Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-16

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[దేవప్రయాగలో బస్సు దిగి ఒక చిన్న హోటల్‌ రూము తీసుకుంటాడు స్వామి. కాస్త ఫ్రైష్ అయి బయటకొచ్చి ఓ రోడ్ సైడ్ హోటల్ పుల్కాలు ఆలూ సబ్జీ తిని గదికి వచ్చి నిద్రపోతాడు. సాయంత్రం నుంచి పెద్ద వాన కురవడంతో, స్వామి బయటకు వెళ్ళలేకపోతాడు. గతంలో తాను చేసిన భైరవకోన యాత్ర గురించి తలచుకుంటాడు. మర్నాడు మధ్యాహ్నానికి జ్యోతిర్మఠ్ చేరుకుంటాడు. ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుని మర్నాడు మధ్యాహ్నం శంకరచార్య గుహకు వెళ్తాడు. ఆ గుహ వద్ద కొంతసేపు గడిపి, తర్వాత యమునోత్రికి వెళ్లే జీపు ఎక్కుతాడు. సాయంత్రం అయ్యేసరికి ‘హనుమాన్‌చట్టీ’ కి చేరుతుంది జీపు. అక్కడ్నించి గుర్రాలు లేదా కాలినడకన పైకి వెళ్ళాలి. మర్నాడు ఉదయం ఓ గుర్రం మీద ఎక్కి యమునోత్రి బయల్దేరుతాడు. సుదీర్ఘ ప్రయాణం చేసి యమునోత్రి చేరుకుంటాడు. అక్కడ కొంత సేపు గడిపి, తిరుగుప్రయాణమవుతాడు. ఆ రాత్రికి విపరీతమైన ఒళ్లునొప్పులు, జ్వరంతో తన బసకి  చేరుతాడు స్వామి. బస యజమాని దయతో బలవంతం చేసి ఒక గిన్నె వేడి జావ ‘సత్తు’ తాగించి, జ్వరం ఒళ్ళు నొప్పులు తగ్గడానికి మాత్రలు వేస్తాడు. ఆశ్చర్యంగా మరునాడు ఉదయానికి స్వామి బాగా కోలుకుంటాడు. బద్రీనాద్ వెళుతూ మధ్యలో పాండుకేశ్వర్ వద్ద ఆగుతాడు. పాండురాజు, కుంతీదేవి మాద్రిల కథలు గుర్తు చేసుకుంటాడు. కుంతి మాద్రలకు నియోగ పద్ధతి ద్వారా సంతానం కలిగిన విధానాన్ని, కురువంశ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటాడు. పాండుకేశ్వర్ నుంచి కేదారనాధ్ బయల్దేరుతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-17: ఒంటరి యాత్రికుడు – నాల్గవ భాగం

క చాయ్‌ దుకాణంలో తన బ్యాగు బరువును వదిలించుకుని పాదయాత్ర సాగించాడు. అంతటా మన్నూ మిన్నూ ఏకంచేసే ‘హర హర మహాదేవ్‌’ స్తోత్రాలు. ‘భం భం బోలేనాథ్‌’ అంటున్న కాషాయధారులు. గంజాయి దమ్ములో వారు గరళకంఠుడిని దర్శిస్తారు. దుకాణాలలో వినబడుతున్న శివభక్తి పాటల క్యాసెట్లు.

అక్కడ ఆ దారులలో ఒక రష్యన్‌ యాత్రికుడు కనిపించాడు. యువకుడే కాని కాలినడకన వచ్చినందున తెగ ఆయాసపడి పోతున్నాడు. అతని ముక్కు నుండి నోటి నుండి చలి వలన ఆవిరి పొగలు బుసబుసమని పొంగుకొస్తున్నాయి. వీపున అతి పెద్ద “బాక్‌ప్యాక్‌”. దాని లేసులు ఛాతీకి, కడుపుకు బిగించి కట్టుకున్నాడు. అతను ధరించిన జర్కిన్‌, గమ్‌బూట్స్‌ మంచుపొడితో నిండి ఉండి మంచుమనిషిలానే భారంగా అడుగులు వేస్తూ ఒక చోట ఆగాడు. అతని అవస్థ గమనించిన స్వామి దగ్గరికి వెళ్లి ఒక నీళ్ల సీసా అందించాడు.

“దస్వీదానియా” అన్నాడు.

అప్పుడు తెలిసింది. రష్యన్‌ అని. రష్యాలోని ఓల్గా నది ఈ గంగానది దగ్గరకు వచ్చినట్లు స్వామికి అనిపించింది. బ్యాగును క్రిందికి దించటంలో ఆ ‘ముసాఫిర్‌’కు తనూ ఒక చేయివేసి సాయం చేసాడు. వీపు మీదున్న కొండంత బరువు దిగగానే అతను రిలాక్స్‌ అయ్యాడు. ఆయాసం కొంత తగ్గింది.

