[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది.]
అధ్యాయం-1: ములాఖాత్ విత్ చార్మినార్ అండ్ జెఫ్రీ
తెలంగాణా చరిత్ర ఆ రోజు మళ్లీ ఒళ్లు విరుచుకుని ముఖ్యమైన మలుపు తిరిగిన రోజు.
చరిత్ర పుటలలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు.
ఆరోజు తెలంగాణా విముక్తి దినం.
ఆ దినం 18 ఫిబ్రవరి 2014
లార్డ్ బజార్‌కు వెళ్లే సందు మలుపులో అప్పట్నించి ఇప్పటి వరకు అట్లనే ఉండి పాతబడి ముసలిదైన ఇక్బాల్ హోటల్లకు అరవై మూడు సంవత్సరాల స్వామి ప్రవేశించి ఖాళీగా ఉన్న ఒక కుర్చీలో కూచుని ఎదురుగా కనబడుతున్న నాలుగున్నర శతాబ్దాలు నిండిన చార్మినార్‌ను కళ్లతోనే కావలించుకుని పలకరింపుగా ఒక చిన్న చిర్నవ్వు నవ్వాడు.
“ముబారక్ హో స్వామీ సాబ్. ముబారక్ హో. హృదయ పూర్వక శుభాకాంక్షలు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్” అంటూ చార్మినార్ నిండుగా నవ్వుతూ స్వామిని పలకరించింది.
“థాంక్యూ” అని ముక్తసరిగా జవాబిచ్చాడు స్వామి.
“గదేంది. సంతోషంగా లేవేంది? ఈరోజు తెలంగాణా రాష్ట్రం సిద్దించింది కదా. అరవై సంవత్సరాల తెలంగాణా కల నెరవేరింది కదా. మరి ముఖం అట్ల ముడుచుకున్నవేంది?” ప్రశ్నించింది చార్మినార్.
ఆరోజే అనేక అవాంతరాలు, ఆటంకాలు, గందరగోళాల మధ్యన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం బిల్లు పార్లమెంటులో ఆమోదించబడి పాస్ అయ్యింది.
“నిజమే కాని ఉత్త భౌగోళిక తెలంగాణా మాత్రమే వచ్చింది. ఇంకా ప్రజా తెలంగాణా, ప్రజాస్వామిక తెలంగాణా రావాలి కదా” స్వామి సంశయాత్మకంగా అన్నాడు.
“మూడు తరాల నుండి, అరవై సంవత్సరాల పోరాటం చేసి ప్రస్తుతానికి భౌగోళిక తెలంగాణా తెచ్చుకుని మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చుకున్నారు. ఇక రాబోయే తరం వారు నువ్వనుకునే ప్రజాస్వామిక తెలంగాణాను సాధిస్తరేమో? ఆ ఫికర్ నీకెందుకు?” అని అనునయంగా బుజ్జగిస్తున్నట్లు చార్మినార్ స్వామిని సమ్జాయించింది.
“ఏమో నాకైతే కొంచెం అనుమానంగానే ఉంది. గతమంతా రెడ్డి వర్గాల పెత్తనం, ఆ తర్వాత కోస్తా కమ్మవాళ్ల పరిపాలన అనుభవించాం కదా ఇక ఈ రాబోయే తెలంగాణాలో మళ్లీ ఇంకో కొత్త దొరల పెత్తనం రాజ్యమేలుతదని నాకు అనుమానంగా ఉంది” అన్నాడు స్వామి.
“నువ్వెప్పుడూ ఇంతే. సంశయాత్మక జీవివి. అసంతృప్త మానవుడివి.” అని చార్మినార్ కొంచెం విసుక్కుని “అయినా ఈ అనుమానం నీకెందుకొచ్చింది” అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
“ఎందుకు రాదు? ఉద్యమం నడిచిన తీరుతెన్నులు, పోకడలను గమనించినపుడే నా అనుమానం నిజమని తేలిపోయింది. ఉద్యమ అగ్రనాయకత్వం అంతా ఒక్క సామాజిక వర్గం వారిదే కదా? వారే కాక వారి పిల్లలు అప్పటిదాకా విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ అనామకంగా బ్రతికిన వారు ఇక్కడికి వచ్చి రాత్రో రాత్రి నాయకత్వ స్థానాలు సంపాదించుకుని పెత్తనాలు చేయలేదా? నాయకుడి దగ్గరి బంధువులు కూడా ‘సందట్లో సడేమియా’ లాగా ఉద్యమంలో జొర్రబడలేదా?
