[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[ఈ మధ్య కాలంలో శారీరిక అలసట కంటే మానసిక అలసట ఎక్కువగా ఉంటోంది స్వామికి. ఓ ఆదివారం సాయంత్రం వేణు వచ్చి స్వామిని మాసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న ఓ కమ్యూనిటీ హాల్‌కి తీసుకువెళ్తాడు. అక్కడ సి.వి. కృష్ణరావుగారి ఆధ్వర్యంలో సీనియర్ అండ్ జూనియర్ కవులు తాము రాసిన తాజా కవితలు వినిపిస్తారు. ప్రతి నెల ఆఖరి ఆదివారం జరిగే ఈ లిటరరీ మొహఫిల్‌కి తప్పక హాజరవమని వేణు చెప్తాడు. ఓ రోజు స్వామి ఆఫీసులో పని చేసుకుంటుండగా ఓ యువకుడు వచ్చి నమస్కారం చేసి తనని స్వామి దగ్గర క్లర్క్‌గా వేశారని చెప్తాడు. అతన్ని కూర్చోమని పేరు అడుగుతాడు స్వామి. విలియమ్ కేరీ అని చెప్తాడతను. బెల్ కొట్టి అటెండర్‌ని పిలిచి రెండు టీ తెమ్మన్ని చెప్పి కేరీని మాటల్లో పెట్టి అతని బెరుకు పోగొడతాడు స్వామి. కుటుంబ ఖర్చులకు అప్పులు చేస్తూనే ఉంటాడు స్వామి. అవి కాక అక్కకి, తమ్ముళ్ళకి ఇవ్వవలసి మొత్తాలు చెల్లించలేకపోతాడు. ఇవి చాలక అక్క దగ్గర మళ్ళీ అప్పు చేస్తుంటే బావ మజాక్ చేస్తాడు. తండ్రి అంటే ప్రేమ ఎక్కువగా ఉన్న రాజా – ప్రతీ రోజు స్వామి కోసం ఎదురుచూసేవాడు. కాలనీలో అందరి పిల్లల తండ్రులు ఇంటికి వచ్చేసినా, ఇంకా వాడి నాన్న రానందుకు బాధపడుతూంటాఅడు. తండ్రి ఎక్కువగా నవ్వడని, ఎప్పుడూ సీరియస్‍గా ఉంటాడని వాడికి కోపం. ఎదుగుతున్న రాజా – తండ్రి ముభావం వెనుక ఉన్న ఆలోచనలని గ్రహించలేడు. ఐమాక్స్ థియేటర్‌కి వెళ్ళి రాజా ఆస్వాదిస్తుంటే, దాని నిర్మాణం వెనుక కథలు, వ్యథలు గుర్తొచ్చి స్వామి మనసు మొద్దుబారుతుంది. మరో వైపు స్వామి వాళ్ళుండే కాలనీలో రిలయెన్స్ ఫ్రెష్ తెరుస్తారు. అందులో షాపింగ్ చేయాలని ముచ్చటపడతాడు రాజా. జనాల్ని పీల్చి పిప్పిచేసే కార్పోరేట్ల పట్ల తన వ్యతిరేకతని పిల్లాడికి అర్థమయ్యేలా చెప్పలేకపోతాడు స్వామి. కానీ స్వామి చేయలేని పనిని ఆంజల్య చేస్తుంది. పిల్లాడికి అర్థమయ్యేలా అన్నీ వివరిస్తుంది. అప్పుడు స్వామి పెదాలపై చిన్న చిరునవ్వు మొలుస్తుంది. రాజాకి పట్టరాని సంతోషం కలుగుతుంది. – ఇక చదవండి.]
అధ్యాయం-15: జారుడు బండలు-1
స్వామి మొదటినుండి ముసలివాళ్ల ప్రేమికుడు. వాళ్లతో స్నేహం, శిష్యరికం చేస్తే బోలెడన్ని జీవిత కథలే గాక వాళ్ల అనుభవాలు, మార్గదర్శకత్వంలో ‘జ్ఞానం’ లభిస్తుందనీ మేలు జరుగుతుందనీ దృఢంగా నమ్ముతాడు. పన్నుల శాఖలో చేరిన తర్వాత మోహనరావుతో పరిచయం ఆవిధంగానే జరిగింది. ఆయన త్వరలోనే రిటైర్ అవుతున్నాడు. చిన్న వయసులో చాలా క్రిందిస్థాయి రికార్డు అసిస్టెంటుగా చేరి క్లర్కుగా, హెడ్‌క్లర్క్‌గా, సూపరిడెంటుగా పనిచేసి ఒక పది సంవత్సరాల క్రితమే స్వామి స్థాయికి చేరుకున్నాడు.
మోహనరావు, స్వామి పనిచేసే ‘సర్కిల్’ ఆఫీసులోనే ఇంకో ప్రాంతానికి అదే స్థాయి అధికారి. ఉద్యోగం చేరిన కొత్తలో, పని విధానం, పద్ధతులలో ఏం సందేహాలు, సమస్యలున్నా అక్కడే అందుబాటులో ఉన్న అతన్ని సంప్రదించేవాడు. అతను ఒపికగా, దయతో తన ఆధిక్యతను చూపకుండా స్వామిని గైడ్ చేసేవాడు. అట్లా అతను నెమ్మది నెమ్మదిగా గైడ్, ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్‌గా మారినాడు.
నిజానికి అతను చాలా నిదానంగా ఉంటాడు. పైగా మితభాషి. ‘పై ఆకాశం ఊడి నెత్తిమీద పడుతుందని ఎవరైనా చెపితే’ చూద్దాం అది దగ్గరకు రానివ్వండి అని తీరికగా సిగరెట్ వెలిగించి ఊదేరకం. దేనికి చలించడు, తొందరపడడు, పునాదుల నుండి కష్టపడి పనినేర్చుకుని అనేక అనుభవాలతో ఈ స్థాయికి వచ్చాడు. కనుక స్థిరంగా, నిండుకుండలా తొణకకుండా ఉంటాడు. ముఖం ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇతనికీ, తనకు శిక్షణ ఇచ్చిన కోదండపాణికి ‘జమీన్‌ఆస్మాన్ ఫరక్’.
అందుకే స్వామి అతడిని ఆప్యాయంగా “అన్నా” అని నోరారా పిలిచేవాడు.
ఒక సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయాక స్వామి గదిలోకి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. సాధారణంగా అతను అలా రాడు.
“ఏం స్వామీ ఇంకా పని అయిపోలేదా” అని చిర్నవ్వుతో చిన్నగా అడిగాడు.
“లేదన్నా.. ఇగో.. ఈ పెండిరగ్ ఫైల్ ఒకటుంటే.. అని చెప్పబోతుంటే.
“అది ఉండనీ స్వామీ. పని ఎప్పటికీ ఉండేదే. ఎప్పుడూ ఎంత చేసినా అది తరగదు, కొంత మిగిలే ఉంటది” నా వెంబడి రా. అట్ల బైటికి పోదాం అన్నాడు.
ఎప్పుడూ అడగని అతను మొదటిసారి అట్లా అడగడంతో అతని మీది గౌరవంతో లేచాడు.
మోహనరావు స్వామిని సీదా లక్డీకాపూల్ చౌరాస్తాలోని “ఈగల్ బార్ అండ్ రెస్టారెంటుకు తీసుకపోయాడు. స్వామి బుద్దిగా అతడిని అనుసరించాడు. ఈగల్ (డేగ) ఆకాశంలో విహరిస్తుంది కావున ఆ మధుశాల కూడా తన పానప్రియులందర్నీ చుక్క వేసుకున్న తర్వాత చుక్కల లోకంలో ఆకాశమార్గాన విహరింప చేయటానికి మూడవ అంతస్తులో లిఫ్ట్‌తో సహా ఉంది. ఇద్దరూ వెళ్లి కూచున్నారు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది.
“ఆవో హుజూర్ తుమ్‌కో
సితారోఁ మేఁ లే చలూఁ”
(‘కిస్మత్- 1969)
అని ఆషా బోస్లే మెత్తగా మత్తుగా పాడుతుంది. టేబుల్స్ అన్నీ దూరదూరంగా ఉన్నాయి. ఒకరి మాటలు మరొకరికి వినబడకుండా. సచివాలయం అక్కడికి చాలా దగ్గరే కావున సాయంసంజెలలో పైరవీకారుల ఖర్చుతో ఆఫీసర్లు అక్కడికి వచ్చి వారితో ‘డీలింగులు’ సెటిల్ చేసుకుంటారు. మీటింగులు, ఈటింగులు, డ్రిరకింగులు అన్నీ అక్కడే. ఇంకా హైఫై కలాపోసకుల కోసం అక్కడికి దగ్గరే ఉండే లాడ్జింగులలో కప్లింగులు, ఫిట్టింగులు సైతం ఏర్పాటు చేస్తారు.
స్వామి అద్దాల బయటి నుండి సంధ్యాసుందరిని చూస్తున్నాడు. నగర నిశాసుందరి నల్లని మఖ్మల్ చీర మీద తెలుపు చుక్కల అద్దాలు ధరించి తళతళా మిలమిలా మెరుస్తున్నది. రాత్రి నెమ్మది నెమ్మదిగా రాజుకుని మహారాణిలా రాణిస్తున్నది. ట్యాంకుబండు మీద మిలమిలా మెరుస్తూ ప్రవహిస్తున్న వాహనాల వెలుతురు చుక్కల లోకంలోకి తీసుకపోయే వెన్నెల మార్గంగా భాసిస్తున్నది.
బేరర్ వస్తే రెండు రాయల్‌చాలెంజ్ చిల్డ్ బీర్లకు ఆర్డర్ ఇచ్చాడు మోహనరావు.
“అయ్యయ్యో” అని ఆపబోయాడు స్వామి. మరేం పరవాలేదు. నా కంపెనీ కోసం కొద్దిగా అన్నాడు ఆ అన్న. అన్న మాటను కాదనలేక మోగమాటపడ్డాడు ఆ తమ్ముడు. చిన్నప్పుడు క్లాసుమేట్ల దోస్తానా కూడా ఎంత పక్కాగా ఉంటదో పెద్దగయిన తర్వాత గాసుమేట్ల దోస్తానా కూడా అంత పక్కాగా ఉంటదని ఉత్తరోత్తరా గ్రహించిన పిమ్మట జ్ఞానోదయం కలిగింది.
బేరర్ రెండు చల్లని బీర్లు, తెల్లని శుభ్రమైన పొడుగు గ్లాసులు తెచ్చి వాటిల్లో బీర్లు నురగకక్కకుండా చాకచక్యంగా పోసి కాంప్లిమెంటరీ మంచింగా శ్రేష్టమైన కాజూనట్స్, వేడివేడి ఉల్లిపాయ పకోడీలు ప్లేట్లలో సర్దాడు. పెద్దన్న ప్రేమగా ఒక గ్లాసు స్వామికి అందించి మరోగ్లాసు తను తీసుకుని చీర్స్ కొట్టాడు.
స్వామి జన్మలో తొలిసారి నాలుగు బీరు చుక్కలను చప్పరించాడు చల్లగా, చిరుచేదుగా, వగరుగా, జిమ్‌జిమ్మంటుందది.
ముందు కాజూ, పకోడీలు తినండి ఉత్త కడుపుతో తాగితే బాగుండదు అని ప్రేమగా సలహా ఇచ్చాడు. “ప్రతిరోజు సాయంత్రం నేనిక్కడికి వచ్చి ఒక్కటంటే ఒక్కటే బీరు గంటసేపు నెమ్మదిగా తాగి రిలాక్స్ అయితే దినమంతా పడిన అలసట ఇక్కడే మరిచిపోయి ఇంటికిపోతే రాత్రికి సుఖంగా నిద్రపడుతుంది”. అని ఆయన ఆరాంగ బీరు చప్పరిస్తూ “స్వామీ మీరు ఆఫీసులో జాయిన్ అయ్యి దాదాపు రెండేండ్లు అవుతుంది. అప్పటినుండీ నేను మిమ్మల్ని గమనిస్తున్నా. ఇప్పుడు ఒక సంగతి మీకు చెప్పుదామనుకుంటున్నా”. అని ఆగి ఒక్క కాజు ముక్క నోట్లో వేసుకుని పటుక్కున కొరికాడు.
“చెప్పండన్నా” అని అడిగి మరో గుక్క బీరు గొంతులోకి దింపాడు. ఏం సంగతి వినవలసి వస్తుందో అన్న ఆత్రుతతో.
“ముందు మీరు మీ క్రిందిస్థాయి సిబ్బందితో, పైస్థాయి అధికారులతో ఎట్లా వ్యవహరించాలో, ఎట్లా మసులుకోవాలో తెలుసుకోవాలి. పని సెకండరీ సంగతి.”
“అదెట్లన్నా” అని అడిగి అమాయకంగా ముఖం పెట్టాడు ఇన్‌ఫిరియార్టీ కాంప్లెక్సుతో.
“మన దగ్గర ప్రతి ఆఫీసులో రెండు రకాల వారుంటారు. ఒకటి డైరెక్టు రిక్రూటీస్, అంటే మీలాగ కాంపిటీటీవ్ పరీక్షలు రాసి డైరక్ట్ ఆఫీసర్లుగా వచ్చినవారు. మరో రకం ప్రమోటీస్. అనగా నాలాంటి వారు చిన్న స్థాయి నుండి అనేక ప్రమోషన్లు పొంది చివరికి నాలాగ రిటైర్‌మెంటు టైంకు ఆఫీసర్ అయినవారు.”
మాటల మధ్యలో పడి మరిచిపోయి మరో రెండు గుక్కలు ఒకేసారి పట్టించాడు బుద్దిగా కథ వింటున్న ఆ శ్రోత.
“ప్రమోటీస్ వారు చిన్న వయసులోనే రికార్డు అసిప్టెంటుగా, క్లర్కులుగా జాయిన్ అయ్యి చాలా సంవత్సరాల అనుభవంతో పనిలో రాటుతేలుతారు. పని మెలకువలన్నీ వారికి బాగా తెలుసుకాని పది పదిహేను సంవత్సరాలు పనిచేసినా ప్రమోషన్ వచ్చి మీ స్థాయి, హోదాలకు చేరుకోనందున వారందరికీ సాధారణంగా మీ డైరెక్ట్ రిక్రూటీస్ మీద కోపంగా, జెలసీగా ఉంటారు. కొత్తలో మీకు పని అంత బాగా రానందున మిమ్మల్ని మిస్ లీడ్ చేసి, ఆటపట్టిస్తూ, వీలైతే లాభం పొందాలని ప్లాన్లు వేస్తుంటారు. మీ వెనుక గోతులు కూడా తవ్వుతారు.”
చల్లటి బీరుతో కాదు గాని ఆ మాటలు వింటుంటే స్వామికి లోలోపల చలిజ్వరం వచ్చినట్లయ్యి వనజ, ముజీబులు జ్ఞాపకం వచ్చారు. సుఖంగా పాఠాలు చెప్పుకున్న రోజులు జ్ఞాపకం వచ్చి ఎందుకొచ్చిన పీడరా నాయినా అని ప్రాణం ఉసూరుమంది. తాగుతున్న బీరు మరింత చేదుగా మారింది. ఉత్త పుస్తక జ్ఞానం చాలా ఆనందంగా ఉంటుంది. కాని లోకజ్ఞానం చాలా భయపెడుతుంది.
“అయితే వాళ్లను కూడా తప్పుపట్టవలసిన పనిలేదు. నేనూ ఆ క్రిందిస్థాయి నుండే వచ్చాను కావున అనుభవంతో చెపుతున్నా. వాళ్లయన్నీ చిన్న ప్రాణాలు వారికి అవసరాలుంటాయి. కోర్కెలుంటాయి. కలలుంటాయి, పెండ్లాం, పిల్లలూ, సంసారం ఉంటుంది కదా. కాలం మారిపోతుంది ప్రతి మనిషి ఈ ప్రపంచీకరణలో పంచరంగుల కలలు కంటాడు. కలల్ని నిజం చేసుకోటానికి ఎండమావుల వెంబడి పరిగెత్తుతుంటాడు. ఈ మార్కెట్ ఆర్థిక విధానంలో మనిషి తనను తాను కోల్పోయి ‘కళ్లకు గంతలు కట్టిన గుడ్డి గుర్రంలా’ పరిగెత్తుతుంటాడు. ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ గుద్దుకుని క్రింద పడతాడో వాడికే తెలియదు.
అన్ని ప్రభుత్వ శాఖలలో ఆఫీసర్లు లడ్డూలు తింటున్నప్పుడు క్రిందిస్థాయి ఉద్యోగి కనీసం చాకెట్లకన్నా ఆశపడటం తప్పా? అయితే నేను ‘గుడిని, గుడిలోని లింగాన్ని మింగేవాళ్ల గురించి’ అంటే వనజ, ముజీబు లాంటి వాళ్ల గురించి వత్తాసు పలకటం లేదు. అందరూ అట్లాకాదు సగటు ఉద్యోగుల గురించి చెపుతున్నా.
మీరు లెక్చరర్‌గా చాలా ఆదర్శాలు, ఆదర్శసమాజం గురించి పిల్లలకు పాఠాలు చెప్పుతూ అవినీతి లేని సమాజం ఆదర్శ సమాజం అని చెపుతూ ఉండేవారేమో. కాని అవినీతికి మూలం ఎక్కడుంది? భారతీయుడు సీన్మాలో కమల్‌హాసన్ అవినీతి అంతా ఒక గుమస్తా, ఒక ట్రాఫిక్ కాన్సిస్టేబుల్, ఒక ప్రభుత్వ డాక్టర్ దగ్గరే ఉన్నట్లు చూపించి చేతులు దులుపుకున్నాడు. వాళ్లే సమాజానికి శత్రువులన్నట్లు. పదో తరగతి కూడా పాస్‌కాని కమల్‌హాసన్ ఒక నటుడు మాత్రమే. కాని చదువు లోకజ్ఞానం, రాజకీయ, పరిజ్ఞానం లేని కమల్‌హాసన్ ఇట్లాంటి సీన్మాలే తీసి చప్పట్లు కొట్టించుకుంటాడు. మళ్లీ ఇటువంటి సీన్మా వాళ్లే ఇన్‌కంటాక్సులు ఎగ్గొట్టి ప్రజల్ని చీమల్లా దోమల్లా చూస్తారు.”
మందుమీద మనుషులు నిజాల్ని నిర్భయంగా నిజాయితీగా ఉన్నదున్నట్లు మాట్లాడతారన్న సత్యం స్వామికి తెలుసు.
“మీకు తెలియనిదేముంది. మీరు బాగా చదువుకున్న వారు కదా. అవినీతి, లంచాలు, ముడుపులు, కమీషన్లు లావాదేవీలు, బేరసారాలన్నీ పై నుండి క్రిందికి వస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ఐ.ఏ.ఎస్.,ఐ.పి.ఎస్.లు మొదలుకొని సీన్మాస్టార్లు, క్రికెట్ వీరులు, కార్పోరేట్ సంస్థలు, చోటా మోటా వాణిజ్య వ్యాపార పరిశ్రమల వాళ్లందరూ ఇందులో మునిగి తేలేవారే కదా. మన సిస్టమ్, వ్యవస్థనే అట్లుంది చాణ్యుకుడి అర్థశాస్త్రంలో అవినీతి, లంచాల ప్రస్తావన కూడా ఉంది. అంతెందుకు మొన్న సోవియట్ యూనియన్ కూలిన తర్వాత చాలా సంగతులు ఇవతలికి వచ్చాయి. మరి కమ్యూనిస్టులు వ్యక్తిగత ఆస్తికి విరోధులు కదా. గోర్బొచేవ్ అధ్యక్ష నివాసం ఒక ఇంద్రభవనం. మరి లెనిన్ ఎట్లుండేవాడు పార్టీ తనకు కేటాయించిన భవనాన్ని ‘గోర్కీ మ్యూజియం’కు ఇచ్చి తను సాధారణమైన నివాసంలో ఉన్నాడు. కాలం మారుతుంది, మనుషులు మారుతున్నారు.”
మితభాషి, మృదుభాషి ఐన ఈ మనిషిలో ఇంత లోతైన అవగాహన, ఆలోచనలు ఉన్నాయని తెలిసిన స్వామికి ఎక్కిన బీర్ నిషా చప్పున క్రిందికి దిగుతుంది. అతని మాటలు వింటూ సీసా మొత్తం ఖాళీ చేసాడు. అట్లా స్వామి మొదటిసారి ‘గరళకంఠుడైనాడు’.
స్వామికి నిషా దిగితే మొహనరావుకు నిషా ఎక్కి తనకోసం మరొక బీరు ఆర్డరిచ్చాడు. అతని లోపలి లావా ఇంకా చల్లారలేదు మళ్లీ మాట్లాడసాగాడు. స్వామి కోసం ఒక ఫ్రైడ్ రైస్ తెప్పించాడు. ఆకలిమీదున్న స్వామి దాన్ని తింటూనే అతని మాటల్ని శ్రద్దగా వింటున్నాడు.
“మరో ముఖ్యమైన మాటస్వామీ అది చెప్పటానికే నిన్ను పిలిచాను” అని కాసేపాగి, “సరే అది ఆఖరికి చెపుతాను.
మీరు ఇప్పటికీ మిస్టర్‌క్లీన్ గానే ఉన్నారు. సరే మీ క్రింది వాళ్ల సంగతేంది. మీరు తినక వాళ్లనూ తిననీయకపోతే ఆఫీసు పనిలో వాళ్లు మీ మాట వింటారా? అమ్మ అన్నం పెట్టకపోతే పిల్లలు వీధిలోకి వెళ్లి అడుక్కుంటారు కదా. మీ స్టాఫ్ రేపు బజార్లలో పడి డీలర్లతో వారి వాటా వసూలు చేసుకోరా? ముజీబు, వనజ లాంటి బద్మాష్‌లు మళ్లీ మీకు ప్యూచర్‌లో తగిలితే వారు మీ పేరు చెప్పి అట్లా కూడా దండుకుంటారు” మాటలు వింటున్న స్వామికి బీరుతో కాదు అతని చేదునిజం మాటలతో తల తిరిగి పోతున్నది.
చుక్కల లోకంలో విహరిస్తున్న ముఖేష్ ఈసారి ‘ముజ్ కో యారో మాఫ్ కర్నా మై నషే మేఁ హూఁ’ అని పాడుతున్నాడు.
“మరిప్పుడు నేనేం చేయాలి?” అని నీరసపు గొంతుతో అడిగాడు స్వామి.
“మీరు నన్ను అన్నా అని గౌరవంగా పిలుస్తున్నారు. కావున నేను మిమ్మల్ని తమ్ముడిగానే భావించి నిర్మొగమాటంగా మాట్లాడుత”.
“చెప్పండన్నా”
“మీ డైరెక్ట్ రిక్రూటీస్ బ్యాచ్ మేట్సందరూ మీ కంటే పదేండ్లు చిన్నవాళ్లుగా కనబడుతున్నారు. వాళ్లకు చాలా సర్వీసు ఉంది. మీకిప్పటికే గ్రేహేయర్స్ వస్తున్నాయి. ఒక ఇరవై సంవత్సరాల సర్వీసు మాత్రమే ఉంది. మీకు పెన్షన్ కూడా ఫుల్‌గా రాదు. అతి కష్టంగా సగం రావచ్చు మీరేమో సింగిల్‌బ్రెడ్ విన్నర్. మీ వైఫ్ హౌజ్ వైఫ్. ఇద్దరు పిల్లలు. ఇంకా చిన్నవాళ్లే ఆడపిల్ల పెండ్లి అనేది అదనపు బాధ్యత..”
ఆయన అట్లా తన గురించి చెబుతుంటే తన అప్పుల ఊబి, కమిట్‌మెంట్లు జ్ఞాపకం వచ్చి స్వామి ఒణికిపోయాడు.
“మీ క్లర్క్ విలియం కేరీ నా దగ్గర ఎప్పుడూ పనిచేయలేదు కాని అతనికి మన డిపార్ట్‌మెంటులో మంచి పేరుంది. సిన్సియర్ అండ్ ఎఫిషియెంట్ పెన్ వర్కర్. యంగ్ మాన్ కాబట్టి నలుగురి పని ఒక్కడే డైనమిక్‌గా చేస్తాడు. అన్నింటికన్నా ఎక్కువ నమ్మదగిన వ్యక్తి. ఆఫీసర్లకు పంగనామాలు పెట్టే మొసకారి, చీటింగ్ కాదు. అతను డీలర్ల అన్ని పనులు చకచకా సమయం కన్నా ముందే పూర్తి చేసి వారిని నొప్పించకుండా మెప్పించి ఒప్పించి వారు సంతోషంగా ఇస్తే తీసుకునే మనిషి.