ఎదురుగా ఉన్న చాయ్‌ దుకాణాన్ని చూపిస్తూ “సమొవార్‌, చాయ్‌” అని ఆహ్వానించినట్లు అడిగాడు స్వామి. ఆ బహుదూరపు బాటసారి “దాదా” అని తల ఊపాడు. రష్యన్‌లో దాదా అంటే ఇంగ్లీషులో ఓ.కే. అన్నట్లు.

అట్లా ఆ రెండు కప్పుల గరం గరం పొగలు గక్కే చాయ్‌ ‘ఇండియా-రష్యా’ దోస్తానాకు వారధిగా మారింది. అతనికి ఇంగ్లీషు రాదు. కాని ఇద్దరికీ “దిల్‌ కీ భాష, హృదయభాష” తెలుసు కావున ఆ అగంతకుడు ‘పీటర్సుబర్గు’ నివాసి అని అతి కష్టంగా తెలుసుకున్నాడు. ఆ తర్వాత కొంత ప్రయత్నంతో అతని పేరు ‘ఉల్యానోవ్‌ ఇల్యిచ్‌ అలెగ్సాండ్రోవిచ్‌’ అని కనిపెట్టాడు. రష్యా ఆఖరి జార్‌ చక్రవర్తి పేరు అది.

స్వామి తనని చూపించుకుంటూ “స్వామి” అన్నాడు.

అతను ఏదో అర్థం అయినట్లు గట్టిగా నవ్వుతూ “హో సామే” అన్నాడు.

స్వామి లెనిన్‌, గోర్కీ, టాల్‌స్టాయ్‌ పేర్లు పలికాడు టెలిగ్రాఫిక్‌ ‘భాష’లో.

“సబ్‌ సమజ్‌గయా” అన్నట్లు అతని కండ్లు మెరిసాయి. చిరునవ్వులు చిందించాడు.

ఆ తర్వాత ఒకరికొకరు గట్టిగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకుని మరోసారి దస్విదానియాలు చెప్పుకుని ఆ ‘సంచారులు’ వీడ్కోలు తీసుకున్నారు. తాము జీవితంలో మళ్లీ కలవమని ఆ ఇద్దరు ‘బంజారులకు’ తెలుసు. కాని కలిసి గడిపిన ఆ రెండు, మూడు ఘడియలను మాత్రం మధురమైన జ్ఞాపకాలుగా జీవితాంతం మనసులో దాచుకుంటారు. ప్రతి మలుపులో,  ప్రతి మంజిల్‌లో కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు తారసపడి వారి ముద్రలను బలంగా మనపై వేస్తారు. వారిని వారి జ్ఞాపకాలను మనం జీవితాంతం మెదడు అడుగు పొరలలో నిక్షిప్తపరచుకుంటాం. కొందర్ని మనం లిప్తకాలం, రెప్పపాటు క్షణంలోనే చూడగానే మనకు చిరపరిచితులయినట్లు, ఎప్పుడో, ఏదో కలలో మనకు కనబడినట్లు పూర్వ జన్మలో చూసినట్లు, కలిసినట్లు అనిపిస్తుంది. అవన్నీ అకారణ ప్రభావాలు. ఏడేడు ఎనక జన్మల అనుబంధం కావచ్చు.

సంవత్సరంలో ఆరునెలలు అనగా జూన్‌ నుండి డిసెంబరు వరకు మాత్రమే కేదార్‌నాథ్‌ యాత్రికులకు తెరిచి ఉంటుంది. డిసెంబరు చివరికి పూజారులు, వ్యాపారులు అందరూ క్రిందికి దిగి వచ్చేస్తారు. ఇక నరమానవుడెవరూ అక్కడ కనిపించడు. ఆ ఆర్నెల్లు దేవతలు కైలాసం నుండి క్రిందికి దిగి వచ్చి నివాసముంటారని జనాభిప్రాయం. దేవలోకం వారు, భూలోకంవారు అట్లా అనధికార అంగీకార ఒప్పందం చేసుకున్నారేమో!

స్వామి తీరికగా నడుచుకుంటూ ఆ దేవాలయాన్ని దాటుకుని చాలా దూరం ముందుకు వెళ్లాడు. అక్కడే శంకరాచార్యుని సమాధి ఉంది. పెద్ద వేదికలాగా కట్టారు. దానిపై చాలా ఎత్తున ఎగురుతున్న కాషాయకేతనం. పాల తెలుపు మంచు పర్వతాలపైన పరుచుకున్న నీలాకాశం మబ్బుల క్రింద రెపరెపలాడుతున్న సంజకెంజాయ నారింజ కేతనం. ‘జంబూ ద్వీపం, భరతఖండే’ అధ్యాత్మికతకు ఒక సంకేతంలా ఒక ప్రతీకగా మిలామిలా మెరుస్తున్నది. అది నిజమైన అస్థికలను భూస్థాపితం చేసిన సమాధి కాదు, అదే దారిలో ఆదిశంకరుడు పన్నెండు వందల సంవత్సరాల క్రిందట ఏకాకిగా, ఒకడే ఒంటరొంటరిగా ముందుకు, మున్ముందుకు నగ్న పాదాలతో నడుచుకుంటూ వెళ్లి మంచు పర్వతాలలో మాయమైన స్థలం ఇదే. అంతకన్నా ముందు అర్వాచీన, ప్రాచీన కాలంలో మహాభారత యుద్దానంతర కాలంలో కౌరవులతో సహా బంధుమిత్రులందర్నీ యుద్ధరంగంలో కోల్పోయిన తర్వాత, తమ ఆత్మబంధువు, సఖుడు, మార్గదర్శి ఐన శ్రీకృష్ణుడు ద్వారాకానగరంలో అవతారం చాలించినాక పాండవులలో మిగిలిన ఏకైక వారసుడు, అభిమన్యుని పుత్రుడు పరీక్షిత్తునకు పట్టాభిషేకం జరిపి వైరాగ్యభావనలు ముంచెత్తగా ద్రౌపది సమేతంగా పాండవులు ఇచ్చటనే ఇదే దారిలో ఈ మంచుగడ్డల హిమశీతల మృత్యు దారులలో మహాభినిష్క్రమణం చేశారు. మహాపరినిర్వాణం  పొందారు. స్వర్గారోహణ దారిలో ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఒక్కొక్కరే రాలిపోయారు. కూలిపోయారు. ధర్మరాజు మాత్రమే ఒక శునకం వెంటరాగా స్వర్గానికి చేరుకున్నాడని ఒక పౌరాణిక కథ ఉంది.

ఆ సమాధి స్థలం దగ్గర ఒక బెంచీపై స్వామి కాలాన్ని మరిచిపోయి చాలా సేపు కూర్చున్నాడు.

‘టైం మిషన్‌’లో బహుశా ప్రాచీన కాలంలోకి వెళ్లిపోయాడేమో!

ఆ రాత్రి అక్కడే రెండు పరుపులు మధ్య పడుకున్నా నిద్రరాని స్వామి మరునాడు తెల్లారి ‘బద్రీనాథ్‌’ వైపు ప్రయాణమయ్యాడు.

“హై మెరే దిల్‌ కహీఁ ఔర్‌ చల్‌
గమ్‌ కి దునియా సే దిల్‌ బర్‌ గయా”.
(దాగ్‌ ఫిల్మ్‌ 1952)

***

బధ్రీనాథ్‌ చేరుకున్నాడు. దేవాలయం క్రింది లోయలో అలకనంద గలగలా పారుతుంది. అదొక వైష్ణవాలయం. అక్కడ పూజారులందరూ మలయాళ దేశానికి చెందిన నంబూద్రి బ్రాహ్మణులే ఉంటారు. హిమాలయాలలో ఏ చోటికి వెళ్లినా చలి చెలి వెంట తరిమి వేటాడుతూనే ఉంటుంది.

అక్కడ కూడా ఒక తెలుగు పెద్దాయన కనిపించాడు. ఆయనది అక్కడ వానప్రస్థాశ్రమ జీవితం. తెలుగు యాత్రికులకు గైడ్‌గా మార్గదర్శిగా వ్యవహరిస్తూ తన శేషజీవితం అక్కడే గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆయన సహాయంతో తక్కువ ధరకు ఒక గది సంపాదించి తన ‘గాడిద బరువును’ అక్కడ వదిలించుకుని అలకనందలో విముక్తుడయ్యాడు. సాన్నానికి చాలా అనుకూలంగా ఉండటంతో గోరువెచ్చని ఉదయపు నీరెండలో తృప్తిగా స్నానం చేసాడు. ఒంటికి సబ్బు పులుముతే ‘గంగామాయీ’ కి అపచారం చేసినట్టు అవుతుందన్న భయంతో ఉత్త చేతులతోనే ఒళ్లంతా రుద్దుకుని స్నానం చేసాడు. ఆ పవిత్ర పుణ్యజలాల స్నానంతో శరీరశుద్ది, ఆత్మశుద్దితో పాటు జీవుడి ప్రాణానికి సుఖం అనిపించింది.

ఈలోగా కొంతమంది పిల్లపూజారులు దరికి చేరి పెద్దలకు పిండాలు పెట్టుకుంటారా అని ఆశతో అడిగారు. వారు వేదవిద్యార్థులు కావచ్చు. “పియ్యి తినెడి కాకి పితరుడెట్లాయెరా” అన్న వేమన పద్యం జ్ఞాపకం వచ్చింది. పాపం ఆ పిల్లపూజారులను నిరాశపరచరాదని భావించి ఒక పది రూపాయల నోటు వారి చేతిలో పెట్టి మళ్లీ రేపు ఉదయం వస్తా అని దొంగ వాగ్దానం చేసాడు. “పోయిన వాళ్లను తృప్తి పరచకుండా, ఉన్నవాళ్లను సంతోషపెడితే చాలు” అనేది స్వామి మనస్తత్వం.

క్యూలో గంటలు గంటలు నిలబడి బదరీనాధుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు సేవించటం సమయ నష్టం  అని భావించి అక్కడికి మూడు కి.మీ.ల దూరంలో ఉన్న ‘మానా’ గ్రామానికి కాలినడకన బయలుదేరాడు. అది భారతదేశ చివరిభాగం, చివరి గ్రామం. సరిహద్దు దాటితే చైనా దేశం. అక్కడికి ఏ రవాణా సౌకర్యం ఉండదు. కాలిబాటనే శరణ్యం.

అంబరాన్ని చుంబించే కుడిఎడమల పర్వతాల లోయలలో సన్నని కాలిబాట మీద ప్రయాణం. ఆ ప్రకృతి ఒడిలో తానొక అల్ప, స్వల్ప పిపీలికం. చీమ లాగే ఒక్కొక్క అడుగు ముందుకు వేసి సాగుతుంటే జనారణ్య ప్రపంచానికి దూరంగా తానొక్కడే దారి కాని దారులలో ఆ ఇరుకుదారుల కాలిబాటలలో ఆ చిన్న చిన్న గులకరాళ్ల మీద తన అడుగుల చప్పుడు తానే వింటూ ముందుకు సాగటం దివ్యానుభూతిగా ఉంది. అప్పుడు సాలూరు రాజేశ్వరరావుగారు తను స్వయంగా రచించి స్వరపరచి, తన సంగీత పర్యవేక్షణలో తనే స్వయంగా ఆకాశవాణి రేడియో కోసం గానం చేసిన మధురగానం జ్ఞాపకం వచ్చింది.

“ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా
ఉదయారుణ కాంతిపుంజ
పథమున ఎటు పయనింతువో!
ఓహో యాత్రికుడా..

నిద్రరాని, నిద్రలేని నీవు
నీ పవిత్ర యాత్ర
సాగింపుము.
ఓహో యాత్రికుడా!”

ఈ ‘మానా’ గురించి భారతీయ విద్యాభవన్‌ వాళ్లు వేసిన చార్‌ధామ్‌ పుస్తకంలో చదివాడు. అక్కడి ఒక గుహలో వ్యాసమహర్షి తన శేష జీవితం అంతా గడిపి ‘మహాభారతం’ రాసాడని ఒక ఇతిహాసం వాడుకలో ఉంది. బదరీనాథ్‌ దేవాలయం కన్నా ఆ ‘వ్యాస గుహనే’ స్వామిని ఆకర్షించి ఇక్కడి దాకా తీసుకొచ్చింది.

గ్రీకు దేశంలో ‘హోమర్‌’ రాసిన చారిత్రక కావ్య పురాణాలు ‘ఇలియడ్‌’, ‘ఒడిస్సీ’ ఎట్లాంటివో మన దేశానికి రామాయణం, మహాభారతాలు అట్లాంటివి.  అయితే మరుగున పడిన మరో విస్మృత పురాణం కూడా ఉంది. అది రెండు వేల సం॥ల కిందట కిర్గీజ్‌భాషలో రాసిన ‘మానస్‌’ పురాణం. ఇటీవలికాలం 1990 కిర్గీజ్‌స్థాన్‌లో దాని రెండువేల సంవత్సరాల ఉత్సవాలు జరిగాయి. క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో మన దేశాన్ని పరిపాలించిన హుణరాజు ‘కనిష్కుడు’ ఆ దేశం నుండి వచ్చినవాడే. ఐదవ శతాబ్దంలో పరిపాలించిన తోరమానుడు, మహిరకులుడు ఇద్దరూ హుణ జాతికి చెందినవారే.

‘మానా’ గ్రామం చేరాడు. చాలా చిన్నపల్లె. యాభై, అరవై కన్నా ఎక్కువ ఇళ్లు లేవు. అవి కూడా సమతలంగా కాక భూగృహాల్లా లోపలికి ఉన్నాయి. ఎస్కిమోల ఇండ్లు ”ఇగ్లూ”ల లాగా. చలికాలం హిమవత్పాతంతో అంతా కప్పబడుతుంది. కావున వెచ్చదనం కోసం అటువంటి గృహనిర్మాణాలు. ప్రతి ఇంటిముందు బండ్ల కొద్దీ కట్టెల మోపులు. చలికాలంలో పొయ్యిలోకి కట్టెలు దొరకవు కాబట్టి ఆ జాగ్రత్తలు. మన గ్రామాలలో మేకలు, గొర్రెలు, ఆవుల్లాగా ఎక్కడ చూసినా జడలబర్రెలు, యాక్‌లు, ఆ పల్లె ప్రారంభంలో ఒక స్త్రీ నిలుచుని ఉంది. టిబెటెన్‌ ఆకారం. నిలువెత్తు నల్లటి మందమైన దుస్తులు. మెడలో రంగు రంగుల దొడ్డు దొడ్డు పూసల హారాలు. చిన్న చిన్న కండ్లు చప్పిడి ముక్కు. చప్పిడి దవడలు. తలను, చెవులను నిండా కప్పుకున్న నల్లటోపీ. బహుషా ఆ యాక్‌ వెంట్రుకలతో చేసినది కావచ్చు.

“వ్యాస గుహ కిదర్‌ హై” అని అడిగితే ముందు ఆమెకు అర్థం కాలేదు. “బ్యాస్‌ గుహ” అని ఉచ్చారణ మార్చి అడగ్గానే పల్లెకు ఎడమవైపు చేయి చాపి చూపెట్టింది. మొత్తానికి ‘వ్యాస గుహ’ చేరుకున్నాడు.

అక్కడ యాత్రికులెవరూ లేరు. లోపలికి వెళ్లగానే కేశ సంస్కారాలులేని యువ కాషాయాంభరదారి కళ్లు మూసుకుని ధ్యానంలో కూచున్నాడు. వ్యాసమహార్షి రాతి విగ్రహం పక్కన ఏకదంత వినాయకుడిది మరో చిన్నసైజు విగ్రహం. అక్కడ ఎటువంటి ఆర్బాటాలు, హంగామాలు లేవు. భక్తులు లేరు, పూజారులు లేరు. సంభావనలూ లేవు.

మహాభారత రచనా స్థలానికి మన దేశప్రజలు ఇచ్చిన గౌరవం, ప్రాధాన్యతకు స్వామి సిగ్గుపడ్డాడు. మన వాళ్లు ‘లక్ష్మీదాసులే’ గాని సరస్వతి ఆరాధకులు కాదని మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఇతర దేశాలలో వారి గొప్ప రచయితలకు ప్రత్యేకంగా వారు నివసించిన ఇళ్లను ‘మ్యూజియంలు’గా నిర్మించారు. ఉదాహరణకు లండన్‌లో డికెన్స్‌ మ్యూజియం, మాస్కోలో గోర్కీ మ్యూజియం, బిష్కెక్‌లో చెంగీజ్‌ ఐత్‌ మాతోవ్‌ మ్యూజియం.

స్వామి శ్రద్దగా మోకాళ్లపై వంగి వ్యాసమహర్షి విగ్రహానికి దండం పెట్టాడు.

వ్యాసమహార్షికి వ్రాయసగాడు వినాయకుడు. ఆయన ముఖతహాగా, మౌఖికంగా చెపుతుంటే వినాయకుడు తన దంతాన్ని ఊడపెరికి దానిని గంటంగా ఉపయోగించి మహాభారత రచన చేసాడని ఒక కథ ప్రచారంలో ఉంది. నిజానికి పూర్వకాలంలో కవి పండితులెవరూ స్వయంగా తమ స్వహస్తాలతో రచనలు చేయలేదు. మౌఖికంగా చెపుతుంటే శిష్యుపరమాణువులు చేత గంటంపూని తాళపత్రాలపై గబగబా రాసుకుంటూ పోయేవారు. ఆఖరికి మన విశ్వనాథ సత్యనారాయణగారు కూడా వేయిపడగలు నవలను మౌఖికంగా చెపుతుంటే ఆయన పెద్ద తమ్ముడు ‘విశ్వనాథ వెంకటేశ్వర్లు’ 29 రోజులలో వేయి పేజీలను రాసి ముగించాడు.

స్వామి అలికిడికి ఆ యువసాధువు కనులు తెరిచాడు. ఎక్కడి నుండి వచ్చారు అని హిందీలో ప్రశ్నించాడు. స్వామి చెప్పాడు. తనది కర్నాటక అనీ దేశసంచారం చేస్తూ బద్రీనాథ్‌ కన్నా ఇక్కడే ప్రశాంతంగా ఉందని ఈ గుహ పక్కనే కుటీరం నిర్మించుకుని ఉంటున్నానని. అతను ముక్తసరిగా చెప్పి మళ్లీ తన ధ్యానం లోకి వెళ్లిపోయాడు.

మానా గ్రామం దాటి కొంచెం ఎత్తులోఒక కొండెక్కగానే సరస్వతి నది జన్మస్థానం కనిపించింది. ఆ జలపాతం దూకుడుకు, హోరుకు చెవులు బ్రద్దలు అవుతున్నాయి. అయితే కొంతదూరం ప్రయాణించిన తర్వాత భూమిలోకి మాయం అవుతుంది. ఇక మళ్లీ ఎక్కడా కనిపించదు కానీ అలహాబాదు ప్రయాగ వరకు అంతస్సవ్రంతిల్లా ప్రవహించి అక్కడ గంగాయమునలతో కలిసి త్రివేణీ సంగమంగా రూపొంది కాశీ వైపు పురోగమిస్తుంది. సరస్వతి నది మధ్యలో ఒక పెద్ద రాతిగుండు ఉంది దాని పేరు ‘భీమగుండు’ భీముడు ఆ గుండును నదిలో వేసినందుకే ఆ ప్రవాహం ఆగి అక్కడే భూమిలోకి అంతర్లీనమయ్యిందని ఒక కథ ప్రచారంలో ఉంది. కృష్ణా, గోదావరి నదులు కూడా అంతే. కొండలలో ఆవిర్భవించి అక్కడే ఉన్న చిన్న గుండంలోకి మాయమయ్యి మళ్లీ క్రింద మైదాన ప్రాంతాల్లో దర్శనమిస్తాయి.

మానా నుండి మళ్లీ బద్రీనాథ్‌కు తిరుగుముఖం పట్టాడు. పాదాల క్రింద చిన్న చిన్న గులకరాళ్లు కిర్రు కిర్రున శబ్దాలు చేస్తుంటే స్వామి మనసులో ఆలోచనా తరంగాలు నది ప్రవాహంలోని అలల్లాగా ఎగిసిపడుతున్నాయి.

తన వలన కొనసాగిన కురువంశం తన కళ్లముందే నశించిపోవటం వ్యాసుడి మనసును క్షోభ పెట్టింది. ఆ వంశ పతానానికి దారి తీసిన పరిస్థితులు గురించి గ్రంథస్థం చేసాడు. నిజానికి వ్యాసమహర్షి తను రచించిన కావ్యానికి తొలుత ‘జయేతిహాసం’ అని పేరు పెట్టాడట. తర్వాత కాలంలో అతని శిష్యులు వైశంపాయనుడు, సౌతి, జైమినీ మొదలగువారు దానికి అనేక విషయాలు జోడించి ‘భారతం’ అని కొత్త పేరు పెట్టారట. ఇదొక్కటే కాదు ఒడిస్సీ, ఇలియడ్‌, మానస్‌ లన్నీ ఇతిహాసాలే కదా! ఆ నాటి చరిత్రకు ప్రతిఫలనాలు. రిఫ్లెక్షన్స్‌ అన్నమాట. వ్యాసుడి తర్వాత కాలంలో పురాణాలు, భాగవతంలో అనేక అంశాలు, కల్పనలు కలిసి అది ‘మహాభారతంగా’ రూపొందింది. కాలానుగుణంగా అనేక భాషలలో వచ్చిన కవులు తమ ఊహాశక్తితో అనేక కల్పనలను జోడించారు.

బధ్రీనాథ్‌ చేరుకుని తన బ్యాగు తీసుకుని గోముఖ్‌ బస్సు ఎక్కాడు. గోముఖ్‌ అతని చివరి మజిలీ.

***

గతంలో స్వామి నాసిక్‌, త్రియంబకంలో గోదావరి, పశ్చిమ కనుమలలో భాగమైన మహాబలేశ్వర్‌ కొండలలో కృష్ణానది, మధ్యప్రదేశ్‌ అమర్‌కంటక్‌లో నర్మదానది, ముల్తాయిలో తపతీనది జన్మస్థానాలను దర్శించాడు. పర్వతాలు, నదులు అతడిని సూదంటు రాయిలా ఆకర్షించి రారమ్మని రహస్య మార్మిక సంకేతాలు పంపిస్తుంటాయి. ఒక నాస్తికుడికి ఇవన్నీ అవసరమా అని కొంతమంది అనుకుంటారు గాని వీటి మీది ప్రేమకు, అన్వేషణకు మతమూ, దేవుళ్లకూ సంబంధం లేదని వివరించి చెప్పటం “చెవిటి వాళ్ల ముందు శంఖం” ఊదినట్లే కదా! నాస్తికుడైన నెహ్రు కూడా “ఒకవేళ నేను రాజకీయాలలోకి రాకపోతే కాశ్మీర్‌ మంచుకొండల మైదానాలలో, పచ్చిక బయళ్ల లోయలలో ఒక సంచారిగా జీవించే వాడిని” అని తన స్వీయచరిత్రలో రాసుకున్నాడు. ప్రకృతి ప్రేమకు, సంచార తత్వానికి ఆస్తికవాదానికి సంబంధం లేదు కదా? కొందరు నైలు నది, అమెజాన్‌ నది మూలాలను ఎందుకు అన్వేషించారు. సహారా, గోబీ ఎడారులను ఎందుకు అధిగమించారు? కిలిమంజారో, ఎవరెస్టు లాంటి పర్వతాలను ఎందుకు అధిరోహించారు? చిన్న తెరచాప పడవలలో సముద్రాలను ఎందుకు దాటారు? మానసిక జడత్వం ఉన్న వారికి జవాబులు చెప్పటం ఎవరి తరం? మేధస్సుకు, తర్కానికి అందని ఎన్నో సంగతులు ఉంటాయి. దానికి ‘పరేంగిత జ్ఞానం’ ఉండాలి.

గోముఖ్‌లో గంగానది ఒడ్డున ‘గంగాదేవి’ ఆలయం చిన్నగా ఉంది. దానికి భక్తుల తాకిడి అంతగా లేదు. స్వామి నది ఒడ్డున చాలాసేపు కూచున్నాడు. నదిలో నీళ్లన్నీ ఎర్రగా, బురదబురదగా, రాళ్లు రప్పలతో కలిసి వేగంగా ప్రవహిస్తున్నాయి. ఎక్కడో పైన పర్వతాలలో భారీ వర్షం కురిసిందట. కొండలు కోసుకపోయి, చరియలు విరిగి పడి అట్లా నీళ్లు బురదబురదగా మారాయట.

నిజానికి గోముఖ్‌ అసలు జన్మస్థానం  కాదు. ఇంకా పైపైకి పన్నెండు కి.మీ.ల దూరం ప్రయాణిస్తే గంగోత్రి కనబడుతుంది. అక్కడి హిమపర్వతాలలో ఒకచోట ఒక హిమగుహ ‘గోవుముఖం’లా ఉంటుందట. అందులో నుండి వచ్చే పరమపవిత్ర పావన జలాలే గంగానది జన్మస్థానం. సాధారణ మానవులు ఎవరూ అక్కడికి వెళ్లటం సాధ్యంకాదు. సాధువులు, సన్యాసులు మాత్రం సులభంగా వెళ్లగలరు.

ఈ సంగతులన్నీ స్వామి సుందరానంద, స్వామికి చెప్పాడు. ఆయన స్వామిని కలవటం చాలా నాటకీయంగా, గమ్మత్తుగా జరిగింది.

ఒకరోజు స్వామి నదితీరాన ఏకాంత సేవలో కూచున్నాడు. ఒక వృద్దసాధువు అతని పక్కనుండే త్యాగరాజకృతి “రామా నను బ్రోవరా” అన్న పదమూ, రాగమూ ఆలాపిస్తూ వెళ్లుతున్నాడు.

ఆ సాధువు తెలుగువాడని స్వామికి తెలిసి ఆయన వెనక పరిగెత్తి ‘స్వామీజీ నమస్తే” అని తెలుగులో అన్నాడు. ఆయన హఠాత్తుగా ఆగి “మీరు తెలుగువారా?” అని ప్రశ్నించాడు.

అవును అన్నాడు.

కాసేపు కుశలప్రశ్నలయినాక గంగకు ఎడమ ఒడ్డున ఉన్న తన కుటీరానికి ఆహ్వానించాడు. అనుకోకుండా రెండు రోజులు ఆయన అతిథిగా అక్కడే ఉన్నాడు.

ఉన్న ఆ రెండు రోజులలో అనేక ప్రశ్నలు, జవాబుల ద్వారా స్వామి ఆ ‘కర్మయోగి’ జీవితం గురించి వివరంగా తెలుసుకున్నాడు.

డెభ్బై సంవత్సరాల స్వామి సుందరానంద్‌ 1927 సం.లో నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెలో జన్మించాడు. ఆయన అసలు పేరు సుందరరామయ్య. నాల్గవ తరగతి చదువును మధ్యలోనే ఆపేసి, ఇహలోక ప్రపంచంలో ఇమడలేక పరలోకచింతన అధికమై తన పదహారో ఏట ఇల్లు వదిలి సంచారజీవితం గడుపుతూ 1943లో రిషికేష్‌ చేరుకున్నారు. నాలుగు సంవత్సరాలు అక్కడే గడిపి, సన్యాసం స్వీకరించి నిజమైన గురువుల కోసం అన్వేషిస్తూ 1950లలో ఇంకా లోపలి హిమాలయాలలోకి వెళ్లారు. అక్కడ ఎముకలు కొరికే చలిలో తపస్సును హఠయోగాన్ని నేర్చుకున్నారు. అలా సాధన చేసే కాలంలోనే హిమాలయాల అద్భుత సౌందర్యాన్ని, గంగాజల ప్రవాహాల సుమధురసంగీతాన్ని ఆస్వాదించి అనుభవించారు. తన అధ్యాత్మిక సాధనకు హిమాలయాలు తోడ్పడినందున ఇక అప్పటి నుండి ఆ ప్రకృతిలో తనూ ఒక విడదీయరాని భాగమై అక్కడే జీవిస్తున్నారు.

యాభ్బై సంవత్సరాల క్రితం గంగతీరాన ఈ కుటీరాన్ని నిర్మించుకుని దానిని తన ‘కార్యక్షేత్రం’గా మలుచుకున్నారు. అక్కడి నుండి అతని కర్మయోగం ప్రారంభమయ్యింది.

ముందు ఎవరెస్టు విజేత టెన్సింగ్‌ నార్కే వద్ద పర్వతారోహణలో శిక్షణపొందారు. తర్వాత అనేక హిమశిఖరాలను అధిరోహించటమేగాక తర్వాత కాలంలో ఇతర పర్వతారోహకులకు మార్గదర్శిగా వ్యవహరించాడు. వెంట్రుక వాసిలో ఎన్నోసార్లు మృత్యువు కోరల నుండి తప్పించుకున్నాడట. సన్యాసి జీవితం గడపటం కన్నా మృత్యుభయం నుండీ విముక్తి కావటం అంతకన్నా గొప్ప విషయం అని అంటారు. ఆయన మొత్తం 108 సార్లు అనేక హిమశిఖరాలను అధిరోహించి సురక్షితంగా వెనక్కి తిరిగి వచ్చారు. పక్షులు కూడా ఎగరలేనంత ఎత్తులో శిఖరాలను అధిరోహిస్తూ ‘దేవలోకమార్గం’లో ప్రయాణించానని చెప్పారు.

ఆ హిమవన్నగముల అద్భుత సౌందర్యాన్ని ప్రపంచానికి చూపెట్టాలన్న తపనతో ఫోటోగ్రఫీ నేర్చుకుని తన ‘ముక్కంటి’ కెమెరాలలో ఆ సౌందర్యాన్ని బంధించి వందలాది ఫోటోలు తీసి గొప్ప ఛాయాగ్రహకుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. దేశ విదేశాలలోని అనేక నగరాలలో వాటి ప్రదర్శనలు జరిగాయి. వివిధ పత్రికలలో ఆయనపై వ్యాసాలు రాసారు. డాక్యుమెంటరీలు తీసారు. అలా ‘బెస్ట్‌ ఫోటోగ్రాఫర్‌ ఆఫ్‌ హిమాలయాస్‌’ అని ‘క్లిక్కింగ్‌ స్వామీజీ’ అని పేరు పొందారు.

పార్లమెంటు సెంట్రల్‌ హాలులోనూ, రాష్ట్రపతి భవన్‌లోనూ ఆ ‘ఛాయాచిత్ర ప్రదర్శనలు’ జరిగాయి.

గంగోత్రి, గోముఖ్‌ ప్రాంతాలలో పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం కోసం ఆయన ప్రప్రథమంగా ఉద్యమించారు. పవిత్రమైన నదీ తీరాలలో వాతావరణం ఎలా కలుషితమవుతున్నదో తను తీసిన ఫోటోల ద్వారా, ఉపన్యాసాల ద్వారా వివరించి చెపుతారు. ఆయన కృషి, ఉద్యమం ఫలితంగా ప్రభుత్వం ‘గంగోత్రి అభివృద్ది సంస్థను’ ఏర్పాటు చేసింది. కాని దాని నిర్వహణ అంతంత మాత్రమే అని తన నిరాశా నిస్పృహను వ్యక్తం చేసారు.

సమాజానికి అతీతంగా, దూరంగా, ఏక్‌ నిరంజన్‌లా బ్రతకటం ఆయన వ్యక్తిత్వం, తత్వం కాదు. సమాజాభివృద్ది కోసం నిరంతరం స్వప్నిస్తూ, కృషి చేస్తూ జీవిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఆర్ట్‌ గ్యాలరీ, ఫోటో మ్యూజియం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారు. గోముఖ్‌కు దగ్గరలో ఉన్న భగీరథ శిల ప్రాంతంలో ఒక ‘నేచర్‌ పార్కు’ను ఏర్పాటు చేసి ప్రపంచ పర్యాటకులను రప్పించాలన్న ఆలోచనలతో అనేక ప్రణాళికలు, నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నారు. భూఆక్రమణలకు, అనధికార కట్టడాలకు, విలాసవంతమైన హోటళ్ల నిర్మాణాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

జర్మనీ, జపాన్‌, బిబిసి వారు అనేక డాక్యుమెంటరీ ఫిల్మ్‌లు ఆయనపై తీసారు. ఆయన జీవితం, కృషి గుర్తించి అనేక గ్రంథాలు వెలువడినాయి. అనేక అవార్డులు, బిరుదులు వచ్చాయి. కెమెరా సొసైటీ ఆఫ్‌ ఇండియాలో ఆయన శాశ్వత సభ్యుడు.

ఎవరైనా ఆయన వ్యక్తిత్వానికి, గొప్పతనానికి ముగ్దులై ఏ మాత్రం పొగిడినా వెంటనే మృదువుగా అడ్డుపడి చిరునవ్వుతో సవినయంగా, “భగవద్గీతలో ఆదేశించినట్లే నేను నా కర్మను ఆచరిస్తున్నాను” అని అంటారు. నిజమైన ‘కర్మయోగి’ స్వామి సుందరానంద.

అట్లా ఆ ఇరవైరోజుల ‘హిమాలయాల దర్శన యాత్ర’ ముగించుకుని ఆ యాత్రికుడు ఆ చల్‌ అకేలా ముసాఫిర్‌ స్వామి చివరికి గృహోన్ముఖంగా ప్రయాణమైనాడు.

‘చిత్తశుద్దిలేని శివపూజలేలరా’ అన్నట్లు ఆత్మశుద్ధి జరగని ప్రయాణాలు ఏల అని రైలులో కూచున్నప్పుడు తన జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాడు.

దారి బత్తెము చెల్లిపోవగ
దారి మాత్రం మిగిలియున్నది.
బాటసారిని కలిచివేసెడు
బాధ మాత్రం విడువకున్నది.
‘షాద్‌’ రామేశ్వరరావ్‌.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version