“మాలిక్ మేహర్బాన్ హైతో గధా భీ పహిల్వాన్ హోతాహై” అని చార్మినార్ పకపకా నవ్వింది స్వామి అనుమానం నిజమే అన్నట్లు.
స్వామి చాయ్ తాగుతుంటే ఎదురుగా టేబుల్ మీద ఒక మనిషి దక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పేపరు ముఖానికి అడ్డం పెట్టుకుని చదువుకుంటున్నాడు. పేపరు వెనక నుండి చార్మినార్ సిగరెట్ పొగలు ఘాటుగా, దట్టంగా మేఘాల్లాగ పైకి లేస్తున్నవి. స్వామి అనుమానంగా అటువైపు చూస్తుంటే..
“ఏం భే సాలే. హౌలేగా నన్ను గుర్తుపట్టలేదా? అప్పుడే మర్సిపోయినవా ఏందీ?” అన్న ప్రశ్న వినబడింది.
స్వామి ఒక్క మినిట్ పరేషాన్ అయ్యిండు. గొంతు ఎప్పుడో, ఎక్కడో విన్నట్లు గుర్తుకొస్తుంది. గబుక్కున పేపరు క్రిందికి గుంజిండు.
“జెఫ్రీ”
“అర్రే జెఫ్రీ నువ్వు చనిపోయినవ్ కదా. అప్పుడు 1969 ఉద్యమంల మేడే నాడు రాజభవన్ ముందు రైలు కట్ట మీద పోలీసులు ఫైరింగ్ చేసినపుడు.”
“ఔను భే. అప్పుడు చనిపోయిన నిజమే. కాని తెలంగాణా వచ్చినంక చూసి పోవాలని నా ఆత్మ ఇట్లనే ఈ భూమ్మీద అప్పట్నుండి ఇప్పటి వరకు బట్కాయించుకుంట ఇట్లనే చక్కర్లు కొడుతుంది.”
జెఫ్రీ అట్లనే ఇంకా అదే రూపంతో పదిహేడు సంవత్సరాల పి.యు.సి. చదివే సిటీ కాలేజీ పిల్లగాడిగానే కనబడుతున్నడు. నల్లటి ముఖంలో తెల్లటి మల్లెపూవసుంటి నవ్వు. అదే కొంటె చూపు మిశ్చివస్గా.
“మరి నువ్వు నా తీర్గ ముసలోడివి కాలేదేంది? అడిగిండు స్వామి.
“అవున్రా. ఆత్మలకు ముసలితనం రాదు. శరీరాలకే ముసలితనం. ఏ వయసుల చనిపోయిన్నో అదే రూపం నా ఆత్మకు ఉంటది. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం సిద్దించింది కదా ఇక నా ఆత్మకు విముక్తి దొరికింది. ఇక నేను ఈ భూమిని వదిలిపెట్టే సమయం ఆసన్నమయ్యింది.”
స్వామికి గతమంతా జ్ఞాపకం వచ్చింది. నలభైఐదేళ్ళ క్రింద 1969 మేడే నాడు తను, జెఫ్రీ, గోపి, అశోక్ ఇదే ఇక్బాల్ హోటల్ల ఆరోజు కలిసి చాయ్‌లు త్రాగి, సిగరెట్లు ఊది ఈ చార్మినార్ నుండే రాజ్‌భవన్‌కు వెళ్లే ఊరేగింపుల పాల్గొన్నారు. అడగడుగునా రక్తతర్పణలు, బలిదానాలు జరిగాయి. ఆఖరికి రాజ్‌భవన్‌కు ఊరేగింపు చేరుకుంది గవర్నర్‌కు మెమోరాండం సమర్పించటానికి. అక్కడ మళ్లీ రైలు కట్ట మీద పోలీసుల కాల్పులు జరిగాయి. తప్పించుకోవటానికి పరిగెత్తుతున్న జెఫ్రీ వీపులో వెనక నుండి తుపాకి తూటా దూసుకపోయి అక్కడే క్షణాలలో రక్తం కక్కుకుని చనిపోయాడు. ఇప్పుడు ఇట్లా తెలంగాణా వచ్చిన రోజు మళ్లీ వాడి ఆత్మ దర్శనం.
“ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతవు జెఫ్రీ” అని అడిగాడు స్వామి. పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా పెదవుల మధ్య ఆపుకుంటూ.
“ముందు ఒక చార్మినార్ సిగరెట్ డబ్బా తెప్పించరా” అన్నాడు జెఫ్రీ.
స్వామి సర్వర్‌కు చెప్పి తెప్పించాడు.
