Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-18

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[యాత్రలు ముగించుకుని ఇంటికి తిరిగివచ్చి సాధారణ జీవితం కొనసాగిస్తుంటాడు స్వామి. ఒక ఆదివారం ఉదయం పాశం యాదగిరి మరో ఇద్దరితో పాటు స్వామి ఇంటికి వస్తాడు. చాయ్ తాగి, నగరంలో జరుగుతున్న ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమానికి సన్నాహాక సమావేశానికి వెళదాం రమ్మని స్వామిని తయారవమంటాడు. తొలిదశలో జరిగిన ఘటనలూ, ప్రాణాలు కోల్పోయిన మిత్రులను మరచిపోయావా అని స్వామి అడిగితే, మరిచిపోలేదు కనకే మలిదశ ఉద్యమం అని చెప్తాడు యాదగిరి. తెలంగాణ ప్రభాకర్ గారింట సమావేశం జరుగుతుంది. 1969 ఉద్యమం పరిమితులు వైఫల్యాల గురించి ఫ్రొపెసర్‌ జాదవ్‌ గారు క్లుప్తంగా సమీక్షిస్తారు. తర్వాత జయశంకర్ సార్ మాట్లాడి ప్రజాసంఘాల ఏర్పాటును, వాటి ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇతర వక్తలు కూడా ప్రసంగించాకా, మూడు పెద్దనగరాలలో సభలు జరపాలని తీర్మానించి సమావేశం ముగిస్తారు. ఆ నెల జరిగిన సాహితీ సమావేశం ‘నెల నెలా వెన్నెల’లో స్వామి పాల్గొంటాడు. కవితా పఠనాలు జరుగుతాయి. సభికుల మధ్య యాస గురించి, భాష గురించి వాగ్యుద్ధం జరుగుతుంది. ఇదంతా గమనించిన స్వామి ‘పచ్చికట్టె పామై కరిచింది’ అన్న వ్యాసం రాసి, ప్రశంసలు పొందుతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-19: ‘పిల్లి కండ్లూ-రాగిరంగు తోలు’ కథ

రెండు భిన్న ప్రపంచాల మనుషులను దగ్గరగా చూసిన అనుభవం, అదృష్టం స్వామికున్నది.

ఒకటి ఆదర్శవాద ప్రపంచం. ప్రజలకోసం, దేశం కోసం ప్రాణాలను బలిపెట్టే విప్లవకారులు, సైనికులు, కవులు, కళాకారులు, రచయితలు, పౌరహక్కుల నాయకులు, నిష్కామ కర్మలను ఆచరించే మరికొంతమంది సాధువులు, సన్యాసులు మొదలగువారు.

శుద్ద వ్యవహారిక, భౌతికప్రపంచంలో మునిగితేలే సుఖలాలసులు, భోగలాలసులు, తమ కోసం తాము, తమ స్వార్థమే పరమార్థంగా భావించి, తమలోకి తామే నత్తగుల్లాల్లా ముడుచుకుని, ‘నా చిన్ని బొజ్జ శ్రీరామరక్ష’ అనుకుంటూ ‘డబ్బును తిని డబ్బును మాత్రమే విసర్జించే’ క్షుద్ర కీటక మానవ ప్రపంచం మరోవైపు.

రెండు భిన్న ప్రపంచాలు, రెండు వైరుధ్య ప్రపంచాలు.

ఒకరోజు తను ఆఫీసుకు వెళ్లగానే అన్ని గదులలో, సిబ్బంది, అధికారులు కూర్చునే కుర్చీలు, టేబుళ్లు, ఆఫీసు ఫైల్సు పెట్టుకునే అల్మారాలు, బీరువాలతో సహా అన్నీ వంకరటింకరగా మార్చబడి ఉన్నాయి. తన గదిలో మాత్రం అన్నీ యధాతథస్థితిలో ఉన్నాయి. అటెండరు అంజయ్యను పిలిచి “సంగతేందని” అడిగాడు.

వాడు నెత్తిమీది తెల్లటోపీ సర్దుకుంటూ ముసిముసినవ్వులతో “ఏం లే సార్‌. నిన్న సాయంత్రం ఒక కోయదొర వచ్చిండు. కొండ దొర వేషంలో ఎట్లున్నడనుకుంటున్నరు? బిల్కుల్‌ శివుడు కైలాసం నుండి సీదా క్రిందికి దిగి వచ్చినట్లే. మెడలో నాగుపాము ఒక్కటే తక్కువ. వచ్చీరాంగనే అందరి ముఖాలు చూసుకుంట జ్యోతిష్యం చెప్పబట్టిండు.

‘మీ అందరి ముఖాల్లల లక్ష్మీకళ ఉట్టిపడుతుంది కాని చేతులల్ల జేబులల్ల మాత్రం ‘గలగలలు’ సరిగ్గలేవు. మీ ఆఫీసుల శని అన్ని దిక్కులా తిష్టవేసి కూసున్నడు. వాస్తును మార్చుకోండ్రి అన్నడు’. ఆ దెబ్బకు అందరి ముఖాలల్ల భయమూ, ఆ కోయదొర పట్ల భక్తి పుట్టుకొచ్చినయి. ‘మరేం జెయ్యాలె’ అని అందరూ ఒక్కసారే అడిగిండ్రు.

అప్పుడు ఆ కొండదొర ఒక్కొక్కరి చేతులు చూసి, చేతుల్లల గీతల్ని తన చూపుడు వేలుతో గీక్కుంట చూసి నువ్విట్ల, నువ్వట్ల, ఆయన అట్ల, ఆ సారు ఆ మూలకు, ఈ సార్‌ ఈమూలకు ఇట్టిట్ల కూసుంటే ‘అబ్బో అబ్బో మీ ఇండ్లల్ల లక్ష్మీదేవి ఆగకుండ గంతులేసుకుంట నాట్యం చేస్తది’. అని చెప్పి అందరి దగ్గర కన్సల్టేషన్‌ ఫీజులు దండిగా వసూలు చేసుకుని, ముంజేతులకు, మెడలల్ల ఎర్రదారాలు, రాగి తాయెత్తులు కట్టి మళ్లీ వాటికి సపరేట్‌ ఫీజులు వసూలు చేసి మాయమయ్యిండు.

ఇగ చూడుండ్రి. ఆ కొండదొర పోంగనే మనోళ్లంతా ఒక్కటే హల్‌‌చల్‌. రాత్రి పదింటి దాకా ఈ టేబుల్‌ ఇటు గుంజా, ఆ టేబుల్‌ అటు గుంజా. చెమటలు కక్కుకుంట ఒక్క పరేషాన్‌ కాదు”. అని చెప్పటం ఆపి పక పక నవ్విండు అంజయ్య.

‘పై ఆమ్‌ దానీ’ వచ్చే కొన్ని ప్రభుత్వ ఆఫీసులకు కోయదొరలు జ్యోతిష్యులు, సంఖ్యాశాస్త్రాలు చెప్పేవారు వస్తుంటారు. వారందరికీ ఈ ఆఫీసులల్ల గిరాకీలు ఎక్కువే. అడ్డ దారులల్ల ఆందానీ కమాయించే వాళ్ల తలకాయలల్ల భయాలు, అనుమానాలు కూడా ఎక్కువుంటాయేమో? ఒక ఉద్యోగి ప్రభుత్వ గజిట్‌లో ప్రచురణ ద్వారా రెండుసార్లు తన పేర్లు మార్చుకున్నాడు. అట్లా అతని సర్వీసు రిజిస్టర్‌లో కూడా ఒకటి అసలు పేరు మరో రెండు మార్చుకున్న పేర్లు కనబడతాయి. అట్లా చేసిన తర్వాతే తనకు బాగా కలిసి వచ్చిందని అందరికీ చెపుతాడు. ఇక వాస్తుశాస్త్రం పేరుతో కొత్త ఇళ్లను కూలగొట్టుకుని వంకరటింకరగా చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. ద్విచక్రవాహనదారులకు ఏ ప్రమాదం జరగకుండా ఆపటానికి మహిమగల ఉంగరాలను అమ్మేవారు, విదేశీ స్మగుల్డ్‌ వస్తువులను అమ్మే దొంగవ్యాపారస్థులు, బూతు సీన్మా క్యాసెట్లు, ‘ఇచ్ఛ కల్గిన రసికులకు’ కొందరికి మాత్రమే రహస్యంగా అమ్మేవాళ్లు, నడివయసు దాటిన మగవారి పుంసత్వాన్ని వృద్ధి చేసే వనమూలికలు, ఔషధాలు, లేహ్యాలు, చూర్ణాలు అమ్మేవారు పై ఆందానీ వచ్చే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. అక్రమ సంపాదనాపరులు మార్కెట్‌లో మనీ సర్కులేషన్‌ పెంచి దేశ ఆర్థికాభివృద్దికి అట్లా తమ వంతు సహకారం అందిస్తుంటారు.

‘తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతుంది’ అన్నట్లు 1990 తర్వాత కొంతమంది స్థితిపరులు, శ్రీమంతుల ఇళ్లల్లో హోమాలు, యజ్ఞాలు ప్రారంభించారు. దానికి మినిమం ఐదుగురు వేదపండితులు, పురోహితులు అవసరం. వాటికి ముక్తాయింపుగా గోదానాలు, సువర్ణదానాలు సరేసరి. క్యాన్సర్‌ అని తెలిసి అనేక ట్రీట్‌మెంట్లు చేయించుకున్నా తగ్గక చివరికి ఎవరి సలహాపైన్నో ఇంటిలో యజ్ఞం, హోమం చేయించుకున్న నెలకే చనిపోయిన అధికారి తనకు తెలుసు.

అయ్యప్పస్వామి దీక్షాధారణ చేసి, నల్లవస్త్రాలతో, నగ్నపాదాలతో ఆఫీసులకు వచ్చే  అయ్యప్ప భక్తులు ప్రతి సాయంత్రం చేతులు చాపటం, చేతులు తడుపుకోవటం మాత్రం మానరు. వారికది ‘పేకాట పేకాటే తమ్ముడు, తమ్ముడే’ అన్న మాట. మెడలో అయ్యప్ప మాల వేసుకుని, నల్లని వస్త్రములను ధరించిన అటెండరును పై అధికారి కూడా పేరుతో పిలవకూడదు. ‘స్వామీ’ అనే పలకరించాలి. అదొక ప్రహసనం. ఆ చిరుద్యోగి ఆత్మ ఆ దీక్షా దినాలలో అట్లా సంతృప్తి పడుతుంది.

చిన్న చిన్న నాలుగుపేజీల పత్రికలు నడుపుకునే ‘ఎల్లో జర్నలిస్టులకు’ కూడా కొదవలేదు. వారు ఆఫీసుల చుట్టూ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ముడుపులు అందుకుంటారు. లేనిచో వారి ‘దేడ్‌ ధమ్మిడీ’ పత్రికలలో కాకుల్లాగా కావు కావు మని కూస్తే ఆ వార్తలు ఎ.సి.బి. వారికి చేరి కొంపలు మునుగుతాయన్న భయంతో వారికి తృణమో, ఫణమో అప్పచెప్పి సంతృప్తి పరుస్తుంటారు.

‘అద్దాల మేడలో ఉండేవారు అందరికీ భయపడుతూనే జీవించాలి’ కదా.

‘జర బచ్‌ బచ్‌ కే చల్నా హుజూర్‌.’

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక లాండ్‌ రెవెన్యూ తప్ప ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే అన్ని ప్రభుత్వ శాఖలలోని కొన్ని ముఖ్యమైన విధులను, పన్నుల వసూళ్లను ప్రైవేటు సంస్థకు అప్పచెప్పాలన్న ఆలోచనలతో ‘సింగపూర్‌ కన్సార్టియం’ అనే సంస్థతో సంప్రదింపులు ప్రారంభించాడు. అది ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణలు, ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటైజేషన్‌ తీవ్రంగా జరుగుతున్న కాలం. పన్నులు వసూలు చేసే అన్ని శాఖల వారికి ఈ వార్త తెలిసి తమ అధికారాలకు కోత పడుతుందనీ, కొంతమంది కొత్త టెంపరరీ ఉద్యోగుస్తులను టెర్మినేట్‌ చేయగలరని, ప్రమోషన్లకు ప్రమాదమని గ్రహించి, గుర్తించి అధికారుల నుండి అటెండర్ల దాకా తీవ్రంగా ఆ ప్రణాళికను వ్యతిరేకించారు.  రెవెన్యు వచ్చే అన్ని శాఖలు కలిసి ఐక్య ఉద్యమం సాగించారు. నిరసన ప్రదర్శనలు, సభలు, సమావేశాలు రాష్ట్రమంతా ముమ్మరంగా జరిగాయి.

అప్పుడు స్వామిలోని పాత ‘ట్రేడ్‌ యూనియనిస్టు’ బయటికి వచ్చాడు. ప్రతి సమావేశంలో నిప్పులు చెరుగుతూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించాడు. స్వామిలోని ‘లోపలి మనిషి’ సామర్థ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కడో, ఏ మూలనో, అమాయకంగా ‘లో-ప్రొఫైల్‌’ లో ఉండి తన పనేదో తను చూసుకునే స్వామి ఒక్కసారిగా డిపార్ట్‌మెంటులో ‘షైన్‌’ అయ్యాడు. అవకాశం దొరికిందని పనిలో పనిగా లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌, ప్రైవటైజేషన్‌ (ఎల్‌.పి.జి) పై తన అభిప్రాయాలను, వ్యతిరేకతను అందరికీ ఒక లెక్చరర్‌ లాగా ఉపన్యాసాలు ఇచ్చాడు. చివరికి ఏలిన వారు అనేక కారణాల వలన ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు.

అట్లా అటుపై అధికారులకు తోటి ఉద్యోగస్థులకు, చివరికి అటెండర్లకూ, డ్రైవర్లకూ స్వామి ‘అందరివాడు’ అయ్యాడు. ఉద్యోగాలలో, సర్వీసు మ్యాటర్స్‌లో ఏ చిక్కులున్నా స్వామిని సంప్రదించటం ప్రారంభించారు. ఒక అనధికార ‘సంఘ’ నాయకుడిగా కొత్త గుర్తింపు వచ్చింది.

అశోక్‌ తనకు ఆఫీసులో మంచి మిత్రుడే. కాని భయస్తుడు. అతని బలహీనత ఒక్కటే. అది డబ్బు జబ్బు. కాని స్వామిని మాత్రం చాలా ఇష్టపడేవాడు.

స్వామి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉపన్యాసాలిస్తుంటే ఒకరోజు.

“అన్నా జర భద్రమే. నువ్వు మాట్లాడుతుంటే అందరూ చప్పట్లు కొడుతున్నరు గాని రేపు నీకెదన్న అయితే ఎవలూ నీ ఎంబడి నిలబడరే” అని విచారం వెలిబుచ్చిండు. అతనిదంతా ‘మెదకు’ జిల్లా యాస.

“ఏమన్న అంటే ఏమైతది?” అడిగిండు స్వామి.

చెవి దగ్గర నోరు పెట్టి రహస్యంగ “మీటింగులల్ల సి.ఐ.డి.లు ఉంటరే ‘ఎసిబి’ వాళ్లు నీ పేరు రాసుకుంటరు. సర్కారుకు కోపమొస్తే నీ మీదికి ఎసిబి దాడులు జరుగుతై. ముందు పేపర్ల పేరొస్తది. తర్వాత సస్పెన్షన్‌ కేసు తేలేసరికి ఈజీగ మూడు, నాల్గేండ్లు. నీ భార్యాపిల్లలు అన్యాయమైపోతరే అన్నా” అని భయం భయంగ కనుగుడ్లు పెద్దగ చేసుకుని చెప్పిండు.

స్వామి ‘కత్తులు తిప్పిన గతకాలం’ గురించి ఇప్పుడెవరికీ తెలియదు.

ఒకసారి ఇద్దరూ కల్సి మంచి మందుమీద ఉన్నపుడు:

 “అన్నా నాకేం తక్కువ లేదే. అయ్యా అమ్మకు ఒక్కడ్నే. ఒంటి రామలింగం సొంటి కొమ్ము అన్నట్లు. నాయినకు ఊర్లె పంపుమోటర్ల బిజినెస్సు. కొద్దిగ సేతానం. ఇగ నా భార్య గవర్నమెంటు టీచర్‌. ఒక కొడుకు ఒక బిడ్డ. ఇగ నాకేం ఫికరే. అంతా ఆరాంకా మామ్లా” అన్నడు.

స్వామికి క్రింద మండింది. తాగినోడు సత్యహరిశ్చంద్రుడే కదా! టక్కున సలహా ఇచ్చిండు.

“అశోకా. అన్ని రకాలుగా నువ్వు బాగా దండోనివి (ధనికుడు) కదా. మరి ఈ పై ఆందానీ నీకెందుకే? ఇమ్మీడియట్‌గ అది బందు చెయ్యి. అవసరం లేని అదనపు సంపాదన కూడా పాపమే” అన్నడు ముక్కుమీద గుద్దినట్లు.

పాపం ఒక్కసారి షాక్‌కు గురయ్యిండు అశోక్‌. తుపాకి గుండు దెబ్బతిన్నట్లు ముఖంపెట్టి:

“గదేందే అన్న! గట్లన్నవ్‌ పైసా మే పరమాత్మా హై కదా!” అని నోరు పక్షవాతమొచ్చి కూలబడినట్లయి ఇగ మళ్లీ నోరు విప్పలే.

బహుషా పుట్టబోయే మనుమలు, మనుమరాళ్లకు మూటగట్టి ఇవ్వాలన్న తాపత్రయం కాబోలు. అతని హీరోహోండా మోటారు సైకిలు పక్కన పెద్ద డబ్బా ఒకటి తగిలించి ఉండేది. సాయంకాలాలు తన పరిధిలోని మార్కెట్లో చెక్కర్లు కొట్టి ‘ముఫత్‌ కా మాల్‌’ నింపుకుని పోవటానికి.

ఉదయం పూట ఆఫీసుకు రాగానే స్వామి గదిలోకి వచ్చి చాయ్‌ తాగి లోకం మీది ముచ్చట్లు చెప్పటం అతని దినచర్య.

“అన్నా దినామూ ధరలు హనుమంతుని తోకలాగ పెరుగుతున్నయే” అని విచారంగ ముఖం పెట్టిండు అదేదో ఇరాక్‌ మీదికి అమెరికోడు హమ్లా చేసిన వార్త చెప్పినట్లు.

“ఏమైంది అశోకా”

“బెల్లం ధరనే. పోయిన్నెల పదిరూపాయలకు ఒక కిలో. ఇప్పుడేమో పదకొండు” అట్లనే అల్లం కూడా.

స్వామికి పక్కున నవ్వొచ్చింది. ఆపుకోలేక నవ్వాడు.

“గదేందే గట్ల నవ్వుతవు. ఇగ గరీబోళ్లు బ్రతికేదెట్లనే” అని తనని కూడా గరీబుల జాబితాలోకి జమచేసుకుని కటిక ధరిద్రునిలా ముఖం పెట్టిండు.

మరో రోజు గుర్రం ఎక్కిన నిషాల:

“అన్నా ఈ పైసలన్నీ ఇంటోళ్లకు ఇవ్వద్దే” అన్నడు.

స్వామి తికమకకు గురయ్యిండు. ఇంకేదైనా ‘చిన్నిల్లు’ ఉందా అని. “మరి” అని ప్రశ్నించిండు.

“ఇంట్ల పెండ్లాం చేతికిస్తే బట్టలు, బంగారం అని పైసలన్నీ తీన్‌ తేరా నౌ అఠారా చేస్తరే” కష్టపడి సంపాదించిందంతా బర్బాద్‌ అయిపోతది.

“మరెట్ల?”

“ఏం లేదే. రాత్రి అందరూ పండుకున్నంక లేదా తెల్లారగట్ల ఎవ్వలూ లేవకముందే అల్మారాల సీక్రెట్‌ లాకర్‌ ఉంటది గదెనే. అండ్ల నొట్ల కట్టలు నూకెయ్యాలె. తాళం చెయ్యి సీక్రెట్‌ జాగాల దాసిపెట్టాలె. పిల్లలకూ భీ ఏం అతాపతా తెల్వద్దు. లేకపోతే ఉత్తపుణ్యానికి చెడిపోతరే” అన్నడు.

అట్లాంటి మరుగుజ్జుతో కల్సి తాగుతున్నందుకు సిగ్గుపడ్డాడు స్వామి.

స్వామితో కాదుగాని మిగతా వారితో ఎప్పుడూ కొత్తకార్ల విశేషాలు, వారి ధర వరలు, ప్రత్యేకతలు గురించి మాట్లాడి చివరికి ఒక శుభదినాన కొత్త కారు కొనుక్కుని దోస్తులందరికీ జోర్‌దార్‌ దావత్‌ ఇచ్చిండు. కారు లేని బేకార్‌ మనిషి స్వామితో సహా అందరూ శుభాకాంక్షలు చెప్పారు. అప్పటికే వారందరికీ కార్లున్నాయి. కాని ఎవరికీ చెప్పరు. ఏడ్చిపోతారని.

కొన్ని నెలల తర్వాత జరగకూడని ఒక విషాదం జరిగింది.

ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్న అశోక్‌ కొడుకు డాడీకి తెల్వకుండా కొత్త కారు తాళం సంపాదించి అందరూ నిద్రపోతున్న వేళ దానిని తీసుకుని, దోస్తులతో కల్సి బీరు తాగి ఒంటి మీద సోయి లేక ఇంకో నలుగురిని కూర్చోబెట్టుకుని సరిగ్గా రాని డ్రైవింగుతో నెక్లేసు రోడ్డుకు వెళ్లే ఖైర్తాబాదులో ఫ్లై ఒవర్‌పై గుద్దుకుని క్రింద రైలు పట్టాలపై పడి ఐదుగురు పిల్లలు ప్రాణాలు అక్కడికక్కడే.. కారు తుక్కు తుక్కు అయిపోయింది.

వార్త తెలిసి అందరూ పరిగెత్తుకెళ్లారు. అశోక్‌ను ఓదార్చటం ఎవరి తరమూ కాలేదు.

ఒక ఆర్నెల్ల తర్వాత మనాదితో ఉన్న అశోక్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌. కార్పొరేట్‌ ఆసుపత్రిలో సరిగ్గా నెలరోజులున్నాడు. కాని లాభం లేకపోయింది. చనిపోయిన రెండు, మూడు రోజుల దాకా శవాన్ని వెంటిలేటర్‌పై పెట్టి ట్రీట్‌మెంటు చేసారు. లక్షలు లక్షలు దండుకుని చివరికి శవాన్ని ఇచ్చారు.

అవసరంలేని అక్రమ సంపాదన ‘అగ్గి’ లాంటిది. అది ఓరోజు మనల్నే బాస్మాసురహస్తంలా దహిస్తుందన్న సత్యం తెలుసుకున్నాడు. అశోక్‌ మరణం స్వామిని అతలాకుతలం చేసింది. జారుడుబండల మీద ఇక ఎక్కువ కాలం నడవవద్దన్న ‘ఎరుక’ను తెలుసుకున్నాడు.

చార్‌ ధాం యాత్ర ముగించి రైలులో గృహోన్ముకుడై ప్రయాణిస్తున్నపుడు, తీసుకున్న నిర్ణయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు.

***

కోదండపాణి అనే ముసలి సోరచేప ముచ్చటగా మూడోసారి ఎసిబి వలలో చిక్కాడు. సోరచేపలు వలల్ని కొరికి త్వరలోనే ఇవతల పడతాయి అన్న సంగతి చాలామందికి తెలియదు.

‘జమానా బదల్‌ గయా’.

స్వామి చిన్నపుడు వాళ్ల గల్లీల బ్రహ్మయ్య అని ఒక ముసలి ఔసలాయన ఉండేవాడు. భార్యలేదు. ఒక్కగానొక్క కొడుకే అతనికి ఆధారం. తెలివిగల్ల పిల్లగాడు. మెట్రిక్‌ పాస్‌ కాంగనే కండక్టరు నౌఖరీ వచ్చింది. తండ్రి పెళ్లి సంబంధం కుదిర్చాడు. నెలలో పెండ్లి తేదీలు నిశ్చయం అయ్యాయి.

ముసలాయన సంబరం, అంతా ఇంతా కాదు. అందరికీ పెండ్లి పత్రికలు పంచాడు.

ఒక దినం ప్రొద్దున్నే ఇంటికి పోలీసులు వచ్చి “నిజాంబాద్‌ రైల్‌ స్టేషన్‌ల పట్టాల క్రింద తలకాయ పెట్టి నీ కొడుకు బల్మీకి ప్రాణం తీసుకున్నాడు” అని చెప్పారు.

ఆ తండ్రి కుప్పకూలి నేలకొరిగాడు. మళ్లీ లేవలేదు. అసలు సంగతి తర్వాత తెలిసింది. ఆ పిల్లగాడు కండక్టరు డ్యూటీ మీద ఎర్రబస్సుల నిజాంబాద్‌ వరకూ పోయిండట. అక్కడ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ చెకింగ్‌ చేస్తే ఇచ్చిన టిక్కెట్ల కన్నా అతని భుజానికున్న బ్యాగులో చారానా పైసలు ఎక్కువున్నాయట. ఎవరో ప్యాసింజరుకు టిక్కట్‌ ఇవ్వకుండా ఆ చారానా తన బ్యాగులో వేసుకున్నాడని అక్కడి కక్కడ పరపరా కాగితం రాసి అతనిని సస్పెండు చేసాడట. తనే పాపం చేయలేదని కాళ్లు పట్టుకున్నా కనికరం చూపలేదట. సిగ్గూ శరమూ, రోషమూ ఉన్న ఆ  పిల్లగాడు ఆ అవమానం భరించలేక నాయినకు ఏం ముఖం చూపెట్టాలన్న భయంతో సీదా స్టేషన్‌కు వెళ్లి మన్మాడ్‌కు పోతున్న రైలు క్రింద తల పెట్టాడు.

సత్యహరిశ్చంద్రుడు లేకున్నా అభిమానమూ, రోషమూ ఉన్న సత్యకాలం అది.

డిపార్ట్‌మెంటులో చాలాకాలం క్రిందనే ‘వజీఫా’ (రిటైర్‌మెంటు) అయ్యి పింఛన్‌ తీసుకుంటున్న ఒక ముసలి, స్వామికి చాలా సంగతులు చెప్పాడు.

నైజాం కాలం నుండి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దాకా సర్కారీ ములాజింలలో రుష్వత్‌ అన్న మాట లేదు. ఆ కాలంల అందరూ అల్ప సంతోషులే. అయినా పైస కనబడని కాలం అది. సర్కారీ దఫ్తర్‌లల్ల జర పని జల్దీ కావాలంటే ఒక జిలేబీ ఒక సమోసా తినిపించి ఒక మలాయ్‌దార్‌ పౌనా తాగిస్తే చాలు, పని అయిపోయేది. 1956 తర్వాత ఆంధ్రా ఉద్యోగస్థులు వచ్చి రుష్వత్‌లు మొదలుపెట్టారు. వాల్లంతా తెల్లోల్ల మానసపుత్రులు కదా! వాళ్లను చూసి మనోళ్లు కూడా లంచాలు మరిగారు అని అనేక ముచ్చట్లు చెప్పాడు ఆ పింఛన్‌దార్‌.

ఈకాలంలో లంచాలు మరిగి బొర్రలు పెంచుకునోళ్లకే ‘బ్రతకనేర్చినవాడు’ అని ‘తెలివిగల్లోడని’ మర్యాద.

స్వామి స్నేహితుడొకాయన యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌. ఒకరోజు తను పుట్టి పెరిగిన ఊరుకు వెళ్లాడట. చిన్ననాటి స్నేహితుడు అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నతను కలిసి కుశల ప్రశ్నలయినాక “చాలా సంతోషం. నువ్వు ఇన్ని పెద్ద చదువులు చదివి ఫ్రొఫెసర్‌ అయినావు మంచిదే మరి. జీతం కాక నీకు పై నుండి ఎన్ని పైసలు వస్తవి” అని అమాయకంగా అడిగాడట.

“పై నుండి రావటమేంది?” అని ఆశ్చర్యంగా అడిగాడట ఆ ఆచార్యులవారు.

“అదే సారూ సర్కారీ కొలువులు చేసెటోళ్లకు జీతమే కాక పై సంపాదన ఉంటది కదా. అదెంత అని అడుగుతున్న” అన్నడట.

ఈయన “అయ్యో అటువంటివేమీ మాకు రావు” అన్నాడట.

“మరేం లాభం సార్‌? ఇంత కష్టపడి ఇన్ని చదువులు చదివి పై సంపాదన లేని ఉద్యోగం ఒక ఉద్యోగమా సార్‌” అని ఆశ్చర్యపోయాడట.

ఇప్పటి “జనాభిప్రాయం” అట్లా ఉంది. జమానా బదల్‌ గయా.

మోహనరావు రిటైర్‌ అయినాడు. ఆ సందర్భంగా స్వామి ఆయన్ని గౌరవించటానికి లక్డీకాపూల్‌ ‘ఈగల్‌ బార్‌ అండ్‌ రెస్టారెంటు’లో విందుకు ఆహ్వానించాడు.

మసక మసక చీకట్లు అలుముకున్న ఆ మధుశాలలో రెండవ పెగ్గులో ఉన్నపుడు శ్రీమాన్‌ కోదండపాణిగారి ఎసిబి రెయిడూ, సస్పెన్షన్‌ ప్రస్తావన మాటల మధ్యలో వచ్చింది.

“వాడా? వాడి పుట్టు పూర్వోత్తరాల కథ అంతా నాకు తెలుసు. అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెల్వదా?” అన్నడు మోహనరావు.

“చెప్పండన్నా. నాకు కథలంటే చాలా ఇష్టం” అని చిన్నపిల్లవాడిలా అడిగాడు.

“పదే పదే జైలుకెళ్లిన వాళ్లు కరుడుగట్టిన నేరస్థుల్లా అయితరు కదా. ఈ కోదండం గాడూ అంతే. గత రెండుసార్ల అనుభవంతో ఇవతలబడినట్లే ఇప్పుడూ రెండు చేతులతో అంచెలంచెలుగా అందరికీ డబ్బులు వెదజల్లి మళ్లీ స్వచ్చమైన పాలతో క్షీరాభిషేకం జరిపించుకుని మిస్టర్‌ క్లీన్‌గా ఇవతలకి వచ్చి ఉద్యోగంలో చేరుతడు. సర్కారు వారు కేసు ఫైనల్‌ అయ్యేదాకా జీతంలో సగం ఇచ్చే సస్పెన్షన్‌ అలవెన్సు వాడికి ముక్కులోపలి వెంట్రుకతో సమానం. అయితే వాడు ఉత్తగనే, “ఊరికే ఇంట్ల కూచుంటడని నువ్వు అనుకుంటున్నావా?” అని ప్రశ్నించాడు మోహనరావు.

“మరి” అని అమాయకంగా ముఖం పెట్టాడు స్వామి.

పెద్ద కొడుకు పేరుతో వాడు ‘బినామీ’ రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్సులు చిన్న చిన్న స్థలాలు కొని అపార్ట్‌మెంట్లు కట్టి అమ్మే దందాలు చేస్తున్నాడు. వీడి కొడుకు ఉత్త ‘నామ్‌ కే వాస్తే’ నిశానీ. ఇరవై నాల్గు గంటలు వాడికి తాగటానికి సరిపోవు. ‘హరాం కా కమాయీ’ మనుషుల్ని వాళ్ల పిల్లల్ని చెడగొడతది స్వామీ. జ్ఞాపకముంచుకో” అని సలహా ఇచ్చాడు.

మూడో పెగ్గులో గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి భూమికి జానెడంత ఎత్తులో ఉన్నపుడు ‘రాత్‌ బాకీ ఔర్‌ బాత్‌ బాకీ’ అని గమనించిన స్వామీ “అన్నా వాడి పుట్ట్టుపూర్వోత్తరాల కథ చెప్తా అని చెప్పకనే పోతివి. వాడి పిల్లి కండ్ల కథ ఎందీ? వాడి రాగిరంగు తోలు కత ఏందీ?” అని క్రాస్‌ క్వొచ్చెన్‌ వేసిండు.

“అబ్బో అది చాలా పెద్ద కత స్వామీ. అది చెప్పాలంటే నేను 1757ల జరిగిన బొబ్బిలి యుద్దం నుండి శురూ చెయ్యాలి”.

“చెప్పన్నా నేనిన్ను భద్రంగా ఆటోల కూచుండబెట్టి ఇంటి వరకూ దిగబెడ్త కదా. ఫికరెందుకు” అని ఇంకో రెండు ఆమెట్లకు ఆర్డర్‌ ఇచ్చాడు. మధుశాలలు కొండకచో ‘కతల కార్ఖానాలు’ కూడా అవుతాయి.

1757ల ఫ్రెంచి సైన్యాధికారి బుస్సీకి వెలమ ప్రభువులకు యుద్దం జరిగి అండ్ల వెలమ ప్రభువులు ఓడిపోయినారు. ఫ్రెంచి అన్న పదం పలుకరాక మన ప్రజలు వారిని ఆ రోజులల్ల ‘పరాసులు’ అనేవారు. అట్లా పరాసుల పాలన ఉత్తరాంధ్రల స్థిరపడింది. ఆ తరువాత ‘ద్వారబంధాల చంద్రయ్య’ వారి పాలనకు ఎదురుతిరిగి మన్యం ప్రజలందర్నీ కూడగట్టాడు. 1857 సిపాయిల తిరుగుబాటు కన్న ముందటి కథ ఇది. 1920లల్ల అల్లూరి సీతారామరాజు చేసిన ‘మన్యం తిరుగుబాటు’కు ఈయనే ఇన్‌స్పిరేషన్‌. ఆ ద్వారాబంధాల చంద్రయ్య భద్రాచలం అడవుల్లోని కొండరెడ్లు, కోయలను కలుపుకుని తిరుగుబాటు కొనసాగించాడు. అప్పుడు భద్రాచలం ఇప్పటి తూర్పు గోదావరి జిల్లాలో ఉండేది. దానిని అణచటానికి ఫ్రెంచి వారు నైజాం నవాబు అనుమతి తీసుకుని గోదావరి దాటి ఇప్పటి వరంగల్‌ జిల్లా వెంకటాపురం దగ్గరి ఒక కుగ్రామంలో తుపాకులు తయారుచేసే ఫ్యాక్టరీని స్థాపించారు. అంటే ఇప్పటి మన ‘గన్‌పౌండ్రీ’ లాగ. దానిని అది ఫ్రెంచిసేనాని రేమండ్‌ మూన్సే స్థాపించాడన్న సంగతి నీకు తెలిసే ఉండొచ్చు.

“అవును తెలుసన్నా” అని వంత పలికాడు స్వామి.

వెంకటాపురం ప్రజలు ఆ ఊరిని ‘తుపాకుల గూడెం’ అని పిలవసాగారు. ఇప్పటికీ ఆ ఊరు పేరు అట్లనే ఉన్నది. అక్కడ ఇప్పటికీ ఫ్రెంచి వారి సమాధులు ఉన్నాయి.

“అది సరే గాని ‘సముద్రంలోని ఉప్పుకూ చెట్టు మీది ఉసిరికాయకూసంబంధం’ అన్నట్లు ఆ ఫ్రెంచి వారికి వీడికి సంబంధం ఏందన్నా?” అని అడ్డుపడ్డాడు స్వామి.

“ఈ గాడిదకొడుకు తాతలు వాళ్లకే పుట్టారు. అందుకే ఆ పిల్లి కండ్లూ. రాగి రంగు తోలూ” అని బాంబు పేల్చాడు.

“ఆఁ” అని నోరెళ్ల బెట్టాడు స్వామి. తాగిన మూడు పెగ్గుల నషా గుట్నలకాడికి (మొకాళ్ల)కు దిగింది.

“అట్టెట్లనే” అని స్వామి షాక్‌కు గురయ్యాడు.

“తొందరెందుకు చెప్త విను” అని చిద్విలాసంగ చిర్నవ్వులు చిందిస్తూ సిగరెట్‌ వెలిగించి పొగపీల్చి గాలిలో విలాసంగా వదులుతూ చెప్పసాగాడు.

“ఇద్దరం ఒకేరోజు వరంగల్ల ఇదే డిపార్ట్‌మెంటుల క్లర్కులుగ జాయిన్‌ అయినం. వీడిది వెంకటాపురం. మాది పక్కనే ఉన్న ములుగు. మా పెద్దలందరూ ఈ వెంకటాపురం గురించి మజేదార్‌ కతలు చాలా చెప్పెటోళ్లు.

తుపాకుల గూడెం ఏర్పడే నాటికే వెంకటాపురంలో అక్కడి వెలమదొరల కోసం ‘ఆడిపాడే’ కొన్ని కళావంతుల కుటుంబాలు ఉండేవి. వాళ్లంతా గోదావరి జిల్లాల వాండ్లు. ఆ రోజులల్ల అక్కడ సానివాడలు, కళావంతులు చాలామంది ఉండేవారు. అండ్ల కొంతమంది గోదావరి దాటి వెలమదొరల కోసం, వారి ప్రాపకం కోసం వెంకటాపురంలో స్థిరపడ్డారు. తుపాకులగూడెం ఏర్పడినాక ఫ్రెంచి సైన్యాధికారులకూ ఆ కళావంతులు అలవాటు ఐనారు. పొరపాటుననో, గ్రహపాటుననో కొంతమంది పిల్లల్ని కూడా కన్నారు. చేసిన పాపం ఊరికే పోదన్నట్లు తర్వాత కొన్ని తరాల వరకూ ఆ కుటుంబాలలోని ఆడపిల్లలకూ మగపిల్లలకూ రాగిరంగు జుట్టుతో సహా ఫ్రెంచి వాళ్ల శారీరక లక్షణాలు వచ్చాయి. వీడికి రాగిరంగు జుట్టు  పిల్లికండ్లతో సహా అదనంగా గుంటనక్క లక్షణాలు కూడా వచ్చాయి.

ఆరోజులల్ల వరంగల్‌ల మన డిపార్ట్‌మెంటుల అందరికీ వీడి జన్మ వృత్తాంతం తెలుసు. ‘ప్యారిస్‌ బాబు’ అని తోక పేరు తగిలించారు. వీడి వెనక నవ్వుకునేవారు. ఆ హేళనలు, అవమానాలు భరించలేక వీడు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని ఇక్కడికి, హైద్రాబాద్‌కు పారిపోయి వచ్చాడు. వాడు హైద్రాబాద్‌కు వచ్చినపుడు మంచి వయసులో పైలా పచ్చీసుగా ఉండేవాడు. వాడి ఫ్రెంచి అందానికి, భ్రమసి ఒకరిద్దరు ‘దీపం చుట్టూ తిరిగే శలభాల్లా’ వాడి వలలో పడ్డారు. అందుకే నేను అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని మొదట్లనే అన్న.”

స్వామి జాగ్రత్తగా ఆయన్ని వాళ్ల ఇంటి దగ్గర దింపి హ్యాపీ రిటైర్‌మెంటు శుభాకాంక్షలు చెప్పి అదే ఆటోల ఇల్లు చేరుకునేసరికి క్యాలెండరులో తేదీ మారిపోయింది.

***

డిపార్టుమెంటులో అందరూ వెంకట్రావును పిచ్చి వెంకట్రావ్‌ అనీ లేదా పాగల్‌ వెంకట్రావ్‌ అని పిలిచేవారు. ఆ పేరుకు తగ్గట్టు అతను సార్థక నామధేయుడే. ముఖంలో పిచ్చి కళ, తళ తళ లాడుతూ తాండవించేది. కాని లోపలి మనిషి మాత్రం చాలా చాలాక్‌, బడా బట్టేబాజ్‌. అతని పూర్వీకులు మరాఠా దేశం నుండి వచ్చి నైజాముల కాలంలో పట్నంల స్థిరపడ్డారు కావున ‘మాయల మరాఠీ’ అన్నా తప్పేంలేదు.

సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు అతను పెద్ద పెద్ద ఆఫీసర్ల ఇండ్ల చుట్టూ తిరిగి వారి వారి ఇండ్లలోని పనులన్నీ ఇతనే చక్కబెట్టి వారి మెప్పులు పొంది మంచి మంచి పోస్టింగులు వేయించుకునేవాడు. పీఠాధిపతులందరికి ఘన, ద్రవ, ఆడ పదార్థాలను కూడా సరఫరాలు చేస్తాడని చెవులు కొరుక్కునే వారందరూ. అతనికి ‘సర్వీసెస్‌ అండ్‌ సప్ల్లైస్‌’ అని అదనపు నిక్‌ నేమ్‌ అనగా తోకపేరు కూడా తగిలించారు.

వెంకట్రావు ముఖం ఎప్పుడూ టెన్షన్‌ టెన్షన్‌గా ఆందోళనగా ఉండేది. అతను బాగా పాతబడి, రంగులు వెలిసిన సఫారీ సూట్లను ధరించేవాడు. ఆ ప్యాంట్‌ రెండు జేబులూ చాలా పొడవుగా సగం తొడల వరకూ ఉండేవి. అందులో రూపాయల కట్టలు రెండు జేబులలో ‘లట్కుం లట్కుం’ అని అందరికీ కనబడేలా వ్రేలాడుతూ ఉండేవి.

“గదేంది సార్‌ మాంసం తింటున్నామని బొక్కలు మెడల వేసుకుని తిరగాల్నా” అని ఎవరన్న మందలిస్తే ‘హే పిచ్చోడా! నీకేం తెల్వదు మన ఆఫీసర్లు ఎప్పుడు ఏం పని చెప్తరో మనకు  తెల్వదు కదా. అవన్నీ కొననీకే మన దగ్గర కీసల కొత్తలుండాల్నా లేదా” అని తిరిగి సిగ్గూ శరం లేకుండ మజాక్‌ చేసెటోడు.

ఎటియంలు, డెబిట్‌ కార్డులు ఇంకా రాని కాలం అది.

ఒకరోజు సదరు ఆఫీసరు గారింట్లో వారి తండ్రిగారి తద్దినం వచ్చింది. ఇక మన వాడి హడావుడి చెప్పతరం కాదు. రెండు రోజుల ముందు నుండే పెళ్లి హడావుడిలా అది మొదలయ్యింది. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ నుండి సామాన్లు, సరుకులు మోసుక రావటం, తద్దినం బ్రహ్మలు, భోక్తల ఏర్పాట్లు, గోదానం కోసం గోవును కొనటానికి  నార్సింగీ పశువుల మార్కెట్టుకు పోవటం, ఆ నాటి ఉదయం వచ్చిన బంధు గణానికి టీలు, టిఫిన్లు, మధ్యాహ్నం తద్దినం భోజనాలకు రాం నగర్‌ గుండుకు వెళ్లి శుద్దశాఖహార బ్రాహ్మణ క్యాటరింగ్‌ వారిని అరెంజ్‌ చేయటం అన్నీ ఒంటిచేత్తో ‘సవ్యసాచి’లా పనిచేసి ఆయన, ఆయన భార్యామణి మెప్పులు గొప్పగా సంపాదించాడు.

మూల విరాట్టు భార్యామణి పిల్లల సమేతంగా షాపింగులకు బయలుదేరితే మనవాడు రెండు జేబుల ‘లట్కుం లట్కుంలతో’ బాడీగార్డులా బయలుదేరేవాడు. ఆమె, పిల్లలూ షాపింగులు చేయటం బిల్లులు ఈయన చేతికి అందివ్వటం. ఇట్లా ఆ మహా ఇల్లాలు తన ఇంటికి అవసరమైన కర్టెన్లు, బెడ్‌షీట్లు, దుప్పట్లు, పిల్లో కవర్లు, ఏం కొనాలన్నా ‘పిచ్చి వెంకట్రావు’ వెంట ఉండవలసిందే, సేవలు చేసి తరించవలసిందే.

ఈ సంగతులన్నీ అటెండర్లు, డ్రైవర్ల ద్వారా డిపార్ట్‌మెంటులో అందరికీ తెలుస్తుండేవి. రహస్య సమాచారాల సేకరణకు వారే ఫ్రధాన కేంద్రాలు.

ఒక వేసవి చల్లని సాయంకాలం, ఆఫీసు సిబ్బంది అంతా ఒక బార్‌లో టెర్సేస్‌ పైన కూచుని చల్లచల్లని బీర్ల సేవనంలో ఉన్నపుడు ‘పిచ్చి అండ్‌ పాగల్‌’ వెంకట్రావ్‌ ప్రస్తావన వచ్చి, వైన వైనాలుగా చెప్పుకుని నవ్వుకుంటుంటే కొత్తగా చేరిన ఒక కుర్ర క్లర్కు:

“అయితే మన వెంకట్రావు సార్‌, పెద్ద సార్‌ గారింట్లో అన్ని పనులూ చేస్తుంటే ఇగ పెద్ద సార్‌కు వాళ్లింట్లో చేయవలసిన పనులేం ఉండవన్నమాట” అని అమాయకంగా సందేహం వెలిబుచ్చాడు.

“ఇగ ఒక్క పనే ఉంటది రా బేటా. రాత్రి పూట పెళ్లాం పక్కలో పడుకుని పిల్లల్ని పుట్టించే పని” అని మరో కొంటె క్లర్కు కుర్రక్లర్కుకు సందేహ నివృత్తి చేయగానే బీరు గ్లాసులన్నీ గల గల మన్నాయి.

నవ్వులన్నీ సద్దుమణగగానే మరో రసిక శిఖామణి “ఇగ ఆఖరికి ఆ ఒక్క మిగిలిన పని కూడా మన పాగల్‌‌ చేస్తే అన్ని పనులు పూర్తిగా చేసినట్టుంటవి కదా” అని ఒక చెణుకు విసరగానే మళ్లీ పకపకా వికవికా బెకబెకలు వెల్లివిరిసాయి.

“అయినా, భాయీ; మనోడికి అంత సీను లేదు. ఇతరులకు ఊడిగం చేసి చేసి అలిసిసొలిసి ఉన్నది కాస్తా ఎప్పుడో వాలిపోయి ఉండొచ్చు” అని మరో వృద్ధ జంబూకం స్వానుభవ వ్యాఖ్యానం.

పాపం పిచ్చి వెంకట్రావు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version