[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[స్వామి వ్యక్తిగత జీవితం బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళవుతారు. బయటకి అంతా బాగున్నా, లోలోపల స్వామిని ఏదో కుదిపేస్తూ ఉంటుంది. తానో ఒంటరినని భావించేవాడు. ఏవేవీ కలలు తరచూ వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, వెళ్ళి ఓ సైకియాట్రిస్టుని కలుస్తాడు. ఆయన సూచన మేరకు – అన్నిటిని తాత్కాలికంగా వదిలి ఒంటరి యాత్రకు సిద్ధమవుతాడు. ఆఫీసుకి ఇరవై రోజులు సెలవు పెడతాడు. ఆంజల్యకి చెప్పి బయల్దేరుతాడు. ముందుగా ఢిల్లీ వెళ్తాడు. కానీ ఊర్లోకి వెళ్ళకుండానే, మరో రైలెక్కి హరిద్వార్ చేరుకుంటాడు. ఒకచోట చిక్కటి మజ్జిగ తాగి ఆకలి తీర్చుకుని భారతదేశ చారిత్రిక సాంస్కృతిక, వారసత్వ రహదారిపై నడిచి నడిచి చివరికి ‘గంగా మాయీ’ ఒడ్డుకు చేరుకుంటాడు. కాసేపు అక్కడ తిరిగి జనాలని చూస్తూ కూర్చుంటాడు. తర్వాత ఓ హోటల్‍లో గది తీసుకుని విశ్రాంతి తీసుకుంటాడు. రాత్రి మళ్ళీ హరిద్వార్ వీధుల్లో సంచారం చేస్తాడు. ఓ చోట మట్టి పిడతలో టీ తాగి అక్కడి జనాలను పరిశీలిస్తూ శ్రీశ్రీ కవితని, నజీర్ అక్బరాబాదీ కవితని గుర్తు చేసుకుంటాడు. కాసేపయ్యాకా లేచి నడిచి గంగపై ఉన్న వంతెన అధిరోహించి దాని మధ్యలో ఒంటరిగా నిలబడి చుట్టూ చూస్తుంటాడు. మేలా సిన్మాలోని ఓ పాటని గుర్తు చేసుకుంటాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-17: ఒంటరి యాత్రికుడు – రెండవ భాగం
తెల్లారి హరిద్వార్ నుండి రిషికేష్‌కు ఒక షేరింగ్ క్యాబ్‌లో బయలుదేరాడు. సుమారు ఒక గంట ప్రయాణం. స్వామి తన లోపలి ప్రయాణం ప్రారంభించాడు.
స్వామికి చిన్నప్పట్నుండీ నదులంటే చాలా ఇష్టం. తొమ్మిదేళ్ల వయస్సులో భద్రాచలం వెళ్లినప్పుడు మొదటిసారి గోదావరిని చూసాడు. ఆ రోజుల్లో గోదావరిపై వంతెన లేదు. బూర్గంపాడు, సారపాక దాటిన తర్వాత అక్కడే ఎర్రబస్సు ఆగిపోయేది. యాత్రికులందరూ నది తీరం ఇసుకలో చాలా దూరం నడిచి ఒక చెక్కపడవ ఎక్కారు. పడవ నడిపే నల్లటి శరీరాలున్న ఇద్దరు మనుషులు తెల్లటి గోచీలు మాత్రమే పెట్టుకుని పొడుగు పొడుగు గెడలతో పడవను ముందుకు నడపటం, చుట్టూ గల గలా నీళ్ల అలల చప్పుడు ఇసుకతీరం చూస్తుండగానే దూరం కావటం స్వామికి వింతగా అనిపించింది. పడవ నది మధ్యలకు రాంగనే అమ్మ తన రొండిలో దోపుకున్న ఆకుల సంచి జాగ్రత్తగా ఇవతలికి తీసి అండ్ల తన అరచేయి దూర్చి ఒక ‘నయాపైసా’ ఇవతలికి తీసింది.
1957లో దేశంలో కొత్తగా ‘నయాపైసా’ (ఒక రూపాయికి వందపైసలు) పద్దతి వచ్చింది. 1964 భారత ప్రభుత్వం నయాపైసా అన్న పదాన్ని రద్దు చేసి ‘ఒక పైసా’ అనాలని ఉత్తర్వులు చేసినా చాలా ఏండ్ల పాటు సామాన్య ప్రజలు మాత్రం నయాపైసా అన్న పదాన్ని వదలలేదు. ‘ఆదత్ సే మజ్బూర్ హై’ అని దీనినే అంటారు. నైజాం జమానాలో చిల్లిపైస ఉండేది. అది కనుమరుగై నయాపైస వచ్చింది. ఇప్పటి తరానికి ‘ఒక పైస నాణెం’ తెలవదు. రూపాయి నోటు కూడా కాలగమనంలో కొట్టుకపోయింది.
