[మాయా ఏంజిలో రచించిన ‘After’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(ఒకానొక ఉదాసీనపు ఉదయం తర్వాత ఉండే సాయంకాలపు వాతావరణాన్ని చిత్రించిన కవిత!)
~
మూల్గుతూ ఉండే ఆకాశం నుంచి
ఎలాంటి శబ్దమూ రాదు
సాయంత్రపు నీటి కొలనుని
ఏ ముడతలూ వెక్కిరించవు
ప్రజ్వరిల్లే రాతి వెలుగులో
పక్షులు ఎగురుతూ ఉండగా
నక్షత్రాలు కిందికి వంగి ఉంటాయి
అంగడి- తన ఖాళీ సొరుగుల్లోకి
దొంగ చూపులు చూస్తుంటుంది
అతి తక్కువ వాహనాలకు
వీధులు వక్ష స్థలాలవుతాయి
ఎవరూ నడుం వాల్చని బరువుతో
ఈ మంచం ఆవులిస్తూ ఉంటుంది.
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.