జెఫ్రీ ఆత్రమాత్రంగా ఒక దాని తర్వాత మరొకటి వరుసగా సిగరెట్లన్నీ బుస్సుబుస్సుమని పీల్చాడు. వాడి చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకుంటున్నాయి. చూస్తుండగానే వాడు ఆ పొగల మధ్య నీడలా మారి మాయమైనాడు. అప్పుడు అక్కడ ఒక పొగల మేఘం పైకి లేచింది. అది కాసేపు అటూ ఇటూ ఊగుతూ హోటల్ నుండి ఇవతలికి వచ్చి చార్మినార్ వైపు వెళ్లి దాని నాలుగు కొమ్ముల చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి పైపైకి ప్రాకి ఆకాశం అవతలి వైపుకు మాయమై విశ్వవీధులలో లక్షలాది నక్షత్రాలలో ఒక నక్షత్రంలా మిలమిలా మెరుస్తూ మిగిలిపోయింది.
స్వామికి అంతా ఒక కలలాగా అనిపిస్తుంది. గతించిన జ్ఞాపకాల తలుపులు నెమ్మది నెమ్మదిగా కిర్రుకిర్రుమని శబ్దం చేస్తూ ‘ఓపెన్ సిసేమ్’లా తెరుచుకుంటున్నాయి. కాలయంత్రం గిరగిర తిరుగుతూ స్వామిని గతంలోకి గుంజుకపోతుంది. ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి సుడిగుండం అతడిని తన లోపలికి లాక్కుని తొంభై దశకం తొలి సంవత్సరాలలోకి నెట్టివేసింది.
“గుజ్రే జమానా యాద్ ఆతీహై
దర్ద్ పురానా యాద్ ఆతీహై”.
అధ్యాయం-2: ఉద్యోగ పర్వం
జీవనయానంలో అనేక ఆటుపోట్లకు గురై ఈతరాని వాడి వలె తలమునకలైన స్వామి చివరికి చాలా ఆలస్యంగా రాష్ట్రప్రభుత్వం పన్నుల శాఖలో ఒక అధికారిగా ఉద్యోగంలో చేరాడు. జీవిత నావ తనకు ఏ మాత్రం తెలియని, తన ప్రవృత్తికి ఏ మాత్రం సంబంధంలేని కొత్త తీరాలకు చేరుకుంది. బ్రతుకు సముద్రంలో నావ నట్టనడుమ మునిగిన తర్వాత అల్లకల్లోలంగా వున్న అలలకు ఎదురీది ఒక కొత్త ద్వీపానికి చేరుకున్నది.
తమ ముగ్గురి చిన్న కుటుంబానికి ఇక డోకా లేదని రోటీ కప్డా ఔర్ మకాన్‌కు భద్రత దొరికిందని బ్రతుకు మీద భరోసాతో ఊపిరిపీల్చాడు. స్కూలుకు పోతున్న కూతురు సమత కూడా మా డాడీకి కొత్త ఉద్యోగం వచ్చిందని తన గల్లీ దోస్తులందరికి ఎగురుకుంట చాటింపు వేసింది. స్కూల్లో క్లాస్మేట్సుకు కూడా చెప్పేసరికి మరి మాకు మిఠాయిలు పంచవా అని వాళ్లు డిమాండ్ చేసారట. ఆ తెల్లారి డాడీ దగ్గర పైసలు వసూలు చేసి స్కూలు దగ్గర నాలుగు చక్రాల తోపుడుబండి మీద అమ్మే ఎర్రెర్రని కొబ్బరి మిఠాయిలు – కోప్రా మిఠాయిలు కొని అందరికీ పంచి డాడీకి వచ్చిన క్రొత్త ఉద్యోగాన్ని సెలబ్రేట్ చేసుకుంది.
గతంలో పది సంవత్సరాలు లెక్చరర్‌గా తన ప్రవృత్తికి సరిపడే ఉద్యోగం చేసిన స్వామి తన ముక్కుసూటితనం, నిజాయితీ, అమాయకత్వం, మొండితనంతో దాన్ని ఊడగొట్టుకుని తన ప్రవృత్తికి విరుద్దమైన పన్నుల శాఖలో క్రిందిస్థాయి అధికారిగా చేరాడు. అంతా కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త పని. ఎన్నడూ ఊహించని పని సంస్కృతి.