అమ్మ తన ‘ఆకులు-పోకల’ సంచీ నుండి తీసిన నయాపైసాను భక్తితో శ్రద్దతో రెండు కండ్లకు అద్దుకుని నదిలో విసిరేసి రెండు చేత్తులూ జోడించి నీళ్లకు మనసారా దండం పెట్టింది.
‘అయ్యో, అమ్మా పైస అట్ల నీళ్లల్ల ఎందుకు పారేసినవే” అని ఆత్రంగా అడిగాడు. ఎందుకంటే ఒక నయాపైసకు ఆ రోజులల్ల తినేటివి చాలా చాలా వచ్చేవి. చిన్న పిల్లలు ‘బుడ్డ పైస’ అని కూడా అనేవారు.
స్వామి అడిగిన ప్రశ్నకు అమ్మ “నానీ! నది అంటే మనకు అన్నం పెట్టే అమ్మ అన్నమాట” అని జవాబు ఇచ్చింది.
స్వామికి చాలాకాలం తర్వాత ఆ మాటలో ఉన్న అంతరార్థం బోధపడింది. తెలంగాణాలో ప్రజలు ఏ నదినైనా ‘గంగ’ అనే పిలుస్తారు. “గంగమ్మ తల్లీ” అని కూడా అంటారు. భారతదేశపు అన్ని నదులలో అగ్రస్థానం గంగానదికే. అన్ని నదులకు ‘గంగ’ తల్లి లాంటిది.
భద్రాచలంలో పడవ దిగగానే నదిలో స్నానాలు స్వామితో పాటు ఇద్దరు చిన్న తమ్ముళ్లు. అమ్మ భాషలో ఆ ముగ్గురు “పోంగ జిక్కినోళ్లు”. చాలామంది పిల్లలు చనిపోయిన తర్వాత మిగిలిన పిల్లల్ని “పోంగ జిక్కినోళ్లు” అనటం తెలంగాణాలో తల్లులకు అలవాటే. అమ్మ ముగ్గురికి స్నానాలు చేయించి, తర్వాత తనూ చేసి, తోడు వచ్చిన మిగతా బంధువులతో కలిసి రాములవారి దర్శనానికి వెళ్లారు. “సీతా సమేత రామ, లక్ష్మణ విగ్రహాలు” స్వామి కండ్లకు నచ్చలేదు కాని గుడిలో అయ్యవారు తన నెత్తిన బంగారు శఠగోపం పెట్టి ఆశీర్వచనాలు పలకటం చాలా నచ్చింది. అక్కడి ఆ విగ్రహాల కన్న తమ ఇంటి మనసాలలో గోడ మీదున్న సీతారామలక్ష్మణుల పటం చాలా నచ్చింది. ఆ ముగ్గురి కాళ్ల దగ్గర ఆంజనేయుడు మోకాళ్లపై వంగి నమస్కరించటం కూడా బాగా నచ్చింది. చిన్నప్పుడు ఆ పటాన్ని చాలా సేపు చాలా తదేకంగా చూసేవాడు. వాళ్ల అందమైన ముఖాలు, కండ్లు, ముక్కు, రంగులు, ఆ బట్టలు, నగలు చాలా ఆకర్శణీయంగా ఉండి దేవుళ్లు, దేవతలు, ఇట్లనే ఉండేవాళ్లేమో అని పలుపలు విధాల ఊహాగానాలు చేసుకునేవాడు. చాలా కాలం తర్వాత అది రాజారవివర్మ గీసిన చిత్రం అని తెలిసింది. స్వామి చిన్నతనంలో ప్రతి పెళ్లిపత్రిక మీదా రవివర్మ గీసిన ఆ బొమ్మనే ఉండేది.
మనసాల గోడ మీద ఆ పటంతో పాటు మరో రంగుల ఫోటో, అందులో కూచున్న ఒక బీద ముసలాయన తెల్లటి గడ్డం, లోపలికి పోయిన కండ్లు, భుజం మీది లాల్చీ ఒక పక్క చిరిగి కుట్టువేసి ఉంది. మామూలు పంచెకట్టు దానికి కూడా అక్కడక్కడా చిరుగులే క్రింద ఒక కుక్క తన తోకను పైకి లేపి ఆయన ముఖాన్నే దీక్షగా చూస్తుంది. ఆ బీద ముసలి తాతను చూస్తుంటే స్వామికి చాలా జాలివేసేది. “అయ్యో పాపం” అనిపించేది. ఆయన ఎవరని ఒకసారి బాపును అడిగితే “షిర్డీ సత్యసాయిబాబా” అని సమాధానం చెప్పాడు. ఆ జవాబు కూడా అర్థం కాలేదు. అయినా ఆ బొమ్మను ప్రతి దినం తదేకంగా చూసేవాడు. ఆయన తను ఇంటికి “బిచ్చానికి” వస్తే అమ్మకు చెప్పి అన్నం పెట్టించాలని కూడా నిర్ణయించుకున్నాడు.
‘అడ్డాల నాటి బిడ్డ గడ్డాల నాటి బిడ్డ కాదు’ అన్నట్లే స్వామి కాలేజీకి వచ్చేసరికి ఆ రెండు పటాల ప్రక్కనే మరో రెండు ఫోటోలు గోడమీదికి వచ్చాయి. ఒకటి లెనిన్ రెండు హోచిమిన్. ఇక ఇంట్ల ప్రతిరోజూ “రామరావణ” యుద్దమే. పెద్దగాడిదకు తోడు చిన్న గాడిద కూడా కలిసాడని బాపు తన పెద్ద తమ్ముడు జ్ఞానిని కూడా తిట్టటం మొదలయ్యింది. అట్లా ఆ నూనూగు మీసాల కుర్రకుంకలకు ఇద్దరు కొత్త దేవుండ్లు పరిచయమైనారు. ఆ రెండు ఫోటోలు వారి రాబోయే జీవితాలను పూర్తిగా మార్చివేసాయి.
తొమ్మిదేండ్ల బాలుడైన స్వామికి భద్రాచల దేవాలయం కన్నా పర్ణశాల చాలా నచ్చింది. దాని ప్రక్కనే కొద్ది లోతులో గోదావరి నది నిండుగా, నిదానంగా ప్రవహిస్తుంది. ఆ లోయ ఆ నది రెండు స్వామిని ఆకర్శించి అతని మనోఫలకం పై శాశ్వతంగా ముద్రించుకుని నిలిచిపోయింది. అప్పుడు ఆ క్షణాన, ఆ నది, స్వామికి ఏదో తెలియని ఒక మార్మిక సందేశాన్ని అందించింది. ఒక నిగూఢ భావాన్ని విప్పి చెప్పింది. అట్లా ఆ నది పట్ల ఒక రహస్య ప్రేమ ఆ క్షణంలో జన్మించింది. అది అతడిని జీవితాంతం వెంటాడి వేధించింది. ఆ క్షణంలో తనకే తెలియకుండా ఒక అన్వేషకుడిగా, ఒక సంచారిగా మారిపోయాడు. నిజానికి స్వామి పూర్వీకులు వైష్ణవమత ప్రచార నిమిత్తమై తమిళదేశం నుండి బయలుదేరి అంచెలంచెలుగా మజిలీలు చేస్తూ తెలంగాణాకు వచ్చిన సంచారులే! ఆ తాతముత్తాతల సంచార రక్తం, ఆ దేశదిమ్మరి తత్వం ఆక్షణాన స్వామి రక్తంలో వారసత్వ, పరంపరగా ప్రవహించింది, ఉత్తేజపరిచింది.
క్యాబ్ ఆగిపోయింది. రిషికేష్ వచ్చింది. ఆ ప్రాచీన, పౌరాణిక, పవిత్ర నేల మీద పాదం మోపగానే అతనిలో ఒక అలౌకిక ఆనందం నిండిపోయింది. ఒక నూతన మానవుడిగా అవతరించాడు. ఒళ్లంతా కళ్లు చేసుకుని స్వచ్ఛమైన మనసుతో ఆ వీధులలో నడవసాగాడు. విదేశీయులు కొందరు ఆడ, మగా నుదుటిపై కుంకుమ బొట్లతో, మెడలో రుద్రాక్షమాలలతో, భారతీయ సాంప్రదాయిక దుస్తులతో, అక్కడక్కడా పాదాలకు చెక్క పాదుకలతో కనబడ్డారు. వారంతా అధ్యాత్మిక భావనలతోనే గాక ధ్యానం, యోగ విద్యలను అభ్యసించటానికి కూడా వచ్చినవారు. హిమాలయాల ప్రకృతిని, అక్కడి శిఖరాలను, అక్కడి లోయలలో ప్రవహించే నదులను చూసి పరవశించి, ఆరాధించటానికి వచ్చిన ప్రకృతి ప్రేమికులు. ఆ శివాలిక్ పర్వత సానువులలో చాలా యోగాశ్రమాలు ఉన్నాయి. ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. అవి నేర్చుకోవటానికి ఆ హిమాలయాలు అనువైన చోటు.
‘చల్నా జీవన్ కీ కహానీ’. నడక నా నేస్తం. అన్నట్లు ఆది అంతూ లేని ఈ అండపిండ బ్రహ్మండ విశ్వంలో ప్రతి అణువణువూ స్థావర జంగమాత్మకమే. చలించనిది ఏదీ లేదు. మారనిది ఏదీ లేదు. మారనిది ఏదన్నా ఉందంటే అది ఒక మార్పు మాత్రమే. వేదాలలో ఋషులు “చరైవేతి చరైవేతి” అన్న మాట చెప్పారు. మనిషన్నవాడు నిరంతరం ఈ భూగోళంలా తిరుగుతూనే ఉండాలి. ఈ తిరగటం తోనే జ్ఞానం సంపాదిస్తాడు. కూపస్థ మండూకాలు జ్ఞానసముపార్జన చేయలేవు ‘జ్ఞాని లోక సంచారి’ అన్న మాట కూడా అట్లనే పుట్టింది.
నడుస్తూ నడుస్తూ ఉండగానే ‘లక్ష్మణ్ జూలా’ వచ్చింది. ఆ వంతెన రుషికేష్‌కు ఒక అందం. ఒక అలంకారం. ప్రాచీన పౌరాణిక కాలానికి, వర్తమానికి అదొక వంతెన. ఈస్టిండియా కంపెనీ వారే ఆ వంతెనను నిర్మించారు. ఎన్నోసార్లు రిపేర్లు జరిగాయి అయినా ఇంకా పటిష్టంగానే ఉంది. రావణుడితో యుద్దానికి ముందు ఆత్మశక్తికోసం రాముడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నపుడు లక్ష్మణుడు ఈ వంతెన నిర్మించాడని ఐతిహ్యం. అందుకే అది లక్ష్మణ్ జూలాగా మారింది. వంతెన మధ్యలో నిలబడి క్రిందికి చూసాడు. శివుడి జటాజుటం నుండి తప్పించుకున్న గంగాదేవి దూరాన తన కోసం నిరీక్షిస్తున్న సముద్రుడితో సంగమానికి విరహవేదనతో అభిసారికలా పరుగులు పెడుతుంది. ఆత్మ పరమాత్మలో లీనమైనట్లు.
అన్ని నదులు చివరికి సముద్ర సంగమంలోనే విలీనమౌతాయి. వాటి జన్మస్థానం ఏదైనా చివరి గమ్యస్థానం మాత్రం సముద్రుడే. ఈ చరాచర జగత్తులోని అన్ని ప్రాణులకూ, ప్రజలకూ దాహశాంతిని ప్రసాదించే అన్ని నదులూ చివరికి తమ దేహశాంతికోసం సముద్రుడితో కలిసి ఏకాత్మ స్వరూపులుగా మారిపోతారు. లీనమవుతారు.
వంతెన దాటి ఒడ్డు మీదికి చేరుకున్నాడు. ఎటు చూస్తే అటు నిత్యనూతన ఉత్సవసంబరమే. ఏదో ఒక అలౌకిక దివ్య శక్తి అక్కడున్న వారి నరనరాల్లో అంతర్లీనంగా విద్యుత్తేజంలా ప్రసరిస్తుంది. ఉత్తేజభరిత ఉత్సవ వాతావరణం. యాత్రికుల కోసం అనేక సత్రాలు. ఒక చోట ‘ఆంధ్రా ఆశ్రమము’ ఆదుకునే అన్నపూర్ణాదేవిలా కనబడింది. లోపల చాలా విశాల ప్రాంగణం. దాని మధ్యలో ‘చతుశ్శాల భవనం’ చుట్టూ గదులు. పటిష్టమైన పాత నిర్మాణమే అయినా కొత్త భవనంలా ఇటీవల వేసిన రంగులతో కళ కళలాడుతుంది. నిర్వాహకులందరూ తెలుగువారే. తమ పదవీ విరమణ అనంతరం ఇక్కడే స్థిరపడి ‘స్వచ్ఛంధసేవలు’ యాత్రికులకు అందిస్తున్నారు.
ఒక గది దొరికింది. పరిశుభ్రంగా చిన్నగానే ఉన్నా మంచం మీద తెల్లపరుపు పరిచి ఉంది. ఒక కుర్చీ రాసుకునే ఒక టేబుల్. కామన్ స్నానాల గదులు. శౌచాలయాలు. అవి కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. గాంధీగారు అన్నట్లు ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్ట్స్ టు గాడ్లీనెస్’ చలి ప్రదేశం కావున ఫ్యాన్లు, ఎ.సిలు లేవు. మధ్యాహ్నం సాపాటు, రాత్రి అల్పాహారం. అంతా శుద్ద శాకాహారం.
ఉచిత బస. ఉచిత భోజనం. ఎటువంటి రుసుములు లేవు. యాత్రికులు గది ఖాళీ చేసేటప్పుడు అక్కడున్న హుండీలో వారి వారి శక్త్యానుసారం ఎంత్తైనా అందులో వేయవచ్చును.
ఆ బసకు ఎదురుగా ప్రవహిస్తున్న గంగమ్మ తల్లి యాత్రికులను నిరంతరం పలకరిస్తూనే ఉంటుంది.
అక్కడే మూడు, నాలుగు రోజులు గడపాలని స్వామి నిర్ణయించుకున్నాడు.
***
ప్రతిరోజూ ఉదయమూ సాయంత్రమూ అక్కడి గంగానది మెట్లమీద కూచుని ఆ స్వచ్ఛమైన గంగాజలాల ప్రవాహాన్ని చూస్తు గంటలు గంటలు గడిపేవాడు. ఏకకాలంలో నది ప్రవాహంతో పాటు అతని అంతర్గత ఆలోచనలు కొసాగుతుండేవి. ఆ నీళ్లు రిషికేష్ వరకే స్వచ్ఛంగా ఉంటాయి. హరిద్వార్ నుండి ప్రయాగ, కాశీ, కాన్పూర్, పాట్నా, కలకత్తా వరకూ ఇక మానవ తప్పిదాల కాలుష్యమే. అందుకే ‘రామ్ తెరీ గంగా మైలీ’ అన్న మాట పుట్టుకొచ్చింది. చివరికి కలకత్తా నగరానికి రెండు వందల కి.మీ. దూరంలో గంగాసాగర్ అన్న స్థలంలో బంగాళాఖాత సముద్రంలో సంగమిస్తుంది. గంగకు ఐదుగురు చెల్లెళ్లు ఉన్నారు. అలక్‌నందా, ధూళిగంగా, మందాకినీ, పౌడర్, భాగీరథీలు. ఈ ఐదింటిని పంచగంగలు లేదా ఉపనదులు అంటారు. ఈ ఐదు నదులు దేవ ప్రయాగ వద్ద కలిసి “గంగానది” పేరుతో రిషికేష్ చేరుకుంటాయి. దేవ ప్రయాగ రిషికేష్ నుండి 70 కి.మీ.ల దూరంలో ఉంటుంది.
ఒకరోజు నీలకంఠేశ్వర దేవాలయానికి వెళ్లాడు అది అతి ప్రాచీనమైనది. శంకరాచార్యులవారు అక్కడ చాలా కాలం తపస్సు చేసారు. రిషికేష్ ప్రధానంగా శైవుల పుణ్యక్షేత్రం. మహారుషులు, మహామునులందరూ అక్కడ తపస్సులు చేసుకున్నారు. స్వామికి విగ్రహారాధనలు నచ్చవు. వేదకాలంలో విగ్రహారాధనలు, దేవుళ్లు, దేవతలు లేరు. ప్రకృతి పంచభూతాల ఆరాధనే ముఖ్యం. పురాణాల సృష్టి దేవుళ్లు దేవతలు.
అయితే మూల విగ్రహాలను చూడటం మొక్కటం ఇష్టం లేకున్నా అన్ని దేవాలయాలను సందర్శిస్తాడు. దేవాలయాలు అన్ని కళా నిలయాలు, కళా కేంద్రాలు అని విశ్వసిస్తాడు. వాటి వాస్తుకళారీతులు, శిల్పకళలు, అక్కడి సంగీతం, సాహిత్యం, నృత్యం అన్నీ భారతీయ సంస్కృతిలో భాగమేనని నమ్ముతాడు. “మతం మానవజాతికి మత్తుమందు” అన్న కారల్‌మార్క్స్ సిద్దాంతం సంపూర్ణం కాదని పాక్షికం మాత్రమేనని చాలామంది మిత్రులతో వాదించి మెప్పించాడు.
క్రిస్టియానిటీ మతం రాకపోతే బిబ్లికల్ ఆర్ట్, గోథిక్ శిల్పకళ లేకపోయేది. మైకేలేంజిలో, లియోనార్డ్ డావిన్స్‌లు కూడా లేకపోయేవారు. ఇస్లాం ఆవిర్భవించక పోతే మినార్‌లు, గుంబజ్‌ల వాస్తు కట్టడాలు, లతలు, పూవుల నాజుకు చెక్కడాలు అరబిక్, ఉర్దూ అక్షరాలతో నాట్యమాడిరచే “కాలిగ్రఫీ”కళ అరబ్బీ సంగీతం, నృత్యాలు ఆఖరికి హిందూస్థానీ సంగీతం, పర్షియన్, ఉర్దూ కవిత్వాలు లేకపోయేవి.
ఇవన్నీ అన్ని మతాల సానుకూల అంశాలు. వీటిని కాదనలేం.
ఒక ఉదయం నది మెట్లమీద కూచున్నాడు. పాదాలు నీళ్లలో పెట్టగానే ‘జివ్వుమని చలి’. హిమశీతల జలాలు.
ఇంతలో ఒక ముసలమ్మ వచ్చింది. వయోభారంతో, గూని నడుముతో వొంగిపోయింది. సన్నగా పిట్టంత శరీరం. గునా గునా నడుచుకుంట మెట్లు దిగింది. ఏదో నామస్మరణ చేస్తూ బట్టల మూట పై మెట్టు మీద భద్రంగా పెట్టి కట్టుకున్న చీరెతోనే నీటిలో బుడుంగున మునిగింది. అట్లా రెండు మూడు మునకలు వేస్తూ “హర హరమహదేవ్” అని గట్టిగా నామస్మరణ చేస్తూ సూర్యుడి వైపు తిరిగి దండం పెట్టి, పొడి బట్టలు కట్టుకుని, పిండుకున్న తడి చీరెను చేతిల పట్టుకుని మళ్లీ గునగునా మెట్లు ఎక్కి నీలకంఠేశ్వర ఆలయం వైపు మాయమయ్యింది. స్వామి ఉన్నన్ని రోజులు ప్రతిరోజు అదే సమయానికి ఆ ముసలమ్మ దర్శనం జరిగేది. ఎన్నో ఏండ్ల నుండి ఆమె అక్కడే ఉన్నట్లుంది. వానప్రస్థాశ్రమ సన్యాసిని కాబోలు. అలవాటైన నదీస్నానం ఆమెను భయపెట్టటం లేదు.
ఒకరోజు బజారులో నడుస్తూంటే ఒక మూలన ఒక విదేశీ చిత్రకారుడు కనిపించాడు. ఒక స్టాండు మీద బోర్డుపై ఉన్న తెల్లకాగితంపై తదేక దీక్షతో వాటర్ కలర్స్ చిత్రాలు గీస్తున్నాడు. పారుతున్నగంగ, పైన వంతెన దాని మీది యాత్రికులు, అవతల ఒడ్డుపై దుకాణాలు, నదిలో ఒకటి, రెండు పడవలు అన్ని ఉన్నాయి. అతనిని పలకరించాలనిపించినా అతని ఏకాగ్రత దెబ్బతింటుదని మానుకున్నాడు.
ఒకచోట గడ్వాల్ కొండజాతి యువతి ఒక అరుగుపై కూచుని నిప్పుల మీద మసాలా మినప అప్పడాలను కాల్చి అమ్ముతుంది. ఆ అప్పడాల సువాసన అంతటా కమ్మగా కమ్ముకుంటుంది. ఈ గడ్వాల్ జాతి ప్రజలనే కిన్నెర కింపురుషులని వేదాలలో ప్రస్తావన ఉంది. రాహుల్ సాంకృత్యాయన్, సంజీవదేవ్‌లు కూడా ఈ గంధర్వ స్త్రీల గురించి వారి మధురగానాలు, నాట్యం గురించి తమ పుస్తకాలలో రాసారు. నేటికి ఒక స్త్రీని అన్నదమ్ములందరూ వివాహం చేసుకునే పద్దతి వీరిలో కొనసాగుతుంది. దీనికి మొదటి కారణం స్త్రీల జనాభా అత్యల్పంగా ఉండటం. రెండవ కారణం ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి ఆస్తిని కాపాడుకోవాలనే కాంక్ష.
అక్కడే ఆ అరుగుమీద ఒక జర్మన్ వనిత కూచుని అప్పడాల రుచిని ఆస్వాదిస్తున్నది. నీలి కండ్లు, సువర్ణకేశాలు, కోటేరు ముక్కు, అతి పల్చటి ఎర్రటి పెదాలు, ఆజాను బాహువులున్న విగ్రహం లాంటి శరీరాలు జర్మనులకే స్వంతం. తమది అతి పరిశుద్దమైన ఆర్య జాతి రక్తం అని వారి మూఢ నమ్మకం.
స్వామి కూడా ఒక అప్పడం కొనుక్కుని తింటూ ఆమెను “ఏ దేశం?” అని మామూలుగా పలకరించాడు. “జర్మనీ” అందామె.
“ఓహ్. ది లాండ్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఫిలాసఫర్స్” అనగానే ఆ సుమనస వందిత వికసిత వందన అయ్యింది. అప్పుడు ఇద్దరి మధ్య మాటలు కలిసాయి.
ఆమె పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమంలో చాలా రోజులుండి, ఇక్కడికి శివానంద ఆశ్రమంలో “రాజయోగం” నేర్చుకోవటానికి వచ్చిందట. ఆమె టోటల్ “వీగనిస్ట్” అంటే జంతు సంబంధమైన మాంసాహారం గుడ్డు, పాలు పాల ఉత్పత్తులు ఏమీ తినదు. చివరికి తేనె కూడా. పరిశుద్ద శాఖాహారి ఆ యోగా నేర్చుకున్న తర్వాత జర్మనీ లక్సెంబర్గ్‌కు వెళ్లుతుందట.
ఇంతకూ మీ ఉద్యోగసద్యోగా లేమిటని ప్రశ్నిస్తే తానొక నృత్య కళాకారిణినని, ఇకపై విద్యార్థులకు డాన్సుతో పాటు యోగా కూడా నేర్పుతానని నవ్వుతూ చెప్పింది.
ప్రస్తుతం తన భర్త తమ పిల్లల్ని చూసుకుంటున్నాడని తను ఇంటికి వెళ్లగానే తన భర్త ఆఫ్రికా పర్యటనకు వెళ్లిపోతాడని పిల్లల చదువులు చెడకుండా తామిద్దరు వంతుల వారిగా ప్రపంచ పర్యటనలు చేస్తుంటామని చెప్పింది.
“దునియా కీ సైర్ కర్‌లో
ఇన్సాన్ సే ప్యార్ కర్ లో”
ఆఖరి రోజు ఉదయం వాహ్యాళిగా నడుచుకుంటూ ‘మునీకీ రేతీ’ వైపు వెళ్లాడు. ఒకప్పుడు మునులు అక్కడి ఇసుకలో కుటీరాలు వేసుకుని ఉండేవారట. ఇప్పుడూ కొన్ని కనబడినాయి. కొంత దూరం వెళ్లగానే ‘కాలీకంబల్ వాలే’ ఆశ్రమం కనిపించింది. ఆ పేరు విచిత్రంగా అనిపించటమే గాక చార్వాకులలో ఒకరైన “అసిత కేశ కంబళ్” జ్ఞాపకం వచ్చాడు. నల్లని కంబళి బుజాన ధరించిన వాడు అని అర్థం. బుద్ధుని కన్నా ముందే మక్కలి ఘోషాల్, సత్యకామ జాబాలి, అసిత కేశ కంబల్ దేవుడు అనే భావనను ధిక్కరించి హేతువుకు, తర్కానికి, అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చారు. అట్లా ఆ కాలం నుండే నాస్తికవాదం, కణాదుడు చెప్పిన భౌతికవాదం భారతీయ తత్వశాస్త్రంలో ఒక భాగంగా మారింది. నిజానికి భారతీయ తత్వశాస్త్రంలో నాస్తిక, ఆస్తిక వాదాలు రెండు ఒక అంతర్భాగమే. మహాభారతంలో కూడా నాస్తికుల ప్రస్తావన ఉంది.
“ఆ కాలీ కంబల్ వాలే” కథ ఏమిటో తెలుసుకుందామని ఆ ఆశ్రమంలోనికి వెళ్లాడు. అదంతా పాద యాత్రికులతో, లోక సంచారులతో, ఘుమక్కడ్‌లతో నిండి ఉంది. వాస్తవానికి అదొక ఉచిత అన్నదాన సత్రం. అక్కడి కార్యాలయం గదిలో ఖాళీగా కూచున్న ఒక వయోవృద్దుడు కనిపించాడు. చూడగానే వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకిలు జ్ఞాపకం వచ్చేటట్లు!
వెళ్లి నమస్కారం చేసాడు.
“జీతే రహో” అన్నాడు ఆ వృద్దుడు.
‘పండిత్ జీ! ఓ నామ్ కా మత్‌లబ్ క్యాహై” అని హిందీలో అడిగాడు.
“ఆప్ మద్రాసీ హై క్యా” అని ప్రశ్న
“నహీఁ నహీఁ మై తెలుగు, తెలంగాణా, హైద్రాబాద్” అన్నాడు.
“ఓ చార్మినార్-బహుత్ ఖూభ్, బహుత్ ఖూబ్” అని ప్రశంసించాడు. ఆయన తనను ప్రశంసించాడో లేక చార్మినార్‌ను ప్రశంసించాడో తెలియలేదు.
హిందీ భాషా, మర్యాదలతో ప్రసన్నుడైన ఆ పెద్దాయన “కాలీకంబల్ వాలే” చరిత్ర చెప్పసాగాడు.
ఒక వంద సంవత్సరాలకు పూర్వం రాజస్థాన్‌లో ఒక మార్వాడీ సేఠ్ అతి చిన్న వయసులోనే బాగా సంపాదించి కోటీశ్వరుడయ్యాడు. అయితే నడివయసు రాకముందే అతనికి జీవితంపై వైరాగ్యం ముంచుకొచ్చింది. ఈ ఇహలోక సంసార భవబంధాలనన్నింటినీ వదిలించుకుని, ఆస్తిపాస్తులన్నీ అమ్మి ఎవరికి ఇవ్వాలిసింది వారికి ఇచ్చి ఈ రిషికేష్‌కు వచ్చి స్థిరపడ్డాడు.
ఆరోజులలో బీద యాత్రికులకు సరిఐన వసతులు లేక పోవటం గమనించి తన వంతుకు వచ్చిన డబ్బులతో ప్రప్రథమంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆశ్రమాన్ని కట్టించాడు. ఆయన నిజమైన వైష్ణవభక్తుడు. వైష్ణవం చెప్పే ‘మానవ సేవనే మాధవ సేవ’ అనే సూక్తిని త్రికరణశుద్ధిగా నమ్మినవాడు. మిగిలిన అనేక హిమాలయ పుణ్యతీర్థాలలో కూడా ఇటువంటి సత్రాలే నిర్మించాలని సంకల్పించాడు. అయితే తను ‘ఉత్తచేతుల భిక్షపతిగా’ మారినందున దేశమంతా పర్యటిస్తూ వచ్చిన డబ్బులతో ఒక్కొకచోట ఒకో సత్రాన్ని ఈ రిషికేష్ నుండి మానస సరోవరం వరకూ ఉన్న అన్ని ముఖ్యమైన తీర్థాలలో నిర్మిస్తూ పోయాడు.
అయితే తను సర్వసంగ పరిత్యాగిగా మారినందున తన పేరు ఎవరికీ చెప్పలేదు. చివరికి తన పేరును కూడా పరిత్యజించాడు. తను కట్టించిన ఏ సత్రానికి ఆయన తన పేరును పెట్టలేదు. ఆయన నిరంతరం ఒక నల్లని కంబళి భుజాన వేసుకుని సంచరించేవాడు కావున ప్రజలు ఆయనను ‘కాలీ కంబల్’ వాలే అని పిలవసాగారు. ఆయన కట్టించిన సత్రాలను కూడా ఆ పేరుతోనే పిలవసాగారు” అని ఆ పెద్దాయన తను చెప్పే ముచ్చట ఆపేసాడు.
“మరి ఆయన ఎప్పుడు ఎక్కడ చనిపోయాడు? ఆయన సమాధి ఎక్కడుంది? అని అడిగాడు స్వామి చాలా ఆత్రుతతో.
ఆఖరికి ఆయన ఏమైపోయాడో ఎవరికీ సరిగ్గా తెలియదు. తనకు అవసాన దశ సమీపించిందని గమనించిన ఆయన మంచుపర్వతాలలోకి నడుచుకుంటూ వెళ్లి ఆ మంచులోనే మాయమైనాడని కొందరు చెప్పుకుంటారు.
స్వామికి ఆ క్షణంలో హర్షద్‌మోహతా జ్ఞాపకం వచ్చాడు. దానితో పాటు స్టాక్ మార్కెట్లు, షేర్ల బిజినెస్‌లు, రియల్ ఎస్టేట్‌లు గుర్తుకొచ్చాయి. మనుషులందరూ పచ్చనోట్ల పిచ్చి వేటలో గంతల గుర్రాల్లా పరుగులు పెట్టటం మనసులో మెదిలాయి.
ఆ పెద్దాయనకు రెండు చేతులు జోడించి నమస్కరించి అక్కడి నుండి నిష్క్రమించాడు.
మరుసటి రోజు హిమాచల్‌ప్రదేశ్ వారి బస్సులో డెబ్బై కి.మీ.ల దూరంలో ఉన్న దేవ ప్రయాగకు బయలుదేరాడు.
(మళ్ళీ కలుద్దాం)
పరవస్తు లోకేశ్వర్ 10 జూన్ 1951 నాడు హైదరాబాద్ పాత నగరంలో జన్మించారు. కథా నవలా రచయిత, అనువాదకులు. ట్రావెల్ రైటర్. యాత్రా కథనాల రచనలో అందెవేసిన చెయ్యి. పరదేశీగా దేశదేశాల సరిహద్దులలో, దారి కాని దారులలో ఒంటరి బాటసారిగా తిరగాలనేది రచయిత అంతర్జ్వాల. ప్రపంచ యాత్రికుడు పండిత్ మహామహోపాధ్యాయ్ పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ ప్రభావం తనపై చాలా ఉందని రచయిత అంటారు.
సలాం హైదరాబాద్, సిల్కురూట్‌లో సాహస యాత్ర, ఒక హిజ్రాకథ (సుప్రసిద్ధ హిందీ, ఉర్దూ అనువాద కథలు), ఛత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర, ఆనాటి జ్ఞాపకాలు, తెలంగాణ సంభాషణ, ప్రపంచ పాదయాత్రికుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర, 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు, నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు, ఎవరిది ఈ హైద్రాబాద్?, హైద్రాబాద్ జనజీవితంలో ఉర్దూ సామెతలు, కల్లోల కలల కాలం వంటి పుస్తకాలు వెలువరించారు. ‘సలాం హైద్రాబాద్’ కు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం లభించింది.
హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది చివరిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది.