Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-11

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[స్వామి పనిచేసే డిపార్టుమెంటులో మోహన్‌రావు అనే ఆయనతో స్వామి పరిచయం స్నేహంగా మారి, ఆపై గురుశిష్య సంబంధం స్థాయికి ఎదుగుతుంది. ఓ రోజు సాయంత్రం మోహన్‌రావు స్వామి ఆఫీసుకు వచ్చి, అతన్ని తనతో పాటు ఓ బార్‍కి తీసుకెళ్తాడు. క్రిందిస్థాయి సిబ్బందితో, పైస్థాయి అధికారులతో ఎట్లా వ్యవహరించాలో, ఎట్లా మసులుకోవాలో తెలుసుకోవాలని, పని సెకండరీ అని స్వామికి చెప్తాడు. ఎలా అని అడిగితే, స్వామికి అర్థమయ్యేట్టు వివరిస్తాడు. మితభాషి, మృదుభాషి ఐన ఈ మనిషిలో ఇంత లోతైన అవగాహన, ఆలోచనలు ఉన్నాయని తెలిసి స్వామి ఆశ్చర్యపోతాడు. విలియమ్ కేరీ గురించి చెప్పి, డీలర్లు సంతోషంగా ఇచ్చే డబ్బుని అతని ద్వారా తీసుకోమని సూచిస్తాడు. ఆలస్యంగా ఇంటికి వెళ్ళిన స్వామి తాగి వచ్చాడని ఆంజల్య గ్రహిస్తుంది. ఫ్రెష్ అయి వచ్చి, భార్యని కూర్చోబెట్టి, మోహనరావు చెప్పినవన్నీ చెప్తాడు. మరి నువ్వేమన్నావని అడుగుతుంది. ఏం చేయమంటావని భార్యని అడిగితే, ఆలోచించి చెప్తానంటుంది. రెండు రోజుల తర్వాత తన నిర్ణయం చెబుతుంది ఆంజల్య. తమ నిర్ణయం తమ ఆత్మకు విరుద్దమయినదే అయినా, తమని తాము బ్యాలెన్సు చేసుకోవాలని, అతికి పోకుండా మితంగానే ఒక పరిధిలోనే ఉండాలని సూచిస్తుంది. సరేనంటాడు స్వామి. ఓరోజు ఆఫీసులో ఖాళీ సమయం దొరికితే, విలియం కేరీని తన గదిలోకి పిలుస్తాడు. అతని గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. విలియం కేరీ ఎవరో తెలుసా అంటే తెలియదంటాడు కేరీ. తన పూర్వీకుల గురించి, తన తాత గురించి చెప్పుకొస్తాడు. అంతా విన్న స్వామి మీ తాత పేరేమిటి అని అడుగుతాడు. కోటప్ప అని చెప్తాడు కేరీ. కోటప్పలు ఎప్పుడూ ఇలానే చనిపోతుంటారు అని వ్యాఖ్యానిస్తాడు స్వామి. అదెలా అంటే, తర్వాత చెప్తానంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-15: జారుడు బండలు-2

రెండు రోజుల తర్వాత కేరీ స్వామి గదిలోకి వచ్చి కూచున్నాడు. ఇప్పుడతనికి సాన్నిహిత్యం పెరిగింది.

“సార్‌, నిన్న పెద్దాయన మోహనరావుగారు నన్ను పిలిచి కొన్ని సంగతులు చెప్పి ‘రాముడికి హనుమంతుడు’ ఎట్లనో స్వామి సార్‌కు నువ్వు అట్ల ఉండాలని ఉపదేశం చేసిండు. నేను సరే అన్న. ఇగ ఇప్పుడు మీరు ఈ ‘రామభక్త హనుమాన్‌’కు ఏమి ఆదేశం ఇస్తరో ఇవ్వండి” అని కళ్లతో నవ్వుతూ చెప్పాడు.

స్వామి కూడా నవ్వుతూ “అవును కేరీ నేను కూడా ఆ సంగతి నీతో ప్రస్తావిద్దామనే అనుకుంటున్న కాని మోగమాటం అడ్డం వచ్చి ఆగిపోయా” అన్నాడు.