తనకు అందిన ఉద్యోగ ఉత్తర్వుల ప్రకారం ముందు ఒక సంవత్సరం తన పై అధికారి క్రింద ఒక ట్రైనీగా శిక్షణ పొందాలి. మొదటి రోజు ఆఫీసు మెట్లు ఎక్కుతుండగానే పరిసరాలన్నీ అపరిశుభ్రంగా, దుమ్ముధూళితో ఉండటం గమనించాడు. అది ఒక అద్దె భవనం. ఎప్పటిదో నిజాం కాలం నాటి పురాతన భవనం. మెట్ల పక్కనున్న గోడలన్నీ నల్లటి ఎర్రని పాన్ మరకలతో నిండి వికారం కల్గించే వాసన కొడుతున్నాయి. మెట్లక్కి కార్యాలయంలోకి అడుగుపెట్టగానే మధ్యలో ఒక విశాలమైన హాలు. దాని తలుపులకు మురికి పట్టి రంగులు వెలిసిన కాటన్ క్లాత్ తెరలు వ్రేలాడుతున్నాయి. అంతటా లుకలుక లాడుతూ ఊగుతున్న పాతకాలం కుర్చీలు, టేబుళ్లు, వాటిపైన కూర్చుని పనిచేసుకుంటున్న వారి తలలపై పెద్దగా లొడలొడ శబ్దం చేస్తూ ఊగుతున్న పాత ఫ్యాన్లు. అవి ఎప్పుడు ఊడిపడి ఎవరికి కపాలమోక్షం లభిస్తుందో ఆ పైనున్న వాడికే తెలుసు. అక్కడి కుర్చీలు, టేబిళ్ల వెనుక వరుసగా నిలబెట్టిన తుప్పుపట్టిన పాతకాలం నాటి ఇనుప రాకులున్న ఓపెన్ బీరువాలు. అందులో ముక్క వాసన వేస్తున్న వాణిజ్య పన్నుల లెక్కలకు సంబంధించిన దస్త్రాలు. నన్నయ కాలం నాటి కవిలె కట్టల్లా కనబడుతున్నాయి. అప్పటికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా కంప్యూటర్లు రాలేదు. ప్రతి టేబుల్‌పై చేతిరాతతో రాసిన బోలెడన్ని ఫైళ్లు గుట్టలు గుట్టలుగా పేర్చబడి ఉన్నాయి. ఇసుకలో తలదూర్చిన నిప్పుకోళ్ల మాదిరిగా సిబ్బంది అంతా తమతమ ఫైళ్లలోకి తలలు దూర్చి ఏకదీక్షతో పని చేసుకుంటున్నారు. అయితే వారందరూ ఆమ్దాని లేని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది లాగానో లేక అత్తెసరు జీతాలతో బ్రతికే బడిపంతుళ్లలా బక్కగా బలహీనంగా కాక కొవ్వు పట్టిన మెడ కండరాలతో, ఊబ శరీరాలతో, బాగా ఉబ్బిన ముఖాలతో, లంబోదరాలతో, బహు సుఖజీవుల్లా ఉన్నారు. కొందరు పాన్ బీడాలు నములుతుంటే, మరికొందరి పెదాలపై సిగరెట్లు గుప్పుగుప్పున వెలుగుతున్నాయి. అక్కడేదో హోమం జరుగుతున్నట్లు ఆ హాలు మొత్తం హోమజ్వాలల భుగభుగలతో ఘాటైన గంధక దూపం లాంటి పొగలతో నిండి ఉంది.
వక్కా, పాన్, సిగరెట్ లాంటి వేమీ తెలియని స్వామి మొదటి రోజే అక్కడి వాతావరణానికి ఉక్కిరి బిక్కిరైనాడు. ముక్కుపుటాలు బిగిసుకపోయి ఊపిరాడనట్లు గొంతు ఎండుకపోయినట్లు అయ్యింది.
తన అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిల పట్టుకుని తను ఎవరి దగ్గరైతే శిక్షణ పొందాలో ఆ అధికారి గదిలోకి వెళ్లాడు. అతని పేరు కోదండపాణి. అప్పటికే ఐదుపదులు దాటిన అతను పదవీ విరమణకు చేరువలో వున్నట్టున్నా మనిషి మాత్రం అరవైల నాటి హాలీవుడ్ హీరోలా కుదిమట్టసంగా గట్టిగా ఉన్నాడు. ఇంకా పాత బడని కొత్త సఫారీ సూట్ నల్లని సిమెంటు రంగులో ఆ తెల్లని మనిషికి బాగా నప్పింది. కొలిమిలో బాగా కాలిన రాగి రంగు ముఖంతో పిల్లి కళ్ల నీలిరంగు, కన్నింగ్ జాకాల్ కళ్లలా మిలమిలా మెరుస్తున్నాయి. పిల్లి కండ్లవాళ్లను నమ్మొద్దని చిన్నప్పుడు నాయనమ్మ చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. బహుషా ఆమె కాలంలో నీలిరంగు కళ్ల తెల్లదొరలు వుండేవాళ్లు కావున వారిపై ద్వేషంతో అది దేశీయుల అభిప్రాయం కావొచ్చని స్వామి అనుకొంటుండగా..
“యస్ వాట్ డు యు వాంట్?” అని ఆ పిల్లి కళ్ల అధికారి పరధ్యాన్నంగా నిలుచున్న స్వామిని గంభీరమైన బొంగురు గొంతుతో అడిగాడు. రాక్హుడ్సన్ హఠాత్తుగ ఇంగ్లీష్‌లో మాట్లాడినట్లనిపించింది.
చేతిలో వున్న కాగితం అతనికి అందించి, ఎదురుగా వున్న కుర్చీలో నిశ్శబ్దంగా అతనినే చూస్తూ కూచున్నాడు. ఆ కాగితాన్ని అమూలాగ్రంగా ఓపికగా చదివిన ఆయన:
“హాహాహా. ఓహోఒహోహో. మీరేనా ట్రైనీ స్వామి. వెల్కం వెల్కం” అని షేక్‌హ్యాండిస్తూ మరోసారి ఘటోత్కచుడిలా వికటాట్టహాసం చేసాడు.
అప్పుడు రాక్హాడ్సన్ మాయమై ముత్యాలముగ్గులోని రావుగోపాలరావు తెరమీద ప్రత్యక్షమయ్యాడు.
ఆ తర్వాత ఆయన వేసిన ప్రశ్నల పరంపరల దాటికి తట్టుకుని స్వామి తన ‘ప్రవర’ నెమ్మదిగా వినిపించాడు. అప్పుడాయన సంతుష్టుడై జేబులో నుండి ఖరీదైన త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ తీసి అందులో నుండి రెండిరటిని తీసి తన పెదాల మధ్యనొకటి అలవోకగా సుతారంగా బిగించి మరొకటి స్వామికి ఆఫర్ చేసాడు. దానికి స్వామి ఏదో తప్పు చేసినట్లు, క్షమాపణ అడుగుతున్నట్లు “నో ప్లీజ్” “సారీ ప్లీజ్” అన్నాడు. ఇబ్బందిగా కుర్చీలో కదులుతూ.
ఇక ఆయన అగ్నిహోత్రావధానం మొదలయ్యింది. అసలే చిన్న గది. ఆ చిన్న గదికి అతి చిన్న కిటికీ నామ్‌కే వాస్తే ఉన్నట్టుంది. పైన ఫ్యాన్ బరబర పుణ్యమా అని గది అంతా లుంగలు లుంగలుగా చుట్టుకుంటున్న పొగలు. స్వామికి ఉక్కిరిబిక్కిరిగా ఉంది. పబ్లిక్ ప్లేసెస్‌లలో పొగత్రాగటం నిషేధం అన్న ఏలినవారి ఫర్మానా అప్పటికి రాలేదు.
“మిమ్మల్ని చూస్తుంటే మీరు లెక్చరర్‌గా ఉంటేనే బాగుండేదేమో అనిపిస్తుంది” అని విలాసంగా పొగలు వదులుతూ ఒక ఉచిత వ్యాఖ్యానాన్ని వెలిబుచ్చాడు.
స్వామి ఏడవలేక నవ్వినట్లు ముఖం పెట్టాడు.
“మరేం పరవాలేదు స్వామీజీ. మీ ట్రైనింగ్ ఒక సంవత్సరం పాటు ఉంది. అంతా మెల్ల మెల్లగా నేర్చుకోవచ్చు. జల్దీ బాజీ ఏం లేదు. ఒక్కసారి కుర్చీలో కూచుంటే ‘కుర్చీ సబ్‌కుచ్ సిఖాతా హై’ అని నిజాం కాలం నాటి ఉర్దూ సామెత. కొత్తగా ఉద్యోగాలలో చేరిన వారికి ముందు కుర్చీలో లేవకుండా గంటలు గంటలు కూచునే అలవాటు కావాలి. పనిదేముంది ఆ తర్వాత పని దానంతట అదే వస్తుంది” అని ఉద్యోగ సూత్రాలలో మొదటి సూత్రాన్ని చిద్విలాసంగా పొగలూదుతూ బోధించాడు.
బోధగురువు ముందు బుద్దిమంతుడైన శిష్యుడిలా తలాడించాడు స్వామి.
కమ్యూనిస్టు క్రమశిక్షణకు అలవాటు పడిన స్వామి ఆ మరునాడు టంచన్‌గా పదిన్నరకు ఆఫీసుకు చేరుకున్నాడు. విచిత్రం ఆఫీసుకు ఇంకా ఎవరూ రాలేదు. ఒక ఆడమనిషి చీపురు కట్టతో నేల ఊడుస్తుంది.
“ఇంకా ఎవరూ రాలేదా?” అని ఆశ్చర్యంతో అడిగాడు.
“ఇంత జల్దిగా ఇప్పుడెందుకు వస్తరు సార్. పదకొండు, పదకొండున్నరకు పురుసత్‌గ వస్తరు” అందామె. కష్టమంతా తనదే ఐనట్లు నిష్టూరంగా.
‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు’ తను తొందరగ వచ్చినట్లు గమనించిన స్వామి ఆ దుమ్ము నుండి తప్పించుకోవటానికి తలుపు అవతల నిలబడ్డాడు. ఆమె చెప్పినట్లు పదకొండున్నర ముందు అటెండరు తర్వాత సిబ్బంది నెమ్మదిగా పెళ్లి నడకలతో రంగప్రవేశం చేసారు. కాలేజీలో టైం ప్రకారం క్లాసులకు హాజరయ్యే స్వామికి వారి సమయపాలన విచిత్రమనిపించింది.
‘రాజు వెడలె రవితేజములరరగ’ అన్నట్లు బాస్ కోదండపాణి పన్నెండు గంటలకు ఆఫీసు చేరుకున్నాడు. ఆయన రాక కన్నా ముందే ఆయన పూసుకున్న సెంటు వాసన గుప్పుమని గుభాళించింది. ఈ రోజు మరో కొత్త సఫారీ సూటు. ఆ ఘాటైన సెంటు సువాసన కూడా స్వామిని ఉక్కిరిబిక్కిరి చేసింది. పాపం అతనికి ఇంట్లో అగరుబత్తుల వాసన కూడా అలెర్జీకి గురిచేస్తుంది. స్వామిని చూసి ఒక చిర్నవ్వు చిద్విలాసంగా ప్రదర్శించాడు.
స్వామి ఆయన ముందు యూవర్ మోస్ట్ ఒబీడియంట్లీ అన్నట్లు ముందున్న కుర్చీలో ఒదిగి కూచున్నాడు. కోదండపాణి స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి రాని వాళ్లకు ఎర్ర టిక్కులు పెట్టి వారందరి చివరన తను సంతకించి ఎదురుగా తెల్లటి గాజు గ్లాసులో అటెండర్ భూమయ్య తెచ్చిన మంచి నీళ్లు గటగటా త్రాగి దాహశాంతి తీరినాక తీరికగా మొదలు పెట్టాడు.
“చూడండి స్వామీ మీరు ఒక అధికారిగా మీ డ్యూటీస్‌లో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక భాగం. మీకు ఒక లెక్చరర్‌గా పిల్లలకు పాఠాలు చెప్పే అనుభవమే కాని ఆఫీస్ నిర్వహణ, స్టాఫ్‌ను అజమాయిషీ చేసే అనుభవం మీకు తెలియదు. పైగా మన అసలైన పని వాణిజ్య పన్నుల చట్టం ప్రకారం వ్యాపార వర్గాల వారి అమ్మకం, కొనుగోలు లెక్కల్ని మదింపు చేసి పన్నులను విధించటం, వసూలు చేయటం. పన్ను ఎగవేతదారులను మనం చేసే ఆడిట్, ఇన్స్పెక్షన్లలో గుర్తించి జరిమానాలు విధించటం. అవసరం అనుకుంటే వారి ఆస్తులను జప్తుచేసే అధికారం కూడా మనకు రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఉంది. కావున మీరు మన యాక్ట్ బుక్కును కూలంకషంగా చదివి అర్థం చేసుకోవాలి.” అని ఒక క్లుప్తమైన ఉపన్యాసం ఇచ్చాడు ఆ బాసు.
రాజనీతిశాస్త్రంపై లెక్చర్లు ఇచ్చిన ఒకప్పటి లెక్చరర్ స్వామికి ఆయన ఇచ్చిన లెక్చర్ ద్వారా ఆ వ్యాపారాలు వాటి లెక్కలు డొక్కలు, పన్నులు, జరిమానాలు, జప్తులు శిక్షలు, కొంచెం తికమకగా అయోమయంగా అనిపించి యాంత్రికంగా తల ఊపాడు.
“మరో మాట. మనది కేవలం ఆఫీస్ అండ్ టేబుల్ వర్క్ మాత్రమే కాదు బయటికి వెళ్లి వ్యాపారాలు దుకాణాల అకౌంట్ బుక్స్‌ను, తనిఖీ చేయటం లాంటి ఎక్స్క్యూటీవ్ వర్క్ కూడా చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సింహభాగం మన వాణిజ్య పన్నుల శాఖదే. మన తర్వాతే ఎక్సైజ్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రెవెన్యూ” అంటూ ఒక చిన్న దండకం చదివాడు ఆ బొంగురు గొంతు అధికారి.
కాని స్వామి మాత్రం ఆయన టక్కరి మార్జాలపు నీలి నయనాలపై దృష్టి సారించి నాగస్వరం ఊదుతున్న పాములవాడి ముందు తల ఊపుతున్న వెర్రి నాగన్నలా ఆయన ఇస్తున్న లెక్చర్‌కు తల ఊపసాగాడు ఏదో అతి శ్రద్దగా వింటున్నట్లు. వినేవాడు చెప్పేవాడికి లోకువన్నట్లు ఈ కొత్త ‘బకరా’ తన జ్ఞాన ప్రదర్శనకు, అనుభవానికి అమిత ఆశ్చర్య ఆనందాలకు లోనవుతున్నాడని భ్రమచెంది అతి ఉత్సాహంతో తన టేబుల్ సొరుగును బర్రున ఇవతలికి లాగాడు కోదండపాణి.
ఆ కర్ణ కఠోర శబ్దానికి సహజంగా స్వాప్నికుడైన స్వామి ఇహ లోకంలోకి వచ్చాడు.
ఆ సొరగులో నుండి ఆయన ఒక లావుపాటి బైండు పుస్తకాన్ని తీసి దాన్ని అతి పవిత్రంగా రెండు చేతులతో పట్టుకుని “ఇదే మన ‘వాణిజ్య పన్నుల 1957 చట్టం పుస్తకం’ అని చిర్నవ్వులు చిందిస్తూ స్వామికి అందించాడు. అదొక గీత, బైబిల్, ఖురాన్ లాగ.
ఆ గ్రంథరాజాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు స్వామి.
“ఈ యాక్టు పుస్తకాన్ని మీరు అమూలాగ్రంగా చదివి అర్థం చేసుకుంటేనే మీరు ఎఫిషియెంట్ ఆఫీసర్ అవుతారు. వ్యాపార వర్గాల వారికి మీరు ‘సింహ స్వప్నం’గా మారుతారు” అంటూ కనుబొమ్మలెగరేస్తూ కొంటెగా నవ్వాడు. ఆయన లోని నీలికళ్ల కన్నింగ్ జాకాల్ కొద్దిగా ఇవతలికి వచ్చి తొంగిచూసింది. సఫారీ సూటు, త్రిబుల్ ఫైవ్ సిగరెట్లు, కునేగా సెంటు వెనక చిదంబర రహస్యం లీలగా అర్థమయ్యింది ఆ శిష్యుడికి.
ఆ తర్వాత చాయ్పానీల కదంబ కార్యక్రమం, ఉభయ కుశలోపరి కబుర్లు, దునియ మీది ముచ్చట్లు కొంత సేపు జరిగినాయి. ఆయన మాటకారి తనం వెనుక, ఆయన ఆరోగ్యం, ఉత్సాహం వెనుక ‘ధనం మూలం మిదం జగత్’ అన్న సత్యం కొంచెం బోధపడిరది.
అప్పుడు స్వామికి హఠాత్తుగా రచయిత రావిశాస్త్రి జ్ఞాపకం వచ్చాడు. ఆయన రాసిన పిపీలికం కథలో పుట్టలో దాక్కున్న బలిసిన సర్పం జ్ఞాపకం వచ్చింది. అయితే సర్పాలు సఫారీలు ధరించి కునేగా అత్తరులు కూడా అద్దుకుంటాయన్న సత్యం రావిశాస్త్రి చెప్పనేలేదు అని అబ్బురపడుతుండగా..
మరోసారి ఫ్రెష్‌గా వెలిగిన త్రిబుల్ ఫైవ్ “స్వామి గారు” అని పిలవటంతో పన్నుల శాఖా లోకంలోకి ఊడిపడ్డాడు స్వామి.
“మీరు కూసింత పరధ్యానంలో ఉన్నట్టున్నారు” అని నాటకీయంగా ప్రారంభించాడు పాణి.
“అయ్యో అదేం లేదుసార్” అని మళ్లీ బుద్ధిగా ఒదిగొదిగి ఒప్పులకుప్పగా కూచున్నాడు.
“ముందు మీరు ఒక నెలపాటు మన హెడ్ క్లర్క్ కమ్ ఆఫీసు సూపరిడెంటు అబ్దుల్ ఖాదర్ ముందు కూచుని ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ తెలుసుకోండి. డీఎంఓ అని ఒక బుక్ ఉంటది..”
“అంటే అదేంది సార్” అని స్వామి వినయంగా ప్రశ్నించాడు. “గుడ్ క్వొశ్చన్, డిస్ట్రిక్ మాన్యుయల్ ఆఫీస్ బుక్ అన్న మాట. బ్రిటిష్ కాలం నాటిది. ప్రభుత్వ కార్యాలయాల కార్యనిర్వహణ ఎలా క్రమశిక్షణతో నియమబద్దంగా పని ఎలాచేయాలో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ అందులో వారు ఏర్పాటు చేసారు. దాని ప్రకారమే మన ఆఫీసులన్నీ పని చేయాలన్న మాట. టెన్ కమాండ్మెంట్స్ లాగా అవన్నీ మనకు శిలాక్షరాలు. శిరోధార్యాలు.”
కురుక్షేత్ర రంగంలో అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడిలా ఎదుట ఉన్న కోదండపాణి ముఖారవిందం జ్ఞాన ప్రకాశంతో వెలిగిపోతుంది.
స్వామికి సన్నగా తలనొప్పి మొదలయ్యింది. ఏదో ప్రాచీన గ్రీక్ అండ్ లాటిన్ భాష ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నట్లు అయోమయంగా ఉంది.
ఆయన టేబుల్ మీది కాలింగ్ బెల్ కర్ణకఠోరంగా మ్రోగించి అబ్దుల్‌ఖాదర్‌ను రమ్మనమని వచ్చిన అటెండరును ఆదేశించాడు. నల్లగా నున్నగా గుండ్రటి ఫుట్బాల్లా వున్న ఖాదర్ దొర్లుకుంటూ బాస్ గదిలకి ప్రవేశించి “గుడ్‌మార్నింగ్ సర్” అన్నాడు.
“వీరు మన క్రొత్త ఎ.సి.టి.ఓ. గారు. వీరిని నీ దగ్గర కూర్చోబెట్టుకుని ఒక నెలరోజుల పాటు మన డీఓఎం బుక్ ప్రకారం ఆఫీసు అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ ఇవ్వాలి.”
ఓకే సార్. ఓకే సార్. మంచిది సార్” అని వినయంగా తలూపాడు ఆ ఖాదర్.
“అన్నట్లు మరి మన ఆఫీసులో డీఓఎం పుస్తకముందా?” అని అనుమానంగా అడిగాడు బాసు.
“ఉన్నట్లుంది సార్. చూస్తాను సార్. వెతుకుతాను సార్” అని ఆ వీర విధేయుడు వంగి వంగి సలాములు చేస్తూ స్వామిని వెంటబెట్టుకుని తన టేబుల్ దగ్గరికి తీసుకు పోయాడు.
ధూమపాన కూపం నుండి విముక్తి పొందినట్లు స్వామి గట్టిగా ఊపిరి పీల్చాడు. అతని కొత్త ఉద్యోగ పర్వం అట్లా ప్రారంభమయ్యింది.
(మళ్ళీ కలుద్దాం)
పరవస్తు లోకేశ్వర్ 10 జూన్ 1951 నాడు హైదరాబాద్ పాత నగరంలో జన్మించారు. కథా నవలా రచయిత, అనువాదకులు. ట్రావెల్ రైటర్. యాత్రా కథనాల రచనలో అందెవేసిన చెయ్యి. పరదేశీగా దేశదేశాల సరిహద్దులలో, దారి కాని దారులలో ఒంటరి బాటసారిగా తిరగాలనేది రచయిత అంతర్జ్వాల. ప్రపంచ యాత్రికుడు పండిత్ మహామహోపాధ్యాయ్ పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ ప్రభావం తనపై చాలా ఉందని రచయిత అంటారు.
సలాం హైదరాబాద్, సిల్కురూట్‌లో సాహస యాత్ర, ఒక హిజ్రాకథ (సుప్రసిద్ధ హిందీ, ఉర్దూ అనువాద కథలు), ఛత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర, ఆనాటి జ్ఞాపకాలు, తెలంగాణ సంభాషణ, ప్రపంచ పాదయాత్రికుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర, 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు, నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు, ఎవరిది ఈ హైద్రాబాద్?, హైద్రాబాద్ జనజీవితంలో ఉర్దూ సామెతలు, కల్లోల కలల కాలం వంటి పుస్తకాలు వెలువరించారు. ‘సలాం హైద్రాబాద్’ కు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం లభించింది.
హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది చివరిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది.