Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-3

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[ఓరోజు సాయంత్రం స్వామి ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి, భార్య ఆంజల్య ఒక ఉత్తరం అందిస్తుంది. అది స్వామి బాల్యమిత్రుడు వేణు రాసినది. స్వామికి ఉద్యోగం వచ్చినందుకు తమకెంతో సంతోషంగా ఉందని చెబుతూ, అభినందిస్తాడు వేణు. కొన్ని రోజుల తర్వాత తాను మళ్ళీ గర్భవతినన్న శుభవార్త వినిపిస్తుంది ఆంజల్య. స్వామి అమ్మకి ఈ వార్త చెబితే ఆమె సంతోషించి, ఆశీర్వదిస్తుంది. ఒక బిడ్డ ఒక బిడ్డా కాదని. కనీసం ఇద్దరు ముగ్గురుంటేనే ఇల్లు నిండుగా వుంటదని అంటుంది. మర్నాడు సాయంత్రం భార్యతో కలిసి అక్క ఇంటికి వెళ్ళి, అక్కకి బావకి కూడా శుభవార్త చెప్తాడు. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆంజయ్యకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా, రెండో సంతానం భూమిమీదకి వచ్చేసరికి తనకి నలభై వస్తాయని, ఈ వయసులో పిల్లల్ని కని వాళ్ళకి న్యాయం చేయగలనా అనే సంకోచం స్వామిలో ఉంటుంది. బావగారికి చెప్పుకుంటే, ఆయన ఏం పర్వాలేదని ధైర్యం చెప్తాడు. తర్వాత స్వామి ఆంజల్యా తమ ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్‌కి వెళ్ళి ఆవిడ సలహా కూడా తీసుకుంటారు. ఆమె కూడా ఆంజల్యకి ఆరోగ్యపరంగా ఏమీ ఇబ్బంది ఉండదనే చెబుతుంది. బాస్ కోదండపాణి చెప్పినట్టు, నెల రోజుల పాటు సూపరిండెంట్ అబ్దుల్ ఖాదర్ దగ్గర కూర్చుని పని నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు స్వామి. డీఓఎం అన్న పుస్తకం గురించి అడిగితే, దాని రహస్యం వివరిస్తాడు ఖాదర్. ఒక్కసారి ట్రేనింగ్‌ఐపోయి కుర్చీల కూచుంటే చాలు ఆ కుర్చీనే నేర్చిస్తుందని అంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-5: అల్లాహో అక్బర్‌, హరహర మహాదేవ్‌

పాతనగరం చరిత్రలో ఆ రోజు మరొక దుర్దినం.

1989 డిసెంబరు నెల పదిహేనవ తారీఖు రాత్రి ఏడున్నరా ఎనిమిది మధ్య సమయం.

స్వామి పక్కమీద పడుకుని పురుసత్‌గా వివిధ భారతీల ‘ఫౌజీ బాయియోంకా ఫర్మాయిషీ గానే’ వింటూ లతాజీ కుసుమకోమల కంఠంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నడు. పక్కన వంటింట్లో ఆంజల్య గ్యాసునూనె బత్తీల ‘నూతన్‌’ స్టౌ మీద అన్నం వండుతుంటే ఆ కొత్త బియ్యం సువాసన ముక్కుపుటాలకు కమ్మగా సోకుతుంది. ఇంకో ఎలక్ట్రిక్‌ స్టౌమీద మసాలా వంకాయ వేపుడు కూర వేయిస్తున్నదేమో దాని సువాసన కూడా కుతకుత ఉడుకుతున్న బియ్యం సువాసనతో పోటీపడుతుంది. అప్పటికే రోట్లో రోకలితో నూరిన ఆకుపచ్చని పుదీనా పచ్చడి గుబాళింపులు మలయమారుతంలా వంటిల్లు గదిని దాటి స్వామిని మెల్లమెల్లగా చుట్టుముట్టుకుంటే అతనిలోని ఆత్మారాముడు ఆకలితో కరకరమంటూ విజృంభిస్తున్నాడు.

అప్పటికే పాతనగరమంతటా ఎటువంటి సడలింపులు లేకుండా వరుసగా రెండు రోజుల నుండి మతకల్లోలాల వలన కర్ఫ్యూ విధించారు. ప్రజలంతా కలుగుల్లోని ఎలుకలలాగా వారివారి ఇండల్ల బందీలైపోయినారు. ప్రతి ఇల్లు స్వచ్ఛంద జైలుగా మారిపోయింది. స్కూళ్లు, ఆఫీసులు అన్ని మూతబడ్డాయి. కొత్త ఉద్యోగానికి ఇదొక ఆటంకం అనుకుంటూ ఇంట్లోనే ఉన్నాడు స్వామి.

“ఇక సాపాటుకు రావచ్చు” అని ఆంజల్య వంటింటి నుండే కేకవేసింది. స్వామి ఆకలాకలిగా లేచి బయట బావి గచ్చుదగ్గరికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకుంటున్నాడు. ఇంతల అవతల గల్లీల ఎవరెవరివో కేకలు వినబడుతున్నట్లు అనుమానం వేసింది. కడుక్కుంటున్న చేతులను ఆపి చెవులప్పగించి కాస్తా శ్రద్ధగా విన్నాడు. మరు క్షణంలో ఆంజల్య లోపల్నుండి గాబరాగాబరాగా ఇవతలికి ఉరుకుతున్నట్లు వచ్చి..

“ఏందా చప్పుళ్లు” అని ఆందోళనా స్వరంతో స్వామిని అడిగింది.

గల్లీ ముందు భాగం నుండి అల్లరి గుంపుల ఒర్లుడు వినబడుతుంది. “నారా ఏ తక్‌బీర్‌ అల్లాహో అక్బర్‌” అన్న కేకలు. ఆ కేకల వెంబడే గల్లీలోని హిందువుల ఇండ్ల తలుపులు, కిటీకీల మీద పెద్దపెద్ద రాళ్లు విసురుతున్న చప్పుడు. దాంతో ఏక్‌దమ్మున సంగతేందో ఖుల్లంఖుల్లాగ (వివరంగా) సమజయిపోయింది. స్వామి పెద్ద తమ్ముడు జ్ఞాని, చిన్న తమ్ముడు మధు వాళ్ల గదుల నుండి ఇవతలికి ఉరుక్కుంట వచ్చి ఇంటి పెద్ద దర్వాజాను ‘ధన్‌’ మని చప్పుడయ్యేటట్లు గట్టిగా మూసి కిందా మీదా నడుమా ఇనుప గొళ్లాలు బిగించివేసారు.

‘అల్లాహో అక్బర్‌.. మారో మారో – పీటో పీటో’ అని ఉద్రేక పూరిత స్వరాలు ఇంటికి దగ్గరవుతున్నాయి. అంటే ఆ గుంపులు స్వామి గల్లీలకు గుసాయించి వస్తున్నరన్న మాట. అంతలోనే ఇంటి వెనుకవైపు ఉండే హిందువుల రూప్‌లాల్‌ బజార్‌ బస్తీల నుండి ముస్లింల కేకలకు సమాధానంగా ‘హర్‌హర్‌ మహాదేవ్‌, జై భవానీ వీర్‌ శివాజీ’ అన్న కేకలు. ఆ కేకలు వేస్తున్న వారందరూ మరాఠాలు. ఆ కేకల మధ్య ఆడోళ్లు, మొగోళ్ల, చిన్న పిల్లల ఏడుపులు, అరుపులు, మొత్తుకోవటం స్వామి ఇంట్లోని వారందరికీ స్పష్టంగా వినబడుతున్నయి.

ఆ ముగ్గురు అన్నదమ్ములు, వారి భార్యలు, పదేండ్ల సమతా అందరూ కాల్జేతులు గజగజా వణుకుతుంటే ‘ఇక అయిపోయిందిర మన పని’ అని మనుసులనే అనుకుంటూ చావుకోసం క్షణాలు లెక్కపెట్టుకుంటున్నారు. వాడకట్టు చుట్టు పట్ల సంకుల సమరం జరుగుతుంది. లాఠీలు, కట్టెలు పఠెల్‌, పఠేల్‌ మని నెత్తులమీద పడి పగులుతున్న చప్పుళ్లు. రాళ్ళ వర్షం. “అరే అల్లా మర్‌గయా” అని ఒకవైపు మరోవైపు “అమ్మో అమ్మో” అన్న అరుపులు, కేకలు, శోకాలు, శాపాలు. “మాదర్చోతోంకో కాట్‌కే మార్‌డాలో” లాంటి అరుపులు. అంతటా గడబడలు చెవులు చిల్లులు పడేటట్లు వినబడుతున్నాయి. ఇంతల ఆంజల్య కూరమాడిపోతున్న వాసన పసిగట్టి వంటింట్లకురికి బత్తీల స్టౌ మీద నీళ్లు చిలకరించి మంట ఆర్పేసింది. ఇష్టంగా వొండుకున్న వంకాయ మసాలా కూర మాడి మసిబొగ్గులయ్యింది.

“వచ్చిన తుర్కోళ్లు మన బస్తీవాండ్లు కాదనుకుంట అన్నయ్యా ఖాజీపురా నుండి వచ్చినట్లుంది” అని చిన్న తమ్ముడు మధు గుసగుసగా మాట్లాడిండు. ఎందుకన్నా మంచిదని అమ్మ ఇంట్ల ఉన్న అన్ని రూంల లైట్లు ఆర్పేసింది. దూరంగా ఎక్కడెక్కడో తలుపు రెక్కలు విరుగుతున్న చప్పుళ్లు. మరెక్కడో నెత్తులు పగిలి బొక్కలు విరిగి, కత్తి పోట్లకు గురై నొప్పులతో, బాధలతో, భయంతో మూలుగుతున్న శబ్దాలు. పిల్లాజల్లా ఏడ్పులార్పులు. అన్నీ గందరగోళంగా వారందరికీ వినబడుతున్నాయి. ఇంతల శక్కర్‌గంజ్‌ పార్థీవాడ నుండి పెద్దగా అకస్మాత్తుగా ఏడ్పులు వినబడినాయి. అక్కడ ఇండ్లు తగులబడ్తున్నట్లు అటువైపునుండే చీకటి ఆకాశంల వెలుగులు కనబడుతున్నయ్‌. ప్రాణాల రక్షణకోసం మనుషులు చివరిక్షణాలలో చేసే ఆర్తనాదాలు వారి గుండెలను గుబగుబలాడిస్తున్నాయి.

స్వామి, అతని పెద్ద తమ్ముడు జ్ఞాని నెమ్మదిగా ఒక గోడమీదికి ఎక్కి అటు నుండి ఇటు కప్పు మీదికి చేరుకుని శక్కర్‌గంజ్‌ పార్థీవాడ వైపు చూశారు. అక్కడ పిట్టలోళ్ల ఇళ్లన్నీ అగ్నికీలల్ల కాలిపోతున్నయి. వణుకుకుంట క్రిందికి దిగివచ్చి ఆ సంగతి గుసగుసగా అందరికీ చెప్పినారు.

‘అమ్మో, మళ్లీ రజాకార్ల కాలం వొచ్చినట్లుంది. అప్పుడు కూడ ఇట్లనే అయ్యింది’ అనుకుంట అమ్మ వాళ్ల ఇలవేలుపు చిల్పూరుగుట్ట దేవుడికి రెండు చేతులూ ఎత్తి దండం పెట్టి తన ఆకులు పోకల సంచి నుండి ఒక రూపాయి బిళ్లను ఇవతలికి తీసి దానిని కండ్లకద్దుకుని తన చీరెకొంగుకొసన గట్టిగ ముడేసి ముడుపు కట్టింది. ఎవరికి ఏం ఆపద, గండం వచ్చినా అట్లా మొక్కుకుని ముడుపు కట్టటం ఆమెకు అలవాటే.

కాసేపటికి సైరన్‌లు బజాయించుకుంట పోలీసు వ్యాన్లు బస్తీల చక్కర్లు కొట్టినయ్‌. ఒక అర్దగంట అయినంక శ్మశాన నిశ్శబ్దం అంతటా వ్యాపించింది. మళ్లీ ఆ రాత్రి ఎక్కడ నుండి ఎవరొస్తరో, ఏం అఘాయిత్యాలు చేస్తరో అన్న భయంతో ఇంట్లో ఉన్న అందరూ పక్కింటి కరణపు బ్రాహ్మల ఇంట్ల నుండి అటు పక్కనుండే దేవీదాన్‌ బాసూత్కర్‌ అనే మరాఠోళ్ల బాడాకు వెళ్లారు. ఆ ఇల్లు చిన్న సైజు గడీలాగా గట్టిగా, భద్రంగా ఉంది. అప్పటికే ఆ ఇంటికి వాళ్లు, గల్లీవాళ్లందరూ అక్కడ జమ అయ్యారు. గొల్లోల్ల భారతమ్మ, వడ్ల్లోల సుశీలమ్మ, కరణాల కుటుంబం, స్వామి కుటుంబం, పిల్లాజల్లా ముసలి ముతకా అందరూ నానా జాతి సమితి సభ్యుల్లా జమకూడి, టి.వి. చూస్తున్నరు. అన్నీ గొడవలు, కర్ఫ్యూ, పోలీసుల పహారాల దృశ్యాలే. ఉస్మానియా ఆస్పత్రి అంతా క్షతగాత్రుల హాహాకారాలతో దద్దరిల్లుతుంది. ఆ మరాఠీ ఇంటామె రాధాభాయి, ఆమె సవతి గుండేభాయి ఆమె కొడుకు దేవీదాస్‌ బాసూత్కర్‌ “ఏం ఫికర్‌ లేదు. మీరంతా ఈ రాత్రి ఇక్కడే ఉండండి” అని అందరికీ ధైర్యం చెప్పారు. వచ్చిన వారందరికీ చాయ్‌, పానీల సరఫరా కూడా చేసారు.

ఆ రాత్రంతా తిండి తిప్పలు లేక శివరాత్రి జాగారం చేసి మరునాడు ప్రొద్దున ఇండ్లల్లకు వాపస్‌ అయినారు.

“ఇగ ఇక్కడుండొద్దురా పెద్దనానీ (స్వామిని అమ్మ పెద్ద నాని అని పిలుస్తది. నాన్నా అన్నదానికి అది అపభ్రంశపదం). ఎప్పుడేం జరుగుతదో తెల్వదు. శాలీబండల అక్కింటికి పోదాం పదుండ్రి. అక్కడుంటే ప్రాణాలైన దక్కుతయి” అని అందర్నీ బయలుదేరమంది.

మూటలు, ముల్లెలు, సందుగలు, సంచులు అన్నీ సర్దుకుని వాళ్లందరూ అక్క ఇంటివైపు నడవసాగారు. అక్క ఇల్లు పెద్దరోడ్డు మీదనే ఉంటది కావున దాడులు జరిగే ప్రమాదం ఏ మాత్రం లేదు. వాళ్లు రూప్‌లాల్‌ బజార్‌ బస్తీల నుండి నడుస్తుంటే అంతటా శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తుంది. ప్రతి ఇంటి మీద దాడి జరిగింది. తలుపులూ, కిటికీ రెక్కలు విరిగి ఉన్నయి. కోమటాయన దుకానం “తీన్‌ తేరా నౌ అఠారా” అయ్యింది. మల్హర్‌ రావ్‌ ఇంటి మీద దాడి చేసి ఆయన తలకాయ పగలగొట్టినట్లుంది. నెత్తికి పట్టీ కట్టుకుని ఆయన దీనంగా, లాచార్‌ కండీషన్‌ల తన ఇంటి అరుగుమీద కూచున్నడు. పలకరిస్తే ఏడుస్తాడన్న భయంతో స్వామి ఆయన్ని పలకరించలేదు తలక్రిందికి వంచుకుని నడుస్తున్నడు.

రంజిత్‌, విక్రం భయ్యా ఇండ్ల మీద కూడా దాడి జరిగిందట. ఇంకో మలుపు తిరిగే సరికి అక్కడ పుండ్లీక్‌ (తెలుగులో పుండరీక్‌ మరాఠీలో పుండ్లీక్‌) కాలు, చెయ్యి విరిగి కుంటుకుంట నడుస్తూ కనబడినాడు. 1947 దేశ విభజన సమయంలో రెండు దేశాల సరిహద్దులలో సాగిన మానవ వలసల ప్రవాహం లాగా స్వామి కుటుంబ సభ్యులు, మరికొందరు బస్తీవాసులు గుంపులు గుంపులుగా ప్రాణాలు అరచేతులల్ల పెట్టుకుని, ఏ క్షణంల ఏ గల్లీల నుండి ఎవరు దాడి చేస్తరో అన్న భయంతో గజగజ వణుకుతూ నడిచి, నడిచి శాలీబండ పెద్దరోడ్డుకు చేరుకుని బ్రతుకు జీవుడా అని వాళ్ల అక్కింటికి సురక్షితంగా చేరుకుని ఆశ్రయం పొందారు.

***

మర్నాడు పొద్దున్నే దినపత్రిక వచ్చింది. అన్నీ దుర్వార్తలే. పార్థీవాడ మొత్తం లంకాదహనం, రావణకాస్టం అయ్యింది. చాలా మందిని తల్వార్లతో నరికి తగలబడుతున్న ఇండ్లల్ల విసిరేసారు. ప్రాణాలతో బ్రతికిన అక్కడి పిట్టలోళ్లందరూ చెట్టుమీది పిట్టల్లా, బెదిరి పోయి చెదిరి పోయి నాలుగు దిక్కులా వెళ్లి కొత్త పట్నంలో ఎక్కడెక్కడో స్థిరపడినారు.

ఇంతకూ ఈ మత కల్లోలాలు ఎందుకు జరిగాయి అంటే ఒక ముఖ్యమంత్రిని సింహాసనం నుండి తప్పించి మరో ముఖ్యమంత్రిని అందులో కూచోబెట్టటానికి జరిగిన మారణ హోమం. ఒకే పార్టీలోని రెండు గ్రూపుల మధ్య జరిగిన సంఘర్షణ ఫలితమది. ఆవులు, ఆవులు కొట్లాడుకుంటే మధ్యలో లేగ దూడల కాళ్లు విరిగాయన్న సామెత నిజమే అయ్యింది.

ఆ తర్వాత స్వామి కుటుంబం ఒక గట్టి నిర్ణయం తీసుకున్నది. ముందు అందరూ ఇల్లు ఖాళీ చేసి న్యూసిటీలో ఎవరంతల వాళ్లు విడివిడిగా కిరాయి ఇళ్లు తీసుకోవాలి. ఆ తర్వాత అయిన కాడికి ఎంత ధర వస్తే అంత ధరకు ఆ ఇల్లు అమ్మేయాలి. ముస్లింలు తప్ప మరెవరూ ఆ ఇల్లు కొనరు. అప్పటికే పాతనగరంలో చాలా మంది తమ ఇండ్లు ముస్లింలకే అమ్మి కొత్తపట్నానికి వలస పోతున్నారు. అట్లా ప్రాంతాలు కూడా మతపరంగా విడిపోతున్నాయి. మనుష్యుల మధ్య గోడలు, గోతులు ఏర్పడుతున్నాయి.

తూ హిందు బనేగా న ముసల్మాన్‌ బనేగా
ఇన్సాన్‌కి ఔలాద్‌ హై ఇన్సాన్‌ బనేగా

అన్న కవిగారి కలలు మతకల్లోలాల పుణ్యమా అని మూసీ నది మురికిలో కలిసి కొట్టుకుపోయాయి.

స్వామీ ఆంజల్యలకు ఈ మార్పు సరిఐనదే అనిపించింది. కూతురు సమత ఐదవ తరగతి పూర్తి కాబోతుంది. దానిని న్యూసిటీలోని బెస్ట్‌ కాన్వెంటు స్కూల్లో చేర్పించాలని వాళ్ల కల. ఈ కర్ఫ్యూలు తరచుగా పెట్టటంతో స్కూళ్లు మూతబడి పిల్లల చదువులూ దెబ్బతింటున్నాయి. ఆఫీసులకు, వ్యాపారాలకు వెళ్లకుండా రోజుల తరబడి ఇండ్లల్లో బందీలుగా ఉండటం కూడా పెద్దలకు చికాకు కలిగిస్తుంది. పైగా దినదిన గండం నూరేళ్ల ఆయుస్సన్నట్లు మనిషి ప్రాణాలకే అసలు ఎసరు వస్తుంది.

స్వామికి తరచుగా కర్ఫ్యూ రోజులను చూస్తుంటే ఫ్రెంచి రాజకీయ తత్వవేత్త రూసో చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చేవి. ఆదికాలంలో ఇంకా ప్రభుత్వమూ, రాజ్యము, న్యాయమూ ఏర్పడని అరాచక కాలంలో మనిషి జీవితం Man’s life was solitary, poor, Nasty, brutish & short.

అంటే బలవంతుడిదే రాజ్యం అనే ఆటవిక జంతుప్రవృత్తి కాలంలో మనిషి జీవితానికి, మాన ప్రాణాలకు, కుటుంబానికి, ఆస్తిపాస్తులకు ఎటువంటి రక్షణ లేదు అని అర్థం. సరిగ్గా పాతనగరం ప్రజల జీవితాలు మత రాజకీయాల వలన అట్లనే ఉన్నాయి. మత విద్వేష రాక్షసి పదఘట్టనల క్రింద చీమల కాళ్లు విరిగిన చప్పుడు ఎవరు పట్టించుకుంటారు?

దేఖ్‌ తెరీ సంసార్‌ కి హాలత్‌
క్యా హోగయి భగవాన్‌
కిత్నా బదల్‌ గయా ఇన్సాన్‌
(నాస్తిక్‌ సీన్మా 1954).

అధ్యాయం-6: మసక మసక చీకటిలో గీతారహస్యం

రోజులు రంగుల రాట్నంలా గిర్రుగిర్రున తిరుగుతుంటే చూస్తూ, చూస్తూ ఉండగానే జీతాలు అందే పహేలీ తారీఖు వచ్చేసింది. సగటు సర్కారీ ఉద్యోగి జీవితంలో పహెలీ తారీఖు ప్రాధాన్యత తెలుసుకోవాలంటే కిషోర్‌ కుమార్‌ పాడిన పాత పాట ‘పహేలీ తారీఖ్‌ హై’ వినవలసిందే. అయితే జీతం కంటె గీతం ఎక్కువ ఉన్న కొందరు మహానుభావులకు ఈ పాటలోని అందం అర్థంకాదు. వారి తరీఖానే వేరు. వారి జేబులలో కాసుల గలగలలు ఎప్పుడూ ఉంటాయి.

అప్పటికింకా ఉద్యోగుల జీతాలు బ్యాంకు ఖాతాలలో పడటం లేదు. ఫస్టునాడు క్యాష్‌ డైరక్టుగా చేతికి అందేది. అంతా ‘నగద్‌ నారాయణ్‌’ వ్యవహారమన్న మాట. ఆ రోజు ఒక అందమైన రంగురంగుల పువ్వులున్న ప్రింటెడ్‌ గిఫ్ట్‌ కవర్లో స్వామికి రావలసిన నెల జీతం డబ్బులు పెట్టి ‘విత్‌ గుడ్‌ విషెస్‌’ అని దాని మీద అందంగా రాసి స్వామి చేతికి ముసి ముసి నవ్వులతో ముస్కురాయిఁస్తూ ఖాదర్‌ మిఁయా అందించాడు.

ఆ కవర్‌ అందుకుంటుంటే నిజంగా స్వామికి చాలా సంతోషం వేసింది. తన రాబోయే భవిష్యత్‌ జీవిత చిత్రపటమంతా ఆ కవరులోనే దాగి ఉన్నట్లు అనిపించింది. కొంత భావోద్వేగానికి గురై..

“శుక్రియా ఖాదర్‌ భాయి. ఇలాంటి జీతాలు ఇక భవిష్యత్తులో ఎన్నో తీసుకుంటాను. కాని మీ చేతుల మీదుగా ఈ డిపార్ట్‌మెంటులో తీసుకుంటున్న మొదటి జీతాన్ని నేనెప్పుడూ మరువలేను” అని ఉర్దూలో అన్నాడు.

“రాబోయే రోజులలో మీరు చాలా తరక్కీ (అభివృద్ధి) సాధించాలి స్వామీ సాబ్‌” అని ఖాదర్‌ కూడా సంతోషంతో షేక్‌ హాండ్‌ ఇచ్చాడు.

ఆ సాయంత్రం పుల్లారెడ్డి స్వీట్‌ ప్యాకెట్‌, మల్లెపువ్వుల పొట్లం, జీతం కవర్‌తో సహా ఇల్లు చేరగానే ఆంజల్య చేతికి అందించాడు “ఇదిగో ఇది మన మొదటి నెల జీతం” అని.

సంతోషంతో ఆమె ముఖం వికసించి నవ్వుతూ “ఇది ఎంత” అన్నది.

“ఏమో నాకేం తెలుసు. నేనైతే లెక్క పెట్టలేదు. నువ్వే లెక్కపెట్టు” అన్నడు ఏమీ తెలియనట్లు.

కవరు నుండి ఆమె నోట్లు ఇవతలికి తీసి లెక్కపెట్టసాగింది. ఆమెకు నోట్లు సరిగ్గా గబగబా లెక్కపెట్టటం రాదు ఐనా వ్రేళ్ల మధ్యన కొత్త నోట్లు అటు ఇటు జారిపోతున్నా అపసోపాలు పడుతూ లెక్కపెడుతుంది. జారుతున్న నోట్లను చూస్తూ లక్ష్మీదేవి చంచలమైనది, సరస్వతి స్థిరంగ ఉంటది అన్నమాట జ్ఞాపకం వచ్చింది.

లెక్కపెట్టటం ముగిసిన ఆమె “అరె చాలా పెద్ద జీతం, లెక్చరర్‌ జాబ్‌ కన్నా, ఇదే ఎక్కువగా ఉంది” అన్నది తబ్బిబ్బవుతూ.

“అవును మరి” అన్నాడు స్వామి.

ఆ రాత్రి అన్నాలు తిన్నంక సమతను అమ్మకు అప్పజెప్పి వారిద్దరూ సన్నీఢయోిల్‌ మొదటిసారి నటించిన ‘బేతాబ్‌’ సీన్మాకు ‘మహేశ్వరీ – పరమేశ్వరీ’ టాకీస్‌లో సెకండ్‌ షోకు వెళ్లారు. కాశ్మీరు లోయల్లోని పచ్చిక బయళ్ల మైదానాలు వారికి చాలా నచ్చాయి. ఇక తమ జీవితమంతా సతత హరితమే అని కూడా అనుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత మొదటి జీతం అందుకున్న శుభసందర్భాన స్వామి ఒక చల్లని సాయంత్రం ఆఫీసు బందు అయినంక ఖాదర్‌ను ‘దావత్‌’ కు ఆహ్వానించాడు.

పిలుపు వినగానే ఖాదర్‌ ఖుష్‌ ఐపోయి “క్యోం నహీ జరూర్‌ ఆవుంగా” అన్నాడు.

నుమాయిష్‌ మైదాన్‌ పక్కన ‘ఆదాబ్‌’ హోటల్‌ భూగృహం చలువ గదిలో (ఏసీ) వారిద్దరూ ప్రశాంతంగా ఉన్న ఒక మూలలో కూచున్నారు. గిరాకీల రణగొణ ధ్వనులు ఏమీ లేవు. మంద్రంగా, వెలుగుతున్న విద్యుద్దీపాల వలన అంతటా మసకమసక వెలుతురు హాలంతా పరుచుకుంది. గ్రామఫోను రికార్డు నుండి అతి సన్నగా సుతారంగా బంగారు తీగలాంటి కంఠస్వరంతో ‘దీవానా బనానాహైతో దివానా బనాదే’ అని బేగం అఖ్తర్‌ పాట జలతారు పరదాలా జాలువారుతుంది.

ముందు బాగా స్వచ్చమైన వెన్నముద్ద పూసి రాసిన ‘కల్మీ కబాబులు’ వచ్చాయి. వాటిని కొరికి తింటూ ఆఫీసు ముచ్చట్లలోకి దిగారు. చనువు పెరగటం వలన ‘ఖాదర్‌ భాయి’ అని పిలవటం అలవాటయ్యింది.

“ఖాదర్‌ భాయి, మన ఆఫీస్‌ స్టాఫ్‌ అంతా టైమ్‌ డిసిప్లేన్‌ పాటించకుండా పురుసత్‌గ పన్నెండు గంటల వరకు వస్తున్నారు. ఒక హెడ్‌ క్లర్క్‌గా దీన్ని మీరు సరిచేయలేరా” అని అడిగాడు.

“మరి వారంతా పొద్దుపోయే దాకా రాత్రి ఏడు ఎనిమిది దాకా పనిచేస్తున్నరు కదా” అన్నాడు ఖాదర్‌ కల్మీకబాబు మజా లుఠాయిస్తూ.

“అట్లా ఎందుకు? రూల్‌ ప్రకారం పదిన్నరకు వచ్చి సాయంత్రం ఐదున్నరకు వెళ్లొచ్చుకదా” అన్నాడు స్వామి.

స్వామి అమాయకత్వానికి ఖాదర్‌ లోలోపల ముచ్చటపడుతూ ఆఫీసుకు సంబంధించిన ‘తత్వ బోధ’ను ప్రారంభించాడు.

“స్వామీ సాబ్‌ వాళ్లందరూ మీలాగా అమాయకులు కాదు. ఆఫీస్‌ అవర్స్‌ దాటినా పని చేస్తున్న శ్రామిక రత్నలూ కాదు. ‘మేహనత్‌ కరేతో మేవా మిల్తా’ అన్న సత్యాన్ని సంపూర్తిగా గ్రహించిన జ్ఞానులు వారు. ఒకప్పుడు మీలాగ పిల్లలకు పాఠాలు చెప్పి నెలకోసారి జీతం డబ్బులు కళ్ల చూసేవారు కాదువారు. ప్రతి ఉద్యోగికి ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం. అటెండరు నుండి ఆఫీసరు దాకా. ఈ ఉద్యోగ బృందమొక నిచ్చెనమెట్ల వ్యవస్థ. ఎవరికి ముట్టవలసింది వారికి పర్సెంటేజీల ప్రకారం అందుతుంది. ఐక్యమత్యమే మహా బలము అన్న సూక్తిని ఇక్కడ అందరూ పాటిస్తారు.”

స్వామికి గాభరా మొదలయ్యింది.

జర దమ్ముతీసుకుని ఖాదర్‌ మళ్లీ చెప్పటం ప్రారంభించాడు.

“మన ప్రధాన డ్యూటీ వ్యాపార, పరిశ్రమల నుండి సాధారణ దుకాణాల దాకా వారి సాలుసరి చిత్రగుప్త చిట్టాలను ఇవతలికి తీసి వారి అమ్మకాలను, కొనుగోలులను, ఓపెనింగ్‌ అండ్‌ క్లోజింగ్‌ స్టాకులను పరిశీలించి, బూతద్దాలతో పరీక్షించి పన్నులు విధించి వసూలు చేయటం. వారు ఎగవేసిన పన్ను మొత్తాలను ఇవతలికి లాగి ఒకటి నుండి మూడు రెట్లు జుర్మానాలను విధించటం, మాయల మరాఠీ ప్రాణాలు చిలుకలో దాగి ఉన్నట్లు వారి తపొప్పుల రహస్యాలు మన గుప్పిట్లో ఉంటాయన్న మాట. వారి దొంగ పనులు మనకు బాగా తెలుసున్న సంగతి వారందరికీ ఇంకా బాగా తెలుసు. వారికి మనకు మధ్య గల సంబంధం ‘దామన్‌ చోలీ’ లాంటిది. అనగా పోరి వేసుకున్న జాకెట్టుకు, ఓణికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటదో అట్లా అన్నమాట.”

“అయ్యో అయ్యో” అని ఆశ్చర్యపడి విచారాన్ని వ్యక్తం చేసాడు స్వామి.

“ఇంకా వినండి హుజూర్‌, అప్పుడే పరేషాన్‌ అయితే ఎట్లా” అని ఖాదర్‌ వెయిటర్‌ను పిలిచి “అరే చోటే! అచ్చా గరం గరం దో పాయా ఔర్‌ షీర్మాల్‌ రోటీ లానా. ఔర్‌ భూలో మత్‌ నింభూ, తోడా ప్యాజ్‌ భీ. జల్దీ లేకే ఆనా” అని ఫర్మాయిషీ జారి చేసి..

“తో – స్వామీ సాబ్‌ మై క్యా బోల్‌ రహా థా” అని అడగగా ఆ హెడ్డు గారు ఏమి బోలుతున్నడో స్వామికి అర్థం గాక గందరగోళంగా ముఖం పెట్టాడు.

“హాఁ” అని ఆ భారీకాయం కొంచెం దమ్ముతీసుకుని మళ్లీ తన ఉపదేశం శురూ చేసాడు.

“అసలు ఈ జిందగీలో ఎవరూ ఏ రంగంలో కూడా సత్యహరిశ్చంద్రులు కారు. అంతా ఫిఫ్టీఫిప్టీ ఆధా హిందుస్థాన్‌ అన్నమాట. (1947న పాకిస్తాన్‌ ఏర్పడినాక పుట్టిన సామెత). సగము నిజము మరో సగం అబద్దం. ఏ సత్యమూ పూర్తిగా సంపూర్ణం కాదు. పూర్ణచంద్రునికి కూడా ఒక నల్లని మచ్చ ఉన్నట్లు ప్రతి మనిషిలో కూడా కనీ కనబడని మచ్చలుంటాయి” అని కాసేపు ఫిలాసఫీలోకి వెళ్లి పోయాడు ఆ హెడ్డుగారు.

అప్పుడు స్వామికి మళ్లీ రావిశాస్త్రి కథలలో, నవలల్లో ఎర్రటోపీ బుంగ మీసాల హెడ్డు కానిస్టేబుల్‌ తన బానబొర్ర నిమురుకుంటూ బక్కపల్చటి కొత్త కానిస్టేబులుకు వినిపించిన లోకరీతి నీతి నియమాలూ, తలపండిన సీనియర్‌ లాయర్‌ కొత్తగా చేరిన కుర్ర లాయర్‌కు వినిపించిన ఆదేశిక సూత్రాలు గుర్తుకొచ్చి కలవరపడి..

“మరి.. మరి..” అని మాటలు రాక ఆగిపోయాడు.

“సునో సాబ్‌. సీదా అక్కడికే వస్తున్నా. చచ్చీ చెడీ, చిఠ్ఠాలు తిరిగేసి, మర్లేసి (వాటిని మార్వాడీ సేట్లు బహీఁఖాతాలు అంటారు). లెక్కలు, డొక్కలు కట్టి వాడి డొక్క చీల్చి వందరూ॥ల టాక్సు (ఉదాహరణ) తీసామనుకోండి అయితే మన అసెస్‌మెంటు ఆర్డర్లలో ఆ వంద చూపించం. నాంకే వాస్తే యాభై రూపాయలు చూపించి ఆ టాక్స్‌ మాత్రమే వసూలు చేస్తాం. కొంపతీసి పూర్తిగా వందకు వంద వసూలు చేస్తే వాడు నెత్తిన తడిగుడ్డవేసుకుని అన్నమో రామచంద్రా అని అడుక్కుంటూ రాజస్థాన్‌ ఎడారుల్లోకి పారిపోతాడు.” అని రవ్వంత విశ్రాంతి కోసం ఆగాడు.

మార్క్సు ఎంగెల్స్‌లు రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక లాంటి సిద్దాంత గ్రంథాలను గతంలో ఔపోసన పట్టిన స్వామికి ఈ ఇహలోక నిజాలను తెలుసుకుంటున్న కొద్దీ జీవితంలో మొదటిసారి ‘జ్ఞాన చక్షువులు’ తెరుచుకోసాగాయి.

“మరి ఆ మిగిలిన యాభై” అడిగాడు నీరసపు గొంతుతో.

“ఆఁ ఆబ్‌ ఆప్‌ లైన్‌ పర్‌ ఆరేఁ” అని ఖాదర్‌ చిన్నగా కన్నుగొట్టాడు.

“మరి మనం వాడికి మెహర్బానీ చేసాం కదా (ఆ ఫుట్‌బాల్‌ స్వామిని అప్పుడే తమలో ఒక వానిగా కలిపేసుకున్నాడు) అందుకు వాడు మన వాటాగా ఇరవై ఇస్తాడు.”

“మరి ఇక మిగిలిన ముప్పై” ఇక అడగక తప్పదన్నట్లు సభామర్యాద కోసం అడిగాడు.

“బహుత్‌ ఖూబ్‌. చాలా మంచి ప్రశ్న. అందులో ఇరవై పోలీసులకు, మున్సిపల్‌ వాళ్లకు, తూనికలు కొలతల శాఖా వాళ్లకు, రౌడీలకు, గుండాలకు, గణేష్‌ చందాలకు వగైరా వగైరా” అన్న మాట. ఆఖరీల ఇక ఆ పంచి పెట్ల ఫలారం అయినంక ఎంత మిగిలే? అని స్వామి సరిగా వింటున్నాడా లేదా అని పరీక్షించటానికి కొశ్నించాడు.

బుద్ధిమంతుడైన విద్యార్థిలా శ్రద్దగా వింటున్నట్లు తెలియ చేయటానికి స్వామి టక్కున “పది” అన్నాడు.

“శభాష్‌ స్వామీజీ. మరి అవి ఎవరికో జర సోచాయించి చెప్పండి” అన్నాడు.

మళ్లీ తెలియదన్నట్లు సున్నమేసిన గోడలా తెల్లముఖం పెట్టాడు.

“అన్ని రాజకీయ పార్టీలకు భై. వీళ్లని, వాళ్లని కాదు అందరికీ. ఆఖరికి కమ్యూనిస్టులకు, నక్సలైట్లకు కూడా” అని గొల్లుగొల్లున నవ్వాడు ఖాదర్‌ బాయ్‌.

స్వామి ప్రాణం చివుక్కుమంది.

పాయా తర్వాత ఏక్‌ మే దో మటాన్‌ బిర్యానీ వచ్చింది. అల్పప్రాణి అయిన స్వామికి అప్పటికే భుక్తాయాసం వచ్చింది. ‘మెహమాన్‌ నవాజీ’ అంటే అతిథి మర్యాద కోసం చెమ్చాతో తింటున్నట్లు ప్లేటులోని బిర్యానీని గెలకడం మొదలు పెట్టాడు.

“ఇదీ అసలు కత స్వామీ సాబ్‌. అసలు బిజినెస్‌ సాయంత్రం ఐదు ఐనాకనే మొదలవుతుంది. డీలర్ల రాకపోకలు కూడా అప్పుడే, సెటిల్‌మెంట్లూ అప్పుడే. ఇచ్చిపుచ్చుకోవడాలు అప్పుడే. ప్రొద్దుట్నించి చేసిన మెహనత్‌కు మేవాలు (మిఠాయిలు అంటే అమ్యామ్యా) అందేది అప్పుడే, దానికోసమే రాత్రి ఏడు ఎనిమిది దాకా మనవాళ్లదరూ జక్‌ మరాయిస్తారు. ఆఫ్‌కోర్స్‌ ఇస్‌ మే షర్మానేకీ బాత్‌ క్యా హై. నా వాటా నాకు దక్కుతది. సర్వేజనా సుఖినోభవంతు. జైహింద్‌.

సమజ్‌ గయేనా, లేకపోతే ఉత్తగ ఎవరు కూచుంటరు బై. హౌలా గాళ్లమా? పైసలు రాని వేరే డిపార్ట్‌మెంటు గాల్లు హౌలాగాళ్లు. వాళ్లు సాయంత్రం ఐదుకాంగనే టిఫిన్‌ డబ్బా చేతిల పట్టుకుని ‘జిత్నా తన్‌ఖా, ఉత్నా కామ్‌’ అని కొంపలకు కాళ్లు ఈడ్చుకుంట, ఏడ్చుకుంట డీలా ముఖాలతో కొంపలకు వెళ్లి పోతరు. అటువంటి వాళ్లకు పెళ్లాలు మాత్రం మర్యాద ఇస్తరంటరా?”

ఏం జవాబిస్తే ఏమౌతుందో అని స్వామి గమ్మున నోర్మూసుకున్నడు.

“మరి రాత్రి ఎనిమిదయినా సీదా ఇంటికి పోతరనుకుంటున్నరా?” అని మళ్లీ ప్రశ్నల పరంపర వేసాడు.

“మరి?” అన్నాడు స్వామి.

“దినమంతా గాడిదల్లాగ ఇంత కష్టపడి చాకిరి చేసినంక జర ‘ఉతార్‌’ ఉండాలి కద?”

“ఉతార్‌ అంటే?”

“ఏదైనా బార్‌ అండ్‌ రెస్టారెంటుకు పోయి అందరూ గల్సి పూటుగా తాగి, తినటం. గప్పాలు కొట్టుకుంట సిగరెట్లు తాగటం. అట్లా అలసట తీర్చుకోవటం. రాత్రి ఏ పదకొండు గంటలకో ఇల్లు చేరటం. అప్పటికి పెండ్లాం పిల్లలు నిద్రల ఉంటరు. తెల్లారి తొమ్మిదికి నిద్రలేచేసరికి పిల్లలు స్కూలుకు పోతరు. అప్పుడు ఓపిక ఉంటే పెండ్లాంతో మార్నింగ్‌ షో..” అని పకపకా నవ్వి, “అందుకే భై మరి ఆఫీసులకు వచ్చేసరికి పదకొండు పన్నెడు కాదా” అని వారి ఆలస్యానికి వత్తాసు పలుకుతూ సంజాయిషీ చెప్పాడు.

అట్లా ఆ మసకమసక చీకట్లలో స్వామికి ‘గీతా రహస్యం’ బోధపడిరది.

ఇద్దరూ లేచి హోటల్‌ పక్కనున్న పాన్‌షాప్‌కు వచ్చారు. ఖాదర్‌ ఖిమామీ జర్దా లక్నో పాన్‌ కట్టించి దౌడకు పెట్టి “ఆప్‌ పాన్‌ నహీఁ ఖాతే, ఔర్‌ సిగరెట్‌ నహీఁ పీతే” అని వాఖ్యానిస్తూ..

“పాన్‌ హీ హైద్రాబాద్‌ కీ షాన్‌ హై భై” అని అల్విదా (వీడ్కోలు) చెప్పాడు. మెట్లు ఎక్కేటప్పుడు ఆఫీసు గోడలు ఎందుకు మరకలుగా ఉన్నవో సమజయ్యింది స్వామికి. బ్రతుకు జీవుడా అనుకుంటూ స్వామి బస్సుస్టాండు వైపు బయలుదేరాడు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version