Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-15

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[హరిద్వార్‌ నుండి రిషికేష్‌కు ఒక షేరింగ్‌ క్యాబ్‌లో బయలుదేరుతాడు స్వామి. గంటకు పైగా పట్టే ఆ ప్రయాణంలో తాను బాల్యంలో చేసిన భద్రాచం యాత్రను, చిన్నప్పటి సంగతులను గుర్తు చేసుకుంటాడు. నదుల్లో రాగిపైసలు ఎందుకు వేసేవారో అమ్మ ద్వారా తెలుసుకున్న సంగతులు, ఆలయంలో సీతారాములవారిని దర్శించినప్పుడు కలిగిన అనుభవాన్ని మరోసారి మనోయవనికపైకి తెచ్చుకుంటాడు. రిషీకేశ్ చేరగానే అలౌకిక ఆనందానికి లోనవుతాడు. ఒళ్లంతా కళ్లు చేసుకుని ఆ వీధులలో తిరుగాడుతాడు. లక్ష్మణ్ ఝూలా దగ్గరకి వెళ్తాడు. ఆ వంతెననీ, క్రింద ప్రవహిస్తున్న గంగని చూసి అబ్బురపడతాడు. ఆంధ్రా ఆశ్రమం చేరి ఒక గదిలో బస చేస్తాడు. ప్రతిరోజూ ఉదయమూ సాయంత్రమూ అక్కడి గంగానది మెట్లమీద కూచుని ఆ స్వచ్ఛమైన గంగాజలాల ప్రవాహాన్ని చూస్తు గంటలు గంటలు గడుపుతాడు. ఒకరోజు ఓ ముసలామెని, మరో రోజు ఓ విదేశీ చిత్రకారుడుని చూస్తాడు. వారిని మనసులోనే అభినందిస్తాడు. మరో రోజు ఇంకో చొట ఓ జర్మన్ వనితని పలకరిస్తాడు. ఆమె తన కుటుంబం గురించి చెప్తుంది. నడక కొనసాగిస్తాడు స్వామి. ‘కాలీకంబల్‌వాలే’ ఆశ్రమం కనిపించగా, లోపలికి వెళ్ళి అక్కడున్న వయోవృద్ధుడితో సంభాషించి, కాలీ కంబల్‌వాలా గురించి తెలుసుకుంటాడు. మర్నాడు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవప్రయాగకు బస్సులో బయల్దేరుతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-17: ఒంటరి యాత్రికుడు – మూడవ భాగం

చాలా ఏండ్ల కిందట స్వామి హిందూ దినపత్రికలో ఒక సగం పేజీ అడ్వర్టైజ్‌మెంటు ఫోటో చూసాడు. చాలా పై ఎత్తునుండి బాగా స్కిల్‌ ఉన్న ఫోటోగ్రాఫర్‌ తీసిన ఫోటో అది. విమానం కిటికీ నుండి ఒక దృశ్యం చూస్తున్న అనుభూతి. చుట్టుముట్టూ ఆకుపచ్చరంగు శిఖరాలు మధ్యలో సన్నని లోయ. లోయలో సంగమిస్తున్న రెండు నదులు. ఒకటి పూర్తిగా నీలం మరొకటి పాల తెలుపు. ఆ సంగమ స్థలానికి చేరుకోవటానికి ఆ శిఖరాల మధ్య జేగురు రంగు రాతిమెట్లు. ఆ చివరి అంచున కూచుని పాదాలను నీళ్లలో జారవిడవటానికి విశాలమైన పరుపుల్లాంటి రాతిపలకలు. ఆ కొండ మధ్య భాగంలో ఒక చిన్న ఊరు. కొన్ని నివాసగృహాలు. ఆ ఫోటోను చాలా సేపు కళ్లప్పగించి అట్లనే చూస్తూ ఉండిపోయాడు. ఎక్కడిది ఈ దృశ్యం అని ఆశ్చర్యం. ఫోటో క్రింద ఒక మూలన ‘దేవ ప్రయాగ్‌, హిమాలయాస్‌’ అని రాసి ఉంది. జాగ్రత్తగా కట్‌ చేసి కొన్ని సంవత్సరాల పాటు ఆ కాగితం దాచిపెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు ఆ దేవప్రయాగ్‌ చూడాలని.

మరి కొన్ని రోజులకు భారతీయ విద్యాభవన్‌వారు ప్రచురించిన ‘చార్‌ధామ్‌ యాత్ర’ ఇంగ్లీష్‌ పుస్తకాన్ని కొనుక్కున్నాడు. మ్యాటర్‌తో పాటు కలర్‌ ఫోటోలు హిమవన్నగముల సౌందర్యాన్ని, ప్రదర్శిస్తూ, అందులో మళ్లీ దేవ ప్రయాగ ఫోటోలు, సమాచారం.

“ఇచ్ఛయే నా ఈశ్వరుడు”, “హమ్‌ అప్నే మర్జీ కే మాలిక్‌ హై” అన్న తత్వం స్వామికి కూడా ఉంది. దాని ఫలితమే ఈ హిమాలయాల యాత్ర. కలలను అందరూ కంటారు. కాని కలలను కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. స్వామి ఈ రెండవ రకం.

దేవప్రయాగలో బస్సు దిగి ఒక చిన్న హోటల్‌ రూము తీసుకున్నాడు. అవన్నీ చిన్న చిన్న గ్రామాలు. ప్రజలంతా కొండజాతి జనులు. కావున మహానగరాల్లో ఉండే మాయగాళ్లు, మోసగాళ్లు, దొంగతనాలు అక్కడేమీ ఉండవు. యాత్రీకులను ‘అతిథి దేవుళ్లనే’ భావిస్తారు.

డెభ్బై కి.మీ. దూరమే అయినా మూడు గంటల ‘నత్తనడక’ ప్రయాణం. అంతా ఎగుడు దిగుడు కొండల మీది మలుపుల దారి. అంతా సింగిల్‌ రోడ్డు. ఎదురుగా ఏ వాహనం వచ్చినా ఆగి దారి ఇవ్వవలసిందే. మధ్య దారిలో వర్షాల వల్ల కొండ చరియలు విరిగి రొడ్డు మీద పడటం. వర్కర్స్‌ వచ్చి ఆ రాళ్లు రప్పలు పారలతో ఎత్తేసి లోయలోకి విసిరేస్తేగాని రోడ్డు క్లియర్‌ కాదు. అందాక అటు ఇటూ కిలోమీటర్ల పొడుగునా వాహనాల నిరీక్షణ. “ఏడేడు శిఖరాలు నేనేక్కలేను” అన్నట్లు భక్తులు, యాత్రికుల పరిస్థితి. ఏదైనా పెద్దరాతి గుండు క్రింద ఉన్న వాహనం మీద పడితే ఇక అంతే సంగతులు. అందరూ సీదా పై లోకానికే.

బ్యాగు హోటల్‌ రూంలో పడేసి ఇవతలికి వచ్చాడు. రోడ్డు పక్క ఒక గుడిసె హోటల్‌. గరం గరం గోధుమ పుల్కాలు, ఆలు-గోబీ సబ్జీ కడుపారా ఆరగించి ఒక చాయ్‌ పట్టిస్తేగాని ఆత్మరాముడు శాంతించలేదు. హిమాలయాలన్నీ పుణ్యభూమి, కర్మభూమి గాన ఎక్కడా మధువు, మాంసం కనిపించదు.

రూంలో మళ్లీ మొద్దునిద్ర. సాయంత్రం లేవగానే భోరున పెద్దవర్షం. అవతలికి కాలు పెట్టే వీలు లేదు. మదిలో నా గదిలో నా గదిమదిలో.. అన్నట్లు లైట్లు కూడా లేని గదిలో.. సూర్యోదయం కోసం జాగారం. మధ్య మధ్యలో కోడినిద్ర.

అక్షరాల వెంబడి ప్రయాణించటం స్వామికి అలవాటే. ‘లోయ’ అన్న కథలో కథకుడు అజయ ప్రసాద్‌ ‘భైరవకోన’ అనే స్థలాన్ని కళ్లకు కట్టినట్టు చాలా అందంగా దృశ్యీకరించాడు. దట్టమైన నల్లమల అరణ్యాలలో ఒక లోయలో భైరవకోన కాలభైరవుని ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. అక్కడి చెంచుజాతి ప్రజలకు అది ఆరాధ్యదైవం. ఒక శివరాత్రి రోజు మాత్రమే అక్కడ భక్తుల సందడి ఉంటుంది. మిగతా అన్ని రోజులూ అది నిర్మానుష్యంగా, ఏకాంతంగా ఎవరికోసమో నిరీక్షిస్తూ ఒంటరొంటరిగా ఉంటుంది. దానిని చేరుకోవటానికి ఎటువంటి రవాణా సౌకర్యాలు, సరిఐన రహదారి కూడా లేదు.

ఆ కథలోని ప్రకృతి వర్ణన స్వామిని ఆకట్టుకుంది. తప్పకుండా వెళ్లాలని ఆ నాస్తికుడు నిర్ణయించుకున్నాడు. మరికొన్ని రోజులకు దినపత్రికలో మరో వార్త వచ్చింది. కడపజిల్లాకు చెందిన ముగ్గురు యువకులు ఆ దేవాలయ దర్శనం కోసం కాలినడకన బయలుదేరి నల్లమల అరణ్యంలో దారి తప్పారు. వారం రోజులయినా వారి జాడ తెలియక కుటుంబసభ్యులు పోలీసులకు, కలెక్టరుకూ విజ్ఞప్తులు చేయగా చివరికి హెలికాప్టర్‌ అన్వేషణలో వారి ఆచూకి తెలిసి రక్షింపబడ్డారు. ఆ ముగ్గురి పరిస్థితి చచ్చి బ్రతికినట్లు అయ్యింది.

ఆ వార్త చదివాక స్వామి నిర్ణయం మరింత దృఢంగా మారింది. ‘సాహసం సమక్షంలో మృత్యువు ఒక లెక్కకాదు’ అనే తత్వం అతనిది.

చివరికి ఒకరోజు బస్సులో కనిగిరిదాటి సీతారామపురం దాకా ప్రయాణించి అక్కడ ఒక మిత్రుడి మోటారు సైకిలు సంపాదించి అతని సూచనల ప్రకారం ప్రయాణించి కాలిబాటలలో వాహనాన్ని నానా తిప్పలు పెట్టి చివరికి భైరవకోన చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ముగ్గురు బైరాగులు ఉన్నారు. ఆ పగలు, రాత్రి అంతా వారితో సహవాసం. తను పట్టుకెళ్లిన అరటిపండ్లు, డబుల్‌రొట్టెలు, బిస్కట్లు, కారా మిక్చ్సరూ ఆనాటి ఆహారం. గజా గజా వొణికించే ఆ నల్లమల అడవుల చలిలో, చలినెగళ్ల ముందు కూచుని వారు చెప్పే వారి సంచార జీవితం కథలు వినటం, వారు పాడిన బైరాగి తత్వాల పాటలు, పోతులూరి వీరభ్రహ్మం పదాలు వినటం ఒక మరుపురాని అనుభూతి. తెల్లారి లేచి అక్కడి జలపాతం క్రింద జలకాలాడి, అజ్ఞాత శిల్పులు చెక్కిన భైరవ శిల్పాలు చూసి లోయ అంతా కలియ తిరిగి తిరుగుముఖం పట్టాడు.

అట్లా ఒక కథ అతడిని వేధించి, వెంటాడి అతనిని భైరవకోన దాకా తరిమింది. మరో హిందూ పేపరు ఫోటో అతడిని ఇప్పుడు ఈ దేవప్రయాగకు తీసుకొచ్చింది. ఆదిమకాలంలో మనిషి తన మనుగడకోసం చేసిన సంచారగుణం ఇప్పటికి కొందరు మనుషులలో ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది.

నీలాకాశం నల్లమబ్బుల క్రింద, చిలకాకు పచ్చలోయలో జేగురు రంగు రాతి మెట్లు ఓపికగా దిగి సంగమస్థలానికి చేరుకుని రాతి పలకలపై కూచుని రెండు పాదాలను ప్రవాహానికి అప్పజెప్పాడు. స్వామికి నీళ్లల్లో మునిగి పుణ్యస్నానాలు చేయటం ఇష్టం ఉండదు. కాని తీరికగా ఒడ్డుమీద కూచుని ప్రవాహాన్ని తిలకించటం అంతర్గతప్రపంచంలో ప్రయాణించటమే ఆనందం. అది కూడా ప్రకృతిని తనలోపలికి ఆవాహన చేసుకునే ఒక తపస్సు, ఒక ధ్యానం లాంటిదే.

దేవ ప్రయాగలో అలకనందా నీళ్లు నీలం. భాగిరథీ నీళ్లు పాల తెలుపు. ఈ రెండూ కలిసి ‘గంగ’ అన్న కొత్తపేరుతో రిషికేష్‌ వైపు సాగుతాయి పైన ఉండే ప్రయాగలలో ధూళిగంగా, మందాకినిలు కూడా ప్రవిత్రమైనవే.

ఆ మధ్యాహ్నమే బస్సు ఎక్కి సాయంకాలానికి జ్యోతిర్మఠ్ చేరుకున్నాడు.

శంకరాచార్యుడు స్థాపించిన నాలుగు పీఠాలలో ఒకటి ఈ జ్యోతిర్మఠ్. దీనికి ఉత్తర కాశీ అని మరోపేరు కూడా ఉంది. ఆయన చాలా కాలం ఇక్కడే ఉండి శంకరభాష్యం పూర్తిచేసాడని ప్రతీతి.

నందాదేవి హిమశిఖరానికి ఈ స్థలం చాలా సమీపంలో ఉంది. కావున ఎముకలు కొరికే చలికి నిజమైన అర్థం ఏమిటో ఆ రాత్రి అక్కడ అనుభవించాడు. అన్నీ పేయింగ్‌ గెస్ట్‌ హౌజ్‌లు. మామూలు రగ్గులు, బ్లాంకెట్లు అక్కడ నహీఁ చల్తా. క్రిందొక పరుపు పైనొక పరుపు, రెండు పరుపుల మధ్య దూరి ముడుచుకుని పడుకోవాలి. కాని క్యా ఫాయిదా? ‘చలి పులి’ రాత్రంతా వొణికిస్తూనే ఉంటది. భారతప్రభుత్వం వారి ‘హిమాలయాల పర్వతారోహణ శిక్షణా శిబిరం’ ఇక్కడే ఉంది. విదేశీ పర్వతారోహకులు ఎక్కువగా కన్పిస్తారు. వారందరూ ‘గిరిపుత్రు’ల్లానే కనిపించారు స్వామికి.

మరునాడు మధ్యాహ్నం శంకరాచార్యులు తపస్సు చేసిన గుహకు వెళ్లాడు. కాసేపు తనూ చక్లం ముక్లం వేసుకుని ధ్యానం చేసాడు. ఆ తర్వాత అక్కడే చాలాసేపు కూచుని ఆదిశంకరుని జీవితాన్ని, జీ.వి. అయ్యర్‌ తీసిన శంకరాచార్య సీనిమాను గుర్తు చేసుకున్నాడు. తన మూడు పదుల జీవితంలో పన్నెండు వందల ఏండ్ల క్రితం దేశం నలుమూలలా కాలినడకన సంచరించి నాలుగు పీఠాలను నెలకొల్పిన ఘనత గురించి, ఆయన అద్వైత సిద్థాంతం, మాయావాదం గురించి మననం చేసుకుని ఆశ్చర్యపోయాడు. ఎక్కడి కేరళ, ఎక్కడి కల్హాడీ? ఒక్క పన్నెండేండ్ల బాలుడు ఇల్లు వదిలి సన్యసించి అద్భుతమైన భారతీయ తత్వ చింతనకు తనూ ఒక కారణజన్ముడు కావటం ఆశ్చర్యం కాదా?

జ్యోతిర్మఠ్‌లో దారి రెండుగా చీలుతుంది. ఒకటి యమునోత్రి వైపు మరొకటి భద్రీనాథ్‌, గంగోత్రి వైపు. ఆ మధ్యాహ్నం యమునోత్రికి వెళ్లే జీపు ఎక్కాడు.

“వహాఁ కౌన్‌ హై తెరా, ముసాఫిర్‌

జాయేగా కహాఁ

దమ్‌ లేలే గఢీభర్‌, ముసాఫిర్‌

జాయెగా కహాఁ”

(గైడ్‌ ఫిల్మ్‌ 1965)

స్వామికి యాత్ర అంటే పాటల పల్లకీలో ఊరేగటమే. బర్మన్‌ గొంతులో వంగదేశపు సాధువులు, సంతాలుల ‘బౌల్‌’ సంగీతనాదాలు వినవస్తాయి.

సాయంత్రం అయ్యేసరికి ‘హనుమాన్‌ చట్టీ’లో జీపు ఆగింది. అది అంతవరకేనట. మిగిలిన ప్రయాణం గుర్రాలపైన లేక కాలినడక. చీకట్లో ఆ కొండ చరియల అంచుల మీద గుర్రాలు నడవవు. నడక సాధ్యం కాదు. కావున మఠం భోజనం, సత్రం నిద్రే గతి. స్వామికి రకరకాల రొట్టెలు తినటం అలవాటే. ఈ అలవాటు ఉన్న వాళ్లు దేశంలో ఎక్కడైనా సుఖంగా తిరగవచ్చు. లేదూ మాకు అన్నమే కావాలనుకునేవారు ‘ఇల్లే వైకుంఠం, కడుపే కైలాసం’ అని ఎంచక్కా ఇంట్లోనే ముడుచుకుని పడుకోవచ్చు. ఎందుకొచ్చిన రొస్టు! ఎందుకొచ్చిన యాతన!!

లంక యుద్దంలో లక్ష్మణుడు మూర్ఛిల్లగానే వాయుపుత్రుడు వాయువేగంతో హిమాలయాల కెగిరి వచ్చి హేమకూట పర్వతంపై ‘సంజీవని’ని సాధించి తిరుగుప్రయాణంలో ఇక్కడ, ఇదే స్థలంలో రవ్వంత సేపు విశ్రమించినందున దీనికి ‘హనుమాన్‌ చట్టీ’ అని పేరొచ్చిందట. అందుకే అక్కడ ‘జై భజరంగ్‌ బలీ’ గుడి కూడా వెలిసింది.

మరునాడు ఉదయమే యమునోత్రి ప్రయాణం. ఆ ఉదయం మంచుపర్వతాలన్నీ మౌనమునుల్లా తపస్సమాధిలో మునిగి ఉన్నాయి. వాటి వెనకే ఉదయభానుడు గోర్వెచ్చని ఎండతో యాత్రికులను పలకరిస్తున్నాడు. అందరితో పాటు స్వామి కూడా ఒక గుర్రాన్ని అద్దెకు తీసుకుని దాన్ని అధిరోహించాడు. రౌతు వెంట నడుస్తూ వస్తున్నాడు గుర్రం పగ్గాలు పట్టుకుని. ముందు కాసేపు విఠలాచార్య సీన్మాలో ఎన్టీవోడులా, కత్తి కాంతారావులా ఫీలయ్యాడు. ఆ తర్వాత అటువంటి చిన్న చిన్న ఉపమానాలు తన స్థాయికి సరిపోవని విశ్వవిజేత అలెగ్జాండరుగా తనను తాను ఊహించుకున్నాడు. ‘ఊహలు వూళ్లేలుతుంటే కర్మ కావిళ్లు మోసిందన్నట్లు’ కాసేపటికి క్రింద పృష్టభాగంలో నొప్పి మొదలయ్యింది. అదే పోతుందని ధైర్యంగా బింకంగా కూచుంటే క్షణక్షణానికి అధికం కాసాగింది. చివరికి ఎన్టీవోడూ, కత్తి కాంతారావులు మాయమై హాస్యనటుడు అంజిగాడులా పరిస్థితి తారుమారు అయ్యింది. “క్రిందికి దించరా బాబూ” అని రౌతును బ్రతిమిలాడవలసి వచ్చింది. వాడేమో అనువైన స్థలం కానరాక జరా టెహరో, జరా టెహరో అంటాడు. నొప్పిరా నాయినా అన్నా వాడు వినేటట్టు లేడు. చివరికి గుర్రం దిగి తన బ్యాగు మాత్రం దానిపై వేసి “నడక నా నేస్తం” అన్నట్లు నడవసాగాడు. అట్లా తనూ ఖుష్‌. గుర్రం భీ ఖుష్‌. ఆ గుర్రం తనను ఓరకంట చూసి కొంచెం సకిలించింది. ఒహో దీనికి కూడా మర్యాదలు తెలుసు. థాంక్సు కూడా చెపుతుంది అని తాను కూడా సంతసించాడు.

అదొక సుదీర్ఘ ప్రయాణం. లాంగ్‌మార్చ్‌. కుడిపక్క ఆకాశం అంచును తాకుతున్న వెండి వెలుగుల మంచు పర్వతాలు. ఎడమపక్క అంతా ఆకుపచ్చ లోయ. లోయలో ఉరుకుల పరుగుల యమునమ్మ. కొండ చరియలను తొలిచి, వొలిచి చేసిన కాలిబాటలు. ఎప్పుడూ ఏ క్షణం ఏ లాండ్‌స్లైడ్‌ జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఆ గుర్రాల వరుసలు, ఆ మనుషులు, ఆ ఇరుకిరుకు కాలిబాటలను చూస్తుంటే ‘మెకన్నాస్‌ గోల్డ్‌’ సీన్మా దృశ్యాలు గుర్తుకొస్తున్నాయి. మధ్య మధ్య గుడిసె హోటళ్లలో డికాషన్‌ చాయ్‌లు, మాగీ న్యూడుల్స్‌ మాత్రమే దొరుకుతాయి. అక్కడక్కడా గుర్రానికి గుగ్గిళ్లు, బెల్లం తినిపిస్తున్నాడు రౌతు.

అపసోపాలతో ఆయాసపడుతూ మధ్యాహ్నం మూడు గంటలకు యమునోత్రి చేరుకున్నారు. అక్కడి దృశ్యం భీభత్సరస భయానకంగా ఉంది. ఎదురుగా ఉన్న రెండు హిమశిఖరాల మధ్య లోయ నుండి యమున చాలా ఉగ్రంగా భీకరంగా చెవులు చిల్లులు పడే హోరుతో అంత ఎత్తునుండి క్రిందికి దూకుతుంది. భూమి బ్రద్దలవుతున్న శబ్దం. ఆ జలపాతం హోరు చాలాదన్నట్లు అంతటా దట్టంగా కమ్ముకున్న పొగమంచు. ఆ హోరులో ఎవరి మాట ఎవరికీ వినబడటంలేదు. బోలెడన్ని మెట్లు దిగి జలపాతం సమీపానికి వెళ్లాడు. ఆ నీటి తుంపరలతో జడివానలో తడిచినట్లు దుస్తులు, శరీరం ముద్దముద్దైనాయి. నింగీనేలను ఏకం చేసే ఆ పెను శబ్దంతో గుండెలు గుబగుబలాడుతున్నాయి. అక్కడ ఒక చిన్న గుడి. యమునా మాతతో పాటు తాబేలు విగ్రహం. భక్తుల దగ్గర సంభావనలు తీసుకుని పాండాలు పూజలు చేస్తున్నారు.

స్వామి బొమ్మలా నిలుచుని ప్రకృతి చేసే ప్రళయ బీభత్సాన్ని చూస్తున్నాడు. అదొక శివతాండవం. కోటానుకోట్ల డమరుకాల శబ్దాలు. ఆ జలపాతం ముందు తానొక చిన్న పూచికపుల్ల. ఇదే జన్మస్థానం అని అనుకుంటున్నా ఆ యమున దాని వెనక ఇంకా ఎన్నెని హిమశిఖరాలను, హిమలోయలను దాటుకుని, దూకుతూ వొంపుసొంపుల పరవళ్లతో ఇక్కడికి వచ్చిందో మానవ మాత్రులు ఊహించలేని విషయం. అందుకే నదుల జన్మరహస్యం ఎవరికీ తెలియదు అని ఋషులు చెప్పారు.

ఇటువంటి ఉగ్ర యమున రేపల్లెకు చేరి ప్రశాంతంగా మారి రాధాకృష్ణుల సంగమానికి సంకేత స్థలంగా నిలిచింది. “యమునా తీరమున, సంధ్యా సమయమున, వేయి కనులతో రాధ వేచియున్నది కాదా” మధురగీతం జ్ఞాపకం వచ్చింది.

వర్షం వచ్చేటట్లు ఉందని రౌతు తొందరచేసాడు. మళ్లీ తిరుగుప్రయాణం ఈసారి నొప్పి తగ్గే మాత్ర వేసుకుని గుర్రమెక్కాడు. మినుకు మినుకు మనే చుక్కల వెలుగుల్లో చీకటి ప్రయాణం వర్షం వచ్చి వెలిసిందేమో దారి చిత్తడి చిత్తడిగా గుర్రాల లద్దితో నిండి ఉంది. గుర్రం కాలు ఏ మాత్రం జారినా తన అస్థికలు యమునలో చేరి అలహాబాదు ప్రయాగలో కలుస్తాయి. రౌతు పతా లేడు. చీకట్లో కేకేసినా వాడి అతాపతా లేదు. గుర్రం మాత్రం తనకు బాగా తెలిసిన దారిలో నిశ్చింతగా ప్రయాణం చేస్తుంది. శరీరం ఒకసారి ఒకవైపు మరోసారి మరోవైపు జారుతుంది. రెండువైపు కళ్లాల్లో పాదాలు బిగించి, నడుము నిటారుగా పెట్టి క్రింద పడకుండా నానా అవస్థలు పడ్డాడు.

బస దగ్గర గుర్రం దిగలేకపోయాడు. ఏ కీలుకా కీలు ఊడిపోయిన బాధ. రౌతు, బస నిర్వాహకుడు ఇద్దరూ కలిసి అతి కష్టంగా క్రిందికి దించారు. వారి భుజాలపై చేతులు మోపి మూలుగుతూ శరీరాన్ని ఈడ్చుకుంటూ నడుస్తూ గదిలో మంచం మీద వాలాడు. కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో జ్వరం. బస యజమాని దయతో బలవంతం చేసి ఒక గిన్నె వేడి జావ ‘సత్తు’ తాగించాడు. ఆ తర్వాత రెండు ఒళ్లు నొప్పులు, జ్వరం తగ్గే మాత్రలు మింగించాడు. ఇట్లా యాత్రికులకు సపర్యలు, సేవలు చేయటం అతనికి అలవాటే.

ఇక ఇక్కడే మూడు నాలుగు రోజులు రెస్టు తీసుకోవాలేమో అని ఆ రాత్రి భయపడిన స్వామి తెల్లారి లేచేసరికి అన్ని నొప్పులు, జ్వరం మాయమై ఫ్రెష్‌గా నవ్వుకుంటూ నిద్రలేచాడు. అది హిమాలయాల మహిమ.

దయతో సపర్యలు చేసిన బస యజమానికి అదనంగా బక్షీసులు ఇచ్చి మరి మరీ ధన్యవాదాలు చెప్పి తిరిగి అదే పాత మజిలీ జ్యోతిర్మఠ్‌కు వచ్చాడు. ఆ రాత్రి అక్కడే విడిది చేసి తెల్లారి పాండుకేశ్వర్‌కు వెళ్లాడు. బదరీనాథ్‌ చాలా దూరం కావున మధ్యలో ఒక మజిలీ తప్పదు. పైగా పాండుకేశ్వర్‌కు ముఖ్యమైన స్థలపురాణం ఉంది.

పాండు మహారాజు పేరుతో వచ్చినదే ఈ పాండుకేశ్వర్‌. తన ఇద్దరు భార్యలతో ఆయన కొన్ని సంవత్సరాలు ఇక్కడే నివసించాడు. ఒకరు కుంతి, మరొకరు మాద్రి. పాండు మహారాజు రెండు పెళ్లిళ్ల నాటికే పుంసత్వం కోల్పోయిన సంతానహీనుడు. పుంసత్వం లేనందుకు చింతలేదు కాని సంతానం లేకపోతే తన వారసత్వం తనతోనే అంతరించి తన సోదరుడు దృతరాష్ట్ర సంతానానికి సింహాసనం దక్కుతుందని అతని బెంగ, భయం.

పాండుకేశ్వర్‌ దాటితే హిమాలయాలలోని దేవలోకం ప్రారంభమవుతుంది. దేవతల లోకాన్ని బ్రహ్మవర్తం అని మానవుల లోకాన్ని ఆర్యావర్తం అని కూడా అనేవారు. ఇంద్రుడు ఆ దేవలోకం అధిపతి. పాండురాజుకు ఎవరో ‘దేవలోకం’లో ఉండే అశ్వినీదేవతలు గొప్ప వైద్యులనీ, వారి దగ్గర వనమూలికల ఔషధాలు ఉంటాయనీ, అవి వాడితే పుంసత్వం, పునర్‌యవ్వనం తిరిగి వచ్చి సంతానం కలుగుతుందని సలహా ఇచ్చారు. అట్లా ఆయన తన ఇద్దరు భార్యలతో మందీ మార్బలాన్ని ఆహార సామాగ్రి, గుర్రాలు, గుడారాలతో వచ్చి ఈ స్థలంలో బసచేసాడు. త్వరలోనే అశ్వినీ దేవతలు అక్కడికి వచ్చి కలిసారు. వారికి తన సమస్య వివరించాడు. వారు రకరకాల ఔషధాలు, అద్భుతమైన వన మూలికలు ఎన్ని ఇచ్చినా లాభం లేకపోయింది. నిండు యవ్వనంలో ఉన్న ఇద్దరు భార్యలు వయసుపోరుతో వేగలేకపోతున్నారు. వారి అందచందాలన్నీ అడివి కాచిన వెన్నెలలా మిగిలిపోయాయి. కుంతి అప్పటికే తన పద్నాగేళ్ల వయసులో దూర్వాస మహారుషి ద్వారా ఒక కొడుకును కన్నది. కాని లోక భయంతో ఆ బాలుడిని నదిలో వదిలిపెట్టింది. అట్లా ఆమెకు అప్పటికే ‘ఆ రుచి’ ఏమిటో తెలుసు కావున మరింత వేగిపోతుంది. మద్ర దేశపు స్త్రీలు శృంగారంలో చాలా ప్రవీణులు. వారు కన్యలుగా ఉన్నపుడే దాసీల ద్వారా ఆ కళలన్నీ నేర్చుకుంటారు. మద్ర దేశానికి చెందిన మాద్రికి తను తెలుసుకున్న కళలను ఉపయోగించే అవకాశం లేక అలమటిస్తుండేది.

మరోవైపు దిగులు చెందిన పాండుమహారాజు తమ కురు వంశపు వారసత్వ సంతాన మూలాలను ఒకసారి నెమరువేసుకున్నాడు.

మొదటినుండి కురువంశంలో ప్రతి అంకురం సంకరమైనదే. ఎవరూ సక్రమ సంతానం కాదు. బీజం-క్షేత్రం పద్దతి ఎక్కడా సరిగ్గా అమలు కాలేదు. ఇది కురు వంశానికే కాక ఋషులకు కూడా వర్తిస్తుంది.

శంతన మహారాజు వృద్ధాప్యంలో కామించి, మోహించి పెళ్లి చేసుకున్న బెస్తకన్య సత్యవతి వివాహానికి పూర్వమే పరాశర మహామునితో కృష్ణద్వైపాయనుడు అనే కొడుకును కన్నది. అతనే వ్యాసుడు. అయితే పరాశర మునియే వ్యాసుడిని పెంచి పెద్దచేసాడు. భరధ్వాజ మునికి ఒక కుమ్మరి స్త్రీకి జన్మించినవాడు ద్రోణాచార్యుడు. శరద్వంతుడు అనే ముని ఒక ఆటవిక స్త్రీతో కలిసి ఉన్నందున కృపాచార్యుడు జన్మించాడు. వ్యాసుడి ముత్తాత వసిష్ఠుడి భార్య అరుంధతి ఒక చండాల స్త్రీ. అందుకే ఋషుల జన్మరహస్యం, నదుల జన్మరహస్యం తెలుసుకోలేమని ఒక నానుడి.

కురువంశానికి మూలపురుషుడు వ్యాసుడు. వృద్ధరాజు శంతనుడికి సత్యవతి ద్వారా పిల్లలు కలగలేదు. కొడుకు భీష్ముడు తల్లి సత్యవతికి ఇచ్చిన మాట ప్రకారం అజన్మ బ్రహ్మచారిగానే ఉంటానని ప్రతిజ్ఞ చేసాడు. స్వయంవరంలో ఎత్తుకొచ్చిన అంబిక, అంబాలికలకు సత్యవతి కొడుకైన వ్యాసుడితో ‘నియోగపద్ధతి’ ద్వారా సంతానం కలిగేటట్టు సత్యవతి, భీష్ముడు కలిసి ఆలోచన చేయగా అట్లా పుట్టినవారే దృతరాష్ట్రుడు, పాండురాజు.

పాండురాజుకు తన సంతానం కాకపోయినా తన భార్యలకు కలిగిన సంతానానికే సింహాసనం దక్కాలన్న కోరికతో దేవలోకం వారితో ఇద్దరికీ ‘నియోగ పద్ధతి’ ద్వారా సంతానం కల్గించాలని నిర్ణయం చేసాడు. దేవతలు వీరులు, పరాక్రమవంతులు కావున పుట్టే పిల్లలు కూడా అలాగే ఉంటారని అతని నమ్మకం. ఈ నియోగ పద్ధతి ఇద్దరు భార్యలకు చెప్పగానే వారు కూడా తమ అవసరం కొద్ది కొంత, భవిష్యత్తులో రాజమాతలు అవుతామని ఆశ చేత మరింతా సంతోషంతో ఒప్పుకున్నారు.

దేవతల లోకంలో పెళ్లి, కుటుంబ వ్యవస్థ లేదు. దేవలోకంలో ఉన్న స్త్రీ పురుషులందరూ ఒకరికొకరు భార్యాభర్తలు. వారిలో ఎవరో ఒకరు కోరిక వ్యక్తం చేస్తే రెండోవారు నిరాకరించటం దేవలోక నియమాలకు విరుద్ధం. పుట్టిన పిల్లలందరూ అందరికీ చెందిన సంతానమే. అందుచేత అశ్వినీ దేవతల ద్వారా పాండురాజు పంపిన విజ్ఞప్తికి దేవతలు ఒప్పుకున్నారు.

ఫలితంగా కుంతి దేవతలలోకం ధర్మాధికారి ద్వారా ధర్మరాజును, దేవతల సేనాని మరుదత్తుని ద్వారా భీముడిని, ఇంద్రుని ద్వారా అర్జునుడిని కన్నది. మాద్రికి అశ్వినీ దేవతల ద్వారా పుట్టిన సంతానమే నకులుడు, సహదేవుడు.

ఈ నియోగ పద్ధతి అన్ని దేశాలోనూ కొంచెం అటు ఇటుగా అప్పట్నించి ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది. మానవ సమాజం మధ్యలో వచ్చిన పెళ్లి, కుటుంబ వ్యవస్థకు ఇప్పటికీ గట్టి పునాదులు ఏర్పడలేదు. అందుకే పామర జనులు ‘రామాయణం రంకు మహాభారతం బొంకు” అంటారు.

పాండుకేశ్వర్‌లో స్వామికి చాలా నచ్చిన స్థలం వేడి నీటి బుగ్గబావులు. కొండల నుండి వచ్చే నీళ్లు గంధకం (సల్ఫర్‌) మిశ్రమం వలన వేడినీళ్లుగా మారుతాయి. వీటికి కొన్ని చన్నీళ్లను జతచేసి స్విమ్మింగ్‌పూల్‌ లాంటి పెద్ద పెద్ద తొట్లలో నింపటం వలన యాత్రికులు ఆ నీళ్లలో స్నానాలు చేస్తారు. ఆ నీళ్లు చర్మానికి చాలా ఆరోగ్యకరం. అలసిసొలసిన యాత్రికులకు ఆ వేడి నీటి స్నానాలు ఎంతో హాయిని ఇస్తాయి. శరీరం సత్తువ పుంజుకుంటుంది.

పాండుకేశ్వర్‌లో స్వామికి ఒక తెలుగు సాధువు కలిసాడు. మరీ గమ్మత్తు ఏమిటంటే ఒకప్పుడు అతను హైద్రాబాదు నివాసి. దేశం కాని దేశంలో ఒక తెలుగు మాట్లాడే మనిషి దొరకటం స్వామికి సంతోషం అనిపించింది. ‘ముట్టుకుంటే పట్టుకునే ముచ్చట్లు’ అతనితో మొదలుపెట్టాడు. యాత్ర అంటే కేవలం స్థలాలను చూడటం, గుళ్లుగోపురాలు తిరిగి దండాలు పెట్టుకుంటూ, తమ కోరికలు నెరవేరటానికి మొక్కులు మోక్కుకోవటమే కాదు కదా! స్వామి లాంటి వారికి చారిత్రక, పౌరాణిక స్థలాలను దర్శించటమే గాక రకరకాల క్రొత్త మనుషులను కలిసి వారితో మాటా ముచ్చట కొనసాగించటం. దోస్తానాలు కలుపు కోవటం కూడా. ఇష్టమైన సంగతులే.

“మీ పేరు” అని అడిగాడు ఆ సాధువును. “నా పేరు నేను చెప్పగూడదు. నేను సన్యాస దీక్షను తీసుకున్నాను. ఈ చరాచరజగత్తును సన్యసించటంతోపాటు నా పేరును కూడా త్యజించాను. నిజానికి నేను నా పేరును, నా గతాన్ని పూర్తిగా మరిచిపోయాను. ఎప్పుడైతే దీక్ష తీసుకున్నానో అప్పుడే నేను కొత్తగా పుట్టినట్టు లెక్క” అన్నాడు.

పాండుకేశ్వర్‌ నుండి కేదార్‌నాథ్‌ చాలా దగ్గర అని తెలిసింది. ఆ సాధువు కూడా అక్కడికే వెళ్తున్నాడట. ఇద్దరు కలిసి ఒక షేరింగ్‌ జీపు ఎక్కుదాం అని స్వామి ఆహ్వానిస్తే “మేం పాదచారులం. ఎటువంటి వాహనాలు ఎక్కకూడదు” అన్నాడు.

కేదార్‌నాథ్‌ ప్రధానంగా శైవక్షేత్రం. శివుడు నివాసముండే కైలాసం కూడా అదేనని ‘స్కంధపురాణం’ చెపుతుంది. భగీరథ మహర్షి కోరికపై శివుడు తన జటాఝూటం నుండి గంగను వదిలింది ఇక్కడే. అప్పుడు శ్రీనాధుడి పద్యం జ్ఞాపకం వచ్చింది.

“సిరిగల వానికి చెల్లున్‌

పదియారువేల తరుణుల పెండ్లాడగన్‌

తిరిపెమున కిద్దరాడవాండ్రా?

పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌!”

మానవుని ముక్తి మార్గానికి దారి ఇదే కావున ‘ముక్తినాథ్‌’ అని కూడా అంటారు. మందాకినీ నది జన్మస్థానం ఈ హిమగిరులలోనే ఉన్నది. అన్ని హిమగిరులలోనూ కేదార్‌నాథ్‌ అత్యున్నత హిమశిఖరం కావున అన్ని కాలలోనూ ఇక్కడ మంచు పూలవానలా కురుస్తూనే ఉంటుంది.

ఇక్కడ కూడా జీపు కేదార్‌నాథ్‌ పర్వత పాద పంక్తుల వరకే వెళ్లుతుంది. ఆ తర్వాత ‘ఉత్తిష్టోత్తిష్ట’ అనుకుంటూ అధిరోహణ చేయాలి లేదా అశ్వాలనే విశ్వసించాలి. చివరికి ‘అశ్వారోహణనే’ గతి అయ్యింది.

కేదార్‌నాథ్‌ గుడిని పాండవులు తమ స్వర్గారోహణకు ముందు కట్టించారని పురాణాలు చెపుతున్నాయి. జలతారు పరదలా జాలువారే ఆ మంచుపూలవానలో ఆ పురాతనమైన శివాలయం జేగురురంగులో మార్మికంగా కనబడుతుంది అధ్యాత్మిక చింతనకు ఒక సంకేతంగా నిలిచి ఉంది. లోపలికి వెళ్లి కైలాసనాధుడిని దర్శించుకోవాలనిపించింది. కాని భక్తుల సమ్మర్థం బాగా ఉండటం వలన ఆ ఆలోచన విరమించుకున్నాడు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version