్రులని తెలుస్తనే ఉన్నది. బ్రతికున్న ఔరంగజేబు తలను పగుల గొడ్తున్నట్లు వారందరూ నరనరాల్లో తరతరాలుగా పేరుక పోయిన తమ కసితో, ద్వేషంతో ఆ గుమ్మటాలను ధ్వంసం చేస్తున్నారు. నాయకుల విజ్ఞప్తులు గాలిలో కలిసిపోయినాయి. వారి కళ్ల ముందే మొదటి గుమ్మటం ఆ తర్వాత కొన్ని క్షణాలకు రెండు గుమ్మటాలు నేల కూలాయి. జైశ్రీరాం నినాదం నింగీ నేలను ఏకం చేస్తుండగా పూర్తిగా మొత్తం మసీదు పెళపెళా రావాలతో నాలుగు కాళ్లు విరిగి కురుక్షేత్ర యుద్దరంగంలో నేలకూలిన మదగజంలా ఒరిగి పోయింది. కూలి పోయింది.

పవిత్ర రాజ్యాంగం ప్రజలకిచ్చిన హామీ ‘లౌకికవాదం’ అట్లా సరయూనది తీరం ఇసుకలో నేలపాలయ్యింది.” అని చెప్పటం ఆపేసాడు గోవిందు.

“ఆ తర్వాత ప్రధానమంత్రిగారు చాలా తీరికగా ఆ నాయకుల అరెస్టు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన, సంఘపరివార్‌ సంస్థలపై నిషేధం విధించటం జరిగింది. కాని క్యా ఫాయిదా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయ్యింది.”

రాత్రి చాలా పొద్దుపోయింది. చాలా సేపు ఆ ముగ్గురి మధ్య పెద్ద నిశ్శబ్దం గడ్డ కట్టుకపోయింది.

కోలుకున్న గోవిందు “నాకేం తెలుసు ఆ కుక్కల కొడుకులు ఆ మసీదును అట్లా కూలగొడుతరని” అన్నాడు.

ఆంజల్య మూడు పళ్లాలో అన్నం పెట్టింది. ఏదో తిన్నాం అంటే తిన్నాం అనిపించి చేతులు కడుక్కుని ముందు గది డ్రాయింగ్‌ రూంలోకి వచ్చారు. ఇల్లంటూ లేని గోవిందుకు, ఎందుకు ఆలస్యంగా వచ్చావని కోపడే వాళ్లు లేని గోవిందుకు పట్నం అంతా నిశాచరుడిగా తిరిగి ఏ అర్ధరాత్రి దాటింతర్వాతో తనుండే వైఎంసీఏ హాస్టల్‌ రూంకు చేరుకోవటం అలవాటు. చల్‌ అకేలా ఏక్‌ నిరంజన్‌. న ఘర్‌ హై న టికానా. ఫిర్‌ భీ చల్తే జానా హై.

“ఒక్క మాట చెప్పిపోతా మీ ఇద్దరికి. నా బాల్యమంతా మీ లాగే పాత నగరం ఈదీ బజార్‌లో గడిచింది. మా ఇంటికి దగ్గరగా సైదాబాద్‌కు పోయే తోవల ఒకప్పుడు తానీషా కాలంల జీవించిన ఒక సూఫీ సాధువు దర్గా ఉండేది.

అక్కడ ప్రతి ఏటా ఆయన ‘ఉర్సు’ (వర్ధంతి) గొప్పగా జరిగేది. పొద్దుటి పూట ‘చాదర్‌’ కార్యక్రమం. దానిని ‘పూల్‌వాలోఁకీ సైర్‌’ అని కూడా అంటారు. అంటే ఆయన సమాధిపై పట్టు బట్టతో చేసిన చాదర్‌ పరిచి దానిపై గులాబీల మాలల్ని పరిచి ఊదు, అగరు బత్తులు వెలిగించి ‘మన్నత్‌’లు కోరి ఆ తర్వాత వచ్చిన అందరికి ‘లంగర్‌’ భోజనాలు ఏర్పాటు చేసేవారు. రాత్రి కాగానే ఆ దర్గాకు రంగురంగుల లైటు బుగ్గలు అంతటా వేలాడదీసి పాటలు, ఖవాలీలు, ముషాయిరాలు జరిగేవి. ఆ దీపపు కాంతుల జిలుగు వెలుగులలో రాత్రికూడా పట్టపగలు దినంగా మారేది. మేలా నడుస్తనే ఉండేది. రంగుల రాట్నాలు, బొంబైకా తమాషా బయస్కోపు డబ్బాలు, షర్బత్తులు, కారా, మిఠాయిలు అమ్మే పుట్‌పాత్‌ దుకాణాలు చిన్న పిల్లల ఖేల్‌ ఖిలోనాల దుకాణాలు భైరూపుల వాళ్ల వేషాలు, పాటలు పాడుకుంటూ ‘అల్లాకే నామ్‌పే’ అని ఖైరాతీలు అడుక్కునే ఫకీరులు, పాము ముంగీస ఆటలు ఆడించే పాముల వాళ్లూ, నేల మీద గుడ్డ పరచి ఇనుప డబ్బాలో గవ్వలు వేసి గలగలా మోగిస్తూ ‘ఏక్‌ రూపయికో చార్‌ రూపయ్యా’ అని జూదాలు ఆడేవాళ్లు, హిందూ ముస్లిం కిరస్తానీలు, పిల్లాజెల్లా ముసలి ముతకా ఆడామగా అందరూ ఆ ఉర్సూలో పాల్గొనటానికి అక్కడ జమయ్యేవారు. చాలా మంది హిందూవుల్లోని క్రింద కులాల వాళ్లు హరిజనులు, గిరిజనులు ఇసుకపోస్తే క్రింద రాలనంత మంది జనాలు వచ్చేవారు. ఆ ‘వలీ’ దర్గాను సందర్శించి చాదర్‌లు పరిచి గులాబీ పూలు చల్లి, మీఠాబూందీని అక్కడ సమర్పించి మొక్కులు మొక్కుకుని ఆ మక్బరా చుట్టూ అన్ని జాలీలకు తమ ముడుపు దారాలను కట్టేసి అరచేతి దండలకు దట్టీలు కట్టుకుని మెడలో తాయెత్తులు, తావీజులు కట్టుకునే వారు. అన్ని మతాల త్రివేణీ సంగమం అక్కడ వెలిసేది. మన పట్నంల మౌలాలీ దర్గా, జహంగీర్‌ పీర్‌ దర్గా, పహాడీషరీఫ్‌ దర్గా, నాంపల్లిల యూసుఫిఁయా దర్గాలు ఇట్లాంటివే కదా.

మా బస్తీ నుండి మేం హిందూ, ముస్లిం తురక దోస్తులమందరం ఆ మేలాలో అలాయి, బలాయిలుగా ఒకరి భుజాలమీద మరొకరం చేతులేసుకుని దోస్తానాలతో తిరిగేవాళ్లం. ఇప్పుడు ఆ దినాలన్నీ మాయమైనాయి. ఇగ ఇప్పుడు నా తురక దోస్తులకు నా ముఖం ఎట్ల చూపెట్టాలో నాకైతే సమజయితలేదు” అని చాలా సేపు అంగలార్చిండు.

అంగలార్చీ అంగలార్చీ అర్దరాత్రి దాటినంక తన డొక్కు స్కూటర్‌ చాలా సేపు కొట్టీ కొట్టీ చివరికి అది స్టార్‌ కాంగనే దాన్ని ఎక్కి ఆ నిశిరాత్రి నిశ్శబ్ద చీకట్లలో మాయమైనాడు ఆ నిరంతర ముసాఫిర్‌.

‘సోగయా ఏ జమీన్‌
సోగయా ఆస్మాన్‌
సోగయీ ఏ మంజిలేఁ
సోగయాహై రాస్తాఁ’
(తేజాబ్‌ సీన్మా 1988)

***

బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతికారచర్యగా దేశంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదం తలెత్తింది. 1993 మార్చి పన్నెండవ తేదీన బొంబాయి నగరంలో మెజార్టీ ప్రజలు నివసించే ప్రాంతాలలో ఒకే రోజు పన్నెండు స్థలాలలో ఉగ్రవాదులు అతి శక్తివంతమైన బాంబులు పేల్చారు. ఆ విధ్వంసంలో 257 మంది చనిపోయారు. 1400 మంది తీవ్రంగా గాయపడినారు.

ఇక అది అంతం కాదు ఆరంభం మాత్రమే అని స్వామి అంచనా వేసాడు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version