Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-2

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది.]

[అది 18 ఫిబ్రవరి 2014. తెలంగాణ చరిత్ర పుటలలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం బిల్లు పార్లమెంటులో ఆమోదించబడి పాస్‌ అయిన రోజు. స్వామి, చార్మినార్ దగ్గరలోని ఇక్బాల్ హోటల్‍కి వెళ్ళి, ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుని, ఎదురుగా కనబడుతున్న చార్మినార్‍ని చూసి పలకరింపుగా నవ్వుతాడు. బదులుగా చార్మినార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నందుకు అభినందనలు చెబుతుంది. అయితే స్వామి సంతోషంగా కనిపించడు. కారణం అడిగితే, ప్రస్తుతం వస్తున్నది భౌగోళిక తెలంగాణ మాత్రమే, ప్రజా తెలంగాణా రావాలని అంటాడు. అది కూడా త్వరలోనే సిద్ధిస్తుందని చార్మినార్ భరోసా ఇస్తుంది. అంతలో అక్కడ 1969 ఉద్యమంలో మేడే నాడు రాజభవన్ ముందు రైలు కట్ట మీద పోలీసులు జరిపినప్పుడు చనిపోయిన జెఫ్రీ అనే మిత్రుడు ప్రత్యక్షమవుతాడు. తెలంగాణ సిద్ధిస్తున్నందుకు అభినందనలు చెప్తాడు. ఇవన్నీ స్వామి జ్ఞాపకాలు. ఆలోచిస్తూ తొంభై దశకం తొలి సంవత్సరాలలోకి జారుకుంటాడు. జీవనయానంలో ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరకు రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖలో అధికారిగా ఉద్యోగం తెచ్చుకుంటాడు. తాను రిపోర్ట్ చేయాల్సిన ఆపీసుకు వెళ్ళి అక్కడి అధికారి కోదండపాణిని కలుస్తాడు. కొద్దిసేపు జరిగిన సంభాషణలోనే ఆయన మనస్తత్వాన్ని స్వామి గ్రహిస్తాడు. పని ఎలా చేయాలో చెప్తాడు. కుర్చీయే అన్నీ నేర్పిస్తుందని అంటాడు. మర్నాడు ఉదయం స్వామి ఆఫీసుకు వెళ్ళేసరికి ఇంకా సిబ్బంది ఎవరూ రాలేదు. పన్నెండు గంటలకు కోడండపాణి వస్తాడు. కాసేపయ్యాకా, స్వామి ఆయన గదిలోకి వెళ్తాడు. ఆయన స్వామి విధి నిర్వహణ ఎలా ఉండాలో వివరిస్తాడు. హెడ్‌ క్లర్క్‌ కమ్‌ ఆఫీసు సూపరిండెంటు అబ్దుల్‌ ఖాదర్‌ ముందు కూచుని ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ వర్క్‌ తెలుసుకోమంటాడు. డీఎంఓ అని ఒక బుక్‌ ఉంటుందని, దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోమని చెప్తాడు. అబ్దుల్‌ ఖాదర్‌‌ని పిలిచి, స్వామిని పరిచయం చేసి, ఒక నెల రోజుల పాటు డీఓఎం బుక్‌ ప్రకారం ఆఫీసు అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ ఇవ్వమని చెప్తాడు. ఆయన సరేనంటాడు. స్వామి, ఖాదర్ బయటకు వస్తారు. స్వామి కొత్త ఉద్యోగ పర్వం ప్రారంభమవుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-3: సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

క రోజు సాయంకాలం ఆఫీసు నుండి నీరసంగా ఇంటికి వచ్చిన స్వామికి ఆంజల్య ఒక ఉత్తరం అందించింది. ఆ కవరు మీద ఇంద్ర ధనస్సు రంగులతో లతలు, పువ్వులు, పిట్టలు, సన్నసన్న సుతారమైన గీతలు రాతలతో జపనీస్‌ ఆర్ట్‌ మాదిరిగా చూడ ముచ్చటగా ఉంది. దానిని చూడగానే అది తన ప్రియమిత్రుడు, బాల్యమిత్రుడు వేణు రాసిన ఉత్తరం అని తెలిసి అతని పెదాలపై చిర్నవ్వులు వెల్లివిరిసాయి.

కాళ్లు చేతులు ముఖం కడుక్కుని తీరికగా ఆరాం కుర్చీలో వాలి ఆంజల్య అందించిన చాయ్‌, చుక్కలు చుక్కలుగా చప్పరిస్తూ, ఆస్వాదిస్తూ వేణు రాసిన కవర్‌ ఓపెన్‌ చేసాడు. లోపలి సన్నని తెల్లకాగితం మీద నలుమూలలా నల్లపెన్నుతో బార్డర్‌ లైన్లు గీసి వాటి మధ్యన “ఆనందం, ఆనందం, ఆనందం” అని గులాబీ రంగులో గుండ్రని అక్షరాలు. కాగితం మధ్యలో ఆకు పచ్చని పెన్నుతో ముత్యాల సరాల్లాంటి అక్షరాలు. కుడివైపు కాగితం మూలన ఒక ఏడాది పసివాడి బోసినవ్వుల కటింగ్‌ కాగితం మీద అంటించాడు. ఆ పసివాడి పసిడి నవ్వుతో పాటు ఆనంద ఆశ్చర్యాలతో విచ్చుకున్న పొద్దుతిరుగుడు పువ్వుల్లాంటి పెద్ద పెద్ద కళ్లు. సంతోష సందర్భానికి తగినట్టు వున్న ఆ బాలుడి బొమ్మ. ఆ ప్రియమైన లేఖను చూడగానే స్వామి అలసట ఎగిరి పోయి మనసు మానస సరోవరమయ్యింది.

ఆ ముత్యాల సరాల లేఖలోని అక్షరాలను కళ్లల్లో ఒంపుకుని, నింపుకుని చదవసాగాడు.

ప్రియమైన స్వామీ!

నీకు ఉద్యోగం వచ్చినట్లు నీ లేఖ ద్వారా తెలిసి మేమందరం. అమ్మా, నేను, విజయా చాలా చాలా సంతోషపడినాము. మా ముగ్గురి నవ్వులు, ఆనందాలను గమనించిన నా ఏడాది కొడుకు వినయ్‌కు ఏమర్ధమయ్యిందో ఏమో తెలియదు కాని వాడు కూడా నవ్వుతూ కేరింతలు కొట్టాడు. అందుకే ఈ బొమ్మను అంటించాను.

ఇక ఈ ఉద్యోగం రావటంతో నీ కష్టాలన్నీ గట్టెక్కినట్లేనని, నీ జీవిత నావ సుఖశాంతులతో సాగుతుందని నా నమ్మకం. ఈ క్రొత్త ఉద్యోగంలో నీవు మంచి ఆఫీసరుగా పేరు తెచ్చుకుంటావని నేను ప్రత్యేకంగా జోస్యం చెప్పవలసిన అవసరం లేదు.

మనిద్దరి జీవితాలు చాలా గమ్మత్తుగా మలుపులు తిరిగి భిన్నమైన కొత్త మజిలీలకు చేరుకున్నాయి. ఒకానొక చారిత్రక దశలో మన స్నేహం విద్యార్థులుగా, యువకులుగా మొదలయ్యింది. అది 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. 370 మంది అమరులైనా ఇప్పటికీ ఆ కల నెరవేరలేదు. కాని సాహిత్య స్నేహబంధం మనల్ని ఈనాటి వరకు కట్టిపడేసింది. అంటే మన స్నేహం సుమారు రెండు దశాబ్దాలు దాటింది.

మనిద్దరి ఉద్యోగాలు కూడా చాలా గమ్మత్తుగా తారుమారు ఐనాయి. చివరికి నా దారిలోకి నువ్వు నీ దారిలోకి నేను ప్రవేశించాం. కేంద్ర ప్రభుత్వంలో నాది ఎనిమిది సంవత్సరాల ఉద్యోగం. అది నాకు ఒక వృత్తి తప్ప ప్రవృత్తి కాదు. సాహిత్య జీవితానికి దగ్గరగా ఉండాలన్న కోరికతో దానికి  రాజీనామా ఇచ్చాను. అంతమంచి ఉద్యోగం వదలటం సరైనది కాదని అందరూ అన్నా పోటీ పరీక్షలు రాసి  జూనియర్‌ లెక్చరర్‌ ఐనాను. పాత ఉద్యోగం కన్న ఇప్పుడు తక్కువ జీతమే అయినా ప్రాణం సుఖంగా ఉంది. ఇక నీ సంగతి. అనుకోకుండా నీ ప్రవృత్తికి తగిన లెక్చరర్‌ ఉద్యోగం ఊడింది. బ్రతుకు తెరువు కోసం పోటీ పరీక్షలు రాస్తే  నీకు ఏ.సి.టి.వో. ఉద్యోగం వచ్చింది. అది నీ తత్వానికి ఊహించని మార్పు. జీవితం యాదృచ్ఛిక సంఘటనల సమాహారం కదా. నువ్వు అందులో కుదురుకోవటానికి సమయం పడుతుంది. అయినా తప్పదు. మదర్‌ ఇండియా సీన్మాలో నర్గీస్‌ పాట జ్ఞాపకముంది కదా..

జీవన్‌ హై అగర్‌ జహర్‌  తో పీనా హీ పడేగా

జీవ ఫలం చేదు విషం.

ఎందరెందరో తమ ప్రవృత్తులకు విరుద్దమైన వృత్తులలో ఉండి కూడా వారి వారి జీవితాలలో సమతౌల్యాన్ని సాధించారు. తమను తాము కోల్పోలేదు. నువ్వు స్థితప్రజ్ఞుడివన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది.

కావున జయహో.

నీ

వేణు.

మిత్రుడి స్నేహం, ప్రేమా, వాత్సల్యాలకు స్వామి సంతోషపడినాడు. దానితో ఆఫీసు అలసట అంతా దూరమయ్యింది.

“జీవితాలలో సమస్యలకు టోల్‌ఫ్రీ నంబరు స్నేహితుడు”

***

కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి ఏకాంత సమయాన పరుపుపై పడుకుని తన చిన్న పాకెట్‌ ట్రాన్సిస్టర్‌లో వివిధ భారతి ఫర్మాయిషీ గానే వింటున్న స్వామి సన్నిధికి చేరుకున్న ఆంజల్య చటుక్కున పాటను బంద్‌ చేసింది. స్వామి చికాకుగా “ఇదేం బేహద్బీ” అన్నాడు కన్యాశుల్కం భాషలో ఆమె వైపు తిరిగి.

కొంటెగా నవ్వుతూ.. “ముఖతహాఁగా ఒక ముఖ్య ప్రకటన” అన్నది రేడియో భాషలో.

“ఆ ప్రకటన ఏదో పాట అయిపోయిన తర్వాత చేయవచ్చు కదా” అన్నాడు ఇంకా తగ్గని చికాకు గొంతుతో.

“లేదు. చాలా జరూర్‌. చాలా అత్యవసరం ఇప్పుడే చెప్పాలి. వాయిదా వేస్తే వార్త పాసిపోతుంది” అన్నది జర్నలిస్టుల జార్గన్‌లో.

“ఏందో ఆ ముఖ్యమైన ప్రకటన” అన్నాడు వ్యంగ్యంగా కళ్లు మూసుకుని.

“కళ్లు మూసుకుని వినే సంగతి కాదు స్వామీ. కళ్లు తెరిసి నా వైపు చూస్తేనే చెపుతా.”

“సరే” అని కళ్లు తెరచి ఆమె ముఖంలోకి చూసాడు.

“నిన్న మొన్నటి దాకా మనం ముగ్గురమే. ఇక రాబోయే రోజులలో మనం నలుగురం”.

స్వామికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. తర్వాత బల్బు వెలిగింది. అతను నోరు విప్పేలోగా “ఇంకా సమజ్‌ కాలేదా” అంది అల్లరిగా.

“ని-జ-మా” అన్నాడు ఆశ్చర్యంతో. నమ్మలేనట్లు.

‘నిజ్జంగా నిజమే” అన్నదామె నవ్వుతూ.

“జోకు చేస్తున్నావా?”

“జోకులు కేకులు తర్వాత గాని ముందు నీ అరచేయి తెరువు” అన్నది.

“ఏం జోస్యం చెపుతావా” అంటూ అర చేయి తెరిచాడు. ఆంజల్య తన కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు జోడించి అతని అరచేతి మధ్య సున్నిత చర్మాన్ని కసుక్కున్న తన వాడి గోళ్లతో గట్టిగా గిచ్చింది.

“అబ్బా” అన్నడు.

“కమ్మగుందా? ఇప్పుడైనా నిజమని నమ్ముతావా” అన్నది ఇంకా నవ్వుతూనే.

అప్పుడు స్వామి గట్టిగా “హా-హా-హా, “హో-హో-హో” అని నవ్వాడు.

వాళ్లిద్దరూ ఈ సంగతి కలలో కూడా ఊహించలేదు. తామిద్దరూ విప్లవం కోసం పని చేయాలని, పిల్లలు పార్టీ పనికి ఆటంకం కావున అసలు పిల్లల్నే కనవద్దని పెళ్లికి ముందే గట్టిగా అనుకున్నారు. ఆ రోజుల్లో వారికి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆదర్శం. కాని ఆ తర్వాత పార్టీలో జీవితం ఒడిదొడుకులకు గురయ్యింది. రాజకీయాలను వదిలి సాధారణ, మామూలు జీవితం గడుపుతున్నప్పుడు పెళ్లి చేసుకుంటే పాప పుట్టింది కొత్త జీవితాలకి ఒక ప్రారంభంగా, అప్పుడు తమ కన్న కలలకు ప్రతిరూపంగా ‘సమత’ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆంజల్య ఆరోగ్యం సరిగా లేకపోవటం, ఆర్థిక పరిస్థితులు కనాకష్టంగా ఉండి రెండో సంతానం గురించి ఆలోచించే ధైర్యం లేక ఒక్కరితోనే సరిపెట్టుకున్నారు.

ఇప్పుడు జీవితం మళ్లీ మలుపు తిరిగి కొత్త మజిలీ చేరుకుంది. బ్రతుకుకు భరోసా ఏర్పడిరది.

ఆంజల్య నెమ్మదిగా స్వామి చెంతకు చేరి అతని ఛాతీమీద చేయివేసి “మనం కోరుకోకున్నా, కాలం మనకు అనుకోని బహుమతి ఇచ్చింది. దీనిని మనం సంతోషంగా స్వీకరిద్దాం. ‘సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌’ అన్నమాట”  అన్నది.

“అవును నిజంగా మనకు సర్‌ప్రైజ్‌ గిఫ్టే” అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుని.

ఆ తెల్లారి ఇద్దరూ  కలిసి అమ్మకు ఆ శుభవార్త చెప్పారు. ఆమె తన బోసి నోటితో పెద్దగా సంతోషంతో నవ్వుతూ..

“నేను చెప్పలేదారా పెద్దనాని. ఒక కన్ను ఒక కన్నూ కాదు. ఒక బిడ్డ ఒక బిడ్డా కాదని. కనీసం ఇద్దరు ముగ్గురుంటేనే ఇల్లు నిండుగా వుంటది” అన్నది.

నిజమే అని ఇద్దరూ ఒప్పుకొన్నారు.

“నన్ను చూడండ్రి. నేను తొమ్మిది మందిని కనలేదా? పోంగ జిక్కినోళ్లను ఆర్గురిని మీ బాపుకు వచ్చే తక్కువ జీతంతో పెంచలేదా? ‘నారు పోసిన వాడు నీరు పోయడా’ అని పెరుమాండ్ల మీద నమ్మకంతో పిల్లలను కన్నాం” అన్నది.

నిజమే అన్నట్లు ఇద్దరూ తలలూపారు. ఆ ఉదయపు శుభవార్తతో ఆమెకు హుషారు కలిగి రొండిలో దోపుకున్న ఆకుల సంచి ఇవతలికి లాగి పాన్‌ తయారు చేసుకుని దాన్ని సుతారంగ దౌడకు పెట్టుకుని అరమోడ్పు కన్నులతో..

“ఈ సారి నీకు కొడుకుపుడతాడురా” అన్నది.

“ఎవరైనా పరవాలేదు అమ్మమ్మా” అన్నది ఆంజల్య.

“అట్లేం కాదు. స్నానం చేసి మన ఇలవేలుపు చిల్పూరు గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతాను. మనుమడి పుట్టు వెంట్రుకలు నీ దగ్గరే తీస్తా అని”.

“సరే నీ ఇష్టం అమ్మా” అని స్వామి ఆమె మాటకు అడ్డు చెప్పలేదు.

జీవితం కొట్టిన దెబ్బలకు మెత్తబడి ఈ మధ్య కొన్నింటికి రాజీపడటం నేర్చుకుంటున్నాడు. యవ్వనంలో ఉన్న ‘ఖడక్‌’ నడీడుకు వచ్చే సరికి ‘నరమ్‌’గా (మెత్తగా) మారుతదేమో.

‘పహెలా ఖడక్‌, బీచ్‌ మే నరమ్‌ బాద్‌ మే బేషరమ్‌’ అని ఒక ఉర్దూ సామెత.

ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి వచ్చినంక ఫ్రెష్‌ అయ్యి శాలిబండ మార్కెట్‌లో వుండే అక్క ఇంటికి శుభవార్త చెప్పటానికి ఇద్దరూ బయలుదేరారు. అయితే స్వామి మనసులో ఒక మూల రెండు కారణాల వలన దిగులుగా ఉంది. వాటి గురించే లోలోపల మథనపడుతూ, ఆలోచిస్తూ అక్క ఇంటికి చేరుకున్నాడు.

అక్కా బావ డ్రాయింగ్‌ రూంలో కూచుని నలుపుతెలుపుల దూరదర్శన్‌లో సాయంత్రం ఏడుగంటలకు వచ్చే తెలుగు వార్తల కోసం నిరీక్షిస్తున్నారు.

“రాండ్రి రాండ్రి” అని నవ్వుతూ అక్క వారిద్దర్నీ ఆహ్వానించింది. తెల్లటి గాజుగ్లాసులతో చల్లటి మంచి తీర్థం కూడా తెచ్చిచ్చి తను కూడా ఒక కుర్చీలో ఆరాంగ కూచుంది.

“మీరిప్పుడు తెలుగు వార్తలు బందు చేస్తే మేం మీకు ఒక శుభవార్త అందిస్తాం” అని ఆంజల్య నాందీ ప్రస్తావన ప్రారంభించింది.

బావ టక్కున టి.వి. బందు చేసి “ఏందా శుభవార్త?” అన్నాడు ఆశ్చర్యంతో.

అక్కేమో ముసిముసి నవ్వులు నవ్వుతూ నాకంతా తెలుసు సుమా అన్నట్లు కుర్చీలో పురుసత్‌గా కూచుంది. ఈ రోజు ప్రొద్దునే అమ్మ పక్కింటి నుండి అక్కింటికి ఫోను చేసి ఉప్పందించినట్లుందని స్వామి పసిగట్టాడు. అయితే బావకు మాత్రం అక్క చెప్పనట్లుంది. మేము చెప్పటమే బాగుంటుందని.

“బావా ఆంజల్యకు ఇప్పుడు రెండో నెల” అని స్వామి ముక్తసరిగా చెప్పాడు.

“అరెరె ఎంత మంచి వార్తరా. ఈ సంవత్సరం నీకు కాలం కలిసి వచ్చింది. అటు ఆఫీసరు ఉద్యోగం ఇటు ఆంజల్య ప్రెగ్నెంటు కావటం” అన్నాడు ఆయన సంబరపడుతూ.

“కష్టాలు కలిసి వస్తాయి. సుఖాలు విడి విడిగా వస్తాయి” అన్న టాల్‌స్టాయ్‌ మాట స్వామికి జ్ఞాపకం వచ్చింది.

అక్క వంటింటి గదిలోకి వెళ్లి అప్పటికే ఆమె అడ్వాన్సుగా తయారు చేసి పెట్టిన రవ్వలడ్డూలు స్టీలు పళ్లెంలో పట్టుకొచ్చింది. అందరూ నోర్లు తియ్యగ చేసుకుంటుంటే..

“మామయ్య మిమ్మల్నేదో సలహా అడగటానికి వచ్చాడు” అని చిన్నాయనకు చెప్పింది ఆంజల్య.

“ఇంకా ఇందులో ‘సలహా’ అవసరం ఏముందిరా” అన్నాడు ఆయన స్వామిని చూస్తూ.

“ఏం లేదు బావా. ఈమె ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటబడలేదు కదా. అటువంటప్పుడు మరి ఈ రెండో వాళ్లు రావటం సరైందేనా అని నా అనుమానం” అన్నాడు.

“అంటే” అన్నాడు ఆయన అర్థం కానట్లు.

“ఏం లేదు చిన్నాయనా. పుట్టే పిల్లలకు ఏమైనా సమస్య ఉంటదేమో అని ఈయన అనుమానం” అన్నది ఆంజల్య.

‘అవును” అన్నాడు స్వామి అక్క వంక చూస్తూ.

బావ కొంచెం సేపు కళ్లు మూసుకుని ఆలోచించి “ఒరే నా చిన్నతనంల ఎంత మందిని చూడలేదు. రోగాలు, నొప్పులతో బాధపడుకుంటనే తల్లితండ్రులు సంసారాలు చేయలేదా? పిల్లల్ని కనలేదా. ఆ పుట్టినోళ్లందరూ నాకు తెలిసి ఆరోగ్యంగనే ఉన్నరు”.

ఇంతలో అక్క మధ్యలో జోక్యం చేసుకుని “మీ ఇద్దరికీ అంత అనుమానం ఉంటే ఫ్యామిలీ డాక్టరును సంప్రదించి సలహా తీసుకోండ్రి” అన్నది.

ఆ ఇద్దరి మాటలతో వారికి కొంచెం ధైర్యం వచ్చింది.

“ఇక రెండో సంగతి కూడా అడుగు” అన్నది ఆంజల్య స్వామిని చూస్తూ..

“ఏం లేదు బావా. ఇక రెండో వాళ్లు వచ్చేసరికి నాకు నలభై ఏండ్లు. ఈ వయసులో పిల్లల్ని కని వాళ్లకు న్యాయం చేయగలమా? అని మా ఇద్దరి భయం” అన్నాడు.

దానికి ఆయన పెద్దగా నవ్వి “మనం హిందువులం ఇట్లనే బయపడుకుంట ఒకరిద్దరితో సరిపెట్టుకుంటం. అదే ముస్లింలను చూడు అల్లా మీద భారం వేసి యాభై సంవత్సరాల వయస్సులో కూడా పిల్లల్ని ఇంకా కంటనే ఉంటరు. వాళ్లకున్న ధైర్యం మనకుండదు. అయినా నీకు ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది. ఇంకా ఇరవై ఏండ్ల సర్వీసు. ఇంకా పై పదవులు, ప్రమోషన్లు కూడా వస్తాయి. నీ ఆర్థిక పరిస్థితి భవిష్యత్తులో చాలా బాగుంటది. నువ్వు రిటైర్‌ అయ్యే నాటికి నీ రెండో సంతానం డిగ్రీ చదువులలో ఉంటది. ఇప్పుడు సమతకు పదేండ్లు కదా. నువ్వు రిటైర్‌ అయ్యేనాటికి దానికి ముప్పై ఏండ్లు. అంటే అప్పుడు దాని పెండ్లి కూడా అయిపోతది. ఇక ఉన్న ఒక్కర్ని సాకలేరా? అని వివరంగా విప్పి చెప్పి ధైర్యం చెప్పాడు.

ఆయన ఇచ్చిన భరోసాతో ఇద్దరికి సంతోషమూ, తృప్తి, ధైర్యం కూడా కలిగింది. వాళ్లు వాపస్‌ అవుతున్నప్పుడు అక్క ఆంజల్య చేతికి తను చేసిన ‘కోడి మాంసం వేపుడు డబ్బా’ అందించింది.

మరునాడు సాయంత్రం తమకు బాగా తెలిసిన ఫ్యామిలీ డాక్టర్‌ క్లినిక్‌కు వెళ్లారు. ఆంజల్య ఆరోగ్యం సంగతి అతనికి కూడా తెలుసు. విషయం చెప్పి తమ అనుమానం కూడా తెలియచేసి “మీ సలహాకోసం వచ్చాం” అన్నారు.

“మీకెంతమంది పిల్లలు” అడిగాడు డాక్టర్‌. “ఒక పాప పది సంవత్సరాలు” అన్నది ఆంజల్య.

“చూడమ్మా ఈ కీళ్ల నొప్పులన్నది జన్యు సంక్రమిత, వారసత్వ జబ్బు కాదు. నూటిలో ఒకరికి కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు. మీకున్నది ఒక పిల్లనే కదా! ఇంకొకరుంటేనే బాగుంటది. పుట్టబోయే పిల్లలకు ఏం కాదు. సంతోషంగా ఉండండి” అని బంగారం లాంటి సలహా ఇచ్చాడు.

ఇద్దరి మనసులలో మబ్బులు తొలిగాయి. ఆనందంతో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నడుస్తూ ఇంటికి వస్తున్నప్పుడు..

“ఈ సంగతి సమతకు చెప్పవద్దు. లేకపోతే ఇప్పుడే అది గల్లీల అందరికీ టాంటాం ప్రచారం చేస్తది అన్నది ఆంజల్య.

“నిజమే చెప్పవద్దు” అన్నడు స్వామి.

తీరా వారిద్దరూ ఇల్లు చేరి గుమ్మంలో కాలు పెట్టారో లేదో సమత ఎదురుంగ  ఎగురుకుంట పరిగెత్తుకొచ్చి “మమ్మీ నాకు తమ్ముడు పుడతాడట కదా” అని గల్లీకంతటా వినబడేటట్లు కేకలు వేసింది. “నాకు నానమ్మ చెప్పిందిలే” అని చేతులూపుకుంట గంతులు వేసింది. దాని తల వెనుక బిగించి కట్టిన రెండు జడలకున్న గులాబీ రంగు రిబ్బన్లు కూడా గాలిలో అటు ఇటూ తోకల్లా ఊగుతూ దానితో పాటు గంతులు వేసాయి.

ఇద్దరూ ఒకరి ముఖాలొకరు ముందు నిస్సహయంగా చూసి తర్వాత క్షణంలో పక్కున నవ్వారు. సమత అంత కంటె గట్టిగా పకపక నవ్వింది.

“పిల్లల్ని కనొద్దు, విప్లవంలో పాల్గొనాలి” అని వారిద్దరూ ఒకప్పుడు కన్న కలలు, చేసుకున్న వాగ్దానాలు కాలం చేసిన గారడీ వలన కనుమరుగైనాయి.

అధ్యాయం-4: కుర్సీ సబ్‌ కుచ్‌ సిఖాతా హై

సూపరిడెంట్‌ అబ్దుల్‌ ఖాదర్‌ ముఖంలో సదా చిర్నవ్వు తొణికిసలాడుతుంది. మనిషిలో హాస్య ప్రియత్వం ఎక్కువ. హాస్యరసంతో పాటు మాటల మధ్య ‘లడ్డూల మధ్యలో కిస్‌మిస్‌లు, కాజు పలుకుల్లా’ ఉర్దూ సామెతలు కూడా అలవోకగా దొర్లుతాయి. పైగా స్నేహశీలి. అసలు సిసలు హైద్రాబాదీ ఐన స్వామికి చాలా మంది ముస్లింలు ఎన్ని ఈతిబాధలున్నా, ఎన్ని పరేషాన్లు ఉన్నా మజాక్‌ మజాక్‌ మాటలు మాట్లాడుకుంటనే జీవితాన్ని తేలికగా తీసుకుని బ్రతుకుబండిని చాలా సులభంగా ముందుకు నడిపిస్తారన్న సంగతి తెలుసు.

బాస్‌ కోదండ పాణి ఆదేశించినట్లు అడ్మినిస్ట్రేషన్‌ వ్యవహారాలలో ఒక నెల రోజుల పాటు శిక్షణ పొందటానికి అబ్దుల్‌ ఖాదర్‌ టేబుల్‌ దగ్గర కూర్చోవటం మొదలు పెట్టాడు.

ఖాదర్‌ వయస్సులో స్వామి కన్నా కొంచెం పెద్దవాడు కాని పదవి హోదాలో మాత్రం స్వామికన్నా చిన్నవాడు. మొదటి రోజున “ఆయియే స్వామి సాబ్‌” అని తన ఎదురుంగ ఉన్న కుర్చీని చూపిస్తూ ఆహ్వానించి “ముబారక్‌ హో” (శుభాకాంక్షలు) అన్నాడు. స్వామి కూర్చున్న తర్వాత టేబుల్‌కున్న డ్రాయర్‌ను లాగి అందులో నుండి ఒక వెండి డబ్బా ఇవతలికి తీసి ఒక పాన్‌ను మర్యాదగా స్వామికి అందించాడు.

“సారీ” అన్నాడు స్వామి. ఉస్తాద్‌ల గండాబంధన్‌ కార్యక్రమం గుర్తుకొచ్చింది.

రియాజ్‌ (సాధన, అభ్యాసం) చేసేముందు హిందూస్థానీ సంగీత విద్వాంసులు అంటే ఉస్తాద్‌లు తమ షాగిర్ద్‌లకు (శిష్యులకు) సంగీత సాధనకు శ్రీకారం చుట్టే రోజును “గండా బంధన్‌” కార్యక్రమం అంటారు. అందులో శిష్యులు లేదా శిష్యురాళ్ల చేతి మణికట్టుకు కాషాయరంగు దారాన్ని రెండు మూడు వరుసలు బిగించి కట్టి తాంబూలాన్ని శాస్త్రప్రకారం అందిస్తారు. అది సాంప్రదాయమైన పద్దతి. అదొక రివాజు.

“ఓ. ఆప్‌ పాన్‌ నహీఁ ఖాతే” అని ఉర్దూలో ఆశ్చర్యపడి అదే పాన్‌ తన నోట్లో నాజుకుగా దౌడకు పెట్టుకుని ఆ తర్వాత తెలుగులో కుశలప్రశ్నలకు దిగాడు. అతను తెలుగు ధారాళంగానే మాట్లాడుతున్నా అందులో ఉర్దూ పదాల యాసను గమనించాడు. సాధారణ ఉత్తరభారతదేశం ప్రజలు ఇంగ్లీషు మాట్లాడుతున్నా అందులోని ‘హిందీ’ యాస దక్షిణ భారతదేశం వారికి సులభంగానే తెలుస్తుంటది. అట్లనే రాయలసీమ ముస్లింలు ఉర్దూ మాట్లాడుతున్నా అందులోని తెలుగు యాస అనుకోకుండా బయట పడుతుంది. బెంగాలీ బాబులు ఇంగ్లీష్‌లో ‘బేకరీ’ని బేకారి అని పలుకుతారు. బేకారి అంటే హిందీలో నిరుద్యోగి అన్న అర్థం వస్తుందని పాపం వారికి తెలియదు.

పరిశీలనా దృష్టి కలిగిన స్వామి మెదడు ఏక కాలంలో ఒకే విషయాన్ని రెండు రకాలుగా గమనిస్తూ ఉంటుంది. అందువలన అప్పుడప్పుడూ అతను పరాకుగా, ఆబ్సెంట్‌మైండ్‌గా కూడా ఎదుటివారికి కనబడుతుంటాడు.

“ఆప్‌ బహుత్‌ ఖుష్‌నసీబ్‌ హై (అదృష్టవంతుడివి) స్వామీ సాబ్‌” అన్నడు ఖాదర్‌.

“క్యోం” అన్నాడు స్వామి.

“చూడుండ్రి మీరు నాకన్నా చిన్నవారు. అయినా ఆఫీసర్‌గా రిక్రూట్‌ అయి ఈ డిపార్ట్‌మెంటుకు వచ్చారు” అన్నాడు.

ఏమనాలో తోచక చిరునవ్వు నవ్వాడు స్వామి.

“మేరే కో దేఖో. ఇరవై ఏండ్లకు ఎంప్లాయ్‌మెంటు ఆఫీసు నుండి క్లర్క్‌గా ఇక్కడికి వచ్చాను. సీనియర్‌ క్లర్క్‌ అయితందుకు పన్నెండు సంవత్సరాలు దాని తర్వాత హెడ్‌ క్లర్కు కమ్‌ సూపరిడెంట్‌ అయెందుకు మరో ఐదు సంవత్సరాలు. మళ్లీ ఐదేండ్ల నుండి ఇదే పోస్టుల లట్కాయిస్తున్న. నలభై మూడేండ్ల వయసు వచ్చింది కాని ఏం ఫాయిదా ఇంకా ఏసీటీఓ ప్రమోషన్‌ కోసం ఎదిరి చూస్తనే ఉన్న.”

“అయ్యో” అన్నాడు స్వామి సానుభూతిగా.

“అందుకే మీరు లక్కీ. ఇక నేను ఇంతెజార్‌ మే హీ ఇంతఖాల్‌ హోజాతా” (నిరీక్షణలోనే ప్రాణాలు కోల్పోవటం) అన్నాడు.

“అయ్యయ్యో. అట్లా మాట్లాడవద్దు” అని ఓదార్చాడు స్వామి. ఖాదర్‌ అటెండరుతో చాయ్‌ తెప్పించాడు. స్వామి చాయ్‌ తాగినంక

“ఖాదర్‌ సాబ్‌ మన సార్‌ ఏదో డీఓఎం అని పుస్తకం చెప్పాడు. అది మీ దగ్గరుంటే ఒకసారి ఇవ్వండి. ఈ రోజు అదే చదువుతాను” అన్నాడు.

“డీఓఎం” అని పలుకుతూ వ్యంగ్యంగా నవ్విన అతను మీకొక రహస్యం చెప్పనా” అన్నాడు.

“ఏంటది”?

“అది అంగ్రేజీ జమానా నాటి బుక్‌. అదిప్పుడు ఏ ఆఫీస్‌లోనూ కనబడదు. నేను భీ దాన్ని గురించి వినటమే గాని నా పాపపు కండ్లతో ఎప్పుడూ చూడలే. చదవలే. ఉంటే, గింటే సెక్రటేరియట్‌ లైబ్రరీలో ఏదో ఒక మూల చెక్క అల్మారల చెదలు పట్టిన స్థితిల దొరుకుతదేమో! దానిని ఇప్పుడు పురావస్తు శాఖ వారు శోధించి, సాధించాలి”.

“అయ్యో ఇప్పుడెట్ల మరి, ఆయనేమో అది చదివి ఆఫీసు అడ్మినిస్టేషన్‌ గురించి తెలుసుకోవాలి అన్నాడు కదా” అన్నాడు స్వామి అయోమయం జగన్నాధంలా ముఖం పెట్టి.

“ఆయన అట్లనే అంటడు” అని మరోసారి వ్యంగ్యంగా నవ్వి “ఆయన కూడా తన జిందగీల దాని గురించి వినటమే గాని ఎప్పుడూ చూసి ఉండడు. చదివి ఉండడు. మీలాంటి కొత్తవారి ముందు తన ఆధిక్యతను ప్రదర్శించి, మిమ్మల్ని తికమక పెట్టటానికి, మాలాంటి చిరుద్యోగుల్ని దబాయించటానికి అట్లా నటిస్తాడు”.

పుస్తకం చదవాలి అని ఉత్సాహపడిన స్వామి ఆ మాటలు విని నీరసపడిపోయి నిస్సహాయంగా అతని ముఖం వైపు చూసాడు.  ఖాదర్‌ ఆ కొత్త ‘బకరా’ను గమనించి “పరేషాన్‌ కాకుండ్రి సార్‌” అని ఓదార్చాడు.

ఒకప్పుడు క్లాసులో డిగ్రీ విద్యార్థులకు సూటిగా, స్పష్టంగా రాజనీతి తత్వశాస్త్రం పాఠాలను బోధించిన ఆ లెక్చరర్‌ ఇప్పుడు ఈ మనుష్యుల ద్వంధ ప్రవృత్తులు అర్థంకాక “మరిప్పుడు నేనేం చెయ్యాలి” అని గాలిపోయిన బెలూన్‌ లాగా ముఖం పెట్టి అడిగాడు.

“మీకెందుకు సార్‌, మై హూఁనా? నేను మీకు అన్నీ ఖుల్లంఖుల్లాగ చెప్త కద”. అంటూనే “నీటిలో చేపపిల్లకు ఈత ఎవరు నేర్పిస్తరు సార్‌” అని కొశ్నించాడు. స్వామి మౌనంగా ఉండటం చూసి “ఒక్కసారి ట్రేనింగ్‌ ఐపోయి కుర్చీల కూచుంటే చాలు ఆ కుర్సీనే సబ్‌కుచ్‌ సిఖాతాహై. అంటే అనుభవం మీద అన్నీ తెలుస్తాయి” అని నిజాం కాలం నుండి సర్కారీ ధప్తర్‌ల్ల తాతల కాలం నుండి నానుతూ వస్తున్న సామెతను తను మాత్రమే కొత్తగా చెపుతున్నట్లు పునశ్చరణ చేసాడు ఆ ఫుట్‌బాల్‌.

చేసేదేమీ లేక చివరికి ‘మిడతం బొట్ల’ చేతికి చిక్కినట్లు తెలుసుకుని వినదగునెవ్వరు చెప్పిన రీతిలో “చెప్పండి” అని సర్దుకుని సిద్ధంగా కూచున్నాడు బుద్ధిమంతుడైన విద్యార్థిలాగా.

అప్పుడు ఆ విధంబుగా జనమేజయునితో వైశంపాయనుడు ఇట్లనియె..

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version