Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తప్పు నాది కాదు

Natasha L. Karimakwenda రాసిన ‘Not My Fault’ అనే కథని తెలుగులో అందిస్తున్నారు అత్తలూరి విజయలక్ష్మి.

నేను సైకాలజిస్ట్ ముందు కుర్చీలో కూర్చున్నాను. నా కళ్ళ నుంచి కన్నీళ్లు ధారాపాతంగా స్రవిస్తున్నాయి. ఆ కన్నీళ్లను తుడుచుకోవాలన్న ధ్యాస కూడా లేదు నాకు.. కదలకుండా అలాగే స్థిరంగా కూర్చున్నాను. నిజానికి నేను చాలా దృఢమైన మహిళను అని నా నమ్మకం.. అందుకే నా కన్నీళ్లు ప్రెసిడెంట్ Ncube తో సహా ఎవరూ చూడడం నాకిష్టం లేదు. అయినా ఇప్పుడు కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఏం జరిగిందో సైకాలజిస్ట్‌కి తెలియచేయడానికి చాలా కష్టపడుతున్నాను.

దేశంలోని అతి పెద్ద బ్యాంకులో ఉపాధ్యక్షురాలిని.. ఆ పదవిలో ఉండాలని ప్రతి స్త్రీ కల కంటుంది. అందుకే ఇప్పుడు ఆ పదవి కోసం, దానికోసం పోటీ పడుతున్నారు పాల్‌తో సహా. నాకు మాత్రం ఆ పదవి ఓ పీడకలగా మారింది.

“పాల్” అంటూ సైకాలజిస్ట్ మొదలు పెట్టి, “పాల్ గురించి మరికొంత సమాచారం ఇవ్వండి.. నాట్” అన్నది.

దుఃఖంతో ఉన్న నేను శ్వాస తీసుకోడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాను. ఏడుపు బయటకి రాకుండా చాలా ప్రయత్నం చేస్తూ పరధ్యానంగా నా నీలం రంగు స్కర్ట్ అంచులు సవరిస్తూ కూర్చున్నాను. కానీ అది అంత సులభం కాదని, నా ఉద్యోగం పొందడానికన్నా చాలా పెద్ద బాధ అని నన్ను హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తోంది.

“వైస్ ప్రెసిడెంట్ ఖుమాలో” సైకాలజిస్ట్ నా ఆలోచనలను చెదరగొట్టింది… ఘనీభవించిన దుఃఖం బయటపడింది. కన్నీళ్లు అణచడానికి ప్రయత్నించి విఫలం అయాను.

“వైస్ ప్రెసిడెంట్ ఖుమాలో! మీ ఎమోషన్స్ బయటపడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారు అనుకుంటా.. మీ స్థాయిలో మీరేం చేసినా అది ప్రెసిడెంట్‌కి తెలుస్తుంది. ఏదో తప్పు జరుగుతోందని ఊహించే ప్రెసిడెంట్ Ncube మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు..”

నేను మాట్లాడలేదు.. కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. తుడుచుకోడానికి నేను ప్రయత్నించడం లేదు. ఆరోజు నాకు టైం తో సహా గుర్తుంది.

“అమ్మాయిల హక్కుని ఉల్లంఘించే అధికారం, ఆమెని హింసించే అధికారం ఎవరికీ లేదని, అది ఎవరి బారిన పడకుండా అమ్మాయిలూ తన హక్కుని కాపాడుకోవాలని నమ్ముతారా!” అడిగాను.

“ఎస్, వైస్ ప్రెసిడెంట్, నమ్ముతాను.” అంది ఆవిడ.

కానీ అదే జరిగింది నాకు. నేను కుర్చీలో గుండ్రంగా తిరిగి జరిగింది అంతా చెప్పడం మొదలు పెట్టాను.

“జరిగిన సంఘటన గురించి నేను మరి, మరి ఆలోచించాలి. నేను, పాల్ మంచి మిత్రులం. ఐదేళ్ళ క్రితం మేము టెల్లర్స్ లాగా బ్యాంకు ఉద్యోగంలో ఒకేసారి ప్రవేశించాము. త్వరలో మంచి మిత్రులం అయాము. అతను డేటింగ్‌లో ఉన్నాడని నాకు తెలుసు….. నేను డేటింగ్‌లో ఉన్నానని అతనికి తెలుసు. మేము ఎన్నో విషయాలు టెల్లర్స్‌ గానే కాదు, వ్యక్తిగతంగా కూడా షేర్ చేసుకునే వాళ్ళం.. మేము సరదాగా జోక్స్ వేసుకునే వాళ్ళం, డేటింగ్ గురించి సలహాలు ఇచ్చుకునే వాళ్ళం, ఒకరిది ఒకరు లంచ్ పంచుకునే వాళ్ళం. మేము మంచి మిత్రులం అనేకన్నా అంతకన్నా అన్నా, చెల్లెళ్ళలా ఉండేవాళ్ళం. తరవాత అతనికి వివాహం అయింది నాకు కాలేదు… స్త్రీ జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైనది.. కానీ అది నాకు దక్కలేదు. కానీ నేను దాని గురించి బాధపడలేదు.. ఎందుకంటే నేను కలలు కన్న ఉద్యోగం నాకుంది.”

“సో… నువ్వు నిజంగా పాల్‌ని నమ్మావన్నమాట …” ఆ ప్రశ్నకి ఆమె వైపు చూసాను.

“అవును నమ్మాను.. నమ్మక పోవడానికి నాకేమి కారణం కనిపించలేదు. మేమిద్దరం వర్క్‌మేట్స్… కలిసి ఒకే దగ్గర పని చేసాము. తరవాత ప్రమోషన్ వచ్చాక ఎవరి ఆఫీస్‌లకు వాళ్ళు వెళ్ళాము. మొదటిసారి విడిపోయాము. అతను చాలా సరదాగా, హుషారుగా ఉండేవాడు. అంతే కాదు ఎలాంటి సమస్య అయినా ఒకటి రెండు జోక్స్‌తో డీల్ చేసేవాడు. అతను కొత్త, కొత్త ఐడియాలు చెప్పేవాడు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నాడనే భావించాను.”

‘విచిత్రమైన వాళ్ళు అమ్మాయిలు’ అనుకుంది సైకాలజిస్ట్.

“ట్రబుల్ ఎలా మొదలైంది?” అడిగింది.

“మేమిద్దరం అన్నా, చెల్లలు అన్నంత ప్రేమగా ఉండేవాళ్ళం అనుకున్నా. కానీ ఒక దుర్మార్గుడిని నమ్మాను అని తరవాత అర్థం అయింది. ఆరోజు అతన్ని మా ఆఫీస్‌కి రానివ్వకుండా ఉండవలసింది. కనీసం ప్రెసిడెంట్‌తో అబద్దం చెప్పకుండా ఉండాల్సింది. Ncube హమ్మ్… అతను క్రమంగా ఉద్యోగంలో మెట్లు ఎక్కుతూ ఉన్నతస్థానం పొందసాగాడు. తన ఉన్నత కోసం కృషి చేస్తూ పరంపరగా మెట్లు ఎక్కడంలో నిమగ్నమయాడు. అతనికి లురేట్టా… Ntombi ల బాధ్యత ఉంది. వాళ్ళు అతని భార్య, కూతురు. వృత్తికి అంకితం అయిన అతను కుటుంబానికి దూరం కాసాగాడు. ఉన్నత స్థానానికి వెళ్తున్న కొద్ది లురేట్టాతో గొడవలు ఎక్కువ కాసాగాయి. ఒకరోజు లురేట్టా నుంచి నన్ను తిడుతూ ఫోన్ వచ్చింది. అతన్ని నేను ఆఫీస్‌లో కట్టేస్తున్నా అని తిట్టింది. కానీ నేను ఎప్పుడూ అతన్ని త్వరగా ఇంటికి పొమ్మని చెప్పేదాన్ని. అతను మారలేదు. పరిస్థితులు మరీ దిగజారిపోయాయి. అతని వివాహం విచ్చిన్నం అయింది.. భార్యాభర్తలు విడిపోయారు. అది జరిగిన తరవాత అతను మరింతగా వృత్తిలో మునిగిపోయాడు. ఇదివరకటి ఉత్సాహం, చలాకీతనం అన్నీ పోయాయి.. వృత్తిలో తనని తాను పట్టించుకోడం మానేశాడు. ఇంతలో అతి  పెద్ద ప్రమోషన్ మా ముందుకు వచ్చింది.. అదే వైస్ ప్రెసిడెంట్ పదవి. అప్పటి నుంచీ మేము బ్యాంక్ కింద కూర్చుని 17 అంతస్తు వైపు ఆరాధనగా చూడడము మొదలుపెట్టాము. నా కిటికీలో నుంచి ప్రతిరోజూ కనిపిస్తూ నన్ను దిశా నిర్దేశం చేస్తున్నట్టు అనిపిస్తూ అనిపిస్తూ ఉండేది.

“ఈ ఉద్యోగం నీకు డబ్బు కోసమా!” అడిగింది సైకాలజిస్ట్.

“అవును” అన్నాను.

కొన్ని సంఘటనలు మనుషుల మీద చూపించే ప్రభావం ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడడం ఆమెకి ఇష్టం.

నాకు ఏడుపు వచ్చింది.. కాని ఎలా ఏడవను.. పా..?

“పాల్ నన్ను నిర్లక్షం చేసాక…” దుఃఖంతో స్వరం పెగల్లేదు. ఆమె నన్ను కంఫర్ట్‌గా ఉంచడం కోసం దగ్గరకి వచ్చింది..

“అదిగో… అదే వైస్ ప్రెసిడెంట్ పదవి… నాకు ఆ పదవి అంటే అసహ్యం” ఏడుస్తూనే చెప్పసాగాను. “పాల్‍కి పదవి కావాలి.. అతనికి అవసరం.. కానీ నాకు ఇచ్చారు.” దుఃఖం ఎక్కువైంది. సైకాలజిస్ట్ నా తలని తన చేతుల్లో పట్టుకుంది. నేను ఉలిక్కిపడ్డాను. ఆరోజు పాల్ తాగి నా పదిహేడో అంతస్తు గదిలోకి వచ్చిన విషయం గుర్తొచ్చింది.

“మంగళవారం రాత్రి 7.30 నిమిషాలకు అతను నా గదిలోకి వచ్చాడు. అప్పుడు నేను మా ఇన్వెస్టర్స్‌తో జరగబోయే చాలా ముఖ్యమైన మీటింగ్ కోసం రిపోర్ట్స్ చదవడంలో ఉన్నాను. అప్పుడు అతను వస్తూ, వస్తూ నా ఆఫీస్ ముందు పడిపోయాడు.. అది చూసి నేను ఫైల్స్ పక్కన పడేసి పరిగెత్తాను. అతన్ని రెండు చేతులతో లేవనెత్తాను. మొదటిసారిగా నా మొహాన్ని తాకాడు. ఇంతకూ ముందు ఎప్పుడూ అంత దగ్గరగా రాలేదు. నేను నిశ్చేష్టురాలిని అయాను. ‘నువ్వు whore … పదిహేడో అంతస్తులో పడుకుని ఉన్నావు’ అన్నాడు నా చెవిలో గుసగుసగా. అతని చేతులు నా శరీరాన్ని తమకంగా తడమడం గమనించాను.

కోపంగా అతన్ని దూరం నెట్టడానికి ప్రయత్నించాను. మంచి మిత్రుడు పాల్ వయొలెంట్ పాల్‌గా మారాడు. నా మెడ మీద చేయి పెట్టి గట్టిగా దగ్గరకు లాక్కుంటూ నా అండర్‌వేర్ లాగడానికి ప్రయత్నించసాగాడు. అతి బలవంతంగా ఊపిరి తీసుకుంటూ సాయం కోసం అరిచాను. కానీ, కానీ…” కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పసాగాను.

“నా మంచి స్నేహితుడు రేపిస్ట్‌గా మారడానికి కారణం అయిన పదిహేడో అంతస్తుని నేను అసహ్యించు కుంటున్నాను. ఎన్నిరోజులు గడిచిపోతున్నా మర్చిపోలేకపోతున్నా.. ఆ సంఘటన నా మెదడులో పదే, పదే కదులుతోంది.”

“ఈ విషయం ఇంకెవరికన్నా తెలుసా!” అడిగింది సైకాలజిస్ట్.

“లేదు ఎవరికీ తెలియదు.. నేనెవరికి చెప్పలేదు.. ఎందుకంటే అతన్ని ఎవరూ దూషించడం నాకిష్టం లేదు… అతను ఎక్కడికి పోగలడు నన్ను విడిచి!”

***

మూలం: Natasha L. Karimakwenda

తెలుగు: అత్తలూరి విజయలక్ష్మి

Exit mobile version