మీరు అతని మీద ‘ఆ భారం’ వేసి నిశ్చింతగా ఉండండి. మీరు మాత్రం ఎవరు ఇస్తామన్నా ఎప్పుడూ మీ చేతులతో ముట్టుకోవద్దు. డబ్బును నిప్పులా చూడాలి. ఆఫీసు బయట కేరీతో మాట్లాడుకోమని వారికి సూచన ప్రాయంగా చెప్పండి. ఎటువంటి క్యాష్ డీలింగులు ఆఫీసులో చేయవద్దని కేరీకి గట్టిగా చెప్పండి. అతని వల్ల మీకు పనిభారమూ తగ్గుతుంది. ఒక్క సంవత్సరంలో మీ దశ కూడా తిరుగుతుంది. నా మాట నిజం.
ఆఫీసు అయినంక కేరీని కొంచెం దూరంగా ఎక్కడైనా హోటల్‌లో కలిస్తే మీకు కవరు అందిస్తాడు. నా మాట వినండి మీరూ సంతోషంగా ఉంటారు. మీ క్రింద పనిచేసేవారూ సంతోషంగా ఉంటారు లివ్ అండ్ లెట్ లివ్ పద్దతి. అప్పుడు ఆఫీసు పని సజావుగా సాగుతుంది. కేరీ తమకు కావాలని చాలామంది ఆఫీసర్లు అడుగుతుంటారు. చాలా డిమాండు ఉందతనికి. ఆ వనజ వల్ల మీరు పడిన బాధలు గమనించి మీరు ఈ డిపార్ట్‌మెంటులో నిలదొక్కుకోవాలని ప్రత్యేకంగా కేరీని మనబాస్ మీకు ఇచ్చాడు.”
స్వామీ కళ్లల్లో కృతజ్ఞతతో తడి ఉబికింది.
అట్లా ఆ బీరు సీసా సాక్షిగా స్వామికి ఏకకాలంలో జ్ఞానోదయమూ మరియు “జ్ఞ్ఞాన స్నానం” కలిగాయి. “పునరుత్తానం” ఒకటే మిగిలిఉన్నది.
***
ఆ రాత్రి స్వామి లేటుగా ఇంటికి వెళ్లాడు. నిద్రపోకుండా ఎదిరిచూస్తున్న ఆంజల్యకు తలుపుతెరవగానే తాగి వచ్చాడని అర్థం అయ్యింది. ఎప్పుడూ లేనిది ఇదేమిటని అతని వంక వింతగా చూసింది. ఫ్రెష్ ఐనాక ఆంజల్యను కూచోబెట్టి సుదీర్ఘంగా మోహనరావు చెప్పిన సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆమె శ్రద్దగా అంతా విని “మరి నువ్వేమన్నావూ?” అని ప్రశ్నించి అతని కళ్లలోకి చూసింది.
“నేనైతే ఏమీ చెప్పలేదు. మరి నువ్వేమంటావో చెప్పు” అని ఎదురు ప్రశ్నవేసాడు.
ఆమె కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి “నాకు కొంచెం వ్యవధి కావాలి. ఆలోచించి చెప్తా చాలా రాత్రి అయ్యింది. ఇక పడుకో” అన్నది.
ఆ రాత్రి అంతా కలత నిద్ర. మళ్లీ కల్లోల కాలం కలలు.
రెండు రోజులయ్యాక సడిలేని నడి రేయి అలిసి సొలసి సొమ్మసిల్లిన తర్వాత ఆంజల్య స్వామి చెంత చేరి అతని ఛాతీపై చేయి వేసి “మరి ఏం నిర్ణయం తీసుకున్నావు” అని అడిగింది.
“బాగుంది ప్రశ్నకు ప్రశ్ననే సమాధానమా, ఆలోచించి చెప్పుతా అన్నది నువ్వే కదా”.
“సరే చెపుతా విను. ఆ పెద్దాయన మోహనరావుగారు చెప్పింది కూడా నిజమే. చుట్టుముట్టు ఉన్న ఈ అప్పులు, వడ్డీలతో మనిద్దరికీ రాత్రిపూట నిద్ర కరువయ్యింది. మధ్యరాత్రి మేల్కొస్తే గుండె ‘డుక్కు డుక్కు’ మని కొట్టుకుంటది. ఒకరు కాదు ఇద్దరు పిల్లలు. వారి చదువులు, పెంపకం, పోషణ ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సమతకు ఈ యాడాది టెన్త్ అయిపోతది. అది ఇంటర్ గుంటూరుకు వెళ్లి సిద్దార్థ రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకుంటా అని అంటుంది. దాని మాటలు వింటుంటే నాకు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయ్యింది.
తమ్ముళ్లకు, అక్కకు డబ్బులు ఇవ్వాలి కదా. వాళ్లు నోళ్లు తెరిచి గట్టిగా అడుగుతలేరు కాని ఎదిరి చూస్తున్నరు. వాళ్ల బాధలు వాళ్లకుంటాయి కదా. మనం కొత్త ఇంట్లో సుఖంగా ఉంటూ వాళ్ల సంగతి మరిచి పోయినమని అనుకుంటున్నరు కాని మన పరేషాన్ల సంగతి వాళ్లకేం తెలుసు.
మనం మన సగం జీవితకాలం ఆదర్శాలు, ఆశయాలు అనుకుంట ఏటికి ఎదురీది నానా తిప్పలు పడ్డాం. పిల్లల్ని కూడా కనొద్దు అనుకున్నం. కాని రోజులు మారాయి. మనకోసం మన పిల్లల కోసం ముందు చూపుతో జాగ్రత్త పడకుండా సగం జీవితం వృధా చేసుకున్నం. ఇక ఈ నలభైలో నువ్వు స్థిరత్వానికి వచ్చినవు. ఇక మిగిలింది ఎంత. మహా అంటే ఇరవై. ఇప్పుడైనా ఇల్లు చక్కబెట్టుకుని పిల్లల మంచి భవిష్యత్తు కోసం జాగ్రత్తగ ఉండాలి కదా. ఆ పెద్దాయన మాట విను. అయితే ఒక్క ముఖ్యమైన మాట.”
“ఏందది?” అన్నాడు మూసుకున్న కళ్లు తెరవకుండానే.
“మన నిర్ణయం మన ఆత్మకు విరుద్దమయినదే కావొచ్చు కాని మనల్ని మనం బ్యాలెన్సు చేసుకోవాలి. అతిగా పోకుండా మితంగానే ఒక పరిధిలోనే మనం ఉండాలి.”
“అంటే ఎట్లా?”
“మనకు బట్టలు-బంగారాలు అక్కర్లేదు. ఆడంబరాలు, విలాసాలు అసలే అక్కర్లేదు,. ముందు ఈ అప్పులన్నీ తీరాలి. తర్వాత పిల్లలకు మంచి చదువులు, మంచి తిండి, మంచి బట్టలు బస్ అంతే. మనిద్దరం ఎప్పుడూ సామాన్యుల్లా సాధారణ జీవితం గడపాలి. మనం మనలాగే ఉందాం. మనల్ని మనం కోల్పోవద్దు. ఈ డబ్బు మనల్ని లొంగదీసుకోవద్దు.
ఇక నేను చెప్పేది ఇంతకన్నా ఏముంటది? అంతిమ నిర్ణయం నీదే” అన్నది.
స్వామి కొంచెం సేపాగి గొంతు సవరించుకుని. “నీ లాగే నేనూ ఆలోచిస్తున్నా. సగం జీవితం మనకు మనం అన్యాయం చేసుకున్నాం. ఇక ఈ మిగిలిన సగం పిల్లలకు అన్యాయం చేయోద్దు. సరే నువ్వన్నట్లే చేద్దాం” అని మాట ఇస్తున్నట్లు తన ఛాతీ మీదున్న ఆమె అరచేయి మీద తన చేయి వేసాడు.
ఆమె ఇంకొంచెం అతనికి దగ్గరికి చేరి అనునయంగా, లోగొంతుతో “తామరాకు మీద నీటి బొట్టులా అంటీ అంటకుండా ఉండాలి సరేనా?” అన్నది.
‘సరే’ అన్నట్లు తలూపాడు.
***
విలియం కేరీ వచ్చి దాదాపు నెలరోజులవుతుంది. ఇప్పుడు స్వామి ప్రాణం హాయిగా ఉంది. ఏ పని పెండిరగ్‌లో ఉండటంలేదు. హెడ్డాఫీసుకు పంపవలసిన రిపోర్టులన్నీ సకాలంలో వెళ్లుతున్నాయి. అతను ఏ ఫైల్ రాసినా ఒకసారి తను చూసుకుని సంతకం చేస్తే చాలు. స్వామి తన పని ఇన్‌స్పెక్షన్లు, అసెస్‌మెంట్లు చేసుకుంటే సరిపోతుంది. ఆఫీసుకు సంబంధించిన టెన్షన్లు అన్నీ దూరమై రాత్రి సుఖంగా నిద్ర పడుతుంది.
ఒకరోజు పనీలేక ఖాళీగా ఉన్నపుడు కేరీని పిలిపించి తన ఎదురుంగ కూచోబెట్టుకున్నాడు.
“నీకీ పేరు ఎవరు పెట్టారు కేరీ” అని అడిగాడు.
“నేను పుట్టినపుడు మా అమ్మానాయిన నన్ను తీస్కపోయి చర్చిలో జీసస్‌పాదాల దగ్గర పెట్టారట. అప్పుడు అక్కడుండే చర్చ్ ఫాదర్ నాకు ‘విలియం కేరీ’ అని పేరు పెట్టాడట. ఆ ఫాదర్ ఆంగ్లో-ఇండియన్.”
“మరి ఆ విలియం కేరీ ఎవరో ఆయన గొప్పతనం ఏమిటో నీకు తెల్సా?”.
“తెలవదు సార్.”
“మీ అమ్మా నాయినా చెప్పలేదా?”
“అయ్యో వాళ్లకేం తెలుసుసార్. వాళ్లకు చదువులేదు. అక్షరాలు కూడా రావు. ‘కాలా అక్షర్ బైఁస్ బరాబర్’ అన్నమాట.”
స్వామి పక్కున నవ్వి “నీకు ఈ ఉర్దూ సామెతలు, ఉర్దూ ఎట్ల, ఎక్కడ్నుంచి వచ్చింది” అని అడిగాడు.
“సార్ నేను పదేండ్ల పిలగాడిగా ఉన్నపుడే మా వాళ్లు నన్ను హైద్రాబాదుకు తీసుకొచ్చి మా క్రిస్టియన్ మిషినరీలు నడిపే అనాథాశ్రమంలో చేర్పించారు. అది మన ఆబిడ్స్ తాజమహల్ ప్రక్కన మెథడిస్టు స్కూలు లోపలే ఉంటది. అక్కడి ఆశ్రమంలో ఉంటూ అదే స్కూలుల టెన్త్, ఇంటర్ కంప్లీటు చేసిన అట్ల హైద్రాబాద్‌ల ఉన్న, కాబట్టి ఇంగ్లీష్, ఉర్దూ, తెలంగాణా యాస కూడా అబ్బింది. మన డిపార్ట్‌మెంట్లకు వచ్చిన తర్వాత చాలామంది ముస్లిం ఆఫీస్లర దగ్గర పనిచేసిన కదా. అట్ల ఉర్దూనే కాక ఉర్దూ సామెతలు కూడా వచ్చు. మరి నా పేరు కథ ఏంది సార్?”
“అది నేను ఆఖర్ల చెప్తగని. ముందు నీ కత అంతా చెప్పు.”
“ఏముంటది సార్. చెప్పనీకె. మా తాత ముత్తాతల కాలం నుండీ మాది పలనాడు ప్రాంతంలోని కనిగిరి దగ్గర ఒక చిన్న పల్లెటూరు. అబ్బో మా తాత ‘భళభళీ మాతాత బల్లెంబు చేబూని’ అన్నట్లు మహా గొప్ప బలశాలి అట. ఎద్దు రక్తం, మూలగ, పచ్చిదే గటగటా తాగి సూర్యుడు పొడిచే యాళ్లకు కనిగిరి నుండి యాభై కిలోమీటర్ల దూరంల ఉన్న కందుకూరు దాకా ఒంగోలు గిత్తలాగ ఆగకుండా ఉరికేటోడట. కారిన చెమటలల్ల తాగిన రక్తమూ, మూలగ కలిసి ఆవిరైపోయేవట. అప్పుడు అంబటాళ్లకు ఆకలి ఆకలి అంటూ మాదిగవాడలకు పోయి ముంతల మీద ముంతలు పది ముంతల తాటికల్లు పట్టించి ఒక సేరు చియ్యల కూరా మరో రెండు సేర్ల రాగి సంకటి తిని త్రేన్చి కుంభకర్ణుడిలా గురకలు పెట్టి నిద్రపోయి మళ్లీ పొద్దుమీకే యాళ్లకు కనిగిరికి నడుచుకుంట వాపస్ వొచ్చెటోడంట. ‘మార్ ముంత చోడ్ చింతా’ అన్నట్లు అకర్ ఫికర్ లేని మనిషికి ముగ్గురు పెండ్లాలు. డజన్ పైన్నే పిల్లలు. వాళ్లంతా సేతానంల కైకిలికి పోయి దుడ్లో, జొన్నలో, రాగులో తెచ్చి ఇల్లు, వాకిలి, పిల్లల్నే కాక మొగుడ్ని కూడా చూసుకునేవారట. ఆయన మాత్రం ఏ కాయ కష్టం చేయకుండా కసరత్తులు చేసి కండలు పెంచి బస్తీమే సవాల్ అంటూ వస్తాదులతో కుస్తీలకు దిగి చివరికి తాను గెలిచినా, ఓడిపోయినా ఎవడిదో ఒకడి బుర్ర రామకీర్తన పాడించిగాని ఇంటికి తిరిగి వచ్చేవాడు కాదట. దేవుడి పేరు మీద అచ్చేసి వదిలేసిన ఆంబోతులా ఊరంతా బలాదూర్‌గా తిరుగుతూ మాపటేల మొక్కజొన్న తోటలలోనో, జొన్న చేలల్లోనో ఆ మసక మసక చీకట్లల్ల తనంటే పడి చచ్చే ఆడవాళ్లతో సరసాలు కూడా చేసేవాడట.
ఒకసారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చిందట. కనుమ మరునాడు మా పల్నాడు ప్రాంతంలో కోడిపుంజుల పందాలతో పాటు ఎద్దులకు మనుష్యులకు మధ్య కుస్తీపోటీలు జరుగుతాయి. ఎవడైనా ఒక వీరుడు బలంగా, దృఢంగా ఉన్న ఒక ఎద్దుకొమ్ముల్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఆ మెడల్ని బలంగా వంచి, విరిచి దాన్ని నేలకూల్చాలి. గతంలో మా తాత ఒకట్రెండుసార్లు అండ్ల పాల్గొని విజేతగా గెల్చాడట. ఆ సారి కూడా అదే ధైర్యంతో ఒప్పుకున్నాడట.
ఇక కనుము మరుసటి రోజు రానే వచ్చింది. ఊరు ఊరంతా పిల్లాజెల్లా ముసలి ముతకా అందరూ ఆ ఊరి నడిబొడ్డు రావిచెట్టు క్రింది బొడ్రాయి దగ్గర జమైనారు. అందులో ఆయన ముగ్గురు పెండ్లాలు, వారి వారి పిల్లలు, బంధువులు అందరూ ఉన్నారు. మాదిగ వాళ్ల తోలు డప్పుల హోరుకు ఊరు ఊరంతా దఢదఢలాడుతుంది. ఆ గోదా చుట్టూ జనమంతా ఊపిరి బిగపట్టి, కళ్లప్పగించి బొమ్మల్లా కొందరు నిలుచున్నారు. మరికొందరు కూచున్నారు.
అప్పుడు మా తాత ఆ మట్టికి అనగా నేల తల్లికి దండం పెట్టి అదే మట్టిని కాస్తా నుదుటికి రాసుకుని గోదాలోకి, అడుగుపెట్టాడు. భీముడు పునర్జన్మ ఎత్తి ఇప్పుడే హస్తినాపురం నుండి ఈ ఊరికి వచ్చినట్లు వచ్చాడు. ఒక నల్లటి కొండకు ప్రాణమొచ్చి నెమ్మదిగా నడిచి వచ్చినట్లే వచ్చాడు. నల్లటి మత్తగజంలా మెల్లమెల్లగానే అయితేనేం హుందాగా నడిచి వచ్చాడు. అతడి కాళ్ల క్రింద ఎర్రమట్టి ఎర్రెర్రగా దుమ్ముదుమ్ముగా రేగుతుంది. ఆహ.. ఆహా.. ఒహో ఒహో ఏమి శరీరం, ఏమీ ఆకారం ఆపాదమస్తకం ఒక ఇనుపశరీరమే కాని మనిషి శరీరం మాత్రం కాదు గాక కాదు సుమా అని చూపరులు కనురెప్పలు కదపకుండా చూస్తు విస్తుపోతున్నారు. అంగ్రేజీలో ఐరన్ మాన్ అంటారు కదా అట్లన్నమాట. ఆ ఊరి పక్కన నీళ్లు లేక ఎండాకాలం ఎండిపోయిన చెరువుభూమి ఆ వీరుడి ఎదముందు చిన్నగానే కనబడి చిన్నబోతున్నది. ఆ కొండంత బండంత నల్లటి మహాకాయానికి వేడి చేసిన నువ్వుల నూనెతో రుద్ది రుద్ది బలంగా మాలీష్ చేసినారేమో అతని అణువణువూ ఆ ఎర్రటి ఎండకు నల్లగా, నున్నగా మిలమిలా మెరుస్తూ నల్లత్రాచుపాములా నిగనిగలాడుతున్నది. అతని నడుము సింహబలుడి నడుములాగే ఉన్నా ఉదరం మాత్రం వెన్నుపూసదాకా లోపలికి పోయి లోతుగానే కనబడుతున్నది. అతని కాళ్లు, పిక్కలు, తొడలు ఉలితో చెక్కి తీర్చిదిద్దిన రాతి శిల్పంలా ఉన్నాయి. అతని ప్రియమైన శిష్యులు ప్రేమతో ఆ విశాలఫాల భాగంపై ఎర్రటి కుంకుమబొట్టు గుండ్రంగా పెట్టినందున అది శివుడి త్రినేత్రంలా భగభగ మండుతూనే ఉన్నది. ప్రొద్దున తాగిన తాటికల్లు ప్రభావంతో ఆ రెండు కండ్లూ అమ్మోరి గుడిలో రాత్రి పూట వెలిగే రెండు జ్యోతుల్లా ఎర్రెర్రగా వెలుగుతునే ఉన్నాయి.
ఈ లోగా ఎద్దును ఎవరో బరిలోకి ప్రవేశపెట్టారు. దానిని ఎద్దు అన్న వాళ్లకి పాపం తగిలి పున్నామనరకానికి పోతారు. శివుని వాహనమైన నందీశ్వరుడు కైలాసాన్ని వదిలి హిమలోకాన్ని దాటి ఏకంగా దక్షిణాపథంలోని కనిగిరిలో కాలుపెట్టినట్లే వచ్చాడు. లేదా లేపాక్షిలో కూచున్న బసవయ్య లేచి నిలబడి రంకె వేసి పరిగెత్తుతూ బుసలు కొడుతూ నల్లమల కొండల మీద నుండి ఈ ఊరు కనిగిరికి వచ్చినట్లే వచ్చాడు. కాదు కూడదంటే మైసూరు చాముండీగుట్ట మీది వృషభరాజు ఉగ్రరూపంతో ఈ ఊరికి ఉరుకురికి వచ్చినట్లే వచ్చాడు.
పైన ఆకాశంలో కనుమునాటి సూర్యుడు ఎర్రెర్రగా మండుతూ మిడిసిపడుతూ ఆ పసురానికి మనిషికి మధ్య జరిగే కుస్తీ పోటీ చూడటానికి చాలా ఆత్రంగా ఆ ఊరి మీదికి హడావుడిగా ఎగబాకి వచ్చినాడు.దేవలోకం వదిలి ఆకాశమార్గాన విహారానికి బయలుదేరిన ముక్కోటిదేవతలు, దేవుళ్లూ కనిగిరిలో జరుగుతున్న ఆ వింత పోటీ తిలకించడానికి నీలాల నింగిలోని నల్లని మబ్బులను చాటు చేసుకుని క్రిందికి తొంగితొంగి చూస్తున్నారు.
ఎవరో రెండు ఎరుపు పసుపుపచ్చ బంతిపూల దండల్ని తెచ్చి ఒకటి ఆ వృషభరాజు మెడలో మరొకటి మహాకాయుడి మెడలో గౌరవంగా అలంకరించారు. మనిషి రెండు ముంజేతులకు, పసురం నాలుగు కాళ్ల గిట్టలకు కొంచెంపైన ఆ పూలదండలను బిగించి కట్టి దాని నడుముకు ఒక ఎర్రరంగు సిల్కు బట్టను తాడుతో బిగువుగా బిగించారు. మహాకాయుడు లోపల కటి భాగంలో లంగోటా గట్టిగా బిగించి దానిమీద కాసె పోసిన గోసీని దృఢంగా బిగించినందున వాడి నడుముకు కూడా అటువంటిదే ఎర్రపట్టుగుడ్డను కట్టి దాని తోకను గాలిలో అటుఇటూ జయకేతనంలా ఊగేలా కట్టటమే గాక నుదుటికి ‘కఫన్’లా ఒక నీలిరంగు రిబ్బను కట్టి దాని రెండుకొసలు కణతనుండి క్రిందికి మెడవరకు జారేలా పంచరంగుల వన్నెచిలక పొడుగుతోకలా కట్టినారు.
ఆ వృషభరాజం పాలతెలుపురంగులో ఉండి దాని రెండు పొడుగు కొమ్ములు మాత్రం నలుపురంగులో వొంపులు తిరిగి వాటి కొసలు బాగా మొన తేలి ఉన్నాయి. అర్థచంద్రాకారంలో పొడుగు పొడుగు నెలవంకల్లా ఉన్నాయి. ఇక దాని భవిష్యత్తు వాడి భవిష్యత్తు అటో ఇటో తేల్చేది ఆ రెండు కొమ్ములే.
ఎవరో ఊపిరి బిగించి చాలా జోరుగా బాకా ఊదారు హఠాత్తుగ తోలు డప్పుల మోత ఆగిపోయింది. గాలి స్తంభించింది. రావిచెట్టుమీది ఎండిపోయిన కొమ్మల ఆకులు కొంచెం భయం భయంగానే ఒక్క నిముషం మాత్రమే గలగలా చప్పుడు చేసి మళ్లీ నిశ్శబ్దం పాటించాయి.
బరిలో ఆ తెల్లటి పసురము నల్లటి మనిషి దూరదూరంగా తూర్పు పడమరల్లా ఎదురెదుగా నిశ్శబ్దంగా నిలుచుని ఒకరి కళ్లలోకి మరొకరు సూటిగా, నిశితంగా, నిశ్శబ్దంగా చూసుకున్నారు. ఆ నాలుగు కండ్ల మూగ బాస ఏమిటో ఆ పైనున్న పరమాత్ముడికే తెలియదు తెలిసినా అర్థమూ కాదు.
ఇంతలో ఆ ఊరి చాకలి రావిచెట్టు క్రింద చాలా ఎత్తుగా ఉన్న రచ్చబండ మీది కెక్కి తల ఇంకా పైకెత్తి తన రెండు చెంపల్ని బూరెల్లా ఉబ్బించి బలంగా చాలా సేపు బాకా ఊది యుద్దోన్మాదం చేసాడు. దానికి తోడు తోలు డప్పుల మీద చిర్రాగోనెలు కదన కుతూహలంతో లయబద్దంగా దరువులు వేయసాగాయి. ఆ దరువులు దద్దడ్ కీ దద్దడా, దద్దడికీ దద్దడా అని శబ్దాలు చేస్తున్నాయి. ఆ చప్పుడుకు నాలుగు దిక్కులూ పిక్కటిల్లి మారుమోగిపోతున్నాయి. గ్రామ పెద్దలలో ఒకాయన కాషాయ ధ్వజాన్ని అటుఇటూ ఊపుతూ కదనరంగానికి శంఖం పూరించి ఊదాడు.
చూపరులకు ఆ వృషభం అప్పుడు నేల మీదికి దిగి వచ్చిన మహిషాసురుడిలా కనిపించింది. దాని మెడమీది బలమైన మూపురం మీద పసుపు కుంకుమలు చల్లి సరిపోక దాని నుదుటిపై కూడా కొంత చల్లారు. ఆ మహాకాయుడికి మహిషాసురుడికి యుద్ధం ప్రారంభమయ్యింది. వాడు దానితో కొంచెం సేపు సయ్యాట లాడుతూ దానిని కవ్వించాడు. రెండుచేతివ్రేళ్లతో దగ్గరకు రారామ్మని మూగ సైగలు చేసాడు. జబ్బలు చరుచుకుంటూ, తొడలు తన అరచేతుతో పటపట కొట్టుకుంటూ దానిని సవాల్ చేసాడు. అది ఆ సవాల్‌కు జవాబుగా దాని తోకను అటూ ఇటూ నెమ్మదిగా గాలిలో ఊపింది. ఆ తర్వాత తన చుట్టూతానే గుండ్రంగా గిరికీలు కొట్టి ప్రదక్షిణ చేసింది. బుసకొడుతూ కొంత చొంగ కార్చింది. తన ఎడమ కాలు గిట్టను ఆ ఎర్రమట్టి నేల మీద రాపాడిరచి కొదమసింహంలా ముందుకు కదిలింది. అప్పుడు వాడు హె-హె హేహే అని పశువుల భాషలో దానిని రెచ్చగొట్టాడు.
అప్పుడు అది పో- పోరా-అధమాధమ మానవా అన్నట్లు తల కాస్తా క్రిందికి వొంచి తన వాడి కొమ్ములను గర్వంగా ప్రదర్శిస్తూ ముందుకు దూసుకొచ్చింది. అది చాలా దగ్గరకు అంటే అరగజం ఎడంలో ఉన్నపుడు వాడు చాలా చాకచక్యంగా మెరుపువేగంతో పక్కకి జరిగాడు. ముందుకు పోయిన అది తనను తాను నాలుగు కాళ్లతో సంభాళించుకుని మళ్లీ వెనక్కి తిరిగింది గురి తప్పింది అన్న అక్కసుతో.
వాడు కావాలని దానిని రెచ్చగొట్టాలని వంకరటింకరగా పరిగెత్తాడు. తనేదో భయపడుతున్నట్లు. అదో వినోదభరితమైన ఆటలాగా “ఎక్కడికి పోతావు చిన్నవాడా” అన్నట్లు అది వాడి వెంటపడింది. జనాలు ఆ వినోద ప్రదర్శనకు ఆనందంతో చప్పట్లు కొడుతూ పకపకా నవ్వుతున్నారు. కొందరు గట్టిగా ఈలలువేసారు.
అలసిపోయిన ఆ పసురం అలిగి దూరంగా వెళ్లి నిలుచుని వాడిని పులుకుపులుకుమని చూసింది. వాడు హేళనగా మట్టి మీద ఎగురుకుంటూ తొడలు గట్టిగా అరచేతులతో చరుచుకుంటూ మరొక్కసారి ‘రా’ అన్నట్లు సైగ చేసాడు.
అప్పుడది తుఫానుగాలిలా ప్రచండవేగంతో ముందుకురికి తన తలతోవాడిని ఢీ కొట్టింది. వాడు గాలిలోకెగిరి దబ్బున క్రింద పడ్డాడు. అప్పుడది విజయగర్వంతో తన కొమ్ములతో కుమ్మబోగా వాడు తృటిలో పక్కకు తొలగి దొర్లి తప్పించుకొని నేలకు కొట్టిన బంతిలా లేచి నిలుచున్నాడు.
మళ్లీ చప్పట్లు. మళ్లీ ఈలలు. మళ్లీ మళ్లీ ఇంకా ఇంకా డప్పుల మోతలు.
పశువు పరాభవంతో పేట్రేగిపోయి మోరపైకెత్తి గట్టిగా రంకెవేసింది. ఆ రంకెకు భయపడి రావిచెట్టు మీది ఎండుటాకులన్నీ భయంభయంగా కంపించాయి.
ఇక అప్పుడు ఆ పోటీ రసపట్టుగా మారింది. పట్టుదలగా మళ్లీ దూసుకొచ్చిన దాని మీదికి లంఘించి దాని వీపు మీద వాలి ఆ రెండు కొమ్ములి రెండు చేతులతో బిగించి పట్టుకున్నాడు. దానికి రోషమొచ్చి గట్టిగా విదిలించగా ఆ ఊపుకు విసురుకు తుపుక్కున బొమ్మలా క్రిందపడ్డాడు. ఎర్రటిధూళి వాడిని కమ్ముకుంది.
ఆ క్షణకాలమవకాశం ఏ మాత్రం వృథా చేయక అది మళ్లీ కుమ్మబోగా వాడు స్ప్రింగులాగ లేచి నిలబడి గరుడ పక్షిలా దాని కొమ్ములు, వీపుపై నుండి ఎగిరి దాని తోక వెనుక భాగంలో క్రిందపడ్డాడు.
ఊహించని ఆ పల్టీకి ప్రజలందరూ భళభళీ అని మెచ్చుకున్నారు.
సాము, గరిడీలు చేసిన వాడి శరీరం లోపల ఎముకలే లేనట్లు తోలుబొమ్మలా ఎటుపడితే అటు మెలికలు తిరుగుతుంది. అప్పుడా మహిషాసురుడు బుసలుకొడుతూ ఏ మాత్రం జాగు చేయక గిరుక్కున వెనక్కి తిరిగి మళ్లీ కుమ్మబోగా అప్పుడా బలభీముడు తన ఇనుపహస్తాలతో దాని రెండు కొమ్ముల్ని గట్టిగా పట్టుకుని క్రిందికి తన శక్తినంతా కేంద్రికరించి వంచసాగాడు. వాడు దాని పాలిట కాలయముడైనాడు. మెడలు పటపటమని విరుగుతున్న బాధతో అది రంకెలు వేస్తూ క్రిందికి తూలి వాలిపోతుండగా వాడు విజయగర్వంతో ఆనందంతో పెడబొబ్బలు పెడుతూ జనాల వంక ‘చూసారా నా ప్రతాపం అన్నట్లు’ చూసాడు.
జేజేలు పలుకుతున్న గ్రామ ప్రజలు. ఎగిరి గంతులేస్తున్న ముగ్గురు పెండ్లాలు వారి వారి పిల్లలు. కొద్ది దూరంలో కాస్తా ఎత్తుగడ్డమీద ఆడవారి గుంపు. ఆ గుంపులో నిలుచున్న ‘కామాక్షి’ వాడి డేగ చూపుకు చిక్కింది. వారిద్దరి కళ్లు, కళ్లూ ఒక్క నిముషం కలుసుకున్నాయి. ఆమె కండ్లు, పెదాలు సంతోషంతో నవ్వుతున్నాయి. ఆమె ఆ ఊరి “కలవారి కోడలు కలికి కామాక్షి”.
ఒక క్షణం వాడి మనసు చెదిరింది. తొలిసారి ఆమె మబ్బులు మసకేసినపుడు, ఆ మసకమసక వెన్నెల రాత్రి వెలుగునీడలలో ఏపుగా పెరిగిన చెరకుతోటలో తనను కలుసుకుని తమకంగా కావలించుకొని తన చెవిలో మత్తుగా, మెత్తగా గుసగుసగా అడిగిన మాట జ్ఞప్తికి వచ్చివాడి వొళ్లు పులకరించింది. “నేల చిత్తడి చిత్తడిగా ఉంది. దున్నిపోరా దున్నపోతా”.
లిప్తకాలం పరవశత్వంలోకి వెళ్లిపోయాడు. అంతే అర్జునుడి దృష్టి మత్స్యయంత్రంలో తిరుగుతున్న చేప కన్నుమీద నుండి పక్కకు తొలిగింది. పరాకుగా ఉన్న వాడిని ఆ పసురం పసిగట్టి ఆ బంగారు అవకాశాన్ని ఏ మాత్రం వృథా చేయలేదు. పరవశంతో ఉన్న వాడి బాహువుల బలం రవ్వంత సడలిందన్న సంగతి గమనించి మళ్లీ మహిషాసురుడిలా మారి బుసకొట్టి రంకెవేసి తన శక్తినంతా కూడగట్టుకొని ఒక్క విసురుతో వాడిని క్రిందికి త్రోసి వెల్లకిల్లా క్రిందపడ్డవాడి పొట్టలోకి తన వాడికొమ్ములతో గట్టిగా కుమ్మింది.
అప్పుడు వాడు బాధతో భయంతో పెట్టిన ఒకే ఒక పెడబొబ్బకు రావిచెట్టు కొమ్మల మీద ప్రశాంతంగా కూచున్న పక్షులు, వాటి పిల్లలన్నీ గాభరగాభరగా కలకలారావాలతో లేచి ఆ అరుపుకు భయంతో రెక్కలను టపటపలాడిస్తూ గాలిలోకి ఎగిరిపోయాయి. చూపరులకు ఒక నిముషం ఏం జరిగిందో అర్థంకాక స్తంభించి శిలల్లా నిలబడిపోయారు.
ఆ విధంగా ఆ వృషభం తన కొమ్ముల్ని బలంగా, గట్టిగా క్రిందికి అదిమి నొక్కిపెట్టింది. కొండంత ఆ మనిషి చిన్న పిట్టలా తన కాళ్లూ చేతుల్ని నేలకు టపటపా కొట్టుకుంటున్నాడు. ఏదో ఒక ఆసరా దొరుకుతుందన్న ఆశతో, కాని వాడి గిలగిలలకు ఏ ఊతమూ దొరుకలేదు. దీనంగా అందరివైపు అదే చివరి చూపు అన్నట్లు చూసి తన వాళ్లందరికీ కళ్లతోనే కడసారి వీడ్కోలు పలికాడు.
అప్పుడు ఆ పసురం నెమ్మదిగా విజయగర్వంతో తల పూర్తిగా గాలిలోకి పైకి ఎత్తింది. ఆ కొమ్ములకు గుచ్చుకుని ఉన్న వాడి శరీరం పూర్తిగా గాలిలో పైకి లేచింది. వాడు బొక్కబోర్లా పడుకుని ఉన్నవాడిలా ఉన్నాడు కాని వాడి కడుపును చీల్చికుని ఆ రెండు వాడి కొమ్ములు వెన్నులో నుండి బయటికి వచ్చాయి. ఇక వాడి అరుపులు లేవు గాని చివరి ప్రయత్నంగా రెండు చేతులు అడ్డంగా చాచి ఊపుతూ రెండు కాళ్లు తపతపా కొట్టుకుంటున్నాడు. ఈత రానివాడు మునిగిపోయే ముందు నీటిపై తేలుతూ తపతపా కొట్టుకుంటున్న వాడిలా. నోటిలో గాలం చిక్కుకున్న చేపపిల్లలా గిలగిలలాడుతున్నాడు. ఆ పసురం తన తల అటూ ఇటూ ఆడిరచేసరికి వాడి పొట్టలోని ఎర్రని పేగులు రక్తమోడుతూ జలజలా క్రిందికి రాలి తీగలు తీగలుగా, పువ్వుల దండగా దాని ముఖాన్ని కప్పేసాయి. అప్పుడు దానికి చిరాకు వేసి, తలక్రిందికి దించి అటుఇటు ఊపేసరికి వాడి నిర్జీవ శరీరం, వాడి విగత శరీరం దబ్బున ఆ ఎర్రమట్టిలో, ధూళిలో క్రింద నేలకు వాలింది.
కోలుకున్న ప్రజలందరూ ఒకేసారి గొల్లుమన్నారు. గుంపులో నిలబడ్డ కామాక్షి స్పృహతప్పి క్రిందికి నేలమీద ఒరిగిపోయింది.
వాడి భార్యలు, పిల్లలు బంధువులు వాడిని ఒక బండిలో వేసుకుని తమ మాదిగ వాడకు కాకి శోకాలతో మోసుకపోయారు. ఈ సారి డప్పులు చావు డప్పు మోగించాయి.
మామూలుగా ఎద్దు మనిషిని కుమ్మి క్రిందపడేస్తుంది కాని అంత క్రూరంగా చంపదు కదా అని అందరూ గుసగుసలాడి నోళ్లు నొక్కుకున్నారు.
కాని కొన్ని రోజులకు ఒక కుట్ర బయటపడిరది.
రంకు గురించి తెలుసుకున్న కలవారి కొడుకు నయానా భయనా బెదిరించినా కామాక్షి మారలేదు. చివరికి ఆమె తొలిసారి గర్భవతిఐ ఒక కొడుకును కూడా కన్నది. ఆ శిశువు నల్లగా బాల భీముడిలా ఉన్నాడు. ‘అంకురం సంకరం’ అయ్యిందని ఆమె భర్త నెత్తినోరూ కొట్టుకున్నాడు. తన లంకంత ఆస్తికి ఆ సంకర జాతివాడు వారసుడౌతాడనేదే అతని బాధ. పుట్టగానే ఆ పసికందు గొంతు పిసకాలని వాడు ప్రయత్నిస్తే కామాక్షి ఆడపులిలా ప్రతిఘటించి వాడు నా బిడ్డ నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. కావాలంటే వీడిని తీసుకుని మాదిగ వాడకు వెళ్లిపోతా అని బెదిరించింది. పరువు ప్రతిష్ఠల సమస్య కాబట్టి ఆ మొగుడు నోరు మూసుకుని సమయం కోసం ఎదురు చూసాడు. చివరికి ఎద్దు యజమానిని కాసులతో లోబరచుకుని పందెం రోజు ఉదయం ఎద్దు తాగే కుడితిలో పూటుగా నాటు సారా కలిపించాడు. అదీ తెరవెనుక జరిగిన కుట్ర.
తర్వాత కొద్ది నెలలకు మాదిగవాడలో రాతితో చెక్కబడిన ‘వీరగల్లును’ వాడి బంధుమిత్రులు స్థాపించారు. అందులో ఒక వీరుడు ఎద్దుతో పోరాడుతున్న ఒక దృశ్యాన్ని చెక్కారు. అది ఈ నాటికి చెక్కు చెదరకుండా చరిత్రలో నిలబడి అట్లనే ఉంది.
తర్వాత్తర్వాత మరి కొన్ని దినాలకు వీరుడి కొడుకులు కలవారి కొడుకును అదే సమయంలో ఎద్దు యజమానిని ఒక నిండు అమాస రాత్రి వేటకత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి రక్తానికి రక్తంగా ప్రతీకారం తీర్చుకుని తమ తల్లులు, భార్యలు, పిల్లలందర్నీ తీసుకుని ఊరు వదిలి మాయమైనారు. వారి అతాపతా ఎవరూ కనుక్కోలేక పోయారు. వెనకా ముందూ ఏమీ లేని పేదవారికి పోయేదేమీ లేదు. తరతరాలు మోస్తున్న దాస్యశృంఖలాలు తప్ప.
ఒక వీర కథాగానం వినిపించిన పురా జానపద గాయకుడిగా స్వామి కళ్లకు విలియం కేరీ కనిపించాడు.
గదిలో గడ్డ కట్టిన నిశ్శబ్దాన్ని ఛేధించుకుని చాలా నెమ్మదిగా “తాత పేరేమిటీ?” అని అడిగాడు.
“కోటప్పసార్”
“కోటప్పలు ఎప్పుడూ ఇట్లనే చనిపోతుంటారు” అన్న మాటలు విన్న కేరీ “అట్లెట్ల సార్” అని అడిగాడు.
“మళ్లీ సమయం వచ్చినపుడు చెపుతా” అని స్వామి ఆఫీసు నుండి ఇంటికి భారంగా బయలు దేరాడు.
ఇప్పుడు స్వామి కేరీకి రెండు కథలు బాకీ. ఒకటి అతని పేరు గురించి రెండు అతని తాత పేరు గురించి.
(మళ్ళీ కలుద్దాం)
పరవస్తు లోకేశ్వర్ 10 జూన్ 1951 నాడు హైదరాబాద్ పాత నగరంలో జన్మించారు. కథా నవలా రచయిత, అనువాదకులు. ట్రావెల్ రైటర్. యాత్రా కథనాల రచనలో అందెవేసిన చెయ్యి. పరదేశీగా దేశదేశాల సరిహద్దులలో, దారి కాని దారులలో ఒంటరి బాటసారిగా తిరగాలనేది రచయిత అంతర్జ్వాల. ప్రపంచ యాత్రికుడు పండిత్ మహామహోపాధ్యాయ్ పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ ప్రభావం తనపై చాలా ఉందని రచయిత అంటారు.
సలాం హైదరాబాద్, సిల్కురూట్‌లో సాహస యాత్ర, ఒక హిజ్రాకథ (సుప్రసిద్ధ హిందీ, ఉర్దూ అనువాద కథలు), ఛత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర, ఆనాటి జ్ఞాపకాలు, తెలంగాణ సంభాషణ, ప్రపంచ పాదయాత్రికుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర, 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు, నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు, ఎవరిది ఈ హైద్రాబాద్?, హైద్రాబాద్ జనజీవితంలో ఉర్దూ సామెతలు, కల్లోల కలల కాలం వంటి పుస్తకాలు వెలువరించారు. ‘సలాం హైద్రాబాద్’ కు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం లభించింది.
హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది చివరిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది.