Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-19

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[రెండు భిన్న ప్రపంచాల మనుషులను దగ్గరగా చూస్తాడు స్వామి. ఒకటి ఆదర్శవాద ప్రపంచం, మరొకటి స్వార్థపరుల భౌతికప్రపంచం. రెండు భిన్నమైనవి. ఒక రోజు ఆఫీసుకి వెళ్ళేసరికి ఒక్క తన గదిలో తప్ప మిగతా సిబ్బంది బల్లలూ, కుర్చీలు అన్నీ వంకరటింకరగా మార్చబడి ఉండడం చూసి, అటెండర్‌ని పిలిచి అడిగితే, ఓ కోయదొర వచ్చి, అలా మార్పించాడనీ, అలా కూర్చుంటే ధనలాభం కలుగుతుందని చెప్పాడని చెప్తాడు. ఆర్థిక సంస్కరణల ప్రభావంతో ప్రభుత్వం తమ డిపార్టు‌మెంట్ లోని కొన్ని ముఖ్యమైన విధులను, పన్నుల వసూళ్లను ప్రైవేటు సంస్థకు అప్పచెప్పాలన్న ఆలోచన చేస్తోందని తెలిసిన స్వామి సిబ్బందిని ఆందరినీ కూడగట్టి ఉద్యమం లేవదీస్తాడు. కొత్త నాయకుడవుతాడు. తోటి ఉద్యోగి అశోక్ స్వామిని హెచ్చరిస్తాడు. ప్రభుత్వం అన్నీ గమనిస్తూ ఉంటుందనీ, స్వామి మీద ఎసిబి దాడులు చేయిస్తుందని భయపెడతాడు. స్వామి అతన్ని పట్టిచుకోకుండా, అతన్నే జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అవినీతికి పాల్పడిన డబ్బుతో కారు కొంటాడు అశోక్. ఓ రోజు అశోక్ కొడుకు తండ్రికి తెలియకుండా ఆ  కారుని బయటకి తీసి, మిత్రులనెక్కించుకుని, మద్యం మత్తులో నడిపి, యాక్సిడెంట్ అయి చనిపోతాడు.అశోక్‌ను ఓదార్చటం ఎవరి తరమూ కాదు. ఆరునెలల తర్వాత మనోవ్యాధితో అశోక్‍ కూడా చనిపోతాడు. హిమాలయాల యాత్ర నుంచి ఇంటికి తిరిగివస్తున్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంటాడు స్వామి. మోహనరావు రిటైరవుతున్న సందర్భంగా, అతనికి పార్టీ ఇస్తాడు స్వామి. ఆ రోజు జరిగిన సంభాషణలో కోదండపాణి అనే అవినీతి అధికారి ప్రస్తావన వస్తుంది. అతని గురించి పూర్తి వివరాలు మోహన్‌రావుని అడిగి తెలుసుకుంటాడు స్వామి. డిపార్ట్‌మెంటులోని మరో ఉద్యోగి పిచ్చి వెంకట్రావు పూర్వాపరాలు తెలుసుకుంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-20: సమత పెళ్లి కూతురాయెనే

కాలవాహిని అలల వాలున రోజులు, నెలలు గులకరాళ్లలా దొర్లుకుంటూ ముందుకు పొర్లిపోతుంటవి. చూస్తుండగానే స్వామి ఇంట్లో రెండు క్యాలెండర్లు మారిపోయి మూడో సంవత్సరం వచ్చింది.

సమతకు ఇంజనీరింగు డిగ్రీ చేతికొచ్చింది.

ఆంజల్య, స్వామి ధైర్యం చేసి పై చదువులకు విదేశాలకు పంపిద్దాం అని ఆలోచనలు చేసారు కాని సమతకు చెప్పగానే అది ఒప్పుకోలేదు.

“డాడీ ఉన్న కొన్ని పైసలు ఖర్చుచేసి నన్ను విదేశాలకు పంపిస్తే ఎట్లా? రాజా ఇప్పుడు నైన్త్‌. వాడు డిగ్రీకి వచ్చేటప్పటికి వాడిని చదివించటం కష్టమైతది. అప్పటికి నువ్వు రిటైర్‌ అవుతవు. అప్పుడు మీరు చాలా కష్టపడతరు. నేను విదేశాలకు వెళ్లను” అని స్పష్టంగా చెప్పింది.

“మరెట్లా? ఇక్కడే పి.జి. చేస్తవా?” అని ఆంజల్య అడిగింది.

“అది కూడా చేయను. రెండు, మూడు ఏండ్లు జాబ్‌ చేస్తా. కొన్ని డబ్బులు సంపాదించుకుని ప్యూచర్‌ ప్రోగ్రామ్‌ తర్వాత ఆలోచిస్తా” అన్నది. సరే అన్నారు మమ్మీడాడీ.

అప్పుడప్పుడే హైద్రాబాద్‌ల సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్న కంపెనీలలో కూడా ఉద్యోగం రావటం లేదు. దాని ఫ్రెండ్‌ ఒకరు ఎవరికో ఆర్నెల జీతం ముందే ఇచ్చి హైద్రాబాద్‌లనే జాయిన్‌ అయ్యిందట.

మమ్మీకి ఆ సంగతి చెప్పింది. “మరి మనం కూడా ఇద్దామా? హాయిగా హైద్రాబాద్‌లనే ఉద్యోగం” అని ఆంజల్య ఆశగా అనగానే..

“ఛీ ఛీ..” అన్నది.

“అదేంది” అని నివ్వెరపోయింది ఆంజల్య.

కళ్లనిండా నీళ్లు నింపుకుని, “ఇంత కష్టపడి చదువులు చదివి ఎదురు డబ్బులు ఇచ్చి ఉద్యోగం చేస్తానా. అది నాకే అవమానం” అని ఉక్రోశంగా అన్నది.

ఈ సంగతి ఆంజల్య స్వామికి చెప్పినపుడు స్వామి గర్వంగా “అవును అది మన బిడ్డ కదా” అన్నాడు.

పిల్లలకు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి వ్యక్తిత్వం ఉండేలా పెంచాలని చాలాసార్లు ఇద్దరు అనుకునేవారు. చివరికి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. తనే ఒంటరిగా అక్కడికి వెళ్లి షేరింగ్‌ రూం హాస్టల్‌ ఒకటి వెదుక్కుని జాబ్‌లో జాయిన్‌ అయ్యింది. ఇంటి నుండి ఒక రూపాయి  తీసుకోకుండా తన తిప్పలేవో తను పడిరది. ఒక సంవత్సరం తర్వాత పెళ్లి సంబంధాలు వెదకటం ప్రారంభించారు. స్వామి బంధువర్గంలోని వారు మహా చాదస్తులు. పట్టింపులు ఎక్కువ. వారి ఆలోచనలు, విశ్వాసాలు ఆంజల్య స్వామి ఇద్దరికీ నచ్చకపోయేవి.

ఆఖరికి ఒక సంబంధం. వాళ్లే వెదుక్కుంటూ వచ్చారు. అప్పుడు సమత బెంగుళూరులో ఉంది. ఈ మాటా ఆ మాటా మాట్లాడి వెళ్లిపోయి చివరికి ఎవరితోనో కామెంటు చేసారట. వారింట్లో ఏ గోడకూ దేవుండ్లు, దేవతల పటాలు లేవు. అసలు పూజాగదే ఆ ఇంట్లో లేదు. గోడలమీద ఎవరెవరివో ఫోటోలు ఉన్నాయి. అందులో ‘కాళోజీ’ బొమ్మ ఒక్కటే మాకు తెలుసు. అయినా ఆ కాళోజీ నక్సలైట్లకు సపోర్ట్‌ చేస్తడట కదా” అని అనుమానాలు బయటపెట్టారట.

సమత ఆ చాదస్తపు ఇళ్లల్ల అడ్జెస్టు కాలేదు అనుకుని ఏ సంబంధాలు చూడకుండా ఇద్దరు ఆ సంగతి కాలానికి వదిలిపెట్టారు.

ఒకరోజు గోపాల్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. ఆయన వాళ్లకు మంచి దోస్తు. ఒకప్పుడు జన నాట్యమండలిలో కళాకారుడిగా, ఫౌండర్‌మెంబర్‌గా పనిచేసాడు. ‘మాభూమి’ సీన్మాలో నటించాడు. చాయ్‌, తాగినంక వాళ్లిద్దరికీ ఒకేసారి చెప్పాడు. “మా వాడికి సంబంధాలు వెతుకుతున్నాం. వాడు కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. మీరూ మేమూ ఒకే ఆలోచనా విధానం కలిగిన వాళ్లం. మీ సమతను మీతోపాటు చాలా మీటింగులల్ల మేం చూసాం ఆ అమ్మాయి కలివిడితనం, మంచి మర్యాదా మాకు నచ్చాయి. అన్నాడు.

స్వామి, ఆంజల్యకు ఆ ప్రపోజల్‌ నచ్చింది. చివరికి ఆంజల్యనే మాట్లాడింది:

“ఈ సారి సమత సెలవులకు ఇక్కడికి రాంగనే మీకు ఫోను చేస్తం. పిల్లా, పిల్లగాడూ ముందు ఇద్దరు కల్సి ఒకర్నొకరు చూసి అన్ని మాట్లాడుకోనివ్వండి తర్వాత మనం పెద్దలం ఆలోచిద్దాం” అన్నది.

“అదే సరైన ఆలోచన” అని గోపాల్‌రెడ్డి వెళ్లిపోయాడు. సమత ఆర్నెల్లకు గాని ఇంటికి రాలేదు. వచ్చిన తర్వాత సంగతేందో చెప్పారు.

సమత చిన్నగా నవ్వి: “నేనొకర్ని ఇష్టపడ్డాను డాడీ” అన్నది.

ఆ మాట విని ఇద్దరూ ఆశ్చర్యంతో, సంతోషంతో అతని వివరాల కోసం ప్రశ్నల వర్షం కురిపించారు. సమత అన్ని ప్రశ్నలకూ ఓపికగా జవాబులు, వివరాలు చెప్పింది. మొత్తానికి సారాంశం ఏమిటంటే:

అబ్బాయి పేరు శాంతికిరణ్‌, ఇద్దరూ ఒకేరోజు ఉద్యోగంలో చేరారు. రెండేళ్ల నుంచి ఇద్దరూ ఒకే ఆఫీసులో కొలీగ్స్‌. వాళ్లది నెల్లూరు సిటీ. బ్రాహ్మలు. శుద్దశాఖాహారులు. తండ్రి గవర్నమెంటులో సివిల్‌ ఇంజనీరు. తల్లి గృహనిర్మాత. వాళ్లకు ఇద్దరూ మగపిల్లలే. ఇతను ఇంటికి పెద్దవాడు. తమ్ముడు ఫస్ట్‌ఇయర్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంటు.

“అయ్యో వాళ్లు బ్రాహ్మలు. మనం బి.సి.లం వాళ్లు శాఖాహారులు. నీకేమో నాన్‌-విజ్‌ చాలా ఇష్టం. పైగా వారు ఆంధ్రావాళ్లు వాళ్ల భాషా వ్యవహారాలు అన్నీ వేరు కదా? అసలు వాళ్లు ఒప్పుకుంటారా” అని ఇద్దరూ పరేషాన్‌ అయ్యిండ్రు.

“మేమిద్దరం అన్నీ ముందే మాట్లాడుకున్నాం. అతను వాళ్లింట్లో ఒప్పించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాని వాళ్లు ఒప్పుకోవటం లేదట. అయినా ట్రై చేస్తున్నాడు” అని చెప్పింది.

ఆంజల్య, స్వామి ఇద్దరూ వాళ్లు ఒప్పుకోకపోతే ఎట్లా అని టెన్షన్‌కు గురైనారు. సమత ప్రశాంతంగానే ఉంది. తమ్ముడు రాజాను తీసుకుని సీన్మాకు పోయింది. తెల్లారి చాయ్‌లు తాగేటప్పుడు మరో సంచలన సంగతి పురుసత్‌గ చెప్పింది.

‘శాంతికిరణ్‌ తన కన్న రెండు సంవత్సరాలు చిన్న’ అని.

ముందే టెన్షన్‌లో ఉన్న వారిద్దరూ ఈ సారి ఏకంగా తలలు పట్టుకుని కూచున్నారు.

“ఈ రోజులల్ల, ఇది అంత సీరియస్‌ సంగతికాదు. సచిన్‌ టెండూల్కర్‌ కన్న అతని భార్య అంజలి ఆరు సంత్సరాలు పెద్దది. సునిల్‌దత్‌ కన్న నర్గీస్‌ ఐదు రోజులు పెద్దది. కాలం మారుతుంది కదా” అని ఇద్దరికి సమ్జాయించింది. శాంతికిరణ్‌కు అభ్యంతరం లేనపుడు మనకెందుకు అని సమాధానపడ్డారు.

సమత ఉన్నప్పుడే శాంతికిరణ్‌ ఒకరోజు హైద్రాబాద్‌ వచ్చాడు. పిల్లగాడు చూడటానికి బాగున్నాడు. మంచిరంగు, సమతకన్న పొడుగు ఎక్కువ.

“నేను మా అమ్మానాన్నను అన్ని విధాలుగా ఒప్పిస్తున్నా. చివరికి వొప్పుకోకపోయిన మేం పెళ్లి చేసుకుంటాం” అని దృఢంగా నమ్మకంగా చెప్పాడు. ఆ రాత్రే ఇద్దరూ బెంగళూరు వెళ్లిపోయారు.

పదిరోజుల తర్వాత శాంతికిరణ్‌ ఫోను చేసాడు. “మీరిద్దరు ఒకసారి నెల్లూరుకు వెళ్లి మా పేరెంట్సును కలవండి. అది పద్ధతి కదా మర్యాదగా కూడా ఉంటది. నేను నా ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్న. మీరూ మీ ప్రయత్నం చేయండి” అన్నాడు. సమత కూడా అదే మాట చెప్పింది.

ఒకరోజు వాళ్లకు మంచి మిత్రుడు, రచయితా డాక్టర్‌ కేశవరెడ్డి వచ్చాడు. ఆంజల్య సంగతంతా ఆయనకు వివరించింది అంతా సావధానంగా విని:

“తప్పకుండా వెళ్లి వాళ్లను కలవండి, వాళ్లు పరుషంగా, కోపంగా బాధతో ఏమన్నా మాట్లాడినా మీరు మాత్రం బ్యాలెన్సు కోల్పోవద్దు. ఓపికగానే నచ్చచెప్పండి. మళ్లీ మాట్లాడుకుందాం అని చెప్పి తిరిగిరండి, ఆలోచించుకోవడానికి వాళ్లకూ సమయం కావాలి కదా” అని సలహా ఇచ్చాడు.

కేశవరెడ్డి సలహాను మనసులో పెట్టుకుని నెల్లూరులో దిగారు. సీదాగా వాళ్లింటికి పోకుండా హోటల్‌ రూము తీసుకుని ఫ్రెష్‌ అయి బ్యాగులు పడేసి ఎందుకైనా మంచిదని బ్రేక్‌ఫాస్ట్‌ కూడా దండిగానే తిని వాళ్ల ఇల్లు చేరుకున్నారు.

శాంతికిరణ్‌ ముందే వాళ్లకు చెప్పినట్లుంది. వాళ్లూ రెడీగానే ఉన్నారు. వాళ్లు ఒకసారి కొడుకును చూడటానికి బెంగుళూరు వెళ్లితే సమతను “నా ఫ్రెండ్‌ అండ్‌ కొలీగ్‌” అని పరిచయం చేసాడట. అట్లా ఒకసారి సమతను చూసారు గాని ఇట్లా అవుతుందని వాళ్లు ఊహించలేదు.

శాంతికిరణ్‌ తండ్రి చాలా నెమ్మది మనిషి. ‘కూల్‌’ గానే ఉన్నాడు. “ఈ పెళ్లికి ఒప్పుకుంటే మా బంధువర్గంలో మాకు చాలా తలవంపులు వస్తాయి. మాది చాలా పెద్ద బలగం. అది మేం తట్టుకోలేం” అన్నాడు.

తల్లి మాత్రం చాలా ఆందోళన, టెన్షన్‌గా కనబడింది. తను ఎందుకు వద్దనుకుంటున్నానో ముఖ్యమైన మూడు కారణాలు చెప్పింది. ఒకటి వరుడి కన్నా వధువు వయస్సు ఎక్కువుంటే వరుడికి శాస్త్ర ప్రకారం ఆయుక్షీణం. రెండు మేం శుద్ధ శాఖాహారులం. ఎల్లిపాయలు, ఉల్లిపాయలూ, కందబచ్చలి లాంటివి కూడా మాకు నిషేధవస్తువులు. మరి మీరేమో మాంసాహారులు. మూడు మేం స్మార్తులం, బ్రాహ్మలం పైగా మా నెల్లూరి బ్రాహ్మలకు ఆచారవ్యవహారాలు, పట్టింపులు, నోములు, వ్రతాలు ఎక్కువ. మా బంధువులెవరూ ఈ పెళ్లికి ఒప్పుకోరు” అని చెపుతూ చివరికి కన్నీళ్ల పర్యంతం అయ్యింది.

వాళ్లు చెప్పిందంతా ఆంజల్య, స్వామి ఓపికగా సానుభూతితో విన్నారు. మధ్యలో ఎక్కడా అడ్డుతగలలేదు. ఇక వాళ్లకు చెప్పే అభ్యంతరాలు ఏవీ లేవని తెలుసుకున్నాక ఆంజల్య ఇట్లా నెమ్మదిగా మాట్లాడిరది.

‘మీరు చెప్పేవన్నీ నిజమే. మేము మీ బాధ అర్థం చేసుకుంటున్నాం కాని మనం పెద్దలం ఒప్పుకోకపోయినా రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకుంటామని వారిద్దరూ చాలా పట్టుదలతో ఉన్నారు కదా” అన్నది.

“చేసుకుంటే చేసుకోనివ్వండి మేం మాత్రం రాము” అని ఇద్దరూ ఒకేసారి కోపంగా అన్నారు.

అప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది. భోజనాలవేళ. వచ్చేముందే ఇద్దరూ అనుకున్నారు. ‘ఇది సింగిల్‌ సిట్టింగ్‌లో తేలే సంగతికాదు. కొంచెం విరామం ఇస్తే వాళ్లూ ఆలోచించుకుంటారు’ అని.

“మేం సాయంత్రం మళ్లీ వస్తాం. అప్పుడు మాట్లాడుకుందాం” అని స్వామి చెప్పాడు. వారూ రమ్మని, రావద్దని ఏమీ అనలేదు. వెళ్లి భోజనం చేసి ఒక కునుకుతీసి సాయంత్రం మళ్లీ వాళ్లింటికి వెళ్లారు.

ఎండ వేడి తగ్గింది. వాళ్ల మాటలలో వాడి, వేడి కూడా కొంచెం తగ్గినట్లు గమనించారు. ఉదయం ఉన్న ఉద్రిక్తత సాయంత్రం అయ్యేసరికి లేదు. తప్పకుండా తమ వ్యవహారశైలి వారిని ప్రభావితం చేసినట్టుంది. వాళ్లు కూడా మరోసారి ఆలోచించుకున్నట్లు కనబడింది.

ఆమె మంచి ఫిల్టర్‌ కాఫీ చేసి ఇచ్చింది.

మళ్లీ ఆమె ప్రొద్దుటి రికార్డు కొంచెం తక్కువ స్పీడుతో వేసింది. “ఓర్పు ఉంటే ఓరుగల్లును కూడా సాధించవచ్చు” అని ఒక సామెత. అంతా మరోసారి ఆమె బాధ ఓపికగా మధ్య మధ్య తలలూపుతూ విన్నారు.

చివరికి స్వామి: “సరేనండి. మీరు మళ్లీ ప్రశాంతంగా ఆలోచించండి. మీరు సరే అంటే పెద్దలం కల్సి సంతోషంగా పెళ్లి జరిపిద్దాం. మీరు కాదంటే మేం కూడా పెళ్లికి వెళ్లం. రెండు వైపులా తల్లిదండ్రులు లేని అనాథలుగా వాళ్లనే చేసుకోనివ్వండి” అని మేమూ మీ వైపే ఉన్నామన్నట్లు సానుభూతి చూపిస్తున్నట్లు, స్నేహంగా లౌక్యంగా మాట్లాడాడు. ఆంజల్య కూడా అదే మాట రిపీట్‌ చేసింది. ఆ చిట్కా తప్పకుండా పనిచేస్తది అని వాళ్ల నమ్మకం.

ఆ రాత్రి రైలుకు తిరిగి ప్రయాణమైనారు. వారం తిరగక ముందే సమత, శాంతికిరణ్‌లు ఇద్దరూ ఫోన్‌ చేసి చెప్పారు. వాళ్లు ఒప్పుకున్నట్లు. ఈ ఆదివారం వాళ్లు హైద్రాబాద్‌ వచ్చి మీతో మాట్లాడుతారు అని.

‘ఆనందమానంద మాయెనే’

ముందు ఆ శుభవార్త ‘మంచి మనిషి డాక్టర్‌ కేశవరెడ్డి’కి చెప్పారు. ఆయన సంతోషించాడు. తథాస్తు అన్నాడు.

తర్వాత శాంతికిరణ్‌ సమతకు చెప్పాడట. తల్లితండ్రులు డోలాయమాన స్థితిలో ఉన్నపుడు ‘బొమ్మరిల్లు’ సీన్మా చూసి ఈ పాజిటీవ్‌ నిర్ణయం తీసుకున్నారని. ఒక సీన్మా ఇంత ప్రభావం చూపుతుందా అని ఆంజల్య స్వామి ఆశ్చర్యపోయారు.

వాళ్లు వచ్చారు. ఒక స్వీట్‌ బాక్సుతో. మనం నలుగురమే మాట్లాడుకుందాము. మీవైపు మా వైపు బంధువులు ఎవరు వద్దు అని ఆమె ముందే ఫోనులో చెప్పింది. అదే మంచి పద్ధతి అని స్వామి, ఆంజల్యలు అనుకుని సరే అన్నారు.

వాళ్లు పెద్ద ఎత్తున కట్నాలు, కానుకలు అడుగుతారేమోనని భయపడ్డారు. కాని వాళ్లు మంచివాళ్లు.

“మీ ఇష్టం. మీ అమ్మాయికి ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం. పెళ్లి మాత్రం బాగా చేయండి. మేం బ్రాహ్మలం భోజన ప్రియులం కదా. భోజనాలు మాత్రం ఘనంగా ఉండాలి” అన్నారు.

మేఘాలు కమ్ముకున్న వాతావరణం చాలా తేలికగా మారింది. నెలరోజులలో ముహూర్తం. స్వామి అదృష్టం కొద్దీ గవర్నమెంటు వారి నిర్వహణలో ఉన్న ఆర్‌టిసీ కల్యాణ మంటపం అతి తక్కువ రేటుకే దొరికింది. హాలు విశాలంగా నీటుగా ఉంది. ఆంజల్య చాలా మినిమంగా కొన్ని బంగారు నగలు కొన్నది. తెలిసిన క్యాటరర్‌ మిత్రుడు ఎక్కువ చార్జ్‌ చేయకుండా చాలా ఖరీదైన, రుచులు కల్గిన శాఖాహారభోజనాలను అందించాడు. ముందు పెళ్లికి వ్యతిరేకించిన వారి బంధుగణమంతా పెళ్లికి వచ్చారు. వధూవరులను సంతోషంగా దీవించారు.

అట్లా సమత పెళ్లి ఈజీగా అయిపోయింది.

“ఒరే మీ ఇద్దరి మంచితనం వల్లనే సమతకు మంచి సంబంధం దొరికి ఉన్నంతల పెళ్లి బాగా జరిగిందిరా” అని అక్కలు తమ సంతోషాన్ని ప్రకటించారు.

మరో సంవత్సరంలో సమతకు ఆమె భర్తకు ఉద్యోగాలు దొరికి విదేశాలకు వెళ్లిపోయారు.

***

ఒక సెలవు రోజు తీరిక సమయంలో ఆంజల్య స్వామితో తను తీసుకున్న నిర్ణయం చెప్పింది.

“ఇక మన జీవిత నావ ఒక తీరానికి చేరుకున్నట్టే. ఎటువంటి అప్పులు చేయకుండా సమత పెళ్లి ఉన్నంతల బాగనే చేసినం. వాళ్ల మంచితనం వల్ల మనకు కట్నకానుకలు లాంఛనాల బాధ కూడా తప్పింది. ఇక ఈ భూమ్మీద మనం ఎవరికీ ఒక పైసా బాకీ లేం. అప్పు లేకపోవటం కూడా ఒక అదృష్టమే కదా. నీకు ఇంకో మూడెళ్ల సర్వీసు ఉంది. రిటైర్‌ అయినా ‘అకర్‌ ఫికర్‌’ ఏమీలేదు. నీకు వచ్చే ప్రావిడెంటు ఫండ్‌ డబ్బులతో రాజాను చదివించుకోవచ్చు. అంతగా అవసరం అయితే, ఆ డబ్బూ సరిపోకపోతే వాడే తన అక్క దగ్గర అప్పు తీసుకుని ఉద్యోగం వచ్చాక మళ్లీ వాపస్‌ చేస్తాడు. ఇగ నీకు సగం పెన్షన్‌ వచ్చినా దానితోనే మనం ఎప్పటిలాగా సింపుల్‌గా బ్రతుకుదాం” అన్నది.

“ఔనౌను, ఔను నిజం ఔను నిజం. నీవన్నది నిజం. నిజం” అని స్వామి వాళ్ల సంభాషణ మధ్యలోకి శ్రీశ్రీని తీసుకొచ్చాడు.

“జోకులు కాదు. సీరియస్‌గానే చెప్తున్న”

“అయ్యో చెప్పు. చెప్పు. నేనేం చెపొద్దు అంటున్నానా? ఇంతకూ “నీ భావమేమి తిరుమలేశా?”

“అగ్గో. మళ్లీ. మజాకులు వద్దన్నానా?”

“ఒకె. ఒకె. కానీ. కానీ.”

“ఏం లేదు. ఇగ ఇప్పట్నుంచీ మనకు జీతం డబ్బులు చాలు. వేరే ఒక్క రూపాయి కూడా ఇంట్లోకి రాగూడదు” అన్నీ బంద్‌”.

“ఇంకా..?”

“ఇంకేముంటది? మన మినిమం అవసరాలన్నీ తీరాయి కదా. ఒకప్పుడు తప్పనిసరిఐ, వేరే గతిలేక, మన ఆత్మలకు, మన విశ్వాసాలకు విరుద్దంగా ఆ పనిచేసాం. ‘అవసరం’ మనల్ని బలవంతం చేసింది. అన్ని అవసరాలు తీరాక కూడా మనం ఆ తప్పుపనులు కొనసాగిస్తే అది ‘వ్యసనం’ కింద మారుతుంది.”

“చాలా బాగా చెప్పినవ్‌ ఆంజల్యా. నేను హిమాలయాల నుండి తిరిగివస్తూ రైలు ప్రయాణంలో ఇదే నిర్ణయం తీసుకున్న. వెంటనే అప్పుడు కాకున్నా ఇప్పుడు సమత పెళ్లి అయ్యింది. కాబట్టి ఈ నిర్ణయం వందశాతం కరెక్టు. ఇగ ఇప్పుడు మనం ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం లేదు.”

ఆంజల్య ముఖం మబ్బులు తొలిగిన వెన్నెలాకాశంలా మారింది.

“మనం తీసుకుంటున్న ఈ నిర్ణయం వెనుక నా మరో నిర్ణయం కూడా ఉంది”. అన్నాడు.

“ఏమిటీ” అన్నట్లు చూసింది.

“ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం ఉద్యమం ఉదృతమవుతున్నది. ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రసక్తి లేకుండా కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, మేధావులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చురుకుగా ఒక ‘భావ విప్లవం’ కోసం కదులుతున్నారు. పనిచేస్తున్నారు. తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం ప్రారంభమయ్యింది.”

“మరి?” అని ప్రశ్నార్థకంగా ముఖం పెట్టింది.

“నేను కూడా నేను సైతం సమిధనొక్కటి’ అన్నట్లు ఈ యజ్జంలో నా వంతు పాత్ర నిర్వహించ దలచుకున్నాను.”

“అదెట్లా?”

“ఇప్పుడు ‘కవులు రచయితల సంఘాలు’ విద్యావంతుల సంఘాలు పెట్టబోతున్న సంగతి నాకు తెలిసింది. వాటి నిర్మాణాలలో చురుకుగా పాల్గొనాలని ఉంది. దానితో పాటు అనేక విషయాలపై సీరియస్‌గా వ్యాసాలు, రచనలు చేయాలని ఉంది.”

“మంచి సంగతే కదా! నేను మాత్రం వద్దంటానా?”

“అది కాదు ఆఫీసులో ఇప్పుడు నేను చేస్తున్నపని చాలా ‘హాట్‌ సీట్‌’. ఎప్పుడూ పన్నుల వసూళ్ల టార్గెట్లు. బండచాకిరి. ఎంత చేసినా ఎప్పుడూ తరగని పని. సమీక్షా సమావేశాలు, అక్షింతలు.”

“విలియంకేరీ ఉన్నాడు కదా! పనిభారం పంచుకోవటానికి.”

“నీకు చెప్పటం మరచాను. వాడు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వబోతున్నాడు. వాడి తమ్ముళ్లు, చెల్లెలి చదువులూ ఒక కొలిక్కి వచ్చాయట. వాడి ‘లా’ కంప్లీటు అయ్యింది. జూనియర్‌ లాయర్‌గా స్థిరపడతాడట. ‘మజ్బూరీ వల్ల ఈ పాపపు సొమ్ము ఇన్నాళ్లు తిన్నా సార్‌. జీసస్‌కు ఇష్టం ఉండదు. మొన్ననే ‘కన్‌ఫెషన్‌ బాక్స్‌’లో కూచుని చేసిన తప్పుడు పనులకు ప్రాయశ్చిత్తం చేసుకున్న. ఇగ న్యాయమైన కొత్త జీవితం మొదలుపెడ్తనని మేరీమాత ముందు నిర్ణయం తీసుకున్న’ అన్నాడు.”

“మంచి పిల్లగాడు. మంచి నిర్ణయం తీసుకున్నడు” అని మెచ్చుకుని, “మరిప్పుడెట్ల?” అని ప్రశ్నించింది.

“ఏమీ లేదు ఆ సీటు నుండి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని నాన్‌ ఫోకల్‌ సీట్లు కొన్ని ఉంటయి. దాంట్లో ఎవరూ చేరరు. పని భారమూ ఉండదు. తలనొప్పులూ ఉండవు. ‘జిత్నా తనఖా ఉత్నా కామ్‌’ అంతే. ఇగ మన చేతులకు ఏ మసి అంటించుకోవాల్సిన అవసరం ఉండదు. హాయిగా నేను నా రచనలు చేసుకోవచ్చు.”

“చిత్తం మహాప్రభూ” అని ఆంజల్య సంతోషంగా నవ్వింది.

“అన్న పానాదులకు ఆత్మ తాకట్టు పెట్టు మనుగడ నీకు సమ్మతమ్ముకాదు”

-షాద్‌ రామేశ్వరరావు

ఒకరోజు పెద్దబాసు దగ్గరకు వెళ్లాడు. డిపార్ట్‌మెంటులో సమ్మె జరిగినపుడు స్వామి విశ్వరూపం, ఉపన్యాసాలు ఆయన ప్రత్యక్షంగా అతి సమీపం నుండి చూడటం, వినటం జరిగింది. ఆ సమ్మె జరిగిన వారం, పది రోజులూ డిపార్ట్‌మెంటులో అటెండెరు నుండి ఆఫీసర్ల దాకా అందరూ ఐక్యమత్యంతో ఒక్కటిగా నిలబడినారు. కమీషనర్‌ హెడ్డాఫీసు ప్రాంగణంలో ఒక కుర్చీపై నిలబడి స్వామి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అనర్ఘళంగా ఉపన్యసిస్తుంటే మొత్తం సిబ్బంది, అధికారులు కూడా క్రింద నేలపై నిలుచునే స్వామి ఉపన్యాసాలను శ్రద్దగా వినేవారు. అట్లా ఆ తర్వాత పై అధికారులు చాలా మంది స్వామికి సన్నిహితులుగా మారారు. సమత పెండ్లికి ఆ పెద్దబాసు కూడా వచ్చారు.

స్వామి బాసు గదిలోకి వెళ్లగానే ఆయన నిండుగా నవ్వుతూ:

“రా స్వామి రా. మీ అమ్మాయి పెళ్లి బాగా జరిగింది. జ్ఞాపకముంది కదా మా వైఫ్‌తో సహా వచ్చాను” అన్నాడు.

“థ్యాంకూ సార్‌” అన్నాడు వినయంగా.

“బాగుంది కాని మీ బంధువుల కన్నా కవులూ, కమ్యూనిస్టులు, నక్సలైట్లే ఎక్కువ మంది కనబడ్డారు” అని మళ్లీ నవ్వాడు. ఆయన వరవరరావును, గద్దర్‌ను, జననాట్యమండలి ఫౌండర్‌, మాభూమి తీసిన బి. నర్సింగ్‌రావ్‌ను చూసినట్టుందని స్వామికి అర్థం అయ్యింది.

“అదేం లేదు సార్‌. నాకు కొంచెం బంధువుల కన్న మిత్రబృందం ఎక్కువ” అని నసిగి తప్పించుకున్నాడు.

ఆ మాటా ఈ మాటా మాట్లాడినంక “సార్‌ నన్ను ఆ సీట్‌ నుండి తప్పించి ఏదైనా నాన్‌ ఫోకల్‌ సీట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయండి, ప్లీజ్‌” అని రిక్వెస్టింగ్‌గా అడిగాడు.

ఆ మాట విని ఆయన ఆశ్చర్యపోయి “అదేంటి ఎవరైనా నిన్ను హర్ట్‌ చేసారా?” అని అనుమానంగా అడిగాడు.

“అబ్బే అట్లాంటిదేమీ లేదు సర్‌” అని నసిగాడు.

“మరేంటి ఆరోగ్యం బాగా లేదా?”

“మంచిగనే ఉంది సార్‌”.

“బాగుంది. అమ్మాయి పెళ్లి చేసావు. అప్పులు అయి ఉండవచ్చు. మంచి సీటు అడుగుతావనుకుంటే ఇదేమిటి? మంచి సీటు కావాలని అందరూ వచ్చి అడుగుతుంటారు. కాని నువ్వేమిటి. ఒక మూల సీట్లో కూచుని మూలుగుకుంటూ, గోళ్లు గిచ్చుకుంటూ కుచూంటానని నాన్‌-ఫోకల్‌ సీటు అడుగుతున్నావూ? అని అభ్యంతరం లేవదీసాడు.

మౌనంగా కూచున్నాడు స్వామి. “చూడు స్వామీ ఐ లైక్‌యు. ఐ అడ్మైర్‌ యు. అందుకు చనువుగా చెపుతున్నా. ఇంకా నీ నెత్తి మీద బాధ్యతలున్నాయి. పిల్లవాడు ఇంకా పదో తరగతే కదా. ఈ నాటి చదువులంటే లక్షలు లక్షలు కావాలి కదా. అప్పుడే ఇంత పెద్ద నిర్ణయం ఏమిటీ? సర్వీసు ఇంకా పూర్తిగా మూడేండ్లు కూడా లేదు. ఇప్పుడే కదా జాగ్రత్తగా ఉండాల్సింది.”

కృత నిశ్చయంతో మౌనంగానే ఉన్నాడు స్వామి.

“సరే ఇక, ఇక్కడా అక్కడా ఎందుకు నా దగ్గరికే రా. ఈ ఆఫీసు మేనేజర్‌ పోస్టుకు. ఇక్కడ పన్నుల వసూళ్లు టార్గెట్ల టెన్షన్లు ఏమీ ఉండవు. పూర్తిగా అడ్మినిస్ట్రేషన్‌. జీతాల బిల్లుల మీద సంతకాలు చేయటం, సర్వీస్‌ మ్యాటర్స్‌ చూసుకోవటం, ఏమంటావూ?”

“సంతోషం.  తప్పక వస్తాను సర్‌” అని మెరుస్తున్న కళ్లతో జవాబు చెప్పాడు.

“నువ్వొక పెద్ద అమాయకుడివి స్వామి. మేనేజర్‌ పోస్టు అంటే అదొక శివాలయం. ఇక్కడ విభూతి, బిల్వపత్రాలు, మందారం పువ్వులు తప్ప మరేం ఉండవు. ఫోకల్‌ సీట్లన్నీ వైష్ణవాలయాలు. అక్కడ నిత్యకల్యాణం పచ్చతోరణం. తోయం, పుష్పం, ఫలాలతో పాటు చెక్కర పొంగళి, దద్దోజనాలు, పులిహోరలు..” అని తన హాస్యానికి తానే నవ్వుకున్నాడు.

“సరే రేపు ఆర్డర్స్‌ పంపిస్తా” అని కుర్చీలో నుండి లేచి షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. ఆ లేవటం, ఆ షేక్‌హాండ్‌ ఇవ్వటం నిజాయితీని గుర్తించి ఇచ్చిన పద్మశ్రీ పురస్కారం.

The greatness relies not in acquisition of wealth but renunciation of wealth.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version