“ఇందులో మొగమాటమేముంది సార్‌. నాకు కూడా నెత్తిమీద చాలా బాధ్యతలున్నాయి. మా వాళ్లు ఊరొదిలిన తర్వాత రహస్యంగా నందికొండకు (నాగార్జునసాగర్‌) వచ్చి అక్కడ జరుగుతున్న ఆనకట్ట నిర్మాణంలో కూలీలుగా చేరారు. అప్పుడు అక్కడే మతం పుచ్చుకున్నారు. తర్వాత నేను పుట్టాను. చర్చి సాయంతో మా నాన్న నన్ను హైద్రాబాద్‌ తీసుకొచ్చి ఇక్కడి అనాథాశ్రమంలో చేర్పించాడు. ఇప్పటికీ మా అమ్మానాయినలు మిర్యాలగూడలో కూలి పనులే చేసుకుంటున్నారు. నాకు ఈ ఉద్యోగం వచ్చినంక నా ఇద్దరు తమ్ముళ్లు ఒక చెల్లె హైద్రాబాదుకు వచ్చి చదువుకుంటున్నారు. వారి బాధ్యతలు ఉన్నాయని నేనింకా పెళ్లి చేసుకోలేదు.

నాకు మొదటి నుండీ చదువంటే చాలా ఇష్టం. ఈ జాబ్‌ వచ్చినంక ఒపెన్‌ యూనివర్సిటీ నుండి బి.యె. పాస్‌ఐనాను. ఇప్పుడు ఈవినింగ్‌ లా కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంటును.”

చదువు సంగతి వినగానే స్వామికి చాలా సంతోషం కలిగింది.

“మీరు ఒప్పుకుని అనుమతిస్తే మా బ్రతుకులు ఇంకొంచెం బాగుపడతవి. వేణ్ణీలకు చన్నీళ్లు తోడన్నట్లు” అని మాట్లాడటం ముగించాడు కేరీ.

“మీరు భయపడకండి సార్‌. మీకు చెడ్డ పేరు తీసుకరాను”.

“మరో మాట. ఎవరినీ పీడించకు, భయపెట్టకు, బాధపెట్టకు, బలవంతం కూడా చేయవద్దు, వారి పనులు సకాలంలో పూర్తిచేసి ఒక రివాజుగా (అలవాటుగా) వారు ‘గుడ్‌విల్‌’తో ఇచ్చేదే మనకు మంచి చేస్తుంది. ఇచ్చిన వాడికి ఒక దండం ఇవ్వని వాడికి రెండు దండాలు. ఈమాట జ్ఞాపకం పెట్టుకో.” అని సూచించాడు స్వామి.

“సర్‌, నేను ట్రూ క్రిస్టియన్‌ని. ప్రతి ఆదివారం చర్చికి పోతా. పాటలు పాడుతా, గిటార్‌, పియానో వాయించటమే కాక డ్రమ్స్‌ బాగా కొడతా ఇదెందుకు చెపుతున్నానంటే తప్పు పనిచేసినా అందులో కూడా ఒక నీతి ఉండాలనేదే నా నియమం. ‘హరాం కా కమాయీ’ నాకు కూడా ఇష్టం ఉండదు” అన్నాడు.

“సార్‌ మనం ఇన్ని కొత్త రిజిస్ట్రేషన్లు, అసెస్‌మెంట్లు, ఇన్‌స్పెక్షన్లు చేసాం. పని అయిపోయి టాక్సులు, జుర్మానాలు చెల్లించినాక ‘మీదేమైనా ఉంటే చెప్పండి సార్‌. మేం రెడీ’ అని అందరూ చాలా సార్లు అడిగారు. తర్వాత చెప్తా అన్న. ఇప్పుడు మీరు ఒ.కే. అంటే వారందర్నీ కలుస్తాను” అన్నాడు.

“ఒ.కె.” అన్నాడు స్వామి.

హనుమంతుడు కూడా ఖుష్‌ అయినాడు.

ఒక శనివారం మధ్యాహ్నం కేరీ గదిలోకి వచ్చి “సార్‌ నేను ఆఫీసు పని మీద బయటికి (మార్కెట్‌) వెళ్తున్న. సాయంత్రం ఆరుగంటలకు రవీంద్రభారతి పక్కనున్న ‘పంచశీల’ హోటల్‌కు మీరు రావాలి.” అన్నాడు కేరీ.

విషయం ఏమిటో అర్థమైన స్వామి సరే అన్నాడు.

ఆ సాయంత్రం వారిద్దరూ కలుసుకున్నారు. ఎవరూ చూడనప్పుడు ఒక బరువైన తెల్లకవరును కేరీ అందించి ఇది మీది సార్‌ అన్నాడు. స్వామి దానిని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు.

“కేరీ ఈ సందర్భాన్ని మనం గుడ్‌ బిగ్నింగ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలి.”

“ష్యూర్‌ సర్‌”

“నీకు బీర్‌ అలవాటు ఉందా?”

“అయ్యో అదేం ప్రశ్న సార్‌. మేం కిరస్తానీలం. ‘డ్రింక్‌, డైన్‌ అండ్‌ డాన్స్‌’ మాకు అలవాటే. అయితే ఏదైనా ఒక లిమిట్‌లోనే.”

ఇద్దరూ వెళ్లి లిబర్టీ చౌరాస్తాలో ఉన్న ‘మహారాజా బార్‌ అండ్‌ రెస్టారెంటు’కు వెళ్లారు. రెండు చిల్డ్‌ బీర్లకు ఒక చికెన్‌ మంచూరియాకు ఆర్డర్‌ ఇచ్చి.

“కేరీ ఆ కామాక్షి, ఆమె కొడుకూ తర్వాత ఏమయ్యారు”.

“ఆ ఘటన జరిగింతర్వాత ఆమె తన కొడుకును తీసుకుని కట్టుబట్టలతో తన పుట్టింటికి చేరుకున్నది. వారిది బాగా భూవసతి కల్గిన ఒక పెద్ద కులం. తల్లితండ్రులకు ఒకే కూతురు. ఆమె తన కొడుకును ఒక ఇంగ్లీష్‌ మీడియం కాన్వెంటులో చేర్పించి ఆ తర్వాత విజయనగరం దగ్గర్లో ఉన్న ‘కోరుకొండ సైనిక్‌ స్కూల్లో’ చదివించిందట. ఇప్పుడు అతను మిలిటరీలో లెఫ్టినెంట్‌ ఆఫీసర్‌. నాకన్నా వయస్సులో చాలా పెద్దవాడు.”

“ఈ సంగతులన్నీ ఎట్లా తెలిసాయి?”

“చాలా కాలానికి ఆ ప్రతీకారం తీర్చుకున్న మా పెద్దలు ఆమెను కలిసి తమెవరో చెప్పి క్షమాపణలు అడిగారట.

“అప్పుడామె ఏమీ మాట్లాడక ఒక విషాదపు నవ్వు నవ్విందట. అప్పుడు మా పెద్దలు ధైర్యం చేసి ‘అమ్మా ఒక మాట అడగవచ్చా’ అని భయం భయంగానే వినయంగా అడిగారట.”

“అడగండి” అన్నదామె.

“మీ అబ్బాయి పేరు?”

ఆమె చాలా ప్రశాంతంగా “కోటేశ్వరరావు” అన్నది.

ఆ పేరు వినగానే మా పెద్దలంతా వలవలా ఏడ్చారట.

అప్పుడామె వారందరికీ కడుపునిండా కమ్మటి భోజనం పెట్టి, పొందూరు చేనేత పంచెల చాపులూ, ఉత్తరీయాలు కానుకగా ఇచ్చి రానూ పోనూ సాదరు ఖర్చులకు డబ్బులిచ్చి సగౌరవంగా సాగనంపిందట.

అట్లా ఆ అమ్మ తనకు తాను ప్రాయశ్చిత్తం చేసుకుని మా వాళ్లందరినీ గౌరవించిందట.

స్వామికి ఉద్వేగంతో కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి.

“ఇప్పుడు మా ముసలి నాయినకు ఒకే ఒక్క కోరికుంది సార్‌”

“ఏమిటది?”

“తమ నాయిన రక్తం పంచుకుని పుట్టిన తన తమ్ముడు కోటేశ్వరరావును ఒక్కసారి చూడాలని. కాని ఆయన కోరిక అసాధ్యం అని ఆయనకు ఎట్లా చెప్పాలి సార్‌. మనువు కాలం నుండీ వస్తున్న ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో మేం అట్డడుగున చివరి మెట్టు క్రింద ఉన్నాం. ఆయన్ని కలవడం మా పిచ్చి అమాయకపు నాయినకు సాధ్యం కాదని నేనెట్లా చెప్పగలను?” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు కేరీ.

శిలాప్రతిమలా స్వామి కేరీని చూసాడు. కాని ఓదార్చలేదు ఎందుకంటే అవి యుగయుగాలుగా తరతరాలుగా ప్రవహిస్తున్న దుఃఖజలాలు.

తేరుకుని రెండో బీర్‌ తాగుతున్నపుడు కేరీ అడిగాడు.

“కోటప్పలు ఎప్పుడూ ఇట్లనే చనిపోతరని” ఆ రోజు మీరు అట్ల ఎందుకన్నరు సార్‌?

స్వామి చెప్పటం ప్రారంభించాడు. “నీకు కోటప్ప కొండ జాతర తెలుసా కేరీ. అది మీ పల్నాడు ప్రాంతంలో నర్సరావు పేటకు దగ్గరగా ఉంటది.”

“అయ్యో నాకెందుకు తెలవదు సార్‌, చిన్నప్పుడు ఒకసారి ఆ జాతరకు వెళ్లాను”.

“దానికి కోటప్ప జాతర అని ఎందుకు పేరొచ్చిందో తెలుసా?”

“అది తెలవదు కాని ఇప్పుడు అక్కడ త్రిలోకేశ్వరస్వామి అని గుడి వెలసింది. ఆ జాతర ఆ దేవుడి గుడిపూజలు రెండూ ఇప్పుడు కలిసి పోయాయి.”

“అవునవును అట్లనే కల్సిపోతవి” అని స్వామి వ్యంగ్యంగా కోపంగా అన్నాడు. స్వామికి కాకతీయ ప్రభువులకు వ్యతిరేకంగా పన్నులు కట్టలేమని పోరాటం చేసిన గిరిజన వీరస్త్రీలు సమ్మక్కసారలమ్మలు జ్ఞాపకం వచ్చారు. తొలిరోజుల్లో గిరిజనులు వారిని స్మరించుకునేందుకు ప్రతిసంవత్సరం జాతర చేసేవారు. తర్వాత కాలంలో వారు దేవతలుగా మారి గుడులు వెలిసాయి. పూజారి వర్గం అక్కడ చేరి హిందుమత పద్దతులతో పూజలు చేయటం జ్ఞాపకం వచ్చింది.

“మరి అసలు కత ఏంది సార్‌?”

“చాలా కాలం క్రితం ఈస్టిండియా కంపెనీ కొత్తగా వచ్చిన రోజుల్లో కోటప్ప ఒక భూకామందు ఇంట్లో జీతగాడు. వెనకా ముందూ ఏమీ లేక ఆ కామందు ఇంట్లో ఒక బానిసగా ఉండేవాడు. తక్కువ కులం మనిషిని ఇంట్లోకి కూడా రానివ్వకుండా అంటరాని వాడిగానే చూసారు. అతను యవ్వనుడైనాక మంచి దేహధారుడ్యంతో నల్లబంగారంలా మెరిసిపోతూ ఉండేవాడు. ‘ఎద్దు కూర తిన్నోడూ ఎంతో ముద్దుగున్నాడు’ లాగానే పెళ్లి కాని ఆడపిల్లల కంటికి ‘నజర్‌’లాగున్నాడు.

గ్రామాలలో పొలమూ, పుట్రా, అనేక గదులు, గోదాములతో ఉన్న విశాలమైన ఇండ్లు బోలెడంత ప్రైవెసీ ఉండేది. మూడో మనిషికి తెలవకుండా వయసులో ఉన్న జీతగాళ్లతో కామందుల ఇండ్లల్లో అందరూ కాకున్న ఎక్కడో అక్కడ కొంతమంది స్త్రీలు తాత్కాలికంగా మాత్రం ఐతేనేం ‘తొడ సంబంధాలు’ పెట్టుకునేవారు. ఇది మహాభారత కాలం నుండీ వస్తున్న సార్వజనీనమైన సంగతి. మగవారు భోగం వాళ్ల ఇండ్లకూ, సాని కొంపలకు వెళ్లుతున్నారన్న కోపమూ, కక్షా కూడా వాళ్లకు ఒక కారణం కావొచ్చు.

రంకు బొంకు ఎక్కువ కాలం దాగవు కదా. భూకామందులు ఈ సంగతులు పసిగట్టి ఒక కొండప్రాంతంలో వాడిని చంపించి, శరీరం పై నున్న తోలు అంతా చెక్కి దానిని నిజంగానే కాకులకు గ్రద్దలకు వేసారు. వాని దగ్గరి బంధువులు కూడా గుర్తు పట్టలేనంతా ఆ ముఖాన్ని చెవులను, పెదాలను పూర్తిగా చెక్కేసారు.

ఆ రోజుల్లో మాలమాదిగలందరూ కారల్‌మార్క్సు భాషలో చెప్పాలంటే ‘ఓన్లీ స్పీకింగ్‌ టూల్స్‌’. మాట్లాడే పనిముట్లు. దళితులందరికీ కోటప్ప హత్యకు కారణం, హంతకులెవరో తెలుసు కాని నిస్సహాయులు. ఒక చిన్న సమాధిని నిర్మించి ప్రతి ఏటా అందరూ అక్కడ కలిసి తమ సాధక బాధలు, చెప్పుకునేవారు. కాలక్రమేణా అది జాతరగా మారింది. తర్వాత బ్రాహ్మణ పురోహితులు అక్కడ ప్రవేశించి మొక్కుబడులు, పూజా తంతులు సాగించి చివరికి ఏకంగా ఒక గుడి కట్టించి తమకు తామే ఒక ‘సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ స్కీం’ను ఏర్పాటు చేసుకున్నారు. తిమ్మిని బమ్మిని చేసినట్లు ఇప్పుడది త్రిలోకేశ్వరస్వామి గుడి అయ్యింది. సవర్ణకులాల వారు కూడా వెళ్లుతున్నందున ఆ కోటప్ప కొండ జాతర పేరు మారి శాశ్వతంగా ఒక కొత్త పేరు వెలిసింది.”

“ఈ నిజానికి ఆధారం ఏమైనా ఉన్నదా సార్‌.”

“కంభంపాటి సత్యనారాయణ గారని ఒక సీనియర్‌ చరిత్రకారుడు ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అని రాసిన పుస్తకంలో ఈ ఉదంతం ఉంది.”

“మరి మీరు కోటప్పలు అని బహువచనం ఎందుకు వాడారు?”

“అది కూడా చెప్తా విను.

1968లో కృష్ణాజిల్లా కంచికచెర్లలో ఒక భూస్వామి తన వద్ద పనిచేసే జీతగాడు కోటేషు అనే యువకుడిని తన పొలంలోనే ఒక గుంజకు కట్టేసి కిర్సనాయిలు పోసి నిలువునా సజీవ దహనం చేసాడు. పోలీసు కేసు అయ్యింది. తన వద్ద ఉండే అతి పవిత్రమైన కాశీ నుండి తెచ్చిన రాగి చెంబును దొంగిలించాడని, తన సున్నితమైన హృదయం గాయపడి దేవుని ఆజ్ఞతోనే అతనిని శిక్షించానని ఆ పరమ పవిత్ర దైవభక్తిపరుడు పోలీసులకు కోర్టు వారికి విన్నవించాడు.

‘హరిజన పాలేరు సజీవదహనం’ అని పత్రికలు పతాక శీర్షికలతో ఘోషించాయి. విషయం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృష్టికి కూడా వెళ్లింది. ప్రతిపక్ష సభ్యులు రాష్ట్ర శాసనసభలో అధికార పక్షం వారిని దుమ్మెత్తిపోసారు. అప్పుడు కాసు బ్రహ్మనందరెడ్డిగారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ‘రెడ్డి రాజుల పరిపాలన’ నడుస్తుంది.

చర్చ నడుస్తున్నప్పుడు రెవెన్యూశాఖా మాత్యులు గౌరవనీయులైన పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిగారు, చిత్తూరు జిల్లాలో ఆయనొక పెద్ద భూస్వామి, మధ్యలో జోక్యం చేసుకుని ‘దొంగతనం చేసిన వాడిని మరి ముద్దు పెట్టుకుంటారా’ అని కోపంతో అడిగాడట.

ఆ మాటకు అసెంబ్లీ నివ్వెరపోయింది.

అప్పుడు రిప్లబికన్‌ పార్టీ ఎంఎల్‌ఏ ఈశ్వరీబాయి ఆడపులిలా లేచి నిలబడి తన ఎడమకాలి చెప్పు తీసి ‘ఏమన్నవురా బాడ్కావ్‌ చెప్పుతో కొడుతా’ అని అతని సీటు వైపు దూసుకపోయిందట. తోటి ఎంఎల్‌ఏలు మధ్యలో ఆమెను అడ్డుకున్నారు. లేకపోతే ఆ పెద్దిరెడ్డి గారికి ఆ రోజు పెద్ద సన్మానమే జరిగి ఉండేది.

మళ్లీ అదొక పెద్ద చర్చ అయ్యింది. ఇది గౌరవ శాసనసభ ప్రతిష్ఠ మర్యాదలకు సంబంధించినది కావున అందరూ ఈ విషయం మరిచిపోవాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేసారట.

ఆ కోటేషు సజీవ దహనం వెనుకా ఒక ‘ఆడపదార్థం’ ఉన్నదని ఆ ఊరివారందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.

1985 కారంచేడు, 1991లో చుండూరు దళితుల సామూహిక హత్యలు గురించి నీకు కూడా తెలిసిన సంగతే కదా” అని ముగించాడు స్వామి.

“సార్‌ ఇక ఆఖరికి నా పేరు వెనక కథ గురించి కూడా చెప్పండిసార్‌. నేను మా అమ్మకూ, అయ్యకు కూడా వినిపిస్తాను మీరు చెప్పే కథ విని వాళ్లు కూడా సంతోషిస్తారు.” అని రిక్వెస్టు చేసాడు కేరీ.

అప్పుడు స్వామి ఇట్లా చెప్పాడు.

“ఇంగ్లాండు నుండి వచ్చిన ఒక మిషనరీ విలియం కేరీ. 1793లో ఆయన కలకత్తాకు వచ్చాడు. అప్పుడు బెంగాల్‌లో ఈస్టిండియా కంపెనీ వారి పరిపాలన కొనసాగుతుంది. ఆయన మత ప్రచారం కంటే ఎక్కువగా అక్షరాస్యతకు, విద్యావ్యాప్తికి కృషి చేస్తూ చిన్న చిన్న గ్రామాలలో కూడా పాఠశాలలు పెట్టాడు. తను స్వయంగా హిందీ, సంస్కృతం, భాషలను నేర్చుకుని బైబిల్‌ను ఆ భాషలలోకి అనువదించాడు. దాని కోసం ప్రింటింగ్‌ ప్రెస్సులను స్థాపించాడు. కలకత్తాలో మొదటి ప్రింటింగ్‌ ప్రెస్సును స్థాపించింది ఇతనే. తులసీదాస్‌ రామాయణాన్ని ఆయన ఆంగ్లంలో అనువాదం చేసి ఇంగ్లీష్‌వారి కోసం ముద్రించాడు. సీరంపూర్‌లో ఆయన ఆ రోజులలోనే ఒక కాలేజీని స్థాపించాడు. అది సీరంపూర్‌ యూనివర్సిటీగా ఇప్పటికీ కొనసాగుతుంది.

ఈయన వల్ల ఇద్దరు బెంగాలీ ప్రముఖులు బాగా ప్రభావితులై సంఘ సంస్కరణ ఉద్యమాలను చేపట్టారు. ఆ ఇద్దరూ ఈ విలియం కేరీకి సమకాలికులు. వారిద్దరూ రాజారాం మోహన్‌రాయ్‌, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌. అట్లా ఆయన 41 సంవత్సరాలు నిరంతరంగా పనిచేసి తన 73 సంవత్సరాల వయసులో ప్లేగు వ్యాధితో కలకత్తా నగరంలోనే చనిపోయాడు. ఇప్పటికీ ఆయన సమాధి అక్కడే ఉంది.

అందుకే మొదటిసారి నీపేరు నువ్వు చెప్పగానే నాకు ఆ మహానుభావుడు గుర్తొచ్చి పెదాల మీద చిర్నవ్వు వచ్చింది” అని ముగించాడు స్వామి.

తనకు అంత గొప్ప పేరు ఉన్నందుకు సంతోషంతో ఉబ్బి తబ్బిబైనాడు కేరీ.

అప్పటికే చాలా రాత్రయ్యింది. “సర్‌ మీరు ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్లగలరా లేక నన్ను తోడుగా అక్కడి వరకూ రమ్మంటారా” అని అడిగాడు.

“లేదు కేరీ నేను వెళ్లగలను. గుడ్‌నైట్‌” అని చెప్పి బైక్‌ స్టార్ట్‌ చేసాడు.

ఇల్లు చేరేసరికి పాత రోజు పోయి కాలెండరులో కొత్త రోజు మొదలయ్యింది. స్వామి సంగతి గమనించిన ఆంజల్య ముభావంగా ఉండిపోయింది.

స్వామి సీదా మంచం చేరుకుని బెడ్డుమీద వాలి మరుక్షణంలో గురక ప్రారంభించాడు.

***

పొద్దున నిద్ర లేచేసరికి తొమ్మిదవుతుంది. ఇల్లంతా నిశ్శబ్దం. పిల్లలు స్కూలుకు పోయినట్లుంది. ఫ్రెష్‌ ఐనాక డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూచుంటే ఆంజల్య చాయ్‌ కప్పు, సాసర్లో రెండు మేరీ బిస్కట్లు తీసుకుని వచ్చింది.

“చాయ్‌ బాద్‌ మే కాని ముందు నీకో సర్‌ఫ్రైజ్‌” అన్నాడు.

“ఏమిటో ఆ సర్‌ఫ్రైజ్‌?” అని ముఖం ముడుచుకుని అన్నది. రాత్రి తాగి అంత లేటుగా వచ్చినందుకు ఆమె కించిత్తు కోపంగా ఉన్నది అని గమనించాడు.

“నువ్వు కళ్లు మూసుకుని కుడిచేయి చాపాలి” అన్నాడు.

సరే అని ఆమె అట్లనే చేసింది. జేబులో నుండి బరువైన తెల్ల కవరు తీసి ఆమె చేతిలో పెట్టాడు.

ఏమిటిదీ? అని ఆమె కవరు విప్పితే అందులో వందరూపాయిల నోట్లు కనిపించాయి. ఆశ్చర్యపోయి “ఎక్కడిది? జీతమా” అని అడిగింది.

“జీతం కాదు గీతం” అన్నాడు.

ఆమెకు అర్థమయ్యింది. కొన్ని రోజులు క్రితం మాట్లాడుకున్న సంగతులు జ్ఞాపకం వచ్చాయి.

“ఇన్ని డబ్బులు?” అని మళ్లీ ఆశ్చర్యంతో ఆగిపోయింది.

“అవును అన్ని డబ్బులే. అవి నీవు లెక్కపెట్టు. ఇంతల నేను చాయ్‌ తాగుతా” అన్నాడు. కుర్చీమీద కూచుని అవన్నీ టేబుల్‌ మీద పెట్టుకుని క్రిందా మీదా పడుతూ ఓపికగా లెక్క పెట్టింది.

“ఇరవై వేలు” అంది కళ్లు పెద్దగా చేసి. “యస్‌” అన్నాడు.

“ఇది దాదాపు నీ నెల జీతమంత”

అవును అన్నట్లు తల ఊపాడు. కొన్ని ప్రభుత్వ శాఖలలో జీతం కంటె గీతం చాలా ఎక్కువ అనీ అసలు వాళ్లకు జీతాలతో పనే లేదని ఆమెకు తెలియదు. ఒక్క నిముషం ఆమె ఆలోచించి “నేనొక మాట చెపుతా నువ్వు వినాలి” అన్నది.

“వినదగు నెవ్వరు చెప్పిన” అని హాస్యమాడాడు.

“నేను గాక నీకెంకెవరు చెప్పేది?” అని కొంచెం సీరియస్‌గా మరికొంత హాస్యంగా అంది.

“మరి అంతే కదా! చెప్పు చెప్పు” అన్నాడు.

“ఇట్లా నువ్వు ఇచ్చేవన్నీ దేని కది విడివిడిగా రబ్బరు బాండ్లు పెట్టి ఒక పొదుపు డబ్బాలో వేస్తా. ఇందులో నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయను. ప్రతిరెండో తారీఖు ఆ డబ్బా మూత తీసి అంతా లెక్కపెట్టి, కొంతా కొంతా మీ తమ్ముళ్లకు అది పూర్తి అయ్యాక మీ అక్కకు ఇవ్వాలి. ఆ తర్వాత కాశీయాత్ర కోసం తెచ్చిన వడ్డీల వాడికి ఆ తర్వాత ఫైనాన్స్‌ వాళ్లకు పూర్తిగా చెల్లించి రుణ విముక్తులమవ్వాలి.”

“మరి నెల నెలా చీటీల వాడికి?” అని ప్రశ్నించాడు.

“జీతం అంతా మజా చేస్తూ ఉడాయిద్దామంటే కుదురదు. అదొక్కటి నీ నెల జీతం నుండే కట్టాలి” అన్నది.

“మరి అప్పులన్నీ తీరాక?”

“ఈ అప్పులన్నీ తీరాక ఈ పై డబ్బులతో టింగురంగా అని జల్సాలు చేయవద్దు. ప్రతి పైసా సమత కాలేజీ చదువులకు దాచి పెట్టుకోవాలి. దాని చదువులూ పెళ్లి అయినంక మిగిలిన వన్నీ రాజాకోసం. నువ్వు రిటైర్‌ అయ్యేనాటికి వాడు ఇంటర్‌ అయ్యి డిగ్రీ మొదటి సంవత్సరానికి మాత్రమే వస్తాడు. అందుకే ఇప్పటి నుంచి మన ఇల్లు గడిచేది ప్రతినెలా వచ్చే జీతంతోనే. ఎప్పటి లాగే సింపుల్‌గా బ్రతకాలి. మన జీవితం ఇప్పటికే సగం అయిపోయింది. ఇప్పుడన్న జాగ్రత్తగా ఉండాలి.”

ఆమె అన్నీ అడ్వాన్సుగా ముందే ఆలోచించి ఒక ప్రణాళిక వేసుకుందని గ్రహించాడు.

హోం మినిస్టరు ఆ రోజు నుండీ ఆర్థిక శాఖా మంత్రి బాధ్యతలు కూడా చేపట్టింది.

ఆమె మళ్లీ రెండో రౌండు చాయ్‌ కూడా తీసుకుని వచ్చి అతనికి అందించి ముందు కూచుంది. ఈ సారి ఎజెండాలోని టాపిక్‌ చేంజ్‌ అయ్యింది.

“ఏమిటీ? రాత్రి మళ్లీ గుర్రమెక్కి వచ్చావు. ఇట్లయితే నీ రెండు కాళ్లూ ఆ గుర్రం నాలుగు కాళ్లూ విరుగుతాయి జాగ్రత్త” అని హెచ్చరించింది.

“హా హా హా” అని పకపకా నవ్వాడు.

“ఇది హాస్యం కాదు. సీరియస్‌గానే చెపుతున్నా”

“ఎవరి కాళ్లూ విరచవద్దు కాని ఓ మాట చెపుతా అర్థం చేసుకో. నా ఉద్యోగంలో పెద్ద మార్పు వచ్చింది. లెక్చరర్‌గా ఉన్నపుడూ కాలేజీ పిల్లలూ, పాఠాలు, పుస్తకాలు అంత వరకే జీవితం పరిమితం. ప్రజా సంబంధాలతో పనిలేదు. కాని ఇప్పుడు కొత్త జీవితం, కొత్త పని విధానం. కొత్త మనుషులు, కొత్త సంస్కృతి. ప్రతి ఉద్యోగానికి ఒక సంస్కృతి ఉంటుంది. రోము నగరంలో ఉన్నపుడు రోమన్‌ లాగే ఉండాలని ఒక ఇంగ్లీష్‌ సామెత ఉంది. ఇప్పుడు నేను ఇందులో చాకచక్యంగా నెగ్గుకు రావాలంటే ముందు మా ఉద్యోగులతో మంచి సంబంధాలు పెట్టుకోక తప్పదు ఎందుకంటే ఇక్కడ ‘మనీ’ అంశం కూడా ఇన్‌వాల్వ్‌ అయి ఉంది.

‘బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దెన్‌ వాటర్‌’ అన్నట్లు ఈ ఉద్యోగంలో ‘లిక్కర్‌’ గట్టి దోస్తానాలకు పునాది. ఫెవికాల్‌ లాగా పనిచేస్తది. చాలా వ్యవహారాలు చక్కదిద్దుకునేది ఒక ‘చషకం’ ముందే. సాయంత్రాలు మధుశాలలోనే.

అయితే నా ‘విల్‌పవర్‌’ మీద నాకు నమ్మకం ఉంది. ఏదీ అతిగా పోను. దేనికి లొంగను. బానిసను కాను. దేనినైనా బ్యాలెన్సు చేసుకునే శక్తి నాకుంది. కాబట్టి నా మీద నమ్మకం ఉంచి నువ్వు నిశ్చింతగా ఉండు. డబ్బుల విషయంలో నువ్వు ఆలోచించినట్లే చేద్దాం. నీ మాట నేను మాత్రం కాదంటానా” అని సముదాయించాడు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version